రోజెందుకు?!(కవిత )–గిరిప్రసాద్ చెలమల్లు

ఎక్కడైనా
ఎవ్వరిపైనైనా
ఎదిగిన తర్వాత
ఆర్ధిక లావాదేవీల స్పర్ధలో
మనస్పర్థలో
హత్యలకు మూలమౌతుంటే
నాపై మాత్రం
నవ నయా నయవంచన టెక్నాలజీ
కత్తులుగా దాడిచేస్తూ
నేలపై పడకముందే
హత్య కి రూపకల్పన

వైద్యోనారాయణ హరి
తెరమరుగై ద్రవ్యం వేటలో
వెలుస్తున్న వైద్యశాలలెన్నో
నా హత్య పథక రచనల్లో
నిమగ్నం

ఎవడెలా పుట్టాడో తెలియని
అంధకారంలో
పుట్టకముందే
పుట్టిన తర్వాత
ఎదిగే క్రమంలో ఎదిగిన తర్వాత
ముదిమిలో కాటికి చాపిన వేళలో సైతం
నా అంగాంగాలపై దాడుల పర్వం నిరంతరం

నాకెందుకో ఒక రోజు
ఆ రోజున సైతం దాడులు పక్కా
అడుగడుగునా పురుషాధిక్యత
విషం చిమ్ముతుంటే
గడిచే రోజుల్లో పారదర్శకత కరువై
వేటాడే వ్య్వవస్థలో
రోజెందుకు?!
నన్ను నేను మోసం చేసుకునేందుకే
ఈ రోజు
(మహిళాదినోత్సవం మార్చి 8 సందర్భంగా)

                                                                         -గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.