దేహం (కవిత )-గిరిప్రసాద్ చెలమల్లు

ఎముకల చుట్టూ
అల్లబడిన దేహం
రంగుల్లో
రూపు రేఖల్లో
తారతమ్యాల సంకెళ్లో
నిర్వచించబడే అందమనే పదంలో
అంతర్లీనంగా బంధించబడి
మనిషి మరచిపోతున్న
జీవసంబంధ చర్యలు ప్రతిచర్యలు

వివక్ష లో దేహం
అంగట్లో దేహం
మారుతున్న నేపధ్యాలు
భౌగోళికం నైసర్గికం యదార్ధం
పెట్టుబడి దేహాలపై
పరచబడి
వేదికలపై న్యాయనిర్ణేతల
కళ్ళముందు దేహం

చూచే కళ్ళల్లో
చూచే కోణాల్లో
తేడా అందంలో ప్రస్ఫుటం
బాహ్య దేహం
అంచనాల్లో
వెలలో వేలంలో
యవ్వనంలో ముదిమిలో
తెరల లోకంలో
తెములుతున్న దేహం

పైపూతల సృష్టి
కర్కశంగా దేహాన్ని
మానసికంగా శారీరకంగా
చంపుతుంటే
ఆకాంక్షల దేహం
దీనంగా పలవరిస్తుంది

                                                           –గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.