నా కళ్లతో అమెరికా -71-యాత్రా సాహిత్యం (కాన్ కూన్ -మెక్సికో యాత్ర- భాగం-2)-కె.గీత

కాన్ కూన్ నగరం మెక్సికో దేశానికి ఆగ్నేయ దిక్కున ఉన్న “క్వింటానా రూ” రాష్ట్రం యూకతాన్ ద్వీపకల్పం లో ఉంది.

స్థానిక మాయా భాషలో కాన్ కూన్ అంటే “పాముల పుట్ట” అని అర్థమట.

ఈ చుట్టుపక్కలే ప్రపంచంలో అత్యంత పురాతన మైన గొప్ప సంస్కృతుల్లో ఒకటైన మాయా నాగరికత క్రీ.పూ. 2000 నుండి క్రీ.శ. 900 వరకు విలసిల్లింది.

ఇక్కడ ఇప్పటికీ సజీవంగా ఉన్న అనేక శిథిల కట్టడాలు అబ్బురమనిపిస్తాయి.

కాన్ కూన్ నగరం 18 వ శతాబ్దిలో స్పానిష్ వారి ఆక్రమణ ఫలితంగా వెలుగులోకి వచ్చింది.

ఇక 1970 వ సం.రం తరువాత ఇక్కడ రిసార్టుల నిర్మాణం ప్రారంభమయ్యేక యాత్రికుల రాకపోకలు ప్రారంభమయ్యేయి.

పై నుంచి చూస్తే సముద్రంలోకి వదులుగా వొదిలేసిన సన్నని తాడులాంటి భూభాగం మీద వరసగా స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణాలు కనువిందు చేస్తూ భూలోక స్వర్గాన్ని తలపింపజేస్తాయి. ఈ ప్రాంతం పేరే “జోనా హోటాలెరా” (హోటల్ జోన్”).

ఈ జోన్ కి అటూ, ఇటూ కొసలు ప్రధాన నగరాన్ని కలిపి ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఎటు ప్రయాణం చేసినా రెండు వైపులా నీళ్లతో అందమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి.

ముఖ్యంగా హోటలు బాల్కనీ లోంచి అనంత సాగరపుటంచు మీదుగా ప్రతీ ఉదయానికీ ఆహ్వానం పలికే ప్రశాంత సూర్యోదయం, రాత్రి పూట కెరటాల మీద దోబూచులాడుతూ సరాసరి గుండెల్లోకి దూసుకొచ్చే అందమైన చంద్రోదయాలు చూడ్డానికైనా వెళ్లాల్సిందే అనిపించింది.

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

ఈ హోటల్ జోన్ తప్ప మిగతా ప్రాంతమంతా చిన్న సైజు టౌనులా ఉంది.

ఇక్కడ జనాభా లో 99% ఇక్కడి టూరిజమ్మీద ఆధారపడి బతుకుతున్నవాళ్లే. స్పానిషు ప్రధాన భాషైన మెక్సికో దేశంలో ఏ మాత్రం ఇంగ్లీషు మాట్లాడగలిగే వాళ్లకయినా టూరిజం లో అవకాశాలు ఈ ప్రాంతంలో మెండుగా ఉన్నాయి. అయినా మామూలు జనానీకం పేదరికంలోనే మగ్గుతున్నట్లు నగరంలోని ఇతర ప్రాంతాల్ని చూస్తే అర్థం అవుతూంది.

గత కొన్నేళ్లుగా ఇక్కడ డ్రగ్స్ కి సంబంధించిన నేరాలు, హత్యలు పెరగడం వల్ల అమెరికా వంటి సంపన్న దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేక భద్రతలు కూడా పెంపొందించినట్లు రోడ్లపై ఎక్కడికక్కడ మిలటరీ దళాలు ఉన్నాయి.

ఇందుకు భయపడే మేం అనేక సార్లు ఈ ప్రయాణాన్ని వాయిదా వేసాం. కానీ వెళ్లొచ్చాక అంతగా భయపడాల్సిన పని లేదని అనిపించింది.

నాకు పరిచయం అయిన కొందరిని అక్కడి భద్రతకు సంబంధించి అడిగినప్పుడు ప్రపంచంలో అన్ని ప్రాంతాలలోనూ నేరాలు జరుగుతున్నా ఇక్కడి సంఘటనలనే భూతద్దంలో చూపిస్తూ ఉంటారని వాపోయారు. ఒకతనైతే “అమెరికాలో ఎన్ని కాల్పులు జరగడం లేదు? అక్కడ మాత్రం భద్రత ఉందా?” అని ఎదురు ప్రశ్న వేసాడు. నిజమే అనిపించింది నాకు.

మధ్యలో ఒక రోజు మేం టూరుకి వెళ్లిన బస్సు డ్రైవరు “మీరు వచ్చిన పనిని బట్టి మీ భద్రత ఆధారపడి ఉంటుంది. మీరు కేవలం సందర్శకులైతే మీ మీద ఎవరు కాల్పులు జరుపుతారు? నాకు తెలిసినంతవరకు అనేక ఇతర ప్రాంతాలతోనూ, దేశాలతోనూ పోలిస్తే సామాన్యులకు ఇది చాలా భద్రత కలిగినదే. ఇక డ్రగ్స్ మాఫియా అంటారా? అది ఎక్కడ మాత్రం లేదు? అమెరికాలో కంటే పెద్ద నేరాలు మా మెక్సికో దేశంలో జరగవు.” అన్నాడు నవ్వుతూ.

ఇక ఇలాంటి వివాదాస్పదమైన చోటికి ధైర్యంగా వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుని వచ్చాం కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించకూడదని అనుకున్నాం.

చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి లిస్టు చేసుకున్నాం. అందులో ముఖ్యమైనవి ఆధునిక ప్రపంచ ఎనిమిది వింతల్లో ఒకటైన చిచెన్ ఇట్జా పిరమిడ్ ఒకటి.

అంతే కాకుండా అక్కడ “సెనోట్లు” అనబడే భూగర్భ జలాలు తప్పనిసరిగా చూడదగినవి.

ఇక కానుకున్ ని ఆనుకుని ఉన్న “ఇస్లా మొహారీస్” ద్వీపం ఒక రోజు కార్యక్రమం గా చేరింది.

స్థానిక ఉత్పత్తులకు, ప్రజల్ని, వారి సంస్కృతిని చూసేందుకు ప్రసిద్ధి చెందిన “మార్కెట్-28” తప్పని సరి అని నేను పేచీ పెట్టేను.

సత్యకు, వరుకు ఇష్టమైన జిప్ లైన్ వంటి ఎడ్వెంచర్ టూర్లు వాళ్లు బుక్ చేసుకుందామన్నారు.

సముద్రమ్మీద సాయంత్రం పూట కనువిందు చేస్తూ తప్పనిసరిగా చూడాల్సినదని జనం మెచ్చిన టూరు “పైరేట్ షో”.

తులం, కోబా వంటి మాయా సంస్కృతిలోని శిధిల నగరాలు అన్నిటికంటే ముఖ్యమైనవి. వెరసి మొత్తం అయిదు రోజులకు సరిపడా టూర్లు సిద్ధమయ్యేయి మాకు.

ఇక మేం బయలుదేరే రోజు రానే వచ్చింది.

కాస్ట్ కో పాకేజీ టూరులో భాగంగా రెండు ప్లయిట్లు మారినా వెంట వెంటనే ఫ్లయిట్లు కావడం వల్ల మధ్యాహ్నం పన్నెండుకి బయలుదేరి, రాత్రికి చేరాల్సి ఉంది మేం.

కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ లోని డల్లాస్ కు మొదట మూడు గంటలు, డల్లాస్ నుంచి మరో రెండు గంటలు ప్రయాణం. కానీ కాన్ కూన్ సమయం మాకు మూడు గంటలు ముందు ఉండడం వల్ల మేం వెళ్లేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది.

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేసరికి మరో అరగంట.

కాంకూన్ ఎయిపోర్టు చాలా చిన్నది. నిజానికి బయటకు రావడానికి అట్టే సమయం పట్టదు.

ఇంక రెండు నిమిషాల్లో అద్దాల తలుపులు దాటి బయటకు వస్తామనగా ఉన్న టూరిజం హెల్ప్ సెంటర్ల లాంటి చోట్ల ఉన్న బాడ్జు పెట్టుకున్న ఒకమ్మాయి మమ్మల్ని “సాయమేదైనా కావాలా” అని పలకరించింది.

కాస్ట్ కో పాకేజీ లో భాగంగా మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని హోటల్ లో దించే ప్రైవేటు వ్యాను ఎక్కడ ఆగుతుందో అన్న సందేహంతో ఆమె దగ్గిర ఆగేం మేం.

అదెంత పెద్ద తప్పో మాకు తర్వాత తెలిసొచ్చింది.

——-

(ఇంకా ఉంది)

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా కళ్ళతో అమెరికా, యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో