ప్రముఖ రచయిత్రి శారదా పోలంరాజు గారి తో మాలాకుమార్ ముఖాముఖి

స్నేహశీలి,అందరికీ అత్యంత ఆప్తులు ఐన శారదా పోలంరాజు గారిని చూస్తే నాకు ,ఒకప్పటి టి.వి లో సీరియల్ పాట “లేడీ డిటెక్టివ్ అమ్మో మహా ఆక్టివ్ ” అన్నది గుర్తొస్తుంది. శారదగారు పురాణాలు బాగా అథ్యయనం చేసి అందులోని అపురూపమైన కథలను ఈ తరానికి అర్ధమయ్యేలా వ్రాస్తారు. ఛందోబధ్ధమైన పద్య రచనలో ప్రవీణులు.చక్కటి కుటుంబకథలను (నవలలను) వ్రాస్తారు. . శారదా పోలంరాజు గారి నవల “తోడొకరుండిన” గురించి, శారదగారి రచనల గురించి, శారదగారి మాట్లలల్లో తెలుసుకుందాము.

నమస్కారమండీ శారదగారు. మీ “తోడొకరుండిన “నవల చదివాను.చాలా బాగుంది.ముఖ్యం గా పూర్ణిమ కుటుంబం, “పూతరేకులు” చాలా నచ్చేసాయి. నన్ను మా తాతగారింటి కి తీసుకెళ్ళాయి.ఐదు సంవత్సరాల క్రితం వరకూ , మా అత్తగారింట్లో, ఆ తరువాత మా కొడుకు, కోడలు ,పిల్లలు , అమ్మాయి కుటుంబం తో కలిసి ఉన్న మా ఉమ్మడి కుటుంబపు విశేషాలు గుర్తొచ్చాయి. కోటీ ఉమెన్స్ కాలేజ్ ముందు నుంచి ఎన్ని సార్లో వెళ్ళాను కాని లోపల ఇంత బాగుంటుందని నాకు తెలీదు.ఈ సారి అటెళ్ళినప్పుడు ఓసారి లోపలికి వెళ్ళి మీరు చెప్పినవన్నీ చూసి రావాలనుకుంటున్నాను.నవల చదివాక నాకు వచ్చిన అనుమానాలను అడిగి కాసేపు మాట్లాడాలని వచ్చాను 🙂

1. పూర్ణిమ పాత్రకు ఎవరైనా ప్రేరణ నా ? ఎందుకంటే సామాన్యంగా నేను చూసినంతవరకూ సైలెన్స్ అనే లైబ్రేరియన్ నే చూసాను కాని ఇలా విద్యార్దులతో కలిసి పోయి వారి లో పఠనాసక్తి కలిగించేవారిని చూడలేదు .
జ; ముందుగా నా నవలను ఆసాంతము చదివి విశ్లేషించినదుకు మీకు కృతజ్ఞతలు మాలాగారు.
మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చాలా విస్తారంగా ఇవ్వవలసి ఉంటుంది.
పూర్ణిమ పాత్ర ఒక లైబ్రేరియన్ గానే కాదు…..ఉమ్మడి కుటుంబంలో భాధ్యత గల ఒక అమ్మాయిగా చిత్రీకరణ, కోఠీ విమెన్స్ కాలేజీలో సంఘటనలతో సహా ఈ నవలలో వివరణ మొత్తం నా అనుభవాలని చెప్పుకుంటే సోత్కర్షగా అనిపించవచ్చును. కాని వాస్తవాలు తెలియజేయాలి కనుక చెప్తాను.
నేను దాదాపు 30 సవత్సరాలు ఒక కాలేజీలో లైబ్రేరియన్గా ఉద్యోగం చేసాను.
ఒకప్పుడు లైబ్రేరియన్లంటే కేవలం పుస్తకాల మధ్య కూర్చొని, వచ్చిన వాళ్ళను ఎటెండర్ మీద వదిలి, తాను హాయిగా నవలలు చదువుకుంటుందన్న పాత కాలము నుండి పరిస్థితులు మారిపోయాయి.
ఎవరికి ఏ సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియజేయడం మొదలుకొని ఎవరు ఏ సమాచారం అడిగినా అంద జేయడమూ, రిసెర్చ్ స్కాలర్్ేకు ముందస్తుగానే వారి పరిశోధనలకు అవసరమైన సమాచారము అందించడం వరకు బాధ్యతలు రూపాంతరం చెందాయి.
అదే పాలసీ నేను అవలంబించాను. నా నవలలో పూర్ణిమకు అవే భావాలు కలిగేలా రూపొందించాను.
మా దగ్గర అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉండేవి. నేను ఉద్యోగం చేసిన కాలేజీ ఒక మైనారిటీ బిజినెస్ కమ్యూనిటీ వారు స్థాపించినది. వారి వ్యాపార సముదాయాల మధ్యనే మా బిల్డింగు ఉన్నది. అక్కడ చదివేవారు కూడా చాలా గొప్ప ఇళ్ళ నుండి వచ్చే ఆ వ్యాపారస్తుల సంతానమే.
వాళ్ళను సంభాళించడం మొదట్లో కష్టమైనా మెల్లిమెల్లిగా మచ్చిక చేసుకొని, రౌడీల వంటివారిని కూడా తీరిక సమయాలలో కౌన్సిలింగ్ చేస్తూ దారికి తెచ్చుకునేదాన్ని.
వాళ్ళల్లో నిజంగా చదువు మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు కూడా ఉండేవారు. అటువంటి వారిని ఐడెన్టిఫై చేసి, వాళ్ళకు పఠనం మీద మరింత ఆసక్తి కలిగేలా చేయడంలో విజయం సాధించాననే చెప్పుకోవాలి.
కాలేజీ వృత్తిపరంగా పూర్ణిమ గురించి చెప్పిన ప్రతి మాటా నా అనుభవాలే. ఆ వాతావరణం, లైబ్రరీలో మధ్యాహ్నం భోజనాలు చేయడం, అధిక ప్రసంగం ఎటెండర్ (రాజు అని నా ఎటెండర్ పేరే వాడాను) , బయట చాట్ బండి (లడ్డు, అది కూడా అతని నిజమైన పేరే) తినుబండారాలు కట్టి ఇచ్చిన కాయితంలో ఏముంటే అది చదవడం అనే నా అలవాటు, మా స్నేహితురాలు కామెంట్, “శారదకు తలుపు మీద నల్ల అక్షరాలు కనిపిస్తే వదలదు” అనటమూ అన్ని నిజ జీవిత సంఘటనలే.
క్లాసు రూముల్లో చెలరేగే పిల్లలు నాకు చేరువవడము కూడా నా అనుభవాలే. అది చూసిన చాలా మంది లెక్చరర్లు అసూయతో రగిలి పోవడం కూడా బాహాటంగానే జరిగేది.
క్లాసులకు పోకుండా లైబ్రరీ రీడింగ్ రూం పట్టుకొని వదలకుండా అల్లరి చేయడానికి ప్రయత్నించినప్పుడు, నేను వారి మధ్యలో కూర్చొని ఏదో ఒక టాపిక్ మీద చర్చ, లేదా కాంపిటీటివ్ మాగజైన్లలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వంటివి మొదలెట్టేదాన్ని. ఒకరి తరువాత ఒకరుగా చేరి ఆసక్తి ప్రదర్శిస్తూ, ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి ఏదో ఒక సందేహము వ్యక్తం చేయడం నేను అది వివరించడం…….వీటన్నిటితో నేను నా ఉద్యోగ కాలము ఆనందంగా గడప గలిగాను.
వారి అభిమానము ఎంతగా పొందగలిగానంటే, నా వృత్తికి పూర్తి న్యాయం చేకూర్చానని స్టాఫ్ స్టూడెంట్సే కాకుండా మానేజిమెంట్ నుడి కూడా ప్రశంసలు లభించిన గర్వముతో రిటైర్ అయ్యాను. అట్లా నా అనుభవాలు చెప్పుకుంటూ పోతే అదే ఒక గ్రంధము అవుతుంది.

2. రేణుక ను తండ్రి డాక్టర్ చేయాలని ముందు నుంచే ప్రేరేపిస్తాడు . ఈ మధ్య కాలం లో పిల్లలపై ఇలా వత్తిడి పెట్టె తల్లితండ్రులను చూస్తున్నాము దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ; ఆ రోజులకు ఈ రోజులకు చాలా తేడా ఉంది. అప్పటి రోజుల్లో ఇంత పోటీ తత్వము ఉండేది కాదు. ఎవరు ఏ కోర్స్ చేయాలనుకుంటే అందులోనే చేరేవాళ్ళు. ఆడపిల్లలు ఇంజనీరింగ్ వైపు అస్సలు వెళ్ళేవారు కాదు. ఎక్కడో నూటికో కోటికో ఒకరు. అదేవిధంగా మెడిసిన్ కొరకు రెండే కాలేజీలు ఉండేవి. ఆడగాని మగ గాని చాలా కొద్దిమందే మెడిసిన్ చేయాలన్న ఆశయం ఉన్నవాళ్ళు తప్పక చదివి శ్రమించే వారు. నాకు తెలిసి పెద్దల ఒత్తిడి ఏ మాత్రమూ ఉండేది కాదు. పైగా అమ్మాయి ఏదైనా ఒక డిగ్రీ చేస్తే చాలు. ఒక ఇంజనీరు అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేద్దామన్న మధ్య తరగతి మనస్తత్వం. ఆ కారణంగా డాక్టర్ల పిల్లలకే ఆ ఆసక్తి ఉండేది. ఒత్తిడి మాత్రము ఉండేది కాదు.
గత ఇరవై ఏళ్ళల్లో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఆడపిల్లలకు రిజర్వేషనే కారణం కావచ్చు. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన టెక్నాలజీ కాలేజీల వల్లే కావచ్చు. మహిళా సాధికారత, స్వాతంత్రము, అన్న భావాల వల్లే కావచ్చు, కంప్యూటరు విద్య ఊపందుకోవడము వల్లే కాని, ఆడ మగ తేడా లేకుండా పోటీ తత్వము పెరిగిపోయిది. అదే విధంగా మన దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగా విదేశాలకు వలస పోవటము తోడయి జనాలలో అభధ్రతాభావము, ఇవన్నీ కారణాలగా పెద్దలు కూడా తెగ ఒత్తిడి పెట్టడము జరుగుతోంది. ఇన్ని కారణాల వల్ల పిల్లలు పెద్దలు కూడా మనశ్శాంతి కోల్పోతున్నారు. ప్రపంచంలో ఇంజనీరింగ్ కాని మెడిసిన్ గాని చదవక పోతే జీవితమే లేనట్టు ఒక ముద్ర పడిపోయింది. పిల్లలకు విదేశాలకు పంపించే ప్రయత్నాలలో వాళ్ళు ఏమి కోల్పోతున్నారో వాళ్ళకే అవగతం కావడం లేదు.
ఫలితం…….ఇరవై నాలుగు గంటలూ చదువులు చదువులు అంటూ మానసికంగా శారీరకంగా విశ్రాంతి లేకుండా అనారోగ్యాలు. వృద్ధాప్యంలో అయ్యో పిల్లలు దగ్గర లేరే అని ఏడిస్తే ఏమి లాభం.?

3. కుసుమ, సునంద పాత్రల తో ఒక మానసిక సమస్య గురించి ప్రస్తావించారు .వారి గురించి చదివేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .అంత సహజంగా వ్రాసారు అంటే మీకు మానసిక శాస్త్రం (సైకాలజీ ) మీద ఆసక్తా?అసలు మీరు రచన కోసం సబ్జెక్ట్ ఎట్లా ఎన్నుకుంటారు ?
జ; అవునండి. ఆ రెండు పాత్రలూ మలచినప్పుడు నేను పూర్తిగా అందులో మమేకం అయి రాసాను…….
నాకు మొదటి నుండి మనస్తత్వశాస్త్రం అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తితోటే డిగ్రీలో ఒక సబ్జెక్ట్ లో భాగం సైకాలజీ తీసుకున్నాను. డిగ్రీ అయిపోగానే సైకాలజీ ఎం.ఏ లో సీటు సంపాదించాను. కాని అప్పటికే పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అందుకని వదిలేయ వలసి వచ్చింది. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అప్లై చేయడం, సీటు రావడం, పెళ్ళి జరగటం అన్నీ వెంటవెంటనే జరిగాయి… యూనివర్సిటీ కాంపస్ లోనే అత్తగారిల్లు అవడాన యూనివర్సిటీలో చేరాను. కాని అప్పటికే వేవిళ్ళు, పరీక్షల సమయము కాన్పు దాదాపు ఒకేసారి జరగబోతూండటముతో సగంలో మానేసాను.
సహజంగా రాయగలగటానికి ………
మాది చాలా పెద్ద కుటుంబము. పుట్టింట్లో ఆరుగురు అన్నదమ్ములు ముగ్గురు మేనత్తల నడుమ పాతిక మంది దాకా కజిన్స్. అత్తింట్లో చాలా పెద్ద భాధ్యతలు భుజాన వేసుకున్న పెద్ద కోడలిని. ఇంతమంది బంధు జనంలో రకరకాల మనస్తత్వాలను చూసేదాన్ని గమనించేదాన్ని. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా నా స్తోమతు పట్టించుకోకుండా పరిగెత్తే దాన్ని. అట్లాగే మానసిక సమస్యలతో సతమతమయ్యే వారిని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్ళి వైద్యం ఇప్పించడం వంటివి చేస్తూ…..రకరకాల మనస్తత్వాలు గమనించ గలిగేదాన్ని.
డిప్రెషన్ లో ఉన్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తారు అని తెలుసుకున్నాను.
ఉదాహరణకు…… పొరుగున ఉండే ఒక టీనేజరు అబ్బాయి మానసికంగా కష్టం కలిగినప్పుడు….ఎవరినీ ఏమీ అనకుండా ఫుట్ బాల్ తీసుకొని బయట గోడకు కొడుతూ ఉండేవాడు. ధనాధన్ అని బాల్ శబ్దం వినగానే ఆ పిల్లాడికి ఏదో కోపం వచ్చిందని అర్ధమయ్యేది. ఆ విధంగా చాలా సంఘటనలు కళ్ళ ఎదురుగా కనిపించేవి.
నేను ఒక అంశం ఎట్లా ఎన్నుకుంటాను అన్న ప్రశ్నకు ……ఏమో నాకే తెలియదు. ఏదో ఒక సంఘటనతో మొదలెట్టి రాస్తూ, అదే ఆలోచిస్తూ కొనసాగించే దాన్ని.
నే రాసేవన్నీ నాకు అనుభవంలో ఉన్న మధ్యతరగతి కుటుంబ సమస్యలే…..
అటు అణగదొక్కబడ్డ వర్గము గురించి కాని అతి ఉన్నతమైన ధనికుల జీవితాలు గాని నాకు తెలియవు. ఈ నవలే కాదు నా ఇతర రచనలలో కూడా నేను చూసిన జీవితమే ప్రతిబింబిస్తుంది.

4. నేను చదివినంత వరకు మీ ఈ నవలలోను , ఆంద్ర భూమి వార పత్రిక లో వచ్చిన “స్వర్ణ కుటీరం” సిరియాల్ లోను , ఆంద్ర భూమిలోనే వచ్చిన మీ యాత్రానుభవం , మీ మేనత్తగారి దగ్గరకు వెళ్ళింది అన్నిట్లో కుడా ఉమ్మడి కుటుంబం గురించి అన్తర్లీనమ్ గా ఉంది . ఇప్పటి కుటుంబ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
జ; నాకు ఆ నాటి ఉమ్మడి కుటుంబము మీద ఎంత అభిమానము ఉందో ఈ నాటి వ్యష్టి కుటుంబం మీద కూడా అదే ఆదరణ.
మేము ఆరుగురు అన్నదమ్ములకు తొమిదిమంది అక్కచెల్లెళ్ళము. తొమ్మిదిమంది అన్నదమ్ములు.(ఇద్దరు తమ్ముళ్ళు ఈ లోకంలో లేరు). కష్టానికైనా సుఖానికైనా అందరమూ ఒక సైన్యం. తొంభై సంవత్సరాల ఆ చివరి మేనత్తను చూద్దామని అక్కచెల్లెళ్ళము మరదలు ఒక బస్సు మాట్లాడుకొని వెళ్ళి వచ్చాము.
ఆవిడ ఆనందము మాటలతో చెప్పలేము. ఒక్కొక్కరిని దగ్గరకు తీసుకొని కంట తడి పెట్టుకొని, “ఈ ఆనందము కాశీకి పోయినా రాదే” అన్న మాటలే కడుపు నింపాయి.
ఆ తరువాత 85 సంవత్సరాలు నిండిన వదిన ఇంటికి, చివరి బాబాయి ఇళ్ళకు కూడా వెళ్ళి సరదాగా గడిపి వచ్చాము.
అట్లా వయసు మీరిన వారి వద్దకు వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడే తీరిక ఓపిక కోరిక ఈ తరంలో కనిపించదు. కారణం బిజీ లైఫ్. టైం లేదు.

ఉమ్మడి కుటుంబము అంటే అర్ధమే మారిపోయింది. ఆ నాటి పెద్దపెద్ద అరుగుల పెరళ్ళ ఇళ్ళు ఈ నాడు కనిపించవు. బహు కుటుంబీకులు కరువయ్యారు. యాభై ఏళ్ళ క్రితమే ఇద్దరో ముగ్గురో పిల్లలతో మొదలైన ఇళ్ళల్లో, ఉద్యోగాలంటూ తలా ఒక దిక్కు పోయే కుటుంబాలలో ఉమ్మడి అసాధ్యం.
ఒకవేళ ఇద్దరు కొడుకులు తల్లితండ్రితో కలిసి ఉందామన్నా…..మనుషులు మారిపోయారు. మనస్తత్వాలు పూర్తిగా మారిపోయాయి.
మనము అన్న పదము నిఘంటువుల్లోంచి తొలగి పోయింది. నేను, లేదా, నేను మా ఆయన…..

ఆరోజుల్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యేవి. అత్తారింటికి వచ్చిన కోడలు ఎడ్జస్ట్ అయిపోయి ఆ ఇంటి పద్దతులు నేర్చుకోవడానికి ప్రయత్నించేది. ప్రతి విషయంలోనూ అత్తింటి పద్దతులు అనుసరించేది. చివరకు పిల్లల పెంపకంలో కూడా పెద్దల మాట పాటించేది.
ఇప్పుడు…….. పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి ఎంత లేదన్నా, 28, 30 సంవత్సరాల వయసు. ఆ పాటికే సంపాదనలు. వ్యక్తిత్వాలు.
పాతకాలపు అత్తగారి మాట అనుసరించడం అంటే అవమానం.
చివరకు భోజనాల వద్ద కూడా మా ఇంట్లో…..అంటూ పుట్టింటి ఆచారాలు అత్తింట్లో ప్రవేశ పెట్టబోవడం……అక్కడ కూడా తేడానే.
ఒకరికి అణిగిమణిగి ఉండటం అన్న భావన.
పోయిన సంవత్సరం మంథా భానుమతిగారు నిర్వహించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కథల పోటీలలో నేను రాసిన కథ, “భిన్నత్వంలో ఏకత్వం’ లో అదే వివరించాను. అసమానతలు అసహనాల మధ్య ఒక కప్పు కింద కొట్టుకుంటూ బతికే కన్నా ఎవరికి వారు బతుకుతూ అవసరానికి ఆదుకుంటూ ఉంటేనే మేలు.
తరాలలో అంతరాలు అధిగమించ లేము. ఎవరి స్పేసు వారికి ఉంటుంది. పిల్లలు మా మాట వినడం లేదు అని పెద్దవాళ్ళు, ఈ ముసలి వాళ్ళ సుత్తి భరించలేక పోతున్నామని పిల్లలూ తిట్టుకోనవసరం లేదు.

5. ఫేస్ బుక్ లో మీరు వ్రాసిన పెళ్లి సందడి కి చాలా మంది స్పందించారు, ఆనందించారు . వారిలో నేను ఉన్నాను .చాలా ఆసక్తిగా వ్రాసారు . నిజంగా అలాంటి పెళ్ళిళ్ళను మళ్ళీ చూడగలమా ? ఈ కాలం జరుగుతున్న పెళ్లి సంబరాల గురించి మీరే మంటారు ?
జ; అవన్నీ మధుర జ్ఞాపకాలు. మళ్ళీ అట్లాంటి రోజులు రావడం కల్ల. ఈ రోజుల్లో పవిత్ర వివాహ తంతు కన్నా ఆర్భాటాలకు ప్రాధాన్యమివ్వడం కనిపిస్తోంది. ఈ రోజుల్లో నిశ్చితార్థమే పెళ్ళి అంత ఘనంగా చేస్తున్నారు. ఫోటోలు వీడియోలకు ఇచ్చినంత ప్రాధాన్యత మంత్రతంత్రాలకు ఇవ్వడం లేదు. పోనీ ఆ పెళ్ళీళ్ళన్నా కలకాలం నిలుస్తున్నాయా అంటే అనుమానమే.

6. మీరు నవలలే కాక ఇంకా ఏ ప్రక్రియలల్లో రచనలు చేసారు?మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పగలరా?
జ; నేను ఫేస్బుక్ లో చేరాకనే నా సాహితీ ప్రక్రియలకు ఒక రూపము ఏర్పడ్డది. అచ్చంగా తెలుగు సమూహంలో శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారు నిర్వహించిన ఛందస్సు పాఠాలు అనుసరించి పద్యరచన అభ్యాసము చేయటమే కాక ఆ సమూహములో నిర్వహించిన దాదాపు ప్రతి పోటీలోనూ బహుమతులు పొందే భాగ్యము కలిగింది.
కథారచనలు చేస్తూన్న సమయంలో భారతం వచనం చదువుతూ అందులో తటస్థ పడ్డ పాత్రలను ప్రస్తుత సమాజానికి సమన్వయ పరుస్తూ చిన్నకథలు రాయడం మొదలు పెట్టాను. అట్లా ఒక పది కథలు రాసి ఆధ్రభూమి సంపాదకురాలికి పంపించాను. ఆవిడ చాలా సంతోషించి, ఈ విధంగా ఎన్ని రాయ గలుగుతారు అని అడిగారు. మన పురాణాలు ఒక మహా సముద్రము. ఎన్నైనా రాయవచ్చు అనగానే వారపత్రికలో ధారావాహికంగా మొదలెట్టి 80 వారాలు నిరాటంకగా పాత్రోచితము అన్న పేరుతో ప్రచురించారు.
అదే సమయంలో మా తమ్ముడు చాలా సీరియస్ గా మృత్యువుతో పోరాడుతూ ఉండేటప్పటికి ఇక నేను రాయలేక ఆపేసాను.
అచ్చంగా తెలుగు సమూహంలో……సరదాగా ప్రహేళికలు అంటూ నిర్వహించాను. ఒక పురాణకథను నాలుగు పాదాల పద్యములో రూపొందిచి పోస్ట్ చేయడము. సభ్యులు సమాధానము చెప్పడమూ ….
ఆ కార్యక్రమం వల్ల, ఈ తరం వారికి పురాణ పాత్రలు కథల అవగాహన కలిగించడంతో పాటు నాకు మరింత పద్యరచనలో అభ్యాసం కూడా కలిగింది.
కొంతకాలము సంభాషణా సంస్కృతము తరగతులలో భాష నేర్చుకొని, దానికి సంబంధించిన వ్యాసాలు రాసాను. మాసపత్రికలో పది నెలలు సరళ సంస్కృతం అన్న పేరున ప్రచురితమయ్యాయి.
అవే కాక సందర్భానుసారంగా “అనవరత రామలీల:, “త్యాగరాజ ఆరాధన విశేషాలు”, “అగాథాక్రిస్టీ నాటకము” మొదలైన వ్యాసాలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

7. మీ నవలలో చాలా చోట్ల ఇంగ్లీష్ నవల ప్రస్తావన కూడా ఉంది. మీకు సాహిత్యం లో చాలా అభిరుచి ఉన్నట్లుగా తెలుస్తోంది.అలాగే పాటల గురించి కూడా ప్రస్తావన ఉంది. అంటే మీకు సంగీతం లో కూడా ప్రవేశం ఉందా?
జ; చిన్నతనం నుండి పుస్తక పఠనం ఒక వ్యసనం. మా నాన్నగారు విపరీతంగా పుస్తకాలు కొనేవారు. అన్నీ చదివే వాళ్ళము. వయసు వచ్చాక తెలుగుతో పాటు ఇంగ్లీషు పుస్తకాలు కూడా విరివిగా చదివటం మొదలెట్టాను. ఇంట్లో పాప్యులర్ ఇంగ్లీష్ ఫిక్షన్ పెద్ద కలెక్షన్ ఉంది.
శ్రీకృష్ణదేవరాయలాంధ్ర భాషా నిలయంలో జన్మ సభ్యత్వము, స్టేట్ లైబ్రరీ, బ్రిటిష్ లైబ్రరీలో సభ్యత్వము కూడా ఉండేవి.
ఆ ఆసక్తి వల్లనే లైబ్రేరియన్ అయితే బోలెడు పుస్తకాలు చదవవచ్చు అన్న ఆరాటమే నన్ను ఈ రంగం లోకి దింపింది. నా కోరిక మనసారా తీర్చుకున్నాను.
అయిదవ ఏటనే అక్షరాభ్యాసంతో పాటే సంగీతాభ్యాసము కూడా మొదలెట్టారు. వీణ కూడా నేర్చుకున్నాను. కాని అంతగా రాణించ లేకపోయాను.

8. సాహిత్యం, సంగీతమే కాక ఇంకా ఏమైనా కళలల్లో మీకు ప్రవేశం ఉందా ?
జ; పదహారేళ్ళ వయసు నుండి నిట్టింగ్ ఒక హాబీ. ఎవరు అడిగితే వారికి స్వెటర్లు అల్లి ఇచ్చేదాన్ని. ఎవరికైనా బిడ్డ పుడితే వాళ్ళకు బేబీ సెట్ నిట్ చేసి ఇచ్చేదాన్ని. అట్లాగే నా మార్వాడీ కొలీగ్స్ నుండి ఎంబ్రాయడరీ నేర్చుకొని ఆ రోజుల్లో విపరీతంగా చీరల మీద కుట్టాను

9 మీ రచనలు చదువుతుంటే మీరు చెప్పాలనుకుంది చక్కగా , ఏమి చెప్పాలనుకున్నారో అది ఆసక్తి కలిగించే విధంగా చెపుతున్నారు .మీరు టీచర్ గా పని చేసారనుకున్నాను 🙂 మీ పుస్తకాలు ఎక్కడ లభ్యమవుతాయో చెప్పగలరా?
జ; నేను పరోక్షంగా టీచరునే అని చెప్పవచ్చు. ఒక తల్లిగా ప్రతి మహిళా తన సంతానానికి టీచరే…….కాకపోతే, మొదటి ప్రశ్నకు సమాధానము చెప్పినట్టు…..నాకు పిల్లలతో అంటే స్టూడెంట్స్తో మాట్లాడటమూ, తెలియని విషయాలు వివరించటమూ అంటే ఇష్టము. ఏదైనా కాలేజీలో పోటీ అనగానే స్టూడెంట్స్ బిలబిలమంటూ లైబ్రరీ మీద దాడి చేసేవారు. వారందరినీ కూర్చోబెట్టి అంశము గురించి వివరిస్తూ అట్లా ఇండైరెక్ట్ గా టీచింగ్ అలవాటయింది అని చెప్పవచ్చు. నా పుస్తకాలు అన్ని ప్రముఖ పుస్తక షాప్ లల్లో లభ్యమవుతాయండి .
చిన్నచిన్న రచనలు చేస్తూ నేను రాసిన చిరు రచనలను అభిమానించి నాతో ముఖాముఖి నిర్వహిద్దామన్న ఆలోచన వచ్చిన మీకు విహంగ పత్రిక వారికి అనేక ధన్యవాదాలు.
కొద్దిగా మీ సమయాన్ని నాకోసం వెచ్చించి, నేను అడిగిన ప్రశ్నలకు ఒపికగా, విపులంగా సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

-మాలాకుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Comments are closed.