అద్దెఇల్లు(కథ ) -డా. కె. మీరాబాయి

రోజూ లాగే తెల్లని స్కూటీ రివ్వున వచ్చి ఆ వీధి చివరి ఇంటి ముందు ఆగింది. పక్కనింట్లో మొక్కలకు నీళ్ళు పెడుతున్న రమాకాంతం గడియారం చూసుకున్నాడు. సరిగ్గా సాయంత్రం అయిదున్నర. అతని పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది.

” కూతురు అంటే ఇలా ఉండాలి ” మనసులో మెచ్చుకుంటూ లోపలికి నడిచాడు ఆయన.
వారిజ విద్యుత్ శాఖ కార్యాలయం లో పని చేస్తుంది . భర్త వాసుదేవ్ ప్రభుత్వ ఖజానా కార్యాలయం లో ఉద్యోగి. వారిది అనుకూల దాంపత్యం . ఇద్దరు పిల్లలు. ప్రభుత్వపాఠశాల లో చదువుతున్నారు.

వారిజ తండ్రి విశ్వనాథం తంతి తపాల శాఖ లో పనిచేసి పదవీవిరమణ చేశాడు. రెండేళ్ల క్రిందట వారిజ తల్లి కాలం చేసింది. అప్పటి నుండి ఆయన బాధ్యత వారిజ తీసుకుంది.

ఉదయం ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ఒకసారి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి తండ్రిని పలుకరించి వెళ్తుంది వారిజ ఇప్పుడు ఆయన దగ్గరకే వచ్చింది.

డిక్కీ లో ఉన్న మందుల పొట్లాలు తీసుకుని బండి తాళం వేసి లోపలికి అడుగులు వేసింది ముప్పై అయిదేళ్ళ వారిజ .
ముందు గదిలో ఎవరు లేరు. లోపలి నుండి విశ్వనాథం దగ్గు వినబడింది.

తిన్నగా వంటింటి లోకి వెళ్ళి ఫ్రిజ్ లో నుండి పాలగిన్నె తీసుకుని , పాలు వెచ్చ బెట్టి, తాను తెచ్చిన హార్లిక్స్ సీసా తెరిచి , రెండు చంచాలు గ్లాసు లోకి వేసి పాలు పోసి హార్లిక్స్ కలిపింది. బ్రెడ్ హార్లిక్స్ పళ్లెం లో పెట్టుకుని తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళింది.

” నీకు దగ్గు తగ్గ లేదని చెప్తే వేరే మందులు రాసి ఇచ్చారు నాన్నా డాక్టరు. ” అంటూమాత్రలు తీసి అందించింది. ఆయన బ్రెడ్ తిని , పాలు తాగేదాకా అక్కడే కూర్చుంది.

” నువ్వు వెళ్లమ్మ పిల్లలు స్కూల్ నుండి వచ్చి నీకోసం చూస్తుంటారు. ” కూతుర్ని హెచ్చరించాడు విశ్వనాథం.

” ఎనిమిది గంటలకు భోజనం పంపిస్తాను. అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చోక తొందరగా తినేసెయ్. వాడు బలాదూర్ తిరిగి వచ్చేసరికి పొద్దు పోతుంది. ” అని చెప్పి ఇంటికి బయలు దేరింది వారిజ .

ఆ వెనుక వీధి లోనే వారిజ ఉండేది. తను అక్కడ ఇల్లు కట్టించుకుని వచ్చాక అన్నయ్యతో పోట్లాడి మరీ వాళ్లిద్దరిని తన ఇంటి దగ్గరే అద్దె ఇల్లు చూసి అక్కడ చేర్పింది.

వారిజ అన్న చక్రధర్ ఒక రకం మనిషి . డిగ్రీ దాకా చదివాడు. పై చదువులు వద్దంటూ చిన్న ఉద్యోగం లో చేరి పోయాడు. తండ్రి , చెల్లెలు ఎంత పోరినా పెళ్లి చేసుకోలేదు. నలభై ఏళ్లు దాటినా ఏ బాధ్యతలు పట్టించుకోడు . పేరుకు తండ్రి అతని దగ్గర ఉన్నాడే గాని ఆయన బాగోగులు చూసేది అతని చెల్లెలే . అదేదో సిగ్గు పడ వలసిన విషయ మని అనుకోడు.

కాస్త బుద్ధి మాంద్యము ఉన్న వాడిలా కనబడతాడు. తన దుస్తుల గురించి గాని ఇంటిశుభ్రత గురించి గాని పట్టించు కోడు . వారిజ ఏర్పాటు చేసిన పనిమనిషి పొద్దున్న సాయంత్రం వచ్చి ఇల్లు శుభ్రం చేసి, గిన్నెలు కడిగి బట్టలు వుతికి పోతుంది.
చక్రధర్ పనిచేసేది ఒక ముద్రణాలయం లో. ఉదయం ఫలహారం, మధ్యాన్నం భోజనం ప్రెస్ కి దగ్గరిలో ఉన్న మెస్ లో చేస్తాడు. రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరి ఏది ఉంటే అది తిని పడుకుంటాడు.

వారిజ ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే పదేళ్ళ హరి , పన్నెడెళ్ల స్వాతి పరుగున వచ్చి అమ్మ కాళ్లకు చుట్టుకున్నారు ” అమ్మా ఆకలేస్తుందే ” అంటూ.

” కాళ్ళు చేతులు కడుక్కుని రండి. ” అని వాళ్ళకు చెప్తూ, సోఫాల మీద ఉన్న పిల్లల స్కూలు బ్యాగ్స్ తీసి వాళ్ళ గూట్లో పెట్టింది, వాళ్ళ భోజనం డబ్బాలు కడగడానికి సింక్ లో వేసింది.
ముఖంతుడుచు కుంటూ వచ్చారు హరి ,స్వాతి .

” మీ కోసం ఇవాళ హనీ కేక్ తెచ్చాను ” ఇద్దరిని దగ్గరకు తీసుకుంటూ చెప్పింది వారిజ

” తాతకు హనీ కేక్ ఇచ్చి రానా అమ్మా ” తినబోతున్న స్వాతి ఆగి పోయి అడిగింది.

” తాతకు దగ్గు కదా బంగారు తినకూడదు ” కూతురి తల మీద ముద్దు పెట్టి చెప్పింది వారిజ.

” పిల్లల సేవ అయిందా? ఇక కాస్త నా మీద దయ చూపిస్తావా? ” అప్పుడే లోపలకు వచ్చిన వాసుదేవ్ నవ్వుతూ అడిగాడు.

“ఇదిగో ఒక్క నిముషం లో కాఫీ తెస్తాను “అని వంట ఇంటిలోకి అడుగు పెట్టింది వారిజ.
వెనకాలే లోపలికి వచ్చిన వాసుదేవ్ అక్కడ ఉన్న చిన్న బల్ల మీద కూర్చునాడు.

” పొద్దున్న ఆఫీస్కు వెళ్లే దారిలో మామయ్య గారు ఉంటున్న ఇంటి యజమాని కనబడి ఓ కబురు చెప్పాడు వారిజా. ఆ ఇల్లు ఆయన అమ్మకానికి పెడుతున్నాడు ట. “

” అవునా? . ఎవరు కొంటున్నారో తెలిసిందా? మీకు తెలిసిన మనిషి గనుక యీయన కాస్త తక్కువకే ఇచ్చాడు మనకు. కొత్త వాళ్ళు వస్తే అద్దె పెంచుతారేమో ” అంది వారిజ

” చూడాలి ఏం జరుగుతుందో కొనే వారికి ఇల్లు నచ్చాలి. అమ్మే ఆయనకు అనుకున్న ధర రావాలి అంత తొందరలో కాదులే. . .” అనేసి భార్య అందించిన కాఫీ కప్పు తీసుకునిపిల్లల దగ్గరకు వెళ్లాడు వాసుదేవ్.

భర్త లో నచ్చే గుణం అదే వారిజకు. ఏ సమస్య అయినా అంత తొందరగా గాబరా పడడు. నిదానంగా ఆలోచిస్తాడు. వారిజ తండ్రిని, అన్ననూ తమకు దగ్గరగా ఉండాలని అనుకున్నప్పుడు అన్ని విధాల సహకరించాడు. ఆ ఇల్లు చూసింది అతనే.
ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా ముందు నాన్నను పలుకరించి వస్తుందని సరదాకు కూడా ఒక మాట అనడు.
ఏ కారణం గా నైనా వారిజ రావడం ఆలస్యం అయితే పిల్లలకు తినడానికి ఏదో ఒకటి పెట్టి, తామిద్దరికి కాఫీ కలిపి ఎదురు చూస్తాడు. ఏ మీటింగ్ కారణంగా నో వారిజ రావడం ఆలస్యం అయితే తనే వెళ్ళి మామయ్యకు ఏమీ కావాలో చూస్తాడు.
అతని తలితండ్రులు వచ్చినప్పుడు వారిజ వాళ్ళను ఎంతో ఆదరం గా చూస్తుంది. వాళ్ళు కూడా కోడలు తండ్రి బాధ్యత తలకెత్తుకున్నదని మాట తూలరు. .

ఇల్లు కొనాలని అనుకున్న వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసి పోతున్నారు . నెల్లాళ్లు గడిచేసరికి వూళ్ళో వెంకట రమణ కాలనీ లో ఉన్న శ్యామలరావు అనే ఆయనఇల్లు చూసి వెళ్లాడు. అన్నదమ్ములిద్దరు వస్త్ర వ్యాపారం లో ఉన్నారు ట. నలభై ఏళ్ల శ్యామలరావు స్నేహశీలి గా అనిపించాడు వారిజ కు. ‘. అన్నగారు వూరు వెళ్లాడని, ఆయనే తన కుటుంబానికి పెద్ద కనుక ఆయన రాగానే ఇద్దరు వచ్చి చూసి అన్నకు నచ్చితే అడ్వాన్స్ ఇస్తాము ‘ అని ఇంటి యజమానికి చెప్పి వెళ్లాడు. ఇంతలో అనుకోని ఒక సంఘటన జరిగింది.

హాయిగా తిని తిరుగుతున్న పక్కింటి రమాకాంతం ఉన్నట్టుండి గుండె పోటుతో కళ్ళు ముసాడు. ఆయన వయసు అరవై అయిదు ఏళ్ళే . ఈ వార్త విని వారిజ తండ్రి కుంగి పోయాడు.

విశ్వనాథం ఆరోగ్యం బాగాలేనప్పటినుండి ఆయన బయటకు రావడమే అరుదై పోయింది. అంతకు ముందు రమాకాంతం తో కలిసి దగ్గరే ఉన్న పార్క్ లో పదినిముషాలు నడిచేవాడు. ఆ స్నేహంతో రమాకాంతం రోజుకు ఒకసారి అయిన విశ్వనాథం ఇంటికి వచ్చి పలుకరించి వెళ్ళేవాడు. రమాకాంతం మరణం తో విశ్వనాథం దిగులు పడి పోయాడు.

నీరసపడి మంచానికి అతుక్కుపోయాడు,తండ్రి కోసం ఒక రోజు సెలవు పెట్టి దగ్గరే ఉండి ధైర్యం చెప్పింది వారిజ .
అది జరిగిన రెండో రోజే శ్యామలరావు ఇల్లు చూపించడానికి తనఅన్న వెంకట్రావు ను వెంటబెట్టుకుని వచ్చాడు. ఆయనకు ఇల్లు నచ్చింది గానీ మంచాన ఉన్న విశ్వనాథం తీరు నచ్చలేదు. అంతకు ముందే పక్కింటిలో జరిగిన విషయం విన్నాడు ఆయన.
ఇల్లు చూసి బయటకు రాగానే తమ్ముడితో ఖరా ఖండిగా చెప్పేసాడు ” శుభమా అంటూ ఇల్లు కొనగానే ఈ జబ్బు మనిషి కాస్తా గుటుక్కు మంటే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. ముందు వీళ్ళని ఖాళీ చేయించ మని చెప్పు. అప్పుడే రిజిస్ట్రేషన్ సంగతి చూద్దాము. ” అని చెప్పేసాడు.

విశ్వనాథం ఉంటున్న ఇంటిని నెలలోపు ఖాళీ చేయాలని వాసుదేవ్ కు చెప్పాడు ఇంటి యజమాని. దగ్గరలో మరో ఇంటి కోసం ఎంతో ప్రయత్నం చేసింది వారిజ . కానీ దొరక లేదు. తప్పనిసరి పరిస్తితి లో తండ్రిని, అన్నను తన ఇంటికే తీసుకువచ్చింది వాసుదేవ్ సలహాతో.

ఖాళీ అయిన ఇంటికి చిన్న చిన్న రిపేర్లు చేయించి రంగులు వేయించారు ఇల్లు కొనుక్కున్న శ్యామలరావు వాళ్ళు.
మనవడు మనవరాలు పొద్దున్న సాయంత్రం తాతగారి దగ్గర చేరి వాళ్ల బడిలో విశేషాలు పోటీలు పడి మరీ చెప్పడం, ఆయనతో కథలు చెప్పించు కోవడం , కూతురు అల్లుడు కళ్లముందు కనబడు తుండడం వలననొ ఏమో విశ్వనాథం ఆరోగ్యం కుదుట పడింది. లేచి తిరుగు తున్నాడు బయటకు వెళ్ళి . నాలుగు అడుగులు నడిచి వస్తున్నాడు. వారిజ ఇంటి కోసం వెదుకుతూనే ఉంది గాని దగ్గరలో అనుకూలంగా ఉన్నది ఏది దొరకలేదు.

రెండునెలలుగా తాను, కొడుకు ,అల్లుడి ఇంట్లో ఉండడం విశ్వనాథం కు మొహమాటం గా ఉంది. రెండు పడక గదుల ఇల్లు కావడం వలన తండ్రి కొడుకులకు ఒక పడక గది కేటాయించి, పిల్లలకు ముందు హాల్లో సోఫాల మధ్యన క్రింద పరుపులు వేసి పడుకో పెడుతున్నారు. సంవత్సరాది పండుగకు తప్పకుండా వాసుదేవ్ ఇంటికి వచ్చే అతని తలిదండ్రులు ఈసారి రాలేదు. తాము ఇక్కడ ఉండడం వలననే వాళ్ళు రాలేదని కాస్త కించ పడ్డాడు విశ్వనాథం.

విశ్వనాథం ఖాళీ చేసిన ఇల్లు తాళం వేసే ఉంది. ఇప్పుడో అప్పుడో వచ్చి ఇంట్లో చేరుతారు అనుకున్న ఇంటి స్వంతదారు మళ్లీ అటువైపు రాలేదు. రెండు నెలలు గడిచినా గృహప్రవేశం పూజ జరపలేదు. ఎవరు అందులో చేరలేదు.

” ఇల్లు కొనుక్కున్నారు గానీ వాళ్ళకు ఇక్కడకు వచ్చి చేరే ఉద్దేశం ఉన్నట్టు లేదండీ మనకే అద్దెకు ఇస్తారేమో మళ్లీ ఒకసారి అడిగి చూద్దామా? ” ఒకరోజు వాసుదేవ్తో అంది వారిజ.

శ్యామలరావు తన మామగారిని ఎందుకు ఖాళీ చేయించాడో చూచాయగా విని ఉన్నాడు వాసుదేవ్. ఆ విషయం భార్యకు చెప్పడానికి కాస్త సందేహించాడు.

వారిజ కు విషయం అర్థమయ్యింది. అంతకు ముందు ఇల్లు ఖాళీ చేయించే ప్రసక్తి తీసుకురాని శ్యామలరావు ఆ పక్కింటి రమాకాంతం పోవడంతో తమని ఇల్లు స్వాధీనం చేయమనడం లో ఆంతర్యం ఆమెకు అర్థమయ్యింది.

అందుకే తన మనసులో మాట భర్తకు వివరించింది. కాదనలేదు వాసుదేవ్.

శ్యామలరావు చిరునామా సంపాదించి ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే భర్తను తోడు తీసుకుని వెంకటరమణ కాలనీ కి బయలుదేరింది.

ఇల్లు వెదుక్కుంటూ వచ్చిన వాళ్ళను చూసి ఆశ్చర్య పోయాడు శ్యామలరావు.

కూర్చోమని మర్యాద చేసి మంచినీళ్ళు తెప్పించి ఇచ్చాడు.

శ్యామలరావు ముఖం ఎందుకో కళతప్పి కనబడుతూ ఉండడం గమనించింది వారిజ. చల్లకు వచ్చి ముంత దాచడం దేనికని నెమ్మదిగా వచ్చిన విషయం ప్రస్తావించింది.

” మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే క్షమించాలి. మీరు ఆ ఇల్లు కొనుక్కుని మమ్మల్ని వేరే ఇల్లు చూసుకోమని అన్నప్పుడు మీరే అక్కడ వచ్చి చేరుతారు అనుకున్నాము. కానీ ఇల్లు రెండు నెలలుగా ఖాళీ గా ఉంది. మీకు అక్కడ ఉండే ఉద్దేశం లేకుంటే మాకే అద్దెకు ఇస్తారేమో అడగ డానికి వచ్చాము. ” కాస్త మొహమాట పడుతూనే మొదలు పెట్టింది వారిజ.
కూర్చున్న చోటు నుండి గభాలున లేచి అటు ఇటు నాలుగు అడుగులు నడిచి మళ్లీ వచ్చి కూర్చున్నాడు శ్యామలరావు.

” క్షమించండి ఇలా అంటున్నందుకు .ఒక వేళ మా నాన్నగారికి ఇల్లు అద్దెకు ఇవ్వడం మీకుఅభ్యంతరం అయితే ఆయన , మా అన్నయ్య మా ఇంట్లో ఉంటారు. మేము మీ ఇంట్లో అద్దెకు ఉంటాము . ఆయనకు దగ్గరగా ఉండి చూసుకోవాలి అనే కోరికతో అడుగుతున్నాను. మాకు మీ ఇల్లు అద్దెకు ఇవ్వగలరా ? “

అడగాలి అనుకున్న విషయం అడిగేశాక ఆయన ముఖం చూడ లేనట్టు తలవంచుకుంది వారిజ.
పది నిముషాలు మాట్లాడలేదు శ్యామలరావు. పక్కనే ఉన్న గ్లాసు నీళ్ళుత్రాగి, తువాలుతో ముఖం తుడుచుకుని ఇలా అన్నాడు ” జనన మరణాలు మన చేతిలో లేవు.

ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు . అయిన లౌకిక ప్రపంచం లో బ్రతుకుతున్న మనకు కొన్ని నమ్మకాలూ చాదస్తాలు ఒంట బడతాయి. మా అన్నయ్య జీవిత మంతా మా గురించే ధారపోసాడు. నన్ను చదివించి ప్రయోజకుడిని చేశాడు. నాన్న పోయాక ఆయనే ఇంటికి పెద్ద దిక్కుగా వ్యాపారం అభివృద్ధి చేశాడు. అక్కా చెల్లెళ్ళ పెళ్లి చేశాడు. పెళ్లి కూడా చేసుకోలేదు.
ఆ ఇల్లు కొనడానికి వచ్చినప్పుడు మీ నాన్నగారి పరిస్తితి బాగాలేదు. జరగరానిది ఏదైన జరిగితే మాకు మంచిదిది కాదన్న చాదస్తంతో మీరు ఇల్లు ఖాళీ చేయాలని షరతు పెట్టాడు. మనిషి ఒకటి రకంగా తలిస్తే భగవంతుడి తలపు మరొక విధంగా ఉండవచ్చు అంటారు కదా ! స్వంత ఇంటికి రావాలనుకున్న మా అన్న హఠాత్తుగా తాను ఉంటున్న దేహాన్ని వదిలి వెళ్ళి పోయాడు. నలభై ఐదేళ్ల కే ఆయువు తీరిపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేసి పోయినట్టు ఆయన దేహం వదిలేసి వెళ్ళి పోయాడు. అందుకే ఆ ఇల్లు అలా వదిలేసాము . మీ సమస్య నాకు అర్థమయింది. మీ స్వంత ఇంట్లో నాన్నగారిని ఉంచి మీరు మా ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పని లేదు. మీ నాన్నగారు, అన్నయ్య మా ఇంట్లో అద్దెకు ఉండడానికి నాకు అభ్యంతరం లేదు. మా అన్నయ్య గురించి మీరు మరొకవిధం గా అనుకో కూడదని ఇంత వివరంగా చెప్పాను. ” అని దీర్ఘంగా నిట్టూర్చాడు

” మీ ఇంట్లో జరిగిన విషాదం గురించి మాకు తెలియక ఇలా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాము . క్షమించండి . ” అన్నాడు వాసుదేవ్ .

“మేము ఇప్పట్లో ఆ ఇంటికి రాము. మీ నాన్న గారు రేపే అక్కడ చేరవచ్చును . ముందు ఇస్తున్నంత అద్దె ఇవ్వండి .” అని లేచి నిలబడ్డాడు శ్యామలరావు.

మరెమీ మాట్లాడ లేనట్టు గుమ్మం దాటారు వారిజ, వాసుదేవ్ .

-డా. కె. మీరాబాయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.