తెలుగు సాహిత్యంలో మానవ విలువల చిత్రీకరణ (సాహిత్య వ్యాసం )- తాటికాయ భోజన్న,

ISSN 2278-478

కవులు సమాజానికి మంచి జరగలని కలలు కంటారు.ఆ కలలు లోకాన్ని మార్చాలనుకుంటారు. ఈ పాటలో లోకాన్ని కళ్ళముందు చూపడం కనిపిస్తుంది. కాని ఎన్ని వాస్తవాలు కనిపించిన మానవజాతి నిద్రమబ్బు వదిలించుకోవడం లేదనిపిస్తుంది.

``ఏం కొనేటట్లులేదు
ఏం తినేటట్లులేదు నాగులో..నాగన్నా
ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలో బిచ్చాగాళ్ళ బ్రతుకులాయే నాగులో..నాగన్నా “ఈ పాటలో సామాన్య మానవుని వ్యథ కనబడుతుంది. “గొప్పబ్రతుకంటే ప్రపంచమంతా మన ఆస్తులు విస్తరింపజేసుకొని గ్రహామండలాల్లోకి కూడా వెళ్ళి సూర్యున్ని,చంద్రున్ని వేలం పాటలో కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం కాదు.“(సహాయమే దైవం,అంతర్యామి,ఈనాడు దినపత్రిక.)“భారతదేశం నా మాతృభూమి,భారతీయులందరు నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.ఇది పాత తరం మాట,నేను నా దేశాన్ని అందినంత దోచుకొంటాను ఇది నేటి మనుషులలాంటి మనుషుల మనస్సుల్లోని మాట. మన దేశం దేశభక్తులకు ప్రాణపదం,సాహిత్యానికి కల్పవళ్ళి,సభ్యత సంస్కారాలను నిలువునా జీర్ణించుకున్న ఈ పవిత్ర దేశం ప్రస్తుతం పతన దిశలో పయనిస్తుందని మేదవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో మనుషులుంటారని మరిచిన వారికి ఈ గేయం గుర్తు చేయల్సిన అవసరం ఉందనుకుంటాను.
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పంచుమన్నా,
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్,,అని అన్నటువంటి గురజాడ అడుగుజాడల్ని అనుసరిస్తున్న వారు చాలా తక్కువగా ఉన్నారని నేటి సమాజాన్ని చూస్తే తేలుస్తుంది.మనుషుల చరిత్రలని బట్టి దేశ చరిత్రలు తెలుస్తాయి.మనుషులులేని దేశముండదు.కాని మానవత్వం మరిచిన దేశలుండొచ్చు.మన దేశం నాడు సకలసంస్కారాలకు నిలయమైనది,కాని నేడు వాటిని నెమరువేస్తూ,సంస్కారవంతులకై ఎదురు చూస్తోంది.

“ఏ దేశ చరిత్ర చూసిన
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం,

(మహాప్రస్థానం)లో శ్రీశ్రీ వాడి,వేడి గల మాటలు ప్రపంచాన్నేఆలోచింపజేస్తాయనుకుంటే,చాల తక్కువ మందిని ఇలా తట్టి వెళ్ళినట్లు అనిపిస్తుంది.మనుషులకు మాటకంటే,పాటకంటే,మంచికంటే,….ధనమంటేనే ఇష్టమున్నట్లు కనిపిస్తుంది. “తమకు మరణమే లేదన్నట్లు జీవితాంతం సంపాదిస్తూనే ఉంటారు.చట్టాన్ని తమ చుట్టం చేసుకొని టక్కుటమార గరడి విద్యలు ప్రదర్శిస్తూ,అడ్డగోలు తర్కాలతో అందినంత దోచుకోవడమే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు.“ (అర్థశాస్రం,కౌటిల్యుడు).

భారతదశంలో పుట్టడం అదృష్టమని,నీతి,నీజాయితి కలిగి ఉండాలని పలుక ,బలపం పట్టిన దగ్గరనుండి ఇక్కడ మనుషులకు నేర్పిస్తారు.కాని ఈనాటి లోకం అవేవి తెలియనట్లు మృగాళ్ళా వ్యవహరిస్తున్నారనడానికి ఉదంతాలెన్నో ఉన్నాయి.

“ఏ పూర్వపుణ్యమో ఏయోగ బలమో
జనయించినాడవి స్వర్గఖండమున
ఏ మంచి పూవ్వులను పూజీంచినావో
నిన్నుమోసె ఈ తల్లి కనుక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి ఎందు
లేరురా మనవంటి పౌరులింకెందు“

అన్నటువంటి రాయప్రోలు మాటలు నిజమే అనిపిస్తాయి.నిజంగా ఈ భూమి గొప్పది, ఎప్పటికి ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకుంటుంది అనే నమ్మకం కొందరిలో బలంగా నాటుకొని ఉన్నట్లు తెలుస్తుంది.ఎందరు నీతి తప్పిన వాళ్ళున్నా,నీతివంతులకు దేశం గొడ్డుపోలేదు.“వజ్రం చీకట్లోనూ ప్రకాశిస్తుంది`.మరి ఆ వజ్రాలు బయటపడల్సిన సమయం ఆసన్నమైనదని గుర్తిస్తే మంచిది.కాలం కలిసోచ్చినంత వరకు అంతా దొరలే,పాపం పండిన రోజు దొంగలంతా దిక్కులేకుండపోతారు.“మేకపోతు ఎంత ముసుగేసిన సింహం కాలేదనే“విషయం ఆలస్యంగానైన తెలుసుకుంటారు.నేటి సమాజంలో తరిగిపోతున్న మానవ విలువలని చూసి ఏం చేయాలో తెలియని లక్షలో ఒక్కడు,వాడి మనస్తతత్వమును తిట్టుకుంటూ…మనిషిగా బ్రతకాలని ఆశపడే వాడి అగచాట్లుఎప్పుడు అంతరిస్తాయో ? తెలియడం లేదు.

మనిషి మనిషిలా ఉండడం లేదనే సత్యన్ని చెప్పిన అక్షరాలు నేర్వని సహజకవి అందేశ్రీ బాధను, ఆదరించిన నాథుడే లేడనిపిస్తుంది.
“మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు
మచ్చుకైనలేడు చూడూ..మానవత్వం ఉన్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు`

`……లక్షలో ఒక్కడు కనిపిండం కష్టమే,ఆ ఒక్కోక్కరు ఏకమైన నాడు అందేశ్రీ కలలు నెరవేరినట్లే.మరి అలాంటి కలల రోజు ఎప్పుడు వస్తుందో ?వేచిచూడాలి.అలాంటి మంచిరోజు రావాలని అందరం ఆశిద్దాం.మార్పుకు శ్రీకారం చుడదాం.“చాపలు పట్టేవాడు తాను ఆత్మనని భావిస్తే ఉత్తమ బెస్తవాడుగా మారాతాడు.విద్యార్థి తనను తాను ఆత్మగా భావిస్తే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతాడు. (స్వామి వివేకనంద జీవితం సందేశం,2012,80) మనం ఉత్తమంగా ఎదుగుదాం,ఉన్నతిని సాధిద్దాం. “ఎదగాలి నదిలాంటి మనం ఎప్పటికైన సముద్రంగా మారలి,మారక తప్పదు.(స్తుతి,అంతర్యామి,ఈనాడు,04,03,2013) మనిషులు మారాలి అంటారందరు కానీ మనతోనే మార్పు మొదలౌతుందంటారు కొందరు వారే మనకు మార్గదర్శం.వీలైతే చెడు చూడకుండా,మాట్లాడకుండా,చేయకుండా,గాంధీజీని అనుసరిద్దాం,ఇలానైనా భారతజాతి నిర్మాతల రుణం కొంతైన తీర్చిన వారిమౌతాం…………జైహింద్.

ఆధార గ్రంథాలు :

1.తెలుగు సాహిత్య సమీక్ష,నాగయ్య.జి,స్టూడెంట్స్ ఆప్ సెట్ ప్రింటర్స్,1999.
2.కష్టపడి చదువొద్దు ఇష్టపడి చదువండి.పట్టాభిరామ్,బి.వి,ఎమ్మెస్కో బుక్స్,2007.
3.ఈనాడు దిన పత్రికలు.మొ,,
4.స్వామి వివేకనంద జీవితం సందేశం,రామకృష్ణమఠం, గ్రాఫిక ప్రింటర్స్, 2012.

– తాటికాయ భోజన్న,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.