సెకండ్ ఛాన్స్ (కథ )-శ్రీదేవి

నిజం చెప్పే వారికి “సెకండ్ ఛాన్స్” అక్కర్లేదు.తెలివితేటలు ఉన్నవాళ్లకు “సెకండ్ ఛాన్స్” అక్కర్లేదు.అద్రుశ్టవంతులకి “సెకండ్ ఛాన్స్” అక్కర్లేదు. మరి ఎవరికి “సెకండ్ ఛాన్స్” కావాలి?

ఎప్పుడు,ఎవరికి, ఎవరు ఇవ్వాలి. హేంటీ? బోరింగ్ ప్రశ్న అనుకుంటున్నారా? కాదండీ,చాలా అవసరమయిన ప్రశ్న, మనలో చాలా మంది సెకండ్ ఛాన్స్ దొరికితే బాగుండు అనుకుంటాం…..ఎందుకంటే మొదటి ఛాన్స్, ‘ఛాన్స్’ అని తెలుసుకునే లొ పే చేజారిపోతుంది కనుక.ఇక ఈ కోవలోకి ఎవరెవరు వస్తారు అంటే- విద్యార్థులు, ఉద్యోగస్థులు, ప్రేమికులు, ఒళ్లేంటి, టెండర్ నోటీసుల వాళ్ళ దగ్గర్నుంచి ఉరి శిక్ష వేయబడ్డ వాళ్ళ వరకు అందరు వస్తారు.కాని మనం ఆశించినట్టు, వేరే వారికి ఇస్తామా?? కధ పూర్తిగా చదివా క మీరే నిర్ణయించండి.

                         *******                                    ******                                              *******
నట్ట నడి రాత్రి, జోరున వాన.ఫుల్లుగా లోడ్లో ఉన్న నేను.కారులో 185 కి.మీ. వేగంతో వెళుతున్న..నా పేరు ప్రజ్వల్ .నేను చిన్నప్పట్నించి తెలివి గల వాడిని.నాకు అసాధ్యం అంటు ఏదీ లేదు.బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు నేను-మిడిల్ క్లాస్..
కాని నాకు ఇంటా-బయట ఇంటెలిజెంట్, క్లవర్, ట్రబుల్ షూటర్ అను బిరుదులు.అమ్మ దిష్టి తీయకుండా ఒక్క రోజు కూడా ఇంట్లోకి రానీదు అంటే నమ్మండి.నాకు కావల్సిన దాని కోసం నేను ఎపుడు ఏడవను.

జస్ట్ నా బ్రెయిన్ ఉపయోగించి నా కాళ్ల దగ్గరకు తెచ్చుకుంటాను. నాకు ‘అద్రుశ్టవంతుడని’ కూడా పేరు.నాకు నవ్వు ఆగదు ఆ మాటంటే..అది ఉందో లేదో తెలీదు.ఎలా ఉంటుందో కూడా తెలీదు.కాని మనలోనే ఉండి, స్వరూపం ఉండి, ఒక పరిమాణం ఉన్న, మనకు మేలు చేసే ‘మెదడుని’ మనం నమ్ముకోము, ఇక్కడ జనాలు ఖచ్చితంగా దురద్రుశ్టవంతులు మాత్రం అయి తీరుతారు.
20 ఏళ్ళ కే నేను గ్రీన్ ఎర్త్ కంపెనీకి సి.ఇ.ఒ. అయ్యాను 22 ఏళ్ళ కే కోటీశ్వరుడిని అయ్యాను.నెక్ష్ట్,నెక్స్ట్ తరువాతేంటి స్టక్ అయిపోయాను.

పెళ్ళి, ప్రేమ ఇలాంటివి ఏమీ నాకు ఇంటరెస్ట్ లేదు, ఎంత ఆలోచించినా ఏం చేయాలో తోచలేదు. ఉన్నదంతా దానం చేసేసాను. అమ్మ, నాన్న ఏమీ అనలేదు.మళ్ళీ మిడిల్ క్లాస్స్ కి వచ్చేసా.

జనం ‘పబ్లిసిటి’ కోసం అన్నారు. కొంతమంది అమ్మాయిలు ‘కన్నీరు కార్చారు’, ఇంకొంత మంది అంత చిన్న వయసులో ‘హాండెల్ చేయలేక పోయాడు’ అన్నారు. నాకు త్రుప్తిగా లేదు, ఏదో గ్యాప్ నాకు ఎంత మాత్రం త్రుప్తిగా లేదు.
ఎందుకంటే మనం జీరతో మొదలు అయేటపుడు ఉండే జీల్, 20వ మెట్టులో ఉండదు.నాకు ఆ టేస్ట్ మళ్ళీ కావాలి, అంతే…

                       ******                                          ********                                              *****

25 వ ఏడు.30 కోట్లు ఆస్తి మళ్ళీ వచ్చింది, జస్ట్ సాఫ్ట్ వేర్ బిజినెస్తో, కాని ‘త్రుప్తిగా’ మాత్రం లేదు. అందరు ముక్కున వేలేసుకునే లోపే ఉన్నదంతా దానం చేసి ‘మిడిల్ క్లాస్ బాయ్’ గా మిగిలిపోయి కనిపించాను. అంకుల్స్ “పొగరుబోతు” అన్నారు, ఆంటీలు “పిచ్చోడు చేతిలో రాయి” అన్నారు, “ఇర్రెస్పాన్సిబల్” అన్నారు అమ్మాయిలు, “మామ నువ్వు కేక” అన్నారు ఫ్రెండ్స్.

కాని నాకు కావలసిన “త్రుప్తి” ఇంకా దొరకటం లేదు. నెక్స్ట్.. నెక్స్ట్… నెక్స్ట్..మళ్ళీ స్టక్కడ్…..

                           *******                                          ********                                         ********

“గ్రీన్ ఎర్త్” – నేను చేసిన ప్రాజెక్ట్ వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి.ఉన్న మ్యాన్ పవర్ కి ఉద్యోగాలు పోకుండా వారికి సహాయ పడే విధంగా కాస్ట్ ఎఫ్ఫెక్టివ్ వే లో, ‘క్లీనింగ్ మిషన్స్’, ‘అండర్ గ్రౌండ్ డ్రైనింగ్ సిస్టం’, ‘ఏర్ పొల్యూషన్ ప్యూరిఫయింగ్ మిషన్స్’ ఇలా ఎన్నో ఇచ్చింది నా మెదడు ఆ సంస్థకి. ఆ నమ్మకంతోనే నన్ను రిమోట్ ఏరియా కి “ప్రాజెక్ట్ డెవెలప్‌మెంట్ హెడ్” గా పంపించారు. నాకు పని రాక్షసుడని పేరు. నాకు వాళ్లని ఏ ‘పదంతో’ తిట్టాలో తెలీదు.నేను నా ఒళ్ళు కదలకుండా, కేవలం నా మెదడు తో పని చేయిస్తాను.అంతే కాదు ఎవరైనా సెకండ్ టైం అడిగినా, సెకండ్ ఛాన్స్ అడిగినా నాకు తిక్క రేగి పోతుంది.
నా డొనేషన్స్ కి పెద్దగా మంచి పేరు లేదు. పొగరుబోతు, ఐడెంటిటి క్రైసిస్ అని పేర్లు. నా అన్వేషణ మాత్రం ‘త్రుప్తి’ కోసం..చిత్రం ఎంటంటే..కోట్లు పారేసినా.. నాకు కావల్సిన ‘త్రుప్తి’ లేదు జీవితంలో.

                            ******                                    ******                                      *******

నాకు రిమోట్ ఏరియాలో ఏదో కొత్త ది తెలుసుకోబోతున్నాను అని ఒక జీల్.ఈ సారి అయిన నాక్కావల్సిన త్రుప్తి ఇక్కడైనా దో…రు…క్కు…తా..ఆఆ.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే లోతయిన బురద గుంటలో పడి పోయాను…లేచి నిలదొక్కుకుందమన్నా బురద, కళ్ళ నిండా. ఏమి కనపడటం లేదు, కాళ్ళు జారి పోతున్నాయి.

“హెయ్, హాల్లో ఈ లాఠీ పట్టుకోండి, నెమ్మదిగా రండి”, ఎవరో సాయం చేస్తున్నారు.మసక మసక తప్ప ఏమి కనబడటం లేదు.ఎవరో పోలీసు ఆయన, సన్నగా కనబడుతున్నాడు.

నేను అడుగు వేస్తే జారిపోతున్నాను. తిరిగి ఆయనే అన్నాడు “అలా కాదు.. మీరలాగే ఉండండి, నేనిపుడే వస్తాను” అని. కాసేపు నిశ్శబ్దం. ఆయన వచ్చినట్టు ఉన్నాడు, అడుగుల శబ్ధం వినిపించింది.

“ఇదిగోండి, పట్టుకోండి తాడు. ఏంటి ఆలోచిస్తున్నారు…? కమాన్.. కేచ్ ఇట్.. ఒకే.. హ.. అక్కడే ఉండన్డి”.
లేడీ కానిస్టేబుల్.. !! సాధారణంగా అమ్మాయిలు ఎవరూ ఇలాంటపుడు స్వయముగా సహాయం చేయరు, ఇంకెవరినయినా పిలుస్తారు.

నా తల వైపు వచ్చింది, గొంతు వినిపిస్తోంది కాని మనిషి పూర్తిగా కనబడటం లేదు. నా రెండు చేతులకి తాడు కట్టేసింది.పాపం నన్ను లాగటానికి తెగ కష్టపడుతోంది..చివరి దాకా వస్తోంది..మోయలేక వదిలేస్తోంది.

ఆయాస పడుతూ “హా..యాం సారీ..ఒన్ మోర్ టైం విల్ ట్రై..హా” అంటోంది కాని వదిలెయ్ట్లేదు..
నాకు గ్రిప్ దొరక్ట్లేదు,అందుకే తనకెందుకు కష్టం అని “హెయ్….వదిలేసి,మీ స్టాఫ్‌కి ఫోన్ చేయండి” అన్నాను.

“హ??!! షటప్..ఒక్కే??”అంటూ గదమాయిస్తోంది నన్ను-కాని వదలట లేదు.పైకి లాగుతున్నపుడు ఆమె వెచ్చ టి ‘శ్వాస’ నా చెవులకి ‘ఓంకార నాదంలా’ వినబడుతోంది.మళ్ళీ జారిపోతున్న నన్ను హీ సారి… తాడు వదిలేసి అమాంతం పట్టుకొని తన హ్రిదయానికి హత్తుకొని పైకి హోక్క ఉదుటున లాగేసింది.ఆ మెత్త టి హ్రిదయపు థాక్కిడి, నా పసితనాన్ని పలకరించింది-నాలో ఉన్న ‘మగతనాన్ని’ నిద్ర లేపింది..

మొత్తానికి లా..గే..సింది.. నన్ను పైకి ఇంక, తన ప్రపంచంలోకి, తను మాత్రం చతికిల పడి పోయింది.

నా కళ్ళు పూర్తిగా మూసుకు పోయినా యి. నెక్స్ట్, నెక్స్ట్, ఏంటి అని అరుస్తున్న, తను ఆయాసపడుతూనే “సారీ..ఉండండి..విల్ గెట్ సం వాటర్” అంటూ అక్కడినుంచి వెళ్ళింది.

నిజంగా కళ్ళు లేకపోతే ఈ జగమెంత అంధకారమో కదా, నాకు గుడ్డి వారు పడే బాధేంటో అపుడే అర్థం అయింది.మనమెంతో అద్రుశ్టవంతులు అని తెలుసుకున్నాను ఆ సమయానా.కొంత సేపటికి తన అడుగుల చప్పుడు ఎoడుటాకుల మధ్యలో వినబడుతున్నాయి.

“హేయ్ సారీ, మీరే అక్కడికి రావాలి, పదండి” అంటూ నా చేయి పట్టుకొని నడిపిస్తోంది.నాకు తను ఒక నైటేంగల్లా అనిపించింది.ఆ స్పర్శే నర-నరం పాకేసింది.బ్రెయిన్ మొద్దుబారి పోయింది.ఎక్కడో చెరువు దగ్గరి కి తీసుకెళ్లింది. గదమాయిస్తోంది, “హ! కూర్చోన్డి..త్వరగా..బ్రైన్ లేదా” అంటూ.

మొట్ట మొదటి సారి నా జీవితంలో నన్ను ఒకరు “బ్రెయిన్ లేదా” అని అడిగారు..హహ! అదీ హొక ‘లేడీ కానిస్టేబుల్’ బ్రైన్ ఉన్న కూడా పని చేయని పరిస్ధితి, వండర్‌ఫుల్ మూ మెంట్.నా మొహాన, పోలీసులు ఇంటరాగేషన్ టైం లో నీళ్ళు కొట్టినట్టు కొడుతోంది. ఝల్లుమన్న కూడా కళ్ళు కాస్త విప్పారి కనిపిస్తున్నాయి కొంచెం గా తన కోపపు వదనం కనిపిస్తోంది.
తేరుకునే లోపే మళ్ల రెండు మూడు సార్లు నీళ్ళు కొట్టింది మొహానా..ఇక తను రంకెలేస్తోంది “ఇప్పుడు కనిపిస్తున్నాయా కళ్ళు..?? హా..?నిన్నే”?? వామ్మో “మిమ్మల్నే” నించి “నిన్నే” దాకా వచ్చింది.తను హడావిడిగా “ఛలో ఇంక ఆ నీళ్ళ ల్లో బట్టలు క్లీన్ చేసుకొని వెళ్ళు..పొద్దున్నే వెధవ బేరం” అంటూ వెళ్ళిపోతోంది. పెద్ద కళ్ళు, కొ టేరు ముక్కు, ఎత్తయిన వక్ష స్తనం, సన్నని ఝగనం,పసితనపు ఛాయలు వీడని బాడీలాంగ్వేజ్,ఆమెని చూస్తే గమ్మతు అయిన భావన.
వడివడిగా సైకిల్ తొక్కుకుంటూ”యూ బ్రైన్ లెస్స్ త్వరగా వెళ్ళు ఇక్కడ నించి, అసలే ఇది నక్సల్స్ ఏరియా” అంటోంది.అన్నిటికి మించి పెద్ద నోరు,బావురు కప్పలా, హహ!!!

“హెయ్ మీ పేరు” అని అరిచాను నేను, తను వెనక్కి తిరగకుండా “హా త్రుప్తి” అన్నది. గాష్..నేను ఒక త్రుప్తి కోసం వస్తే…నాకు…గాడ్..థాంక్ యూ!!!

                         ******                                      ********                                            *********

వకీలు గారు వివరిస్తున్నారు ‘ప్రాజెక్ట్ మ్యాప్’ ని చూపిస్తూ “సర్, ఇదిగోండి ఇక్కడినుంచి 2 కి.మీ.ల వరకు పోరంబోకు స్థలాలు, అక్కడినుంచి 3 కి.మీ.ల వరకు ప్రైవేటు స్థలాలు.సరిగ్గా అక్కడ నించి గుడిపుడి వరకు అంటే 35 కి.మీ.ల వరకు ప్రభుత్వ భూములు.అక్కడ ప్రాజెక్ట్ కి అన్ని సిద్ధం చేసుకున్నా క పాత ప్రభుత్వం పడిపోయింది.తర్వాత 3 ప్రభుత్వాలు మారాయి కాని ఈ ప్రాజెక్ట్ కి మాత్రం మోక్షం రాలేదు. ఇక్కడున్న నీటిని క్లీన్ చేసి సిటీ కి పంపించే కన్న, పంట సాగులకి వినియోగించాలని ఇక్కడి ప్రజల విన్నపం, అని ముగించారు.

ఎన్నో పధకాలు పట్నం కోసం చేసాను,దేనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు.ఎందుకంటే సిటీ కదా అందరు ఫొకస్ చేస్తారు.కాని నా అవసరం అక్కడి కంటే ఇక్కడే ఉంది.రెక్రూటింగ్ ప్రకటించాను.పెద్దగా స్పందన లభించలేదు.మోస్తరు తెలివితేటలు ఉన్నవాళ్లు “వర్తమానం ఉండదు” అనుకున్నారు, బాగా తెలివి గల వాళ్ళు “భవిష్యత్తు ఉండదు” అనుకున్నారు.
స్వతంత్రం వచ్చిన 60 యేళ్ల తర్వాత కూడ పల్లె ప్రాంతాలను చూసి భయపడుతున్నారు మన యువత.భగత్ సింగ్, గాంధి వీళ్ళంతా ప్రాణాలకు తెగించి స్వతంత్ర యుద్ధం చేసింది 20 ఏళ్ళ వయసు లోనే కదా, మరి మనం, వాళ్ళ ఆస్తులకే కాని ఆశయాలకు వారసులం కాలేమా..??? నా పని ఇక్కడే ఆగిపోయింది.ఛాలెంజస్ ఉన్నప్పుడే మన మెదడుకి మేత దొరుకుతుంది. సిటీస్ లో అందరు ఇన్వెస్ట్ చేస్తారు, రాబడి బాగుంటుంది కాబట్టి, ఇక్కడ మానవ వనరులు కూడ దొరకవు.తలుచుకుంటే సిగ్గు గా వుంది..ఛ..!!

“ఏంటీ సర్..? పని కాలేదని చిరాకు పడుతున్నారా..??” వకీలు గారు టి ఫిన్ బాక్స్ ఒపెన్ చేస్తూ అడుగుతున్నారు.
“హుమ్మ్”…నిట్టూర్చాను సమాధానం తెలియక, సిగరెట్ నేల కే సి కసిగా తొక్కుతూ “కాకపోతే మరేంటండి” అన్నాను.
ఆయన డిన్నర్ ప్లేట్ చేతికి అందిస్తూ, “జనాలకి ఆశ పెరిగిపోయింది సర్.అయినా ఇక్కడ మీరు ప్రాజెక్ట్ కట్టించినా, రేపటి కల్లా ఉన్న నలుగురు జనం ఖాళీ చేసి పట్నం వెళ్ళిపోతారు, మీరు చేసి దంత బూడిదలో పోసిన పన్నీరు అవదని ఏంటి గ్యారంటీ..??? కాబట్టి రేపే పాకప్ చెప్పి, వెళ్ళిపోయి హాయిగా సిటీ జీవితం గడపండి.” అన్నాడు పెద్ద గీతోపదేశం చేస్తున్నట్టు.నేను తింటున్న వాడి నల్లా ఆపే సి “మీకు బ్రైన్ ఉందా..?? అన్నాను.

వకీలు ఖంగు తిన్నాడు.నేను అతి ఛీత్కారంగా మొహం పెట్టి “పోని కడుపుకి అన్నం తిన్నారా? గడ్డి తిన్నారా? హ, ఏం లేదు, మీ సిటీ లో ఎవరన్నా పండించుకొని తింటుంటే చెప్పండి పాకప్ చెప్తాను” అన్నాను.“సిటీ.. సిటీ అని మిడి సి పడకండి. అక్కడ కూడా అన్నం తినాల్సిందే. అదీ ఇక్కడ నించి పంపాల్సిందే.కాబట్టి వచ్చిన పని చూసుకోని పోండి. అన్నం పెట్టే రైతు సౌకర్యం ఆలోచించకపోవటం, పని జరగకుండా కాలు అడ్డు పెట్టడం నిరక్షరకుక్షులు చేసే పనులు, వకీలు అట-వకీలు…”, కసి తీరా తిట్టాను నేను.

ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు, వెళ్ళి పోయి మళ్లి వెనక్కి వచ్చి, “సారీ సర్” అని వెళ్ళి పోయాడు.

                     *************                                  *********************                           ***********
“సర్!!సర్”, అంటూ వకీలు గారి గొంతు వినబడుతోన్ది.. పొద్దున్నే ఎందుకు వచ్చుంటారు..?పరుగున వెళ్ళి డోర్ తెరిచాను…ఆశ్చర్యం..ఫైల్స్ పట్టుకున్న యువకులు పెద్ద క్యూ లో.

నాకర్థం కాలేదు, కలా-నిజమా!!??

వకీలు గారు “సార్! మీరు రెడీ అయి వస్తే ఇంటెర్వ్యూస్ మొదలు పెడదాం” అన్నారు.“ అది సరే అసలు వీళ్ళంతా రాత్రికి రాత్రి ఎలా వచ్చారు.? అని అడిగాను ఆయన్ని.ఆయన దానికి బిజీగా మొహం పెట్టి “ఓహ్!!మీరు అదంతా వదిలేయండి..30 మంది సులభంగా తక్కువ జీతానికే ఒప్పుకున్నారు”, అన్నారు.

నా మనసూరుకోక మళ్ళీ అడిగాను, “కాని ఎలా? ఇందులో ఏమి కిరికిరి ఎం లేదు కదా మీది???”
వకీలు గారు, ఆ మాటకి నవ్వు ఆపుకుంటూ “భలే వారే!! ప్రాజెక్ట్ చూసి వచ్చారు” అన్నాడు.

“నేను నమ్మను, అదీ ఇంత తక్కువ జీతానికా..??!! కాసేపు నిజాలు మాట్లాడుకుందాం,” అంటూ ఆయన చేయి మెలిపెట్టాను గట్టిగా..ఆయన విదిలించుకుంటూ “త్రుప్తి కోసం” వచ్చారు అన్నాడు.

“ఒహ్!!! ఎమేజింగ్.. ఇంత మంది ఆత్మ త్రుప్తి కోసం వచ్చారా..??” అన్నాను, అయన చేయి విడుస్తూ..
ఆయన చాలా గర్వంగా “కాదు సర్, కానిస్టేబుల్ త్రుప్తికి ఇచ్చిన మాట కోసం” అన్నాడు.

“హే..ఏఏఏంటి”…????!!!!!!!! అని నోరు తెరవటం నా వంతైంది.

వకీలు గారు రెస్యూమేస్ ని నా చేతిలో పెడుతూ, “ఔను సర్! ఈ ప్రాజెక్ట్ గురించి మా ఊళ్ళో బాధ పడని వాళ్ళు లేరు, కాని ఎవరికి సాధ్య పరిచే ఆలోచనే లేదు.మీరు చేస్తున్న కృషి 2 నెలలుగా త్రుప్తి చూస్తోంది. అందుకే లీవ్ పెట్టి వారం రోజులుగా, సిటీస్ లో, కాంపైన్ నిర్వహించింది. “సేవ్ ఫార్మర్స్, సేవ్ రిమోట్ ఏరియా” అంటూ అందరినీ మోటివేట్ చేసింది”, అని వెళ్ళిపోయాడు.నేను దాదాపు నోరు ‘డ్యామ్’ అంత తెరిచాను, ఒక్క అమ్మాయికి, ఇది ఎలా సాధ్యం???!! ఎమేజింగ్ య!!
“త్రుప్తి ఎక్కడుంటుంది?” నా మనసు గుసగుస గా నన్నే అడిగింది…

                         ********                                               *********                                   ***********

పోలీస్ స్టేషన్: త్రుప్తి-కాదు, కానిస్టేబుల్ త్రుప్తి ఎంతో శ్రద్ధగా ఫైల్స్ తిరగేస్తోంది.నేను వచ్చిన విషయం కూడ గమనించలేదు. నేను నా గొంతు సవరించుకున్నాను, తన దృష్టి మరల్చటానికి.

“ఒహ్ మీరా! హేంటీ వాచ్ పోయిందా? కళ్ళజోడు పోయిందా?ఉంటే ఫోటో పెట్టెళ్ళండి” అంటూ స్టేషన్ అంత కలయ తిరుగుతోంది త్రుప్తి.

నేను లేని కోపం నటిస్తూ “హెల్లో!నేను ఎలా కనిపిస్తున్నా? మీ కంటికి వాచ్ కోసం, పెన్ను కోసం కంప్లైంట్ ఇచ్చే వాడిలా కనబడుతున్నానా?” అన్నాను.

త్రుప్తి “ఓహ్! మరింకేం పోగొట్టుకున్నారు”? అని అడిగి చెప్పేలోపే, “హేయ్ యు బ్రైన్ లెస్స్!! నిన్నే” అంటూ కసురుకుంది.”
హోసిని! ఎంత పొగరే నీకు, కాని దీనిలో ఏదో ఉంది”, మత్తో- గమ్మత్తో ఏదో ఉంది, నన్ను చిత్తు చేస్తోంది.దీన్ని చూస్తే చాలు నాలుక మడత పడి ఛస్తుంది. పైగా గదమాయిస్తుంది, బోడి కానిస్టేబుల్, పెద్ద డి.ఐ.జి. అనుకుంటుంది.

త్రుప్తి తట్టింది నన్ను “బ్రెయిన్‌లెస్స్ గారు, ఏం పోగొట్టుకున్నారు?” అంటూ.

“హ! నా బ్రెయిన్” అన్నాను నేను అనాలోచితంగా, తిరిగి నాలుక కరచుకున్న, నేను.ఆ రాక్షసి పట్టేసింది, “వాట్ట్”?? అంటూ కళ్ళు ఉరిమింది.

“సారి.. ఏం లేదు..థేంక్స్ చెబ్దాం” అని వచ్చాను, అన్నాను.

“దేనికి”?? అంది అమాయకంగా మొహం పెట్టి..ఈ గయ్యాళిలో ఈ ఏంగిల్ కూడ ఉందా? అనుకుంటూ నవ్వొచ్చింది నాకు.అదే “సిటి లో క్యాంపెయిన్ కోసం…” అని నసిగాను.

“ఓహ్ అదా! ఇది మీ ఊరే కాదు-మా ఊరు కూడ” అన్నది త్రుప్తి.నేను కొంచెం కుతూహలంగా తనని అడిగాను” ఎవరో తె లీని వాళ్లని ఎలా ఒప్పించగలిగారు.. అసలు..”?

“దీనికి పెద్ద-పెద్ద ఆలోచనలు అక్కర్లేదు. కేవలం పని సాధించాలని ఆశ ఉంటే చాలు.అన్నిటి కంటే ‘మనసు’ ఉంటే చాలు.”

“అన్నట్టు ఇక్కడ నత్తికి మందు ఉంది, సాయంకాలం వస్తే ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను, ఇంకెళ్ళు” అని తిరిగి తన పనిలో పడిపోయింది పని రాక్షసి. ఇంతలో గుర్తుకొచ్చింది..హాగాగు ఇది ఏ మంది,నాకు నత్తా? దీని దుంప తెగ? పిక్స్ ఐపోయింది, నాకు నత్తి అని.మరొ మాటకి ఛాన్స్ లేకుండా ఆఫీస్ రూం లోకి వెళ్ళిపోయింది, ఒట్టి పొగరుబోతు.

“ఇంతకీ ఏదన్నా పోగొట్టుకుంటే కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి” అంటూ లోపల్నించే అరుస్తొంది, త్రుప్తి.

“అవును కంప్లైంట్ ఇవ్వాలి…”ఐ మిస్స్డ్ మై హార్ట్”.అనుకుంటూ నా బైక్ స్టార్ట్ చేసాను.వావ్!! ప్రపంచంలో ఏది పోగొట్టుకున్నా మనిషి బాధిస్తాడు కాని, హ్రిదయం పోగొట్టుకున్నపుడు మాత్రం పిచ్చిగా పరవశిస్తాడు. నిజంగా నిజం!! “ఐ ఏం క్రేజ్ ఎట్ యూ మై లేడి”.

నత్తికి మందిప్పిస్తావా?? నీకిస్తానే సరైన డోసు… బక్క నారి అనుకుంటూ, నాకు, నేనే ఒక శపథం చేసుకున్నాను.

                              *********                   ********                                         **********

వకీలు గారు వచ్చారు హడావిడిగా “ఎక్కడికెళ్ళారు సర్? ఇక్కడ వాళ్ళకు ఏదో అనుమతులు కావలట” అంటూ.
ఒహ్! యా, అన్నట్టు అదొక టి ఉంది కదా!! ప్రభుత్వ అనుమతి!! నో ఇష్యూ,తెప్పిస్తాం, అది ఎంత లోకి..రెండు రోజుల్లో వచ్చేస్తుంది,అంతా మనోళ్ళే కావల్సిన డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోండి,” అని చెప్పి ఆ రోజు సాయంత్రమే నేను, వకీలు గారు హైదరాబాద్ బయలుదేరాము.

                          *******                                  **********                             ******                         ***** 

రెండు రోజులు అనుకున్న పని 3 నెలలు పట్టింది. అద్రుష్టం, అసలంటూ పని అయింది..

ప్రతి పక్షం పార్టి వాళ్ళు “సొంత ప్రయోజనం కోసం” అంటూ మాక్కావల్సిన ఆయన మీద బురద జల్లి పనికి అడ్డు పడ్డారు. మొత్తానికి అనుమతి దొరికింది.

త్రుప్తికి చెప్పాలి, పిచ్చి ది, ఎగిరి గంతేస్తుంది.హ!హ!..దాన్ని చూసి, మాట్లాడి మూడు నెలలు అయింది. అసలు నా గురించి ఆలోచిస్తోందా తను.

                        *******                                ********                       *********                  ***********

వకీలు గారే, మా ఇంటికొచ్చారు, నేను “గ్రాండ్ సక్సెస్”!! అంటూ ఆనందంతో ఆయన్ని ఒక్క ఉదుటున ఎత్తేసాను.ఆయన కూడ ఉప్పొంగి పోయారు. “20 ఏళ్ళుగా మూల పడ్డ ప్రాజెక్ట్, మనం సాధించాం,” అన్నాడు కరచాలనం చేస్తూ.నేను అనుమానం తో “ఈ లోపు ఉద్యోగులకి ఆసక్తి పోయుంటుంది, మళ్లి పరిస్ధితి మొదటికి వచ్చుంటుంది, పని ఐతే అయింది కానీ..” అని అడిగాను సందేహంగా.

ఆయన దానికి “కంగారేం లేదు సర్..మన త్రుప్తి ఎప్పటికప్పుడు వాళ్ళ తో టచ్ లో ఉంటూ..వాళ్ళు లో ఉన్న ఆసక్తి నీరు కారిపోకుండా కాపాడుకొచ్చింది.పైగా వాళ్ళు కూడ ఈ శుభవార్త కొసమే ఎదురు చూస్తున్నారు,” అన్నాడు ఆయన.
వయసు పైనబడ్డా, ఆయన కళ్ళల్లో ఒక మంచి పనిని సాధిస్తున్నామే ‘తేజం’ కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

ఇంత మంది మంచి మనసుల మధ్య పని చేయటం ఒక్క గొప్ప అనుభూతిని ఇస్తోంది.కార్పొరేట్ మనుషుల మధ్య ఏదో ఉక్కిరి బిక్కిరి గా ఉంటుంది. “త్రుప్తి నీకు ఎలా సాధ్యం ఇదంతా? ఎందుకంత తపన?” నీ వయసు వారంతా ఏ చీర కొందామా, ఎలాంటి మొగుడు కావాలి అని ఆలోచిస్తారు.కాని నువ్వు మాత్రం ఎపుడూ ఊరి బాగె నీ జీవితం అన్నట్టు ఉంటావు”, అని అనుకుంటూ, నా మనసును లోనే త్రుప్తి కి ఒక చిన్న తాజ్ మహల్ కట్టేసాను ఉన్న పళంగా.. హహ!!.

ఈ ఊరికి నయిట్ ఏంగిల్ నువ్వు- త్రుప్తి..అనుకుంటూ ఉన్న పళంగా కార్ తీసి,పోలీస్ స్టేషన్ వైపు టర్న్ చేసాను.దారి లో ఉన్న నది దగ్గర కార్ ఆపి, నా డైమండ్ రింగ్, వాచ్, బ్రేస్లెట్ నది లో విసిరేసాను.. ఒక నిరాడంబరపు కోమలి కోసం చిన్న- చిన్న వస్తువులు పోగొట్టుకోవటం లో ఆనందం ఉంది.నేరుగా మళ్లి స్టేషన్ వైపు పోనిచ్చాను కార్ని.
అక్కడకు వెళ్ళగానే “త్రుప్తి..న.. న ..పోయినా యి..అన్నాను” తడబడుతూ.
తను నా కంగారు చూసి “ఏంటి, ఏం పోగొట్టుకున్నారు” అంది కొంటెగా.
వ..వ..వాచ్..ఇంక రింగ్..అన్నాను లేని నత్తి నటిస్తూ థేంక్స్ చెప్తే..” ఇది నీ ఊరే కాదు, మాది కూడ “ అంటుంది..బక్క నారి.

“హెయ్! బ్రైన్ లెస్స్ సిటీ లో పని అవ్వ లేదా?వాచ్ కోసం కంప్లైంట్ ఇస్తున్నావ్?” అంది కోపంగా.
“ఆ రోజు ఇమ్మన్నారు కదా మరి! కళ్ళ జొడు పొయినా?” అన్నాను అమాయకత్వం నటిస్తూ.
త్రుప్తి దానికి ప్రతి దాడిగా “ఆ రోజు నేను, అలాంటి వాడ్నా? అన్నారు” అంది తడుముకోకుండా.

“ఓ.కే…చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన రింగ్ కూడా ఉంది, పోయిన వాటిలో” అన్నాను.

“హ! హ! హ! ఫన్ని చిన్నప్పటిది అంటున్నారు. యూస్‌ లెస్స్ కదా? బ్రైన్ లెస్స్!!” అనింది ఎంతో కేరెలెస్స్గా.
ఎంత అహంకారమూ దీనికి.బ్రైన్ లెస్స్ అని పదే – పదే అంటుంది,చూద్దాం దీని తెలివి తేటలు ఎంత ఉన్నాయో అని నాలో ఉన్న మగాడు ఛాలెంజ్ చేసాడు నాతో. ఇoకొంచెం అమాయకత్వం తో నేను “అలా కాదు, ఓ మూడు తులాలన్న ఉంటుంది.కొంచెం కన్సిడర్ చేయండి, ప్లీజ్, తులం 28 వేలు, 3 తలాలంటే మీరే చెప్పండి ఎంత ఖరీదు ఉంటుందో??” అన్నాను గొంతు హెచ్చించి.ఆ ప్రశ్నకి తను ఆముదం తాగిన పసి పిల్లలా ముఖం పెట్టి, “తలాలంటే? అని” అడిగింది.

మూడవ క్లాస్ పిల్లాడు కూడ చెప్తాడు, ఇంత చిన్న లెక్క. నన్ను బ్రైన్ లెస్స్ అంటావా?”, అనుకొని నాలో ఉన్న మగాడు శాంతించాడు.తను అపుడే పుట్టిన పిల్లి పిల్లలా ముఖం పెట్టి, “ఒక 40 వేలు.. ఉండొచ్చు” అంది.. సందేహంగా.నాకు నవ్వాగ లేదు.” కాదండీ..హ!హ! 84 వేలండి,” అన్నాను, వెటకారంగా.

తన కళ్ళు ఎరుపెక్కాయి.కోపంతో పెదవి కొరికేస్తోంది. ఉక్రోషంతో “షటప్..!! ఒకడు కోడీ పోయింది, కోడి గుడ్డు పోయింది, అంటే కంప్లైంట్ తీస్కోటానికి కాదు మేము ఇక్కడున్నది, అంది. త్రుప్తిని మరి కాస్త ఉడికిస్తూ “కాని నాది ‘కోడి’ కాదు, ‘కోడి గుడ్డు’ కాదు” అన్నాను.

తను బిగ్గరగా “గెట్ లాస్ట్!! యూ బ్రైన్ లెస్స్!!!” అంది.

నేను చిన్నగా “యు.. హార్ట్ లెస్స్ లేడీ ” అనుకుంటూ వెను తిరిగాను.

                     **********                              *********                           ******* ******                  ******

నిద్ర పట్టటం లేదు, వెన్నెల కళ్ళల్లో గుచ్చుకుంటోంది. కొబ్బరాకులు, పెళ్ళి లో మండపానికి అలంక్రుతిగా చూసాను కాని, వెన్నెల్లో నులక మంచం మీద పడుకోని, చంద్రుడిని కాసింత కప్పెట్టే కొబ్బరాకుల అందాన్ని ఏమని వర్ణించాలి, ఈ తపన ఇదివరకు లేదెందుకు..నాకు??చందమామ లో అందమైన ఆడవాళ్ళు కనిపించాలి కాని..నాకు గయ్యాళి గంప కనిపిస్తోంది..ఎపుడూ పేలాలా పెట్టె లా పట్ పట్ మని పేలుతూ ఉంటుంది.బక్క నారి తిండి తినదా?కొంచెం కండ పట్టాలి పిల్ల..కిందటి జన్మ లో బావురు కప్ప అయి ఉoడాలి..త్రుప్తి.. హహ!!!తన తలపులతో మనసు మరీచికై పోయింది. తన మనసు మాత్రం, సింప్లి -ఎమేజింగ్!!!

                              *******                       ******                                       ******                            

“సర్ మళ్ళీ ఒక చిక్కు” అంటూ కంగారు పడుతూ వచ్చారు వకీలు గారు.

“ఏంటి సర్? చెప్పండి” అన్నాను మంత్రి గారి ఫోన్ కాల్ ముగిస్తూ.

“అదే సర్, ప్రాజెక్ట్ కోసం, తమ సొంత స్థలాలను, ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోంది అంటూ రైతులు ధర్నాకి దిగారు” అన్నారు వకీలు గారు.

నేను సందేహంగా “అదేంటి..?? ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండానే, డాక్యుమెంట్స్ మన చేతికి ఎలా ఇచ్చారు మరి? అన్నాను.

“బలవంతంగా వ్రాయించుకున్నారు, అసలు రావల్సినది కూడా రాలేదు అంటున్నారు, సర్.”అన్నారు వకీలు గారు.
ఈజ్..ఇట్?? పదండి..అన్నాను చిరాకుగా..
బాప్రే, సుమారు 200 మంది అన్నా ఉంటారు.“డిస్గస్టింగ్”. పని ముందుకు సాగటం లేదు.

జనం కేసి చూస్తూ, “చెప్పండి? ఏంటి మీ ప్రాబ్లం” అన్నాను లేని సహనం కూడగట్టుకుంటూ.వాళ్ళు ఉప్పెనలా విరుచుకు పడ్డారు, నా మీద.ఆ గుంపు లో నించి ఒక నడి వయస్కురాలు, “ఏం బాబు? నిజంగా మా బాగు కోరే చేస్తున్నారా ఇదంతా? అంది ఆవేదనతో.” అదేంటి ఆంటీ, అలా అంటారు.ఈ ప్రోజేక్ట్ మీ కోసం కాదా?” అన్నాను కోపంగా.
ఆవిడ అంతే కోపంగా “ఉండే నీడ పోగొట్టి, ఎవరికో మీరు చేసే సహాయం చెబుతారా?”అంది.

ఇంతలో ఇంకో అవ్వ ముందుకొచ్చి “అట్ట కాదు నాయన! పుట్టినప్పటి నుండి ఈడనే ఉంటిమి. ఇపుడు ఏడకు పోవాలా?” నువ్వే చెప్పు అంది కన్నీళ్ళతో.
నాకు తల తిరిగి పోయింది, అవిడని ఎలా సమాధాన పరచాలో అర్థం కాలేదు.

“అవ్వ! మీ ఊరి కోసం వేరే సిటీ వాళ్ళు ఇల్లు, పిల్లల్ని వదిలి ఇక్కడ కష్ట పడుతున్నారు, ఈ సమయంలో మీరిలా?? అని ఆగిపోయాను.

“బాబు! వాళ్ళు మహా ఐతే ఒక సంవత్సరం కష్ట పడతారేమో, మేము పెళ్ళి కాని పిల్లల్ని పెట్టుకొని ఎక్కడికి పోవాలా? నువ్వే చెప్పు??చదువులు మానిపించి,పట్నంలో బతకటం రాని మమ్మల్ని, మట్టి కొట్టుకు పోమంటివా?” అంది.
నాకు నోట మాట రాలేదు.అవును, రైతు ముఖ్యమే – అదే ఊర్లో ఉండే జనము ముఖ్యమే. మరి ఈ సమస్యకి పరిష్కారమేంటి?? ఒకరికి న్యాయం చేస్తే వేరొకరికి అన్యాయమే మరి. గాష్!!హేంటీ డైలమా!! అని తల పట్టుకున్నా నేను.

“ఓయ్!! ఎంటి మాట్లాడుతున్నారు? ఇది ఎవరి ఊరు.?మ..న.ది…త్రుప్తి.. కానిస్టేబుల్ డ్రెస్స్ లో ఉన్న కనక దుర్గ లా ప్రత్యక్షమయింది సడెన్ గా….

చిక్కి పోయిన అమ్మోరులా వుంది, కాని కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఊగిపోతోంది.జనాన్ని ఉద్దేశించి ఉప్పెనలా విరుచుకుపడింది.” ప్రోజెక్ట్ ఎవరి కోసం?మన కోసం?మన బాగు కోసం ఊరంటే మనమే, మట్టి కాదు. ప్రాజెక్ట్ అందరి కోసం కాని, ఒక వర్గం వారికే అని ఎవరు చెప్పారు?ప్రొజెక్ట్ కడితే పంటలకే కాదు, నీటి నిలువలకి, రవాణా సదుపాయాలకి, కరెంట్ కి ఉపయోగ పడుతుంది””ఏం అవ్వ? ఎపుడో మీ తాత కట్టిన ఇల్లు కోసం ఏడుస్తున్నావా? నీ మనవరాలు చదువుకి కరెంట్ అవసరం లేదా?””పుట్టినప్పటి నించి చచ్చే దాక చీకట్లో మగ్గి పోవాలా మన ఊరి వాళ్ళు?ఏం రాజన్న! నీ పెద్ద కూతురు పురిటి నొప్పులతో ఆసుపత్రి కెళ్ళే దారిలోనే చనిపోయింది, ఎందుకు? రోడ్డు సదుపాయం లేక. అపుడే మర్చిపోయావా? ఇంకా ఎంత మంది ఆడ పిల్లలు ఇలా బలి కావలి? రెండేళ్ల నాడు రోడ్డేస్తే మీ ఇళ్లు, పొలాలు పోతాయి అని అడ్డుకున్నారు. కాని గుక్కెడు నీళ్ళ కోసం, మన ఆడ వాళ్ళు మైళ్లకి మైళ్లు నడిచి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.పిల్లలు చదువులు సగం లోనే చదువులు ఆపేస్తున్నారు. ఎందుకు? మీ లాంటి వాళ్ళ చిన్న- చిన్న ఆలోచనల వల్ల.’సొంత ప్రయోజనాల కంటే సమిష్టి ప్రయోజనాలకి ప్రాముఖ్యతని’ ఇవ్వండి.నా ఇల్లు-నా పొలం పోతున్నాయి అనుకోకండి, మన ఊరు- మన ఊరు బాగు అనుకోండి.అపుడు నష్టం కన్నా అన్ని లాభాలే కనబడతాయి.” అని అక్కడితో తనని తాను సంభాళించుకుంది.

ఎవరి నోట్లో నించి ఒక్క ముక్క కూడ రాలేదు, భోరుమంది ఒక అవ్వ, “ఎక్కడికి పొమ్మంటావ్ తల్లి మరి మమ్మల్ని? అదీ నువ్వే చెప్పు..” అని త్రుప్తి చేతులు పట్టుకుంది.

త్రుప్తి ఆవిడని “బాధపడకండి అవ్వ, పోరంబోకు స్థలాలు మీ పేర్న వచ్చేట్టు వకీలు గారు ప్రభుత్వానికి మొన్నే అర్జీ పెట్టారు.” అని ధైర్యం చెప్పింది ఆ పెద్దావిడకి.

ఆ మాటకి ఆవిడ “భూమి పుట్టినపుడు పుట్టాను, ఈ ప్రభుత్వాలను నేను నమ్మను, కాని పిల్లలు, మీరేదో ఊరికి మంచి చేస్తుంటే కాలు అడ్డు పెట్టను,” అంది.

అక్కడే ఉన్న ఇంకో ఆయన కూడ “చూడమ్మ త్రుప్తి! ప్రభుత్వం ఏదో చేస్తుంది, అని ఎదురు చూస్తూ మా-తరం, మా-తాతల తరం కూడా వెళ్ళిపోయింది. ఇదిగో నువ్వన్నట్టు నా కూతురు చని పోయక ఈ పొలం ఎందుకు?ఇదిగో ఈ పొలం కాగితాలు నీ చేతిలో పెడుతున్న, మళ్ళీ ఇంకో ఆడ కూతురు, నా కూతురు లాగా చనిపోకూడదని ఈ ప్రొజెక్ట్ కి నా వంతు కృషి చేస్తున్నా”అని డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళి పోయాడు.

ఔనమ్మ! రాజన్న చెప్పింది నిజమే,మేము మా వంతు ఉడుతా భక్తిగా, మా పొలాల కాగితాలు కూడా ఇస్తున్నాం. అంటూ ఒక్కొక్కరు త్రుప్తి చేతిలో కాగితాలు పెట్టి వెళ్తున్నారు.

“ఆమే జింగ్, ఎక్కడా చూడలేదు, ఒక వైపు డ్రమటిక్ గా ఉంటుంది, ఇంకో వైపు ఏక్షన్ మూవి చూపిస్తుంది, అంతలోనే సెంటిమెంట్ పండిస్తుంది.

మళ్ళీ పుట్టిన మదర్ థెరిస్సాలా వుంది. డాకుమెంట్స్ అన్ని వకీలు గారి చేతిలో పెట్టి, త్రుప్తి మెరుపు తీగలా మాయమైపోయింది.

           ***********                           ********                          **********                    *******

“సొంత ప్రయోజనం కాదు-సమిష్టి ప్రయోజనం కోసం పోరాడాలి”…!!! హబ్బా!! ఈ త్రుప్తి గొంతు నిద్ర పట్టకుండా.. చెవిలో మారు మ్రోగుతూనే వుంది, రాత్రి ఒంటి గంట అయిన.

కళ్ళు మూసినా త్రుప్తి మందహాసం, కళ్ళు తెరిచినా త్రుప్తి వదనం తప్ప నాకేం కనబడటం లేదు.మంచం మీద అటు- ఇటు దొర్లి- దొర్లి తెల్లవారు ఝాము 3 గంII అయింది.

బక్క నారి కదా! అని చాలా.. లైట్ గా తీసుకున్న. అంతమంది జనాన్ని, ఒక్కతే డీల్ చేసి వెను తిరగకుండా వెళ్ళిపోయింది…ఎంత నిరాడంబరత్వం.

త్రుప్తి నీ హ్రిదయం లో ఎవరున్నారో తెలీదు కాని ..అనుక్షణం నీ కళ్ళల్లో, కను పాప నవ్వాలనుంది, దురాశ కాదు కదా, నా.. చిక్కి పోయిన నెచ్చలీ????వావ్!!! నాలో పైత్యం పుట్టింది. నేను పట్టలేని ఆనందం తో ఒక్క ఉదుటున బయలుదేరాను అప్పటికప్పుడు త్రుప్తి ని కలవటానికి.

మొదటి సారిగా తను “నాది” అనుకున్నా క కలవటానికి వెళుతున్నాను. ఇది రొజూలా కలవటం కాదు..తను నన్ను పూర్తిగా ఆకట్టుకుంది.ఏదో శక్తి తన వైపు లాగుతోంది.లేకపోతే ఈ టైం లో నేను బెడ్ వదిలి ఒక ఆ..డ పిల్ల కోసం, రొడ్ల మీద పడటం హేంటి..??ఎముకలు కొరికే చలి, కాని తను “నాది ఇక నించి” అన్న భావన వెన్నులో వెచ్చని భావనని కలిగిస్తోంది.మూవీస్ లో చూబించినట్టు నిన్ను ప్రపోజ్ చేయటం నాకు రాదు..కాని జీవితాంతం కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను.

తన ఇంటికి చేరుకున్నాను. త్రుప్తి గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే వుంది.డీ సెంట్ గా బతికిన నేను – గోడెక్కాను, కిటికీ అటక పట్టుకొని కష్టంగా పైకి ఎక్కాను.బాల్కనీలో, త్రుప్తి మా ప్రొజెక్ట్ ఇంజినీర్ తో మాట్లాడుతోంది..వకీలు గారు కూడ ఇంకొక ఇద్దరితో ఏదో మంచి బిజీగా మాట్లాడుతున్నారు.

తన సంకల్పం చూసి నాకు సంతోషించాలా, నేను అనుకున్న భావనలు చెప్పే ఉద్దేశ్యాన్ని వాయిదా వేయాల్సి వచ్చినందుకు ఏడ్వాల అర్థం కాలేదు.

                           *******                                         *******                                          *****

పోలీస్ స్టేషన్: గోధూళి వేళ…ఎంతో బిజీ స్కెడ్యూల్స్ తో గడిచిన రోజులో, కాసేపు త్రుప్తి తో మాట్లాడే సమయం మాత్రమే, నాకు లైవ్లీ గా అనిపిస్తుంది. తనతో మాట్లాడని రొజు, తన ఊహ నాలో శక్తిని నింపుతుంది.

త్రుప్తి ఎవర్నో లాకప్ లో వేసి నూరుతోంది, నాకు అమ్మోరు, స్వయంగా వాడి బెండు తీస్తున్నట్టుగా కనిపించింది.బక్క నారి బాగానే విరగ తీస్తోంది.దీన్ని చేసుకుంటే నేను చాల జాగ్రత్తగా ఉండాలి.కొట్టి కొట్టి అలసి పోయి, ఆగి వెనక్కి తిరిగి చూసింది.
ఇపుడు దీన్ని నాతో “డేట్” కి వస్తావా అంటే, వాడితో కలిపి నాకు కూడా రెండు వడ్డిస్తుంది.

“హేంటి ఇలా వచ్చారు”? అంటూ చాల బిజీగా ముఖం పెట్టింది త్రుప్తి.
నత్తి డాక్.. డాక్ దగ్గరకు తీసుకెళుతానని అన్నారు కదా?”అని అన్నాను, లేని నత్తి నటిస్తూ.

“ఓహ్ అదా!” అంటూ తను ఇబ్బందిగా ముఖం పెట్టింది. ఇవాళే ఆయన ఊరి నించి వచ్చారు, రేపు తీసుకెళ్తాను లెండీ” అంది.
“ఎస్కేప్” అవదాం అని చూస్తోంది, బక్క నారి…నేను ఇంకొంచెం అమాయకంగా ముఖం పెట్టి, “అదీ..నత్తి వల్ల, అందరు ఆడ పిల్లలు చిన్నప్పటి నించి, ఏడిపిస్తున్నారు మేడం” అన్నాను.

“జిడ్డు” అని తిట్టుకుంటూ బయలుదేరింది త్రుప్తి నాతో కూడా.
బక్క నారి నాతో మొక్కుబడి గా వచ్చిందే కాని, నాతో మాట్లాడదు సరి కదా, అడిగిన దానికి ‘ఔను’, ‘కాదు’, ‘లేదు’ అంటూ పొడి-పొడి గా సమాధానం ఇస్తోంది.నా కంటే ముందు సైకిల్ పట్టుకొని నడుస్తోంది.

నేనే మాట కలపటానికి, “మౌన వ్రతమా?” అని అడిగాను తనని.

త్రుప్తి వడి వడి గా అడుగులేస్తు, “హ..నీకు నత్తి కదా!నాకు బోర్ నీతో మాట్లాడాలంటే” అన్నది .
హోసిని!అని విస్తుపోయాను నేను.

తను అసలు నా ముఖం కూడ చూడకుండా “ఏం ఫర్వా లేదు, ఆపరేషన్ అవసరం ఉండదు.ఈ డాక్టర్ నత్తి నయం చేయటంలో సుప్రసిద్ధుడు”, అని ధైర్యం చెబుతోంది.

దారిలో బురద గుంటలు వచ్చినప్పుడల్లా, నా చేయి పట్టుకొని, “ఇలా రా- అలా వెళ్ళు” అంటు నడిపిస్తోంది.దీనికి కేరింగ్ ఎక్కువ కాని బాగా డామినేటింగ్ వే, అయినా అందంగానే ఉంది.నా దుష్టి తన మీద నించి తప్పించలేక పోతున్నాను.
తను ఒక్క సారిగా ఎదురుగా నిలబడి “హేయ్ ఎంటి, ఆలోచిస్తున్నావ్? ప్రాజెక్ట్ గురించా? అని గదమాయించింది.
“ఔను!!!ప్రాజెక్ట్ బక్క నారి”-అని మనసులో అనుకున్నాను..

త్రుప్తి “హదిగో!! మాటల్లోనే వచ్చేసింది, డాక్టర్ గారి ఇల్లు” అంటూ కాలింగ్ బెల్ కొట్టింది.
“డాక్టర్ గారు లేరు”అంటూ తోట మాలి పరుగున వచ్చి గేటు తీసాడు.

బావురు కప్ప మళ్ళీ నోరు తెరిచింది,“ స్టేషన్లో పని పక్కన పెట్టి మరీ వచ్చాను.మీకు తొందరెక్కువ.చెప్పానా?! వినలేదు మీరు.ఇపుడు మీ కోసం రేపు కూడా రావాలా??” అంటూ విరుచుకు పడింది నా మీద.

తను అలా అరుస్తుంటే నేను తన చేయి పట్టుకొని ” త్రుప్తి! ఇది నీకెలా సాధ్యం, అందరిని ఎలా ఒప్పించగలవు, నీది చాల పవర్‌ఫుల్ బ్రైన్ తెలుసా? అన్నాను.

తను “షటప్! మంచి పనులు చేయటానికి కావల్సింది బ్రైన్ కాదు, మనం పడ్డ కష్టం ఇంకోరు పడ కూడదు అన్న భావన ఉండాలి అంతే” అంటూ విస విస వెళ్ళిపోయింది.

మళ్ళీ త్రుప్తి వెనక్కి వచ్చి, “6 యేళ్ల వయస్సులో అమ్మని, నాన్నని పోగొట్టుకున్నప్పటి నించి, ఎదురు చూస్తున్న, ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని, నా లాంటి ఇంకో అసంత్రుప్తి అనే పాప ఉండకూడదు”, అని అంటూ గుడ్ల నీరు కక్కింది.

“త్రుప్తి లో ఇంత లోతైన ఆలోచన ఉందా?? ఇపుడు అర్థమయింది తనని నడిపిస్తొంది ఒక విజన్ లేక మిషన్ మాత్రమే కాదు.నలుగురికి మంచి జరగాలి అనే ఒక హార్ట్ ఎంపవర్మెంట్” కూడా అని.

                              ********                                     **********                            ********

తన ఆలోచనలతో నిద్ర పట్టలేదు నాకు.ఇన్ని రోజులు ‘బ్రైన్ ప్రపంచాన్ని శాసిస్తుందని తెల్సు కాని, ఒక హ్రిదయం మాత్రమే ప్రపంచపు హ్రిదయాన్ని గెలవగలదని’ అర్థం చేయించింది త్రుప్తి.

ఆస్ట్రేలియాకి వెళ్ళిన నాకు త్రుప్తి ఏదో ఆపదలో ఉందని ఫోన్ వచ్చింది.తన మొహం చూడకూడదు అనుకున్న నాకు 6 నెల్ల తర్వాత వచ్చిన కబురు భూకంపం తెచ్చింది.

ఇండియా లో లాండ్ అవుతూనే ఆఘమేఘాల మీద త్రుప్తి ఊరు చేరా,కార్ లో వెళుతున్నా ఆ వేగం సరి పొవట్లేదు..దూరం కరగటం లేదు,ఏ.సీ లో కూడ ముచ్చెమటలు పడుతున్నాయి, “గాడ్ త్రుప్తి ని కాపాడు.తన క్షేమ సమాచారం తెలియ చేయి ఇపుడే నాకు.

సడెన్ గా కార్ బ్రేక్ వేసా ……..ఎదురుగా …….పురిటి నొప్పులతో……………………………” త్రుప్తి”.

                            *******                                         *********                                            **********

బెడ్ మీద త్రుప్తి పురిటి నొప్పుల తో బాధ పడుతోంది.తనని అలా చూస్తూ నేను ఏమి చేయలేని స్థితి..వకీలు గారి భార్య ఎమయినట్టు.పరుగున వెళ్ళి డాక్టర్ని పిల్చుకొచ్చాను. దేవుడిలా అర్ధ రాత్రి అని కూడా చూడకుండా వెంటనే వచ్చాడు.

                             *******                                            *******                                      *******

ఉదయం 6 గంII: త్రుప్తి, జూనియర్ త్రుప్తి .. బజ్జోని వున్నారు.
తెల్లవారింది.రాత్రి పడ్డ కంగారుకీ ఇపుడే స్థిమితం ఏర్పడినది.అందరు త్రుప్తిని, పాపని చూసి వెళ్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.ఏం ఘనకార్యం చేసిందనో?నాలో ఉన్న ‘మగ’ అహంకారం మళ్ళీ నిద్ర లేచింది.

ఆ మగ అహంకారం నన్ను అక్కడ ఒక్క క్షణం ఉండనివ్వలేదు. ఎంతో సంఘ సంస్కర్తలా కబురులు చెప్పింది, ఒక సాధారణ ఆడ పిల్లకి ఎంత పెద్ద హ్రిదయమో అనుకునే లోపల, ఒక డబ్బున్న ముసలోడు ఉంచుకుంటానంటే వాడితో వెళ్ళి పోయింది.నేను కట్టిన ప్రాజెక్ట్ మీద నించి దాన్ని తోసేయాలని అనిపించింది.అడ్డంగా నరికి కుక్కలకి వేయాలనిపించింది, నాకు.వకీలు ఇంటి డాబా మీద పెగ్గు మీద పెగ్గు వేస్తున్నా నేను.నా మీద నాకే అసహ్యం గా వుంది.

“సర్! ఇంక ఆపండి, నాకు భయంగా ఉంది” అంటూ వకీలు గారు గ్లాస్స్ కి చేయి అడ్డు పెట్టారు.నేను కసిగా ఆయన చేయి విసిరి కొట్టాను. ”హేయ్ వకీలు! అది అసలు ఆడదేనా?మనిషేనా?డబ్బు కోసం..నీచమైన దారులు తొక్కింది.కుక్కలు నయం దాని కంటే.” అని అక్కడితో తమాయించుకున్నాను.

వకీలు,అమాంతం కౌగిలించుకున్నాడు నన్ను,”సర్!వదిలేయండి, మీరెపుడూ మీ మనసులో మాట చెప్పలేదు తనకి” అని నా వీపు మీద నిమురుతున్నాడు.

“షటప్!!!!”. నా తల నరాలు తెగేలా అరిచాను.. అక్కడున్న సీసాల్ని చేతితో పగులకొట్టాను.నెత్తురు చిమ్మింది.నా కసి ఇలా తీరుతోంది.ఈ గాయం మీద కారం పొసినా నొప్పి పుట్టదు.

వకీలు మరింత ఆందోళన తో “సర్!ఇపుడొద్దు. తర్వాత మాట్లాడదాం ఉండండి కట్టు కడతాను” అంటూ వచ్చాడు.నేను ఉక్రోషంతో ఊగి పోయాను. అయన చొక్కా పట్టుకుని గట్టిగా,”హెయ్ వకీలు..నేను నీకేం అవుతానని, ఎందుకు కట్టు కడుతున్నావ్? నీ కొడుకునా?” అని అరిచాను.

ఆయన ముభావంగా “రేపొద్దున్న మాట్లాడుకుందాం” అని దూరం గా వెళ్ళిపోయాడు.
నేను ఆయనకి అడ్డంగా నిలబడి “ఆ బిచ్ ని అంటే నీకెందుకు బాధ, అదేమన్నా సీతా దేవి నా? అది నీ కూతురు ఐతే, అది చేసిన పనికి ఊరుకుంటావా?“

వకీలు గారు “సా..ర్!!!” అంటూ నా మీద చేయి ఎత్తాడు, ఉప్పెనలా విరుచుకు పడ్డాడు.
ఈ సారి, నా నోరు పెగల్లేదు.ఆయన్ని చూసి మా నాన్న గుర్తుకు వచ్చారు.ఆయనే చేయి దించాడు, కొంచెంగా సర్దుకున్నాడు పాపం.

“సారి సార్”! అంటూ భారంగా నిట్టూర్చాడు” మీ కంటే వయసులో మాత్రమే పెద్ద వాడిని. మీకున్నంత నాలెడ్జ్ లేదు.డబ్బు లేదు కాని, మీకు తెలీని ఒక నిజం మాత్రం తెల్సు. మామూలుగా 20 ఏళ్ళ నాడు ఆగిపోయిన ప్రాజెక్ట్ పర్మిషన్లు 3 నెలల్లో రావు, అదీ ఉత్తి పుణ్యానికి.”

ఆయన నా కళ్ళలోకి తదేక ద్రుష్టి తో చూస్తూ, ”ఔను సర్! మీ బ్రైన్ ఉపయోగించి పర్మిషన్స్ తెచ్చాను అని మీరు అనుకున్నారు.కాని మీ కన్నా ముందు త్రుప్తి నాతో కూడ, హైదరాబాద్ వచ్చింది.మంత్రి గారిని కలిసింది ప్రాజెక్ట్ పని కోసం.అక్కడ మీరు సంతకాల కోసం కుస్తీలు పడుతుంటే, త్రుప్తి మంత్రి గారిని అతి కష్టం మీద కలిసింది,ఆయన కాళ్ల మీద పడింది.దానికి ఆయన పెట్టిన కండిషన్ తన కోడలికి పిల్లలు పుట్టరని, త్రుప్తి “సర్వగెట్ మదర్గా” ఒక బిడ్డని తన కొడుకుకి ఇవ్వాలని, ఆ విషయం సీక్రెట్ గా ఉంచాలని..ఒక పెళ్ళి కాని అమ్మాయి తన జీవితం త్యాగం చేస్తే కట్టబడింది..ఆ ప్రాజెక్ట్..కాని మీరను కొనే మీ పవర్‌ఫుల్ బ్రైన్ కాదు.మీరు త్రుప్తిని మంత్రి గారి కార్లో వెళ్ళటం చూసి అసహ్యంతో విదేశాలకు వెళ్ళి పోయారు.కాని తర్వాత, మంత్రి గారి కోడలు గర్భవతి అవ్వటంతో త్రుప్తి మొహం కూడ తిరిగి చూడ లేదు వాళ్ళు.బిడ్డని వద్దనుకున్నారు.పొరబాటైంది అని డబ్బు ఇవ్వబోయారు, అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆత్మాభినం గల అమ్మాయి డబ్బుకి ఆశ పడలేదు, పసి కందుని చంపటం ఇష్టం లేక నవ మాసాలు మోసింది, కనింది.అంతే కాని అక్రమ సంబంధము వల్ల కాదు కనింది, ఆ బిడ్డని. ప్రతి ఆడది, పుట్టుక తోనే మాత్రుత్వపు లక్షణాలు ఉంటాయేమో, తనకున్నా లేకపోయినా సంతోషాన్ని పక్క వారికి అందచేస్తారు ఈ ఆడవాళ్ళు.మాట మీరినా, నీతి దాటినా ఒక మంచి పని కోసమే ఈ ఆడళ్ళు చేస్తారు సర్!!

స్త్రీ విలువ తెలీని ఏ తెలివి తేటలు ఈ ప్రపంచానికి పెద్ద అవసరం లేదు సార్. మీరు వెళ్తూ వెళ్తూ, త్రుప్తి కి చేసిన మెస్సెజ్, ఆ అమ్మాయిని నరక యాతన పెడుతుంటే, మొత్తం ఊరే ఆ అమ్మాయిని సముదాయించ లేక పోయింది.నోరుంది కదా, అని మాట్లాడకండి”అని వకీలు అక్కడి నించి నిష్క్రమించారు.

                           *******                                   ******** *****                        ******* ******                  ******

జీవితం లో మొట్టమొదటి సారి తప్పు చేసానని ఫీలింగ్‌, ఔను సరి దిద్దుకోలేని తప్పు చేసాను.నేను పెట్టిన మెస్సెజ్ త్రుప్తి హ్రిదయంలో శిలాఫలకంగా మిగిలిపోయింది. స్టేట్స్ నించి వచ్చి 6 నెలలు అయింది.

త్రుప్తిని దూరం నించి చూడగలగటం తప్ప నాకు తనతో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.నిజం, త్రుప్తి నన్ను అసహ్యించుకుంటోంది, అయినా తప్పు తనది కాదు.తను నాకు దూరం అయిపోయింది, అనే బాధలో అంత నీచంగా మెస్సెజ్ పెట్టాను.

గుడికి ప్రతి శుక్రవారం త్రుప్తి పాపని తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరినీ చూస్తే నా భార్య నా పిల్లలు వస్తున్నట్టు గా ఉంటుంది.కాని త్రుప్తి చూసి కూడ చూడనట్టే వెళ్ళిపోతుంది.

తనలో ఎంతో పెద్దరికం వచ్చేసింది.త్రుప్తి లో ఎక్కడా కష్టాల ఛాయలు కనబడవు.పైగా ఇందిరవంటి కన్నా సంతోషంగా ఉంది.ఎపుడు పాపే లోకం తనకి,లేదంటే స్టేషన్.చిన్న ఇంట్లో కష్టపడుతోంది త్రుప్తి ఒక్కతే పాప తో..ఇంత ఆస్తి ఉన్న నా భార్య కి బిడ్డకి అవి ఉపయోగ పడవు, త్రుప్తి లో మునుపటి ‘చలాకితనం’ కన్నా ఇపుడు ఒక ‘బాధ్యతే’ ఎక్కువ కనబడుతోంది.ఊరు జనం కూడ ఆమెను ఎంతో గౌరవిస్తారు.. ఇదివరకు ఐతే పెళ్ళి కాకుండా తల్లి అయితే వెలేసే లోకం, త్రుప్తిని సీతా దేవి లా ఆరాధిస్తోంది. ఈ రోజు పాపకి గుళ్లో పేరు పెట్టింది.”మళ్ళీ మా అమ్మె పుట్టింది” అని సంతోషంతో కన్నీరు పెట్టింది. నేను ఒంటరి దాన్ని కాను వకీలు గారు”, అంటూ పాపని ఆయనకి చూపించింది.

“నువ్వు ఒంటరి దానివి కాదు త్రుప్తి, ఒక్క సారి క్షమించానని చెప్పు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా” అని చెప్పాలని చెప్పలేక పోయి దూరంగా నిల్చుండిపోయాను. ఆలోచిస్తే భయంగా ఉంటుంది, అసలు త్రుప్తి నన్ను క్షమిస్తుందా? అని.
ఎవరో అడుగుతున్నారు ” ఏం పేరు పెట్టావమ్మా పాపకి”? అని.వాళ్ళకు త్రుప్తి “పది మంది కి అన్నం పెట్టే ప్రోజెక్ట్ కోసం పుట్టింది అందుకే “ఆహార్య”, అని పేరు పెట్టనంటూ చిరునవ్వు తో సమాధానమిచ్చింది.

త్రుప్తి అంటే, నాకు ఇదివరకు ఒక ఆకర్షణ మాత్రమే.ఇపుడు పిచ్చి అదంటే నాకు, నాకు క్షమించమని అడగటానికి కూడ అర్హత లేదు.నేను ఒక ‘టాస్క్ గా’ భావించిన ప్రాజెక్ట్ తనకి ఒక ‘జీవిత లక్ష్యం’ అనుకోలేదు.ఒక స్త్రీ ఒక మంచి లక్ష్యాన్ని ఉద్దేశించి ఎంత వరకైనా వెళుతుందా??

తన కళ్ళల్లో ఒక చలాకితనం, చిలిపితనం ఉండేవి ఇదివరకు.. ఇపుడు ఎంతో నెమ్మదత్వం, అలుపెరుగని చిరునవ్వు మాత్రమే ప్రతిబింబిస్తాయి. ప్రతి ఘడియ, ప్రతి గంట నేను పశ్చాతాప్ప పడ్డం తప్ప, మళ్ళీ ఇది వరకులాగా తనతో ఉండలేక పోతున్న.ఊరు కోసం సమిధనయ్యాను, నన్ను ఓదార్చండి, నాకు సహాయం చేయండి” అని ఎవరిని అడగదు.నన్ను ఆమడ దూరంలో ఉంచింది. చిన్న ఉద్యోగం ఇంక పాప, ఇదే తన నిత్య జీవన శైలి.నాకు లేదా స్థానం-జీవితం లో నాకు లేదా-సెకండ్ ఛాన్స్…?????

                     ********                                 ************                                            ***********

త్రుప్తి ఇంటర్నల్ ట్రేనింగ్స్ కి వెళ్తోందట, హైదరాబాద్ కి.
నేను కూడా ఇదే టైంలో అమ్మ దగ్గరకు వెళ్ళి రావలి, అమ్మ ఒకటే ఫోన్లు. వకీలు గారి ఇంట్లో చెప్పి వెళ్దామని ఆయనకి ఇంటికి వెళ్ళాను.వకీలు గారి భార్య కాఫీ కప్పుతో ఎదురొచ్చింది, నా బ్యాగ్ చూసి ‘ఎక్కడికి’ అన్నట్టు చూసింది. వకీలు గారు సంతోషంగా “మంచిది వెళ్ళి రండి, త్రుప్తి కోసం ఎదురు చూడటం అనవసరం.మీ సమయం వృధా చేసుకోకుండా అమ్మ గారిని సంతోష పెట్టండి” అన్నారు. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు.

“ఆంటీ” అంటూ త్రుప్తి గొంతు వినబడింది. నన్ను చూస్తే, గిరుక్కున తిరిగి వెళ్ళిపోతుంది, అని లోపలే ఉండిపోయాను. త్రుప్తి వకీలు గారి భార్య తో మాట్లాడుతోంది “ఆంటీ, ట్రైనింగ్ కి హైదరాబాద్ వెళుతున్న, పాపని 3 రోజులు మీరు చూసుకోగల రా??” అని అడిగింది. ఆవిడ సంతోషానికి పట్ట పగ్గాలు లేవు “హబ్బో! మరి నువ్వు అడిగితే కాని చూసుకోమా ఈ చిట్టి తల్లిని”??అంటూ పాపని హత్తుకుంది.

“థాంక్స్ ఆంటి”, అని వెళ్ళి పోయింది త్రుప్తి.గాష్!! మర్చే పోయాను, త్రుప్తి లేనపుడు పాప దగ్గర నేనుండాలి. అదే నా కూతురు ఐతే మర్చిపోగలనా?ఛ!నిజంగా దేవుడు నాకు బ్రైన్ మాత్రమే ఇచ్చాడు. హార్ట్ ఇవ్వలేదు నాకు.నా కూతురికి నా తోడు కావాలి.కావాలంటే అమ్మని ఇక్కడికి పిలవచ్చు, తనకి మార్పు గా ఉంటుంది.

                            *******                                 ***********                                      ***********

ఇవాళ వకీలు గారు, ఆయన భార్య, ఆహార్య, నేను అందరం కలిసి షాపింగ్ కి వెళ్ళాం.వకీలు గారు ఆహార్యని ఎత్తుకోమని నాకిచ్చారు నా దగ్గర ఒక్క క్షణం కూడ ఉండటంలేదు.

నన్ను చూస్తూనే ఏడ్చేస్తోంది, మొండోళ్ళు తల్లి-కూతుళ్లు. త్రుప్తి రిజెక్ట్ చేసినా, అంత బాధ అనిపించలేదు. కాని పాప అసలు నన్ను దగ్గరకి రానీయటంలేదు.చాక్లెట్స్ ఇచ్చాను,ముట్టనే లేదు అది, ఎందుకు పాపకి నా మీద కోపం? వకీలు గారి భార్యని వదిలి, నా దగ్గరకి రానే లేదు.

ఇదంతా చూసి వకీలు గారి “భార్య బాధపడక బాబు కొంత మంది పిల్లలు కొత్త వారి దగ్గరకు తొందరగా చేరరు”, అంటూ నన్ను సర్ది చెప్పబోయింది. అదేం కాదు కడుపుతో ఉన్నపుడు త్రుప్తి నన్ను బాగా తిట్టుకున్నట్టు ఉంది, పాప అవన్ని కడుపులోనే “అక్షరాల- పుణికి పుచ్చుకుంది”.అమ్మని తిడతావా? అన్నట్లుగా చూస్తుంది, కనీసం నేనిచ్చిన బొమ్మలు కూడ ముట్టలేదు, ఒక్క సారి కూడ ఒడిలోకి తీసుకోనివ్వలేదు.
“ఒక డబ్బున్న దరిద్రుడిని నేను”.

                          ********                                     ************                                            ***********

చిన్నప్పుడు మనమెన్నో తప్పులు చేస్తాం, అమ్మ ముద్దుగా సరి దిద్దుతుంది.నాన్న ఖటువుగా బుద్ధులు చెప్తారు, టీచర్ ముద్దుగా ఒక కధ జోడించి, పాఠం గా మలిచి బోధిస్తారు, స్నేహితులు చిరు నవ్వుతో క్షమించేస్తారు. కాని ప్రియురాలు అలా ఉండదు ఎందుకనో?? తేనె పూసిన కత్తి గుండెల్లోకి దింపి, మగాడు పడే వేదనని ఆస్వాదిస్తుంది. ఊరందరికి దేవతైన త్రుప్తి, నా పట్ల ఎందుకంత ఖటువుగా ఉంటుందో ? అర్ధం అవ్వదు నాకు.

తల పొగరు అనుకుంటా లేదా వెంటపడుతున్నా అని చులకన అయి ఉండచ్చు. తప్పు మనదే కదా! మగాడ్ని అనే అహంకారంతో బాధ పెట్టాను, ఇపుడు వేడుకుంటున్నా, అవసరమా నాకి దంతా?
నేను తలుచుకుంటే కోటి మంది అమ్మాయిలు వస్తారు.

ఒంటి మీద కి 32 యేళ్లు వచ్చాయి, పెళ్ళి కాకుండానే భార్య, ఒక కూతురు ఉన్నారు, అయనా ఘోటక బ్రహ్మచారిని.ఇంతలో వకీలు గారు రెండు బాటిల్స్ తో ప్రత్యక్షం అయ్యారు.ఈయన వయసులో నాకన్నా పెద్ద వాడే కాని నాకు మాత్రం ‘అల్ టైం’ ఫ్రెండ్ అయిపోయాడు.

సర్ ప్రైస్ అవుతూ అడిగాను ఆయన్ని, “ఉన్నట్టుండి, ఈ పార్టీ మూడ్ ఏంటన్డీ” అని.
ఆయన ఎక్సైటింగా, “ఏం లేదు త్రుప్తి వచ్చింది, మా ఆవిడ అటు వెళ్ళింది, మీరొక్కళ్ళే ఉంటారని ఇటు వచ్చాను “ అన్నారు.“ఇంకెందుకు ఆలస్యం లాగించండి.”అంటూ ఒకరికొకరు చీజ్స్ చెప్పుకున్నాం.గంటలు గడుస్తున్నాయి..వకీలు అడ్డంగా పడిపోయాడు. నాకు త్రుప్తి ని చూడాలని ఉంది.నా కోపానికి అవధులు లేకుండా పోయింది. నాలో ఉన్న రాక్షసుడు నిద్ర లేచాడు.”ఒసేవ్ త్రుప్తి”!!అనుకుంటూ త్రుప్తి ఇంటి వైపు నడిచాను. ఎలా తన ఇంటికి చేరానా, నాకే తెలీదు.

“ఒసేవ్ త్రుప్తి..”రావే బయటకి”!!!..అని అరిచాను. తను ఇంటి ముందు నించోని కళ్ల తోనే “ఎంట్రా రాస్కెల్ అన్నట్టుగా” బయటకి వచ్చి చూసింది.”ఏంటే ఆ చూపు” పెద్ద అందగత్తెని పొగరా”? పెద్ద పొజీషన్ లో ఉన్నావా?లేదు, కాదు..పోని ఎవడి మీదన్న ఆశ పెట్టుకున్నావా?..లేదు.మరెందుకే నన్ను ఇలా కాల్చుకుని తింటావ్? అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే ఉన్నాను. త్రుప్తి నన్ను అసహ్యంతో చూస్తోంది తప్ప, సమాధానం ఇవ్వ లేదు.తన మౌనం నన్ను మరింత పిచ్చోడుని చేసింది, రగిలిపోయాను.అరుస్తూనే ఉన్నాను “ఇపుడేంటీ తిట్టాను, నువ్వు నన్ను వదిలిపోయావు అనుకొని, బాధలో నోరు జారాను.అపుడెపుడో అన్న దానికి ఎందుకంత సతాయిస్తున్నావ్.నేను తలుచుకుంటే బోలెడంత మంది అమ్మాయిలు వస్తారు.ఏంటే మాట్లాడవు?” అని గట్టిగా అక్కడున్న గేట్‌ని కాలి తో తన్నాను.

చుట్టు పక్కలున్న వారందరూ బయటకి వచ్చారు, వకీలు గారి భార్య పాప తో సహా బయటకి వచ్చింది.ఆవిడ కూడ నా మీద కోపంతో,”ఏంటి బాబు తాగి వచ్చి, ఈ గొడవ? రేపొద్దున్న మాట్లాడు కుందాం వెళ్ళు” అని కసురుకుంది.

ఆవిడ ముఖం కూడా చూడకుండా “నువ్వుండు ఆంటీ, దీనికి చుట్టు తిప్పుకునే జబ్బు ఉన్నట్లుంది, దేనికి అయిన ఒక లిమిట్ ఉంటుంది.కూటికి గతి లేని దాని వి అది మర్చిపోకు” అని తిట్టి పోసాను.త్రుప్తి చెంప ఛ్ఛెళ్ళుమనిపించింది ‘పాపకి’. ఉన్నట్టు ఉండి పడిన దెబ్బకి పాప గుక్క తిప్పుకోకుండా ఏడుపు మొదలెట్టింది.“సైతాను దానా!! పాప ఏం చేసిందే?? ఎన్నడన్నా మొగుడుతో ముచ్చటగా కాపురం చేసి కన్నావా పిల్లని?? అందుకే పాపని రాక్షసంగా కొట్టావ్.” అని త్రుప్తి మీద క్రూరంగా విరుచుకు పడ్డాను.ఈ సారి నా చెంప పగులకొట్టింది,మగాడిని అని కూడ చూడకుండా, అందరి ముందు.నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి, శ్ప్రుహ లోకి వచ్చాను.ఏం జరిగిందో అర్థమయ్యే లోపే త్రుప్తి విస-విస లోపలికి వెళ్లిపోయింది. నాలో మగ అహంకారం ఆవిరి పోయింది. కూ…ల..బడి పోయాను. త్రుప్తిని ఓదార్చటానికి ఆంటీ కూడా వెళ్ళిపోయింది.

జనాలందరు సినిమా అయిపోయినట్టు లోపలికి వెళ్ళిపోయారు. నేను కూడ బాధ పడుతున్నాను, కాని, మగాడు బాధ పడుతుంటే సంఘం లో ఒక్క ‘మగ కుక్క’ కూడ ఓదార్చదు. కానీ ఒక సుతి మెత్తని చేయి నన్ను శ్ప్రుసించింది, ధారలుగా కారుతున్న నా కన్నీటిని, తుడుస్తున్నాయి ఆ చేతులు.ఔను!చిట్టి తల్లి ‘ఆహార్య’, నా కన్నీటిని తుడుస్తొంది, సరిగ్గా నించోలేక నా జుట్టుని ఆసరాగా చేసుకొని మరీ నించోని, నా ముఖమే అమాయకమైన కళ్లతో చూస్తొంది.చిన్నగా దగ్గర కొచ్చి నా నుదుటిని ముద్దాడాయి ఆ లేత పెదాలు.“అద్భుతమైన అనుభూతి”-మాటల్లో వర్ణించలేను,నేను గెలిచాను-ఒక పసి హ్రిదయాన్ని.

                                  *******                                       **********                           ***********

మర్నాడు ఉదయం 10.00 గంII
రాత్రి జరిగింది తలుచుకొని బాధగా అనిపించ లేదు.పైగా అంతా మన మంచికే అనిపించింది.ఆహార్య చేతి తాలూకు స్పర్శానుభూతి ఇంకా పోలేదు.అంతే కాదు త్రుప్తి కి భర్త ని అవుతానో లేదో కాని ఆహార్య కి మాత్రం తండ్రిని అయిపోయాను.

                                  ******                                                  ********                              *********

అమ్మ వచ్చింది నాన్నతో కూడ.ఇల్లంతా అందంగా అలంకరించేసింది, వస్తూనే.కమ్మని వంటల తో అదరకొట్టేస్తోంది. నాన్నతో సాయంకాలం పేకాట.రాత్రి డిన్నర్ టైం లో కబురులు.జీవితంలో ఇదే నిజమైన జీవం అనిపిస్తుంది.ఊరంతా చూపించాను వాళ్ళకు.ఇంకా త్రుప్తిని చూపించాలి.కాని అంత కన్నా ముందు త్రుప్తి గురించి అమ్మకి చెప్పాలి.అమ్మ కాదనదు.కోట్లు దానం చేసినా పల్లెత్తు మాట అనలేదు, నాన్న నా మాట కాదనరు.ఇక నేను, పాప, త్రుప్తి..అమ్మ నాన్న,ఒక స్వీట్ ఫ్యామిలీ మాది.
“ఒరేయ్ కన్నా ఏం ఆలోచిస్తున్నావు రా??” అంటూ అమ్మ ఈ లోకం లోకి తీసుకు వచ్చింది.

“ఎం లేదమ్మా” అన్నాను కంగారుగా”నేను.
ఆలోచించరా ఇక నయన, 32 యేళ్లు వచ్చాయి ఒంటి మీద కి అంటూ,అమ్మ నా తల మీద నిమిరింది.
అమ్మ!! నాకా ??అపుడే పెళ్ళేంటమ్మా?ఇంకా నువ్వు తల దువ్వి, బడికి పంపిస్తున్నట్టు గా ఉంది నాకు అన్నాను.అసలు అమ్మ తానుగా పెళ్ళి ప్రస్తావన తేవటం పిచ్చి సంతోషంగా వుంది.

అమ్మ ఒక్క మొట్టి కాయ వేసింది ఠంఘున నెత్తి మీద, “అదే నే చేసిన తప్పు” అంటూ చిన్నగా కసిరింది.
నేను పొరబాటు గా “ఇంత లేటుగా అడిగి – ఇంత తొందర పెడతావా” అని నాలుక కరచుకున్న.
అమ్మ,” హోరి వెధవా!! అంటే ముందే అమ్మాయిని చూసి పెట్టుకున్నావన్న మాట.”అంటూ చెవి మెలేసింది.
నేను “అమ్మ ఒక్క సారి వదులు అమ్మాయినే చూపిస్తా నీకు.”.అన్నాను.నా పని ఇంత సులభం అయిపోయినందుకు సంతోషంగా.అమ్మ సంతోషించింది.నేను అనుకున్నట్టు గానే,”పద, అమ్మాయి తల్లి-తండ్రుల తో మాట్లాడదాం, రేపొస్తున్నాం అని కబురు చేయ్ రా.”.అంది తొందర పడుతూ.

అమ్మ తొందర చూసి “ఎపుడు వీడుతుందో తెలియని చిక్కు ముడి నీకు ఎలా చెప్పను అమ్మ”, అనుకుంటూ చిన్నగా ఒక వైరాగ్యపు నవ్వు నవ్వాను.

                                ********                          **********                       *******                          **********

“ఈ గుడి స్పెషల్ ఏంటి రా? పైగా శుక్రవారం అన్నావు. ఏ దేవత గుడి రా?” ఇది అని అడిగారు మా నాన్న.. “ఔను నాన్న ప్రతి గుడి లో ఒక దేవత ఉంటుంది.కాని ఈ దేవత ని చూడటానికి ఇంకో దేవత వస్తుంది.” అన్నాను.
“ఏంటి అన్నావు అన్నారు.” మా నాన్న.

“ఏం లేదు నాన్న, ఉత్సవ విగ్రహాలు, ఇటు వైపు నుంచే వెళ్తాయి, అని చెప్తున్నా” అన్నాను, ముసి-ముసి గా నవ్వుకుంటూ.త్రుప్తి, పాప దూరంగా వస్తూ కనబడ్డారు.అమ్మకి, నాన్నకి తనే మీ కోడలు అని చెప్పాలని ఉవ్వీళ్ళూరి పోయాను.కాని త్రుప్తి కి తెలీకుండా అలా ఎలా చెప్పగలను..?అమ్మ ఎవరితోనో మాటల్లో పడి మమ్మల్ని మర్చిపోయింది.ఈ ఆడవాళ్ళు అంతే.ఇంట్లో ఉన్నంత సేపు బయట ప్రపంచమేంటో తెలీకున్డా ఇంట్లో వాళ్ళ కోసం కష్ట పడతారు, కాని బాహ్య ప్రపంచంలో పడితే ఒళ్లే మరచి పోతారు.

రత్నావళి రంగు చీరలో త్రుప్తి అందంగా వుంది…ఎప్పటి లాగానే చూసి కూడ చూడనట్టే వెళ్ళిపోయింది.
“నైజాము పోరి, నకరాల మారీ” అంటూ గొంతు పెంచి పాడాను, త్రుప్తి ద్రుష్టి నా వైపు మరల్చటానికి.కాని నా మీద తను, మండి పడుతూ కొబ్బరి కాయ విసురుగా కొట్టింది.అది మా అమ్మ నుదుటికి తగిలింది.రక్తం బొటబొటా కారింది. నేను వెళ్ళే లోపల త్రుప్తి కంగారుగా అమ్మ దగ్గరకు పరుగెత్తటం.పసుపు అద్ద టం, మళ్ళీ మళ్ళీ క్షమాపణలు చెప్పటము జరిగి పోతున్నాయి. నేను దెబ్బ చిన్నది అవ్వటంతో అమ్మ దగ్గరకు వెళ్ళ లేదు.పైగా ఇపుడు వెళితే పరిణామం ఎలా ఉంటుందో తెలుసు నాకు.కాని త్రుప్తి, మా అమ్మ మాటల్లో పడ్డారు, పరిచయాలు చేసుకున్నారు.పాపని ముద్దాడుతోంది అమ్మ.త్రుప్తి చాలా ఇబ్బందిగా మళ్ళీ-మళ్ళీ సారి చెప్తోంది.అమ్మ త్రుప్తిని హగ్ చేసుకుంది.

“కాగల కార్యం గంధర్వులే తీర్చారు” హుర్రే..!!!

                     *******                              ********                       *********                                      **********

“నీకేమన్నా పిచ్చి ఎక్కిందా!!? ఒక పిల్లల తల్లిని పెళ్ళి చేసుకుంటావా?? అంటూ ఇంట్లో అందరు నన్ను ఒక బోనులో ముద్దాయిలా చూస్తున్నారు. అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది.మన ఇంటా-వంటా ఇలాంటివి లేవు, నీకెక్కడ్నించి వచ్చాయిరా ఇలాంటి పిదప బుద్దులు.??అని చీర కొంగు తడిపేస్తోంది.నన్ను అడగాలని నీకు అనిపించ లేదా అసలు?నీవు చిన్నోడివి నీకు బుద్ధి లేక పోతే మాత్రం దాని బుద్ధి ఏమీ అయిపోయింది రా..? ఎవరో కన్న పిల్లల్ని నెత్తిన ఎక్కించు కుంటావా?సిగ్గు లేనిది..అది నీకు మందే దో పెట్టింది” అని భోరుమంది.

మా అమ్మ నిజంగా అలా నా వల్ల బాధ పడటం నాకు నచ్చలేదు.”అమ్మా!!కాస్త నిదానం గా ఆలోచించు..” అన్నాను అమ్మని ఓదారుస్తూ.ఆమ్మ అంత కన్నా హెచ్చు స్థాయిలో స్వరం పెంచింది “లేదురా, ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఊరుకున్నా, కాని దాని అర్థం వంశం పరువు తీసినా, ఊరుకుంటానని కాదు, ఇలాంటి ఆడవాళ్ళు ఆస్తి కోసం వలేస్తారు, ఒక్కడ్ని వదిలేసిన ఆడదానికి రెండో వాడు పెద్ద లెక్క కాదు. అయినా నీకేం తక్కువ.నీ పిల్లల్ని నువ్వు ఎత్తుకోవాలి. మంచితనం ఉండాలి కాని ఊరిని ఉద్దరించాలని సొంత ఇల్లు కూల కొట్టుకోకూడదు”.

అమ్మని ఎదిరించటం నా వల్ల కాదు, చిన్నప్పటి నించి కళ్ళల్లో పెట్టుకొని పెంచిన అమ్మని బాధించలేను.నాకు మౌనమే సరైన సమాధానం గా అనిపించింది.

మా నాన్న పక్కనే వచ్చి కూర్చొని భుజం మీద చేయేసి, “చూడు నాన్న, నువ్వు వయసులో ఉన్నావ్, నీకిపుడు అర్థం కాదు,నీ ఆస్తి కోసం ఆ అమ్మయి కాష్ చేసుకోవాలని చూస్తొంది.అయినా సెకండ్ హ్యాండ్ వస్తువులు నువ్వు వాడవు కదా..ఇపుడేంటి కొత్తగా?” అన్నారు నన్ను అనునయంగా.

నాన్న ఒకటి అడుగుతాను చెప్తావా?పెంపుడు జంతువులు పెంచుకొనేటపుడు ఏ జాతి అని అలొచించము కదా? మరి, మనుషులమై ఉండి “వేరే” వాడి పిల్లలు అని పేరు ఎందుకు పెడతాం చెప్పండి?”

ఆ మాటకి మా నాన్న చిన్నగా నవ్వి “చూడు కన్నా నువ్వు చిన్న పిల్లాడివి.. ప్రేమ తప్ప కళ్లకి ఇంకేం కనబడదు, నువ్వు ప్రేమగా పెంచినా, ఆ “వేరే” వాడి పిల్లలు పెరిగి పెద్ద అయ్యి, నువ్వెవడివి రా! నా తండ్రివి నువ్వు కాదు అంటారు.పెంపుడు జంతువులు అలా అనలేవు” అన్నారు భారంగా నిట్టూరుస్తూ.

త్రుప్తి కోసం నాన్నని బాధ పెట్టలేను, నాకు సంతోషం కావాలనుకుంటే క్షణాల్లో కొనగలను, కాని నేను నా సంతోషాన్ని అమ్మ, నాన్న, త్రుప్తి, పాపతో ముడి వేసాను.ఇక దీని మీద చర్చ అనవసరం-పెద్ద వాళ్ళని నొప్పించి తెచ్చుకునే ఒక సంతోషం నాకు వద్దు.పైగా పాపని నేనొక్కొడినే చేర దీసినా, మా ఇంట్లో వాళ్ళు అసహ్యించుకుంటే, రోజు అది పాప మనసుకి బాధ కలిగించటమే అవుతుంది.

                           ******                                     ********                                     **********

నా మనెసేం బాగోలేదు.త్రుప్తి కి పట్టుదల చాల ఎక్కువ. కిరాతకురాలు, తన పంతం తప్ప ఎవరి మాట వినదు.మూర్ఖత్వం తప్ప జీవితం లో బాగుపడే అలోచనలు లేవు.ఇచ్చిన సమయం చాలు.మన జీవితం మనం చూసుకోవాలి.నన్ను జోకర్ ని చేసి ఆడిస్తోంది.సింగల్ గా ఉండటం అలవాటు పడ్డ ఆడది, పైగా డామినేటింగ్ నేచర్ వర్కౌట్ అవ్వదు.

                         ********                                     *******                                          ********

వకీలు గారి ఇంటికి వెళ్ళాను.ఇక్కడైనా కాస్త మనశ్శాంతి దొరుకుతుంది అని.అక్కడ కూడా చుక్కెదురైంది.
ఆయన నా ముందు కూర్చోని మౌనం గా,అన్ని విన్నారు.”వర్కౌట్ అవ్వటం లేదండి.నాకే నచ్చటం లేదు. నిజంగా, ఆ అమ్మాయిని చేసుకుంటే రోజు కాళ్ల మీద పడాలి.పైగా తన దగ్గర లోపం ఉంది, నోర్మూసుకొని వచ్చిన అవకాశం ఉపయొగించుకుందాం అని ఏమి ఆలోచనే లేదు,” అన్నాను పట్టరాని కోపంతో.

ఆయన కూడా అంతే కోపంగా “పొగరండి, దానికి, ఎవరు లేని పిల్ల, ఎందుకులే తిట్టటం అని వదిలేసాను నేను” అన్నారు.
లోపల్నించి ఆంటీ సర్రున వచ్చింది.”ఎవరి కొంప కూల్చింది అని తను నోరుమూసుకొని పడుండాలి.”మగాళ్లు అనిపించుకున్నారు.ఆడాళ్ళంటే మీకు నచ్చినట్లు ఉండాలా?లేక పోతే పొగరుబోతులా?తనకంటూ ఒక అభిప్రాయం ఉండకూడదా?అయినా నువ్వేంటి బాబు ఆ అమ్మాయిని అర్థం చేసుకొనేదమన్నా ఉందా?నిన్ను చేసుకోవటం అమ్మాయికి ఇష్టం లేదు, అంతే.ఎందుకంటే తన నోరుమూయించటానికి తను సదుద్దేశ్యం తో చేసిన పనిని వక్రీకరిస్తావు,అమ్మాయి అది గ్రహించింది.ఆడళ్ళు అన్ని నోరు తెరిచి చెప్పరు, వాళ్ళే నోరేసుకొని చెలరేగిపోతే మీరు ఒక్క ప్రశ్నకి బదులు ఇవ్వలేరు.తను ఒక నిర్దిష్టమయిన అభిప్రాయం తో ఉంది, ఇక నువ్వు ఒక నిర్ధారణకి వచ్చాక, తను నీకు తగదు అనుకున్నాక, నీ ఇష్టమైన ట్లు ఉండచ్చు, కాని అనవసరమైన నిందలు వేయక్కర్లేదు.చదువుకున్న వాడివే కదా, ఇక చర్చలు వద్దు దీని మీద.”అంటూ త్రుప్తిని సమర్థించింది.

నేను నైర్యాశంతో “తప్పంతా నాదే అంటారా? ఆంటీ??” అని అడిగాను.
ఆవిడ అసహనంగా “తను నీ వెంట పడలేదు, ఇక ముందు పడదు, దయ చేసి ఆ పిల్ల జోలికి రాకు” అని చేతులు జోడించింది.

                        ********                              *******                             *******                                    ********

త్రుప్తి నిశ్శబ్దపు ధ్వనితో యుద్దం చేస్తూ గదిలో అలసి పోయుంది.
“తృప్తి నీతో మాట్లాడాలి” అంటూ ఆమె దగ్గరకు వెళ్ళాను.”నాకే గాని, నీకు నా అవసరo లేదా తృప్తి?” అన్నాను, ఆమె కేసి సూటిగా చూస్తూ.ఆమే మౌనంగా నిలబడింది. “నాకు సమాధానం కావాలి తృప్తి” అన్నాను.

ఆమె పెదవి విప్పింది, చాలా రోజుల తర్వాత – తెలివి, డబ్బు, సహాయం ఇవేవీ ఒక వివాహానికి కారకాలు కావు, నాకు తెలిసి, మనం ఒకరిని నిజంగా ఇష్టపడితే, వారే కాదు, వారు ఎంచుకున్న మార్గాలు కూడా నచ్చాలి.ఎన్నో రకాల అభిలాషలు ఉంటాయి, కాని అవన్ని నా లక్ష్యం ముందు దిగదుడుపే” అన్నది.

“నీ లక్ష్యం గురించి నాకు తెలీదు,తెలిసిన మరు క్షణం రెక్కలు కట్టుకొని నీ ముందు వాలాను, కనీసం అధైనా ఒప్పుకుంటావా తృప్తి?” అన్నాను.

ఆమె మునుపటి చిరునవ్వుతో “కాదని నేను అనలేదు, నువ్వు చేయని దానికి, బాధ్యుడిని చేసే మూర్ఖత్వం నాకు లేదు. ఒక మనిషి యొక్క నైజం తెలియాలంటే వాడికి కోపం వచ్చినపుడే తెలుస్తుంది.పరాయి స్త్రీని కన్నెత్తి చూసే వాడు రావణాసురుడు ఐతే, నడి సముద్రంలో వదిలేసే వాడిని రాముడని అంటారు.నేను జానకిని కాను, నా జన్మని నట్టడవిలో ముగించటానికి, సితని కాదు, కాల ఘర్భం లో కలిసిపోవటానికి”. అన్నది

నాకు అర్థం అయింది,వకీలు గారి భార్య ఉప్పందించింది అని. “ఒక మనిషిని అంచనా వేసటపుడు,వాడి నిత్యమయిన గుణాలని చూడాలి కానీ, వాడు ఎపుడో ఆవేశం లో చేసే పనిని బట్టి కాదు. నువ్వేం కోల్పోతున్నావో నీకు తెలియటము లేదు తృప్తి, “a man is a social animal”, ఎందుకో తెలుసా, నీతి యుక్తమయిన శుఖం కోసం.

“సుఖం అంటే నాకు నచ్చిన వారితో, నన్ను మెచ్చిన వారితో జీవితం ఆరంభించటమే కాని, నీలో నన్ను ఉద్ధరిస్తున్నానే భావనే ఎక్కువగా కనబడేదే తప్ప, నాకూ ఒక అభిప్రాయం ఉంటుంది, దానిని పరిగణించాలి అనే తత్వం కనబడలేదు నాకెపుడు.అమ్మ దగ్గర ఉన్నది తక్కువ కాలమే ఐయినా, ఆవిడన్న ఒక మాట మాత్రం బాగా గుర్తుంది” అభిప్రాయాలు ఉంటాయి, కాని వాటిని అవతలి వారి మీద ఆపాదించ కూడదు” అని.గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నిజామ్గా నేను డామినేటింగా?లేక మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక నా మీద వేసిన నెపమా? ఇన్ట్లో వాళ్ళని ఒప్పించలేని నువ్వు, పాపకి న్యాయం చేయలేను అనుకున్నావు,అంత వరకు కృతజ్ఞ్యురాలిని.

నేను ఆధునిక స్త్రీ ని మాత్రమే, ఒకరి అండ దండలు ఉంటేనే స్త్రీ జీవనం అనేది తుప్పు పట్టిన సనాతన ధర్మం.” అని త్రుప్తి ధ్రుఢ నిశ్చయంతో చెప్పింది, మౌనం గా గదిలోకి వెళ్ళి..తలుపులు మూసేసింది.

-శ్రీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.