మందాకిని త్రైమాశిక వ్రాతపత్రిక ఎడిటర్ జ్ఞానప్రసూన గారి తో మాలాకుమార్ ముఖాముఖి

మాలా కుమార్

అరవైలల్లో ఇరవై వచ్చేనా ? అంటే ఉల్లాసంగా ఉత్సాహం గా ఉండేందుకు వయసు అడ్డుకాదు, అరవైలల్లో ఇరవై ఏమిటి పదహారూ వస్తాయి అనిపిస్తుంది శ్రీమతి.జ్ఞాప్రసూనగారిని చూస్తే.చేతివ్రాతతో త్రైమాశిక పత్రిక, అదీ పత్రిక మొత్తం ఒకటే చేతి వ్రాతతో ఉండాలని ఆవిడే స్వయంగా అన్ని ఆర్టికల్స్ చేత్తో రాసి నడుపుతారంటే చాలా గ్రేట్.పత్రికా ఎడిటర్, రచయిత్రి, బొమ్మలు చేస్తారు, వేస్తారు ( సిరి ఇన్స్టిట్యూషన్ లో చేరి పేంటింగ్స్ నేర్చుకున్నారు.) ,ఎంబ్రాయిడరీ చేస్తారు.ఒకటేమిటి ఆవిడకు రాని విద్య లేదు. వారి ఇల్లు కళాత్మకంగా ఉంటుంది.అంతటి ప్రతిభాశాలి గురించి ఉడతాభక్తి గా ఈ ముఖాముఖి.

ప్రశ్న . !  నమస్కారమండి జ్ఞాప్రసూనగారు.మీ ముఖా ముఖి లో మొదటి ప్రశ్న.మీకు సాహిత్యాభిలాష ఎలా కలిగింది?

మానాన్నగారు  కళాప్రపూర్ణ రావూరు వేంకట సత్యనారాయణరావు గారు నేనుపుట్టిన సంవత్సరమే “కృష్ణాపత్రికలో చేరారు. ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణాపత్రిక సంపాదకులుగా ఉండేవారు. మానాన్నగారు చిన్నప్పటినుంచే కవిత్వం వ్రాసేవారట. కృష్ణాపత్రికలో చేరాక మానాన్నగారి రచనా స్రవంతి బహుముఖాలుగా ప్రవహించింది. 

              మాచిన్నతనంలో ఆడపిల్లల్ని బడికి చదువుకోసం పంపేవారు కాదు.నేను ఇంట్లోనే తెలుగు అక్షరాలు ,  చదవను ,వ్రాయను నేర్చుకున్నాను. మేము బందరులో ఖొజ్జిల్లిపేటలో అద్దెకి ఉండేవాళ్ళం. పక్కభాగం లో స్కూల్ హెడ్మిస్ట్రేస్ ఉండేవారు ఆమె మానాన్నకి నచ్చ చెప్పి స్కూల్ కి తీసుకెళ్లారు. నన్ను రెండవ క్లాస్ లో చేర్చుకున్నారు. రెండవ తరగతి లో మంచి మార్కులు వచ్చాయని,నాలుగవ తరగతిలోకి ప్రమోషన్ చేశారు. అప్పుడు మేము ఇల్లు మారి  చెమ్మన గిరి పేట వచ్చాము . అక్కడ స్కూల్ లో నాలుగవ తరగతి చదివాను మంచి మార్కులు వచ్చాయి ఆరో  తరగతి కి ప్రమోషన్ ఇచ్చారు పది ఏళ్ళు వచ్చాయి ఇంక చదువు మానెయ్యి అని తాతగారు ,నాన్నగారు గొడవ చేశారు. నేను పుస్తకాలు పట్టుకొని రోడ్డుమీద నడిచి వెళ్లడం పరువు తక్కువగా భావించారు.మొత్తానికి నాచదువుకి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసారు. మానాన్నగారికి నేను ఏకైక  సంతానం . నాతొ ఆడవాళ్లు ఎవరు వుండేవాళ్ళుకారు. ఇక పుస్తకాలు పేపర్లే నాకు స్నేహితులు. సోదర సోదరీ మణులు అయ్యాయి. కృష్ణాపత్రిక ఆఫీసుకు చాలా పుస్తకాలు ,పేపర్లు వచ్ఛేవి సమీక్ష కోసం నవలలు, కవితా సంపుటాలు, వ్యాససంపుటాలు వచ్చేవి. .నాన్నగారు చదువుకోటానికి ఇంటికి తెచ్చేవారు అవన్నీ చదివేదాన్ని. మా నాన్నగారు కృష్ణాపత్రికలో వారానికి పది పదిహేను పేజీలు వ్రాసేవారు. వారం వారం వడగళ్ళు అనే హాస్య ,వ్యంగ వ్యాసాలూ వ్రాసేవారు. ఎడమ చేతిలో కాఫీ కప్పు,  కుడిచేతిలో కలం పట్టుకు ,సిగరెట్లు   దగ్గర పెట్టుకొని పొద్దున్నే వ్రాయడం మొదలెట్టేవారు. మేటర్ కాగితాలని సన్నగా పొడుగ్గా గోధుమ రంగులో వుండే పుస్తకాలపై వ్రాసేవారు. నేను ఆయన పక్కనే  కూర్చునేదాన్ని. ఒక పేజీ వ్రాయగానే  చించి  నా ఒళ్ళో పడేసేవారు ,చదివేదాన్ని. వ్రాయడం పూర్తి కాగానే మా అమ్మని పిలిచి కూర్చో పెట్టి మొత్తం చదవ మనేవారు చదివేదాన్ని. మానాన్నగారు రచనలకి మా అమ్మా,నేనే మొదటి పాఠకులం రచన కంపోజ్ అయ్యాక ప్రూఫులు దిద్దటానికి ఇంటికి తెచ్చుకొనేవారు .అవి  దిద్దాక  మళ్ళీ చదవమనేవారు. తరవాత పది పన్నెండు పేజీలు ఫారాలుగా వచ్చ్చేవి ఆపై బొమ్మలతో అందంగా పత్రిక వచ్ఛేది. మళ్లీచదివేదాన్ని. మా ఇంటికి సాహిత్యాభిమానులు వస్తూ ఉండేవారు అప్పుడు మానాన్నగారు నన్ను ఆ   రచనలు వారికి చదివి వినిపించ మనేవారు   ఇలా నా కాలక్షేపమంతా అక్షరాలతోనే ! పచారీ కొట్టు నుంచి సరుకులు తెస్తే అవి డబ్బాల్లో పోస్తూ పొట్లాలు కట్టిన కాగితాలన్నీ చదివేదాన్ని. ఇదీ మా  ఇంటి వాతావరణం. మరో వ్యాపకమే లేదు. జీన్స్ ద్వారా కూడా సాహిత్యాభిలాష వఛ్చి ఉంటుంది.  చాలా చిన్నప్పుడే నాలుగు పంక్తులు రాశాను.

“సూర్యుడు వచ్చాడు

వెలుగు వచ్చింది

లాంతరు వెలుగు

వెలాతెలా పోయింది.”

మా అమ్మగారు బలహీనంగా,సన్నగా ఉండటం తో సహాయము చేసేదానిని.పనులు అలవాటయ్యాయి.కాని సాహిత్యం మీద రుచి తరగలేదు.అలా సాహిత్యం నన్నాకట్టుకుంది.

2ప్ర;మీరు పత్రిక ప్రారంభించాలని ఎందుకు అనుకున్నారు?

జవాబు; అప్పుడప్పుడు రచనలు చేయటం,రేడియో ప్రసంగాలు ఇవ్వటం జరుగుతూ ఉండేవి.బతుకు బండి గతుకు దారుల్లో చాలా దూరం ప్రయాణం జరిగాక,డిల్లీ లో మజిలీ.ఎన్నో బాషలవారు,ఎంతో మంది కళాకారులు ఎన్నో రకాల కార్యక్రమాలు జరుపుతూ ఉండేవారు.మా ఇల్లు గెస్ట్ హౌస్ లా ఉండి,రెండు పెట్టెలు వెడితే, మూడు పెట్టెలు వస్తూ ఉండేవి.భాషా సేవ చేయలేక పోతున్నానే బెంగ ఉండేది.నలుగురు రచయతలను కలవాలని,వారి రచనలు చదవాలని ఆశగా ఉండేది.అప్పుడు ఆత్మ సంతృప్తి కోసం చిన్న పత్రిక ప్రారంభించాలనిపించింది.పత్రిక ప్రింట్ చేయించటం అలవి కాని పని.ఎందుకంటే మా వారికి అంకెల మీద ప్రేమ కాని అక్షరాల మీద ఉండేది కాదు.పత్రిక కి “మందాకిని” అని పేరు పెట్టుకున్నాము.అన్నం సుబ్బారావు గారి అమ్మాయి చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉండేది.మందాకిని అట్ట మీద బొమ్మ వేసిపెట్టింది.నాన్నగారు “భావ కుటీరం”అనే సంస్థ స్థాపించి సభలు,సన్మానాలు, పుస్తక ప్రచురణలు చేసేవారు.ఈ పత్రిక ఆ సంస్థ లా పేరు తేవాలని “భావ కుటీరం ప్రచురణలు” అని పెట్టాను.

3ప్ర.మీ పత్రిక కు మందాకి ని అని పేరు ఎందుకు పెడుదామనుకున్నారు?

జ;విభవనామ సంవత్సరం,పుష్యమాసం,ఉత్తరాయణ పుణ్యకాలం,మకర సంక్రాంతి,15-1-1989 నాడు ” మందాకిని ” పుట్టింది.మందాకిని అమరవాహిని.సాహిత్యమూ అజరామంగా పయనిస్తూనే ఉంది.లయలు చిందిస్తూ, హొయలు ఒలికిస్తూ,నురుగు గజ్జల తో క్రెళ్ళురుకుతూ,కవ్విస్తూ, నవ్విస్తూ సాహిత్యం కూడా మందాకిని లా మన భరత భూమి పై ప్రవహిస్తూనే ఉంది.ప్రవహిస్తుంది.అలాగే చైతన్యం తో ముందుకు సాగాలని”మందాకిని ” అని పేరు పెట్టాను.అమ్మ మీద ఒక సంచిక, నాన్నగారి రచనలతో ఒక సంచిక తెచ్చాను.

4ప్ర.మీ పత్రికలో ఎటువంటు రచనలకు ప్రధాన్యం ఇస్తారు?

జ;ఇటువంటి రచనలే కావాలి అనే షరతులు ఏమీ లేవు.హాస్యానికి పెద్ద పీట.కథ,వ్యాసం, కవిత ఏవైనా సరే!స్త్రీల రచనలే కాదు అందరివీ ప్రచురుస్తాము.బాష,భావము బాగుంటే చాలు.మా మందాకిని “అకులందున అణిగి మణి “వంటి పత్రిక.అబిమానులు రచనలు పంపి సహకరిస్తున్నారు.కృతజ్ఞతలు.ప్రమదావనం లో ఫలానా రోజుకు  రచనలు అందజేయండి అంటే , పంపిస్తున్నారు.ఈ తరం వారికి పాత రచయతల రచనలు తెలియవు.వారికి ఆ రచనలని,కవులని పరిచయం చేయాలని వారి రచనలను పునఃప్రచురిస్తున్నాను.కాలం ఎప్పటికీ పాతకొత్తల మేలు కలయిక కదా!డిల్లీ లో ఉండగా శ్రీమతి.భావరాజు వరలక్ష్మి గారు ఒక నవల పంపారు.కనీసం ఇది పూర్తయ్యేదాకన్నా పత్రిక నడపాలని అనుకున్నాను.అలాగే నవల పూర్తిగా వేసాను.కొత్త రచయతలకి మందాకిని లో ప్రత్యేక స్థానం.

5ప్ర పత్రిక, అందులోనూ వ్రాత పత్రిక ఎడిటర్ గా మీ అనుభవాలేమిటి?

జ;వ్రాత పత్రికైనా, అచ్చు పత్రికైనా పత్రిక నడపటం కత్తి మీద సాము లాంటిది.ఆర్ధిక స్థోమత గోడలాగా ఆసరా లేక పోతే అచ్చు పత్రిక నడపటం అసంభవమే.వ్రాత పత్రికైతే సూక్షం లో మోక్షం లా సాగించవచ్చు.జిరాక్స్ చేయించాలంటే వెళ్ళి షాప్ లో కూర్చొని పని చేయించుకొని రావాలి.కూర్చునేందుకు కుర్చీ కూడా ఉండదు.మధ్యలో విధ్యార్ధులు నోట్స్ రాసుకోవటం మానేసి, వందల పేజీలి జెరాక్స్ చేయించుకునేందుకు వస్తారు.మనలని కూర్చోబెట్టి వాళ్ళ పని చేస్తారు.పత్రిక రంగు రంగు బొమ్మలతో అందంగా వేద్దామంటే ఖరీదు ఎక్కువ అడుగుతారు.రంగు అట్ట వేస్తే అదీ ఖరీదే!రెండు మూడు రంగుల బొమ్మలు వేయాలన్నా మరింత.సాదా సీదాగా వేసినా అక్షరాలు స్పష్టంగా వస్తున్నాయో లేవో చూసుకోవాలి.పేజీ పైనా అక్షరాలు సగం తెగిపోయి,పేజీ కింద చోటు ఎక్కువ మిగిలిపోకుండా చూసుకోవాలి.పేజీ నంబర్ల ప్రకారం పిన్ చేస్తున్నారా లేదా చూసుకోవాలి.ఇష్టమైన పని కష్టం అనిపించదు కదా!

రచనలు మేము అడిగిన తేదీకి పంపుతే సులువుగా ఉంటుంది.చివరి క్షణం లో వస్తే ఉక్కిరి బిక్కిరి గా ఉంటుంది.రచన కొంచం అందంగా, స్పష్ఠంగా ఉన్న అక్షరాలతో రాసి పంపుతే బాగుంటుంది.ఈమైయిల్ లో వస్తే బాగానే ఉంటాయి.అన్నింటి కంటే కష్టం ఖాళీలు నింపటం.ఒక కథ, వ్యాసమో పూర్తిగా వ్రాసాక కొంత మేర పేజీ లో ఖాళీ మిగిలిపోతుంది.అది అలా వదిలేయటం ఇష్టం ఉండదు.ఒక సూక్తి, ఒక ఘటన,ఒక చమత్కారం,ఒక కవిత,ఒక పద్యం వెతికి రాసి ఖాళీ నింపాలి.దీని కోసం రెండు రోజులు పని ఆలశ్యం అవుతుంది.పత్రిక అంతా ఒకే దస్తూరీలో ఉంటే బాగుంటుందని రచనలన్నీ నేనే తిరిగి వ్రాస్తాను.రచయతల కి పారితోషకం ఇవ్వలేకపోయినా ఆప్యాయంగా రచయతలు రచనలు పంపుతున్నారు.ధన్యవాదాలు.

పత్రికలో రచనలు చేసిన వారికి మందాకిని ఒక చిరు కానుకలా అందజేస్తాం. మందాకిని అవిష్కరించే రోజున,రచయతలను,భాషాభిమానులను ఆహ్వానించి మా ఇంట్లోనే చిన్న సమావేశం జరిపిస్తాము.అప్పుడు రచయతలు తమ రచనను చదివి వినిపిస్తారు.ఇలా చేయడం వల్ల తమ రచనలను విన్న శ్త్రోతల మొహం లో కనిపించే ఆనందం, హావభావాలు రచయత చూసి ఆనందించవచ్చు.వహ్వా లు వింటారు.అభినందనలు అందుకుంటారు.రచయతకు ఇంతకు మించి ఆనందం ఏమి ఉంటుంది.రచయతలకు కాపీలు అందించేది ఒక భాద్యత.

6ప్ర.జ్ఞాప్రసూనగారూ, మీరు చెప్పింది నిజమే, తన రచనను సొంతం గా చదివి విపించటం ఒక మంచి అనుభూతి. అది విన్న శ్రోతల మొహాలల్లోని ఆనందాన్ని గమించటం, వారి నుంచి అభినందనలు పొదటం చాలా గొప్ప సంతృప్తిని ఇస్తుంది.మీరు పత్రిక నడపటమే కాకుండా ఏమైనా రచనలు కూడా చేసారా?

జ; నేను,ఉంగుటూరి శ్రీలక్ష్మి కలిసి ఆంధ్రప్రభలో ‘ చిన్న మాట ‘ అనే కాలం వ్రాసి,తరువాత “మాటల పందిరి ” అనే పుస్తకం గా అచ్చు వేసాము.చెదురు మదురు గా కథలు, వ్యాసాలు,కవితలు,ఆశీర్వాదాలు, అభినందనలు వ్రాసాను. వై.జయలక్ష్మి నేను కలిసి రెండు నవలలు హిందీ నుంచి అనువాదం చేసాము. ‘ వెన్నెల లేని పున్నమి ‘ అని ఒక నవలను అనువాదం చేసాను.బెజవాడ లో ఒక పత్రిక లో పడింది.కాని దాన్ని దాచుకోవటం నాకు తెలియలేదు.ఒక నవల సొంతంగా రాసాను కాని ఇంకా బయట పెట్టలేదు ధైర్యం లేక.సత్యనారాయణ వ్రత కథ  పాటగా వ్రాశాను.మూడు సార్లు ముద్రించాము.కంప్యూటర్ దండకం వ్రాశాను.దైవం మాస పత్రిక లో కొన్ని ఏళ్ళుగా అనువాదాలు చేస్తున్నాను.హరి ద్వార్ లోని శాంతి కుంజ్ వారి ‘ యుగ శక్తి గాయత్రి ‘ అనే పత్రిక లో చాలా అనువాదాలు చేసాను.మైథిలీ శరణ్ గుప్త గారి ‘ విష్ణు ప్రియ ‘ అనువాదం చేసాను.అది వెలుగులోకి రావాలి.అవకాశం వచ్చినప్పుడు వ్రాయటం – కొండచిలువ మనస్తత్వం 🙂 చాలా మంది బోలెడు రచనలు చేస్తున్నారు, అవి చదువుకుంటే పోలా! మనం ఎందుకు వ్రాయటం అని ఓ నిర్లిప్తత !

7 ప్ర; మీ లాంటి రచయతలు అలా అనుకుంటే ఎలా? మీరు ఇంకా బోలెడు వ్రాయాలి.సాహిత్యం లో కాక ఇంకా మీ అభిరుచులు ఏమిటి?

జ;అబ్బో – చాలానే ఉన్నాయి.నార్ల వారు సంపాదకులుగా ఉన్నప్పుడు వారి పత్రిక లో పని చేయాలని కోరికగా ఉండేది.శాంతి నికేతనం ఠాగూర్ వారి విధ్యాలయం లో చదవాలని కోరికగా ఉండేది.రెండూ నెరవేరలేదు.ఇంక కాస్త సాగిన హాబీలు వీణ వాయించడం, బొమ్మలు వేయడం,గృహాలంకరణ,అల్లికలు,పనికి రావనుకున్న వస్తువులతో బొమ్మలు – వస్తువులు తయారు చేయటం,పిల్లలకు చదువు చెప్పటం, అమ్మాయిలకి జడలు వేయటం,మా కృష్ణయ్యని సింగారించటం,పూసల తో దండలు, థర్మాకోల్ తో దండలు, శాటిన్ రిబ్బన్ తో దండలు చేయటం. నేను కర్మయోగిని.క్షణాలని ఖాళీ గా కాక పనులతో నింపాలని ఆశయం.

సిరి ఆర్ట్ ఎకాడమీ లో ఆయిల్ పేంటింగ్స్ నేర్చుకున్నాను.సీనియర్ సిటిజన్స్ వేసిన చిత్రాలు మెరిగియన్ హోటల్ లో ఎగ్జిబిషన్ పెట్టారు.నే వేసిన చిత్రం కూడా పెట్టారు.కోనసీమ చిత్రకళా పరిషత్ వారు నా చిత్రానికి జ్యూరీ ఎవార్డ్ ఇచ్చారు.అక్కడ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు.ఈ రెండు సంఘటనలూ నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి.

కంప్యూటర్ నేర్చుకోవటం నా జీవితానికో మలుపు.మా అబ్బాయి దగ్గరికి విదేశాలకి వెళ్ళినప్పుడు మా పిల్లలు డెస్క్ టాప్, లాప్ టాప్ వాడుతుంటే ఆశ్చర్యంగా ఉండేది.ఒకళ్ళు అందులోనే బాంక్ పనులు చేసుకుంటే, ఒకళ్ళు అందులోనే ఉత్తరాలు రాస్తుంటే,ఒకళ్ళు అందులో పాటలు వింటుంటే నమ్మశక్యం కాలేదు.మా కోడలు, మనవళ్ళు అ ఆ లు నేర్పారు.ఇక నిరంతర సాధన.మా పెద్దబ్బాయి లాప్ టాప్ కొని వళ్ళో పెట్టాడు!అమ్మో నేనేం చేస్తాను అనుకొన్నా.కాని కంప్యూటర్ తో ప్రేమ, అనుబంధం పెరిగిపోయాయి.మా చిన్నబ్బాయి స్నేహితుడు నన్ను కంప్యూటర్ లో బ్లాగ్ వ్రాయమని చాలా ప్రొత్సాహం చేసి, బ్లాగ్ తయారు చేసి ఇచ్చారు.తెలుగు బాషని ఇంగ్లీష్ లిపి లో వ్రాసేదానిని.తెలుగు లో ఎలా వ్రాయాలి తెలియదు.కనిపించిన వాళ్ళనల్లా కంప్యూటర్ గురించి కనుక్కోవటమే.అనుభవజ్ఞుల సలహాలతో లేఖిని లో వ్రాయటం నేర్చుకున్నాను.ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత గొప్పగా అనిపించింది.కాని లేఖిని నన్నెంత ఏడ్పించిందో! ఒక వాక్యం వ్రాయటం , ఎదో క్లిక్ చేయటం అది డిలీట్ ఐపోవటం.వ్రాసినది పోస్ట్ చేసేదాకా ఒకటే ఖంగారు. every day suruchi.blog spot.com  అని ఒక బ్లాగ్.అందులో నిత్య జీవితం లో సంఘటనలు,సరదాలు వ్రాసేదానిని.gudigantalu.blogspot,comఅని ఒక దాంట్లో అధ్యాత్మికమైన సంగతులు,సూక్తులు,స్తోత్రాలు,పద్యాలు. అలా మరొకటి ravururachanalu.blogspot,comఅందులో అన్ని నాన్నగారి రచనలు రాస్తాను.

8ప్ర;బాగుందండి.మీ అనుభవం తో , కొత్త రచయతలకు మీరేమి సలహా ఇస్తారు?

జ;రచయతలకున్న శక్తి అపారం.రచయతకున్న భాద్యత ప్రజల్ని మేల్కొల్పడమే.కొత రచయతలు వర్ధిల్లాలి.భాషకీ, భావానికీ,రచనలో ఒక సందేశం ఇవ్వటానికి రచనలు చేయాలి.నవీన ఉపకరణాల మోజులో పడి యువతలో సృజనాత్మక శక్తి అణిగిపోతున్నది.దాన్ని పరిరక్షించుకోవాలి.మానవత్వమే మతం అన్నది చాటి చెప్పాలి.ఏదో వ్రాయాలని వ్రాయటం కాక భావావేశం మదిలో పొంగినప్పుడే కలం పట్టి రచన చేయాలి.పక్క మనిషిని మనిషిగా చూడగలిగే సమానత్వం పెంచుకోవడమే మానవ కళ్యాణం అనే సందేశం అందించాలి, అనుసరించాలి.

సోత్కర్ష ఎక్కువైపోయింది 🙂 నా చేత ఇన్ని కబుర్లు చెప్పించినందుకు ధన్యవాదాలు.

నేను; అయ్యో సోత్కర్ష ఏమీ లేదండి.బోలెడు మాకు పనికి వచ్చే విశేషాలు చెప్పారు.మీరు ఇంకా చెప్పినా వింటాను.ఇంత ఓపికగా ఇంతసేపు మీ సమయాన్ని నాకోసం వెచ్చించినందుకు ధన్యాదములు.

మందాకిని పత్రిక ఎడిటర్, రచయిత్రి,కవియిత్రి, కళాకారిణి ఐన శ్రీమతి.జ్ఞానప్రసూనగారి తో మాట్లాడటము ఒక ఎడ్యుకేషన్.జ్ఞానప్రసూనగారిని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే!

ముఖాముఖిPermalink

Comments are closed.