సంపాదకీయం- మానస ఎండ్లూరి

విహంగ పాఠకులకు, సాహితీప్రియులకు, రచయిత్రీ రచయితలకు, మిత్రులకు నా నమస్కారాలు. కొత్తతరం రచయిత్రి రచయితలను పరిచయం చేయాలి, బాధిత స్త్రీల పట్ల నిలవాలి అన్న ఉత్సుకతతో 2010లో ఈ పత్రికను స్థాపించింది రచయిత్రి నాకు జన్మనిచ్చిన తల్లి డా. పుట్ల హేమలత. తొమ్మిది సంవత్సరాలుగా ఈ పత్రిక కోసం ఆమె తన ప్రియ శిష్యులు అరసి శ్రీ, పెరుమాళ్ళ రవి కుమార్ లతో కలిసి అహోరాత్రులు కష్టపడేది. ముఖ్యంగా

‘విహంగ’ కు ISSN ఉండడం వలన విద్యార్థులకు పరిశోధకులకు విహంగలో ప్రచురింపబడిన రచనలు చదువు ఉద్యోగ నిమిత్తం ఉపయోగపడతాయి. ఎంతోమంది పేరుగాంచిన రచయితల నుండి మొట్ట మొదటి రచన చేసే వారి వరకు ఈ పత్రికకు రాశారు. నా మొదటి కథ ‘గౌతమి’ కూడా విహంగ లోనే ప్రచురితమైంది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న అమ్మ ఆకస్మికంగా మనల్ని వదిలి వెళ్ళి పోయిన కారణంగా విహంగ సంపాదక బాధ్యతలు ఆమె కూతురిగా, సాహిత్యాభిలాషి గా నేను తీసుకోవాల్సిన బాధ్యతను అందుకుంటున్నాను. నిజానికి తను ఉన్నప్పుడు నేను ఏం పనులు చేస్తే ఆమె సంతోష పడేదో అవన్నీ ఇప్పుడు నేను శ్రద్ధగా చేయడం నాకు అత్యంత విషాదం.

నిన్న పంజాగుట్టలో బాబాసాహెబ్ విగ్రహం పడకొట్టినప్పుడు ఆ పెద్దాయన్ని ప్రేమించే కూతురిగా అమ్మ బాగా జ్ఞాపకం వచ్చింది. ‘తాతయ్యకి నమస్తే చెప్పమ్మా’ అనేది ఎక్కడైనా కనిపిస్తే. బాబాసాహెబ్ విగ్రహంగా నిలిచినప్పటికే మనం ఒక్కటిగా ఆయన్ని గౌరవించుకున్నామా? మట్టి బొమ్మలా కూలినప్పుడు మనం కలిసి కట్టుగా ఏకమయ్యామా? రాజ్యాధికారం కలగానే మిగిలిపోతూ మనమే రాజ్యాలుగా విడిపోతున్నాం, పేకమేడల్లా కూలిపోతున్నాo. మనలోనూ ఆకార నీళ్లు, రంగుల రాళ్లు నిండుకున్నాయి. ఏవైతే దేనికీ పనికి రాని విషయాలనీ కొట్టిపారేసామో, వాటి గురించే మనలో మనం మనతో మనం కొట్టుకుంటున్నాo. ఈ అక్క చెల్లెళ్ళ పోరు చూసి బాధ పడాలా నిజాలు తొవ్వుకుని ఏడ్చుకోవాలా! విగ్రహం పగిలినన్ని ముక్కలుగా పౌరులు పగిలిపోతే మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ కర్తని గుర్తుపెట్టుకుని ఎవరు గౌరవిస్తారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దళిత నాయకుడు మాత్రమే కాదు. ఒక జాతీయ సంఘసంస్కర్త అన్న వాస్తవాన్ని పదే పదే గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఒక భారతీయురాలిగా ఈ భారతదేశ రాజ్యాంగం పట్ల రాజ్యాంగ రచయిత పట్ల చేసిన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి భారతీయురాలు/ డు ఈ సంఘటనను ఒక హేయమైన చర్యగా గుర్తించాలి. ఎందుకు అన్నది ఆలోచించాలి.
అందరికీ బాబాసాహెబ్ 128వ జయంతి శుభాకాంక్షలు.

ప్రతి నెలా ఈ కొత్త రెక్కలు తొడిగిన విహంగ ద్వారా అర్థవంతమైన, అవసరమైన రచనలు ఇక ముందు కూడా అందించడంలో మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను. మీ రచనలు editor.vihanga@gmail.com కు పంపగలరు.

-మానస ఎండ్లూరి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

6 Responses to సంపాదకీయం- మానస ఎండ్లూరి

 1. అభినందనలు మానస గారు. మీ సారధ్యం లో విహంగ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ,హేమలత గారి ఆశయాలను నిలబెదాటారని ఆశిస్తూ మరో సారి అభినందనలు

 2. Devarakonda Subrahmanyam says:

  చాలా హృద్యంగా రాశారు . 2014 సెప్టంబర్ లో డిల్లీ లో జరిగిన స్త్రీ రచయతల సదస్సుకు అమ్మ వచ్చారు . మంచి అనుభందం ఏర్పడింది. విహంగా ఆవిడ స్మృతికోసం దివ్యంగా నడవాలి

 3. మమత.వి says:

  శుభాకాంక్షలు మానస గారు….. అమ్మ హేమలత గారి ఆశయాలు మీ రు పూర్తి చేయాలని, ఈ పత్రికా రంగంలో మీరు కూడా రాణించాలని కోరుకుంటున్నాను…

 4. Seshu korlapati says:

  అభినందనలు మానస గారు. మీ సారధ్యంలో విహంగ మరింత జనాల్లోకి వెళుతుందని గట్టిగా నమ్ముతున్నాం.

 5. డా. సురేష్ కుమార్ దిగుమర్తి says:

  హేమలత గారి కలల రూపం మీరే. మీ ఆధ్వర్వంలో తప్పక విచ్చుకుంటుంది విహంగ.

 6. Vijay says:

  Welcome to Vihanga, Manasa ! Good editorial …keep up !