తెలుగు సాహిత్యంలో హాస్యం-మహిళల రచనలు(వ్యాసం)-వి శాంతి ప్రబోధ

నాలుగు విధాల చేటు అంటారు కానీ నవ్వు నలభయ్ విధాలా రైటనీ గ్రేటనీ చెప్పరు .
కానీ.. మనసు బాగోనప్పుడు, చికాకులో ఉన్నప్పుడు ధ్యాస మళ్లించుకునేందుకు, మనసారా నవ్వుకునేందుకు హాస్యాన్ని వెతుక్కుంటాం . నిజమే హాస్యాన్ని మించిన ఔషధం ఉందా ..!

నవరసాల్లో హాస్యం ప్రధానమైంది . అందుకేనేమో అసలు నవ్వని వాడు రోగి . నవ్వటం ఒక భోగం అంటాడు జంధ్యాల
మన వాస్తవ జీవితంలో హాస్యంగా మాట్లాడడం , చెణుకులు, చతురోక్తులు విసరడం వాటికి పడీపడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడమో లేదా ముసిముసి నవ్వులు విసరడమో చేస్తుంటాం . చాలా సహజంగా జరిగిపోతుందది . ఆ నవ్వుల పంచాంగం విప్పడం లేదిక్కడ .
మానవ జీవనాన్ని ప్రతిబింబించే సాహిత్యంలో హాస్యం గురించి .. అందునా , మహిళలు సృష్టించిన సాహిత్యం గురించి నాకు తెల్సిన రెండు ముక్కలు మీ అందరితో పంచుకుందామని మీ ముందుకొచ్చాను .

తరచి చూస్తే .. తెలుగు సాహిత్యంలో హాస్యానికి వేసిన పీట చాలా చిన్నది
యూరోపియన్ సాహిత్యంతో పరిచయం తర్వాతే తెలుగు సాహిత్యంలో కొద్దిగానయినా హాస్యరచనలు వచ్చాయనుకోవచ్చు .

వీరేశలింగం గారి ప్రహసనాలలోని పాత్రల్లో హాస్యరసం చిప్పిల్లుతుంది . ఆయన సంఘసంస్కరణోద్యమానికి అస్త్రంగా హాస్యాన్ని వాడుకున్నారు అట్లాగే గురజాడ , చిలకమర్తి, మొక్కపాటి , పానుగంటి, మొదలుకొని భమిడిపాటి, ముళ్ళపూడి వరకూ ఆనాటి నుండి ఈనాటివరకు చాలా మంది రచయితలు కనిపిస్తారు . వారిని నేనిక్కడ తడమడంలేదు . నేనిప్పుడు ఇక్కడ మాట్లాడడం కోసం హాస్య రచయిత్రులు వారి రచనల కోసం అంతర్జాలంలో జల్లెడ పట్టాను. హాస్యం పండించే రచయితలతో పోల్చుకుంటే రచయిత్రులు చాలా చాలా తక్కువగా కన్పించారు.

మహిళల నవ్వు నాలుగు విధాల చేటు అన్న నానుడే అందుకు కారణమా ..
లేక .. మహిళల్లో చదువరులు , రాసేవాళ్ళు తక్కువ ఉండడమా ..
సాహిత్యంలో హాస్యానికి సముచిత స్థానం ఇవ్వకపోవడమా ..?
హాస్యాన్ని రెండవ తరగతిలో పెట్టేయడమా ..?
కారణాలు అన్నీ కావచ్చు . ఏదేమైనా గానీ తెలుగు సాహిత్యంలో నవల , కథ , నాటకం, గల్పిక , కవిత్వం ఏ ప్రక్రియలో చూసినా సునిశితమైన హాస్యం పండించే రచయిత్రుల్ని వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు .
నిజానికి హాస్యం రాయడం కళ. హాస్య రచన చదివిన వాళ్ళు పడీ పడీ హాయిగా మనసారా నవ్వాలి .

మనకి హాస్యం అందించి మనసారా నవ్వించగలిగే రచయిత్రులెవరో ఇప్పుడు చూద్దాం . ఉన్న అతి కొద్ది మందిలో ఎవరికైనా మొదట గుర్తొచ్చేది భానుమతీ రామకృష్ణ గారి ‘అత్తగారి కథలు’ .

ఆనాటికి ఈనాటికీ ఎవరు గ్రీన్ అత్తగారి పాత్ర . ఈ కథల్లో అత్తగారి చాదస్తం మనను నవ్విస్తుంది . సుతారమైన హాస్యం గిలిగింతలు పెడుతుంది. అత్తగారికీ ఆవకాయకూ అకాడమీ బహుమతి అందించిన ఘనత భానుమతి గారిదే. అంతేనా .. ఆడవాళ్ళూ హాస్యం రాయగలరని నిరూపించిందీ భానుమతి గారే .
ఆవిడ ఆవకాయ గురించి రాసినా ఆవును పెంచడం గురించి రాసినా కడుపుబ్బా నవ్వుకుంటాం . ఆ కథను మర్చిపోలేం . తన కథలకు ఇన్స్పిరేషన్ వాళ్ళ అత్తగారే కానీ ఇన్సిడెంట్స్ నా కల్పితాలు అంటారు భానుమతి .
అత్తగారి పురాణం రాసి ముళ్ళపూడి వెంకట రమణ గారికిచ్చినప్పుడు అత్తగారొక క్యారెక్టర్ అయి ఇంత గొప్ప ప్రచారం వస్తుందని ఆవిడ అనుకోలేదట .

చాదస్తపు అత్తగారితో కోడలు విసుక్కోకుండా , అసహనం ప్రదర్శించకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో .. అలా చేస్తే బాగుంటుందేమో అంటూ బతుకు బరువు కాకుండా చూసుకోవడం ఈ కథల్లో కనిపిస్తుంది .

భానుమతి తర్వాత హాస్యరచయిత్రిగా ముందుగా చెప్పుకోవలసింది పొత్తూరి విజయలక్ష్మి గారి సాహిత్యం గురించి .
హాస్యం పండించి పసందైన విందు భోజనంతో కడుపుబ్బా నవ్వించే రచయిత్రి ఆవిడ .
మామూలు పరిస్థితుల్లో అద్భుతమైన హాస్యం అలవోకగా అల్లేయడంలో దిట్ట పొత్తూరి విజయలక్ష్మి . అనుబంధాలు, మానవ సంబంధాలు పునాదులుగా సాగే ఆమె రచనల్లో హాస్యం , వ్యంగ్యం అంతర్లీనంగా సాగిపోతుంటాయి.
‘స్క్రిప్ట్ ఉంది సినిమా తియ్యండి ‘ అనే వ్యంగ్య రచనతో సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆవిడ ఇక వెనుదిరిగి చూడలేదు . తెలుగు సాహిత్యంలో హాస్య రచయిత్రిగా స్థిరపడి హాస్య గుళికలు అందిస్తూనే ఉన్నారు .
హాస్యపూరితమైన వాతావరణంలో పెరగడం వల్ల హాస్యం తన జీవితంలో భాగం అయిపొయింది అంటారామె
ఆమె సరదాగా రాసిన మొదటి నవల ప్రేమలేఖ . చతుర నవలగా వచ్చి శ్రీ వారికి ప్రేమ లేఖ సినిమాగా సూపర్ డూపర్ హిట్ అయింది .
ఆ తర్వాత వచ్చిన సంపూర్ణ గోలాయనం – ప్రేమ ఎంత మధురం పేరుతోనూ , శంకర రావు పెళ్లి – ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం సినిమాగా వచ్చాయి
పొత్తూరి విజయలక్ష్మి గారు ఏం రాసినా అవి తన బాల్య జ్ఞాపకాలో, తన చుట్టూ ఉన్న కుటుంబం , బంధు మిత్రులతో ఉన్న జ్ఞాపకాలో అయి ఉంటాయి . వాటినే ఆవిడ కథలుగా మలిచారు . ఏ రచనలో చూసినా కనుమరుగవుతున్న మానవతా సంబంధాలలోని అతి సున్నిత కోణాల్ని అంతకంటే సున్నితంగా హాస్యంగా వ్యంగ్యంగా ఆవిష్కరిస్తారు నవ్వుల రచయిత్రి .

అందరూ హాస్యాన్ని ఆస్వాదిస్తారు . ఆనందిస్తారు కానీ మిగిలిన రసాలకు ఉన్న గుర్తింపు గౌరవం హాస్యానికి లేదన్నది పొత్తూరి విజయలక్ష్మి గారి ఆవేదన .
అపహాస్యం చెయ్యకుండా ఆరోగ్యకరమైన హాస్యం రాసి హాస్యప్రియులను ఆకట్టుకోవడమే తాను హాస్యరచయిత్రిగా ముద్రపడడానికి కారణం అంటారామె

ఈ వరుసలో తర్వాత మనం చెప్పుకోవాలసింది డాక్టర్ సోమరాజు సుశీల గారి గురించి . పారిశ్రామిక వేత్తగా తన అనుభవాల్నే కథలుగా మలిచి ‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు ‘ తో రచయిత్రిగా సాహితీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ ఇల్లేరమ్మ కథలతో ఇల్లేరమ్మగా మనందరికీ చిరపరిచితులయ్యారు డాక్టర్ సోమరాజు సుశీల. సునిశితమైన హాస్యం , వ్యంగ్యం తో అక్షరాలవెంట పరుగులు పెట్టిస్తాయి ఆమె కథలు . రచయిత్రి ఇల్లేరమ్మగా తన బాల్యపు అనుభవాల ఆసరాగా హాస్యం మేళవించిన కథలివి . ఒకనాటి ఆడపిల్లలు ఎవరికి వాళ్ళు తమ బాల్యాన్నే.. వెనక్కి తొంగి చూసుకుంటున్న భావన కలిగిస్తాయి ఇల్లేరమ్మ కథలు.

‘చిన్న పరిశ్రమలు -పెద్ద కథలు ‘ , ఇల్లేరమ్మ కథలు , దీపశిఖ, ముగ్గురు కొలంబస్ లు, ఏ కథా సంకలనం చూసినా తన జీవితపు అనుభవాల్లోంచి, సంఘటనాల్లోంచి ప్రేరణ పొంది సునిశిత హాస్యం రంగరించి మనసుకు హత్తుకునేలా ఎంతో అద్భుతంగా చక్కని శైలిలో చెప్తారు .

ఆవిడా రచనల్లో ఏది చదివినా చదువరులు నవ్వి నవ్వి పొట్ట పట్టుకోవాల్సిందే .. కళ్ళు తుడుచుకోవలసిందే .. వారి మెదళ్లలో ఓ ఆలోచన మొలకెత్తయాల్సిందే .. ఆవిడ కథల్లో ఎంత హాస్యం ఉంటుందో అంత జీవిత సత్యాల సారమూ ఉంటుందన్నది గమనించాల్సిన విషయం.

‘ఆవిడే స్వయంగా చెప్పుకున్నట్లుగా ‘ ఎవడు రాస్తాడులే అన్న బద్ధకమే లేకపోతే మరెన్నో హాస్యగుళికలు మనముందుండేవేమో .. !

మృణాళిని హాస్యం చాలా ఇష్టపడే రచయిత్రి. ఒకప్పుడు వార్త దినపత్రికలో వారం వారం వచ్చే కోమలిగాంధారం కోసం ఎదురుచూసే పాఠకుల్లో నేనూ ఒకదాన్ని . స్త్రీవాద విషయాల్ని కోమలి గాంధారంలో అలవోకగా వ్యంగ్యం , చమత్కారం , హాస్యం లతో మిళితం చేసి చురకలేస్తూ రాయడం అబ్బురంగా ఉండేది.
కోమలి గాంధారం పేరే గమ్మత్తుగా అనిపిస్తుంది . ఇవీ అత్థగారి కథలే . ఆడపిల్లై పుట్టి ముగ్గురాదా అన్న ఆవిడ అత్తగారి మాటలే ఈ కథలకు పునాది . ప్రయివేటు కాలేజీలో పనిచేసే లెక్చరర్ కోమలి , ఆమె భర్త , అత్తగారి మధ్య జరిగే సంభాషణలే కోమలి గాంధారం . సుదీర్ఘమైన ప్రసంగాలు చేయకుండా కంగారు పడకుండా కీలెరిగి వాత పెట్టే రకం కోమలి . తన మాటలతోనూ చేతలతోనూ చూపిస్తుంది. చేదు ముందుకు వ్యంగ్యం పై పూతగా పూసి హాస్య భరితంగా చెప్పడమే కోమలి రహస్యం.

హాస్యంతో పురుషాధిక్య సమాజంలోని పోకడలు , పురుషుని అహంకారం .. స్త్రీవాదంలోని అన్ని అంశాలూ సృజించిన ఘనత మృణాళినిది . చెప్పే సీరియస్ విషయాన్ని అల్లోపతి మందులాగా చేదుగా కాకుండా హోమియోపతి గుళికల్లా తీయగా చెప్పడం మృణాళిని ప్రత్యేకత . .
మేల్ ఇగోని టార్గెట్ చేసిన కథలంటారు కొందరు విమర్శకులు .
చిన్న చిన్న విషయాలుగా కనిపించే వాటినే ఎంతో అద్భుతంగా చెప్పే మృణాళిని ఆహ్లాదకరమైన హాస్యానికి చిరునామాగా ఆంధ్రజ్యోతికి రాసిన తాంబూలం, ఉదయం దినపత్రికకు రాసిన కామాక్షి కబుర్లు కూడా చెప్పుకోవాలి . అవీ ఆయా పత్రికల వాళ్ళు అడిగిరాయించుకున్నవే

తెలుగుసాహిత్యంలో హాస్యం వెనక ఉన్న గాంభీర్యాన్ని , తీవ్రతను చిన్న చూపు చూస్తాం . అంతర్జాతీయ సాహిత్యంలో అది కనపడదు . వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వడంవల్ల వచ్చిన చేటు . హాస్యంలో వస్తువు ఎక్కడో నిబిడీకృతమై ఉండడం వల్ల వస్తువు స్పష్టంగా కనపడదు. అందువల్లే పాండిత్యం ఎక్కువైన వాళ్ళు, మార్క్సిస్టు విమర్శకులు హాస్యాన్ని సాహిత్యంగా గుర్తించడం లేదంటారు మృణాళిని . షేక్స్ ఫియర్ , బెర్నార్డ్ షా వంటి యూరోపియన్లు హాస్యాన్ని నెత్తిన పుట్టుకున్న మనవాళ్ళు తెలుగులోహస్యాన్ని మాత్రం సాహిత్యంగా గుర్తించరని మృణాళిని ఆవేదన .

సుమారు అరవయ్యో ఏట కలంపట్టి కథలు రాయడం మొదలు పెట్టారు చింతపెంట కమల. మూడు కథ సంపుటాలు వేశారు . జీవితానుభవం దండిగా పండిన చేత్తో కలం పట్టిన కమల గారు హాస్యానికే పెద్ద పిట వేశారు . చేతిపనులు తెలిసిన చేత్తో కథను అల్లడంతో , చిత్రించడంలో తనదైన శైలి ప్రదర్శించారు .

ఆరోగ్యం కోసం హాస్యం అంటూ వదినగారి కథలు పాఠకులకు అందించారు జి ఎస్ లక్ష్మి . గడసరి వదిన గారు అమాయకపు మరదలు కథలు అవి.
నువ్వు హాస్యం బాగారాస్తావమ్మా అన్న కూతురు మాటల ప్రేరణతో హాస్యకథలు రాశారు జి ఎస్ లక్ష్మి .
హాస్య కథల్నిరాయడం ఒక కళ . రాసేటప్పుడు బాలెన్సుడ్ గా ఉండాలి . లేకపోతే హాస్యం వెగటు కలిగించే ప్రమాదం ఉంది అంటారు జి ఎస్ లక్ష్మి

సు బ్బారావు సుబ్బలక్ష్మి ప్రధాన పాత్రలుగా సాగె సుబ్బలక్ష్మి కథలు పాలపర్తి జ్యోతిష్మతి రాశారు. సగటు జీవితాల్లోని హాస్య చతురత, మధ్య తరగతి సంసారాల్లో జరిగే సంఘటనలకు హాస్యం జోడించి మలచిన కథలవి .

నీలాంబరి- శారద కథల్లో ‘ఊయలలూగినదోయి మనసా ‘ ఒక్కగానొక్క హాస్యకథ . మిగతా కథల్లోనూ హాస్యం , వ్యంగ్యం , విమర్శ సహజంగా సాగిపోతుంటాయి . కథలు విలక్షణంగా కనిపిస్తాయి .

వ్యంగ్యం ఉంటే హాస్యం ఉంటుంది . హాస్యం ఉంటే నవ్వు వస్తుంది . ఎప్పుడైనా నవ్వక పొతే ఎండిపోయిన మొక్క అయిపోతాం కదా’ అనే పి సత్యవతి కథల్లోనూ సునిశితమైన వ్యంగ్యం సహజంగా వచ్చి చేరుతుంది. అదే విధంగా మాలతీ నిడదవోలు కథల్లోనూ వ్యంగ్యం , హాస్యం పాత్రోచితంగా కనిపిస్తుంది . ముప్పాళ్ల రంగనాయకమ్మ ఆండాళ్ళమ్మ , స్వీట్ హోం ద్వారా హాస్యం సృష్టిస్తే మునిమాణిక్యం లాగా సంసారిక సంబంధమైన హాస్యం పండించారు నందగిరి ఇందిరాదేవి . వీరు కాక అడపా దడపా జరిగే హాస్య కథల పోటీలకోసం మాత్రమే రాసే రచయిత్రులు కొద్దిమంది కనిపిస్తారు . డాక్టర్ గాయత్రీదేవి రేడియో కోసం హాస్య కథలు రాస్తే , రేడియో అక్కయ్య , వారణాసి నాగలక్ష్మి పిల్లలకోసం హాస్య నాటికలు రాశారు. పి ఎస్ ఎం లక్ష్మి , హాస్యనాటికలు రాశారు .

సాధారణంగా ఆడవాళ్లు మాట్లాడ్డం కంటే వినడం ఎక్కువ . వాళ్ళకి తమ స్వతంత్ర భావాల్ని వ్యక్త పరిచే అవకాశాలు తక్కువ. ఆడపిల్లలు అనే భేద భావంతో , ఆడపిల్ల అని కించపరిచే అవమానపరిచే వాతావరణంలో పెరిగిన ఆడపిల్లల కంటే స్వతంత్ర భావాలతో పెరిగిన వాళ్ళు , స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం ఉన్న మహిళలే హాస్యం సృష్టించి ఉంటారనిపిస్తుంది . అందుకు ఉదాహరణగా భానుమతి , పొత్తూరి విజయలక్ష్మి , మృణాళిని , నిడదవోలు మాలతి వంటి రచయిత్రులను చెప్పుకోవచ్చు .

నిచ్చెన మెట్ల సమాజంలో అన్ని అవకాశాల్లోనూ ముందు వరుసలో ఉన్న సమూహాలనుండే హాస్య రచనలూ వచ్చాయి . కింద వరుసల్లో ఉన్న, అంచులకు నెట్టివేయబడ్డ, విసిరివేయబడ్డ సమూహాల్లోని మహిళలకు చదువు లేదు . చదువుకున్న కొద్ధి మందిలోనూ రాసే వాళ్ళు తక్కువ . రాసే అతి కొద్దిమందీ క్షణక్షణం జీవితంతో, సమాజంతో యుద్ధం చేస్తూ తమ అస్తిత్వం కోసం చేసే పోరాటాల్లో మమేకమైపోతూ ముందుకు సాగుతున్న వారే . అందువల్ల వారు తమ జీవితపు అనుభవాల నుండీ, తమ చుట్టూ ఉన్న సమాజపు అనుభవాల నుండే సాహిత్యం సృష్టిస్తున్నారు. వారివి హాస్యం, వెటకారం , చమత్కారం , చెణుకులతో సరదాగా సాఫీగా సాగిపోయే జీవితాలు కావు కదా .. ?!

పోటీ ప్రపంచపు ఈదులాటలో ఎక్కడ వెనుకబడిపోతామోననే శంకతో ఉరుకులు పరుగులు పట్టే మధ్యతరగతి కుటుంబంలోనూ హాస్యం , వెటకారం , చమత్కారం మాటలు తగ్గాయి . అందువల్లే లాఫింగ్ థెరపీ … లాఫింగ్ క్లబ్స్ వంటివి పుట్టుకొచ్చాయి . యాంత్రిక జీవన హోరులో పడిపోయి మానవ సహజ గుణమైన నవ్వడాన్ని మరచిన మనిషిలోని బాధని , విషాదాన్ని , భయాన్ని , కోపాన్ని పోగొట్టే అత్యంత శక్తివంతమైన సాధనం హాస్యం. అందుకే హాస్యం అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ , సైడ్ రియాక్షన్స్ లేని ఔషధం హాస్యమన్నది ఎవరూ కాదనలేని సత్యం. హాయిగా నవ్వుకుంటూ చతురోక్తులు విసురుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే వాతావరణాన్ని సాహిత్యం సృష్టించాలి . అది నేటి సామాజిక అవసరం కూడా .

ఒకనాటి రచయితలు సృస్థించిన హాస్య పాత్రల్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అవి ఇప్పటికీ అద్భుతంగా కనిపిస్తున్నాయంటే, సునిశితంగా ఉంటూ గిలిగింతలు పెట్టే అద్భుతమైన టానిక్ లాంటి హాస్యాన్ని పాఠకులు ఎప్పుడూ ఆదరిస్తారనే కదా…
ఇప్పటివరకూ కథ , నవలల్లో వచ్చినంతగా నాటిక , కవిత్వం , గల్పిక వంటి ఇతర సాహితీ ప్రక్రియల్లో మహిళల హాస్య రచనలు రాలేదనుకుంటా ..
కవిత్వంలో కొండేపూడి నిర్మల, నెల్లుట్ల రమాదేవి వంటి వారి కవిత్వంలో వ్యంగ్యం ఉంటుంది తప్ప పూర్తి స్థాయి హాస్య కవితలు కనిపించవు .
ముదిగొండ సీతారావమ్మ , మాదిరాజు శివలక్ష్మి , యశస్వి , హంసగీతి వంటి కొద్ధి మంది హాస్య కవితల పోటీల్లో మాత్రమే కనిపిస్తారు.
నా దృష్టిలోకి రాని హాస్య రచనా వ్యవసాయం చేసే రచయిత్రులూ, కవయిత్రులూ ఇంకా ఉండొచ్చు . నవ్వుల జల్లులు కురిపించే సాహిత్య సృష్టి చేస్తున్న రచయిత్రులందరినీ, కవయిత్రులందరినీ అభినందిస్తూ,
హాస్యాన్ని కేవలం వినోదం కోసమే కాకుండా సామజిక ప్రయోజనం కోసం కూడా వాడే సునిశితమైన జీవన చిత్రాలు భవిష్యతులో అందుకోగలమని ఆశిస్తున్నాను.
సాహితీ విమర్శకులు హాస్యం పండించే సాహిత్యాన్ని కూడా గుర్తించి గౌరవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను

వి . శాంతి ప్రబోధ

వ్యాసాలుPermalink

Comments are closed.