చామంతి (కథ)-భండారు విజయ

ఆకాశం ఉరిమినా,భూమి కంపించినా భయంతో అక్కను హత్తుకొనే నిరూప్ కు పాతికేళ్ళ తర్వాత అక్క చామంతిని వదిలి అమెరికా వెళ్ళాలంటే దుఃఖం తన్నుక వస్తోంది. ఇంకా ఫ్లైట్ లాండ్ కావటానికి అరగంట ఉందనగా చామంతి చేయిని తన చేతిలోకి తీసుకుంటూ అక్కా.. నిన్ను వదిలి వెళ్ళటం నా వల్ల కావటం లేదు. ప్లీజ్ మరోసారి ఆలోచించవా… నేను ఈ ప్రయాణాన్నిమానేస్తాను కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అన్నాడు నిరూప్.

చామంతికి ఆక్షణంలో తమ్ముడు తనని వదిలి వుండటం మొదటిసారే నన్న

సంగతి గుర్తువచ్చి దుఃఖం తన్నుకువస్తున్నా, లేని అసహనాన్ని తెచ్చుకొని కోపంగా అతని చేయిని తన చేతి మీదనుంచి సుతిమెత్తగా తొలగించింది.

వీసా వచ్చినప్పటి నుండి ప్రతిరోజూ నిరూప్ ది ఇదే ధోరణి. ఒకవైపు ప్రోఫెషనులో వచ్చిన మంచి అవకాశం వదులుకోవద్దని అందరూ ఎంతగా చెబుతున్నా వినకుండా చామంతిని వదిలి వెళ్ళనూ అంటూ..చిన్నపిల్లాడిలా మారాం చేస్తూనే వున్నాడు.. నిజంగానే వాళ్లిద్దరూ చిన్నప్పటినుండి ఒకరిన వదిలి ఒకరు ఉండక పోవటంతో ఒకే విధంగా దుఖాన్ని మోస్తున్నారు..

తనకు మాత్రం దుఃఖంగా లేదూ? తమ్ముడిని వదిలి ఉండగలదా?అయినా తప్పదు. మనసు గట్టి చేసుకొని నిరూప్ వెంట్రుకలు సరి చేస్తూ..ఇన్నేళ్ళు వచ్చినా నువ్వు నన్ను వదిలి వెళ్ళలేకపోతే అందరూ నన్నేమనుకుంటారో తెలుసా? అంది నవ్వుతూ..

తమ్ముడు ఏమీ మాట్లాడకపోవటం గమనించి చామంతే నిరూప్ చేతిని తనచేతిలోకి తీసుకుంటూ…నువ్వేం నన్ను శాశ్వితంగా వదిలి వెళ్ళుతున్నావా? కొన్నిరోజులు వుండి రానే వస్తావుగా అంది.

అయినా నిన్ను అమితంగా ప్రేమించే నీ భార్య సంయుక్త ఇప్పుడు నీకు అండగా వుంది. నీ ఆలనా పాలనా నాకన్నా తను ఎక్కువ చూసుకో గల్గుతుంది. నీ మనసును పూర్తిగా చదివిన అమ్మాయి. తనే అమ్మా,చెల్లి,అక్కా అన్నీ.. అంతేకాదు అన్నింటిని మించిన మంచి స్నేహితురాలు, నీ జీవిత సహచరి ఆమె ఇప్పుడు . కాబట్టి నువ్వు ఇప్పుడిలా బాధపడటం ఏమీ బాగాలేదు.

చూడు..సంయుక్త వాళ్ళ అమ్మా,నాన్నలు మనల్నే చూస్తున్నారు. కళ్ళు తుడుచుకో..ముందు అంటూ గద్దించింది చామంతి.

నిరూప్ ఫ్లైట్ లాండ్ అవుతోంది. పదా పోదాం ఇప్పటికే లేట్ అయింది…వదినా మీరు మీ తమ్ముడ్ని మరీ గారాభంగా ప్రేమిస్తూ పెంచారు. మీరు లేకుండా అక్కడ ఉండలేనని తిరుగు ఫ్లైట్ ఎక్కేస్తాడేమో..అంది నవ్వుతూ సంయుక్త.

సంయుక్త మాటలకు నిరూప్ జేబులో ఖర్చీఫ్ తీసుకొని మొఖం తుడుచుకుంటూ చిరునవ్వుతో నీకు తెలియదు సంయూ..మా అక్క లేకపోతే నేననే..వాడినే లేను. ఎక్కడో అనాథగా అడుక్కుంటూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఈ సమాజంలో సంఘ విద్రోహిగా ఉండిపోయే వాడిని..అలాంటి నన్ను ఆదరించి తనపక్కన నిలబెట్టుకొని కొండంత ఆదరణను ఇచ్చిన దేవత తను. చుక్కాని లేని నావ కదలలేదనట్లుగా నా జీవితమూ అంతే..!అన్నాడు నిరూప్ నిర్వేదంగా.

నిరూప్ మాటలకు సంయుక్త నోచ్చుకున్నట్లుగా… అలా కాదని నేను అన్నానా నిరూప్….ఇప్పుడు నువ్వొక ఇంటివాడివి అయ్యావు…నీ జివితంలోకి నేను ప్రవేశించాను. నీతో ముడిబడిన నాఈ జీవితం కూడా మీఅక్కతో కలబోసుకొనే వుంటుంది…అయినా నువ్వు అన్నీ మరిచిపోతావు. మన ఈ ప్రయాణం ఇద్దరం కలిసి వదినతో చర్చించాకేగా నిర్ణయించుకుంది.

అమ్మలాంటి అక్క నీకుండటం నిజంగా నీ అదృష్టమే..కాదనను. నిన్ను ఎలా ప్రేమిస్తుందో నాకు తెలియకపోతే కదా?..నువ్వు ఎక్కడున్నా, మీ అక్క మనసంతా నీదగ్గరేగా వుంటుంది.

అయినా వదిన ఇప్పుడు ఒంటరిది కాదు…తనకు తోడుగా మీ బావగారూ వున్నారు. ఆమెకు ప్రైవసీ ఇవ్వాలనే కదా మనం ఈ నిర్ణయం తీసుకుంది నిరూప్ కు దగ్గరగా వచ్చి కేవలం అతనికి వినబడేటట్లుగా మెల్లగా అంది సంయుక్త.

చామంతికి దగ్గరగా వచ్చి ఆమె చేయిని తీసుకొని మృదువుగా నొక్కుతూ మీరేం కంగారు పడకండి వదినా…మీతో రోజూ మాట్లాడుతూనే ఉంటాoగా అంటూ..వంగి చామంతి కాళ్ళకు దండం పెట్టింది ఆశీర్వదించమంటూ సంయుక్త. నిరూప్ మరోసారి చామంతిని కౌగిలించుకొని సుతారంగా అక్కపాదాలు తాకి అక్కడినుండి ఇద్దరూ కదిలిపోయారు. వెనుకనుండి వారిని చూస్తూ కాసేపు మౌనంగా ఆలాగే నిలబడిపోయింది చామంతి.

*****

కళ్ళు తుడుచుకుంటూ ఎయిర్ పోర్టునుండి బయటకు వస్తున్న చామంతిని గమనించిన శశిధర్ భార్యకు దగ్గరగా వచ్చి ఆమెను పొదవి పట్టుకున్నాడు. మరీ ఇంత బేలగా వుంటే ఎలా చామూ…తమ్ముడు నీ కొక్కడే వున్నాడా ఏంటి? అన్నాడు నవ్విచ్చే ధోరణిలో.

చామంతికి దుఖం ఎంత ఆపుకుందామన్నా ఆగట్లేదు. ఒక్కసారిగా కట్టలు తెంచుకొని శశిధర్ భుజాలపై వాలిపోయి బావురుమంది. చిన్నపిల్లలా తనను అతుక్కున్న భార్య తల నిమురుతూ మెల్లగా చామంతిని కారుకు దగ్గరగా తీసుకొని వెళ్లి కూర్చోబెట్టి కారును కదిలించాడు శశిధర్.

*****

ఇద్దరిమధ్య నిశబ్దం గాఢతను పరచుకుంది. చామంతి ముందరి సీట్లో జారిగిలబడి కళ్ళు మూసుకుంది. అంతకన్నాదట్టంగా పరచుకున్న మౌనం ఆమెను ఆసాంతం లోబర్చుకుంది. అప్పటివరకు ఆకాశాన్ని ముసురుకున్న కారుమబ్బులు పలుచబడి పొరలు పొరలుగా విడిపోతూ కదిలి

పోతున్నాయి. అచ్చం ప్రశాంతతకు సిద్ధమౌతున్న చామంతి మనసులా…

చామంతి కళ్ళముందు ఇరవై ఏళ్ళనాటి దృశ్యం మసకమసకగా ఒక్కొక్కటి స్మరణలోకి వస్తున్నాయి … ఆ రోజు ఎప్పటిలాగే తనను, తండ్రి చెయ్యి పట్టుకొని స్కూలు అయిపోయినాక బయటకు తీసుకొని వస్తున్నాడు.

పిల్లలందరూ స్కూలు బయట గుంపులు గుంపులుగా నిలబడి వున్నారు. వాళ్ళ మధ్యలో బక్కచిక్కిన చిన్నపిల్లాడు చినిగిన బట్టలు వేసుకొని చేతిలో తెల్లని పళ్ళెం పట్టుకొని అన్నా..అక్కా అంటూ చిల్లర డబ్బులు అడుక్కుంటున్నాడు. ఆ పిల్లాడి ఒంటి రంగు తెలుపులో ఉన్నప్పటికీ, చాలా

రోజులుగా స్నానం చేయనట్లుగా మొఖం, కాళ్ళు, చేతులు, శరీరమంతా మట్టితో నల్లని చారికలు కట్టుకొని ఉంది. ఆ పిల్లాడి కళ్ళు మాత్రం తెల్లని గాజు గోళీల్లా మెరుస్తున్నాయి.

తండ్రిని అనుసరిస్తున్న చామంతి కళ్ళు ఆ అబ్బాయి మీదనే గురిపెట్టి వున్నాయి. తండ్రి అవేమి పట్టనట్లుగా తనను గబగబా లాక్కొని పోతున్నాడు. తనకెందుకో ..ఆ అబ్బాయిని తనతో తీసుకొని వెళ్లాలన్న కోరిక ఆక్షణంలో కల్గింది…ఒక్క ఉదుటున తండ్రి చేతులను విడిపించుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి పిల్లల మధ్యలో వున్న ఆ పిల్లాడి చేతిని గట్టిగా పట్టుకుంది సంబరంగా.

దూరం నుంచి తన తండ్రి కంగారుపడుతూ రావటం చూసింది. తన చేతిలో ఉన్న ఆ పిల్లాడు వాడి చేయిని గుంజుకుంటూ ఏడుస్తున్నాడు. వాడిని ఎలా ఓదార్చాలో కూడా తెలియని తాను వాడి చేయిని మరింత గట్టిగా బిగించి మా ఇంటికి వస్తావా?..మనమిద్దరం ఎంచక్కా మంచిగా ఆడుకోవచ్చు, ఇదే స్కూలుకు వచ్చి చదువుకోవచ్చు వస్తావా అని ఆత్రంగా అడిగింది.

పిల్లాడు బిత్తరపోయి ఏడుపు మొఖంతో తననే చూస్తున్నాడు… మా ఇంటికి రావా ప్లీజ్ అంటూ మరోసారి వాడి గరుకు బుగ్గలు పట్టుకుoది . ఆ పిల్లాడు భయంతో అక్కడినుంచి తప్పించుకొని పారిపోవాలని, తన చేయిని వదిలించు

కోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఏడుస్తూ గింజుకుంటున్నాడు.

అంతలో అక్కడి వచ్చిన తన తండ్రి తన చేతిలో వున్న ఆపిల్లడి చేతిని విడిపించి తన చెంప మీద కోపంతో గట్టిగా కొట్టడంతో భయంవేసి ఆ పిల్లాడి చేయి వదిలేసింది.. తనకప్పుడు ఎనిమిదేళ్ళు ఉంటాయేమో..నాకీ తమ్ముడు కావాలీ అంటూ తనూ ఏడుస్తోంది.తండ్రిని బతిమిలాడుతూ..వాడిని మన ఇంటికి తీసుకొని వెళ్దామని మారాం చేసింది.

అక్కడ గుమికూడిన పిల్లల్ని చూసి అదే దారిన వెళ్ళుతున్న పోలీసులు..గుమికూడిన పిల్లల దగ్గరికి వచ్చి వారిని చెదరగొట్టారు. పోలీసుల్లో ఒకతను తన తండ్రిని ఏమో అడగటం, తండ్రి వారికేదో సమాధానం చెప్పటం..అప్పట్లో తన బుర్రకు అర్ధం కాలేదు కానీ కాసేపట్లో అక్కడ ఏమీ జరగనట్లే వాతావరణం సద్దుమనిగింది.

ఆ పిల్లాడు అక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకొని పారిపోయాడో కూడా తను గమనించ లేకపోయింది. ఆ తర్వాత ఆ పిల్లాడు కనబడుతాడేమోనని ఆశగా ప్రతిరోజూ ఆ చుట్టూవెతుకుతున్నా ఎక్కడా

జాడా దొరకనేలేదు. కానీ ఆనాటి సంఘటన తన మనసులో మాత్రం పదిలంగా అలాగే ఉండి పోయింది.

******

దాదాపు నాలుగు నెలల తర్వాత ఒకరోజు తన తండ్రి తనను ఎప్పటిలా స్కూలు నుండి ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. తనూ ఏదో విషయం తండ్రితో మాట్లాడుతూ నడుస్తోంది. చాలాదూరం అలా నడిచి వెళ్ళాక తమ వెనుకగా ఎవరో వస్తున్నట్లుగా అనిపించి వెనక్కు తిరిగి చూసింది.

ఆరోజు స్కూలు ముందు అడుక్కుంటున్న పిల్లాడు తమ వెనకాల నడుస్తూ వస్తున్నాడు. ఆ పిల్లాడ్ని చూసి ఆశ్చర్యపోయింది. తండ్రి చూడకుండా ఏమీ తెలియనట్లుగా దొంగచాటుగా వెనక్కితిరిగి మరోసారి చూసింది. ఆ పిల్లాడే…నవ్వుతూ తనకు చెయ్యి ఊపుతున్నాడు. ఆ క్షణంలో తనకు ఎక్కడలేని ధైర్యం వచ్చినట్లైది. తండ్రి చేయిని విదిలించుకొని ఆ పిల్లాడి దగ్గరగా పరుగెత్తుకుంటూ వెళ్లి వాడి చేయి ఈసారి అపురూపంగా పట్టుకుంది.

తండ్రి తనను మల్లీ వారిస్తాడేమో అన్న భయంతో..రోప్పుకుంటూనే అతనికి ఎదురుగా నిలబడి నీ పేరేంటి అడిగింది.

ఆ పిల్లాడు నవ్వుతూ నిరూప్ అన్నాడు.

ఎంత బాగుందో…నీ పేరు అంది మెచ్చుకోలుగా..

నీ పేరు అడిగాడు పిల్లాడు..

చామంతి అంది తనూ..

నీ పేరూ మంచిగుంది అన్నాడు వాడు.

అప్పుడు గమనించింది తను. వాడి తెల్లని బుగ్గలు ఎర్రగా కందిపోయి వున్నాయి..ఇక్కడ ఏమైంది తమ్ముడు అంటూ వాడి బుగ్గలపై చెయ్యెస్తూ అడిగింది.

అక్కా! వాళ్ళు నిన్న నన్ను బాగా కొట్టారు తెలుసా? అన్నాడు వాళ్ళెవరో తనకు తెలున్నట్లుగా..

ఎవరూ నిన్ను కొట్టింది నిరూప్?

. నన్ను మా ఇంటినుంచి ఎత్తుకొని వచ్చారుగా …ఆ బుచాళ్ళు..ఆరిందలా కండ్లెగురవేస్తూ చేతులతో గాల్లో చూపించాడు నిరూప్.

బూచాల్లా! వాళ్లేవరూ ..అంది తనూ అమాయకంగా….

నీకు ఇదికూడా తెలియదా అన్నట్లు వాడొక నవ్వు నవ్వి..మాది ఈ ఊరు కాదు తెలుసా నీకు?

అంటూ మరో ప్రశ్న వేసాడు

ఏ వూరు మీది అడిగింది తను ?..

ఏమో..నాకేం తెల్సు…నన్ను వాళ్ళు ఈ ఊరు ఎత్తుకొచ్చి చాలా రోజులైందిగా..నాకెట్లా తెలుస్తుంది?.

మరి నీకు అమ్మా,నాన్న ఉన్నారా! ఇప్పుడు ఎక్కడున్నారు ? తన ప్రశ్న ఎందుకో తనకే తప్పనిపించినా తెలివితక్కువగా అడిగేసింది.

. నేను చిన్న పిల్లోడిని. నాకెట్లా తెలుస్తుంది? నాకూ నీలానే అక్క కూడా వుందేమో! సందేహంగా అన్నాడు వాడు.

మీ అమ్మ,నాన్న నిన్ను వెతకలేదా అయితే?..మళ్ళీ తెలివిలేని ప్రశ్నే?

ఎందుకు ఎతకరు..ఎతికే వుంటారు అన్నాడు వాడు బాధగా..మొఖం అదోలాపెట్టి.

పోనీ ..ఇప్పుడు నాతో మా ఇంటికి వస్తావా? మనం కల్సి ఉండొచ్చు ..

ఓ! వస్తాను…కానీ ..అగో ఆ చెట్టు చాటున కుంటోడు వున్నాడు చూసావా ?అంటూ దూరంగా వున్న చెట్టువైపు చెయ్యి చూపించాడు

తనూ వాడు చూపించిన వైపు చూసింది. ఒక కాలుతో నిలబడ్డ కుంటివాడు నిజంగానే కనబడ్డాడు దూరంగా.. తనను కూడా వాడు ఎత్తుకొని పోతాడేమో…నాన్నా…ఎక్కడున్నాడో…అంటూ భయంతో వెనక్కు చూసుకుంది…తండ్రి తమవైపే రావటం గమనించి గుండెనిండా ఊపిరి పీల్చుకొంది. అతను

వస్తున్నాడన్న ధైర్యంతో అగో మానాన్న వస్తున్నాడు చూడు …వాడి సంగతి చెప్పి పోలీసులకు వాడ్ని పట్టిద్దాం అంది తనూ ఆరిందాలా….

అయ్యో! అక్కా ..వాడసలు కుంటాడే కాదు నీకు తెలుసా? అంటూ నవ్వసాగాడు వెక్కిరింపుగా..

మరి నువ్వేగా చెప్పావు అంది ఉక్రోషంగా…

అదికాదక్కా..పాపం వాడిని కూడా ఆ బూచాల్లు వాడు చిన్నగున్నప్పుడే ఎత్తుకొని వచ్చారంట..

కాళ్ళువిరగగొట్టి గుడిదగ్గర కూర్చోబెట్టి అడుక్కునేలా చేద్దామని ఒకరోజు బూచాల్లు అనుకుంటుంటే విని మర్నాడు నిజంగానే తనకు కాళ్ళు విరిగిపోయినట్లుగా నటించి తప్పించుక్కున్నాడంట..ఒకరోజు మా ఇస్మాయిలు గాడికి చేబుతుంటీ నేను ఇన్నా…అన్నాడు.

ఎనిమిదేళ్ళ ఆనాటి తన బుర్ర్రకు ఆ పిల్లగాడు చెప్పే మాటలు భయాన్ని కల్గించాయి. రోజూ ఇంట్లో అమ్మా,నాన్న తనను ఎందుకు ఒంటరిగా బయటకు పంపరో గుర్తుకువచ్చి వణికి పోయింది. అమ్మ ఎప్పుడూ

నాన్నను తనకు తోడు పంపుతుంది. బయటవాళ్ళు ఎవరు ఏమీ పెట్టినా తినవద్దని చెబుతుంది. ఎవ్వరు పిలిచినా వాళ్ళ వెంట వెళ్లోద్దని చెప్పేది ఇందుకన్నమాట. తండ్రి రొజూ తన చేయి పట్టుకొని వచ్చి స్కూలులో దించి, మళ్ళి తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెల్తాడు అందుకే కామోసు అనుకుంది.

పిల్లల్ని ఎత్తుకెళ్ళి కళ్ళు పీకేస్తారట. కాళ్ళు,చేతులు విరిచేసి రోజూ రోడ్డుమీద అడుక్కొని రమ్మని పంపిస్తారట గదా మా అమ్మ చెప్పింది నిజమేనా అయితే..?

అవునక్కా నిజమే అన్నాడు వాడు ఏడుపుముఖంతో.. ఆ కుంటోడు చాలా మంచోడు..నన్ను నీ ఎంట వెళ్ళమని వాడే చెప్పాడు తెలుసా?

అవునా..మరి ఆ బూచాళ్ళు..వాడిని కొట్టరా నిన్ను నాతో పంపించేసాడని తెలిస్తే?

ఎందుకు కొట్టరు…బాగా కొడతారు..చీకటి గదిలో వేసి తలుపేస్తారు…పాపం అన్నం కూడా పెట్టరు తెలుసా? ఒకసారి వాడు ఆ గదిలోనే ఒకటి,రెండు చేసాడు..నాలుగు రోజుల తర్వాత అందరికన్నా పెద్ద దీదీ వచ్చి వాడు చచ్చిపోతాడని విడిపించింది…

అసలు మమ్మల్ని ఎత్తుకొచ్చినోల్లకు ఆమె చానా డబ్బులు ఇస్తుంది..ఆమె అందరి బూచాల్లకు పెద్ద దీదీ..

నీకెలా తెలుసు ?

ఇస్మాయిల్ గాడిని ఇట్లాగే ఒకసారి అక్కడినుంచి కుంటాడు తప్పించాడుగా…అప్పుడు చూసా! అప్పుడు ఒక చిన్న పిల్లని ఒక బూచాడు ఎత్తుకొని వచ్చాడు. ఆపాప బాగా ఏడుస్తున్నది…వాడికి బోలెడన్ని డబ్బులు ఇచ్చి పంపింది…అట్లా రోజూ ఎవరినో ఒకరినయినా కొనుక్కుంటుంది ఆమె.

మీతో అమ్మాయిలూ కూడా ఉంటారా అయితే?

మాదగ్గర వుండరు..వాళ్ళని పెద్ద దీదీ వేరే ఇంట్లో వుంచుతదంట… కుంటాడు చెప్పాడు.

అయ్యో!! పాపం..పోనీ వాడ్నికూడా మా ఇంటికి తీసుకుపోదామా! మా నాన్నతో చెప్పి..

వాడు రాడుగా…జేమ్సు,గంగ, రాము, జహంగీర్, కట్టన్న,ఇంకా చాలా

మంది పిల్లలు వాడికోసం అక్కడ ఎదురుచూస్తూ వుంటారు ..అందుకని రాడు వాడికేవో అక్కడి రహస్యాలు తెల్సినట్లుగా ధీమాగా అన్నాడు నిరూప్.

ఎందుకు?

వాడేగా మాకు బోలెడు కథలు చెబుతాడు…రోజూ అందరం వాడు లాస్టుకు చెప్పే అమ్మానాన్నల కథ కోసం నిద్రపోకుండా ఎదురు చూస్తాం..వాడు భలే చెబుతాడు తెలుసా?

అంతలో తండ్రి అక్కడికి రానే వచ్చాడు.తన చేయిని నిరూప్ చేయి గట్టిగా పట్టుకొని వుండటం చూసిన ఆయనే నిరూప్ ను దగ్గరగా తీసుకొని వస్తావా…మాఇంటికి అనటం…అందుకు వాడు తలను ఊపటం ఒకే క్షణంలో జరిగిపోయాయి. తండ్రి ఏమి ఆలోచించుకున్నాడో ఏమో అక్కడికి దగ్గరలో వున్నా పోలీసు స్టేషనుకు నన్ను, నిరూప్ ను తీసుకొని పోవటం ..అక్కడి డిఎస్ పి తో మాట్లాడి ఏవో సంతకాలు పెట్టి తమ ఇంటికి నిరూప్ ని తీసుకుకొని రావటం జరిగిపోయింది.

ఆతర్వాత తన తండ్రి కొన్ని రోజులపాటు శ్రమించి పోలీసుల సాయంతో పిల్లల ట్రాఫికింగ్ కు సంబంధించిన వివరాలు నిరూప్ నుండి సేకరించటం. ఆక్కడ పిల్లల్ని అక్రమంగా ఎత్తుకొని వచ్చిన వాళ్ళని అరెష్టు చేసి వున్నపిల్లలందరినీ విడిపించటం..

వాళ్ళందరినీ షెల్టర్ హోములకు తరలించటం…జరిగిపోయాయి.

నిరూప్ కోసం నాన్న పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి తనను మా ఇంట్లో ఉంచుకోవటానికి పోలీసుల అనుమతి తీసుకోవటo, ఆతర్వాత అమ్మానాన్న నిరూప్ ని చట్టరిత్యా దత్తత తీసుకోవటంతో నిరూప్ మా చిన్ని కుటుంబంలోకి రాగలిగాడు. మా ముగ్గురికి ప్రాణమైపోయాడు. అంతటితో కథ సుఖాంతమైనందుకు తను ఊపిరి పీల్చుకుంది. తండ్రి బదిలీమీద హైదరాబాదుకు రావటంతో నిరూప్ ను ఎవరీ అబ్బాయి అని ప్రశ్నించే వారే లేకపోవటంతో అమ్మా నాన్నలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటనలు తల్చుకున్నప్పుడల్లా ఇప్పటికి ఆ అనుభవాలు తడి ఆరకుండా పచ్చి జ్ఞాపకాలుగానే మిగిలి వుంటాయి తనకు.

                            &                            &                                  &                                        &

మూడు సంవత్సరాల తర్వాత ఒకరోజు సాయంత్రం స్నేహితుల ఫామిలి వస్తుందని తండ్రి చెప్పటంతో అక్కా తమ్ముళ్ళు వాళ్ళకోసం ఎదురుచూస్తూ ఆరుబయట కూర్చున్నారు. అంతలో ఇంటిముందు పెద్ద కారు ఆగింది. అందులోనుండి ఇద్దరు భార్యాభర్తలు దిగారు. అతనిని నాకన్నా ముందే తమ్ముడు గుర్తుపట్టి నాచేతిని తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు. దూరంగా వాళ్ళనే గమనిస్తున్న మమ్మల్ని నాన్న తమ దగ్గరికి రమ్మని సైగ చేయటంతో ఇద్దరం భయంగానే వాళ్ళకు దాగ్గరగా వెళ్లి నిలబడ్డాo. అమ్మా వాళ్లకు మర్యాదలు చేస్తోంది..నాన్న మాటల మధ్యలో ఇదుగోనండి వీడే మా అబ్బాయి నిరూప్ అని పరిచయం చేసాడు.

ఇద్దరికీ దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. ఏడ్వటం మొదలుపెట్టాం.. మా ఏడుపును చూసిన వాళ్లిద్దరూ ఆశ్చర్యపోయి మీ తమ్ముడిని మేమేమి తీసుకొని పోవటానికి రాలేదులే అని నవ్వారు. అప్పుడుగానీ మాఇద్దరి మనసులు కుదుటపడలేదు..అలా పోలీసు అధికారి వచ్చిపోయిన సంఘటన తర్వాత తను ఎప్పుడూ నిరూప్ గురించి భయపడలేదు. ఎవరివలన కూడా డిస్ట్రబ్

కాలేదు..అలా వచ్చిన నిరూప్ తమలో ఒకడిగా మారి, కుటుంబానికి అండగా,

తనకు తోబుట్టువుగా నిలబడ్డ నిరూప్ అంటే తనకు ప్రాణం. అలాంటి వాడు ఈరోజు అమెరికా వెళ్ళటం వెనుక తన తల్లీ దండ్రులు వాడికిచ్చిన అండదండలు ఒక్కొక్కటి కళ్ళముందు కొచ్చి మాయమౌతుండగా….

చామంతి మన ఇల్లు వచ్చింది…ఇక దిగు అని శశిధర్ అనటంతో ఈలోకంలోకి వచ్చి కారు దిగి ఇంట్లోకి నడిచింది చామంతి.

కారులో నుంచి ఈ రోజు పొద్దున లాబ్ నుండి వచ్చిన రిపోర్టు పేపర్లను

చేతుల్లోకి తీసుకొన్న శశిధర్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.వాటిని అపురూపంగా గుండెకు హత్తుకున్నాడు. రిపోర్టు ఫలితాలు చూసి చామంతి మనసు ఎలా ఉప్పొంగుతుందో…నాలుగు సంవత్సరాలుగా తామిద్దరూ ఎదురు చూస్తున్న శుభవార్తను చెప్పి తనను సప్రైజ్ ఎలా చేయాలా అన్న ఆలోచనతో చామంతి వెళ్లిన గదిలోకే శశిథర్ కూడా వెళ్లిపోవటం..వెనుకగా వస్తున్న చామంతి అమ్మానాన్నలు మురిపెంగా అల్లుడిని చూస్తూ ఉండిపోయారు..

-భండారు విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.