జ్ఞాపకాలు 4(ఆత్మ కథ )- కె .వరలక్ష్మి

కె.వరలక్ష్మి

M .A తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను . ఎందుకంటె ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి . 1.విజయ విలాసము, 2.సారంగధర చరిత్రము . చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను . ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు . నాకేమో మోహన్ కూడా పి.జి చేసి హెడ్ మాస్టరో , లెక్చరరో అయితే బావుండునని ఉండేది . బుక్స్ కొనేస్తే తానే చదువుతాడులే అని ఒక ఆశ . ఇద్దరం కలిసి కాకినాడ , రాజమండ్రి బుక్ స్టాల్స్ అన్నీ చుట్టేసాం . మోహన్ కి M.Sc బుక్స్ దొరికేయి కాని , నా బుక్స్ దొరకలేదు . అప్పటికి మోహన్ ఆఖరు పిన్ని సరస్వతిగారు కుటుంబంతో వైజాగ్ డాబా గార్డెన్స్ లో ఉన్నారు . ఆవిడ భర్త లెక్చరర్ గా కొన్నాళ్లు సెలవు పెట్టి ఆంధ్రా యూనివర్సిటీలో హిస్టరీలో డాక్టరేట్ చేస్తున్నారు . ఆయన దగ్గర A.U లైబ్రరీ టోకెన్ ఉంటుంది అని దసరా సెలవుల మొదటిరోజు మోహన్ నన్ను వాళ్లింటికి తీసుకెళ్లి వదిలేసి తను వెనక్కి మద్రాసు వెళ్లిపోయాడు . అది మా అత్తగారి పెద్ద చెల్లెలి ఇల్లు .అప్పటికి ఎందుకో మా అత్తగారి వచ్చి ఉన్నారు . నేను ఆవిడ దగ్గర ఉంటూ సెలవులయ్యేలోగా లైబ్రరీలో నోట్స్ ప్రిపేర్ చేసుకుందామనుకున్నాను . ‘ఆదిలోనే హంస పాదు ‘ ఎదురైంది . నేను వెళ్లిన మర్నాడు రాత్రికి సరస్వతిగారి కుటుంబం తిరుపతి వెళ్తున్నారట . సెలవులయ్యే వరకూ రారట . టోకెన్స్ నా కిచ్చి వెళ్లడానికి ఆయన ఒప్పుకోలేదు . అప్పటికి జిరాక్స్ పద్ధతి లేదు . లైబ్రరీ అసిస్టెంట్ ఒకాయన నాకు ఉపయోగపడే బుక్స్ తీసి ఇచ్చేడు . ఆ పగలు , రాత్రి , మార్నాడు సాయం కాలం వరకూ వీలైనంత , రాయగలిగినంత నోట్స్ రాసుకుని టోకెన్స్ సరస్వతిగారి భర్తకి ఇచ్చేసేను . నిజానికి నాకు ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త . వారమంతా నోట్స్ రాసుకుని వాళ్ల టోకెన్స్ వాళ్లకి అప్పగించి వచ్చేదాన్ని . ఎందుకో కొందరు అలా ప్రవర్తిస్తారు . ఈ మధ్య మా ఆడపడుచు ఇంట్లో సరస్వతిగారి అమ్మాయితో మూడు రోజులు కలిసి ఉండాల్సొచ్చింది . ఆ అమ్మాయి పెద్దదై అమ్మమ్మ కూడా అయ్యింది . కాని అచ్చం ఆనాటి వాళ్ల పెద్ద వాళ్లలాగే ప్రవర్తిస్తోంది .

సరే , A.U లైబ్రరీ వాళ్లు నా వివరాలడిగి “అయ్యో , ఇంత దూరం ఎందుకొచ్చేవమ్మా , మీ రాజమండ్రి గౌతమి గ్రంధాలయంలో మీక్కావాల్సిన బుక్స్ అన్నీ దొరుకుతాయి . అక్కడ సన్నిధానం శర్మగారిని కలవండి “ అన్నారు . నాకు ప్రాణం లేచొచ్చింది . ఇంకా సెలవులున్నాయి . పిల్లల్ని కూడా మా అమ్మకి అప్పగించి వచ్చేను . మరో రెండు రోజులు మా అత్తగారి దగ్గర ఉండిపోయి ఓ రోజు సముద్రాన్ని చూసొచ్చేను . మేమున్న ఇంటి నుంచి అప్ లోకి నడిస్తే కె .జి .హెచ్ దగ్గర సముద్రతీరాన్ని చేరేం . అప్పటికి బీచ్ లో జన సమ్మర్ధం ఉండేది కాదు ఇప్పుడున్నంతగా . తనివితీరా కెరటాల్ని , సముద్రాన్ని చూస్తూ ఒంటరిగా ఏదో తాత్త్విక లోకంలోకి పయనించిన రోజది .

మర్నాడు పక్కింటి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ నమ్మి అప్పారావు గారు , ఆయన భార్య అమ్మాజీ గారు నన్ను వాళ్లింటికి భోజనానికి పిలిచేరు . ఆయనకు నన్ను చూస్తే మద్రాసులో తన స్టూడెంట్ లైఫ్ , గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి , బోలెడన్ని కబుర్లు చెప్పేరు . మధ్యాహ్నం భోజనాల తర్వాత ఊరు చూద్దాం రమ్మని జగదాంబ సెంటర్ , పూర్ణా మార్కెట్ వైపు తీసుకు వెళ్లేరు .వాళ్ల పని మీద బంగారం షాపులో కెళ్లేం. వైజాగ్ వచ్చిన గుర్తుగా ఏదో ఒకటి కొనాలన్పించింది . నా దగ్గరున్న డబ్బుల్తో ముక్కు పుడక ఒక్కటే కొనగలను . అరవై రూపాయలకి తెల్ల ఒంటి రాయి క్లిప్పు ముక్కు పుడక కొన్నాను . నా ముక్కుకి కుట్టు లేదు కాబట్టి క్లిప్ మోడలన్నమాట ! వచ్చేటప్పుడు వాళ్ల చుట్టాలింటికి తీసుకెళ్లేరు . అది పెద్ద భవంతి కాదు గాని ఇంటి వాళ్లు ఇల్లు సర్దుకున్న తీరు ఎంతో బావుంది . ముఖ్యంగా ఒక గదిలో బీరువా నిండా పుస్తకాలు , గోడకి చేర బెట్టిన సితార్ ఉన్నాయి . నేను బీరువాలోని పుస్తకాల్ని పరిశీలిస్తూండగా ఇంటి వాళ్లబ్బాయి వచ్చేడు . ఒత్తుగా ఉంగరాల జుత్తుతో హేండ్సమ్ గా ఉన్నాడు . యూనివర్సిటీలో చదువుతున్నాడట . చక్కగా పలకరించేడు . సితార్ తీసుకుని చిన్న మ్యూజికల్ బిట్ ఒకటి వాయించి చూపించేడు . నా గురించి అడిగితే కొద్దిగా వీణ పరిజ్ఞానం ఉందని చెప్పేను . ఆ తర్వాత వాళ్లమ్మ గారి దగ్గరకెళ్లి కూర్చుని ఏం చెప్పేడో కాని ఆవిడ నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మా అమ్మ , నాన్న ,ఇంటి పేరు , గోత్రం వగైరాలు అడగడం మొదలు పెట్టేరు . కాస్సేపటికి నాకే స్ఫురించి ‘ నాకు పెళ్ళైపోయిందండీ “ అన్నాను .

“అవునా ?” అని తెల్లబోయారావిడ . “ముగ్గురు పిల్లలు కూడా “ అన్నాను . అందరం కలిసి హేపీగా నవ్వేసుకున్నాం .
స్లిమ్ గా ఉండడం , బారు జడ ఉండడంతో బహుశా పెళ్లి కాని అమ్మాయిలా కన్పించి ఉంటాను .
ఊళ్ళో కూడా నా అందాన్ని ప్రశంసిస్తూ ఎవరెవరో పేరు చెప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు . కొన్ని తీర్చి దిద్దిన అక్షరాలు . కొన్ని కొక్కిరి బిక్కిరి అక్షరాలూ . ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షంలా కన్పిస్తుందంటారు కదా ! నేను మాత్రం మోహన్ భయంతో వచ్చిన ఉత్తరాల్ని వెంటనే చింపి పడేసేదాన్ని . మా ఊరి పోస్ట్ మేన్ ముసలాయన ఏమనుకున్నాడో తెలీదు నా స్కూల్ ఎడ్రస్ కి వచ్చిన ఉత్తరాల్ని హైస్కూల్లో మోహన్ కి ఇవ్వడం మొదలు పెట్టేడు . అంతే , వాళ్లెవరో చెప్పమనీ , నేను రాయడం వల్లే వాళ్లలా రాస్తున్నారనీ సాధిస్తూండేవాడు .

ఒక ఆదివారం నాడు మోహన్ తోడు రాగా గౌతమి గ్రంధాలయానికి వెళ్లేను . గేటు దగ్గరొకటి , కాంపౌండు లోపల మరో రెండు పొగడ పూల చెట్లు విరగబూసి ఉన్నాయి . పూల పరిమళంతో పరిసరాలన్నీ గుబాళిస్తూండగా కొన్ని పూలు ఏరి పర్స్ లో వేసుకున్నాను . గ్రంధాలయంలో సన్నిధానం శర్మ గారు ఆప్యాయంగా పలకరించి నాక్కావాల్సిన పుస్తకాల్ని స్వయంగా తీసి ఇచ్చేరు . పుస్తకాల్ని ఒక్కటొక్కటిగా

ఇంటికి పట్టుకెళ్లి తెచ్చి ఇవ్వడానికి వీలుగా డిపోజిట్టు కట్టి మెంబర్ గా జాయినయ్యాను . నేను వాళ్ల చెల్లెలిలాగ ఉన్నానంటూ శర్మగారూ ఆరోజే నన్ను సోదరిని చేసేసుకున్నారు . ఆయనకీ ఎవరైనా ఇచ్చిన పుస్తకాల్ని నాకిచ్చేస్తూ ఉండే వారు . ఆ గ్రంధాలయంలోకి అడుగు పెట్టడమే గొప్ప సాహితీ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టైంది . రాజమండ్రిని మరో కోణంలో చూసినట్టైంది . అప్పటి వరకూ ఒక్క రచయితను కూడా చూసి ఉండని నేను ఎందరెందరో గొప్ప రచయితల్ని , కవుల్ని చూసి పులకించిపోయేదాన్ని అలా మొదటి రోజుల్లో చూసి , వారి చేతుల మీదుగా వారి రచనల్ని అందుకున్నాను . వారు కాళీ పట్నం , స్మైల్ , ఆవంత్స సోమ సుందర్ మొదలైన వారు .

M.A పరీక్షలకి ఆర్ట్స్ కాలేజ్ సెంటరు . అప్పుడెందుకో బస్సుల స్ట్రైక్ జరుగుతోంది . మోహన్ ఫ్రెండ్ లాయర్ రమణ మూర్తి గారు పోస్టాఫీసుకి ఫోన్ చేసి గాంధీపురంలో ఉన్న వాళ్లింటికి కాలేజ్ దగ్గర కాబట్టి వాళ్లింట్లో ఉంది పరీక్షలు రాయమన్నారు . స్కూలు వల్ల నాకు వీలు పడదని చెప్పేను . పోనీ , ఉదయాన్నే ఎలాగోలా వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకి పరీక్షకి హాజరై సాయంకాలం వెళ్తూండమన్నారు .సరే అని మొదటి రోజు వెళ్లేను . అప్పటికి వాళ్ల అక్కయ్యకి కూడా పెళ్లి కాలేదు . అప్పుడెప్పుడో వాళ్ల పెరట్లోని సంపెంగలు కోయించి ఇచ్చిన ఆవిడే ఇప్పుడు వాళ్ల వంటింటి మురిక్కాలవ పక్కన బైట వరండాలో నేల మీద ఆకువేసి ఎత్తెత్తి వడ్డించింది . నాకు ముద్ద గొంతు దిగలేదు . కళ్లల్లో నీళ్ళోచ్చేయి . సరే, వాళ్లు బ్రాహ్మలు కదా అని సరిపుచ్చుకున్నాను . మిగతా పరీక్షలకి టిఫిన్ బాక్స్ తెచ్చుకుని తిన్నగా కాలేజ్ కె వెళ్లేదాన్ని . ఈ ప్రయాణాలన్నిటికీ మోహన్ నా వెంటనే ఉండేవాడు . ఒకోసారి బస్సు దిగేక నేను గోల పెడుతున్నా వినకుండా సినిమా హాలుకి దారి తీసేవాడు . మోర్నింగ్ షో సినిమా చూసి పరీక్షకెళ్ళడం .

అప్పటికి నేను నడుపుతున్న రవీంద్ర కాన్వెంట్ ఒక్కటే ప్రైవేటు స్కూలు ఊళ్లో . మంచి పేరు రావడం వల్ల ఉద్యోగస్తులందరూ పిల్లల్ని మా స్కూలుకే పంపేవారు . వాళ్లల్లో కొందరికి మోహన్ తెలియక ఎక్కడైనా ఎదురుపడితే నన్ను మాత్రమే పలకరించి నమస్కారం చెప్పేవారు . చివరికి సినిమా హాల్స్ లో కూడా దగ్గరకొచ్చి మరీ పలకరించే వాళ్లు . అది కూడా మోహన్ కి నచ్చేది కాదు . బాగా ఉడుక్కునే వాడు . కాని . టీచర్ గా మోహన్ కి చాలా మంచి పేరుండేది .ఇంగ్లీష్ , మేథ్స్ , సైన్స్ అతనిలాగా ఎవరూ తీచ్ చెయ్యలేరు అని చెప్పుకొనే వారు . పరీక్షల్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు . పిల్లల దగ్గర ఒక్క స్లిప్పు దొరికినా కొట్టడమో , బైటకి పంపెయ్యడమో చేసే వాడట . ఒకసారి అలా చేసినందుకు చిట్టబ్బాయి రెడ్డి గారి పెద్ద కొడుకు , రామబ్బాయిరెడ్డి గారి కొడుకులిద్దరూ కలిసి వీధి దీపాలు లేని చీకటి వీధిలో మోహన్ ని బాగా కొట్టేసేరు . సైకిలు విరి చేసి , చొక్కా చింపేసి , రక్తం చిమ్మేలా కొట్టేరు . మోహన్ పోలీసు కంప్లైంటు ఇచ్చేడు . పెద్దకేసయ్యేదే , వాళ్ల తండ్రులొచ్చి బతిమలాడి కేసు వెనక్కి తీసుకునేలా చేసేరు .

ఒకసారి మోహన్ కోరుకొండ నుంచి జగ్గంపేటకి రిక్వెస్ట్ బదిలీ పెట్టుకున్నాడు . అది వెంటనే అయ్యిందట . కోరుకొండలో స్టాఫ్ ఒక చిన్న ఆత్మీయ సభ పెడుతున్నారు అని నన్నూ మా చిన్న పాపనీ తీసుకెళ్లేడు. అందరికీ పరిచయం చేసేడు . సభలో టీచరొకాయన మాట్లాడుతూ “ఈయనకింత తొందరగా బదిలీ ఎలా దొరికిందో నాకు ఈవిణ్ణి చూస్తే అర్ధమైంది “అన్నాడు .నాకు అప్పటి వరకూ టీచర్స్ అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉండేది .కానీ ఆ సంఘటన చూసేక అది కాస్తా ఎగిరిపోయింది . గొప్ప అవమానంతో కృంగి పోయేను . మోహన్ కి కోపం వచ్చి వాడి చెంపపగల గొడాతాడేమో అనుకున్నాను . అసలు పట్టించుకొనే లేదు .అంతే ఇంకెప్పుడూ మోహన్ పని చేసే ఏ చోటికి పిలిచినా వెళ్లలేదు ———————–

గత సంచికల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయగలరు

నా జ్ఞాపకాలు 

– కె .వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)