మేఘసందేశం-13 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు అనగానే మనకు కూర్చున్న కొమ్మని నరుకుతూ, వెర్రివెంగళప్పలా, మోసంతో ఒక రాకుమారిని పెళ్ళాడి ఆవిడ ప్రోద్బలంతో, నాలిక మీద కాళిక బీజాక్షరాలు రాయబడిన సాహితీ విశారదుడైన కధే! అన్ని భాషల్లోనూ సినిమాలు గా కూడా వొచ్చింది! అదే! కానీ అది కేవలం కల్పన అంటారు విమర్శకులు. అంత చక్కని భాష యే గురువు దగ్గిరా ఏమీ నేర్వకుండానే హఠాత్తుగా వొచ్చేస్తుందా ఎవరికయినా? కాళిదాసకవి కూడా అందరి వలెనే విద్యాభ్యాసం ద్వారానే తన ప్రతిభని మెరుగు పర్చుకుని వుండవచ్చునని భావిస్తారు. అతనికీ ఇతర కవులైన దండి, భవభూతి లాంటి వాళ్లతో ప్రజ్ఞావైరం కూడా సహజంగా వుండి ఉంటుంది.
ఈ ముగ్గురితో ముడిపడిన మరొక కధ ఒకటి చెప్తాను. ఒకసారి తనని మిగతా కవులు సరయిన రీతిలో గుర్తించడం లేదని కాళిదాసు మహాకవికి ఆగ్రహం పుట్టి అందరికీ తను ఆరాధించే కాళికా దేవి నోటితోనే తన ప్రతిభ గురించి చెప్పిస్తానని అందరినీ పిల్చాడు. భవభూతి మహాకవి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఆ వివరాలు తర్వాత చెప్తాను. అలా అందరూ వచ్చాక దేవిని ప్రార్ధించి కాళిదాసు అడిగాడు “గొప్ప కవి ఎవరు?” అని. అయితే కాళిదాసు ఊహకు భిన్నంగా మూలవిరాట్టు నుంచి “కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః” అని వినపడింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. అసలు అడిగిందే తను అయితే తన గురించి చెప్పలేదని చిరాకు పుట్టి “కోహం రండే?” అని గద్దించగానే “త్వమేవాహం త్వమేవాహం న సంశయః” అని వినబడేసరికి ఎవరికి తోచిన అర్ధం వాళ్ళు తీసుకుని దేవికి నమస్కరించారు! మిగతా వాళ్లకి నువ్వు నా అంతటివాడివి అని కాళిదాసుని పొగిడినట్టూ కాళిదాసుకి నువ్వూ నాలాగే రండవే అని అన్నట్టూ అర్ధమయింది! మళ్ళీ మనం మేఘసందేశం లోకి ప్రవేశిద్దాం.

శ్లో.54. తం చేద్వాయౌ సరతి సరళస్కంధసంఘట్టజన్మా
బాధేతోల్కాక్షపితచమరీవాలభారో దవాగ్నిః,
అర్హస్యేనం శమయితుమలం వారిధారాసహస్రైః
రాపన్నార్తిప్రశమనఫలాః సంపదో హ్యుత్తమానాం.

భావం: ఓ మేఘుడా! గాలివల్ల దేవదారువృక్షాల బోదెలు ఒరుసుకొని దావాగ్ని పుట్టడం ద్వారా దాని యొక్క నిప్పురవ్వలు చమరీమృగాల తోకలయొక్క వెంట్రుకలను కాల్చిహిమవత్పర్వతాన్ని బాధించినట్లైతే నీవు వేల జలధారలతో ఆ దావాగ్నిని చల్లార్చు. ఆపదలలో ఉన్నవారి కష్టాన్ని తీర్చడమే కదా! సత్పురుషుల లక్షణం. ఉత్తముల సంపదలకు ఉన్న ఫలం అంటున్నాడు యక్షుడు. ఇంకొంచెం వివరణగా చెప్పాలంటే ఉత్తములు, సజ్జనులు అయినవారు సదా పరోపకారులై జీవిస్తూ వీరివద్ద సంపద ఉంటే దాన్ని తిరిగి అడిగినవారికోసమే ఉపయోగిస్తారు. ఎప్పుడూ తమకోసం అని దాచుకోరు. ఎవరైనా అర్థించకపోయినా సరే! అవసరం తెలుసుకొని మరీ సహాయం చేస్తారు. సూర్యుడు కమలములను అవి అడిగాయని వాటిని వికసింపజేస్తున్నాడా! కలువలు ప్రార్థించాకే చంద్రుడు వాటికి సంతోషం కలిగిస్తున్నాడా!” అంటాడు భర్తృహరి. “పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థ మిదం శరీరం అనే విధంగా సత్పురుషులు ప్రవర్తిస్తారు అని యక్షుడు మేఘుడిని పొగిడి ఆనంద పరవశుడిని చేస్తున్నాడు.

శ్లో.55.యే సంరంభోత్పతనరభసాః స్వాంగభంగాయ తస్మి౯
ముక్తాధ్వానం సపది శరభా లంఘయేయుర్భవంతం,
తాన్కుర్వీథాస్తుములకరకావృష్టిపాతావకీర్ణా౯
కే వా న స్యుః పరిభవపదం నిష్ఫలారంభయత్నాః.

భావం: ఓ మేఘుడా! ఆ హిమాద్రిమీద నిన్ను చూసి ఏనుగు అని భ్రమసి తొందరపాటుతో శరభ మృగాలు (పర్వత మృగాలు) నీమీద అతివేగంగా దూకుతాయి. అప్పుడు నీవు అవి నీమీద పడకుండా తటాలుమని తప్పుకో. అప్పుడు అవి ఒళ్లు విరిగి క్రింద పడతాయి. ఆ తర్వాత నీవు వాటిపై దట్టంగా వడగండ్ల వాన కురిపించు. పనికిమాలినపనులు చేసేవారెవరైనా సరే తిరస్కారానికి గురి అవుతారు తప్ప గౌరవింపబడరు. అవమానింపబడతారని కాళిదాసు భావం.

శ్లో.57.తత్ర వ్యక్తం దృషది చరణన్యాసమర్ధేందుమౌళేః
శశ్వ త్సిద్ధై రుపచితబలిం భక్తినమ్రః పరీయాః,
యస్మి౯ దృష్టే కరణవిగమాదూర్ధ్వ ముద్ధూతపాపాః
కల్పిష్యంతే స్థిరగణపదప్రాప్తయే శ్రద్దధానా:

భావం: ఆ పర్వత గొప్పదనం చెబుతాను విను. ఆ హిమవత్పర్వతమందు పూర్వం శివుడు ఒక రాతిమీద తన పాదాన్ని ఉంచాడు. అప్పుడు అక్కడ ఆయన పాదచిహ్నం ఏర్పడింది. ఆ పాద చిహ్నాన్ని సిద్ధ గంధర్వ, యక్షులు మొదలైన వారు ఎన్నోసార్లు పూజించారు. ఆ శివపాదానికి వినమ్రుడవై భక్తితో ప్రదక్షిణం చెయ్యి. అలా చేసినవారి పాపాలు నశిస్తాయి. అంత్యకాలంలో ప్రమథగణ స్థానాన్ని పొందుతారు. శ్రేయస్సు కలుగుతుంది. శివైక్యం సిద్ధిస్తుందని భావం.

శ్లో.58. శబ్దాయంతే మధురమనిలై: కీచకా: పూర్యమాణా:
సంసక్తాభి స్త్రిపురవిజయో గీయతే కిన్నరీభి:,
నిర్హ్రాదస్తే మురజ ఇవ చేత్కందరేషు ధ్వని: స్యాత్
సంగీతార్థో నను పశుపతే స్తత్ర భావీ సమగ్ర:.

భావం: మేఘుడా విను. అక్కడ వెదురుబొంగులు గాలిచే నింపబడి మ్రోగుతున్నాయి. వెదుళ్లు మ్రోగాలంటే రంధ్రాలుండాలి కదా! ఎవరు చేశారాని నీకు అనుమానం రావచ్చు. ఆ రంధ్రాలను తుమ్మెదలు చేశాయి. కిన్నెరస్త్రీలు, గుంపులు గూడి, శివుడు, త్రిపురాసురలను జయించిన కథను పాడుతున్నారు. నీవు ఉరిమినచో, ఆ ధ్వని, కొండగుహలలో చేరి, వెలువడునప్పుడు, మద్దెలమ్రోతలా ఉంటుంది. అప్పుడు శివసంగీతం, సంపూర్ణం అవుతుంది. పరమశివుడు అత్యంత అనందం పొందుతాడు.

శ్లో.59. ప్రాలేయాద్రే రుపతట మతిక్రమ్య తాంస్తా న్విశేషాన్
హంసద్వారం భృగుపతి యశోవర్త్మ యత్క్రౌంచ రంధ్రమ్,
తేనోదీచీం దిశ మనుసరే స్తిర్యగాయామశోభీ
శ్యామః పాదో బలినియమనాభ్యుద్యతస్యేవ విష్ణోః

భావం: హిమవత్పర్వత తటాల్లో ఆ మంచుకొండల యొక్క చఱియల్లో, విశేషాలను మరింతగా దాటిపోయి, హంసలదారి మరియు పరశురాముని కీర్తిమార్గం అయిన క్రౌంచ పర్వతబిలంనుండి బలిని బంధించటానికి పూనుకొన్న విష్ణువు నల్లని పాదంలా అడ్డంగానూ పొడవుగానూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉత్తరదిశగా వెళ్లు అని చెప్తున్నాడు యక్షుడు. వివరoగా చెప్పుకోవాలంటే హిమాద్రి యందు చూడదగిన ఎన్నో వింతలున్నాయి. అవన్నీ చూడాలంటే నీకు చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి నీ దారిన నువ్వు పోవడం మంచిది. అలా పోతూ పోతూ ఉంటే క్రౌంచం అనే పేరుగల మహాపర్వతం నీకు అడ్డు వస్తుంది. ఆ పర్వతానికి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం పూర్వం పరశురాముడు చేసినది. పరశురాముడు కుమారస్వామితో కలసి శివునివద్ద అస్త్రవిద్య నేర్చుకొంటూ, స్కందునితో పోటీపడి వాడియైన బాణాలతో ఈ క్రౌంచపర్వతాన్ని భేదించి ప్రసిద్ధికెక్కాడు. అప్పటినుండి వర్షాకాలం రాగానే హంసలన్నీ ఈ రంధ్రంనుండే మానససరోవరానికి చేరతాయి. నీవు ఈ దారిగుండా వెళ్లు. అప్పుడు నీవు, బలిని అణచదలచి, ఎత్తిన విష్ణువు పాదంలా శోభిల్లుతూంటావు సుమా! అని పొగుడుతూ సాగనంపుతున్నాడు కార్యార్ధియైన యక్షుడు.

– వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)