మేఘసందేశం-16 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాస భారతదేశపు జాతీయకవి అని కవిపండితులు చెప్తారు. మన దేశానికి చెందిన అత్యుత్తమ సాంస్కృతికాదర్శాలను తన కావ్యాల్లో ప్రతిబింబింప జేయడం వలననే ఆయనకీ గౌరవం దక్కింది. “యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం” అని భగవద్గీత ఉవాచ. అంటే భారతీయ సంస్కృతి మొత్తం యజ్ఞం-దానం-తపం-త్యాగం అనే నాలుగు స్థంభాలమీద నిలబడి ఉంది. ఇంద్రియాల్ని తమ వశంలో ఉంచుకోవడమే తపస్సు. ముక్కుమూసుకుని అరణ్యాలలో నివసిస్తేనే తపస్సు కాదు. వశిష్ట, కణ్వాదులు అరణ్యాలలో ఉంటే దిలీపుడు, దుష్యంతుడు రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ, అరిషడ్వర్గాలను జయించి తపస్సమాధిలో ఉండే మహర్షులంటారు పెద్దలు. యజ్ఞం-దానం-తపం అనే మూడింటిలోను త్యాగం దాగి ఉంది. భారతీయ సంస్కృతికి చెందిన ఔన్నత్యాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను విశ్వానికి వినిపింపజేసిన కవి కాళిదాసు. అందుకే ఆయన జాతీయ కవి.

మేఘదూతం మహాకావ్యం. “హిస్టరీ ఆఫ్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్” అన్న మహా గ్రంధం రాసిన గిబ్బన్ కవి చెప్పినట్టు మధుర కావ్యాలను మనసులో చదవడం కాకుండా నోరారా గొంతెత్తి చదవాలి. రసగుళికలైన శ్లోకాల్ని నెమ్మది నెమ్మదిగా నెమరువేసుకుంటూ ఆహ్లాదాన్ని అనుభవించమని కోరుతూ మళ్ళీ మనం మేఘసందేశంలోకి వద్దాం.

గత మాసం “తస్యోత్సంగే ప్రణయిన ఇవ స్రస్తగంగాదుకూలాం” అన్న శ్లోకంతో పూర్వమేఘం సంపూర్తయింది. ఈ మాసం నుండి ఉత్తరమేఘ మాధుర్యాన్ని అనుభవిద్దాం.

శ్లో.1. విద్యుద్వంతం లలితవనితా: సేంద్రచాపం సచిత్రా:
సంగీతాయ ప్రహతమురజా: స్నిగ్ధఘంభీరఘోషం
అంతస్తోయం మణిమయభువ స్తుంగ మభ్రం లిహాగ్రా:
ప్రసాదా స్త్వాం తులయితుమలం యత్ర త్రైస్తైర్విశేషై:

భావం: ఓ మిత్రుడా! అలకానగరంలో భవనాలు అందమైన కోమలమైన యువతులతో గూడినవి. అక్కడ రంగురంగుల చిత్తరువులు ఉంటాయి. సంగీత సమయాలలో మృదు మృదంగ ధ్వానాలు వినిపిస్తూ ఉంటాయి. నేల మణులతో కూడి ఉంటుంది. అవి అన్నీ నీతో స్వామ్యం పొందగలిగినవే సుమా! ఏవిధంగానంటావా? నీలో మెరుపుతీగలుండగా అక్కడ మెరుపులవంటి సుందరాంగనలుంటారు. నీలో రంగురంగుల ఇంద్రధనుస్సులుంటే అక్కడ చిత్రవిచిత్రపు చిత్తరువులుంటాయి. నీగర్జనలను పోలిన మృదంగ ధ్వానాలు ఉంటాయి. నీలో నీరు మెరుస్తూ ఉండగా అక్కడి నేలలోని మణులు కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి. అక్కడి భవనాలు చాలా ఎత్తుగా నీకు సాటిగా ఉంటాయి అని పూర్ణోపమ అలంకారంతో మేఘుడిని అలకాపురి శోభతో సమన్వ్యం చేసి చెప్తున్నాడు యక్షుడు.

శ్లో.2. హస్తే లీలాకమల మలకే బాలకున్దానువిద్ధమ్‌
నీతా లోధ్రప్రసవరజసా పాణ్డుతా మాననే శ్రీః
చూడాపాశే నవకురవకం చారు కర్ణే శిరీషం
సీమన్తే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్‌

ఓ మేఘమా! అలకాపురి పట్టణంలో స్త్రీలు అందరూ సౌందర్య ప్రియులు. వారికి చేతిలో కమలము, ముంగురులలో అప్పుడే వికసించిన మొల్లపూవు, ముఖంలో లొద్దుగు పూల పరాగం వల్ల వచ్చిన పాండువర్ణశోభతో గూడి ఉంటారు. ఇంకా కొప్పులో గోరింటపూవు, చెవిలో అందమైన దిరిసెనపూవు, పాపటలో వర్షాకాలంలో వచ్చే కడిమపూవులతో అలంకారశోభితులై ఉంటారు. కవికులగురువు ఈ విధంగా చెప్తూ అలకాపురిలో ఋతువులతో సంబంధం లేకుండా అన్ని వేళలలోను, అన్నిరకాల పుష్పాలు లభిస్తాయని చెప్తున్నాడు.

శ్లో.3. యత్రోన్మత్తభ్రమరముఖరాః పాదపా నిత్యపుష్పా
హంసశ్రేణీరచిత రశనా నిత్యపద్మా నలిన్యః
కేకోత్కణ్ఠా భవనశిఖినో నిత్యభాస్వత్కలాపా
నిత్యజ్య్జోత్స్నాః ప్రతిహతతమోవృత్తిరమ్యాః ప్రదోషాః

భావం: ఓ ప్రియ మిత్రుడా! మేఘుడా! విను! నీకు అలకాపురి యొక్క శోభను, సౌందర్యాన్ని, సంపత్సమృద్ధి, వారి జీవన విధానాన్ని వినిపిస్తున్నాను. విను అంటూ కొనసాగిస్తున్నాడు యక్షుడు.

ఆ అలకాపురి సామాన్యమైనది కాదు సుమా! సర్వప్రశస్తి కలిగినది. అక్కడి ఏ పూల వృక్షమైనా అన్ని కాలాలలోను పుష్పిస్తూ నిరంతరం తుమ్మెదల ఝుంకారాలతో ఉంటాయి. కొలనులలోని తామరపుష్పాలు హంసలపంక్తికి మొలనూలాన్నట్లుగా ఎప్పుడు కమలాలతో నిండి ఉంటాయి. అక్కడ గృహాలలోని నెమళ్ళు గొప్ప ప్రకాశం గలిగిన పింఛాలతో నిత్యం కేకారవాలు చేస్తూ ఉంటాయి. రాత్రులందు చంద్రుడు వృద్ధిక్షయం లేకుండా నిత్య నూతనంగా మనోహరంగా వెన్నెలను ప్రసరిస్తూ ఉంటాడు.
(ఈ రెండు,మూడు శ్లోకాలు ప్రక్షిప్తాలని మల్లినాధసూరి భావన. అయినప్పటికీ వ్యాఖ్యానం చేసాడు)

శ్లో.4.ఆనన్దోత్థం నయనసలిలం యత్ర నాన్యైర్నిమ్తిౖతెః
నాన్య స్తాపః కుసుమశరజా దిష్టసంయోగసాధ్యాత్
నా ప్యన్యస్మా త్ప్రణయకలహా ద్విప్రయోగోపపత్తిః
విత్తేశానాం న చ ఖలు వయో యౌవనా దన్య దస్తి

భావం: ఓ మేఘుడా! అలకాపురిలో ఉన్న యక్షులు బాగా ఐశ్వర్యవంతులు. వారిక సదా ఆనంద భాష్పాలే తప్ప కన్నీళ్ళు వారు ఎరుగరు. ప్రేయసీప్రియులు కలయికతో తొలిగిపోయే విరహతాపం తప్ప మరొక తాపమే ఎరుగని వారు. ఎప్పుడైనా ప్రణయకలహాలేగానీ మరో కలహం వారికి ఉండదు. వారికి అక్కడ నిత్య యౌవనం తప్ప మరో దశ ఉంటుందని కూడా తెలీని వారు.

ఇచ్చట అలంకారాన్ని పరిసంఖ్యాలంకారం అంటారు. అనగా ఒకచోట నిషేధించి మరొకచోట ఉన్నట్లుగా తెలియజేసే విధానం.

శ్లో.5.యస్యాం యక్షాః సితమణిమయా న్యేత్య హర్మ్యస్థలాని
జ్యోతిశ్ఛాయా కుసుమరచితా న్యుత్తమస్త్రీసహాయాః
ఆసేవన్తే మధు రతిఫలం కల్పవృక్షప్రసూతం
స్వద్గమ్భీరధ్వనిషు శనకైః పుష్కరే ష్వాహతేషు

భావం: ఓ మేఘుడా! అలకాపురి పట్టణంలో ఉన్న యక్షులు భోగలాలసులు. వారికి ధనానికి కొదువలేదు. వారి మేడలు స్ఫటిక మణులతో కట్టబడినవి. ఆ మేడలపై నక్షత్రాలవంటి పూవులు పరచి ఉండగా తమ సహచరులైన స్త్రీలతో వెళ్ళి, మేఘ గర్జన వంటి మృదంగ ధ్వనులు మ్రోగుచుండగా మద్యమును సేవిస్తూ వినోదిస్తుంటారు. ఆ మద్యము కల్పవృక్షమునుండి తయారు చేయబడినందువలన వారికి అది స్త్రీపురుషులిరువురిలో సదా కామోద్దీపనం కలుగజేస్తూ ఉంటుంది.

యక్షుడు మేఘుడికి ఆసక్తికరంగా అలకాపురి పట్టణ శోభను హృద్యంగమంగా వివరిస్తూ ఉన్నాడు. మిగతా విశేషాలు వచ్చే మాసం చూద్దాం.

-వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)