మేఘసందేశం-18 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఒక అర్ధరాత్రివేళ ఒక వ్యక్తి ఒక గొప్పవెలుగునిస్తున్న దివిటీని చేతితో పట్టుకొని ముందుకు వెళుతున్నాడనుకొందాం. ఆ దివిటీకి ముందున ఉన్న భవనాలు, వస్తువులు ధగధగా వెలిగిపోతూ ఉంటాయి కదా! ఆ దివిటీ ముందుకు దాటిపోగానే ఆ భవనాలు, ఆ వస్తువులన్నీ ఆ తేజస్సును కోల్పోవటమే కాకుండా అంతకు ముందు తమకున్న కాంతిని కూడా కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తాయి కదా! ఇప్పుడు ఈ విషయాన్ని మహాకవి కాళిదాసు వర్ణించిన తీరు చూద్దాం.

మహాకవి కాళిదాసు రచించిన రఘువంశ కావ్యంలో విదర్భ రాజకుమారి ఇందుమతికి స్వయంవరం జరుగుతున్నది. మండపంలో నానాదేశాల రాజకుమారులు రెండు వరుసలలో కూర్చొని ఉన్నారు. రాజకుమారి ఇందుమతి దివ్యవస్త్రాలను ధరించి, సకలాభరణాలనలంకరించుకొని, స్వయంవర పూలమాలను చేతులతో పట్టుకొని మండపంలోకి వచ్చింది. ‘ఈ సుందరి నన్నే వరిస్తుంది. నన్నే వరిస్తుంది.’ అన్న ఆలోచనలతో రాకుమారులందరి ముఖాలు దీపశిఖకు ముందున్న వస్తువులలాగా ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఆమె ఒక్కొక్కరిని కాదంటూ దాటివెళుతుంటే ఆ వెనుకనున్నవారి ముఖాలు దీపశిఖకు వెనుక నున్న వస్తువులలాగా వెలవెల పోతున్నాయి. ఈ సందర్భంలో ‘సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ’ – ఇందుమతి రాత్రివేళ నడుస్తున్న దీపశిఖలాగా ఉన్నది అన్నాడు కాళిదాసు. అత్యద్భుతమైన ఈ ఉపమాలంకారాన్ని ప్రయోగించిన కారణంగానే అతడికి ‘దీపశిఖా కాళిదాసు’ అనే ప్రశస్తి లభించింది. ఉపమానాలతో కాళిదాసును మించిన కవి ‘నభూతో నభవిష్యతి’ అనేది అందుకే!

ఇక మళ్ళీ మేఘసందేశంలోకి వస్తే….గత మాసం ” “నేత్రా నీతా: సతతగతినా” అన్న శ్లోకంతో ముగిస్తూ అలకాపురి పట్టణ వర్ణనను మనో నేత్రాలతో తిలకిస్తున్నాం. పట్టణ వర్ణన రమ్యంగా కొనసాగుతున్నది. ఈ మాసం మరిన్ని అలకాపురి విశేషాలను చూద్దాం. క్రమంగా యక్షుడు తన యింటి దారి చెప్పేందుకు అలకాపురిని వర్ణిస్తున్నాడు.

శ్లో.10. అక్షయ్యాంతర్భ వననిధయ: ప్రత్యహం రక్తకంఠై
రుద్గాయద్భి ర్ధనపతి యశ: కిన్నరైర్యత సార్ధమ్
వైభ్రాజాఖ్యం విబుధవనితావారముఖ్యా సహాయా:
బద్ధాలాపా బహిరుపవనం కామినో నిర్విశంతి.

భావం: ఓ మేఘుడా! అలకానగరం ధనవంతులుండే ప్రదేశం కాబట్టి అక్కడివారంతా భోగలాలసులై ఉంటారు. వారు దేవజాతికి చెందిన అప్సరసలను తీసుకొని నగరం వెలుపల ఉన్న ఉద్యానవనాలకు విహారం వెళ్తుంటారు. ఆ సమయంలో గానప్రియులైన కిన్నరులు ధనపతి యగు కుబేరుని గురించి గొప్పగా గానం చేస్తుంటే విలాస వంతులైన యక్షులు సరససల్లాపాలతో విహరిస్తూ ఉంటారు. వారి మేడలలో అనంతమై ఎప్పటికీ తరగనంత ధనరాసులుంటాయి, తత్కారణంగా వారి విలాస విహారలకు ఎన్నటికీ లోపం అనేది ఉండదు. వైభ్రాజమనే పేరుగల గొప్ప ఉద్యానవనం ఆ నగరం వెలుపల ఉంది. అక్కడికి యక్షులు తరచూ వన విహార నిమిత్తం వెళ్తూ ఉంటారు.

శ్లో. 11. గత్యుత్కంపా దలకపతితై ర్యత్ర మందారపుష్పైః
పత్రచ్ఛేదైః కనకకమలైః కర్ణవిభ్రంశిభిశ్చ
ముక్తాజాలైః స్తనపరిసరచ్ఛిన్నసూత్రైశ్చ హారైః
నైశోమార్గః సవితు రుదయే సూచ్యతే కామినీనాం

భావం: అలకాపురిలో కాముకులైన స్త్రీలు ఎక్కువగా ఉంటారు. రాత్రంతా విలాసంగా గడిపి తెలతెల్లవారగానే హడవుడిగా ఇళ్ళకి వెళ్ళిపోయిన కామినీ జనాన్ని గురించి చెపుతున్న శ్లోకం ఇది. వాళ్ళు రాత్రి గడిపారని ఎలా చెప్పగలం అంటే, హడావుడిగా వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళ ముంగురుల్లో ఉన్న మందారపువ్వులు జారిపడతాయి, చిగురుటాకుల్లా వాళ్ళ దేహంమీద చేసుకున్న అలంకారాలూ రాలిపడిపోతాయి, చెవులకి పెట్టుకున్న బంగారు తామరలూ రాలిపోతాయి, స్థనాల రాపిడి వలన తెగిపోయిన ముత్యాల హారాల నుంచి ముత్యాలు రాలిపడతాయి. ఇవన్నీ నేలమీద పడి రాత్రి కాముక స్త్రీలు నడిచిన దారులు మనకు తెలియజేస్తాయి.

శ్లో.13. మత్వా దేవం ధనపతిసఖం యత్ర సాక్షాద్వసన్తం
ప్రాయశ్చాపం న వహతి భయాన్మన్మథః షట్పదజ్యమ్।
సభ్రూభఙ్గప్రహితనయనైః కామిలక్ష్యేష్వమోఘైస్
తస్యారమ్భశ్చతురవనితావిభ్రమైరేవ సిద్ధః॥

భావం: అలకాపట్టణ సమీపంలో కైలాసపర్వతం ఉంది. దానిపైన ప్రభువైన కుబేరుని మిత్రుడైన శంకరుడు నివసిస్తుంటాడు. ఆ భయం వలన మన్మధుడు యువతీ యువకుల మీద తన బాణాలను ఎక్కుపెట్టడు. కానీ ఆ మన్మధ కాంక్ష ఇంకో రకంగా ఎలా తీరుతుందంటే ఆ నగరంలోని స్త్రీలు తమ కనుబొమలనే విల్లును ముడిచి చూపులను ప్రసరించే విధానం మన్మధ బాణాలవలె తగిలి శృంగార వాంఛలను కలుగజేస్తాయి. ఇక అక్కడ మన్మధుని అవసరమేమి ఉందని చమత్కారంగా అంటున్నాడు కాళిదాసు.

శ్లో.14. వాసశ్చిత్రం మధు నయనయో ర్విభ్రమాదేశదక్షం
పుష్పోద్భేదం సహ కిసలయై ర్భూషణానాం వికల్పాన్
లాక్షారాగం చరణకమలన్యాసయోగ్యం చ యస్యా
మేకః సూతే సకల మబలామండనం కల్పవృక్షః

భావం: ఇంత విలాసంగా జీవించడానికి కావలసిన రంగురంగుల బట్టలు, కళ్ళకి జిలుగునీ, విలాసాన్నీ కలగజేసే మధువు, చిగురుటాకుల్తో కలిసి ప్రస్ఫుటంగా కనబడే పువ్వులు, ఆభరణాలు, కమలాల్లా ఉన్న పాదాలకి రాసుకునే లాక్షారసం. ఇలా కావలసిన అలంకారసామగ్రి అంతా కల్పవృక్షమే ఇస్తుంది. దేవతలకు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని మూడు వున్నాయని అవి వారు ఎప్పుడు ఏమి కోరినా సమకూరుస్తాయని పురాణాలలో ప్రసిద్ధి.

శ్లో.15. తత్రాగారం ధనపతిగృహానుత్తరేణాస్మదీయం
దూరాల్లక్ష్యం సురపతిధనుశ్చారుణా తోరణేన।
యస్యోపాన్తే కృతకతనయః కాన్తయా వర్ధితో మే
హస్తప్రాప్యస్తవకనమితో బాలమన్దారవృక్షః॥

భావం: ఓ మేఘుడా! జాగ్రత్తగా విను. అలకాపురి పట్టణంలో యక్షరాజు కుబేరుడు ఉండే భవనానికి ఉత్తరంగా మా గృహం ఉంటుంది. మా యింటికి గుర్తు ఏమిటంటే ఇంద్రధనుస్సు ఆకారంలో అందంగా ఉండే ఒక సింహద్వారం ఉంటుంది. కాబట్టి నీవు దూరం నుండి చూసినా చూడగానే గుర్తుపట్టగలవు. ఇంకో మంచి గుర్తు ఏమిటంటే మా యింటి ముందు నా కుమారునితో సమానంగా నా భార్య ప్రేమగా పెంచుకుంటున్న మందారపు చెట్టు ఉంటుంది. ఈరెండు గుర్తులతో నీవు మా ఇంటిని వెంటనే గుర్తుపట్టగలుగుతావు. యింకా యక్షుని ఇంటివద్ద ఉన్న విశేషాలేమిటో వచ్చే మాసం తిలకిద్దాం.

– వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)