సంపాదకీయం- మానస ఎండ్లూరి

ఈ మధ్య ఫేస్బుక్లో ఒక బొమ్మ చూశాను.పరుగు పందెంలో పాల్గొన్న స్త్రీ పురుషులు పరుగు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ స్త్రీల మార్గమంతా వారి జీవన పోరాటానికి చిహ్నాలుగా తోమాల్సిన గిన్నెలు, ఉతకాల్సిన బట్టలు, పిల్లలు, ఆఫీసు, వంటగది ఉంటాయి. పురుషుల మార్గమంతా ఖాళీగా సజావుగా ఉంటుంది. స్త్రీ పురుషులు తప్ప మరో జెండర్ ని గుర్తించని ఈ ప్రపంచం స్త్రీలలో అణగారిన స్త్రీలను మాత్రం గుర్తిస్తుందా? ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న జూనియర్ gynecologist  Dr. పాయల్ కి తన దారిలో అదనంగా కులం కూడా ఉంది. మనిషిని నిలువునా చీల్చి పరీక్షలు, ఆపరేషన్లు చేసి, రక్తకణాలను మైక్రోస్కోప్ కింద పరీక్షించే డాక్టర్లకు మనిషిలో కులం ఎక్కడ కనబడి ఉంటుంది? ఆధిపత్య కులాలకు చెందిన సీనియర్స్ పాయల్ ను బ్రతుకు పందెం లోంచి తప్పించారు. శాశ్వతంగా బరిలోంచి బయటకు పంపించేశారు. స్త్రీలందరినీ బాధితులగా ఒకే తాటిన కట్టే  ముందు వారి మధ్య తేడాలను సృష్టించే కుల వర్గ మత ఆర్థిక పొరపచ్చాల గురించి కచ్చితంగా ఆలోచించుకోవాలి.
సరే, నిమ్నకులాల పురుషుల ప్రాణాలను తీయడానికి వారు గుర్రమెక్కినా, మంచి బట్టలు వేసుకున్నా, ఇతర కులస్తులను ప్రేమించినా, బియ్యం దొంగతనం చేసినా, రాలిపోయిన మామిడికాయలు తీసుకున్నా చాలు. మరి నిమ్న కులాల స్త్రీల పరిస్థితి? ఎంత మంది చుట్టూ ఉన్న స్త్రీలు వారి ఆత్మ గౌరవం కాపాడుకోడంలో చేయుతనిస్తున్నారు ? అన్ని వివక్షలను తలదన్నే ఈ కులాన్ని అందరం ఎప్పుడు సర్వ నాశనం చేస్తామో అప్పుడే మానవత్వం మళ్లీ మళ్లీ ఊపిరి తీసుకుంటుందని గుర్తుపెట్టుకుందాం.
-మానస ఎండ్లూరి
                         
                   *
సంపాదకీయంPermalink

Comments are closed.