అమ్మ కోరిక(కథ )- సోమ సుధేష్ణ

“ఇవ్వాళ నా చిట్టితల్లి మహి వస్తోంది. అదృష్టం అంటే నీదేనోయ్. నీ కూతురికి చూడు నువ్వంటే ఎంత ప్రేమో.” నవ్వుతూ అన్నాడు అనిల్. సింక్ దగ్గర కాఫీ కప్పు కడిగి ద్రేయినర్ లో పెట్టి భర్త చూడకుండా కళ్ళు తుడుచుకుంది లత.

“ఈరోజు నీ పుట్టిన రోజుకదా, నువ్వెమీ పని చేయక్కరలేదు. లంచ్ నేను చేస్తాను. వాటర్ ఫ్రంట్ లో కొత్త తై ప్లేస్ ఓపెన్ చేసారు. నీకు తై ఫుడ్ ఇష్టం కదా! సాయంత్రం మన ముగ్గురం కలిసి అక్కడికి డిన్నర్ కు వెళ్దామా?” దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసి లతను తన వేపు తిప్పుకున్నాడు. లత మొహం ప్రసన్నంగా లేదు. మేఘాలు కమ్ముకున్న చంద్రునిలా ఉంది.

“ఈ రోజు నువ్విలా ఉండటానికి వీల్లేదు. నేనసలు ఒప్పుకోనంటే ససేమిరా ఒప్పుకొను. నీ మనసులోని ఆలోచనలన్నీ లాకర్ లో పెట్టేయ్యి ఈ ఒక్క రోజు కోసం. తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం, సరేనా డార్లింగ్.” లతను తీసుకొని బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గరకెళ్ళి లతను కూచోబెట్టి

“హెప్పి బర్త్ డే టు యూ మై డియర్.” పక్కనే కూర్చున్నాడు.

“వేజ్ లో పువ్వులు నువ్వు చూడలేదని చిన్న బోయాయి. మీరిద్దరూ ఇలా ఉంటే నేనెవరిని ప్లీజ్ చేయాలి ముందు. నిన్నా! నిన్ను మురిపించే పువ్వులనా!” టేబుల్ పై ఉన్న అన్వలప్ ను లత ముందుకు జరిపాడు.

నవ్వుతూ అది అందుకుని పువ్వుల వేపు చూసింది. “అర్కేయిడ్స్! చాల బావున్నాయి అనిల్.” లేచి వేజ్ వైపు వంగి వాసన చూసి “మ్..ఎంత మంచి వాసన, పర్పుల్ నా ఫేవరేట్ కలర్. చాల పెద్ద బంచ్ తెచ్చావ్. థెంక్యూ.”

లత నవ్వుతూ ఎన్వలప్ తెరిచింది.
“ఓ మై గాడ్ అనిల్, లాస్ వేగాస్ ట్రిప్! నాకసలు తెలీకుండ ఇంత సీక్రెట్ గా ఎప్పుడు
బుక్ చేసావు!” నవ్వుతూ చూస్తున్న అనిల్ వెనకగా వెళ్లి అతని భుజాలపై చేతులు వేసి

“థాంక్యూ హనీ.” అంటూ నుదుటి మీద కిస్ ఇచ్చింది.
“నాకు వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడు కాదు అనిల్. కొన్నాళ్ళయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు వెళ్ళినా నేను ఎంజాయ్ చేయలేను.”

నాలుగు నెలల కిందే ఉన్న ఒక్క కూతురు, మహీర నలభై ఏళ్ల పుట్టిన రోజు చేసుకుంది. ఆ రోజు నుండి లత నిద్దర లేని రాత్రులు, ఆకలి లేని దినాలు చాలా గడిపింది. పెళ్ళి ధ్యాసే లేని కూతురి ధోరణి తల్లి లతకు అర్థంకాని విషయాల్లో ఒకటిగా మిగిలి పోయింది. సంతోషంగా ఉండడానికి కూడా మనసు ఒప్పడం లేదు.

“ఆలోచించు, ఎక్కువ టైం లేదు. నాలుగు రోజుల ట్రిప్పే కదా. ఈ రోజు మహి వర్క్ నుండి ఇక్కడికే వస్తోంది. నువ్విలా ఉంటె తను కూడా బాధ పడ్తుంది. ఈ రోజు అన్నీమరిచి పోయి అందరం హాయిగా స్పెండ్ చేద్దాం. ఏమంటావు?”

“ఒకే, లెట్స్ హేవ్ ఫన్. మహి ఫైవ్ వరకు వస్తానంది.” సంతోషంగా అంది.
“ఇట్స్ యువర్ డే. మేనిక్యూర్, పెడిక్యూర్ లేవి లేవా నీ ప్లాన్ లో !”
“ఊహు. ఇంట్రెస్ట్ అనిపించడం లేదు.” లత తన్ను తాను తమాయించుకుని,
“కామెడీ మూవీ ఏదైనా చూద్దాం రండి.” మనసును మళ్ళించడానికి అదొక దారి. ఇద్దరూ హోమ్ ధియేటర్ లోకి వెళ్ళారు.
                         ***                                           ***                                        ****                       ****

శుక్రవారం లత పుట్టిన రోజు డిన్నర్ అవగానే మహీర సాటర్ డే పని ఉందని వెళ్లి పోయి ఆదివారం మధ్యాహ్నం వచ్చింది.
“హాయ్ మాం!”

“ఎలా ఉన్నావ్ మహీ? నీతో తీరిగ్గా మాట్లాడనే లేదిమధ్య. వర్క్ లో చాల బిజీగా ఉన్నావట,
డాడ్ చెప్పారు.” లత కూతురిని ప్రేమగా చూస్తూ దగ్గరగా వచ్చి హగ్ ఇచ్చింది.
“అవును మాం” అంటూనే తల్లిని గట్టిగా వాటేసుకుంది.
“నెక్స్ట్ వీక్ మళ్ళి బిజీయె.”

ఈ మధ్య ఇండియన్ స్నాక్ కూడా తినడం మానేసింది. చిన్నప్పుడు ఇండియన్ స్నాక్ చూస్తె ఇష్టంగా తినేది. ఇప్పుడు ‘హేల్తి ఫుడ్’ అంటూ నాకే లెక్చరిస్తుంది. కూతురు అలా సైంటిఫిక్ రీజన్స్ ఇస్తూ ఫుడ్ గురించి చెప్తూంటే లతకు చాలా గర్వంగా ఉంటుంది. కిచెన్ లో కౌంటర్ మీద కూర్చుని తన కిష్టమైన రాగిపిండి మురుకులు తింటూ తల్లి మాటలు వింటోంది.

మహీ రాక ముందు లతలో ఆలోచనలు మనసంతా కమ్ముకుని సుళ్ళు తిరుగు తున్నాయి. ‘ఇలాగే కాలాలు కదిలి పోతున్నాయి, మా జీవితాలు కూడా ఇలాగె వెళ్లి పోతాయి. మహీ ఒంటరిగా మిగిలి పోతుంది.’ లత చాల దిగులు పడింది. చాల సార్లు అనిల్ తో అంది. ఓదారుస్తాడే కానీ సొల్యూషన్ మన దగ్గర లేదంటాడు.
“మహీ వచ్చినప్పుడల్లా ఆ విషయం మాట్లాడితే హర్ట్ అవుతుంది, రావడం మానేస్తుంది. మన దగ్గరకు కూడా ఫ్రీగా రాలేక పోతే ఇక ఎక్కడికి పోతుంది. అందం ఉంది, చదువుంది, తెలివి వుంది. అన్నీ ఉన్న నా ప్రిన్సెస్ బోటు మిస్సవలేదనే అనుకుండాం.” అన్నాడే కాని అనిల్ మనసులో ఉన్న దిగులును పైకి కనబడ నీయడు.

కూతురు పెళ్ళి చేసుకోనంటుంది. కూతురి వయస్సుతో బాటు ఆమె చేసే ఉద్యోగంలో అంతస్తులు పెరిగి పోతూ బేంక్ బాలెన్స్ ను పెంచుతున్నాయి. తల్లిదండ్రుల మనస్సుల్లో దిగులు కూడా పెరిగి పోతోంది. ముఖ్యంగా తల్లి మనసులో.

“నాకు టైం లేదు. నాకేవరిని మీట్ అవాలని లేదు. పెళ్ళి జీవితంలో అంత ముఖ్యమా! నాకనిపించడం లేదు. నా కిలాగే హాయిగా ఉంది.”
సంవత్సరానికోసారి క్రూజ్ బుక్ చేసి తల్లి దంద్రులతో బాటు వెళ్తుంది. ఫ్రెండ్సుతో వేకేషన్ లకు తరుచుగా వెళ్తుంది. కాని లైఫ్ పార్టనర్ తో కాదు.
లత మనసులో కదిలే ఆలోచనల్ని అదుపు దాటి ఫ్రెషర్ కుక్కర్ బర్స్ట్ అయినట్టుగా మహి ముందు అవన్నీ పైకేగిరాయి.

“పనిలో పడి జీవితాన్ని హోల్డ్ లో పెడితే కాలం ఆగదుగా మహి. ఈ సారి నీ పెళ్ళి అవాల్సిందే. నవ్వు ప్రయత్నిస్తే తప్పకుండా నీకు నచ్చిన వాడిని కలుస్తావు. నువ్వు ప్రయత్నమే చేయక పొతే ఎలా!”
తల్లి మనసును అర్థం చేసుకుంది మహీర.

“మాం, నువ్వలా దిగులుగా ఉండకు. ఐ లవ్ మై జాబ్, నేను చాల హేప్పిగా ఉన్నాను.
నన్ను చూసి నువ్వు కూడా హేప్పీగా ఉండు నా గురించి వర్రీ అవకు.”

“బర్త్ డే గిఫ్ట్ అంటావు, క్రిస్ట్ మస్ గిఫ్ట్ అంటావు. నాకెందుకు మహీ బహుమతులన్నీ . మాం!, దట్స్ గ్రేట్. డాడ్ వింటున్నావా మామ్మి మాటలు! నువ్వడగడం నేనివ్వక పోవడం జరగదు. ఏం కావాలి మాం?” గిఫ్ట్ వద్దనడమే కానీ ఏనాడూ ఏది అడగని మాం వైపు ఆశ్చర్యం, ఆనందంతో చూసింది. ఫ్రీక్వెంట్ గా ఇంటికి రమ్మని అడుగుతుంది గాబోలు మహీర అనుకుంది.
అనిల్ నవ్వుతూ అక్కడికి వచ్చాడు.

“నాకో గ్రాండ్ చైల్డ్ ని ఇస్తే నేను కూడా హేప్పిగా ఉంటాను. నిన్నుఇంకేమీ అడగను.”
“నిజంగా! గ్రాండ్ చైల్డ్ అంటే అంత ఇష్టమా!!” మహీర కళ్ళు పెద్దవి చేసి తల్లిని చూసింది.
“అవును” లత సంబరంగా అంది.
“నాకంటే కూడానా!”

“అవును నీకంటే కూడా” మురిసి పోతూ అంది. కూతురి వైపు చూస్తూ, అనిల్ వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు.

“ఓకే మాం. ఆలోచిస్తాలే.” నవ్వుతూ కంప్యూటర్ ముందు కూర్చున్న తండ్రి పక్కన చేరింది.
“త్వరగా పెళ్ళి చేసుకో మరి..” ఇప్పుడు మహీ పెళ్ళి గురించి సీరియస్ గా అలోచిస్తుందిలే. లతలో అంతులేని ఆనందం పరవళ్ళు తొక్కింది

                         ***                                    ***                                             ****                                *****

ఆ తర్వాత మహీరకు పని ఎక్కువగా ఉండటం, ట్రిప్ కు వెళ్ళడం సీజనల్ బిజీతో రోజులు కదిలి పోయాయి. మహీ వర్క్ లో జాయిన్ అవగానే దగ్గరలోనే కాండో కొనుక్కుంది. లత ఎప్పుడూ హైవేలో డ్రైవ్ చేయదు. భర్త తీసుకేల్లాల్సిందే. లత పని చేసే లైబ్రరి పది మైళ్ళ దూరంలోనే ఉంది కాబట్టి లతకు ఎప్పుడూ హైవే మీద డ్రైవ్ చేయల్సిన అవసరం రాలేదు. అప్పుడప్పుడు భర్త వర్క్ కు వెళ్ళేటప్పుడు మహి కోసం స్నాక్స్, ఫుడ్ పంపుతుంది. చూడాలనిపించి నపుడు ఫేస్ టైం చేస్తుంది. ఈ ఫేస్ టైం చూసినప్పుడల్లా కనిపెట్టిన వాళ్ళను ‘దీర్ఘాయుశ్భవ’ అని లత మనసులో దీవిస్తుంది.
రెండు నెలల తర్వాత

“మమ్మీ! నేను ఈ వీకెండ్ మీతో గడపడానికి వస్తున్నాను. నీకు వీలయితే నాకు రెండు రోజులకు సరిపడా ఇండియన్ ఫుడ్ చేసిపెట్టు. నే వచ్చాక నీకో గుడ్ న్యూస్ చెప్తాను.”

“ఏమిటది మహీ ఇప్పుడు చెప్పు.” మహి మాటల ధ్వనికి లత గుండె వేగంగా కొట్టుకుంది.
“గుడ్ న్యూస్! నే వచ్చాక వివరాలు చెప్తాను.”

గుడ్ న్యూస్ ఏముంటుంది- మహీకి సూటబుల్ బాయ్ దొరికాడు. లత మనసులో పెళ్ళి పత్రికలు ప్రింటయి పోయాయి. పెళ్ళి మంటపం లేచి నిలబడింది. పువ్వుల తోరణాలు, పెళ్ళి వంటల ఘుమఘుమలలో తేలిపోయే మనసుతో అనిల్ వర్క్ నుండి వచ్చేవరకు వాస్తవ లోకం ఒకటి ఉందని గుర్తే లేదు లతకు. గాలిలో తేలిపోతూ తిరిగింది.

                                    ***                    ***                            ***                            ***                           ***

శనివారం “బ్రేక్ ఫాస్ట్ కు నీ కిష్టమైన మాంగో దోస చేస్తాను త్వరగా రా!” అని లత ఊరించింది.
“అది వింటేనే నాకు వాంతి అయ్యేట్టు ఉంది.” అంటున్న కూతురికి వంట్లో బాగా లేదనుకుంది లత. మహి లేచాక వస్తాను అని ఫోన్ పెట్టేసి నెమ్మదిగా మధ్యాహ్నానికి గాని రాలేదు.

“మహీ మొహం కళకళ లాడుతోంది కదూ!” అనిల్ తో అంటున్నలత మొహం కూడా వెలుగుతోంది అనుకున్నాడు అనిల్.
లంచ్ కాగానే అందరూ ఫేమిలీ రూంలో రిలాక్సయి మహీ ఏం చెప్తుందా అని ఆత్రుతగా ఉన్నారు.

“మాం! నీ కోరిక తీరబోతోంది.”
“ఎవరా అబ్భాయి? ఎప్పుడు మీటవాలి?” సంతోషాన్ని అణుచుకోలేని లత.
ముందుగానే మహీర కొంత ఇన్ ఫర్మేషన్ తండ్రికి ఇవ్వడం మూలాన అనిల్ కామ్ గా ఉన్నాడు.
“ఎనిమిది నెలల తర్వాత”
కొన్ని నిముషాలు ఆగి లత నిరుత్సాహంతో, “నాకు నీ బిడ్డ కావాలి కానీ ఎడాప్తేడ్ కిడ్ కాదు.”

“నేను ఎడాప్ట్ చేయడం లేదు. నేనిప్పుడు ప్రెగ్నెంట్. ”
“నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకోవడానికి మేమెప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడైనా మించి పోయింది లేదు. వెంటనే మీ ఇద్దరికీ పెళ్ళి చేసేస్తాం.” లత కళ్ళల్లో ఆగని కన్నీళ్ళు. కూతురు ప్రెగ్నెంటని తెలుస్తోనే ఉంది, కాని పెళ్ళి కాలేదు.

మహీర లేచి తల్లి పక్కనే కూచుని భుజం తల వాల్చింది. అనిల్ వెళ్లి లతకు మరో పక్క కూర్చున్నాడు.
“లతా! ముందు మహీ చెప్పేది పూర్తిగా విను.” అనిల్ ఓదార్పుగా అన్నాడు.

“మాం! నువ్వు గ్రాండ్ చైల్డ్ కావాలన్నతర్వాత నేను చాల ఆలోచించాను.”
అయోమయంగా కూతురి వేపు చూసింది లత.

“నీకు తోడు ఉండడానికి ఒక జత గాడు కావాలనే ఉద్దేశ్యంతో గ్రాండ్ కిడ్ కావాలన్నాను.”
“నాకసలు పెళ్ళి చేసుకోవాలని లేదు. కారణమేమిటని అడగకు మమ్మీ. ఎందుకంటే కారణాలేవీ లేవు. నువ్వు గ్రాండ్ చైల్డ్ కావాలని అడిగిన వెంటనే రీసర్చ్ చెసాను. IVF (ఇన్ వీట్రో ఫెర్టిలైజేషన్) ట్రీట్ మెంట్ నచ్చింది. నాకు దగ్గరలోనే ఉన్న ఐ వి యఫ్ క్లినిక్ వెళ్ళాను. టెస్టులన్ని చేసారు. అన్నీ బానే ఉన్నాయి. నేను చాల హెల్తీగా ఉన్నాను మాం. అయినా యుటరస్ బలానికి మందులిచ్చారు.”

నోరు తెరుచుకుని వింటున్న తల్లి వైపు చూస్తూ, “చిన్న సర్జికల్ ప్రొసీజర్ తో నా ఎగ్స్ తీసుకున్నారు. అప్పుడు కాస్త నెప్పి ఉండింది. ఒక రోజు రెస్ట్ తో మామూలయి పోయాను. మీకు చెప్తే గాబరా పడతారని చెప్పలేదు. తర్వాత స్పర్మ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్స్, స్పర్మ్ ఇంకుబేట్ చేసారు. ఏం బ్రియోను నా యుటరస్ లోకి ట్రాన్స్ఫర్ చేసారు. అప్పుడు రెండు రోజులు సెలవు తీసుకున్నాను.”

“ నా ఉద్దేశ్యం కిడ్ ఒక్కడే కావాలని కాదు. నీ ప్లాన్ నాకెందుకు చెప్పలేదు. నేను నీదగ్గరే ఉండేదాన్ని.” ఇలాంటివి లత వార్తల్లో చదివింది కానీ నా కూతురే… లత మనసు మూగబోయి ఇంకేమి ఆలోచించలేదు. కూతురిని దగ్గరగా హత్తుకుంది.

“నువ్వొక్క దానివే హేండిల్ చేసావు, మేము నీతో ఉంటె నీకు మోరల్ సపోర్టు, మాకు తృప్తి ఉంటుంది కదరా. ఇక ముందు మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యి.!” అనిల్ బాధగా అన్నాడు.

“డాడ్! మీకు చెప్పకుండా నేనేం చేయనని మీకు తెలుసు. మీకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలని.”
“నాకు తెలుసురా.” ప్రేమగా మహీ తల నిమిరాడు. అనిల్ మనసు తల్లడిల్లింది.

“ఇదంతా ఎలా మొదలు పెట్టావు, ఎప్పుడు మొదలు పెట్టావు?.” లత నెమ్మదిగా తేరుకుని అడిగింది.
“డాడికి ప్రోసిజర్ అయిపోయాక చెప్పాను, నువ్వు బెంబేలు పడతావని చెప్పలేదు.”

“నీకు ముందే తెలుసా అనిల్!” ఆశ్చర్యంగా చూస్తున్న లత చేతిని తన చేతిలోకి తీసుకుని,
“అంతా కన్ఫర్మ్ అయ్యాక చెప్పింది. తాను వచ్చి చెప్పే వరకు నన్ను చెప్పోద్దన్నది.”

“ఒకసారితోనే సక్సెస్ కాక పోవచ్చు. సక్సెస్ అవగానే చెప్పాలనిపించింది. డొనేట్ చేసిన స్పర్మ్ బేంక్ లోంచి నేను ముందే స్పర్మ్ సెలెక్ట్ చేసుకున్నాను. కావలసిన తెలివి, రంగు, అందం అన్నీ ఉన్న స్పర్మ్ ను సెలెక్ట్ చేసుకున్నాను. నేను చాల హెల్తీ గా ఉండడం మూలాన అన్ని సక్రమంగా జరిగి ఒక్క సారికే సక్సెస్ అయింది. ఇంత ఫాస్ట్ గా డిసైడ్ చేసే వాళ్ళు కొద్ది మండే ఉంటారు అని డాక్టర్ అంది. ఇదంతా రెండు నెల్లల్లో జరిగింది. ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజే నీకు ఫోన్ చెసాను మాం.”

“అతను బిడ్డ కావాలని వస్తే ఎలా?” లత ఆందోళన
“కొంత మంది స్పర్మ్ ను అమ్ముకుంటారు. వాళ్ళకు ఏ అధికారం లేదని సంతకం చేస్తారు. కొనుక్కున్న వాళ్ళకే హక్కు ఉంటుంది. కొందరు డొనేట్ చేస్తారు, అయినా హక్కు ఉండదు.”
“తండ్రి లేకుండా బిడ్డను పెంచడం కష్టం మహీ.”

“కష్టమేమి కాదు. పెళ్ళి చేసుకున్న సుమతి అంటి ఏం చేయగలిగింది. హటాత్తుగా అంకుల్ చనిపోతే మీరంతా ఆమెకి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించారు. ఇద్దరు పిల్లల్ని పెంచింది. నాకు మీరున్నారు. ఇంకా ఏం కావాలి.”

“నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరిచి పోవద్దు. సెలవు తీసుకుని ఇక్కడే కొన్ని రోజులు ఉండు.” లత కూతురి తలను తన చేతుల్లో పొదివి పట్టుకుంది.

“తీసుకోవలసిన జాగర్తల గురించి పెద్ద లిస్టు ఇచ్చారు. నాకాండో లోనే ఉంటాను మమ్మీ. క్లినిక్ కు దగ్గరలో ఉంటె బాగుంటుంది. నువ్వు వచ్చి నాతో కొన్ని రోజులు ఉండు.”

“నువ్వు ఈ రెండు రోజులు హాయిగా ఉండు. తర్వాత ఇద్దరం వెళ్దాం.” అనిల్ వేపు చూసింది.
తలాడిస్తూ ఓకె కొట్టాడు అనిల్. రకరకాల ఫీలింగ్స్…ఒకవైపు సంతోషం, మరేదో తెలియని ఫీలింగ్స్ తో లత బిడ్డ చెప్పిన మాటలను జీర్ణం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. రాత్రి పడుకునే ముందు లతకు తన ఫ్రెండ్ మాధవి గుర్తు వచ్చింది.

ఒక రోజు లత మరో నలుగురు ఫ్రెండ్స్ కలిసి మెక్సికన్ రెస్టారెంట్ లో లంచ్ కెళ్ళా రు. అక్కడ చిప్స్, సల్సా భలే ఉంటాయి. మాధవి, రమకు చాలా ఇష్టం. వాళ్ళు చాన్స్ వచ్చినప్పుడల్లా మెక్సికన్ రెస్టారెంట్ నే పిక్ చేస్తారు. ఆర్డర్ కు ముందుగా సర్వ్ చేసే చిప్స్ తోనే కడుపు నింపుకుంటూ దాని గురించి జోక్స్ చేస్తూంటారు. అది గుర్తు రాగానే నిద్ర మత్తులో కూడా లతకు నవ్వు వచ్చింది.

లత పక్కనే కూర్చున్న మాధవి తన కూతురు, నలభై రెండేళ్ళ హారిక గురించి చెప్పింది.
“కంప్యూటర్ వచ్చాక నా బ్రతుకే గందరగోళం అయిందనుకున్నాను, ఎలాగో కష్టపడి ఇమిడి పోయాను.ఇప్పుడు పరుగెత్తే ఈ సైన్స్ ను చూస్తూంటే మనుషుల అనుబంధాలు, అనురాగాలు ఎలా ఉంటాయో తెలీడం లేదు.”

ఉపోద్గాతం దేనికో అనుకుంటుండగానే మాధవి అందుకుంది, “ఎగ్గ్ ఫ్రీజ్ చేయాలను కుంటు న్నాను. నెక్స్ట్ మన్ డే అపాయింట్ ఉంది అన్న నా బిడ్డ మాటలు అర్థం అవడానికి నాకు పది నిముషాలు పట్టింది.” అంది.

మాకందరికి అర్థం అవడానికి చాల టైం పట్టింది. అర్థమయ్యాక జాలేసింది.
‘పెళ్ళి చేసుకోవే’ అనే రోజులు గడిచి పోయాయి. “ఏమి గడ్డు రోజులొచ్చాయి భగవంతుడా!” ఒక్క సెకను ఆగి “కూతురికి తల్లి చెప్పాల్సిన మాటలేనా ఇవి! మీరె చెప్పండి.” ఉబికి వచ్చే కన్నీటిని నేప్ కిన్ తో అద్దుకుంటూ అంది.

“నీ ఎగ్ ను ఫ్రీజ్ చేయించుకో, తారవాత ఎప్పుడో ఒకసారి మళ్ళి గర్భ సంచిలోకి ఎక్కించుకుని పిల్లను కందువుగాని” అని చెప్పాల్సిన రోజులు వచ్చాయి.

పైగా “కనే వయస్సు దాటి పోతుంది. కనీసం ఎగ్ ఫ్రీజ్ చేస్తే పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.” అని నాకే చెప్తోంది. మేము మాటలతో పింగ్ పాంగ్ ఆడుకుంటాంలే.’

“అమల కూతురు అలాగే చేసిందిగా. నలభై నాలుగో ఏట పెళ్లయింది, ఫ్రీజ్ చేసిన ఎగ్ తోనే పిల్లని కంది. మూడేళ్ళ పిల్లా, తల్లి అందరూ హాయిగా ఉన్నారు.” దిగులు పడకు అన్నట్టుగా చెప్పింది నీలవేణి.
అందరం అర్థం చేసుకోవడానికి తెగ ఆలోచించాము. అర్థం అయిన తర్వాత తనని ఓదార్చాము.
పది నెల్ల తర్వాత పండంటి ఆర్నవ్ ను భుజం మీద వేసుకుని నిద్ర పుచ్చడానికి ప్రయత్నిస్తోంది లత.

“నువ్వంటే మహీకి ఎంత ప్రేమో చూడు, నువ్వడిగిన గిఫ్ట్ ను సంవత్సరం లోగా నీ కందిచ్చింది.
అదృష్టమంటే నీదే.”

‘నేనంటే ఏమనుకున్నారు’ అన్నట్టు కనుబొ మలు ఎగరేసి నవ్వింది లత.
ఒళ్లో ఉన్న ఆర్నవ్ కేసి చూస్తూ లత

“సంతోషంగా ఉంది కానీ మహీ ఒంటరిగా జీవితం గడపాలని నిశ్చయించు కోవడం బాధగా ఉంది.” అంది.
“ఇంతకు ముందు ఎవర్నో ఒకరిని కలుస్తుందిలే అనుకునేవాణ్ణి నౌ ఆర్నవ్ ఉన్నాడుగా.
అంటుందేమో!” అనిల్ లో ఉన్న బాధ అంతా గొంతులో వినిపించింది. లత ఇంకేమీ అనలేక పోయింది.
సాయంత్రం అనిల్ బర్త్ డే కేక్ తెచ్చి టేబుల్ పై అరేంజ్ చేసాడు. మహీర వచ్చి

“కేక్ లుక్స్ యమ్మి. మాం త్వరగా కేక్ కట్ చెయ్యి. రెందేల్లాగితే ఆర్నవ్ చేతులతో తానే కేక్ కట్ చేస్తాడు. నిన్ను కేక్ దగ్గరకు రానివ్వడు. నాక్కావాల్సింది కూడా అదే మనసులో అనుకుంటు
ఆర్నవ్ నుదుటి పై కిస్ ఇచ్చి క్రిబ్ లో పడుకోబెట్టి టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడి కూతురి వేపు గర్వంగా చూసింది.

ప్రతి జనరేషన్ లో ఏదో కొత్తదనం రావడం మాములే. అ కొత్తదనం పోయేవరకు పాత జనరేషన్ తడుము కుంటూనే ఉంటారు, కొత్త తనం అలవాటు అయేవరకు. ఈ దేశం వచ్చిన కొత్తలో అంతా అయోమయంగా ఉండేది. ఊరు వాడ అలవాటు అయ్యాక ఇప్పుడు అన్ని కరతలా మలకములే. జీవితమూ అంతే.

— సోమ సుధేష్ణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.