నిశ్శబ్ద విజయపు సడి! (కవిత )-డి.నాగజ్యోతిశేఖర్,

మహిళా దినోత్సవ సంబరాల్లో
కురుస్తున్న ఉత్ప్రేక్షాల జడికి ఎద లోతుల్లో ఏదో అలజడి…
తీరం దాటని స్వేచ్చా వాయు గుండమేదో
గుండెల్లో సుళ్ళు తిరుగుతున్నది!

విరుస్తున్న పెదవిపూల తావికి
మది పుటాల్లో ఏదో ఉక్కిరిబిక్కిరి!
సమానత్వ సుగంధం ప్రసవించని ప్లాస్టిక్ వాసనేదో
ప్రశంసా పరిమళాన్ని కబళిస్తున్నది!

వ్యక్తిత్వ వెన్నెల్లు పూసుకున్న వెలుతురు పిట్టలేవో
ఆకాశంలో సగం నీదని నినదిస్తుంటే….
బాధ్యతల కుక్కర్ ఈల స్వర బంధమేదో
చాల్లే ఇటు రా అంటూ శాసిస్తున్నది!

నిన్నటి ఆశల దుప్పటిని దులిపి రేపటి స్వప్నాల సమూహాన్ని పోగేసుకుంటుంటే…
ఆధిపత్యపు నిశి దారాలేవో
ఆంక్షల కొక్కాలు తగిలించుకుని
ఉనికి వస్త్రాన్ని
తునకలు చేస్తున్నవి!

శ్రమల స్వేదాన్ని గెలుపు సిరాగా తనువు కలంలో
నింపుకొని
అస్తిత్వపు సంతకం లిఖించాలంకుంటుంటే….
భగ్న వాగ్ధానాల ఆవిరి మేఘాలేవో
గుర్తింపు పత్రాన్ని
అపహరిస్తున్నవి!

గర్భమెంత ఎండుతున్నా
గరికై మొలవక పోదు పుడమి!
తలలెంత తరిగినా
జగతికి శ్వాసై
జనించకపోదు తరువు!

మగువా అంతే!
దక్కని “సాధికారత”
పోరాటమై మిగులుతున్నా
తనలోని మాతృత్వాన్ని
తృణీకరించదు!
మారని విధిరాత వెక్కిరిస్తున్నా….
ఈ సృష్టికి జీవం పోసే తన విధిని ధిక్కరించదు!

ఏదో ఒకనాడు!
చేతన రెక్కలు ప్రసవించిన
తన
నిశ్శబ్ద విజయపు సడి ఢమరుక ధ్వనై ప్రతిధ్వనించక మానదు!

-డి.నాగజ్యోతిశేఖర్,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.