నేనెందుకు రాస్తున్నానంటే.. ?(వ్యాసం )- అమరజ్యోతి (ప్ర ర వే ప్రత్యేక సంచిక )

ప్రతి మనిషిలోనూ గుప్తంగా దాగి ఒక వ్యక్తీకరణ కాంక్ష ఉంటుంది. తనను తాను ఎదుటి మనిషికి చెప్పుకోవాలనీ, ఎదుటి వ్యక్తికి తన హృదయన్నీ, అనుభూతులనూ వినిపించి ప్రతిస్పందనలను పంచుకోవాలనీ ఒక నిరంతర కోరిక అజ్ఞాతంగా లోలోపల మనకు తెలియకుండానే రహస్యమై ఉంటుంది. ఆ అతి సహజ కాంక్షతోనే నేను చిన్నప్పుడు బడికి వెళ్ళి వచ్చేప్పుడూ, లేదా ఆడుకుంటున్నప్పుడూ, ఏదైనా మంచి పుస్తకాన్ని చదివి ప్రభావితమైనప్పుడూ నాలో కలిగే ప్రతిక్రియను మా అమ్మతో, నాన్నతో చెప్పుకుని వాళ్ల మెప్పును పొందాలని తాపత్రయ పడేదాన్ని. ఆ క్రమంలోనే చిన్న చిన్న విషయాలను ముఖతః చెప్పాలని ప్రయత్నించినప్పుడు ఆ అనుభూతులను సరిగా వ్యక్తపర్చలేకపోతున్నానని నాకు తెలిసేది. అప్పుడు ఆ ఫీలింగ్స్ నే కాగితంపై పెట్టి అమ్మకూ, నాన్నకూ చూపించి సంతృప్తిని పొందేదాన్ని. కాగితంపై రాయడమే సరియైన వ్యక్తీకరణ అని ఆ విధంగా నాకు అనుభవం ద్వారా తెలిసొచ్చింది. ఆ రకంగా కాగితంపై రాయడం అనే అభ్యాసం క్రమక్రమంగా పెరిగి సహజంగానే హాస్యప్రియనైన నేను చిన్న చిన్న కార్డు కథలను, ఒక పేజీ కథలనూ రాసేదాన్ని. అది క్రమంగా నాకు తెలియకుండానే ఒక అలవాటుగా మారి నన్నొక చిన్న రచయితగా మారిస్తే ఆ రాసిన దాన్ని పత్రికలకు పంపే ధైర్యాన్నిచింది. హాస్యాన్ని ఇష్టపడ్డం, వీలైతే హాస్యాన్ని రాయడం నాకు ప్రియమైన అంశాలు.

నిజాయితీగా చెప్పాలంటే నిజంగా.. మొట్టమొదట అచ్చులో నా పేరు చూచుకుని మురిసిపోవాలనే ఒక రకమైన దురదతోనే నా రచనా యాత్ర ప్రారంభమైంది. నేను పదవ తరగతి చదువుతూండగా ఒక చిన్న స్థానిక పత్రికలో ఒక ‘ కవిత ‘ ను రాస్తే అది అచ్చయినప్పుడు ముద్రించబడ్డ నా పేరును ఇతరులెవ్వరూ చూడకుండా దొంగచాటుగా తడిమి తడిమి చూచుకుని పొంగిపోయి, పరవశించిపోయి, ఉక్కిరిబిక్కిరైపోయి మైమరచి ఆనందించిన అద్భుత క్షణాలు నాకింకా జ్ఞాపకమే. నేననుకుంటాను నాలాగానే చాలా మంది రచయితలు మొట్టమొదట పత్రికల్లో తన పేరును చూచుకోవాలనే ఒకరకమైన కీర్తి కండూతితోనే కలాన్ని పట్టి అక్షర వ్యవసాయం చేస్తారని నేను బలంగా నమ్ముతాను. ప్రతి మనిషిలోనూ తను జీవిస్తున్న సమాజంలో తన తోటి, సాటి సహ వాసులకన్నా భిన్నంగా తనను తాను ఋజువు పర్చుకుంటూ తనదైన ఒక ప్రత్యేక ప్రజ్ఞతో ప్రజలచేత గుర్తింపబడి గౌరవింపబడాలనే తహతహ అజ్ఞాతంగా ఉంటుంది. ఐతే అది బయటికి ప్రస్ఫుటం కాదు. లోలోపలే మ్రగ్గి మ్రగ్గి అది ఒక రచయితగానో, స్వరం బాగుంటే ఒక గాయనిగానో, లేదా ఒక చిత్రకారిణిగానో,ఒక క్రీడాకారిణిగానో రూపాంతరం చెంది వెలుగులోకి రావాలనే అభినివేశం గుప్తంగా ప్రతి మనిషిలోనూ దాగి ఉంటుంది. ఐతే కాలం గడుస్తూ, వయసు పెరుగుతున్నకొద్దీ అనేకానేక కుటుంబ, వ్యక్తిగత , సామాజిక కారణాల వల్ల వ్యక్తులు క్రమేపీ తమ ఐచ్ఛిక అభిరుచులను త్యాగిస్తూ అతి మామూలు మనుషులుగా జనజీవన స్రవంతిలో కలిసి కొట్టుకుపోతూంటారు.

కొందరు హృదయ నిష్టగల , పట్టుదలగల ,చిత్తశుద్ధి గల వాళ్ళుమాత్రం తమలో ఒక ప్రజ్వలితాగ్నిలా గుప్తమై ఉన్న లక్ష్యాలను ఏ పరిస్థితుల్లోనూ మరిచిపోకుండా జీవితాన్నీ, పరిస్థితులనూ ఎప్పటికప్పుడు అనుకూలంగా మలుచుకుంటూ, సృష్టించుకుంటూ తమ సృజనాత్మక గమ్యం వైపు మాత్రమే అడుగులను సంధించుకుంటూ ప్రజా బాహుళ్యంలో పేరు ప్రతిష్టలనూ, గుర్తింపునూ, గౌరవాన్నీ పొందుతూ విజేతలుగా మిగిలిపోతారు. రచయితలుకూడా అంతే. నడక నేర్చుకునే ప్రతి శిశువూ మొదట తప్పటడుగులూ, తప్పుటడుగులూ వేసి పడిపోతూ మళ్ళీ లేచి నిలబడ్తూ మోకాళ్లను పగులగొట్టుకుంటూ గాయాల మధుర వేదనననుభవిస్తూ, మరకలను మిగుల్చుకుంటూ రాటుతేలి ‘ యుద్ధాలను గెలిచే యోధ ‘ గా మిగిలిపోతారు. అందుకు ఎంతో సంయమనం తో కూడిన అధ్యయనం, సాధన, తపస్సమాన కృషి, ఓటమికి వెరవని కొనసాగింపూ అవసరమౌతాయి.అప్పుడు .. ఆ క్షణం ఒట్టి అచ్చులో తన పేరును చూచుకోవాలన్న దుగ్ధతో మొదలైన బుడి బుడి నడకల ప్రస్థానం నిజమైన ‘ చాలెంజ్ ‘ ను ఎదుర్కుంటూ సాటి రచయితలకంటే విలక్షణమైన తన స్వంత స్వరాన్ని వినిపించే వైయక్తిక ఉనికి కోసం పాటుబడే నిజమైన పోరాటంగా రూపు దిద్దుకుంటుంది. అది నిజమైన యుద్ధరంగ ప్రవేశం.

అందరికంటే భిన్నంగా.. అందరికంటే కొత్తగా, అందరికంటే విలక్షణంగా, అందరికంటే ప్రత్యేకంగా తనను తాను ఋజువు పర్చుకునే అసలు సిసలైన నడక మొదలౌతుంది.అప్పుడు నిజమైన సృజనకారిణికి లేదా సృజనకారునికి కలిగే స్పృహ ఒక ‘ ఎరుక ‘ ను కలిగిస్తుంది. అది,
1) నేను ఏ రకంగా మిగతా రచయితలకన్నా విశిష్టంగా రాస్తున్నాను.
2) శైలి పరంగా, వ్యక్తీకరణ పరంగా , నిర్మాణ పరంగా నేను ఇతరులకన్నా భిన్నంగా కనబడ్తున్నానా లేదా.
3) అది కథైనా, కవితైనా, నవలైనా.. ఎంచుకుంటున్న వస్తువు ఏ రకంగా ప్రత్యేకతను సంతరించుకుంటోంది.
4) నా రచన కేవలం ఉబుసుపోక , కాలక్షేప సాహిత్య చెత్తగా మిగిలిపోతోందా.. లేక ఏదైనా ప్రత్యేక సామాజిక ప్రయోజనాన్ని సాధిస్తోందా.
5) నా రచనలు కాలాన్ని తట్టుకుని సజీవంగా నాల్గు కాలాలపాటు నిలబడి జీవించగల్గుతాయా.
వంటి ఆత్మానుగత స్వయంశోధిత అంతర్మథనం మొదలౌతుంది. అది ఎదుగుతున్న రచయితయొక్క అతి కీలక పరిణామ దశ. ఇక ఈ ఆత్మానుశీలన నుండి రచయిత ఎదిగి వికసించగలిగితే .. ఇక ఆ సృజనకారునికి ఓటమి ఉండదు.

ఈ రకమైన ఆత్మ సమీక్షతో.. నేను తరచి తరచి చూచుకుంటూ.. త్రాడుపై నడుస్తున్నట్టు.. కత్తి అంచుపై పరుగెడుతున్నట్టు నేను ఒక సామాజిక బాధ్యతతో రచనలు చేయడం ప్రారంభించి కొనసాగిస్తున్నాను. ఒక రచయితగా కీర్తి కండూతి స్థితిని జయించి ఒక బాధ్యతగల పౌరురాలిగా నా నిర్ధుష్ట ధర్మాలను నాకు నేను నిర్వచించుకున్నాను.అవి,
1) సమాజ హితంకోరి సృజించబడవలసిన ‘ సాహిత్యం’ సమాజానికి ఏ రకంగానూ హాని కలిగించకుండా,మానవీయ విలువలను ధ్వంసించకుండా ఉండాలి.
2) ఒక పాఠకుడు మన రచనను చదివిన తర్వాత అతనిలో కనీసం ఒక ఆవగింజంతైనా వ్యక్తిత్వ ఉన్నతీకరణ జరగాలి. అది ఒట్టి కాలక్షేప వ్యాపకం కాకూడదు.
3) ఏ కొంచెమైనా పాఠకునిలో ఒక కొత్త ఆలోచననూ, సమాజ శ్రేయస్సును కాంక్షించే చింతననూ ఉద్దీపింపజేసి నిర్మాణాత్మక దిశలో నడిపించేదిగా ఉండాలి.
4) వ్యక్తిలో ఒక నూతన చైతన్యాన్ని నింపుతూ సమాజ , తద్వారా దేశ వికాసానికి రచన దోహదం చేసేదిగా ఉండాలి.
5) ఇంతవరకు ఏ ఇతర రచనాకారుడూ స్పృశించని కొంగ్రొత్త పార్శ్వాలను నేను తడిమి నూతన క్షేత్రాలను కొత్త కోణంలో దర్శింపజేయాలి.

ఇదీ నా దృక్పథం.ఈ దారిలో నేను పయనించడానికి ముందు నన్ను నేను శుద్ధి చేసుకుని పరిశుభ్రపరుచుకున్నాను. అంటే..ఇతరులకు చెప్పడానికి ముందు ఒకటి.. నాకు నేను ఆచరణాత్మక విలువలకు కట్టుబడి జీవించడం నేర్చుకున్నాను.. రెండు.. నాలో అత్యంత ప్రధానమైన ‘ మానవీయ ‘ ధాతువును కాపాడుకుంటూ ఒక కారుణ్య గుణంగల వ్యక్తిగా నిలబడ్డం నేర్చుకున్నాను.. మూడు..సాటి మనుషులను గౌరవిస్తూనే అత్యంత సహజమైన అసూయా ద్వేషాలను జయిస్తూ.. కారుణ్య గుణంతో ‘ సహనాన్ని ‘ అలవర్చుకున్నాను. ప్రజా కళల రంగంలో ఏ కళాకారుడైనా తను ‘ చెప్పింది చేసి చూపి ఆచరించి మార్గదర్శనం చేయాలి ‘ , నాలుగు.. ఇతర సామాన్య పౌరులు చేయలేని, చొరవ చూపలేని సందర్భాల్లో సాంస్కృతిక సారథ్యం వహిస్తూ జనావళికి ముందు వరుసలో నిలబడి పోరాటం చేయగలగాలి. స్థూలంగా ఒక రచయిత అంటే నా దృష్టిలో ఒక సాంస్కృతిక సేనాని.. ప్రజల గొంతుక.. జనం చేతిలో జ్వలించే కాగడా…చీకటిలో మ్రగ్గుతున్న దీనజనానికి ఒక ధగధగ మెరిసే ‘ కరదీపిక ‘. రాసి చెప్పి.. చెప్పింది చేసి చూపి.. చూపినదాన్ని జీవిస్తూ ఆచరించి ..సాహిత్యమంటే.. ఒట్టి ‘ థియరీ ‘ కాదనీ.. మనుషులను చైతన్యవంతులను చేయడానికి నిర్వహించే నిరంతర ‘ ప్రాక్టికల్ ‘ ఆచరణ అనీ నేను అత్యంత బలంగా నమ్ముతూ..రాస్తున్నాను..ఇంకా రాస్తాను.. రాస్తున్నది తక్కువే ఐనా నిబద్ధతతో.. నిలకడగా.. మానవీయ సౌరభంతో ఇంకా రాస్తూనే ఉంటాను.

పెద్దలైన సాటి రచయితల సహకారాన్నీ, సలహాలనూ ఎప్పుడూ ఆకాంక్షిస్తూంటాను.
సెలవు.

– అమరజ్యోతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)