అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచెర్ స్టవ్-గబ్బిట దుర్గా ప్రసాద్

హార్రియట్ ఎలిసబెత్ బీచెర్ 14-6-1811 న అమెరికాలోని కనెక్టికట్ లో 13మంది సంతానం లో ఏడవ పిల్లగా జన్మించింది .తండ్రిలిమాన్ బీచేర్ కాల్వేనిస్ట్ ప్రీచర్ .తల్లి రొక్సానా .తల్లి తండ్రి అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో జనరల్ ఆండ్రూవార్డ్ .ఒకసోదరి కేధరిన్ విద్యావేత్త ,రచయిత్రి .సోదరులు మినిస్టర్ లుగా ప్రీచర్ లుగా ప్రసిద్ధి చెందారు .పెద్దక్క నడిపే బడిలో చదివింది హార్రియట్ .మగపిల్లలకు మాత్రమే ప్రవేశమున్న స్కూల్ లో క్లాసిక్స్ ,భాషలు నేర్చింది . 1832లో21 ఏళ్ళ వయసులో ఒహాయ్ లోని సిన్సినాటి కి లేన్ థియోలాజికల్ సేమెటరి ప్రెసిడెంట్ అయిన తండ్రి దగ్గరకు చేరింది .అక్కడ సోషల్ క్లబ్ లో కూడా చేరి క్రియా శీలంగా పని చేసింది .ఒహాయో నదిపై ఉన్న సిన్సిన్నాటి నగరం ఓడలపై వ్యాపారానికి కేంద్రమై దేశం లోని అన్ని ప్రాంతాల నల్లజాతివారు ,ఐరిష్ ప్రవాసీయులు అక్కడికొచ్చి స్థిరపడ్డారు .1829లో అల్లర్ల వలన రోడ్లు భవనాలు దెబ్బతిన్నాయి .ఐరిష్ ప్రజలు నల్లవారిపై దాడులు చేశారు. పోటీతత్వం పెరిగింది .గాయపడిన నల్లజాతి వారికి హార్రియట్ అన్ని విధాల సాయం చేసింది .1836,1841లో కూడా ఇలాంటి దాడులు పునరా వృత్తయ్యాయి .దీనిపై స్పందించి బానిస విధానికి వ్యతిరేకంగా రచనలు చేసింది .కోపమొచ్చిన ప్రజలు ఆమెను తరిమికోట్టారుకూడా . ఇక్కడే ఆమెకు కాల్విన్ ఎల్లిస్ స్టవ్ అనే ప్రొఫెసర్ తో పరిచయమేర్పడి 1-6-1836న పెళ్ళాడింది .ఈయనకూడా బానిసత్వ వ్యతిరేకి .పారిపోయే బానిసలకు తమ ఇంట్లో ఈ దంపతులు ఆశ్రయమిచ్చేవారు .చాలామంది బానిసలు కెనడాలో స్వాతంత్ర్యం కోసం ఉత్తరాదికి వెళ్ళేవారు .ఈ దంపతులకు ఏడుగురు సంతానం. అందులో కవల ఆడ పిల్లలున్నారు .1850లో అమెరికా కాంగ్రెస్ ‘’ఫ్యుజిటివ్ స్లేవ్ లా ‘’ఆమోదించింది .దీనివలన బానిసలకు ఆశ్రయమిచ్చినవారికి తీవ్ర శిక్ష ఉండేది .ఈ పరిస్థితులలో బీచర్ కుటుంబం మైన్ లోని బ్రన్స్ విక్స్ కు చేరింది .భర్త కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .ఇప్పుడు వీరి గృహం ‘’నేషనల్ హిస్టారిక్ లాండ్ మార్క్ ‘’గా గౌరవం, గుర్తింపు పొందింది .ఒకసారి ప్రార్ధన సమావేశం లో చనిపోతున్న ఒక బానిస దయనీయ స్థితి చూసి చలించి ,అతని కథ రాయాలనే గాఢమైన కోరికకలిగింది .అదే సమయం లో 18నెలల కొడుకు సామ్యుల్ చార్లెస్ చనిపోయాడు .ఈ సందర్భంగా ఆమె ‘’నాకు అత్యంత ఆప్తుడైన కొడుకు మరణించటం తో బానిసల అక్రమ విక్రయాలతో అన్యాయంగా ,దౌష్ట్యానికి చనిపోయిన బానిసల పై నాకు సానుభూతి పెరిగింది ‘’అని రాసుకొన్నది . 9-3-1850న నేషనల్ ఎరా అనే పత్రిక సంపాదకుడికి ‘’బానిసల కస్టాలు కన్నీటి గాధలు,సమస్యలు స్వేచ్చ ,మానవత్వం గురించి రాయటానికి పూనుకోన్నాను .ప్రతి తల్లీ నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చోకుండా బానిస సమస్యలపై నాలాగే స్పందించాలని కోరుతున్నాను ‘’అని ఉత్తరం రాసింది .అదే ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలగా ఆమె 40వ ఏట నేషనల్ ఎరా ప్రచురించింది .ఆమె పెట్టినపేరు ‘’ది మాన్ దట్ వజ్ ఎ థింగ్’’.ఈ వీక్లీలో5 జూన్1851నుంచి ధారావాహికగా 1-4-1852వరకు నడిచి ,నవలగా వెలువడింది .5వేల కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడై ఆతర్వాత 3లక్షలకాపీలు అమ్ముడయ్యాయి .ఆమెకు 400 డాలర్లు పారితోషికంగా పత్రిక అందజేసింది .దక్షిణ రాష్ట్రాలలో బానిసలపై జరుగున్న దారుణాలు ఉత్తర రాస్ట్రాలవారికి తెలియ జెప్పటమే ఆమె ధ్యేయం . ఈ నవలలో వ్యక్తులపై బానిసత్వ విధానం ఎంతటి దారుణంగా ఉంటుందో అమెరికా దేశప్రజలకు చాలా ఎమోషనల్ గా చెప్పింది రచయిత్రి .బానిసత్వం బానిసల ,యజమానుల, బానిస వ్యాపారులనందర్నీ ప్రభావితం చేసింది .దేశమంతా దీనిపై చర్చోప చర్చలు జరిగాయి బానిసత్వ నిర్మూలన జరగాల్సిందే అనే అభిప్రాయం బలపడింది దక్షణ రాష్ట్రాలలో .ఒక్క ఏడాదిలో బోస్టన్ లో 300మంది పిల్లలకు ఆమె నవలలోని ఒకపాత్ర’’ ఈవా’’పేరు పెట్టుకొన్నారు ప్రజలు .తర్వాత చాలామంది రచయితలు బానిసత్వ సమస్యలపై రాసినా ఈమె నవలకొచ్చిన ప్రాచుర్యం రాలేదు .దక్షిణ రాష్ట్రాల సమాజాన్ని అత్యంత సహజంగా చిత్రించింది . సివిల్ వార్ అయ్యాక ఆమె వాషింగ్టన్ వెళ్లి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను 25-11-1862న కలిసి మాట్లాడింది .లింకన్ ‘’అయితే ఇంత పెద్ద యుద్ధం రావటానికి కారణ మైన చిన్న స్త్రీవి నువ్వేనన్నమాట ‘’అని అభినందించాడు .యుద్ధం అయ్యాక ఫ్లారిడా కు వెళ్లి ఇల్లు స్థలం కొనుక్కొన్నది.అక్కడ తనకు ఎవరూ హక్కులభంగం కలిగించలేదని చెప్పింది .కాని తర్వాత కొన్ని చిక్కుల్లోపడి కొ౦పా గోడూ వదిలేసి కెనడా చేరింది .స్కాట్లాండ్ లోని దురాగతాలను ఎదిరించింది .1868లో ‘’హార్త్ అండ్ హోమ్’’మేగజైన్ కు మొదటి ఎడిటర్ అయింది .పెళ్లి అయిన స్త్రీలహక్కులకోసం పోరాటం చేసింది .1870లో ఆమె సోదరుడు హెన్రి వార్డ్ బీచెర్ వ్యభిచారం కేసులో జాతీయ అభియోగాన్ని ఎదుర్కున్నాడు .జనాలు దాడి చేయటం తో ఆమె అక్కడినుంచి మళ్ళీ ఫ్లారిడా వెళ్ళిపోయింది .సోదరుని తప్పులేదని నమ్మింది సమర్ధించింది . మళ్ళీ కనెక్టికట్ చేరి ‘’హార్ట్ ఫోర్డ్ ఆర్ట్ స్కూల్ ‘’స్థాపించి౦ది ఇది తర్వాత యూనివర్సిటి ఆఫ్ హార్ట్ ఫోర్డ్ గా మారింది .1886లో భర్త కాల్విన్ స్టవ్ మరణం తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలైంది.1888లో 77 ఏళ్ళ వయసులో ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలను మళ్ళీ రాయటం మొదలుపెట్టిందని ,రోజూ ఎన్నో గంటలు రాసేదని ,ఇదంతా ఆమెకు తెలియకుండానే చేసేదని దీనినే ‘’డేమెన్షియా’’అంటారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసింది .ఈ జబ్బునే ఇప్పుడు ‘’ఆల్జిమీర్స్ వ్యాధి ‘’అంటున్నారు వాజ్ పాయ్ , ఫెర్నాండెజ్ వంటి వాళ్ళు కూడా ఈ వ్యాధి బారినపడ్డారు .దెబ్బతిన్న ఆమె మెదడుకు ఇప్పుడు ఆమె రాసేదంతా కొత్తగా అనిపించేది అదొక భ్రమ .హార్ట్ ఫోర్డ్ లో ఆమె నివాసానికి దగ్గరలౌన్న అమెరికా ప్రముఖ నవలాకారుడు మార్క్ ట్వేన్ తన స్వీయ చరిత్రలో ‘’ఆమె మెదడు క్షీణించి ,దయనీయంగా ఉండేది .రోజంతా ఐరిష్ అమ్మాయి వొళ్ళు అంతా మర్దన చేసేది .ఇంటి తలుపులు ఎప్పుడూ తెరచే ఉండేవి .డ్రాయింగ్ రూమ్ నుండి వచ్చే సుగమ సంగీత౦ విషాద గీతాలు ఆస్వాదించేది .’’ ప్రపంచ ప్రసిద్ధ ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచేర్ స్టవ్ 1-7-1896న 85వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించింది .మాసాచూసేట్స్ లోని ఫిలిప్స్ అకాడెమి సెమిటరిలో ఆమెను ఖననం చేశారు. ఒహాయు ,మైన్ ,ఫ్లారిడా కనెక్టికట్ లలో ఆమెస్మారక చిహ్నాలు నెలకొల్పారు .జులై1న అమెరికాలో ఎపిస్కోపల్ చర్చ్ఆమె గౌరవార్ధం విందు ఇస్తుంది. 1986లో ‘’నేషనల్ ఉమెన్స్ హాల్ ‘’లో ఆమె పేరు రాసి గౌరవించారు 13-6-2007న అమెరికా ప్రభుత్వం 75 సెంట్ల పోస్టల్ స్టాంప్ ప్రచురించి గౌరవించింది .సెయింట్ లూయీ లోని ‘’హార్రిస్ స్టవ్ స్టేట్ యూని వర్సిటి ‘’పేరును ‘’స్టవ్ అండ్ విలియం టోర్రీ హార్రిస్ ‘’గా మార్చారు .ఒహాయు హిస్టారికల్ సొసైటీ ఆమె పేరును అమెరికా రాజధాని లోని స్టాట్యూటరి హాల్ లో చేర్చమని సిఫార్స్ చేసింది . అంకుల్ టామ్స్ నవల అనేకభాషలలో వెలువడింది .,ఇదికాక ‘’ Dred’’ ఏ టేల్ఆఫ్ దిగ్రేట్ డిస్మల్ స్వా౦ప్ ,అవర్ చార్లీ వాట్ టుడు విత్ హిం ,లిటిల్ పుస్సి విల్లో ,సిక్స్ ఆఫ్ వన్బై హాఫ్ ఏ డజన్ ఆఫ్ ది ఆదర్,ఉయ్అండ్ అవర్ నైబర్స్ మొదలైన నవలలలు,’’ది క్రిస్టియన్ స్లేవ్ ‘’డ్రామా ,రెలిజియస్ పోయెమ్స్ ,రాసింది. నాన్ ఫిక్షన్ గా ‘’న్యు ఇంగ్లాండ్ స్కెచ్ బుక్ ,ఎర్త్లి కేర్ ,ఎ హెవేన్లి డిసిప్లిన్ ,ఏ కీ టు అంకుల్ టామ్స్ కాబిన్ ,లైవ్స్ అండ్ డీడ్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మేడ్ మెన్ ,ఎ డాగ్స్ మిషన్ వగైరా చాలారాసింది .కధలు వ్యాసాలుగా –కజిన్ విలియం ,ఓల్డ్ ఫాదర్ మారిస్ ఒలి౦పియాన ది డ్రంకర్డ్ రిక్లైమ్డ్ ,మోరలిస్ట్ అండ్ మిస్సునలిస్ట్ ,విచ్ ఈజ్ ది లిబరల్ మాన్ ,ది టుఆల్టార్స్ మొదలైనవి చాలాఉన్నాయి .                                                                                                                      -గబ్బిట దుర్గాప్రసాద్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.