నాడూ…నేడు(కథ )-లక్ష్మి రాఘవ.

ఇంటి ముందు గుర్రపు బండి ఆగగానే ఆసక్తిగా తొంగి చూసింది పార్వతమ్మ. శుభవార్త తెచ్చి నాడేమో తను ఎదురుగుగా రావటం ఎందుకని బోడి తలమీద చీర ఈడ్చుకుంటూ ఎదురుపడకుండా పక్కకు తప్పుకుంది పాపమ్మ.
బండి చూసి స్నేహితులతో ఆడుకుంటున్న పదేళ్ళ మీనాక్షి చెంగు చెంగు న ఇంటికి వచ్చి “వచ్చేసావా నాయనా…” అంది సంతోషంగా.

“ఆడుకుంటూ వున్నావా తల్లీ?” అని మీనాక్షి బుగ్గమీద చిన్నగా కొట్టి ఇంటి ముందు వసారా లో వున్న ఇత్తడి హండా లో నీళ్ళు ఇత్తడి చెంబుతో ముంచుకుని కాళ్ళు కడుక్కుని లోపలకు వచ్చాడు హనుమంతరావు.
రాగి చెంబులో చల్లని మంచి నీళ్ళు వంపి గ్లాసు ను ఆయన చేతికి ఇచ్చింది పార్వతి. అది అందుకుని ఉయ్యాల బల్లమీద కూర్చుంటూ “అంతా శుభమే పార్వతీ, వారికి మన సంబంధం నచ్చింది. అబ్బాయికి పద్దెనిమిదేళ్ళు. బాగున్నాడు. ఒక తమ్ముడు వున్నాడు. ఆడపిల్లలు ముగ్గురు. ఆ ముగ్గురి పెళ్ళిళ్ళు జరిపినా తరగని ఆస్తి పరులు. శ్రావణమాసం లో ముహూర్తాలు చూడమన్నారు…” అంటూ తృప్తిగా పార్వతమ్మ వైపు చూశాడు.

“మంచిది. ఒకసారి అమ్మకు చెప్పండి. పెద్దల ఆశీర్వాదం వుండాలి కదా…”
“అమ్మా అంటూ పాపమ్మ దగ్గరికి వెళ్లి వివరించాడు.

“సంతోషం నాయనా, మీనాక్షి అదృష్టవంతురాలు.”అంది పాపమ్మ.
మీనాక్షికి ఆవిధంగా పెళ్లి నిశ్చయమయింది.

            ****                           ****                             ****                               ****                             ******

“స్కూలుతో చదువు ఆపేద్దాం అని చెబితే వినకుండా అమ్మాయిని చదువుకోనీ అంటూ వున్నారు. ఎక్కువ చదివితే ఇంకా పై చదువులు చదివిన అబ్బాయిని వెదకాలి అని చెబుతానే వున్నాను.” నిష్టూరంగా అంది రుక్మిణమ్మ.

“మనకాలం కాదే ఇది. అమ్మాయి ఏమి చదువుకుంది?అని అడుగుతారు ఇప్పుడు ఏ సంబంధం చూసినా. అమ్మాయి వివరాలు పేరయ్యకు ఇచ్చివచ్చా మనకు తగిన సంబంధం చూడమని. త్వరలో చెబుతానని అన్నాడు. నీవు తాపత్రయ పడకు.” అన్నాడు క్రిష్ణారావు.

తల్లీ,తండ్రీ సంభాషణ విన్న ఇరవై ఏళ్ల సుగుణ తన కలల్లో రాకుమారుడిని మరోమారు ఊహించుకుంది.
పేరయ్య తెచ్చిన సంబంధం నచ్చింది కృష్ణారావు దంపతులకు.

అబ్బాయి M A చదివాడు బాంక్ లో ఉద్యోగం. ఎదగడానికి అవకాశం వుంది. బ్యాంకు అంటే కడుపులో చల్ల కదలకుండా చేసే ఉద్యోగం! పైగా ఒక్కడే అబ్బాయి. ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
వారం లోనే పెళ్లి చూపులు జరిగాయి.

పెల్లిచూపుల్లో సుగుణ ను చూస్తూనే సానుకూలంగా తల్లి వైపు చూశాడు రాజా రావు.
నెమ్మదిగా తల ఎత్తి చూసిన సుగుణ కు వంకుల జుట్టు తో హీరో లాగా కనిపించిన రాజా రావు తెగ నచ్చేశాడు.
సుగుణ కు ఆ సంబంధం కుదిరి శ్రావణ మాసం లో ముహూర్తాలు పెట్టు కున్నారు.

   ****                           ****                             ****                               ****                             ******

“మొన్న నీతో చెప్పిన సంబంధం వాళ్ళు కబురు చేశారు రాశీ. శని, ఆదివారాల్లో అబ్బాయి వస్తాడట. నీకు కూడా శని ఆదివారాలు సెలవులే గదా అని ఓకే అన్నాను. నీవేమంటావు?” కూతురు రాశి తో అన్నాడు నారాయణ రావు.
“శని వారం నాకు కొంచెం వర్క్ వుంది నాన్నా. ఆదివారం అయితేనే బెటరు అనుకుంటా” అంది రాశి.
తను బి,టెక్ చదివి సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తూంది.

“అయితే ఆదివారం రమ్మంటాను. మొదట అబ్బాయి ఒక్కడే వస్తాడట, తనకు నచ్చితే తల్లీ, తండ్రీ వస్తారుట.”

“నాకూ అదే మేలు అనిపిస్తుంది. మేము ఒకరికొకరు నచ్చితేనే గదా. మొదటనే అందరూ వచ్చి చూడటం అనవసరం.” నిర్మొహమాటంగా అంది రాశి బయటకు నడుస్తూ.

కూతురి సమాధానం సవ్యంగానే అనిపించింది నారాయణ రావుకు.
ఇదంతా వింటున్న తల్లి లక్ష్మి “ తండ్రీ, కూతురూ బాగానే సమర్థించుకుంటున్నారు.”అంది నిష్టూరంగా.

“నీకెందుకే కోపం? మన కాలం కాదే ఇది. ఇప్పుడు అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు మాట్లాడు కుని ఒప్పుకోవటం ముఖ్యం.”
ఆదివారం రాహుల్ రాశి వాళ్ళ ఇంటికి వచ్చాడు. కాఫీ, పలహారం అయ్యాక రాశి తో కాస్సేపు మాట్లాడాక

“అంకుల్, నేను రాశిని కాస్సేపు బయటకు తీసుకెళ్లనా? ఒక గంటలో తిరిగి వస్తాము” అని అడిగాడు.
“అలాగే రాహుల్. రాశీ మనకారులోనే వెళ్ళండి” అన్నాడు రాశితో.

“రాశి కారును గరాజ్ నుండీ బయటకు తీసాక రాహుల్ పక్కన కూర్చున్నాడు. ఇద్దరూ టాంక్ బండ్ దాకా వెళ్ళారు.
గంట తరువాత వెనక్కి వచ్చిన రాశి, రాహుల్ పెళ్లి ఇద్దరికీ సమ్మతమని తెలిపారు.
శ్రావణ మాసం లో ముహూర్తాలు పెట్టుకుందాం అన్ననారాయణ రావుతో

”వద్దు అంకుల్, నేనూ రాశి రిజిస్టర్ మారేజ్ చేసుకుంటాం. ఒక చిన్న రిసెప్షన్ ఇస్తే చాలు అన్నాడు రాహుల్.

“అబ్బాయి రాజేష్ ఫోటో మెయిల్ లో వచ్చింది. మంచి పొజిషన్ లో వున్నాడు. ఒక సారి చూడమ్మా” అన్నాడు తండ్రి కేశవరావు.

“నాకు ఫార్వర్డ్ చేస్తే నేను అతని జాబ్ విషయాలు కనుక్కుంటాను మొదట”
ఆఫీస్ కు వెళ్ళాక మెయిల్ చెక్ చేసి రాజేష్ పని చేసే కంపెనీ లో తన ఫ్రెండ్స్ ను కాంటాక్ట్ చేసింది రశ్మి.
మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఆసంగతి తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.

“నా డిటైల్స్ తో పాటు నా ఫోన్ నెంబర్ ఇవ్వండి డాడీ. ఒకసారి తనతో ఫోన్ లో మాట్లాడి నాకు నచ్చితే చెబుతాను.”

మరు రోజే రాజేష్ నుండీ రశ్మి కి కాల్ వచ్చింది. ఒక గంట సేపు మాట్లాడుకున్నారు. ఆరోజే ‘తనకు రాజేష్ నచ్చాడని చెప్పగానే హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కేశవరావు.

“నేను నెక్స్ట్ వీక్ ఆఫీషియల్ వర్క్ మీద రెండు రోజులు బెంగళూరు వెళ్ళాలి డాడీ. రాజేష్ ను ఎయిర్ పోర్ట్ లో కలుస్తాను.” అంది రశ్మిమరు రోజే.

అలా రశ్మి రాజేష్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు. రెండు రోజుల ట్రిప్ లో ఆఫీసు వర్క్ తరువాత బయట తిరిగారు.
వెనక్కి వచ్చాక రశ్మి రాజేష్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇక ఉండబట్టలేక కేశవరావ్ అడిగాడు
”రాజేష్ పేరెంట్స్ ని కలవనా?”అని.

“వద్దు డాడీ. రాజేష్ ను పర్సనల్ గా అతన్ని కలిశాక నాకెందుకో తన నేచర్ నచ్చలేదు. నేను ‘టూ ఇండిపెండెంట్’ అన్న ఫీలింగ్ వున్నట్టు అనిపించింది. అటువంటి వాడితో కాపురం కష్టం”అంది.
కేశవరావు మళ్ళీ అంతర్జాలం లో వివాహ వేదికలు వెదకడం ప్రారంబించాడు.

“వయసు మీరుతోందే … పెళ్లి మాట ఎత్తవు. మీ డాడీ వుంది వుంటే నీకీ తంటాలు ఉండేవి కాదు.” నిష్టూరంగా అంది రాగిణి.
“మళ్ళీ ఆయన మాట ఎత్తవద్దు అన్నానా. డాడీ అట డాడీ, రెండేళ్ళ కూతురిని ఇంట్లో ఉంచుకుని రెండో పెళ్ళికి సిద్దమై, మనల్ని వదిలేసిన వాడిని డాడీ అంటారా?? చాలా సార్లు చెప్పాను అమ్మా నీకు, ఆయన మాట ఇంట్లో కి రాకూడదని.” కోపంగా అంది హర్షిత.

“ఇక నేనేం చేసేది? నీకు ఒక తోడు కావాలి. నా లాగా ఒంటరి బతుకు కాకూడదు అని తాపత్రయం…”
“ఒంటరి బతుకు వుండదు లేమ్మా. కాక పోతే మారేజీ వ్యవస్థమీద నమ్మకం పోయింది నా ఫ్రెండ్ రజిత విడాకులు తరువాత మరీనీ. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను” అంటూన్న హర్షిత వైపు ఆశగా చూసింది రాగిణి ఏమిచేబుతుందా అని

“నా ఫ్రెండ్ సతీష్ తెలుసుకదా . నాతోనే పని చేస్తాడు. ఒక సారి మన ఇంటికి కూడా వచ్చాడు. తనకు కూడా మన వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. నేనూ, తనూ సహజీవనం చెయ్యాలని అనుకుంటున్నాము. నీతో చెప్పాలని చూస్తున్నా. ఇలాటి కాపురం లో స్వేచ్చగా , హాయిగా కలిసి జీవిస్తాము..” అంటూన్న హర్షిత మాటల్లో సహజీవనం అన్న పదానికి నోరు తెరిచిన రాగిణి అలాగే వుంది పోయింది షాకుతో…

 – డా. లక్ష్మి రాఘవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.