కరీంనగర్ జిల్లా జానపదుల మనసత్త్వ చిత్రణ – గ్రామ వాతావరణం టి.భోజన్న

ISSN 2278-478

నా ఈ క్షేత్ర పర్యటనలో నన్ను ఎక్కువగా ఆకర్షించింది జానపదుల మనస్తత్వమే అని చెప్పవచ్చు. మారుతున్న సమాజంతో వారు అడుగులు వేస్తున్నా ఇంకా వారిలో కొంత మానవత్వపుఛ్చాయాలు కనిపిస్తాయి. రోజువారి పనులలో తీరిక లేకున్నా అతిథి మర్యాదలు మాత్రం నేటికి పాటిస్తారు. వేరే ప్రాంతం వారు వారి గ్రామానికి వచ్చారంటే వారి కోసం వారి పనులను సైత వదిలివేసి వారితోనే గడిపేవారు కనిపిస్తారు.

ఇక్కడి ప్రజలు అన్ని విషయాల్లో చక్కని సమయస్పూర్తి కల్గి ఉంటారు. వీరికి నచ్చిన వారికి ప్రాణమైన ఇస్తారు. నచ్చని వారికి దూరంగా జీవిస్తారు. అతి సున్నిత మనస్తత్వం వీరి స్వంతం.

1. జానపద కథలలో కథకుల ఔచిత్య చిత్రణ:
నా యొక్క పరిశోధనలో భాగంగా కరీంనగర్ జిల్లాను క్షేత్ర పర్యటనకు ఎన్నుకుని కథల సేకరణ చేసినప్పుడు ఆయా కథలలో కథకుల ఔచిత్యం, ఎక్కువగా కనిపించేది. జానపద కథలు గ్రామ గ్రామానికి, ఇల్లు ఇల్లుకి మారుతుంటాయి. కథకులు చెప్పిన కథలలో నాకు వారి యొక్క కుటుంబ జీవన చిత్రణ కనిపించేది. వారి యొక్క జీవిత సారాన్ని రంగరించి కథలు చెప్పినట్లు అనిపించేది.

కథను ఏ కథకుడు చెబుతున్నాడో వారి యొక్క వ్యక్తిగతాంశాలు కథలలో కనిపించేవి. వారి యొక్క వ్యక్తిత్వానికి తగిన కథలనే చెప్పేవారు. వారు చెప్పిన కథలను బట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతవరకు అంచనా వేయవచ్చు. క్రూర స్వభావం కల్గినవారు చెప్పిన కథలలో పాత్రలు క్రూర స్వభావాన్నే కల్గి ఉండేవి అలాంటి కథలను చెపుతూ వారు ఆనందాన్ని పొందేవారు. పిల్లలు వదిలివేసిన తల్లిదండ్రులు చెప్పే కథలు దాదాపు కొడుకు బాధ్యతలను, మరియు కోడలు స్వాభావాన్ని తెలిపేవిగా ఉండేవి. అంతేకాకుండా వారి స్థితి ఎలా వుందో కథలలో ఒక పాత్ర ద్వారా వ్యక్త పరచడం కనిపిస్తుంది.

2. పిల్లల వలన పొందిన ఉత్సాహం:
నా పరిశోధనలో చిన్న పిల్లల ద్వారా కుడా ఉత్సాహం పొందాను వారి ఇండ్లలోని ముసలివారి నుండి అనేక కథలను నేర్చుకొని నాకు చెప్పేవారు. వారు చెప్పేతీరు అనుభావాలు నన్ను ముగ్డున్ని చేసేవి వారిని గమనించిన తరువాత జానపద కథకు చావే లేదనిపించేది. నాకు కథలు చెప్పిన వారిలో 8, 10, 12, 14, సంవత్సరాలు పిల్లలు ఎక్కువగా ఉన్నారు.

3. పరిసరాల వలన పొందిన ఉత్సాహం :
నేను పరిశోధన జరిపే ప్రాంతం నా జిల్లా కావడం, ఈ జిల్లాకు సంబందించిన అనేక అంశాలను సేకరించాలనే కోరిక ఉండడం వలన నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో పరిసరాలను గమనించేవాడిని, అవి నాకు చాలా ఆనందాన్నిచ్చేవి. గ్రామ చుట్టుపక్కల గుట్టలు, నదులు, వాగులు, గుళ్ళు ప్రతిది ఒక చరిత్ర కల్గి ఉండేవి. అవి గ్రామస్తుల నుండి సేకరించడం చాలా ఉత్సాహంగా ఉండేది.

4. క్షేత్ర పర్యటనలో కల్గిన అవరోధాలు:
పరిశోధన రంగంలో క్షేత్ర పర్యటన అనగానే అవరోధాల కలయిక అని చెప్పవచ్చు. గ్రంథాలయంలో కూర్చొని విషయ సేకరణ చేయడం వేరు, గ్రామాల్లోకి వెళ్లి విషయ సేకరణ చేయడం వేరు. గ్రామాల్లో పరిశోధనకై సందర్శించిన సమయంలో అనేక ఇబ్బందులు కలిగినవి. కొన్ని గ్రామాలకు వాహన సదుపాయం ఉండేదికాదు ఆయా గ్రామాలకు చేరాలంటే ప్రైవేటు వాహనాలను సంప్రదించవలిసిందే రామగుండం మండల సందర్శనలో భాగంగా మొదటగా ఆటో తదనంతరం మోటార్ సైకిల్ తరువాత జీపు అటు పిమ్మట కాలినడకన కొంతదూరం వెళ్ళినాను, సిరిసిల్లకు మోటర్ సైకిల్ పై వెళ్ళడం జరిగింది. గ్రామం చేరిన తరువాత నేను అక్కడ కొత్త వాడిని కావడం, నాకు తెలిసిన వారిది ఒకే ఇల్లు ఉండడం ఎవరితో ఏం మాట్లాడి వారితో కలిసిపోవాలో తెలిసేదే కాదు. నాకు కావాల్సిన విషయసేకరణ పొందాలంటే ఒక్కో మండలంలో మొదటివారం గడిచిపోయేది తదనంతరం కథల సేకరణలో వేగం పెరిగేది.

5. వినోద సాధనాల వలన అవరోధాల:
మానవులు వినోద సాధనాలుగా వాడబడే టెలివిజన్ వలన చాలా ఇబ్బంది కలిగేది. ఉదయం వేళ్ళల్లో జానపదులను కలువాలనుకుంటే ఉదయమే వారు పొలం పనులకు, గోర్రేలుమేపడానికి మొదలైన వారివారి కులవృత్తులకు వెళ్ళేవారు. సాయంత్రం వారిని కలువడానికి వెళ్ళడమూ సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే ఎవరి ఇండ్లలో ప్రవేశించిన వెంటనే టెలివిజన్ సిరియేల్స్ మాత్రమే దర్శనమిచ్చేవి.

నేను వచ్చాననే స్పృహ కూడా వారిలో లేకుండా సిరియేల్స్ చూసేవారు. వృద్ధులు, ఆడ, మగ, పిల్లలు అనే తేడాలేకుండా అందరూ సిరియేల్స్ చూస్తూ ఆనందపడేవారు. నేను వారు ఎప్పుడు నన్ను కరునిస్తారా? అని చూసేవాడిని వారికి ఇష్టమైన సిరియేల్స్ పూర్తి అయిన తరువాత నాతో కాసేపు మాట్లాడి నిద్రకు ఉపక్రమించేవారు. ఇది రోజు ఉండే సంఘటనల సమాహారమే అని చెప్పవచ్చు. జానపదులు రోజు త్వరగా నిద్ర లేవడం, త్వరగా పడుకోవడం గమనించాను.

6. వ్యక్తి గత సమస్యలు చెప్పడం:
జానపదులను కలిసిన వెంటనే ఏది చెప్పేవారు కాదు. వారితో చనువు పెరిగే కొద్ది ముందుగా వారి కుటుంబ మరియు వ్యక్తి గత సమస్యలను గంటల తరబడి చెప్పేవారు. వారు చెప్పేది ఖండించడానికి అవకాశం ఉండేది కాదు. వారు చెప్పేది మొత్తం పూర్తి అయిన తరువాత జానపద అంశాలవైపు వెళ్ళేవారు. ముందుగా నాకు తెలిసిన జానపద గేయాలు, పొడుపు కథలు, జానపద కథలు కొన్ని చెప్పిన తరువాత వారు మెల్లగా మొదలు పెట్టేవారు.

7. జానపదుల వ్యక్తిత్వమే అవరోధంగా మారడం :
జానపదులందరూ సమ వ్యక్తిత్వం కలిగి ఉంటారని చెప్పడానికి అవకాశం లేదు. జానపదులు తమకు తెలిసిన విషయాలను చెప్పేవారు కొందరైతే వారికి తెలిసినవి వారి వద్దనే పెట్టుకొని నానుండి తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. నేను కొన్ని చెప్పిన తరువాత వారు చెపుతారనే ఆశతో నాకు అవసరమైన అంశాలను మాత్రం చెప్పేవారు కాదు. చివరగా అలిసిపోయి నిరాశగా అక్కడి నుండి ఇల్లు చేరేవాడిని. మరునాడు అటువైపు వెళ్ళేవాడిని కాదు. మరికొందరు రకరకాల ప్రశ్నలు వేస్తూ వేధించేవారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టంగా మారేది, చిరాకు కలిగేది కానీ నేను నా చిరాకును వ్యక్తం చేయకుండా నవ్వుతూనే సమాధానం చెప్పేవాడిని, వారితో నాకు ప్రమాదం అనుకున్నప్పుడు అక్కడినుండి వెళ్ళిపోయేవాడిని.

8. గ్రామ వాతావరణం :
గ్రామం అనగానే ఆహ్లాదకర వాతావరణం గుర్తుకువస్తుంది చక్కని మానవ సంబందాలు, పశుపక్ష్యాదులు పాడి పంటలు, పిల్లకాలువలు, నదులు, వాగులువంకలు, చెరువులు అనుబంధాల ఆప్యాయతలు, ప్రేమలు, పండగలు, జాతరలు, నాటకాలు మొదలైనవి అన్ని ఇక్క కనిపిస్తాయి. ప్రస్తుతం గ్రామం నుండి పట్టణాలకు వలసలు ఎక్కువగా వెళ్ళడం కనిపిస్తుంది. గ్రామంలో వృద్ధులు మాత్రమే జీవించడం వారి ముందు తరాలు పట్టణాలకు వలస పోతున్నారు. గ్రామాల్లోని తల్లిదండ్రులను అప్పుడప్పుడు చూసిపోవడం పరిపాటిగా మారింది.

నా క్షేత్ర పర్యటనలో వెళ్ళిన గ్రామాల్లో అనేక విషయాలు గమనించడం జరిగింది. పూర్వపు గ్రామానికి ప్రస్తుత గ్రామానికి చాలా తేడాలు కనిపిస్తాయి. ప్రపంచీకరణ వలన పల్లెలు పట్టణాల పోకడలను అలవరుచుకుని గ్రామ వాతావరణాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇక్కడి ప్రజల వేష భాషల్లో అనేక మార్పులు వచ్చాయి. గృహ నిర్మాణం, రహదారులు, పడుగలు, జాతరులు మొదలైనవి కుడా అనేక మార్పులకు లోనైనాయి. ప్రస్తుతం గ్రామంలో పశువుల లేవు. పక్షులు లేవు. ప్యాకెట్ పాలు, పెరుగు, బొమ్మ పక్షులు దర్శనమిస్తున్నాయి.

ముగింపు :
నా పరిశోధనకి ఆధారం జానపద కథల వలన కలుగు లభాపేక్షే అని చెప్పాలి. నాకు కలిగిన లాభమే మరికొందరూ అనుభావించాలనే కోరికే నన్ను ఈ జానపద కథల వైపు నడిపించాయి. నా పరిశోధనలో అనేక సత్యాలను నేర్చుకున్నాను. పిల్లలకు చెప్పాల్సిన నీతి కథలని ఈనాడు పెద్దమనుషులకి చెప్పాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. పాత తరానికి నేటి తరానికి మధ్య తారతమ్యాన్ని గమనిస్తే నేటి తరం పూర్తిగా జానపదాన్ని మరిచి పోతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని పల్లెలో తాత అమ్మలా సాన్నిహిత్యంలో పెరిగిన వారు తప్పా మిగతావారు పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిపోతున్నారు.

టి.భోజన్న.
పరిశోధక విద్యార్థి,
శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
హైదరాబాద్ .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.