గౌరవ సంపాదకీయం -మానస ఎండ్లూరి – ప్ర ర వే ప్రత్యేక సంచిక

సగం ఆకాశం స్త్రీ అని మనం విన్నాం. నమ్మాం. ఆకాశానికి మనం చూసేది ఒక చంద్రుడిని మాత్రమే. ప్రరవే లో ఈ చంద్రికలను ఎంతోమందిని మనం చూస్తాం. వాళ్ళని చదువుతాం. కొందరు పండువెన్నెలను కురిపిస్తారు. కొందరు అమావాస్య చీకటిని నింపేస్తారు. వారి రచనల్లో అంతరార్థాలు వేరే ఉంటాయి. అవి ఏంటని సవాళ్ళు విసురుతూ ఉంటారు. అవి రచనలు మాత్రమేనా? స్త్రీ హృదయాన్ని ఎన్నో కోణాల నుంచి ఆవిష్కరించడం అనేది ఒక వేడుక అని చెప్పేవి. ఎన్ని సంఘటనలు, ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని జీవితాలను రాస్తే స్త్రీని పూర్తిగా ఆవిష్కరించిన వారమవుతాం? బహుశా స్త్రీ పరిస్థితి మారేంత వరకూ కావచ్చు. మునుపటి కన్నా మెరుగవుతుంది అని ఓ పక్క ఆనంద పడుతూనే అంతకన్నా హీనమైన పరిస్థితులకు గురవుతున్న వాస్తవాలను కూడా భరించాల్సి రావడం మర్చిపోలేనిది. మర్చిపోకూడనిది.

అయితే స్త్రీ స్థితిగతులను భిన్న కోణాల నుంచి చూడాలి. అప్పుడే ఎన్ని రకాలుగా ఆమె వంచనకి, దోపిడీకి గురవుతున్నదీ మనకి తెలుస్తుంది. జెండర్ పరంగా చూసినప్పుడు ముందు స్త్రీని స్త్రీయే వివక్షకు గురి చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. సామాజిక, ఆర్థిక, ప్రాంత, వర్గ, కుల, మత బేధాల వలన అని తెలుస్తూనే ఉంటుంది. లైంగికపరంగా పురుషుని వలన స్త్రీ పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఎప్పటికీ ఈ దురాగతాలు ఆ కావన్న భయం కూడా కలుగుతుంది. ఇదేవిధంగా ఒంటరి మహిళల సమస్యలపై ఈ సారి మరింత దృష్టి పెడుతుంది ప్రరవే. ఎన్నో కోణాల నుంచి ఒంటరి మహిళలు పడే వేదనలపై చర్చిస్తుంది. అవివాహితులు, కుటుంబం లేని మహిళలు, వైధవ్యం పొందిన వాళ్లు సమాజంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎంతవరకు ఎదురీత గలుగుతున్నారని ప్రశ్నిస్తున్నాయి ప్రరవే రచనలు.

తెలుగు సాహిత్యమే కాదు స్త్రీవాదం లేని ఏ సాహిత్యమైనా అసంపూర్ణమే. స్త్రీ విరివిగా రాణించాల్సిన రంగాలు ఇంకా మిగిలి ఉన్నట్లు స్త్రీని చూడాల్సిన సామాజిక కోణాలు కూడా ఎన్నో రచనల్లోకి రావాల్సి ఉంది. ఆ మాటకు వస్తే ప్రతి స్త్రీ జీవితం ఒక రచనే. అయితే ఎంత మంది స్త్రీలు తమ అస్తిత్వాన్ని వినిపించడానికి తెలుగులో ముందుకు వస్తున్నారు అన్నది అవసరమైన ప్రశ్న. ఒకప్పుడు స్త్రీవాదం కేవలం పితృస్వామ్య భావజాలం పైనే ఎక్కువగా తన గొంతు వినిపించింది. ఇప్పుడు దళిత స్త్రీవాదం వాడ నుంచి ఆధునిక దళిత మహిళల వెతలని రచనల ద్వారా చర్చకు తీసుకొస్తుంది. ముస్లిం బహుజన స్త్రీవాదులు ఈనాడు పితృస్వామ్యం తన ఇంటి నుంచి మొదలుకొని వీధి వరకు ఎలా వేధిస్తుందో తమ సొంత బాణీలోనే వినిపించడం ఒక గొప్ప విషయం. ఆ పై ఒక మార్పు కు కూడా దారిని ఇవ్వడం ఒక విజయం.

ప్రరవే పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రరవే సభ్యులు ఇదివరకు సమర్పించిన వ్యాసాలు పత్రాలు విహంగ వేదికగా మరోసారి ప్రచురింపబడడం, ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవడం మరోసారి చదువుకోవడం అవసరం మరియు మంచి విషయం.

ప్రరవే ఒక సామాజిక, ప్రజా సంఘంగా గుర్తించబడుతున్నా సాహిత్యానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా వ్యాసాలు, కథలు, కొత్త రచయితలను పరిచయం చేయడంలో ముందుంటుంది. ఇప్పటికే ఈ పదేళ్లలో నాణ్యమైన రచనలు ఎన్నో ప్రచురించిన తీరు చూస్తే సాహిత్యాన్ని ఎంత శ్రద్ధగా పఠిస్తుందో ప్రేమిస్తుందో అర్థమవుతుంది.

కథా సాహిత్యంలో మరింత మంది రచయిత్రులు ముందుకు రావాలని, దానికి ప్రరవే తమ వంతు సాయం చేస్తుందని, ఎప్పుడూ ముందు ఉంటుందని గుర్తు చేసుకుందాం.

-మానస ఎండ్లూరి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Comments are closed.