బాకీ(కవిత )దేవనపల్లి వీణా వాణి

కాదన్నా అవునన్నా
సకల సుఖ దుఃఖాలకు
తెల్ల జెండా కట్టి
నింగి దాకా ఎగరేయడానికి
నీకు మాత్రమే వినిపించే సంగీతంతో
ప్రకృతి వీడ్కోలు పాట పాడుతుంది

పవిత్ర జలంలో కడగబడ్డ అస్థికలు
ఆ నీటికి జత చేసే బురదలో
చివరాఖరి ఉనికి కొట్టుకుపోయి
ఒక ఛాయా చిత్రం
నిన్నటిని గుర్తు చేస్తూ
మిగులుతుంది

ఒక ఎర్రని మంట
నీతో పాటూ ఉన్న
పశ్చాతాపంమింగేసినాక
నువ్వు ఎవరికి క్షమాపణ
బాకీ పడ్డావో
ఎవరికి తెలుస్తుంది ..?

నువ్వైతే
ఎవరి గుండెను
నాలుక ముళ్ళుతో చీరేయలేదు కదా..!?

నువ్వైతే ఎవరి కాళ్ళను
పాములా కాటేసి కణ కణం కమిలిపోయేలా
విషం చిమ్మి ఏమీ ఎరగనట్టు
తప్పించుకోలేదు కదా…!?

నిజం చెప్పు
నువ్వైతే ఎవరికీ క్షమాపణ బాకీ లేవు కదా..!

దేవనపల్లి వీణా వాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.