మేఘసందేశం-14 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాస మహాకవి విద్వత్తు గురించి చెప్పడానికి ఒక చిన్న విషయం చెప్పి, మేఘ సందేశంలోకి వెళ్తాను. భవభూతి అనే ఒక మహాకవి ”ఉత్తరరామచరిత్రమ్” నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని ఉబలాటపడ్డాడు. ఏమంటాడో ఏమో అని శంక ఉన్నప్పటికీ ధైర్యం చేసి తన కుమారుడికి గ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు. కాళిదాసు యింట్లో కూచుని తీరిగ్గా చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. చదివి వినిపించు అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కొంచెం కూడా మరల్చకుండానే. భవభూతి కుమారుడికి మనసు బాధపడ్డప్పటికీ, తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధగా వినడం యిష్టం లేని ఈ కవికి వినిపించడం వృధా శ్రమ అనిపించింది. కానీ తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు. అభిప్రాయం తెలుసుకుంటే తప్ప ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా అన్యమనస్కoగానే చదివి వినిపించాడు. కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. పక్కకు తిరిగి చూడనైనా చూడలేదు. అంతా చదివాక మాత్రం, నోటినిండా తాంబూలంతో అస్పష్ట౦గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.

ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసే భవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు. మాటల మధ్యలో భవభూతి, కాళిదాసుతో “మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం యేదో అన్నారని చెప్పాడు. మీరేమో యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ, అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను” అన్నాడు. కాళిదాసు నవ్వాడు “కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను. నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు” అన్నాడు.

ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. ‘సున్న’ గురించి, నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో! ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో ఏ చిన్న మార్పూ అవసరం లేదు.

ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగిపోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకంలో స్వామీ? నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి అన్నాడు. ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది. మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.

“కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్”

(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక – ఏక – దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో ఒకరుగా ఒదిగి; అవిరళిత కపోలం – చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా ఆసక్తి యోగాత్ – అక్రమేణ – కిమపి కిమపి – మందం మందం – జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప – మరే వరసా, క్రమం లేకుండా – ఏవేవో ముచ్చట్లు – గుసగుసలుగా చెప్పుకుంటున్న మనకు అవిదిత గతమయామా – రాత్రి: – ఏవం – వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది) అవునవును అన్నాడు భవభూతి. అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులుగా రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి) అని చెప్తే మరీ బాగుంటుంది. పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి. రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు కాళిదాసు. అవశ్యం మహాకవి! ఎంత అద్భుత మైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి. అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు. నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ- వా ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే. అంటే..నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమే సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు. భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు. భవభూతి కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంధ్రుడని కొందరూ వాదించారు. భవభూతి రచనలు మూడూ నాటకాలే.’ఉత్తరరామచరితం’ ‘మాలతీమాధవం’ ‘మహావీరచరితం’ భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు. ఇతడు ఆంధ్రుడేననీ.. గోదావరీ తీర వాసి అని కొన్ని పరిశోధనలు ఉన్నాయి. మళ్ళీ మనం మేఘ సందేశంలోకి ప్రవేసిద్దాం.

శ్లో.60. గత్వా చోర్ధ్వం దశముఖభుజోచ్ఛ్వాసితప్రస్థసంధేః
కైలాసస్య త్రిదశవనితాదర్పణస్యాతిథిః స్యాః ,
శృంగోచ్ఛ్రాయైః కుముదవిశదైర్యో వితత్య స్థితః ఖం
రాశీభూతః ప్రతిదినమివ త్ర్యంబకస్యాట్టహాసః

భావం: ఓ మేఘుడా! క్రౌంచపర్వతాన్ని దాటి ముందుకు వెళ్తే కైలాస పర్వతం కనబడుతుంది. అది రావణుని చేత పూర్వం ఒకసారి ఎత్తబడింది. అందువల్ల దాని సంధులు వదులయిపోయి ఉంటాయి గమనించు. దేవతాస్త్రీలకు అద్దంలాంటిదైన ఆ కైలాసపర్వతానికి నీవు అతిథివి కావాలి సుమా! తెల్లకలువల్లాంటి శుభ్రమైన, ఎత్తైన శిఖరాలతో ఆకాశం అంతా వ్యాపించి, ప్రతిరోజూ శివుడు నవ్విన నవ్వు ప్రోగు పెట్టి ఉంచారా ఈ శిఖరంపై అన్నట్లుగా ఉంటుంది.

మనం కొంచెం లోతుకు వెళ్ళి పరిశీలించినట్లైతే… కైలాసపర్వతం వర్ణించబడుతోంది. మున్ను ఒకసారి దశకంఠుడు కుబేరుని ఓడించి అతని పుష్పకవిమానాన్ని గ్రహించి వెళ్తుండగా అది అక్కడి కైలాసపర్వతసమీపంలో ఆగిపోయింది. కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తూండగా నంది వచ్చి శివపార్వతుల ఏకాంతానికి భంగం కలుగుతుంది కాన వెళ్లవలదని చెప్పాడు. అప్పుడు రావణుడు నందిని చూచి వానరముఖుడవంటూ పెద్దగా నవ్వాడు. నందికి కోపం వచ్చి, ఆ వానరులచేతిలోనే నీవు చావు దెబ్బతింటావని శాపమిచ్చాడు. దశముఖుడు ఆ మాటలకు కోపించి తరువాత జరిగిన వాదోపవాదాల్లో నీవెంత? నీ కైలాసపర్వతమెంత? అని ఆ పర్వతాన్ని ఆసాంతం ఎత్తాడు. అది చూచి శివుడు దాన్ని అదిమాడు. అందువల్ల రావణుని చేతులు ఆ పర్వతం క్రింద పడి నలిగిపోయాయి. ఆ బాధతో లోకాలన్నీ భయపడేటట్లు పెద్ద హూంకారావం చేశాడు. అప్పటినుంచి దశకంఠునికి రావణుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కైలాసపర్వతంనుండి శివానుగ్రహంతో బయటపడ్డాడు. రావణుడు ఎత్తడం వల్ల ఆ పర్వతసానువుల్లో పగుళ్ళు ఏర్పడ్డాయి. అందువల్ల ఆ పర్వతం అతుకులు పెట్టినట్లుందని కాళిదాసు రస రమ్యంగా వర్ణిస్తున్నాడు. ఆ పర్వతం అందుకే అలా వదులుగా విడిపోయి పగుళ్ళు కలిగి ఉంటుందని చెప్తున్నాడు కాళిదాసు.

ఇంకా చూస్తే అది వెండికొండ కాబట్టి దేవతావనితలు తమ ప్రతిబింబాలు చూసుకోవడానికి దాన్ని అద్దంలా ఉపయోగించుకొంటారని కవి ఒక మనోహరమైన ఊహను చెప్పాడు. ప్రతిరోజూ శివుడు నవ్వే స్వచ్ఛమైన నవ్వు ప్రోగుపడి ధవళ వర్ణ కైలాసపర్వతమైందని మరొక మనోజ్ఞమైన వర్ణన చేశాడు కవి. తెలుపును మంచివాని మనసుతో, స్వచ్ఛమైన నవ్వుతోనూ పోలుస్తారు కదా! ఇది కవిసమయం అంటారు. “ఓ మేఘుడా! అటువంటి కైలాసపర్వతం నీకు తప్పక వేడుక కలిగిస్తుంది. పుణ్యాన్నీ ప్రసాదిస్తుంది. వెళ్ళిరా! అని యక్షుడంటున్నాడు.

శ్లో.61. ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాంజనాభే
సద్యః కృత్తద్విరదరదనచ్ఛేదగౌరస్య తస్య ,
శోభా మద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీ
మంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ .

భావం: ఓ మేఘుడా! ఏనుగుదంతంలా తెల్లగా ఉన్న ఆ కైలాసపర్వతసానువు మీద నున్నగా నూఱబడిన కాటుకకాంతి లాంటి కాంతి కలిగిన నీవు నిలిచితివేని, బలరాముడు తన భుజం మీద నల్లని పట్టువస్త్రం ధరిస్తే, ఎలా ఉంటుందో అలా చూసేవారికి కన్నుల పండువులా ఉంటావు. రెండవ పాదంలో “ద” కారం అనేక సార్లు ఆవృత్తి చెందినది కనుక వృత్యానుప్రాస అలంకారం ఉన్నది.

శ్లో.62. హిత్వా తస్మి౯ భుజగవలయం శంభునా దత్తహస్తా
క్రీడాశైలే యది చ విహరేత్పాదచారేణ గౌరీ ,
భంగీ భక్త్యా విరచితవపుః స్తంభితాంతర్జలౌఘః
సోపానత్వం కురు మణితటారోహణాయాగ్రయాయీ .

భావం: ఆ కైలాసాన శివుడు పార్వతీదేవితో కలసి కాలినడకన విహరిస్తూంటే అప్పుడు ముందుగా పోయి, నీవు నీ శరీరాన్ని ఘనీభవింపజేసుకుని ఆ జగన్మాత రత్నాలగట్లను ఎక్కబోయేటప్పుడు మెట్లవరుసగా ఏర్పడు. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవై కృతార్థుడవగుదువు అని చెప్తున్నాడు యక్షుడు.

ఇక్కడ విశేషాలు గమనిద్దాం. శివుడు నాగకంకణాన్ని విడచి గౌరీదేవి చేయి పట్టుకొంటాడని కవి వర్ణన చేశాడు. దానికి కారణం పామును చూసి, ఆవిడ భయపడుతుందని కవి అంటున్నాడు. మేఘుని శరీరంలో నీటిప్రవాహాన్ని ఘనీభవింపచేసుకోమంటున్నాడు. తల్లిదండ్రుల విహారాన్ని చూడడం దోషం. అందువల్ల వారు విహరిస్తున్నారు అని తెలియగానే అక్కడే నిలబడక ముందుగా పోయి, వినమ్రుడవై మెట్లవరుసగా మారితే నేల మీద మాత్రమే మేఘుని చూపు ఉంటుంది. కాన దోషప్రాప్తి ఉండదని తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని సూచన. ఇంకా కొంచెం లోతుకు వెళ్ళినట్లైతే ఇక్కడో విశేషం కూడా ఉంది. అదేమిటంటే… స్త్రీ తన భర్తతో ఉన్నప్పుడు, వారి మనస్తత్త్వం ప్రకారం పూర్తి ఏకాంతాన్ని కోరుకొంటుంది. అందుకు విరుద్ధమైతే ఆగ్రహిస్తుంది. ఇంతకుముందు శివపార్వతుల ఏకాంత సమయంలోనే ఇంద్రుడు పంపగా అగ్ని వస్తాడు. అప్పుడు పార్వతి శివుని నుండి దూరమయ్యి, దుఃఖించి, కోపించి, క్రిందపడ్డ శివుని వీర్యాన్ని భరించమని శపిస్తుంది. ఆ వీర్యాన్ని గర్భంలో ధరించిన అగ్ని దాన్ని భరించలేక గంగకు ఇస్తాడు. ఆవిడ కూడా భరించలేక రెల్లుగడ్డి మీదకు త్రోయగా శరవణభవుడు (కుమారస్వామి) జన్మిస్తాడు. అందువల్ల ఎందుకొచ్చిన ఈ గొడవలని మేఘు ణ్ణి యక్షుడు వినమ్రుడవై ఉండవయ్యా బాబూ…అంటూ అందువల్ల తల్లికి కోపం రాదని, అనుగ్రహిస్తుందని, శుభం జరుగుతుందని సెలవిస్తున్నాడు.

-వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)