అమెరికా పౌరహక్కుల ఉద్యమ కారిణి , ,ప్రసిద్ధ జాజ్, పాప్ సంగీత గాయని –నీనా సిమోన్ -గబ్బిట దుర్గాప్రసాద్

బాల మేధావి:

యూనిచ్ కాధలీన్ వేమాన్ గా అమెరికా నార్త్ కరోలిన రాష్ట్రం ట్రియాన్ లో పేద కుటుంబం లో ఎనిమిది సంతానం లో ఆరవ పిల్లగా నీనా సిమోన్ 21-2-1933జన్మించింది .మూడవ ఏటనే పియానో పై చర్చి లో ‘’గాడ్ విల్ బి విత్ యు టిల్ వుయ్ మీట్ అగైన్ ‘’పాట వాయించి అందర్నీ అప్రతిభులను చేసిన బాల మేధావి .12వ ఏటనే మొదటి సంప్రదాయ సంగీత కచేరీ చేసి నప్పుడు ముందువరుస సీట్లలో కూర్చున్న ఆమె తలిదండ్రులను తెల్లవారికోసం బలవంతంగా వెనక సీట్లకు నెట్టేసిన సన్నివేశం ఆమెను తీవ్రంగా కలచివేసి ,వాళ్ళను మళ్ళీ ముందు సీట్లలో కూర్చో బెడితే తప్ప కచేరీ చేయను అనిఖచ్చితంగా చెప్పి పంతం నెగ్గించుకొని ,మొదటిసారిగా పౌరహక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది .తల్లి కేట్ వేమాన్ మెథడిస్ట్ మినిస్టర్ , హౌస్ మెయిడ్ .తండ్రి రెవరెండ్ జాన్ డేవాన్ వేమాన్ డ్రైక్లీనింగ్ వ్యాపారి ,జబ్బు మనిషి .నీనా సంగీత౦ టీచర్ ,ఆమె చదువు కోసం ఫండ్స్ ఏర్పాటు చేసిన ఉత్తమురాలు .తర్వాత ఆమె విద్యాభి వృద్ధికోసం స్థానికంగా ఫండ్ కూడా ఏర్పాటైంది .ఈ స్కాలర్ షిప్ సహాయం తో నీనా నార్త్ కరోలీనాలోని ఆష్ విల్ లో అలీన్ గరల్స్ హై స్కూల్ లో చేరి చదివింది . వర్ణ వివక్షత –అధిగమించిన వైనం .

స్కూల్ చదువుకాగానే వేసవి సెలవులలో 1950లో కారల్ ఫ్రీడ్ బెర్గ్ స్టూడెంట్ గా జులియర్డ్ స్కూల్ లో చేరి ఫిలడెల్ఫియాలోని కర్టిస్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ మూజిక్ లో ఆడిషన్ కోసం చేరింది .ఆమె దరఖాస్తు తిరస్కరి౦పబడగా హతాశురాలై దానికి కారణం నల్లజాతి స్త్రీ అనే పక్షపాతం అని గ్రహించింది .కాని అధైర్యపడకుండా కర్టిస్ లోని ప్రొఫెసర్ వ్లాడిమిర్ సోకోలోఫ్ వద్ద ప్రైవేటుగా పియానో పాఠాలు నేర్చుకొన్నది .మళ్ళీ అప్లికేషన్ పెట్టనే లేదు .ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ గా ఉద్యోగం లో చేరి ,అలీన్ స్మిత్ వోకల్ స్టూడియో లో పియానో పాఠాలను ఫిలడెల్ఫియాలోని తన ఇంటి నుండే బోధించింది .

కేథలిన్- నీనా గా పరివర్తన – ఆదాయం రాని ఆల్బం లు:

తన పియానో సాధనకోసం అట్లాంటిక్ సిటీ లోని మిడ్ టౌన్ బార్ అండ్ గ్రిల్ లో పాటలు పడుతూ పియానో వాయిస్తూ వారానికి 90 డాలర్లు సంపాదించింది .1954లో రంగస్థలం పై ‘’నీనా సిమోన్ ‘’పేరుతొ ప్రసిద్ధి చెందింది .జాజ్ క్లాసిక్ మ్యూజిక్ ,బ్లూస్ సంగీతాలను ఫూజన్ చేసి మధురంగా పడుతూ విపరీతమైన క్రేజ్ తెచ్చింది సంగీతానికి .స్థానిక బార్ లో ఆమెకు విశ్వసనీయమైన అభిమానులేర్పడ్డారు.1958లో డాన్ రాస్ అనే బీట్నిక్ ను పెళ్ళాడింది కాని ,తర్వాత విచారించింది .అదే ఏడాది చిన్న చిన్న క్లబ్ లలో పాడుతూ జార్జి గెర్శ్విన్ గీతం ‘’ఐ లవ్స్ యు పోర్గీ ‘’రికార్డ్ చేసి బిల్ బోర్డ్స్ టాప్ ట్వెంటీ లో అమెరికాలో ఘన విజయం సాధించింది .తర్వాత వచ్చిన ఆల్బం ‘’లిటిల్ గర్ల్ బ్లూ ‘’కూడా బాగా క్లిక్ అయింది .కానీ ఆమెకు వీటివలన ఒక మిలియన్ డాలర్ల నష్టం రాయల్టి వలన కలిగి,ఆల్బమ్స్ వలన చేతి చమురే కాని సెంటు లాభం రాకపోవటం వలన వాటి హక్కులను 3 వేల డాలర్లకు అమ్మేసి ,చేతులుదులుపుకొంది .

వరించి వచ్చిన అదృష్టం:

లిటిల్ గర్ల్ బ్లూ విజయం తర్వాత కోల్పిక్స్ రికార్డ్స్ వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, అనేక కంపెనీలలో అనేక రికార్డ్ లిచ్చి రికార్డ్ బ్రేక్ ఆల్బమ్స్ తో ప్రసిద్ధి సాధించి, ‘’’నీనా సిమోన్ ఎట్ టౌన్ హాల్ ‘’ఆల్బం తో .గ్రీన్ విచ్ విలేజ్ లో అభిమాన గాయని అయింది .తన సంప్రదాయ సంగీతాభి వృద్ధి కోసం పాప్ సంగీతాన్ని పాడుతూ డబ్బు సంపాదించి ,కాంట్రాక్ట్ చేయటానికి ఇష్టపడలేదు .ఇలాగే చాలా కాలం కొనసాగించింది .1961లో న్యూయార్క్ పోలిస్ డిటెక్టివ్ ఆండ్రూ స్ట్రౌట్ ను పెళ్లి చేసుకొన్నది అతడే ఆమె మేనేజర్ అయ్యాడు ఒక కూతురు ను కన్నది .కాని అతడు సైకలాజికల్ గా శారీరకంగా ద్వేషించేవాడు .

ఆఫ్రికన్ –అమెరికన్ వారసత్వ సంగీతానికి ప్రాధాన్యత –పౌరహక్కుల ఉద్యమ పాత్ర:

1964లో డచ్ ఫిలిప్స్ రికార్డ్స్ తో ఒప్పందం చేసుకొని ,తన మనసుకు నచ్చిన విధంగా ఆఫ్రికన్ –అమెరికన్ వారసత్వ సంగీతానికి ప్రాధాన్యమిచ్చింది .వీటితో’’ నీనా ఎట్ ది విలేజ్ గేట్’’ఆల్బం తెచ్చింది .1963 జూన్ 12న మెడ్గార్ ఎవర్స్ హత్య ,సెప్టెంబర్ 15 అలబామా రాష్ట్రం బర్మింగ్ హాం లోని బాప్టిస్ట్ చర్ఛి పై జరిగిన బాంబింగ్ లకు ద్వేషిస్తూ ఆమె పాడిన ‘’మిసిసిపి గొడ్డం’’పాటతో మొదటి సారిగా అమెరికాలోని జాతి వివక్షతకు సవాలు విసిరింది ..’’ఈపాట ఆ కాల్పులు కాల్చినవారిపై పది బులెట్ల ప్రతీకార దాడి లాంటిది ‘’అని స్పష్టం చేసింది .ఇలాంటి గీతాలన్నో ఆమె స్వయంగా రాసి పాడి జాతి వివక్షతకు వ్యతిరేకత తెలియజేసింది .ఈ ఒక్క పాట మాత్రమె రికార్డ్ అయి రిలీజ్ అయింది కాని కొన్ని దక్షిణ రాష్ట్రాలు దీన్ని బాయ్ కాట్ చేశాయి .కారోలీనాలో ప్రమోషన్ కాపీలను నాశనం చేసి ఫిలిప్స్ కంపెనీకి తిప్పి పంపారు .ఆపాట తన ఆక్రోశం ,ఆగ్రహం ఆవేశం నిశ్చయం తో పెల్లుబికి వచ్చిన పాటఅని నీనా చెప్పింది .ఇదే ఆమెలో జాతీయ రాడికల్ భావానికి మొదటి అడుగు వేయించింది .దీని తర్వాత వచ్చిన ‘’ఓల్డ్ జిమ్ క్రో’’ఆల్బం జిమ్ క్రో నిబంధనలకు వ్యతిరేకంగా వచ్చింది .వీటితో నల్లజాతి వారి పౌరహక్కుల ఉద్యమం లో నీనా భాగస్వామ్యురాలైంది .రాజకీయ వేదికలపై జోరు పెంచింది .క్రమంగా ఆల్బం ల రికార్డింగ్ తగ్గింది .

న్యు యార్క్ లోని మౌంట్ వేర్మాన్ లో తన పోరుగువాడైన మాల్కం ఎక్స్ లాగ ‘’బ్లాక్ నేషనలిజం ‘’ను సమర్ధించింది .మార్టిన్ లూధర్ కింగ్ చెప్పిన అహింసా మార్గాన్నికాకుండా తీవ్రవాద విప్లవం రావాలని రావాలని కోరింది .ఆఫ్రికన్ అమెరికన్ లు సాయుధ పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలని ప్రవచించింది కూడా .

1967 లో కాంట్రాక్ట్ ను ఫిలిప్స్ నుంచి ఆర్ సి ఏ విక్టార్ కు మార్చింది నీనా .హార్లెం రినైసేన్స్ లీడర్ లాంగ్ స్టన్ హగ్స్ రాసిన ‘’బాక్ లాష్ బ్లూస్ ‘’ ఆల్బం ఆకంపెనీకి మొదటి ఆల్బం గా రికార్డ్ చేసింది .ఇకవరుసగా అదే భావాలతో పాటలు పాడింది .బిల్లీ టేయిలర్ రాసిన ‘’ఐ విష్ ఐ న్యు హౌ ఇట్ వుడ్ ఫీల్ టు బి ఫ్రీ ‘’ మరియు ‘టర్నింగ్ పాయింట్ ‘’వంటి ప్రసిద్ధ గీతాలను గానం చేసి హక్కుల ఉద్యమానికి ఊపిరులూదింది .1968లో వచ్చిన ‘’నఫ్ సైది’’ఆల్బం వెస్ట్ బెరీ మూజిక్ ఫెయిర్ లో నల్లజాతివారి హక్కులుద్యమనాయకుడు అమెరికన్ గాంధీ మార్టిన్ లూధర్ కింగ్ హత్యజరిగిన మూడు రోజులకు లైవ్ రికార్డ్ అయింది .దీన్ని ఆ మహానాయకునికి అంకితం చేసి ‘’వై’’(ది కింగ్ ఆఫ్ లవ్ ఈజ్ డెడ్ )అనే గీతం పాడి,అశ్రుతర్పణం చేసింది .1974లో ఆకంపెనీకి చివరి ఆల్బం ‘’ఇట్ ఈజ్ ఫినిషేడ్’’ చేసింది మళ్ళీ నాలు గేళ్ళ తర్వాత సిటి రికార్డ్ కంపెనీలో వారికోరికపై పాడింది .

విదేశీ పర్యటన –బైపోలార్ డిజార్డర్ –జీవిత చరిత్ర:

1980లో లండన్ లో రోన్నీ స్కాట్స్ జాజ్ క్లబ్ లో తరచుగా పాడుతూ 1984లో ‘’లైవ్ ఎట్ రోన్నీ స్కాట్స్ ‘’ఆల్బం తెచ్చింది .కొన్ని వేదికలమీద తన మధుర జీవితకాలాన్ని జ్ఞాపకం చేసుకొనేది .1987లో వచ్చిన ‘’మై బేబీ జస్ట్ కేర్స్ ఫర్ మీ ‘’ చానల్ 5లో వ్యాపారానికి బాగా ఉపయోగపడింది .ఇది తర్వాతమల్లీమల్లీ రిలీజై ఆమె పాప్యులారిటీని విపరీతంగా పెంచేసింది .

తరచుగా క్షణికావేశానికి ,ఉద్రేకానినికి గురయ్యే నీనా 1985లో ఒక రికార్డింగ్ కంపెనీ ఎక్సి క్యూటివ్ పై తన రాయల్టీ కాజేశాడని కాల్పులు జరిపింది .’’నేను వాడిని కాల్చి చంపే ద్దామను కొన్నా .కాని బతికి పోయాడు ‘’అని చెప్పింది తరవాత .1980లోనే ఆమెకు ‘’బైపోలార్ డిజార్డర్’’వ్యాధి ఉన్నట్లు గుర్తించారు ‘’.1995లో పొరుగింటి అబ్బాయిని వాడి విపరీతపునవ్వు తన ఏకాగ్రతకు భంగం కలిగిస్తోందని గాలి తుపాకితో కాల్చి౦ది . .ఈ జబ్బుకు 1960నుంచే మందులు వాడుతోందని కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే తెలుసు .2004లో ‘’బ్రేక్ డౌన్ అండ్ లెట్ ఇట్ ఆల్ అవుట్ ‘’అనే ఆమె జీవిత చరిత్రను సిల్వియా హామ్ ప్టన్ ,డేవిడ్ నథాన్ లు రాసి ప్రచురించాక లోకానికి తెలిసింది .

ప్రవాస జీవితం –చివరి సారి అమెరికా రాక:

అమెరికాకు తిరిగివచ్చాక పన్నులు కట్టలేదన్న నేరం తో ఆమెకు అరెస్ట్ వారంట్ సిద్ధంగా ఉండగా, తిరుగుటపాలో బార్బోడా కు వెనక్కు వెళ్ళింది .అక్కడ ప్రధాని ఎర్రాల్ బార్రో తో చాలాకాలం అఫైర్ సాగించింది .గాయకుడు, సన్నిహితుడు మిర్రం మకేబా ఆమెను లిబేరియా కు వెళ్ళమని సలహా ఇవ్వగా వెళ్లి కూతురు లీసా తో కలిసి ఉంది .కాని తల్లి తనపై ద్వేషం తో తిట్లు శాపనార్ధాలతో వేధిస్తుంటే భరించలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు లీసా యే చెప్పింది .నీనా తర్వాత స్విట్జర్ లాండ్ లోని నియాన్ కు చేరి ,తర్వాత నెదర్ లాండ్ లోని అం స్టార్ డాం లో ఉండి,1993లో దాక్షిణ ఫ్రాన్స్ లో ఇల్లుకోనుక్కొని ఉండిపోయింది .1998లో మళ్ళీ న్యూయార్క్ లో కచేరీ చేసి ‘’మీరు మళ్ళీ నన్ను చూడాలనుకొంటే ఫ్రాన్స్ కు వచ్చి చూడండి .నేనుమళ్ళీ అమెరికాకు రాను ‘’అని ప్రకటించింది .

స్వీయ చరిత్ర –గ్లోబల్ కేటలాగ్ బెస్ట్ సెల్లర్ –మరణం:

1992లో నీనా ‘’ఐ పుట్ ఎ స్పెల్ ఆన్ యు ‘’అనే తన స్వీయ జీవిత చరిత్ర రాసి విడుదలచేసింది 1990నుంచి చాలాదేశాలు తిరిగి కచేరీలు చేసి, చివరి దశాబ్దం లో ,ఒక మిలియన్ రికార్డ్ లను అమ్మకం చేసి’’ గ్లోబల్ కేటలాగ్ బెస్ట్ సెల్లర్ ‘’గా రికార్డ్ సృష్టించింది .1993లో దక్షిణ ఫ్రాన్స్ లో ఐక్స్ యెన్ ప్రావిన్స్ లో స్థిరపడి చివరిఆల్బం ‘’సింగిల్ వుమన్ ‘’విడుదల చేసింది .చాలాకాలం నుంచి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతూ 21-4-2003న 70 వ యేట నిద్రలోనే తనువు చాలించింది ఆ అమర గాయని ..గాయకులు మిరియం మకేబా,పట్టి ల బెల్లీలు కవి సోనియా సాన్సేజ్ ,నటులు ఒస్సే డేవిస్ ,రూబీ డీ లతోపాటు వందలాది అభిమానులు ఆమె అంత్యక్రియలలో పాల్గొన్నారు .ఆమె చితాభస్మాన్ని అనేక ఆఫ్రికన్ దేశాలలో వెదజల్లి ఘన నివాళి సమర్పించారు .ఆమె కూతురు లీసా గాయనిగా ,నటిగా ప్రసిద్ధమై ఐడా బ్రాడ్వే లో ప్రదర్శనలిస్తోంది .

నీనా ప్రభావం:

నీనా ప్రభావం ఆఫ్రికన్ అమెరికన్ నాటక రచయితలోర్రెన్ హాన్స్ బెర్రీ పై అధికం .ఆమె పై రిపర్టరీ తయారు చేశాడు .ఆమె ప్రేరణాత్మక గీతాలు ‘’టు బి యాంగ్ ,గిఫ్టేడ అండ్ బ్లాక్ ‘’లు ఆమె ప్రజలనాలుకలపై నిత్యం నర్తిస్తూ ఉంటాయి .నీనా పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు మాత్రమేకాదు ,అమెరికాలో నల్లజాతి మహిళల పై విధించిన యూరో సెంట్రిక్ బ్యూటీ స్టాండర్డ్స్ కు వ్యతిరేకంగా కూడా ‘’ఫోర్ వుమెన్ ‘’అనే గీతం ద్వారా ఆమె భావాలను ప్రకటించింది .ఈ పాట రాయటం లో నల్లజాతి స్త్రీలను ప్రోత్సహించి ప్రేరణకల్గించి,అసలు అందం అంటే ఏమిటో నిర్వచించి ,సాంఘిక నిషేధాల ప్రభావానికి లోనుకావద్దని ప్రబోది౦చటమే. తన ధ్యేయం అని తన స్వీయ జీవిత చరిత్రలో చెప్పిందినీనా .

నీనా గాన విశిష్టత:

జీవితకాలం లో ఆమె పాడిన పాటలన్నీ అత్యున్నత స్థాయికి చెందినవే అని నిర్ణయించారు .ఆమె స్టేజి ప్రదర్శనలకు’’హై ప్రీస్టెస్ ఆఫ్ సోల్’’అనేగౌరవ బిరుదు లభించింది .గాస్పెల్ నుంచి బ్లూస్ దాకా జాజ్, జానపద యూరోపియన్ క్లాసికల్ స్టైల్ ,తో పాటు బాష్ శైలి ,కౌంటర్ పాయింట్ లానే కాక 19వ శతాబ్దపు రొమాంటిక్ పియానో రిపర్టరీ లనూ అద్భుతంగా పాడింది ,వాయించి మధ్యమధ్య నిశ్శబ్ద తాండవం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను ,సమ్మోహితులను చేసి ఘనకీర్తి పొందింది.దాదాపు ఆమె కచేరీలన్నిటికీ లియోపోల్డో ఫ్లేమింగ్ ,గిటారిస్ట్ మ్యూజికల్ డైరెక్టర్ అల్ స్నాక్ మాన్ ఉండటం విశేషం .20వ శతాబ్దపు అరుదైన విశేష ప్రజ్ఞా కల గాయనిగా నీనా విమర్శకుల విశ్లేషకుల మన్ననలు పొందింది .ఆమె ‘’ఇ౦ప్రోవైజేషన్ జీనియస్’’ గా గుర్తింపు పొందింది .అన్నికాలాల గాయకులలో 29 వ విశిష్ట గాయనిగా రోలింగ్ స్టోన్ ఆమెను అభి వర్ణించాడు “one of the most gifted vocalists of her generation, and also one of the most eclectic”.[62] Creed Taylor, who annotated the liner notes for Simone’s 1978 Baltimore album, said the singer possessed a “magnificent intensity” that “turns e everything—even the most simple, mundane phrase or lyric—into a radiant, poetic message”.[63] Music critic Jim Fusilli writes that Simone’s music is still relevant today: “it didn’t adhere to ephemeral trends, it isn’t a relic of a bygone era; her vocal delivery and technical skills as a pianist still dazzle; and her emotional performances have a visceral impact.[64]

ప్రముఖ నల్లజాతి రచయిత్రి కవయిత్రి మాయా ఏంజేలో’’ She is loved or feared, adored or disliked”, , “but few who have met her music or glimpsed her soul react with moderation”.[ అని కీర్తించింది .

అందుకున్న వార్డులు రివార్డులు:

నీనా ‘’గ్రానీ హాల్ ఆఫ్ ఫ్రేం అవార్డ్ ‘’ను 2000లో పాడిన ‘’ఐ లవ్స్ యు ‘’పాటకు అందుకొన్నది .1974లో మానవ కారుణ్య దినోత్సవం నాడు వాషింగ్ట న్ డిసి లో పదివేలకు పైగా ప్రేక్షకుల సమక్షంలో ఆమెను ఘనంగా సత్కరించారు .హామ్ హెర్ట్స్ కాలేజి ,మాల్కం ఎక్స్ కాలేజి ఆమెకు సంగీతం లో, హుమానిటీస్ లో గౌరవ డిగ్రీలు ప్రదానం చేశాయి .అప్పటినుంచి ఆమెను అందర్రూ’’ డా .నీనా సిమోన్’’ అని పిలవటం ప్రారంభించారు .తన అప్లికేషన్ ను తిరస్కరించిన కర్టిస్ ఇన్ ష్టి ట్యూట్ మూజిక్ ఆమె చనిపోవటానికి రెండు రోజులముందు గౌరవ డిగ్రీ ప్రదానం చేయబోతున్న వార్త విన్నది .నాలుగు సార్లు గ్రానీ అవార్డ్ కు నామినేట్ అయింది .వీటిలో రెండుసార్లు ఆమె జీవించి ఉండగా ,మరో రెండు సార్లు మరణానంతరం జరిగాయి .2018లో ‘’రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేం’’లోనూ , నార్త్ కారోలీనా మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫ్రేం లోనూ నీనా పేరు నమోదు చేసి గౌరవించారు .2010లో నార్త్ కారోలీనా లో ఆమె జన్మించిన ట్రయోన్ లో నీనా శిలావిగ్రహం ఏర్పాటు చేశారు నీనా పై డాక్యుమెంటరీ సినిమాలు చిత్రించారు .’’ఎ స్టోరి అబౌట్ మి అండ్ నీనా సిమోన్’’అనే ఏకపాత్ర నాటిక కూడా రాసి ప్రదర్శించారు .నీనా జీవితం పై జీవిత చరిత్రలూ బాగానే వచ్చాయి .ఆమె రాసుకొన్న ఆత్మకధ ‘’ఐ పుట్ ఎ స్పెల్ ఆన్ యు ‘’ఉండనే ఉంది .నెదర్ లాండ్ లోని నిజిమ్ జేన్ సిటీ లో ఒక వీధికి నీనా పేరుపెట్టారు 2005లో ఆసిటీలోనే డీ వెరీ గి౦జ్ మ్యూజిక్ హాల్ లో 50మంది కళాకారులు ఆమె కు ఘనం గా స్మృతి నివాళి నిర్వహించారు . ‘’నల్లజాతి కోయిల ,నైటింగేల్’’ నీనా సిమోన్.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.