ఈ – కథలు : సంస్కృతీ వైవిధ్యం(సాహిత్య వ్యాసం )-ఆచార్య కొలకలూరి.మధుజ్యోతి

ISSN 2278-478

తెలుగు సాహిత్యనికి శ్రీ కౌముది పత్రిక చేస్తున్న సేవ గుర్తించదగ్గది.కె.వి.ఎస్‌. రామరావు సంపాదకత్వంలో 2007 లో ప్రారంభం అయిన పత్రిక శ్రీ కౌముది. ” మీ ముంగిట్లో సాహితి వెన్నెల ” అన్నది దీని ఉపశీర్షిక.వివిధ నూతన పోకడలతో కొనసాగుతూ ఉంది.రచయిత రచయిత్రుల రచనల్లోని గొప్పదనాన్ని అందించటమే కాదు పాఠకులనూ రచయితలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూఉంది. ఒక కొత్త సాహిత్య పత్రికను ప్రారంభించాలనే ఆలోచనే ఈ పత్రిక వెలువడటానికి కారణం. రచయితల అభిప్రాయాలు, ఆలోచనలు,విమర్శలే ” శ్రీ కౌముది ” పత్రిక మరింత ప్రమాణాలతో సాగటానికి కారణమవుతున్నాయి. శ్రీ కౌముది ముఖచిత్రం పై అను నిత్యం ఉండే కవితలు భావుకతతో అలరిస్తాయి. ఈ – పత్రికలలో ప్రథమ వరుసలోని నిల్చే పత్రిక ఇది. కథలు,కవితలు,ధారావాహిక నవలలే కాక, హస్యనికీ భాగ్యస్వామ్యం ఉంది.ఎన్నో ప్రత్యేక శీర్షికలు ఉన్నాయి.అను నిత్యం కొత్తదనాన్ని నింపుకొనే ప్రయత్నం చేస్తూ ఉంది. ” అనగనగా ఓకథమంచి ” అలాంటిదే. నిత్యం కథలు కవితల పోటీిలు నిర్వహిస్తూ ఉగాది నాడు బహుమతులు ఇస్తారు.

శ్రీ కౌముదిలో వచ్చే కథలు సంస్కృతి ప్రతిబింబించే కథలు ఎన్నో కౌముదిలో ప్రచురితమైన రెండు కథలు- జానకి, కొత్త సీసా – పాత సారా భిన్న సంస్కృతులు వాటి మధ్య జరిగే ఘర్షణలను రాజీలను స్పష్టంగా చెప్తాయి. రెండు భిన్న సంస్కృతులకు చెందిన వారు కలిసిినప్పుడు ఆదాన ప్రదానాలు సహజం. చాల సార్లు అవసరార్థం కొత్త సంస్కృతి ప్రాంగణంలోకి వెళ్ళిన వారు, ఆ సంస్కృతి తప్పనిసరై స్వీకరించటం జరిగితే,కొన్ని సార్లు అభిముఖంగానూ ఉంటుంది మార్పు.జానకి ( శామలా దేవి దేశిక -జనవరి 2007 ), కొత్త సీసా పాత సారా(నిడదవోలు మాలతి – జనవరి 2008 ) రెండు కథలూ సాంస్కృతిక వైవిధ్యాన్ని తెల్పే కథలు. జానకి అనే పల్లెటూరి అమ్మాయి.

వివాహమయి పట్టణానికి అమెరికాకు వెళ్ళి నలభైఏళ్ళపాటు తనను తాను అవసరానికనుగుణంగా మలచుకొంటూ,జీవించింది. పల్లె నుంచి పట్టణానికి వచ్చింది. అత్త తెలుగు హిందీ ఇంగ్లీషు భాషలలో మాట్లాడుతూ ఎవరికేది కావాలో చూస్తూంటే జానకికి ఆశ్చర్యం. తెలియనివి నేర్చుకొంటూ కొత్త వాతావరణంలోకి ఇమిడే ప్రయత్నం చేసేలోపు భర్తతో కలిసి అమెరికా చేరవలసి వచ్చింది. అక్కడ వాతావరణానికి అనుగుణంగా పాంటు షర్టు వేసుకొవటం ప్రారంభించింది. అక్కడ సంస్కృతిని అలవర్చుకొంటూ హైహీల్స్‌, లిప్‌స్టిక్‌ వంటివీ అలవర్చుకొంది. పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది.పెరిగే అవసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకొంటూ కొన్ని కోర్సులు చేసి పార్ట్‌టైం ఉద్యోగంలో చేరింది. పిల్లలు పెరిగే కొద్దీ వారిలో మార్పు రావటం తనను సరిచేసే వారి ప్రవర్తన తనకేం తెలియదనే వారి నమ్మకం ఇవన్నీ జానకిలో తెలియని భయాన్ని దిగులును కలగజేశాయి.

ఒకరోజు స్నేహితురాలు సుజాత అడిగితే పిల్లలు తనను అవమానిస్తున్నారని గౌరవించటం లేదని వాపోయినప్పుడు సుజాత ఓదార్చింది. వారిది కౌమారదశ అని ఆ వయస్సులో శారీరకంగా మానసికంగా వాళ్ళెలా మార్పులకు గురవుతుంటారో మనం అర్థం చేసుకోవాలని చెప్పింది. వాళ్ళు మనల్ని గౌరవించటం లేదనుకొంటాం కాని రోజూ వాళ్ళు బయట ఎన్ని అవమానాలకు, విమర్శలకు ఛాలెంజ్‌లకు గురి అవుతారో తెలుసా? వెలివేసినట్లు ప్రత్యేకంగా కనిపించే మన పిల్లల్ని,బయట పిల్లలు ఎంత ఒత్తిడి చేస్తారో ఊహించగలవా? ఇంట్లో ఒక రకంగా బయట మరో రకంగా ఉండే వాతావరణంలో వారెంత ఘర్షణ పడతారో నువ్వు అర్థం చేసుకొవాలి. వాళ్ళకు నచ్చచెప్పాలి. వారు మారిపోతున్నారని కాక తల్లిగా నువ్వు మారటం ముఖ్యం, అని విడమరిచింది.

పిల్లల కొసం మారదలచిన జానకి, వారు వెక్కిరించే తన ఇంగ్లీషును బాగు చేసుకోవటానికి క్లాసులకెళ్ళింది. హోరెత్తే మ్యూజిక్‌ను పాటలను తెలుసుకోవటం మొదలు పెట్టింది. వాళ్ళకు ఇష్టమైన వంటలు నేర్చుకొంది. పిల్లలు భారతీయుల్లా ఉండాలి అలాంటి బట్టలే కట్టాలి అనే దృష్టిని మార్చుకొంది. పిల్లల ప్రపంచంలోకి అడుగుపెట్టి వారితో కలిసిపోవాలని అది అవసరమని గుర్తించింది. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలని అది అవసరమని గుర్తించిన జానకి వారి రాష్ట్రాంతర దేశాంతర ఖండాంతర వివాహాలకూ అడ్డు చెప్పలేదు. మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకోసాగింది. పెద్దాడి కూతురు నికోల్‌ మాత్రం నాన్నమ్మ పెళ్ళి ఫోటోను చూస్తూ తానలా ఉండాలని కోరుకొన్నప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

ఈకథలో మూడు వాస్తవాలు స్పష్టమవుతాయి. ప్రవాసాంధ్రలు ఎదుర్కొనే సమస్యలూ సర్దుబాటులే ఈ కథ. జానకి జీవితాన్ని ఆమె చివరి కాలాలలో నిలబడి చూసినప్పుడు పల్లెటూరి చిన్నది పట్టణానికి విదేశానికి వెళ్ళి నేర్చుకొంటూ తనను తాను మార్చుకొంటూ ఎదిగి సంసారాన్ని దిద్దుకొన్న వైనం ప్రశంసాత్మకం. పురోగమనానికి అది అవసరం.నేను నేనులాగానే ఉంటాను అనుకొంటే తాను ఎదగదు సంసారమూ సజవుగా సాగదు.తప్పని సరి మార్పును ఇష్టంగా అమోదించింది జానకి.

మరో అంశం పిల్లలు. వివక్ష అన్ని చోట్లా ఉంది. గ్రామం మొదలు విదేశాల వరకు ఒక్కోచోట ఒక్కోరూపం. అమెరికాలో వర్ణ వివక్ష. భారతీయుల శరీర రంగు అమెరికన్ల నుంచి వేరు చేస్తుంది. నలుగురున్న ఇంటి సంస్కృతిని పాటించాలా, బయట అనంతంగా ఉన్న సంస్కృతిలో భాగం కావాలా అనేది తెలియని ఒక సంఘర్షణాత్మక స్థితి పిల్లలది అయితే, స్థానికులు అదే దృష్టితో వీరిని గమనిస్తారు. పసివాళ్ళ పట్ల ఆ దృష్టి ఇబ్బందిగానూ, వివక్షగానూ పరిణమిస్తుంది.

మూడో అంశం రెండు తరాల మధ్య సయోధ్య ఉండాలి. అది ఉండాలంటే పెద్దతరం సమర్థవంతంగా ఉండాలి. పిల్లలు తనను గౌరవించే స్థితిలో ఉండాలి. పిల్లలు ఏం కోరుకొంటున్నారో అది గ్రహించే స్థితిలో ఉండాలి. దానికి తల్లిదండ్రుల అధికంగా మార్పును స్వీకరించే స్థితికి సిద్ధంగా ఉండాలి. ఆ తీరు తల్లిదండ్రుల్లో లేకపోతే పిల్లలతో ఘర్షణ, వారితో అనుబంధాలు చెడిపోవటం జరుగుతాయి. ఆ స్థితిని జానకి చాలా జాగ్రత్తగా నిర్వర్తించింది. కుటుంబాన్ని అనుబంధాల చట్రంలో ఒదిగి ఉండేలా చేసింది. మనవరాలు భారతీయ సంస్కృతిని ఇష్ట పడటం జానకి నిర్విరామ మార్పు సంతరించుకొన్న స్వభాóవానికి లభించిన బహుమతి. ఈ మూడు అంశాల రీత్యా ఈ కథ గుర్తుండి పోతుంది.

2. నిడదవోలు మాలతి రాసిన ” కొత్త సీసా పాత సారా ” కథ ఒక ఉద్యోగస్థురాలి కథ. విశేష ప్రత్యేక కథ వస్తువు ఇది. రచయిత్రి ఉత్తమ పురషలో నడిపిన కథలో స్థానిక కళాశాలలో మానవ విలువలు తెలియజేసే పని ఆమెది. ప్రతి సెమిస్టరులో విద్యార్థులు పదిగంటల సాంఘిక సేవ చేయాలి. మికెలా అనే బిజినెస్‌ అడ్మిన్నిస్ట్రేషన్‌ విద్యార్థికి ఊళ్ళో ఉన్న రెండు సేవా సమాజాలకు వెళ్ళి అక్కడ చేయగలిగింది ఏమైనా ఉందేమో చూడమంటేే వెళ్ళిన మికెలా సర్స్గింగ్‌హోంలో ఓ భారతీయ స్త్రీ ఉంది, ఆమె అయితే

కల్చరల్‌ డైవర్సిటికి కూడా అవకాశం ఉంటుందని చెప్పింది. సానుభూతి , సహాయ పడటం, భిన్న సంస్కృతుల విలువలు అనే అంశాలను ఆమె విషయంలో మికెలా అధ్యయానానికి కేటాయించింది. మికెలా తన ప్రాజెక్టు గురించి ఆవిడ పూర్ణిమాదేవి అని వివాహం కాలేదని చెల్లెలి పదకొండు మంది పిల్లలను స్కూలు టీచరుగా ఉంటూ చదివించిందని, పెరిగిన పెద్దవాళ్ళు ఉద్యోగాల్లో చేరి చిన్నవాళ్ళని చదివించారంటూ చెప్పి, తన గురించి ఆమె వివరాలడిగిందని చెప్పేది. మికెలా ఆవిడ కుటుంబ సంబంధ విషయాలు వింటూ ఒక పెద్ద బోర్డు ఇచ్చి తనకు అభిమానం ఉన్నవారందరితో ఓ కలాజ్‌ చేయమని అభిప్రాయాలు రాయమని అడిగింది వేయమని కలాజ్‌కి గమ్‌, ఓ బుక్కు లేదా తెల్ల కాగితాలు అట్టబోర్డు అవసరం. దానికి అవ్వబోయే ఖర్చును అధ్యాపకురాలు తానివ్వబోతే వద్దని వెళ్ళింది. నాలుగు వారాలయినా కనిపించలేదు. సెమిస్టరు అయిపోవచ్చింది. తానేం నేర్చుకొందో తన పని తనలో ఏ మార్పు తెచ్చిందో తెలపాలి. మికెలాకు ఈ – మెయిల్‌ పంపింది. దాని సమాధానంగా మికెలా వచ్చి తాను చేసే ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు కాని పూర్తి చేస్తాను, ఈ లోపు ఇంటర్వ్యూ చేద్దాం అంది.అది రికార్డు చేయటాన్ని వద్దంది. తాను తెలుసుకొన్న విషయాలు చెప్పసాగింది. పెద్ద కుటుంబాలు చిన్న ఇళ్ళలో ఉండటం వల్ల ఫెమిలియారిటి తద్వారా ఆత్మీయులుపెరుగుతాయని తెలుసుకొన్నాను అంది. పూర్ణిమాదేవి చెల్లి కొడుకు ప్రనీల్‌ అందరితోఉన్నా ఆమెకు జరుగుబాటు సమస్యఅవుతూ ఉండటంతో తనతోతెచ్చుకొన్నాడు. ప్రనీల్‌కు ఇద్దరు పిల్లల తర్వాత పుట్టిన పిల్లాడికి మల్టిపుల్‌ సోలరిసిస్‌ వల్ల భార్య బిడ్డ దగ్గర ఉండవలసి రావటంతో పూర్ణిమదేవిని తప్పని సరై దగ్గరలోని నర్సింగ్‌హోంలో చేర్చారని కళ్ళ తడిబారుతుంటే చెప్పింది.

సెమిస్టరు చివరి రోజు, తల్లి రాసిన ఉత్తరం, అమ్మమ్మను తెచ్చి వదిలివెళ్ళిన మావయ్య, అమ్మమ్మకు చాదస్తం ఎక్కువై చిట్టి బుజ్జిని వేధించటం గురించి ఆలోచిస్తూ ఉండగా మికెలా వచ్చింది. కలాజ్‌ సంగతి చెప్పింది. పూర్ణిమదేవి కలాజ్‌ చూపిస్తూ పరమానందపడిపోతూ తనకు థాంక్స్‌ చెప్పింది అంటూ,ఆ కలాజ్‌లోని ఓ చివరి స్టాంపు సైజులో ఉన్న మికెలా బొమ్మను కూడా చూపించింది. ఆవిడ ఎనభై ఏళ్ళ జీవితంలో, నేనెంతసేపూ సేవచేస్తున్నాను అనుకొంటుంటే -నా పాత్ర ఎంత చిన్నదో అర్థమయింది. అదే నేనేర్చుకొన్న నిజమయిన పాఠం అంటూ అది చెప్పటానికి వచ్చానని చేప్పేసి వెళ్ళిపోయింది.

ఈ కథలో తెలిసే అంశాలు విద్యావ్యవస్థ తీరు. భారతదేశంలో బాల్యంలో కాపీ పుస్తకంలో రాసే సూక్తులు ద్వారా- ఆడి తప్పరాదు, తల్లిదండ్రులు దేవునితో సమానం లాంటివి – నేర్పే మానవ విలువలు అమెరికాలోనూ నేర్పుతారు. అయితే బాల్యంలో కాదు. అమెరికాలో ఉగ్గు పాలతో గెలుపు పాఠాలు నూరి పోసి ఎదిగిన తర్వత ఈ సన్మార్గాలు సంఘ సేవ బోధిస్తున్నారు.చదువులో భాగమయిన సంఘసేవ ద్వారా వారు జీవితానికి తాము చేపట్టబోయే వృత్తికి కావలసిన విలువలు మెలకువలు స్వీయఅనుభావాలు నుంచి నేర్చుకొంటారు. మికెలా బిజిసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విద్యార్థి. మనుష్యులతో పని చేయాలి,వారి తత్వాలు తెలుసుకోవాలి, తదనుగుణంగా తానెంచుకొన్న ప్రాజెక్టులో తనకు తెలియని మానవ స్వభావాలను తెలుసుకొంది.ఆ క్రమంలో తానేమిటో తెలుసుకొంది. ఈ అనుభవం తన దృష్టిలో తానెంతో ఉన్నంతగా భావించే మికెలా ఇతరుల దగ్గర తన ప్రాధాన్యర ఎంత పరిమితమో అర్థం చేసుకొంది. ఆమె నేర్చిర నిజమైన పాఠం అదేనని పేర్కొంది. ఆమెరికాలో ఎక్కువ సంఖ్యలో కలిసి ఉండటం, ఒక ఇంట్లో కటిసి ఉండటం ‘ ఫెమిటియారిటి మితిమిరి కంటేంప్ట్‌కి దాని తీస్తుందని ‘ భావిస్తారు. అదే భారతదేశంలో అదే అంశం ఆప్యాయతలకు అనుబంధాలకు దారి తీస్తుంది.ఆ అనుబంధాలు అమెరికాలో అయితే ఎక్కువ కాలం నిలవవు కాని భారతీయలలో చాలా కాలం నిలుస్తాయి. ఆ ఆత్మీయతే ప్రనీల్‌ పూర్ణిమాదేవిని అమెరికాకు తేవటంలో కనిపిస్తుంది. ఆ ఆత్మీయతే మల్టిపుల్‌ సోలరిసిస్‌ ఉన్న కొడుకును జాగ్రత్తగా చూసుకొవాలనే తపనలో కనిపిస్తుంది. అనివార్యమైన ఆమెను సర్సింగ్‌హోంలో చేర్చటం వారికే కాదు ప్రాజెక్ట్‌ చేస్తున్న మికెలాకూ బాధ కలిగించింది. అనుబంధాల ప్రాధ్యాతకు భిన్నసంస్కృతుల నేపథ్యంలో నేర్చుకొంది మికేలా.

సంస్కృతి సంబంధమైన వైవిధ్యాలకు ఈ రెండు కథలూ మచ్చుతునకలు.

ఆచార్య కొలకలూరి.మధుజ్యోతి

తెలుగు ఆధ్యయనశాఖ

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

తిరుపతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.