ధర్మపురి మండల జానపదుల భాష, సంస్కృతి (సాహిత్య వ్యాసం )-తాటికాయల భోజన్న

ISSN 2278-478

పరిచయం :

జానపద సాహిత్యం అనగా జనుల సాహిత్యం అని చెప్పవచ్చు. జానపదం అంటే పల్లె అనీ, జానపదులు అనగా గ్రామీణులనే అర్థంలో వాడబడుతుంది.” మానవ జీవితంలో నిత్యం సామాన్యుడు అనుభవించే సుఖదుఃఖాలు, అనుభూతులు ఇలాంటివన్ని ఒక్కమారున పొంగి పొరలి వచ్చిన “రస మాధురి“యే జానపద గేయ సాహితి. నాటి సంఘ చారిత్రిక విశేషాల్నిభాషా పరిణామాన్ని తనలో ఇముడ్చుకొన్న చైతన్య స్రవంతియే జానపద సరస్వతి. నెలవంక చంద్రికలుగా సంగీత సాహిత్యాల్లో మేళవించిన కవితా ప్రకృతి జానపద సాహిత్యం. (జానపద విఙ్ఞానాధ్యయనం. 2001 : 36 ) మానవ జీవితంలో పుట్టుక నుండి మరణం వరకు జరిగె ప్రతి క్రియ జానపద విజ్ఞానంలోకి వస్తుంది. జానపద సాహిత్యంను కొందరు పండితులు జానపద గీతిక జాతి జీవనాళిక అని చెప్పారు.

జానపద సాహిత్య ముఖ్య లక్షణం మౌఖిక ప్రసారం. “ముఖే ముఖే సరస్వతి” అన్నట్లు ఒకరి నుండి మరొకరికి, ఒక ప్రాతం నండి మరొక ప్రాంతానికి జానపద సాహిత్యం ప్రసారమౌతుంది. ఈ ప్రసార క్రమంలో అయా ప్రాంతాల ఆచారాలను, విశ్వాసాలను నిక్షిప్తం చేసేది జానపద సాహిత్యం అని తెలుస్తోంది.

జానపద సాహిత్యానికి ప్రత్యేక కవి ఉండడు. నిరక్షరాస్యుల నుండి వెలువడే ఆశు కవిత్వమే జానపద సాహిత్యం. వారు నిరంతరం శ్రమ చేస్తూ ఆ శ్రమ మరువడానికి జానపదుడు చేసే ప్రయత్నమే జానపద పాటగా ఉద్భవించింది. జానపదుని కష్టసుఖాలను కలగలపి ముందు తరాలకు మార్గదర్శకం చేస్తే అది జానపద కథగా రూపొందింది. జానపద సాహిత్యం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్గిస్తూనే పరోక్షంగా పథ నిర్ధేశం చేస్తుంది. పూర్వం జానపద సాహిత్యంలో కథల ద్వారా విద్యాబోధన చేసినట్లు విష్ణుశర్మ హితోపదేశం కథల ఆధారంగా తెలుస్తుంది. పూర్వం గురుకులాల్లో మౌఖికంగా విద్యను నేర్పే సాంప్రదాయం ఉండేది.

మన భారతీయ సాంప్రదాయంలోని వేదాలకు, ప్రాచీన గ్రంథాలకు జానపద కథలే మూలమని పలువురు పండితులు అభిప్రాయం. ప్రాచీన వేదాల్లో ఉన్న గేయాలు వీరగాథలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మంత్రోచ్చారణలు, కర్మకాండలు అన్ని జానపద సాహిత్యం అని తెలుస్తుంది.

రామాయణ, మహాభారతాలు జానపద కథలకు, ఐతిహ్యాలకు మూల కేంద్రాలు. ఉపనిషత్తుల్లోనూ,జాతక కథల్లోను అనేక గాథలు అన్నాయి. బృహత్కథలో జానపద కథలు, కట్టుకథలు అపరిమితాలు. అష్టాదశ పురాణాలు, ఐతిహ్యం, మతం, నమ్మకాలు, మూఢ విశ్వాసాలకు జన్మస్థానం. మన ప్రాచీన సాహిత్యాలను పరిక్షిస్తూ పోతే నాటి జానపదుల జీవితచ్ఛాయలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. (జానపద విఙ్ఞానాధ్యయనం. 2001 : 37 )

భారతదేశం జానపద సాహిత్యానికి పుట్టినిల్లు అని పాశ్చాత్య పండితులు కూడా అభిప్రాయపడ్డారు. లిఖిత సాహిత్యానికి పునాదులు వేసినది జానపద సాహిత్యమే. ఈ జానపద విఙ్ఞానమునకు ఆంగ్లమున సమానార్థకాలుగా FOLK LORE అను పదం 1846లో W.J.థాంస్ అను పాశ్చాత్య పండితుడు రూపొందించాడు.

జానపద సాహిత్యం గ్రామీణులదనీ, జానపదులంటే అనాగరికులనీ, మోటువారని, అవిద్యావంతులనీ అభిప్రాయ పడేవారు. క్రమక్రమంగా ఆ అభిప్రాయం పోయింది. ఈ జానపద పదం అమరకోశంలోనూ, వ్యాసుడు రచించిన మహా భారతంలోనూ, ఎర్రన అరణ్య పర్వ శేషంలోనూ జానపదులు గ్రామీణులనే అర్థంలో వాడినట్లు తెలుస్తుంది.

“జనపదుల్ పురీ జనులు సంతసముం బ్రమదం బెలర్పనీ…….చాడ్పున నీవ యిమ్మహీన్”
( భారతము V – 346 )
జానపదులు గ్రామాల్లో ఉంటూ నాగరికతకు దూరంగా పూర్వం జీవించారు. నేటి సమాజం అందుకు భిన్నంగా కనబడుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణులు జానపద సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను వదులు కుంటున్నారు. జానపద సాహిత్యం క్రమ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది.

జానపదులంటే “ఏదైనా ఒక్క విషయంలోనైనా భావసామ్యం కలిగిన జనసముదాయం. వీరు ఒక భాషకు సంబంధించిన వారు కావచ్చు, ఒక ప్రదేశంలో నివసిస్తున్న వారు కావచ్చు. అయితే ఈ సముదాయం తమదే అని చెప్పుకో గల్గిన కొన్ని సాంప్రదాయాలు కలిగి ఉండాలి. Folk అనగా దేశమైనా కావచ్చు, మండలమైన కావచ్చు, కుటుంబమైన కావచ్చు. Folk అనిపించుకోవాలంటే కనీసం ఇద్దరైనా ఉండాలని తేలింది. అయితే జానపద విఙ్ఞానమును మా ఇంటి జానపద విఙ్ఞానం అనడం ఎంత అర్థవంతమో, భారతీయ జానపద విఙ్ఞానం అనడమును అంతే అర్థవంతమే. ఒక కుటుంబంలోని పద్ధతులు, నమ్మకాలు, ఇంటిపేర్లను గురించిన కథా కమామిషూ మొదలైనవి. ఇంటింటి జానపద విఙ్ఞానమైతే, భారతీయుల సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, పండుగలు మొదలైనవి భారతీయ జానపద విఙ్ఞానమనిపించుకుంటాయి. (ఆంధ్రుల జానపద విఙ్ఞానం.2004 : 3 )

‘అలెన్ డెండ’స్ అభిప్రాయంలో ప్రత్యేక సాంప్రదాయం గల జన సమూహం జానపదులు, జనపదుల నుండి పుట్టినది జానపద సాహిత్యం. జానపద సాహిత్యం ఒక తరం నుండి మరొక తరానికి మౌఖిక ప్రచారం ద్వారా సంక్రమించింది. జానపద సాహిత్య పరిశోధన ప్రారంభమైన తరువాత పరిశోధకులకు అక్షయ పాత్ర అయ్యింది. జానపద సాహిత్యం ప్రధానంగా మూడు శాఖలుగా విభజించడం జరిగింది. తెలుగు సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య నాయిని కృష్ణకుమారి, ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు, ఆర్వీ. యస్. సుందరం మొదలైన వారు శాస్త్రీయ దృక్ఫథంతో జానపద సాహిత్యాన్ని విభజించారు. అందులో నాయిని కృష్ణకుమారి గారి విభజన ప్రజాదరణ పొందింది.

1. ధర్మపురి మండల భాష పరిశీలన
ధర్మపురి గ్రామంలో ప్రజల వ్యవహారిక భా:షకు, శిష్టుల వ్యవహారిక భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది.ఈ గ్రామంలో వ్యవహారిక భాష వీధి, వీధికి మారడం గమనించవచ్చు. బ్రాహ్మణ వాడకు దగ్గరగా ఉన్న ఇతర కులాల భాష వీరి భాషకు సామీప్యత కనిపిస్తుంది. ప్రజలు రోజువారి కార్యక్రమాలలో కలిసి, మెలిసి ఉండడం వలన ఒకరి భాష మరొకరికి వ్యాప్తి చెంది ఉంటుంది.
“హాల శాతవాహన చక్రవర్తి కొలువులో సంకలితం అయిన గాథ సప్తశతి నాటికే తెలుగు భాష ఉనికిని తెలియ జేస్తుంది. క్రీ.శ 1 శతాబ్ది నాటి ప్రాకృత కావ్యంలో అత్త, పిల్ల, పాడి, పొట్ట, బోండి (పంది), చీపిరి (గడ్డి), వంటి పదాల ద్వారా తిరుమల రామచంద్రగారు నిరూపించారు. (నరసయ్య . సంగనభట్ల . 2007:227 )

సాహిత్య చరిత్రలో మొదటి సంకలన గ్రంథంగా చెప్పుకుంటున్న గాథ సప్తశతిలోని పదాల ఆధారంగా ఈ గ్రామంలోని భాష పూర్వ కాలం నుండి నిలదొక్కుకుని ఉన్నట్లు తెలుస్తుంది. నేటికి అత్త, పిల్ల, చీపురు మొదలైన పదాలు వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తుంది.భాష కాలక్రమంలో అనేక మార్పులకు లోనైనా కూడా పూర్వపు రూపాన్ని కొంతైన నిలుపుకుంటుందని చెప్పవచ్చు.

ధర్మపురి సంస్కృతిని, మతాల స్థితిగతులని గ్రామ నామాలు తెలియజేస్తాయి.ఉదా. బుద్దెశి పల్లె, నరసయ్య పల్లే, దమ్మన్నపేట్,జైన, మరియు వ్యక్తి నామాలు నర్సయ్య, నరహరి, గంగా, గంగాధర్, లచ్చక్క, నర్సక్క మొదలైన గ్రామ, వ్యక్తి నామవాచకాలను చూడగానే ఇవి ధర్మపురి ప్రాంతానివే అనిపిస్తుంది. గ్రామ నామాలను వ్యక్తి నామాలుగా కలిగినవారు ఉన్నారు. ఉదా ధర్మపురి, భీర్పురి ఇలాంటి నామాలు ధర్మపురి సంప్రదాయాన్ని, చరిత్రను తెలియజేస్తాయి.
జానపదుల భాషలో శిష్టుల భాషలోని కొన్ని పదాలు చేరి ధ్వని పరిణామం చెందాయని చెప్పవచ్చు. బొమ్మాడంగా (బ్రహ్మాండంగా), బైరుపులేషం (బహురూపు వేషం), బత్తి (భక్తి) మొ, ప్రాంతీయ మండలికాలు తెలుస్తాయి. వచ్చిండ్రు (వచ్చినారు), ఎండి (వెండి) మొదలైన వ్యవహార మాండలికాలు ధర్మపురిలో స్పష్టంగా కనబడతాయి. శిష్టుల ఇండ్లను ఆనుకుని ఉన్న ఇతర కులస్తుల ఇండ్లలో భాష మిశ్రమమై, మిశ్రమ భాష మాండలికం ఏర్పడినట్లు మనకు తెలుస్తుంది.

1.1 ధర్మపురి మండల జానపదుల మాండలికం:
1. బరాబర్ = సమానం 2. జాబు = భుజం 3. అనవతు = ఉన్నది ఉన్నట్లు 4. ఆరం = బలి 5. సంబరం = ఆనందం 6. ఎర్రిముండా = వెర్రి ముండా 7. ఎండుగ = పంట పండిన తరువాత 8. నివ్వద్దిగనే = నిజంగా 9. అల్లర = బాధ 10. లొల్లి = గొడవ 11. పావురం = ప్రేమ 12. సోయి = మెలుకువ, తెలివి.13. నయం = మంచిది, తగ్గడం14. మొగులు = ఆకాశం 15. ఈగడం = దూరడం 16. అంపడం = నిమజ్జనం.

2. ధర్మపురిలో విశిష్ట సాంప్రదాయం ధర్మపురి గ్రామంలో జరిగే మరొక విశేషం చెప్పుకోదగినది. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల చివరి రోజున నరసింహుడు అధికారిక లాంచనాలతో రక్షకభట నిలయం చేరి (Police Station) కొద్ది సేపు శాంతి భద్రతల గురించి ఆరా తీసి, కావలిసిన సలహాలు ఇస్తాడని ప్రజలు నమ్ముతారు. ఇటువంటి ఆచారం ఇక్కడ విశిష్టంగా కనిపిస్తుంది.
(బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శాంతి భద్రతల గురించి చర్చించి రక్షకభట నిలయం నుండి బయటకు వస్తున్న నరసింహ స్వామి.)

ఈ సాంప్రదాయం వలన ప్రజలు జరుపుకునే ఆధ్యాత్మికాంశాలలో కూడ గ్రామ పరిపాలన సంబంధిత విషయాలను చేర్చడం వలన ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజలను దేవుడు ప్రత్యేక్షంగా రక్షిస్తాడనే భావనని ప్రజలకు కల్పించడం మనం చూడవచ్చు.
2.1 ధర్మపురి పండగలుః
ధర్మపురి గ్రామంలో సంప్రదాయిక పండుగలు చూడముచ్చటగా ఉంటాయి. (ఉదా : హోళి, గోకులాష్టమి, కాముని పున్నమి, పీరిల పండుగ, రంజాన్ మొదలైనవి.) ఈ గ్రామంలో పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గోదావరి నదికి జరుగుతాయి.

2.2. జాతర (బ్రహ్మోత్సవం): ధర్మపురిలో స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరుగుతాయి. బ్రహ్మపుష్కరిణిలో స్వామివారి డోలోత్సవ కార్యక్రమం నయనానందంగా సాగుతుంది. ఇక్కడ కార్తిక పౌర్ణమి రోజున వేల దీపాల కాంతులు మనకు దర్శనమిస్తాయి.
2.3 మొహర్రం: పీర్ల(పీరీల) పండగలో అన్ని మతాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. హిందువులు సైతం దేవుడు పూనకం అయ్యి తూలూతూ గ్రామమంతా పీరీలను పట్టుకుని తిరుగుతారు. పిరీ ఇంటిముందుకు రానే ఆ ఇంటిలోనివారు పిరీ పట్టున్నవారి కాళ్ళను కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటారు. దేవత ప్రతిమలు గల పల్లకి కింది నుండి పిల్లలు, పెద్దలు దూరుతారు. దీనికి కారణం పిల్లలకు భయం పోతుందని, పెద్దవారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. పిల్లలు కలుగని స్త్రీలు ఓడికట్టుకోని పిరీల వెంట గోదావరి వరకు వెలుతారు అలా సాగే జాతరలో చివరివరకు ఆమె కట్టుకున్న ఓడిలో పువ్వుకాని, కుడుకకాని పడుతుందని, అలా పడినవారికి సంతానం కలుగుతుందని ప్రగాఢంగా ఇక్కడి ప్రజలు నమ్మతారు.
ఈ గ్రామంలో మొహర్రం పండుగ ప్రత్యేకించి చెప్పుకోదగినది. ఈ పండుగలో హిందూవులు, ముస్లీంలు అధికంగా పాల్గొంటారు. పీరీలు ఊరు తిరగడం , పెద్దపులి వేషాల కోలహలం, విశేష జన సందర్శనం కన్నుల పండుగగా ఉటుంది.
Moharram Represents Occasion to follows Because of mayrtydom of martyrs . But in This Celebrating With Great Entusiasm , It is Celebrating as an important Festival and poor lower caste hindu people participate in large number. (యస్. జై కిషన్ 1999: 69 )
మొహర్రం పండుగ సందర్భంగా హిందువులు, ముస్లీంలు ఈ ఉత్సవం చివరి రోజున చేతులు పట్టుకొని అగ్ని గుండం చూట్టూ “ అసైదులా ” అని ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తారు. ఈ సందర్భంగా దేవుడు పూనినవారు ఆగ్నిగుండంలో నడవడం కనిపిస్తుంది.

2.4. బతుకమ్మ పండుగ: బతుకమ్మ పండుగ ధర్మపురి మండల ప్రజలకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగనాడు పూలను సేకరించి బతుకమ్మను పేర్చి ఆట ఆడుతూ ఆనందాన్ని పొందుతారు. పెద్ద బతుకమ్మ పేర్చడం తమ తాహత్ ను (హోదా) తెలుపుతుందని నమ్ముతారు. కొత్త బట్టలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళ సందడి, వస్తువుల కొనుగోల్లు అన్ని ఈ పండుగ రోజుల్లో కనిపిస్తాయి. సత్తు పిండి(బియ్యం, పెసరు,నువ్వులు,పల్లిలతో పిండి చేస్తారు) చేసి సద్దికట్టుకొని, ఊరి వాడలలో ‘‘పోయిరా బొడ్డెమ్మ పోయి రావమ్మ’’ అని పాటలు పాడుతూ తిరిగిన తరువాత బొడ్డెమ్మలను గోదావరిలో వేసి పిండిని ఒకరికొకరు పంచుకుని తింటూ..ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈ పండగలో ఐకమత్యం కనిపిస్తుంది.

3 ధర్మపురి మండలంలోని సాహిత్య , సాంస్కృతిక అంశాలు
3.1 సాహిత్యాంశాలు
ధర్మపురి గ్రామంలో సాహి:త్య సేవ ఎక్కువగా జగినట్లు తెలుస్తుంది. ప్రాచీన కాలం నుండి అనేక గ్రంథాలు ఇక్కడ వెలువడ్డాయి.ఇతర ప్రాంత కవులు కూడా తమ రచనల్లో ధర్మపురి ప్రస్తావన చేశారు.
అనేక మంది కవులు సంస్కృతం గ్రంథాలలో మరియు తెలుగు గ్రంథాలలో ధర్మపురి చరిత్రకు అక్షర రూపమిచ్చారు. ఈ కవుల రచనలలో ధర్మపురిలోని ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు మనకు తెలుస్తాయి.
ధర్మపురిలో అనేక మంది కవులు ధర్మపురి చరిత్రను తెలియజేస్తూ స్వామివారిని అనేక విధాలుగా కొనియాడారు. వారిలో ముందుగా చెప్పకోదగిన వారు శేషప్ప కవి. ఇతనికే శేషచల దాసు అనే పేరు కూడా ఉంది. ఈయన నరసింహ, నృకేసరి, నరహరి శతకాలు రాసినట్లు తెలుస్తుంది. ఈ మూడు శతకాలు తరువాతి కాలంలో ‘‘త్రిశతి’’ అను పేరుతో అచ్చులోకి వచ్చాయి. శేషప్ప కవి శతకాలేకాకుండా ధర్మపురి రామాయణం ( యక్షగానం ), అవనిజా చరిత్రము అనే రచనలు కూడ చేశారు కాని నేడవి అలభ్య గ్రంథాలు, పై గ్రంథాలు రాసి నరసింహస్వామికి అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. ఈ శేషచల దాసు భజన కీర్తనలు కూడా రాసినట్లు ఆధారాలున్నాయి.
“నరహరీ భజనా నోటనురా ! నోటనురా ! నోటనురా
నోటనకున్న వినరా ! నరహరి భజనా నోటనురా
పలుమారు దెలుపు నేటికిరా !
కరుణ గల ధర్మపురి లక్ష్మీకాంతుడే గతిరా ”
( త్రిశతి 2008: పుట: 34 )
అనే భజన కీర్తనలతో శేషప్ప కవి చరమాంకం వరకు నృసింహుని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన పరమ భక్తుడని తెలుస్తుంది.శేషప్ప రాసిన మూడు శతకాలలో నృసింహస్వామి పై గల అపార భక్తి విషదమౌతుంది. ఈ కవి 115 పద్యాలతో “భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర,’’ అనే మకుటం కలిగిన నరసింహ శతకంలోని కొన్నిపద్యాలు కాలగర్భంలో కలిసిపోగ 95 పద్యాలు గల నరహరి శతకం మనకు మిగిలి ఉంది. ‘‘చక్రధర ధర్మపుర ధామ సార్వభౌమ! భక్త జనకల్ప! నాగతల్ప! అనే మకుటం కలిగిన ఇంకో శతకం ‘‘నీకు నమస్కరించెదను నేర్పుగ ధర్మపురి నృకేసరి’’ అను మరో శతకం మొత్తం మూడు మకుటాలతో ధర్మపురి నరసింహ స్వామిని స్తుతిస్తూ మూడు శతకాలు రాసినట్లు తెలుస్తోంది.
ఈ మూడు శతకాలలో శేషప్ప యొక్క పండిత ప్రకర్ష, సామాజికాంశాలపై గల అవగాహణ, భక్తి ప్రపత్తులు తెలిస్తున్నాయి. ఈ మూడు శతకాలలో నరసింహ శతకం ఎక్కువ ప్రచారం పొందింది.
ధర్మపురిలో మరికొంతమంది గొప్ప కవులు ఉన్నట్లు తెలుస్తుంది. వారు కాకుత్థ్సం నరసింహదాసు (శేషప్ప మనువడు – కూతురి కొడుకు) శ్రీ కృష్ణశతకం, మైరావణ చరిత్ర (యక్షగానము), గంగపాట, రోహిలాల పాట, మిశ్రిత రామాయణం, మొదలగునవి రాసినట్లు తెలుస్తుంది. మరియు మరిగంటి తిరువెంగళ చార్యుడు, కృష్ణగిరి వెంకట రమణయ్య మొదలైన వారు ప్రాచీన కాలపు కవులైతే, అధునిక కాలపు కవులు వేమూరి లక్ష్మీనరహరి శాస్త్రి, కొరిడె రాజన్న శాస్త్రి,కొరిడె రామయ్య మొదలైన కవులు ఇక్కడ సుప్రసిద్ధులు.
ధర్మపురి గ్రామంలో సాంస్కృతికంగా అనేక ఉత్సవాలు జరుగుతాయి.ఈ గ్రామ ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు ఈ ఉత్సవాలలో ప్రతిఫలిస్తాయి. గోకులాష్టమి (ఉట్టి పండగ), దసరా, సంక్రాంతి, ముక్కోటి ఏకదశి మొహర్రం, స్వామి వారి జాతర (బ్రహ్మోత్సవాలు) కన్నుల పడుగగా జరుగుతాయి. వీది భాగవతాలు, నాటకాలు వేయడం, పాట కచేరీలు పెట్టడం ఈ గ్రామంలో ఎక్కవగా కనబడుతుంది.

4. ధర్మపురిలోని సాంస్కృతికాంశాలు:
ధర్మపురిలో దేవాలయాలు ఎక్కువగా కనబడతాయి. ఇక్కడి వైదిక కర్మలకు, భక్తి భావానికి ఈ గుడి గోపురాలే నిదర్శనం. ఈ గ్రామంలో ముఖ్యమైన దేవాలయంగా నృసింహాలయం కనబడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ గ్రామంలో దేవాలయంతో పాటు దానికి దగ్గరలోనే గోదావరి, మసీదు ఉండడం మరో విశేషం. దేవాలయాలన్ని ఒక్క దగ్గర సముదాయంగా ఉంటాయి.శైవ వైష్ణవాలయాలతో పాటుగా మసీదు కూడ పక్కనే ఉండడం ఇక్కడి విశేషంగా తెలుపవచ్చు.
1. కొత్త నరసింహాలయం 2. వేణుగోపాల స్వామి ఆలయం 3. వేంకటేశ్వరాలయం 4. పాత నరసింహాలయం 5. రామలింగేశ్వరాలయం 6. సత్యవతి దేవాలయం 7. బ్రహ్మపుష్కరిణి ( కోనేరు ) మొదలైనవి అన్ని పక్క పక్కనే ఉన్నాయి. ఈ దేవాలయాలే కాకుండా గ్రామం నిండ ఇతర చిన్న చిన్న గుళ్ళు దర్శనమిస్తాయి.
ఈ గ్రామంలో కోనేరు చతురస్రాకారంగా చాలా విశాలంగా ఉంటుంది. నాలుగు వైపుల ద్వారాలు కలిగి మధ్యలో మండపంతో కనిపిస్తుంది.
ఈ దేవాలయాల సముదాయాల ప్రక్కనే మసీదు ఉంది. ఈ మసీదు పూర్వం నరసింహాలయంగా ఉండేదని, ఇస్లాం రాజుల దండయాత్రల ఫలితంగా మసీదుగా మారిందని, గుడిలోని విగ్రహాలన్ని గోదావరిలో పారవేశారని ధర్మపురి చరిత్ర వలన తెలుస్తుంది. ముస్లిం రాజుల దండయాత్రల కారణంగా ఈ గ్రామంలో అనేక విగ్రహాలు శిథిలంకాగా, కొన్ని గోదావరిలో పారవేసినట్లు గ్రామీణులు కూడ ఇప్పటికీ చెప్పుకుంటారు. (శిథిలమైన ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం బ్రహ్మగుండంలో నుండి 2012 లో బయటపడి, ప్రస్తుతం రామేశ్వరాలయంలో పెట్టబడింది.)

.1 మతం:
ధర్మపురిలో హిందూ, ముస్లీం, క్రైస్తవ మతస్థులు ఉన్నారు ఈ మతాల వారు సామరస్య భావంతో కలిసి కట్టుగా జీవిస్తారు. ప్రాచీన కాలంలో మత విద్వేషాలు కలిగిన రోజులలోనే శివాలయం, వైష్ణవాలయం, పక్క పక్కనే ఉండడం ఈ గ్రామం యొక్క మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ రెండు దేవాలయాలలో పూజల్లోనూ సమానమైన నిర్వహణ కనిపిస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని హరి హర క్షేత్రంగా పిలుస్తారు.
కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను తిక్కన హరిహర నాథునికి అంకితం ఇచ్చినట్లుగానే హరిహర నాథునికి అంకితమిచ్చాడు. ఇతడు ధర్మపురిని తన కావ్యంలో కింది విధంగా ప్రస్తావించాడు.
హరి హరలేకంబనియేడు
పురాణవచనంబు దృష్టముగ “నొకచోటన్
నరసింహుడు రామే
శ్వరుడును గల ధర్మపురి” వచ్చెగడంకన్
(సింహ: 8:177 )
(ధర్మపురి క్షేత్ర చరిత్ర : 2007 : 199)
ధర్మపురి గ్రామంలో జైన, బౌద్ధ, పుష్టి, మద్వ మతాలు కనుమరుగైనాయని చరిత్ర వలన తెలుస్తుంది. ప్రస్తుతం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను కలుపుకుని నిరంతరం ప్రశాంతంగా దూప, దీప నైవెద్యాలతో ఒప్పారుతూ ఉంటుంది.
“ఈ గ్రామంలో బౌద్ధమత ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది. ధర్మపురి గ్రామమును బౌద్ధ మత దమ్మ అనుపద ప్రభావం వలన ధర్మపురి అని పిలిచినట్లు తెలుస్తోంది. ధర్మపురికి 5 (ఐదు) కి.మీ ల దూరంలోని పాశిగామ గ్రామంలో బౌద్ధ మత స్థూపం ఉంది.’’ (సంగనభట్ల నరసయ్య, 2008 :2)
జైన మత ప్రభావం వలన ధర్మపురి గ్రామానికి 8 కి.మీ ల దూరంలో గల జైన అను గ్రామం ఉంధి. అంతేకాకుండా నక్కలపేట గ్రామంలో జైన తీర్థంకరుని విగ్రహం బయట పడినట్లు తెలుస్తుంది. ఈ గ్రామం ధర్మపురికి 5 కి.మీ ల దూరంలో ఉంది.

-తాటికాయల భోజన్న

పరిశోధక విద్యార్థి,
(జానపద గిరిజన విజ్ఞాన పీఠం,వరంగల్)
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం,హైదరాబాద్

ఉపయుక్త గ్రంథ సూచి:
1. ఇనాక్ కొలుకలూరి – జానపదల సాహిత్య విమర్శ, జ్యోతి గ్రంథమాల, హైద్రాబాద్.
2. ఎల్లోరా – జానపద సాహిత్యం, దీప్తి పబ్లికేషన్స్, హైద్రాబాద్.
3. కృష్ణమూర్తి కాకర్ల – శ్రీ లక్ష్మీ నరహరి శతకం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ధర్మపురి.
4. కృష్ణకుమారి నాయిని – తెలుగు జానపద గేయ గాథలు, 2007, తెలుగు అకాడమి, హైదరాబాద్.
5. చలపతి గల్లా – మహాభారతేతివృత్త సినిమాలపై జానపద సాహిత్య ప్రభావం, 1999, కీర్తి ఆఫ్ సెట్, తిరుపతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.