
కె.వరలక్ష్మి
కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది . నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని . పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని . ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని . ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు తనకి వచ్చిందని , సెలవుల నాటికి వేరే ఇల్లు చూసుకోమని చెప్పేడు . నాకు ఒక్కసారిగా గుండెల్లో రాయిపడింది .స్కూలు కోసం కాబట్టి పెద్ద ఇల్లు కావాలి . ఎక్కడ దొరుకుతుంది వెతకడం మొదలైంది .
1980 ఫిభ్రవరిలో అని గుర్తు . సంపూర్ణ సూర్య గ్రహణం వచ్చింది . రేడియోలో , పేపర్లలో ఒకటే హెచ్చరికలు . ఎవరూ గ్రహణాన్ని చూడొద్దనీ భయపెట్టేసేరు . గ్రహణం మాటేమోగాని , ఆ సందర్భంగా పక్షులలో , జీవుల్లో కన్పించిన అలజడి మరచిపోలేనిది . మధ్యాహ్నం రెండు గంటల వేళ గ్రహణం పూర్తిగా పట్టి సంధ్య వేళలాగ చీకట్లు అలుముకున్నాయి . కొంగల రావి చెట్టు మీది పక్షులన్నీ తమతమ గూళ్ళకి తిరిగి వచ్చేసాయి . కుక్కలా అరుపులు , పిల్లులు పరుగులు చిత్రమైన వాతావరణం ఏర్పడింది . రావి చెట్టు మీది ఉడత ఒకటి కంగారుగా పరుగెత్తుకొచ్చి మా ఇంగ్లీష్ టీచర్ రూం లో మంచం కింద దాక్కుంది . ఆవిడ ప్రేమగా దాన్ని చేతుల్లోకి తీసుకోబోతే చేతుల్నిండా రక్తాలొచ్చేలా రక్కి పెట్టింది . ఆ గ్రహాణాన్ని చూడడం అద్భుతమైన అనుభవం . అంతవరకూ పాక్షిక గ్రహణాలే కాని సంపూర్ణ గ్రహణం చూడడం అదే మొదటి సారి నాకు .
అప్పుడప్పుడే ఊళ్లోకి టి .వి లు రావడం మొదలైంది . నలుపు తెలుపులు టీ .వీ లు , అయ్యారుగారింట్లో ఒకటి , బొండా రాజులు గారింట్లో ఒకటి ఉన్నాయని తెలిసి ఓ రోజక్కడికి , ఓ రోజిక్కడికి వెళ్లి అసలు టి .వి ఎలా ఉంటుందో చూసొచ్చాం . రెండు చోట్లా క్రికెట్ మేచ్ నే పెట్టేరు .
కొంగలరావి చెట్టుకి ఆనుకుని దక్షిణం వైపు ఇంట్లో మేమున్నాం . ఉత్తరం వైపు కుప్పయాచార్యుల వారి పెద్ద మండువా లోగిలి ఉంది .ఆచార్యుల కుటుంబం హైదరాబాద్ వెళ్లిపోయాక ఆ ఇంట్లో తాళ్లూరు మాస్టారు అనే ఎలిమెంటరీ స్కూలు మాస్టారి కుటుంబం ఉంటోంది . ఆ కుటుంబం ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయేరు . ఇంటి బాగోగులు చూసే వాళ్లు లేక ఇల్లు . ఎదురింటి వాళ్ల దగ్గర తాళం తీసుకుని ఇత్తడి బుడిపెలు తాపిన యా పెద్ద సింహ ద్వారం తెరుస్తూంటే ఏదో పులకింత . భక్తితో ఆ పెద్ద గడపకు నమస్కరించి కుడికాలు లోపల పెట్టేను . మండువా చుట్టూ ఆరు పెద్ద పెద్ద గదులు . ఆగ్నేయం మూలలో బైటి నుంచి ఉన్న మెట్లక్కి వెళ్తే మెడ మీది గది . ఇల్లు ఏనాటిదో కావడం , వెదురు గదల మీద సీమ సున్నం మెత్తి కట్టిన మిద్దె కావడం వలన గదిలో అడుగు పెడితే కింది నేల ఊగుతోంది . గది ముందు రెండు మంచాలు పట్టేటంత డాబా . గదిపైకి మెట్లెక్కి వెళ్తే పెద్ద డాబా . పాత కాలం నాటి మట్టి కూజాల డిజైన్ తో రెయిలింగ్ . ఇల్లు మొత్తం గానుగ సున్నంతో కట్టిన బారెడు వెడల్పు గోడలు . వాడుక నీళ్ల కోసం ఈశాన్యం వైపు నుయ్యి . నూతి పక్కన దొడ్డి గుమ్మం . సింహ ద్వారం , దొడ్డి గుమ్మం రోడ్డు నానుకుని ఉన్నాయి . ఇంటికి ఉత్తరం వైపు , పశ్చిమం వైపు పెద్దవి , దక్షిణం వైపు సన్ననిది పెరళ్ళు . పశ్చిమ పెరట్లో ఏనాటిదో పెద్ద బాదం చెట్టు . ఇంటికి ముఖ్యమైన బాత్ రూము , పాయికానా లేవు . చాలా ఎత్తైన ప్రహారీ గోడలు కావడం వల్ల నూతి చప్టా మీదే స్నానాలు చేసే వారేమో . నా చిన్నప్పుడు ఆ ఇంటికి దక్షిణం వైపు ఉండే పశువులశాలను ఆనుకుని పాయికానా ఉండేదేమో ! ఆ స్థలాన్ని విడదీసి ఎవరికో అమ్మెయ్యడం వాళ్ల దాంట్లో వాళ్లు వరస గదులు కట్టి అద్దెల కిచ్చేసుకున్నారు . ఆ అరుగుల మీదే అమ్మలక్కలు తీరికగా కూర్చుని అందర్నీ కామెంట్స్ చేసే వాళ్లు .
ఇక గదుల్లో , మండువా హాల్లో దుమ్ము , ధూళి , ఎండు టాకులు నిండిపోయి ఉన్నాయి . అద్దె అరవయ్యే కాని , ఇంటిని మాత్రం మమ్మల్నే శుభ్రం చేసుకోమన్నారు . సెలవులిచ్చాక ఆయా , నేనూ కలిసి ఆ ఇంటిని శుభ్రం చెయ్యడానికి ఇరవై రోజులు పట్టింది . రోజుకి కొన్ని బళ్ల ఆకులయ్యేవి . అలా శుభ్రం చేస్తున్నప్పుడే మెట్ల పక్కనున్న మామిడి చెట్టు ఆకుల్లోంచి కందిరీగో , తెనేటీగో వచ్చి నాకుడి చెవి పక్క బుగ్గమీద కుట్టేసింది . అది క్రమంగా కిలాయిడ్ గా మారి ఇప్పటికీ బాధిస్తోంది . నూతి దగ్గర రాతి గోలెం ఉంది . దాన్ని కదిలిస్తే కింద బోలెడన్ని పాము పిల్లలున్నాయి .
సెలవులు ముగిసేక స్కూల్ ఓపెన్ కుప్పయ్య గారింట్లోనే చేసేం. సింహ ద్వారం పక్కన ఆగ్నేయ మూలలో ఉన్న మొదటి గదిని
ఆంగ్లో ఇండియన్ టీచర్ యిచ్చేం . దాని పక్కనున్న రెండో గదిలో మా మంచం , బీరువా పెట్టుకున్నాం . ఈ రోజుల్లో బొగ్గుల పొయ్యిలు , కొరోసిన్ స్టవ్వులూ కాబట్టి స్కూలు పిల్లలు రాకముందు ఉదయాన్నే మండువాలో వంట కానిచ్చేసేదాన్ని . వేడి నీళ్ళకి నూతి పక్కనే కర్రల పొయ్యి . ఉత్తరం వైపు ఒక చిత్రమైన గది ఉండేది . ఆ గదిలోకి ఎటునుంచి రావాలన్నా రెండు మెట్లు ఎక్కిరావాలి . ఆ గదికి పెరటి వైపు ఓ పెద్ద సైజు కిటికీ అంత గుమ్మం ఉండేది . మరీ చిన్న పిల్లలు తప్ప ఆ గుమ్మంలోంచి నడవలేరు . ఆ గదిలో మా డైనింగ్ టేబుల్ వేసుకున్నాం . ఏ గదికీ కిటికీలు లేవు . పడమటి వైపు పొడవైన గది స్నానాల నది .పడమటి పెరట్లో దూరంగా తాటాకుల దడి కట్టించి పాయికా నాగా వాడే వాళ్లం . స్నానాల గది స్కూల్ టైం కి క్లాస్ రూం గా మారి పోయేది . మండువాలో సింహ ద్వారం దగ్గర నా ఆఫీస్ రూం టేబుల్ , కుర్చీ ఉండేది . మండువాలోనే ఐదారు క్లాసులు నడిచేవి . ఆ సంవత్సరం చాలా మంది పిల్లలు జాయినయ్యారు . చుట్టూ పక్కల పల్లెటూళ్ళ పిల్లల్ని రిక్షాల్లో పంపించే వారు .
అనుకోకుండా హరిజనపేట నుంచి నడుం వంగి పోయిన ఓ పెద్దాయన వచ్చి తనకేదైనా పని ఉంటే ఇమ్మని అడిగేడు . అతను చంద్రం పాలెంలో కృష్ణ శాస్త్రి గారి పొలాల్లో పని చేసే వాడట యువకుడిగా ఉన్నప్పుడు , తోటమాలిగా చేరెడు . ఎక్కడా ఒక్క ఎండుటాకైనా లేకుండా పెరడంతా శుభ్రం చేసేవాడు . యిక్కడే తిని ఏదో ఓ గదిలో పడుకునేవాడు . ఆదివారం మాత్రం కూతురింటి కెళ్లి సోమవారం ఉదయం వచ్చేవాడు . గదులు తుడవడం , మంచి నీళ్ళు తేవడం , పిల్లల భోజనాల దగ్గర ఉండడం ఆయా చేసేది . ఒకో క్లాసుకీ ఇరవై లేదా పాతిక మంది పిల్లలు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడేదాన్ని , బాదం చెట్టు నీడలో కూడా కొన్ని క్లాసులు నడిచేవి .
ఇక మెడ గది విషయానికొస్తే అక్కడొక ఇక్ష్వాకుల కాలం నాటి పెద్ద టేబులు , దాని మీద చెదలు పట్టి పేజీలు ఊడిపోయిన కొన్ని తమిళ గ్రంధాలు , 19 వ శతాబ్దం (1860 మొదలు) లోని గొలుసు కట్టు తెలుగు ఉత్తరాలు ఉండేవి . నేల ఊగుతూండడం వాళ్ల మా పిల్లల్ని ఆ గదిలోకి వెళ్ళకుండా చూసేదాన్ని . కొంత అలవాటయ్యేక సాయంకాలమైతే చాలు పిల్లలూ నేనూ అక్కడే ఉండేవాళ్లం . ఎంత శుభ్రం చేసినా ఏదో ఒక మూల తేళ్ళో , జెర్రులో కన్పిస్తూండేవి . ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు మా గీతను తేలు కుట్టేసింది . చిన్నపిల్ల , తట్టుకోలేక రాత్రంతా ఏడుస్తూనే ఉంది . మోహన్ తనని భుజం మీద వేసుకుని తేలు మంత్రం వేసే మాస్టారింటికి పరుగెత్తేడు . నేను ఉల్లిపాయ చితక్కొట్టి పట్టు వేస్తే , మోహన్ సైకిల్ డైనమో కరెంటు పెట్టేడు . ఇంకెవరో పాము మణి తెచ్చి కాటుమీద పెట్టేరు . ఎన్ని చేసినా తెల్ల వార్లూ నొప్పితో బాధ పడింది .
గీత పదేళ్ల వయసు నాటికే సైకిల్ నేర్చుకుని బైటి పనులన్నీ చేసుకొచ్చేది . బేంకుకెళ్లి డబ్బులు వెయ్యడం , తియ్యడం చేసుకొచ్చేది . అప్పటికి స్టేట్ బేంక్ హైవే మీద శ్రీరామ్ నగర్ కి వచ్చేసింది . బేగ్ లో స్లిప్పు రాసి పెడితే చాలు బేంకు వాళ్లు ఆ పని చేసి పెట్టె వాళ్లు . ఒకసారి అత్యవసరంగా డబ్బుల కోసం నా నెక్లెస్ పంపించేను . అట్నుంచి కేషియర్ గారు డబ్బుల్తో పాటు నాకో చీటీ పంపించేడు “ మేడం , పిల్లలకి డబ్బులు పొదుపు చెయ్యడం నేర్పచ్చు కాని తాకట్టు పెట్టడం నేర్పకూడదు “ అంటూ .
ఇంటికి తెలిసిన వాళ్లు ఎవరొచ్చినా “ అబ్బ ! ఈ ఇంటికి వాడిన టేకు కలప లక్ష పైన ఖరీదు చేస్తుంది . ఈ తలుపుల , స్తంభాల డిజైను ఎంత బావుందో “ అనే వాళ్లు .
సరిగ్గా మేం ఇల్లు మారినప్పుడే దక్షిణం వరస గదుల్లోకి గ్రంధాలయం మార్చబడింది . పక్క గుమ్మమే కాబట్టి నాకూ మా పిల్లలకీ పుస్తకాలకి లోటు లేకుండా పోయింది . స్కూల్ హోమ్ వర్క్ చేసేసిన వెంటనే ముగ్గురూ వెళ్లి లైబ్రరీలో కూర్చుని వాళ్ల వాళ్ల అభిరుచికి తగిన పుస్తకాలు చదువుకునే వాళ్లు . లైబ్రేరియన్ శివాజీ గారు “ పొద్దున్నే తెచ్చి పెట్టెయ్యండి “ అంటూ అడిగిన పుస్తకమల్లా ఇచ్చేసేవారు. అలా మా పిల్లలు ముగ్గురికీ చిన్నతనంలోనే పుస్తకాలు చదవడం అలవాటైంది . “పుస్తకాలు , పత్రికలు ఊహా శక్తిని పెంచుతాయి . ఒంటరితనాన్ని దూరం చేస్తాయి . మనలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి .కొన్ని స్వప్నాలను మిగులుస్తాయి . మన జీవితాన్ని సృజన పథంలో నడిపిస్తాయి “ అని నమ్మే వాళ్లలో నేనూ ఒకదాన్ని .
రచయితలంటే ఎంత అభిమానం ఉన్నా నా హైస్కూల్ రోజుల్లో ఒక్క సులోచనారాణి గారికి , ఒకే ఒక్క ఉత్తరం చలంగారికీ తప్ప ఇంకెవరికీ ఉత్తరాలు రాయలేదు . స్వాతి మంత్లీ తో అనుబంధ నవలగా వచ్చిన అంపశయ్య నవీన్ గారి “ ముళ్ళ పొదలు “ చదివి ఆయనకి ఉత్తరం రాసేను . ఆయన వెంటనే రిప్లై ఇచ్చేరు . మా మధ్య స్నేహపూరితమైన ఉత్తరాలు నడిచేవి . అప్పటి వరకూ ఏది దొరికితే దాన్ని చదివేసే నేను ఆయన పరిచయంతో ఎంపిక చేసిన గొప్ప రచయితల రచనల్ని చదవడం ప్రారంభించేను . నా లోపలి ప్రపంచం దానికదే విశాలం కావడం ప్రారంభమైంది . వాళ్ల ఫిలిం క్లబ్ లో చూసిన అవార్డ్ పొందిన మూవీస్ గురించి , ఆర్ట్ పిక్చర్స్ గురించి రాసేవారు . రాజమండ్రిలో ఉన్న కొద్ది రోజులూ తప్ప మామూలు హిందీ సినిమాలు కూడా చూసెరుగని నేను ఎన్నో అద్భుతమైన మూవీస్ ను ఆయన ఉత్తరాలు కాబట్టి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉన్చేదాన్ని , ఉత్తరాల ద్వారా మిత్రులయ్యేక ఒక ఆత్మీయతా భావం తప్పక నెలకొంటుంది . నేను రాదే విధానం బావుంటుందనీ , కథలు రాయడానికి ప్రయత్నించమనీ రాసే వారు నవీన్ గారు .
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ కి ఎగ్జామినేషన్స్ చీఫ్ గానో ఏమో వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్ సత్తెన్నగారితో కలిసి మా ఇంటి కొచ్చేరు . ఉత్తరాల్లోని ఆత్మీయతను ముఖాముఖి చూపించలేకపోయేను . మోహన్ తో కలిసి నలుగురం ఏదో సినిమాకి వెళ్లోచ్చేం. వాళ్లున్నంత సేపూ బాగానే నడుచుకున్న మోహన్ తర్వాత “ ఈ ఉత్తరాలేంటి , ఈ పరిచయలేంటి , నా పరువు తీసేస్తున్నావు “ అంటూ నవీన్ గారి ఉత్తరాలన్నిట్నీ వాకిట్లో వేసి అగ్గిపుల్ల గీసి కాల్చేసేడు , అలా ఎంతో పరిజ్ఞానాన్నిచ్చిన ఉత్తరాల్ని కోల్పోయేను .
నా జీవితం నా చేతుల్లో ఉండేది కాదు . నా చుట్టూ ఉన్న వాళ్ల చేతుల్లో ఉండేది.
– కె.వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~