తారాలోకానికి అక్షర విహంగం ……..అక్షర నివాళి – అరసిశ్రీ

 నా “విహంగ పయనంలో ఎందరో ప్రముఖులకి నివాళిగా ఎన్నో వ్యాసాలు రాసాను . నిజానికి పత్రిక నిర్వహణలో భాగంగా ఆ బాధ్యతను నువ్వే చేయాలి , నువ్వు రాయగలవు అరసి  అంటూ నాచేత ఈ విభాగానికి అక్షర నివాళి చేయించిన వారు మీరే ………

కానీ ……

మీ గురించి ఇలా రాయాల్సి వస్తుందని …కలలో కూడా ఊహించలేదు …………………

ఆధునిక కాలంలో ఒక భావానికో , ఒక వాదనికో పరిమితం అయిపోయిన వాళ్ళని ఎందరినో చూస్తున్నాం . అలా కాకుండా అస్తిత్వ పరంగాను , ఒక సగటు మనిషిగాను , స్త్రీవాది గాను , మహిళా రచయిత్రిగాను , అంతర్జాల సాహిత్య పరిశోధకురాలిగా , విశ్లేషకురాలిగా , అంతర్జాల పత్రిక సంపాదకురాలిగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు  డా.హేమలత పుట్ల.

తల్లి చెప్పిన జానపద కథలే ఆమెను రచనా వ్యాసంగం వైపు మళ్లించాయి. సహచరుడు ఎండ్లూరి సుధాకర్‌ సాహచర్యం.. ఆమెను మరింత ముందుకు నడిపించింది. ఇంతకుముందెవ్వరూ చేయని ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’పై పరిశోధన చేసి తన సృజనను చాటుకున్నారు. రచయితగా, వెబ్‌ మ్యాగజైన్‌ నిర్వాహకురాలిగా, తెలుగు వర్సిటీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు హేమలత పుట్ల.

హేమలత పుట్ల ప్రముఖ రచయిత్రి. శ్రీమతి మనోరంజితం , శ్రీ మనష్షే గార్లకు తొలి సంతానం .స్వస్థలం నెల్లూరు , బెంగుళూరు ల్లో ప్రాథమిక విద్యను కొనసాగించారు . బి . ఎ చదువు తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసారు . వీరి విద్య అంతా అక్కడే కొనసాగింది. ఇద్దరు చెల్లెళ్లు….. ఇద్దరు తమ్ముళ్లు….. “ క్రిష్టియన్‌ కుటుంబం కావడంతో ఇంట్లో కథల పుస్తకాలు, చందమామ, బాలమిత్ర చదవకూడదన్న నిబంధన ఉండేది. నాకేమో పుస్తకాలు చదవడం ఇష్టం. స్కూల్లో ఎవరైనా బాలమిత్ర, చందమామ తెస్తే చదివేవాళ్లం. స్కూల్‌ అయిపోగానే లైబ్రరీకి వెళ్లి అవి చదువుకుని ఇంటికి ఓ అరగంట ఆలస్యంగా వచ్చేవాళ్లం” అంటూ చిన్నతనంలోనే పుస్తకాలపై తనకి గల మక్కువని ఒకానొక సందర్భంలో వెల్లడించారు .

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి “ వెబ్ లో తెలుగు సాహిత్యం తీరు – తెన్నులు అనే అంశం పై పిహెచ్.డి” చేసారు . అంతర్జాలం లోని తెలుగు సాహిత్యం పై జరిగిన మొదటి పరిశోధన ఇదే కావడం విశేషం . ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) లో సభ్యులుగా ఉన్నారు . ప్రస్తుతం జాతీయ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు .

సాహిత్యం పై ఆసక్తి :

“మా అమ్మ టీచర్‌. నేను ఆరు, ఏడు తరగతులు చదివే రోజుల్లో రాత్రిపూట అమ్మ వర్ణించి చెప్పే జానపద కథలు వింటూ దృశ్యరూపంలో ఊహించుకునేదాన్ని. తిరిగి వాటిని స్నేహితులకు ఇంకాస్త ఊహను జోడించి చెప్పేదాన్ని. అలా కథలు రాయడం నాకు అబ్బిందేమో” అని చెప్పుకున్నారు ఒక సందర్భంలో . నెల్లూరు సెయింట్‌ జోసఫ్స్‌ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదివేటప్పుడు కృష్ణవేణి అనే స్నేహితురాలుండేది. ఆమె అనారోగ్యంతో చనిపోయింది. ఆ సంఘటనకు తీవ్రంగా స్పందించి ‘తిరిగి రాని పయనం’ అనే కథ రాశారు. ఆ కథ ”క్రీస్తురాజదూత” అనే పత్రికలో అచ్చయింది. వేసవి సెలవులు ముగిసి మళ్లీ స్కూల్‌కు తిరిగి వెళ్లినప్పుడు నా కథని అచ్చులో చూసుకుని మురిసిపోయారు. అప్పటినుంచి స్కూల్లో అందరూ ఆమెను ప్రత్యేకంగా చూసేవారు. స్కూల్‌కు ఎవరు వచ్చినా… వీరిని పిలిచి పరిచయం చేస్తుండేవారు ఉపాధ్యాయులు .

ఆ కథ తరువాత కొన్ని రచనలు చేసారు  కానీ.. పత్రికలకు పంపలేదు. అప్పటినుంచి చిన్న చిన్న అనుభూతులకు, తీవ్రమైన సంఘటనలకు విపరీతంగా స్పందించి ఆ భావాలను ఏదో ఒక రూపంలో బయట పెట్టుకోవాలి కాబట్టి కవితల రూపంలో రాయడం అలవాటుగా మారింది . అలా ఇంటర్‌ చదివే రోజుల్లో కవిత్వం మొదలు పెట్టారు . పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. రెండు నవలలు కూడా రాశారు. ఆ రెండింటిలోనూ క్రైస్తవ వాతావరణం ఉంటుంది. ఆ తరువాత దాదాపు 30 కథల వరకు రాశారు. వాటిని దాచుకోలేదు. అందులో చాలా కథలు మిస్సయ్యాయి.

సాహిత్య వాతావరణం:

వీరు ఇంటర్‌ చదువుతూ రచనలు చేస్తున్నప్పుడు.. ఎండ్లూరి సుధాకర్‌ డిగ్రీ చదువుతూ ఓ క్రైస్తవ ఆధ్యాత్మిక పత్రికలో ప్రూఫ్‌రీడర్‌గా చేస్తుండేవారు. వీరి ఇద్దరికీ ముఖ పరిచయం లేదు. కానీ ఆ పత్రికకు పంపే కథలు చదివి బాగున్నాయని ఉత్తరాలు రాసేవారు సుధాకర్ . ఈ అమ్మాయిది కూడా క్రిస్టియన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ అనుకున్నారేమో… వారి పెద్దలతో అడిగించారు. ట్రైనింగ్‌ అయిపోయి, ఏడాదిపాటు టీచర్‌గా చేసిన తరువాత వీరి పెళ్లయ్యింది. సహచరుడు సుధాకర్‌ కవి, సాహిత్యాన్ని బాగా చదువుకున్నవారు కావడంతో ఇంట్లో సాహిత్యానికి అనుకూలమైన వాతావరణం ఉండేది. బోలెడన్ని పుస్తకాలు, కవులు, రచయితలతో పరిచయాలు, సాహిత్య చర్చలు జరుగుతూ ఉండటం వల్ల సాహిత్యానికి దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.. మానస, మనోజ్ఞ. 

సాహితీ పరిశోధన:

ఆ తరువాత పిల్లలు, అనారోగ్య కారణాలతో రాయడం తగ్గిపోయింది. పెళ్లి తరువాత ఎమ్మే పూర్తి చేసారు . పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ‘ఎవ్వరూ చేయనిది చేయాలి’ అని అప్పటిదాకా కంప్యూటర్‌ పరిజ్ఞానం లేదు. ఇంటర్నెట్‌ అస్సలు తెలియదు. పిల్లల దగ్గర నేర్చుకుంటూ ముందుకు సాగారు . తెలుగు కనిపించడం అబ్బురంగా అనిపించిందామెకు . ఒక సమయంలో సుధాకర్‌గారు అన్నారు ‘కంప్యూటర్‌ ముందునుంచి లేవడం లేదు. ఆ నెట్‌లో ఉన్న తెలుగు సాహిత్యం మీదే పీహెచ్‌డీ చేయొచ్చు కదా’ అని. నిజమే అనిపించింది. నా ఆసక్తి… పరిశోధనాంశం ఒక్కటే కావడం ఆ దిశగా పరిశోధన చేసాను అని తన పరిశోధన అంశం పై గల  ఆసక్తిని తెలియజేసారు . 

రచనలు :
1975 లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే మొదటి సారి రాసిన “తిరిగి రాని పయనం ‘” అనే కథను కాథలిక్ చర్చి వెలువరించే క్రీస్తు రాజ దూత అనే పత్రికలో ప్రచురించారు . 1982లో ” గూడు చేరిన గువ్వ” అనే నవల ‘స్పందన’ ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది . దీనినే నర్సాపూర్ లోని జీవన జ్యోతి ప్రెస్ వారు 1990 లో ప్రచురించారు . అనేక సార్లు విశాఖ రేడియో స్టేషను లో కవితలు చదివారు . “ స్త్రీవాద , దళిత సాహిత్య ఉద్యమాలు దళిత స్త్రీల భావాలను చెప్పుకోవడానికి వేదికను కల్పించి గ్రామ స్థాయి అట్టడుగున దళిత స్త్రీల వరకు వెళ్ళాల్సి ఉందని “ ఈమె అభిప్రాయం.
కవితలు , కథలు , వ్యాసాలూ అనేక పత్రికలల్లో ప్రచురితం అయ్యాయి . అంతర్జాలంలో తెలుగు సాహిత్యం(పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం) ఇప్పటి వరకు రాసిన కవితలన్నింటిని వేకువరాగం(కవితా సంపుటిగా ప్రచురించారు సంపాదకత్వం: లేఖన సాహిత్య వ్యాససంపుటి , అంతర్జాలం-సాహిత్య దర్శనం వ్యాస సంకలనాలను వెలువరించారు .

అంతర్జాలం పై పరిశోధన:
‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’పై పరిశోధన చేస్తాను అన్నప్పుడు రాజమండ్రి తెలుగు యూనివర్సిటీలో సెలక్షన్‌ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు ‘ఇంటర్‌నెట్‌లో తెలుగు సాహిత్యం ఉందా?’ అని. అంతర్జాలం ఏంది? మార్జాలం లాగా అన్నారు . సవాలుగా స్వీకరించడం, దేన్నైనా సాధించడం వీరి అభిమతం కాబట్టి.. పరిశోధన దిగ్విజయంగా కొనసాగింది. ఈ పరిశోధన కాలంలో ఎంతోమంది వ్యక్తుల నుంచి,

సాంకేతిక నిపుణులు, బ్లాగర్ల గురించి ఎంతో నేర్చుకున్నాను. నా పరిశోధన అంశం మీద ఇంతవరకు తెలుగులో ఏ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన జరగలేదు. అందువల్ల నాకు రిఫరెన్సు పుస్తకాలు కూడా దొరకలేదు. ఇంటర్‌నెట్‌ మీదే ఆధారపడాల్సి వచ్చింది. అయినా నిద్రహారాలు మాని ఆరేళ్ల పనిని ఏడాదిన్నర కాలంలో పూర్తి చేశారు.

కవిత్వం :
కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టలు ఉండకూడదు. కవిత్వం రాసేవారిని కవులు/కవయిత్రులు అంటారు. వారి కీర్తి కాంక్ష అసలే ఉండొద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో సృజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే.

ఆధునిక కాలంలో కవిత్వం చాలా మారింది . వస్తు , వర్ణన విషయంలో వాస్తవికతకి దగ్గరగా వచ్చింది . వేకువరాగం కవితా సంపుటిలో కూడా కవితలు ఈ కోవకే చెందినవే . దాగుడు మూతలు ,దస్తఖత్, క్షణాలు జారిపోతున్నప్పుడు … ,పిండాల బావి ,జ్ఞాపకాల తెరలు ,తృష్ణ ,జిగినీ పరదాలు ,అమ్మ కోసం ఓ రోజు,జ్వాల ,స్వప్నముఖి, మేంగో షవర్స్,వర్ణ యుద్ధం,సాలభంజిక ,జీవితాన్ని జీవించనీ ! ,ప్రళయం ,అంతర్హితులు ,నెత్తుటి నక్షత్రం ,వేకువ రాగం ,గతి తప్పిన ప్రయా ణం ,రాగ విధ్వంసం , పొరుగిల్లు కవితలున్నాయి . ఈ కవితల్ని ప్రచురించిన ఆంద్ర భూమి , ఆంద్ర ప్రభ , ఆంధ్రజ్యోతి , వార్త దినపత్రికలలో ప్రచురితం అయినవే .

గర్భంలో పిండ దశలోని ఆడపిల్ల ఆక్రందనని కళ్ళు చెమ్మగిల్లేల కఠిన పాషాణ గుండె కూడా కూడా ద్రవించేలా “పిండాల బావి’- అనే కవిత రాసింది.తాను ఒక జీవ కణమై స్త్రీ గర్భంలో అడుగు పెట్ట్టినప్పటి నుండి ,ఆడో మగో తెలియని దాని నుండి ,ముక్కు మొగమైన రూపు దిద్దుకోనప్పటినుండి ఆ పిండస్థ శిశువు ఆవేదనకి అక్షర రూపం ఈ కవిత.

“నీ మాతృత్వం కూడా నన్ను కాపాడ లేదా ‘ – అని ఆ గర్భస్థ పిండం అడిగిన ప్రశ్నకు ఆడపిల్లలు వద్దనుకుండే ఏ మగాడైన సిగ్గుతో చచ్చిపోవలసిందే.
“కానీ నీకో విషయం తెలుసా అమ్మా?
నాకు ఓ మంచి చోటుందని
అక్కడంతా నా వయసు పిండాలే !”
అనే ఈ మాటలున్న ఈ కవితను ఈ కవయిత్రి ఒరిస్సాలోని నయాఘడ్ పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో నలభై కి పైగా ఆడ పిండాలు కనుగొన బడ్డాయన్న వార్త చదివాకా రాసింది.

సి .డి .ఆర్ . ఇంటెన్సి వ్ కేర్ యూనిట్ లో వున్నప్పుడు… క్షణాలు జారిపోతున్నప్పుడు కవితలో …..

పొద్దున్నే ఎవరో దైవ ధూపం వేస్తున్నట్టు

టైర్లు తగలేసి వంట మొదలెట్టారు

ఫ్యాక్టరీల పొగగొట్టాలు

అగరు బత్తీలై ఆకాశ పటానికి పొగపట్టిస్తున్నాయి

పాన్ తింటున్న పల్లె పిల్ల పెదాలపై

సంధ్య పొద్దు ఎర్రగా మంద్రంగా… తనలో భావాలని అక్షర రూపమిచ్చారు .

“ఈ చూపు చివరిది

ఈ మాట చివరిది

ఈ శ్వాస చివరిది

ఇక సుప్రభాతాలు లేవు అస్తమయాలు తప్ప

పైవాడు సిద్ధం చేసిన క్షణం “ వివరిస్తారు .

“ అమ్మ “ ఈ సృష్టిలో కనిపించే దేవత . ఆ దైవం కోసం రాసిన కవిత “అమ్మ కోసం ఓ రోజు “

నేను నిషేధించిన తల్లుల దినం

మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది

ఎండి మోడైన బంజరు పెను ఉప్పెనకి ఉక్కిరి బిక్కిరైనట్ట

ఈ ఒక్క రోజూ

తల్లి ఉనికి చిగురిస్తుంది

హేపీ మదర్స్ డే ‘మమ్మీ ‘....యామె బాగోగులు చూడాల్సిన పిల్లలు ఎక్కడెక్కడో జీవిస్తున్న ఆ ఒక్క రోజు మాత్రం అమ్మ పై ప్రేమను కురిపించడం అన్యాయం అని ప్రశ్నిస్తుంది రచయిత్రి .

“రాగ విధ్వంసం” కవిత లో నగరాల్లో జరుగుతున్న దాడులను కవిత్వీకరించారు .

“తస్లీమా నస్రీనో

మక్కా మసీదో !
పావురాలకి నూకలు చెల్లు …

లుంబినీ పార్కో
గోకుల్ చాటో !

ఈ గంట గడిస్తే చాలు ….
ఫ్లై ఓవరో

సునామీయో !

జీవితానికి హామీ లేదు ….” అంటూ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వివరించారు . అంతలో బాంబు దాడులు జరిగి ఆ ప్రాంతం ఎంత అల్లకల్లోలంగా మారిపోయింది తెలియజేస్తూ …

“అంగాలు తెగి అల్లాడుతున్న

అభద్రతా వలయాల మధ్య
గుండె గుడారం

కకావికలైన గుడ్డ పీలికలావుంది
చితికిన మెదడుని

సంచిలో వేసుకుని
అవయవాల గుట్టల మధ్య

అవశేషపు దేహాన్ని వెతుక్కుంటున్నాను” ఆ హృదయ విదారాకర దృశ్యాలని తెలియజేస్తారు ఈ కవితలో రచయిత్రి .

కథలు, నవలలు :

వీరు రచించిన కథలు వార , మాస పత్రికలు , కథా సంకలనాలలో ప్రచురితం అయ్యాయి . 1975లో ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు రాసిన మొదటి కథ “తిరిగిరాని పయనం “ ఇది క్రీస్తు రాజదూత అనే మాస పత్రికలో అచ్చయింది . కథలు నూతిలో కప్ప , ఇంటి చీమ , పాపమ్మ బావి , వీరు రాసిన “పరివర్తన “ “కరకు గుండె లో కల్వరి వాణి , హదస్సా , “హృదయ జ్యోతి “తిరిగిరాని పయనం , కనలేని కనులు , అనే కథల్లో దారి తప్పుతున్న క్రైస్తవ యువతని తీర్చిదిద్దే విధానం కన్పిస్తుంది .దురలవాట్లకు బానిసలైన వారి కుటుంబ జీవితాలను , భిన్నాభిన్నమైన మానవ సంబంధాలను మెరుగు పర్చుకునే అంతర్లీన సందేశం కన్పిస్తుంది . దాదాపుగా 20 కథలు , “గూడు చేరిన గువ్వ “ అనే సామాజిక నవల రాసింది . ఇది జీవన జ్యోతి ప్రెస్ వారు అచ్చు వేశారు . “మోడు చిగురించిది “ సీరియల్ నవల “మారనాథ మెసెంజర్ “ మాస పత్రికలో అచ్చయింది .

కథలు , నవలలో దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సంఘటనలు ,ఆ వాతావరణంతో పాటు సమాజంలో జరుగుతున్న ముఖ్యంగా మహిళల పై జరిగే అన్యాయాలు ఇతి వృత్తంగా ఉన్నవే ఎక్కువ అని చెప్పాలి .

వ్యాసాలు :
ఆధునికాంధ్ర సాహిత్యంలో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ప్రవేశించిన సాహిత్య ప్రక్రియాల్లో వ్యాస ప్రక్రియ ఒకటి .అటువంటి వ్యాస ప్రక్రియల్లో సాహిత్యంలోను పరిశోధనాత్మక వ్యాసాలను జాతీయ , అంతర్జాతీయ సదస్సు లలో పత్ర సమర్పణలు చేసారు . ఇంకా పలు వ్యాస సంకలనాలలో , ప్రత్యేక సంచికలలో ప్రచురితం అయ్యాయి .

“తెలుగులో దళిత కవిత “అనే వ్యాసం భారత దేశంలో కొనసాగుతున్న చాతుర్వర్ణ వ్యవస్థన ఆధారంగా చేసుకొని కులాల విభజన జరిగింది . దళిత కవిత్వంలో మినీ కవితలు , నానీలు , హైకూలు , దీర్ఘ కావ్యాలు కూడా వచ్చాయి . దళిత కవిత్వంలో వస్తువు ప్రతీకలు , సామాజిక నేపథ్యం వంటి విషయాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపునువివరించారు .

1909 లో ఒక అజ్ఞాత కవి రాసిన “ మాల వాండ్ర పాట”ని తొలి దళిత గేయంగా భావిస్తున్నారు . ఇది ఆంద్ర భారతి మాస పత్రికలో అచ్చయింది . 1930లో జాలా రంగస్వామి “అంటారని వారెవరు “అనే పాటను రాసాడు . కుసుమ ధర్మన్న 1933లో ‘మా కొద్దీ నల్ల దొరతనమ’నే గేయాన్ని రాసాడు .తొలినాళ్లలో కుసుమ వెంకట రామయ్య , జాలా రంగకవి , నక్కా చిన వెంకయ్య , కుసుమ ధర్మన్న వంటి దళితులు నాయకత్వం వహిస్తూ గేయాలు రాసారు . జాలా రంగకవి ” అంటరాని వారెవరు ” కుసుమ ధర్మన్న “మాకొద్దీ నల్ల దొరతనము ” గేయాలు ఆనాటి దళితుల స్థితిగతుల్ని ప్రస్తావించారు .

ఈ క్రమంలోనే గుఱ్ఱం జాషువా 1941 లో గబ్బిలం కావ్యాన్ని రాసాడు . గబ్బిలం తెలుగులోని దళిత పద్య కావ్యాలలో మొదటిది . అలాగే జాషువాను తొలి దళిత కావ్య నాయకుడిగా గుర్తించ వచ్చునని పేర్కున్నారు . దళిత సాహిత్యంలో ఎస్ .సి వర్గీకరణ నేపథ్యంలో ఎన్నో కవితలు , సంకలనాలు , సంపుటాలు వచ్చాయి . దాంట్లో మాదిగ చైత్యనం , వర్గీకరణీయం , ఒకే గొంతు , దండోరా మొదలైన కవితా సంపుటాలు వచ్చాయి .

“గిడుగు – తెలుగు సవర భాషల సేవ “తెలుగు ,సవర భాషలని తన రెండు కళ్ళు గా భావించి ఆ భాషలను ఉన్నతీకరించటానికి జీవితాన్ని వెచ్చించిన భాషా మార్గదర్శి గిడుగు వెంకట రామ మూర్తి పంతులు . సవర భాషలో కథలు, పాటలు, సవర వాచకం రాసాడు . 1931లో సవర భాష నిఘంటువు, ‘ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్’ అనే వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని రాశారు. మద్రాసు ప్రభుత్వం గిడుగు సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను ముద్రించి గిడుగు చేసిన కృషికి శాశ్వత స్థానాన్ని కల్పించారు . ముండాభాష ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబానికి చెందినది . “సవర” దక్షిణ ముండా భాషకి చెందుతుంది . ఈ భాషపై లోతైన , శాస్త్రీయమైన అధ్యయనం చేసిన తొలి వ్యక్తి గిడుగు రామమూర్తి.

“క్రైస్తవ స్త్రీల సాహిత్యంలో నవల – కథ” తెలుగు సాహిత్య చరిత్రని పరిశీలిస్తే క్రైస్తవ సాహిత్యం క్రీ శ 1 7 2 0 సం పరిసర ప్రాంతాల్లో జేస్సూట్ ఫాదరీల రాకతో జీవం పోసుకుందని చెప్పవచ్చు . మిషనరీల రాకతో తెలుగు భాషకి , సాహిత్యానికి కూడా మేలు చేకూరిందని చెప్పవచ్చు . “ క్రైస్తవ కథలు , నవలలు – రచయిత్రులు “క్రైస్తవ కథలు రాసిన వారిలో తొలి రచయిత్రుల జాబితా లోకి వచ్చే వారిలో శ్రీమతి సెంటీనా సరోజనీ , బి. ప్రేమలీల ,మద్రాసుకు చెందిన పి . లలిత ,శ్రీమతి మంజులా జోయెల్ వైజాగ్ నివాసి . వీరు పుణ్య పురుషులు , బలిదానం నవలలు రాశారు . శ్రీమతి బి . రత్నమణి

20 కి పైగా కథలు , నాలుగు వ్యాసాలూ రాశారు . వీరు శ్రీకాకుళం నివాసి . నిర్మలా దేవదానం గారు కథలు , “ క్రీస్తు కోశం “ అనే బైబిలు పొడుపు కథలు పుస్తక రూపంలో ప్రచురించారు . విజయవాడకి చెందిన పి.శంకుతల సంజీవరావు , పిల్లి విజయ ఛార్లెస్ ,శ్రీమతి ఆరతి వాల్టర్ ,సరళా ఫ్రాన్సిస్ , శ్రీమతి శారా విజయ కుమార్ , ఆలీస్ మేరీ , శ్రీమతి మెర్సీ రత్నాబాయి షేడ్రక్ , ఝాన్సీ కె,వి .కుమారి ,డా .కొలకలూరి మధుజ్యోతి , కొకలూరి ఆశాజ్యోతి ,డా. యం.యం . వినోదిని “ వీరి నవలలు , కథలను విశ్లేషించారు .

“నదీ సాహిత్యం – గోదావరి”భారత దేశ ప్రజలు జీవ నదుల్ని ప్రాణ సమానంగా పూజిస్తారు , ప్రేమిస్తారు . ప్రకృతి సౌందర్యంతో అలరారే నదీ ప్రాంతాలలో పర్ణశాలల్ని , అందమైన గృహాన్ని , దేవాలయాల్ని నిర్మించుకుని నదులతో కూడిన ప్రకృతితో మమేకమయ్యారు . “సాహిత్యంలో కోయిల”కోయిల పేరు వినగానే చిగురించే వసంతం . లేత మావిచివుళ్ళు గుర్తొస్తాయి . ప్రకృతి పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాలు ధరించుకుని ఉగాదికి ఆహ్వానం పలుకుతుందా అన్నట్లు చైతన్య వంతం అవుతుంది . దీనికి తోడు తీయని కోకిల పాటలు వీనుల విందు చేస్తుంటే ఆనందాన్ని ఆస్వాదించని వారు ఎవరైనా ఉంటారా ? అంటూ సాహిత్యంలో కోయిల ప్రస్తావనని పేర్కొన్నారు .

“కంప్యూటర్‌లో తెలుగు లిపి- ఆవిర్భావ వికాసాలు”కంప్యూటర్‌ యుగం ఆరంభమైన తరువాత ‘కంప్యూటర్‌ స్క్రీన్‌’ మీద కేవలం ఆంగ్లపదాలనే చూడటానికి అలవాటుపడ్డ వాడకందార్లు సాంకేతిక నైపుణ్యం పెరుగుతున్నకొద్దీ తమతమ మాతృభాషల్ని కంప్యూటర్‌ తెరమీద చూసుకోవాలన్న తపన మొదలైంది. “వేడుకల్లోకోలాహలం” కోలాటం ఆంధ్రుల జనజీవితంతో పెనవేసుకు పోయిన రసవత్తరమైన నాట్య ప్రక్రియ . ఈ ప్రక్రియని సాంప్రదాయకమైన పండుగలు , వేడుకలు , గ్రామ దేవతల జాతరలు , తిరునాళ్ళలో ప్రదర్శిస్తుంటారు .

పత్రిక నిర్వహణ :
‘ఇంటర్నెట్‌ వచ్చింది… పుస్తకం పక్కకు పోయింది’ ఇది సాహిత్యాభిమానుల ఆవేదన. పుస్తకంలోని సాహిత్యం కంప్యూటర్‌లో అందిస్తూ… సాహితీ తృష్ణను తీరుస్తోంది ‘విహంగ’. ఆన్‌లైన్‌లో మహిళా సాహిత్య వారపత్రిక. నిర్వాహకురాలు కవి, రచయిత్రి హేమలత పుట్ల. సంపాదకురాలు. అంతర్జాలంలో ప్రారంభించబడిన తొలి తెలుగు మహిళా పత్రిక , మరియు ISSN నెంబర్ పొందిన తొలి అంతర్జాల పత్రిక కూడా విహంగనే . వెబ్‌ ప్రపంచంలో మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న మహిళా సాహిత్య పత్రిక ‘విహంగ’. రచయిత్రుల మేలిమి రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ తెలుగు సాహిత్యంలో వారి కీలక భాగస్వామ్యాన్ని ప్రపంచానికి అందిస్తోంది ‘విహంగ’.

ఈ డిజిటల్‌ యుగంలో చేతిలో పుస్తకాలు పట్టుకొని పేజీలు తిరగేస్తూ చదువుతున్నవాళ్ళు కొందరే. ఎందుకంటే పుస్తకాలు ఇప్పుడు వెబ్‌లో కూడా దొరుకుతున్నాయి. అందుకే వెబ్‌లో చదివేందుకే చదువరులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోకే పత్రికలు కూడా వచ్చేశాయి. ప్రింట్‌ అయ్యి బయటికి వచ్చినా వెబ్‌ పత్రికను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కాని పూర్తిగా వెబ్‌లోనే నడిచే పత్రికలు మాత్రం అరుదు. కాని ప్రపంచమంతా వెబ్‌తోనే నడుస్తోంది. అందుకే వెబ్‌ ఆధారిత మహిళా సాహిత్య పత్రికను నడపాలనే ఆకాంక్షతో ప్రారంభించారు ‘విహంగ’ వెబ్‌ పత్రికను. ఇది తొలి తెలుగు మహిళా వెబ్‌ పత్రిక కూడా.

ఇంటర్‌నెట్‌లో మహిళల సాహిత్యం కోసం ప్రత్యేకించి ఒక వెబ్‌ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణం అని అంటున్నారు పత్రిక నిర్వాహకులు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని మ్యాగజైన్‌లు ఉన్నాయి. రోజువారీ దినపత్రికల్లో కూడా మహిళల కోసం ప్రత్యేకంగా పేజీని కేటాయించారు. వీటినే వెబ్‌లోకి తరలిస్తున్నారు. అందుకే పూర్తిగా వెబ్‌లోనే నడిచేలా ప్రారంభించిన తొలి తెలుగు మహిళా పత్రిక విహంగను ఇప్పటివరకు కోటి నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు.

”ఇన్ని పత్రికలున్నా స్త్రీల సాహిత్య పరిణామం కొరతగానే ఉంది. అందుకే ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం, పత్రికలు అంతర్జాలంలో కాలు మోపాలని మా ప్రగాఢ వాంఛ. మా ప్రయత్నంగా పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు మహిళల భావోద్వేగాలకు వేదిక గా ‘విహంగ’ ని తొలి తెలుగు వెబ్‌ పత్రికగా జనవరి2011న అంతర్జాలపు వినువీధుల్లో సగర్వంగా ఎగరేస్తున్నామని” చెబుతున్నారు విహంగ నిర్వాహకులు.

విహంగ  మహిళల సాహిత్య పత్రిక. హేమలత పుట్ల సంపాదకురాలిగా వ్యవహరిస్తూ సమకాలీన అంశాలతో పాటు కవితలు, ధారావాహికలు, కథలు, నాటికలు, నవలలు, ఆత్మకథలు, ఒకప్పటి నారీమణుల చరిత్రలు ఇలా ఒక్కటేమిటి అన్ని అంశాల మేళవింపే ఈ విహంగ. దీనిలో ఇస్తున్న సీరియల్స్‌, ఇంటర్వ్యూలు, పుస్తక సమీక్షలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటి కోసమే ప్రతి నెల విహంగని పాఠకులు చదువుతున్నారు. అందుకే నేడు ఎందరో దీనికి తమ ఆత్మకథలను సైతం పంపుతున్నారు. ఇలా ఎందరికో స్నేహహస్తాన్ని అందిస్తున్న విహంగ పత్రిక ప్రారంభం నాటి పత్రికల నుండి నేటివరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

విహంగ వ్యక్తి స్వేచ్ఛతో పాటు అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది. విశాల భావాలను, దృక్పథాలను ఆదరిస్తుంది. మహిళల్లోని కళాత్మకమైన, భావనాత్మకమైన సంవేదనల్ని, సంఘర్షణల్ని అక్షరరూపంలో ప్రకటించే సృజనకారులని ఆహ్వానిస్తుంది.

సంపాదకీయాలు :
విహంగ సాహిత్య పత్రికలో సంపాదకురాలిగా యిప్పటి వరకు 44 సంపాదకీయ వ్యాసాలను రాసారు రచయిత్రి . మహిళా పత్రిక కావడం వలన సాధారణంగా మహిళల సమస్యల మీద , సాహిత్యానికి ప్రాముఖ్యం ఇవ్వడంతో సాహిత్య విషయాలు , వర్తమాన సంఘటనలను ఈ వ్యాసాలలో విశ్లేషించారు . మొదటి సంపాదకీయం పత్రిక ప్రారంభంలో జనవరి 2011 లో అందించారు . విహంగ ప్రధాన ఉద్దేశ్యం స్త్రీల స్వాతంత్ర్యపు భావాల అభివ్యక్తుల్ని ఆదరించటం , గౌరవించటం , మనువు నుంచి మన కాలపు కంప్యుటర్ యుగం దాకా ఎన్నో మార్పులు వచ్చాయి . సమాజానికి అనుగుణంగా ఉండాలి అంటూ వివరించారు .

2011 జూలై లో సాహిత్యంలో స్త్రీల దృక్పదం ఏ విధంగా ఉంది అనేది ప్రశ్నిస్తూ జెండర్ అస్తిత్వంలోంచి రాయడమే కాకుండా కుల , మత , ప్రాంత , వర్గ , అస్తిత్వాలను తెలియజేసారు . స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చిన వ్యాసంలో స్త్రీలు , బాలికలపై జరుగుతున్న దాడులు , దౌర్జన్యాలను వివరిస్తుంటే మనం ఉన్న సభ్య సమాజం పై అసహ్యం కలగక మానదు .

తెల్ల రిబ్బన్ రోజు 2012 డిశంబరు నెలలో సంపాదకీయం లో వచ్చిన వ్యాసం .నవంబరు 25 నుంచి డిశంబరు 10 వరకు 16 రోజులు స్త్రీలను చైతన్యవంతులు చేసే దిశగా సాగిన సభలు , 154 దేశాలు , 2 వేల స్వచ్చంద సంస్థలు , అంతర్జాతీయ హింస నివారణ దినోత్సంగా జరుపుతారు . 2013 మార్చి “మహిళా సాధిక్కారిత వ్యాసం , మహిళా దినాలు వస్తూనే ఉంటాయి , కాసేపు చర్చలు , సమీక్షలు వెళ్ళిపోవటం మామూలే . ధిల్లి నిర్భయ కేసు , హైదరాబాదు లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

నికిల్ మోరే సంఘటనలు పరిశిలీస్తే యువతులు తమని తాము రక్షించుకోవటానికి ఎంత సంసిద్ధులై ఉండాలో అర్ధం అవుతుంది . మే నెల సంపాదకీయం ఆమే డే అంటే గుర్తుకు వచ్చేది కార్మికుల దినోత్సవం . వారి హక్కులు , వారిలోనూ మహిళా కార్మికులూ ఉన్నారు . వారి మాటేంటి ? ఆడ పిల్లలను కానీ పారేస్తున్న ఈ రోజుల్లో ముగ్గురు మగ పిల్లలు , ఒక ఆడ పిల్ల ఉన్నా అప్పుడే పుట్టి పారవేయబడ్డ ఆడ బిడ్డను అక్కున చేర్చుకుంది ఘాజీయా బాద్ ఈ విషయంలో తన భర్తకి కూడా దూరమైంది .

2014 మార్చి గులాబి హవా “ వ్యాసంలో 2006 లో ప్రారంభమైన గులాబీ గ్యాంగ్ గురించిన ప్రస్తావన 2014 లో హైదరాబాద్ మున్సిపాల్ కార్పరేషన్ మహిళా డ్రైవర్ గా ఉపాధి కల్పించే దిశగా షీ టాక్సీ లను పంపిణి చేసారు .

సాహిత్యానికి సంబంధించిన అంశాలతోను ఆయా సందర్భాలలో ప్రత్యేకంగా వ్యక్తుల్ని వారి విశ్లేషణాత్మక వివరణను సంపాదకీయ వ్యాసాలుగా వచ్చినవి ఉన్నాయి . సెప్టంబర్ నెలలో సంపాదకీయమలో జ్యోతిరావు పూలే చేసిన సేవల్ని , అతని భార్య సావిత్రి బాయి పూలే తొలి ఉపాధ్యాయురాలిగా అంగీకరించటంలో తప్పు లేదని వివరించారు . మాలతీ చందూర్ స్మృతి వ్యాసంగా రచించిన విశ్వ విజ్ఞాన విదూషీ మాలతీ చందూర్ లో మాలతీ చందూర్ నిర్వహించిన కాలమ్స్ ని , ఆమే రచన శైలిని ప్రస్తావించారు . ఇంకా మల్లాది సుబ్బమ్మ , శరత్ వంటి కవుల పై రాసిన సంపాదకీయ వ్యాసాలూ విశ్లేషణాత్మకంగా సాగినవే .

అటు దళిత సాహిత్యం , ఇటు క్రైస్తవ సాహిత్యం లోను రచనలు చేస్తూ ఒక చట్రంలోనే ఇరుక్కు పోకుండా స్త్రీవాది గా గొంతును వినిపించడం మరొక వైపు మహిళా సాహిత్య పత్రిక అంటూ బాధ్యతలు నిర్వహిస్తూ , దానిలో పురుషులకి స్థానాన్ని కల్పించారు వీరు . సమాజంలో నిత్యం జరిగే సంఘటనల పైన స్పందిస్తూనే ఉండేవారు .  ఆధునిక కాలంలో ఒక భావానికో , ఒక వాదనికో పరిమితం అయిపోయిన వాళ్ళని ఎందరినో చూస్తున్నాం . అలా కాకుండా అస్తిత్వ పరంగాను , ఒక సగటు మనిషిగాను , స్త్రీవాది గాను , మహిళా రచయిత్రిగాను , అంతర్జాల సాహిత్య పరిశోధకురాలిగా , విశ్లేషకురాలిగా , అంతర్జాల పత్రిక సంపాదకురాలిగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు .

– డా. అరసి శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, సంపాదకీయం, సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.