మేఘసందేశం-17 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు మహాకవి అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు చాలా అమయాకంగా ఉండేవాడట. అందరూ ఏదో విధంగా పనిగట్టుకుని అతన్ని ఆటపట్టించేవారట. ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి “అస్తి కస్చిత్ వాక్ విశేషః?” అని అన్నదట. అంటే “అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా” అని అపహాస్యం చేసిందట. కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని ‘అస్తి, కస్చిత్, వాక్’ అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు కాళిదాసు అలానే చాలా కాలం మస్తిష్కంలో ఉండిపోయాయట. ఆమె అనడం వల్లనో దేవి కరుణాకటాక్షమో తెలియదు గానీ తదనంతర కాలంలో కాళిదాసు ఆ మూడు పదాలతో “మొదలెట్టి” మూడు కావ్యాలే రాసేసాడు.

1. అస్తి…తో ‘అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా…’ అంటూ మొదలెట్టి కుమారసంభవం.
2. ‘కస్చిత్..తో..’కస్చిత్ కాంతా విరహ గురుణా..’ అంటూ మొదలెట్టి మేఘ సందేశం.
3. ‘వాక్’ ..తో..’వాగర్ధావివ సంపృక్తౌ…’ అంటూ మొదలెట్టి రఘువంశం రాసేసాడు.

అసలు నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్రకారులు ఒప్పుకోకపోయినా, భాషాభిమానులు, భక్తి పారాయణులు ‘అద్భుతం..’ అనకుండా ఉండలేరు. ఆ కావ్యాల్లో చిన్నది, విరహ శృంగార రస ప్రధానమైనది మేఘసందేశం. .కావ్యం అంతా ఒకటే వృత్తం- మందాక్రాంత. ప్రతి హిందువుకూ ‘శాంతాకారం భుజగశయనం పద్మ నాభం సురేశం..’ అనే ప్రసిధ్ధ శ్లోకం తెలిసే ఉంటుంది..ఈ కావ్యం మొత్తాన్ని ఆ శ్లోకం నడకలో చదువుకోవాలి.. భారతదేశంలో పుట్టినందుకు మరణించేలోపు ఒక్క మహాకావ్యమన్నా చదివి ఆస్వాదించాలనే తృప్తికోసమైనా ఈ మేఘసందేశం చదివి తీరాలి. నిజానికి ఇదొక్కటీ ఆస్వాదిస్తూ చదివితే మరికొన్ని కావ్యాలు చదవాలనే కొరిక కలగొచ్చు.

కుబేరుని శాపం వల్ల భార్యకు దూరమైన ఒక యక్షుడు మేఘంతో చేసే తన విరహ సంభాషణే ఈ కావ్య వస్తువు. మేఘంతో సంభాషణేమిటి? అర్థం లేకుండా! అని అనుకుంటూ ఉండే లోపే…. మనం కావ్యంలో నిమగ్నమైపోతాం. ఆదిలోనే…’ధూమజ్యోతి సలిల మరుతా…’ అంటూ విరహబాధ వినిపిస్తాడు కాళిదాసు. విరహంలో ఉన్న ప్రియునికి సాధ్యాసాధ్యాల బేరీజు వెసుకోవడం, ఇంగిత జ్ఞానం వంటివి ఉండవని అన్యాపదేశంగా చెప్తాడు కాళిదాసు.. ఇక అక్కడి నుంచి నాయకుడైన యక్షుని మనఃస్థితిని అర్థం చేసుకుని తక్కిన కావ్యం సందేహాలు లేకుండా ఏకబిగిన చదివేయొచ్చన్నమాట. మరి ఆలశ్యం ఎందుకు? మనం అలకాపురి పట్టణ వర్ణనలోకి వెళ్దాం.

గత మాసం “యస్యాం యక్షాః సితమణిమయా” అన్న శ్లోకంతో ఉత్తరమేఘ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం. ఇక ఈ మాసం మరిన్ని అలకాపురి విశేషాలను చూద్దాం.

శ్లో.6. మందాకిన్యా: సలిలశిశిరై: సేవ్యమానా మరుద్భి
ర్మందారాణా మనుతటరుహాం ఛాయయా వారితోష్ణా:
అన్వేష్టవై: కనకసికతాముష్టినిక్షేపగూఢై:
సంక్రీడంతే మణిభిరమరప్రార్ధితా యత్ర కన్యా:

భావం: ఓ మేఘుడా! అలకానగరంలో యక్ష కన్యలు దేవతల ప్రార్ధన మేరకు అక్కడకు విచ్చేసి వారి విందువినోదాలలో పాల్గొంటారు. అక్కడి గంగానది మీదుగా వీచే చల్లని గాలులతో వేడిమిని తగ్గించుకొని పిడికిళ్ళతో ఇసుకను తీసుకొని దానిలో మణులను రహస్యంగా దాచి వాటిని గుర్తించే క్రీడతో వినోదిస్తారు.
విశేషము: ఈ ఆట కొద్ది మార్పులతో ఈనాడు కూడా ఉన్నది. ఒకరి కళ్ళకు గంతలు కట్టి ఇసుకను దోసిళ్ళతో పోయించి, ఆ ప్రదేశాన్ని తర్వాత కళ్ళగంతలు విప్పి కనుగొనమనడం లాంటి ఆట ఆ రోజులలో కాళిదాసు కాలంలో కూడా ఉన్నదన్న విషయం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

శ్లో.7. నీవీ బంధోచ్ఛ్వసిత శిధిలం యత్ర బింబాధరాణాం
క్షౌమం రాగాదనిభృత కరేష్వాక్షిపత్సు ప్రియేషు
అర్చిస్తుంగా నభిముఖ మపి ప్రాప్య రత్నప్రదీపాన్
హ్రీమూఢానాం భవతి విఫల ప్రేరణా చూర్ణముష్టి:

భావం: ఓ మేఘమా! ఆ పట్టణంలోని స్త్రీపురుషులంతా భోగలాలసులు. నిత్యం శృంగార చేష్టలతో వినోదిస్తూ ఉంటారు. ప్రేయసీప్రియులు కలిసి విహరించే సమయంలో అతిమోహంతో ప్రియులు తమ నీవీబంధాన్ని సడలించడంవలన వారు ధరించిన పట్టువస్త్రాలు జారిపోతూ ఉంటాయి. ఆ సమయంలో స్త్రీలు తమ శరీరాలు వేరొకరికి కనిపించగూడదన్న ఉద్దేశ్యంతో దీపాలను ఆర్పివేయాలన్న సంకల్పంతో కుంకుమ పొడిని దీపలవేపు చల్లుతారు. కానీ ఆదీపాలు నూనెతో చేసినవి కాక మణులతోచేసినవి కనుక ఆ దీపాలను ఆర్పడం సాధ్యం కాదు. వారి ప్రయత్నాలన్ని వ్యర్ధం అవుతాయి. ఇవన్నీ వారి శృంగార జీవితాన్ని నీకు చెప్పడానికే సుమా! అంటున్నాడు యక్షుడు.

శ్లో.8. యత్ర స్త్రీణాం ప్రియతమభుజోచ్ఛ్వాసితా లింగితానా
మంగ గ్లానిం సురజనితాం తన్తుజాలావలంబా:
త్వత్సమ్రోధాపగమ విశదైశ్చంద్ర పాదైర్నిశీథే
వ్యాలుం పన్తి స్ఫుటజలల వస్యందినశ్చంద్రకాన్తా:

భావం: ఓ ప్రియనేస్తమా! మేఘమా! అలకా పట్టణంలో అర్ధరాత్రి సమయంలో నీ అడ్డు తొలగడం వలన స్వచ్ఛంగా ప్రసరిస్తున్న వెన్నెలతో చంద్రకాంత శిలలు స్వచ్ఛమైన నీటిబిందువులను స్రవిస్తాయి. ఆ శిలలు ఆ గృహాల గోడలలో అమర్చడంవలన శయ్య మందిరాలలో ప్రియుల సమాగంతో అలసిపోయిన స్త్రీల శరీరాలపై ఆ బిందువులు చల్లని స్పఋశతో వారికి మిక్కిలి హాయిని కలిగిస్తాయి.

శ్లో.9. నేత్రా నీతా: సతత గతినా యద్విమానాగ్ర భూమీ
రాలేఖ్యానాం స్వజల కణికా దోషముత్పాద్య సద్య:
శంకాస్పృష్టా ఇవ జలముచ స్త్వాదృశో జాలామర్గై:
ర్ధూమోద్గారాను కృతినిపుణా జర్జరా నిష్పతంతి.

భావం: ఓ మేఘుడా! అలకాపట్టణంలోని ఎత్తైన మేడల పైభాగాములకు గాలిద్వారా తీసుకుని రాబడిన నీవంటి మబ్బులు భవనాలలో వేలాడదీయబడి ఉన్న చిత్రపటాలపై నీటిబిందువులను తగిలేట్టు చేస్తాయి. ఆవెంటనే ఏదో తప్పు జరిగినట్టుగా జంకుతో కిటికీల రంధ్రాల ద్వారా చిన్న చిన్న ముక్కలై బయటికి వెళ్ళిపోతాయి.

యక్షుడు మేఘుడికి ఆసక్తికరంగా అలకాపురి పట్టణ శోభను హృద్యంగమంగా వివరిస్తున్నాడు. ఆ తర్వాత మేఘునికి యక్షుని యింటికి చేరుకునే మార్గం చెప్పబోతున్నాడు. మిగతా విశేషాలు వచ్చే సంచికలో చూద్దాం.

– వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)