పరిశోధకుడిగా ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం(సాహిత్య వ్యాసం )-.హరిత భట్లపెనుమూర్తి ,

ISSN 2278-478

ప్రఖ్యాత ఆధునికాంధ్ర విమర్శకుడిగా పేరు పొందిన డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారి పరిశోధనలను గురించి చర్చించడమే ఈ పత్ర లక్ష్యం. విమర్శకు, పరిశోధనకు ఒక సన్నని విభజన రేఖ ఉంది. అసలు విమర్శ అంటే ఏమిటో, పరిశోధన అంటే ఏమిటో జి.వి.యస్. మాటల్లోనే చూస్తే, “ఒక వినూత్న వివేచనం గానీ, సమన్వయం గాని, దృక్పథం గాని సప్రమాణంగా సమర్పించబడితే అది విమర్శ అవుతుంది. అదే ఒక వినూత్న సిద్ధాంతాన్ని గాని, సమన్వయాన్ని గాని, విశ్లేషణాన్ని గాని ప్రతిపాదిస్తే అది పరిశోధన అవుతుంది”(సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు[2002:703]). ఈ నిర్వచనాన్ని బట్టి చూస్తే, సాహిత్య రంగంలో ఎన్నో వినూత్న ప్రతిపాదనలను, ఎన్నో సిద్ధాంత రూపకల్పనలను చేసిన జి.వి.యస్.ను నిస్సందేహంగా ఒక ప్రముఖ పరిశోధకుడిగా పేర్కోవచ్చు.

పరిశోధనను బ్రౌణ్య యుగం, వీరేశలింగ యుగం, రాయప్రోలు యుగం, విశ్వవిద్యాలయం యుగంగా విభజించారు విమర్శకులు. అందులో చివరిదైన విశ్వవిద్యాలయ యుగానికి యుగకర్తృత్వాన్ని వహించగల సమర్థులు జి.వి.సుబ్రహ్మణ్యంగారు. ఒక తాజా చెరుకుగడనుండి రసాన్ని ఎవరైనా తీయవచ్చు. కాని ఒక పీల్చి పిప్పి చేసిన చెరుకుగడనుండి రసాన్ని తిరిగి తీయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాగే ఎవరూ స్పృశించని రచనలను తీసుకొని వాటిని విశ్లేషించడం ఒక సాధారణ విమర్శకుడు కాని లేదా ఒక పరిశోధకుడు కాని చేసే పనే కాని దశాబ్దాలుగా ఎందరో మహామహులైన విమర్శకుల/పరిశోధకుల పరిశోధనల్లో నలిగిన రచనలను చేబట్టి, వాటినుండి నూతన ప్రతిపాదనలను, నూతనాంశాలను వెలికి తీయడమనేది కష్టసాధ్యమైన పని. అటువంటి కష్టసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టారు జి.వి.యస్.

సాహిత్య పరిశోధన మొదలైన నాటినుండీ అంటే దాదాపుగా 19వ శతాబ్ది రెండవ అర్ధభాగంనుండీ, పురాణేతిహాసాలపై, కావ్యాలపై, ప్రబంధాలపై, ప్రాచీనకవులపై ఎడతెరిపి లేకుండా పరిశోధనలు, విమర్శలు, విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో ఉద్దండులైన కవి విమర్శకులు రామాయణ, మహాభారతాలను, కావ్యాలనూ, ప్రబంధాలనూ, ఇతర కావ్యాలనూ జల్లెడపట్టి అందులోనుండి ఎన్నో విశేషాలను వెలికితీసి సాహితీలోకం ముందుంచారు. ఆచార్య సి.నా.రె. అన్నట్టు, నన్నయ అంటే ప్రసన్నకథాకలితార్థయుక్తి తిక్కన అంటే నాటకీయత వంటి పడికట్టు పదాలు స్థిరపడిపోయాక పరిశోధనలోకి అడుగుపెట్టి ప్రాచీనకావ్యాలను తనదైన దృష్టిలో పరిశీలించి, వివేచించి, పరిశోధించి అంతవరకూ ఎవరూ దృష్టి సారించని విషయాలపై తన దృష్టిని ప్రసరించి, నన్నయ అంటే ప్రసన్నకథాకలితార్థయుక్తే కాదు నన్నయ అంటే నాటకీయత కూడా అంటూ, ఇటువంటివే ఎన్నో కొత్త వెలుగులను తెలుగువిమర్శనారంగంలో ప్రసరింపజేసినవారు జి.వి.సుబ్రహ్మణ్యంగారు. వారి పరిశోధనలను, ప్రతిపాదించిన సిద్ధాంతాలని స్థూలంగా పరిశీలించడమే ఈ పత్ర ముఖ్యోద్దేశం.

చాలా మందికి పరిశోధన అనేది డాక్టరేటు పట్టాను సంపాదించడంలో భాగంగా ప్రారంభమవుతుంది. జి.వి.యస్. తమ పరిశోధనా వ్యాసంగాన్ని, పిహెచ్.డి.లో చేరకమునుపే ప్రారంభించారు. ‘పీహెచ్.డి. ఈయదగిన పరిశోధన గ్రంథం’గా ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారిచే ప్రశంసలు పొందిన “వీరరసం” అనే పరిశోధనాత్మక వ్యాసం రాసి, తన సత్తా నిరూపించుకుని మరీ పిహెచ్.డి. పరిశోధనలోకి అడుగుబెట్టారు. “ప్రథమాంధ్ర మహాపురాణము – ప్రబంధ కథామూలము” అన్న శీర్షికతో మారన “మార్కండేయ పురాణం”పై పరిశోధన చేసి పట్టా పుచ్చుకున్నాకే ఆచార్య జి.వి.యస్.కి అసలు పని ప్రారంభమైంది. పరిశోధనే ప్రవృత్తిగా కలిగిన పరిశోధకుడికి విశ్రాంతి ఉండదు. 1960 మొదలుకొని 2006లో ఆయన తుదిశ్వాస విడిచేదాక అవిశ్రాంతంగా తెలుగు పరిశోధనాక్షేత్రంలో శ్రమించి, ఎన్నో పరిశోధనా ఫలాలను పండించిన కృషీవలుడు జి.వి.యస్.

జి.వి.యస్. ప్రతిపాదించిన నూత్న సిద్ధాంతాలు కొన్నింటిని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించే ప్రయత్నం ఈ వ్యాసంలో చేస్తున్నాను.

ధర్మవీరం:

జి.వి.యస్. ప్రతిపాదనలలో అతి ముఖ్యంగా పేర్కొనబడదగ్గది “ధర్మవీర మేవ రసానాం రసః” అన్న రససమీకరణ సూత్రం. సాహిత్య క్షేత్రంలో ఉన్న శాంత శృంగార కరుణాద్భుత రససమీకరణవాదాలను నిర్ద్వంద్వంగా తోసిరాజని, వివిధ ఉదాహరణలతో ధర్మవీరమే ఏకైక రసమనీ, రసరాజమనీ నిరూపించారు. అంతే కాక, అభినవగుప్తాది ప్రాచీన ఆలంకారికులచేత రామాయణ, మహాభారతాల్లో అంగిరసం శాంతమని స్థాపింపబడి ఉండగా, వారి అభిప్రాయాలను పూర్వపక్షం చేస్తూ, ధర్మవీరాన్ని రామాయణ, మహాభారతాల్లో అంగిరసంగా నిరూపించారు.

నవ్యసంప్రదాయవాదం:

క్లాసిక్ తత్త్వాన్ని జీర్ణించుకొని, సమకాలీన చైతన్య ప్రభావంతో, విన్నూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో కొనసాగిన కావ్య రచనా మార్గానికి “నవ్య సంప్రదాయం” అని నామకరణం చేసి ఈ వాదానికి ప్రతిష్ఠ, ప్రచారాలను కల్పించిన ఘనత జీవీయస్ గారికే దక్కుతుంది. నవ్యసంప్రదాయ యుగకర్తగా విశ్వనాథను ఉపపత్తులతో నిరూపించిన జి.వి.యస్., ఒకప్పటి వచనకవితా పితామహులచే నడుములు విరగదన్నించుకున్న పద్యం తన కాలానికీ(1988) గౌరవాదరాలను పొందడాన్ని నవ్యసంప్రదాయోద్యమం సాధించిన విజయంగా అభివర్ణించారు.

ప్రబంధాల్లో ప్రతీకాత్మకత: ప్రబంధాలనన్నిటినీ సాంగోపాంగంగా అధ్యయనం చేసి, అప్పటికే విమర్శకులు స్థాపించిన ప్రబంధ లక్షణాలకు, “వక్రోక్తి”, “ప్రతీకాత్మకత” అనే రెండు లక్షణాలను కొత్తగా జత చేయడమే కాక, విజయవిలాస, ప్రభావతీ ప్రద్యుమ్నాది ప్రబంధాలలో గల ప్రతీకాత్మకతను నిరూపించారు.

ప్రక్రియా వివేచన:

ప్రక్రియా పరమైన వివేచన తెలుగు సాహిత్య విమర్శకు జి.వి.యస్. అందించిన అతి పెద్ద బహుమానంగా భావించవచ్చు. ఏదైనా ఒక రచనను సమగ్రంగా విశ్లేషించాలంటే కవి హృదయం, కవి దర్శనం అర్థం కావాలి. కవి ఏ విధంగా రచనావస్తువును భావిస్తున్నాడు, ఏ విధంగా పాఠకునిముందు ఆవిష్కరించదలచుకున్నాడు అనే విషయాలను అర్థం చేసుకుంటే, కావ్యావగాహనలో వైకల్యాలు ఉండవు. కావ్యప్రక్రియను గురించి, కవితాశైలిని గురించి ఒక నిర్దిష్ట కాలంలో ఒక రకమైన సాహిత్య రచనలు వెలువడటానికి కారణమైన అంతర్గతి సూత్రాన్ని గురించి అవగాహన పెంచుకోవటానికి సాహిత్య దర్శన వివేచన ముఖ్యమవుతుందని, కవి సాహిత్య దర్శనమే అతను చేపట్టిన ప్రక్రియలో ప్రతిఫలిస్తుంది కనుక ప్రక్రియా పరిజ్ఞానం సాహిత్య విమర్శకూ, సాహిత్యానుశీలనానికీ ప్రాణప్రదమని ఉద్ఘాటించారు జి.వి.యస్.

తెలుగు కవులు ప్రయోగించిన ప్రక్రియలు శుద్ధమైన ప్రాథమిక ప్రక్రియలు కావు, ప్రౌఢమైన మిశ్రప్రక్రియలన్న జి.వి.యస్., తెలుగు సాహిత్యంలో వెలువడిన ప్రసిద్ధ రచనలనన్నిటినీ ప్రక్రియా పరంగా విశ్లేషించారు. మహాభారతాన్ని కావ్యేతిహాసంగా, కుమారసంభవాన్ని వస్తుకావ్యంగా, బసవపురాణాదులను దేశిపురాణాలుగా, కేతన దశకుమారచరిత్ర కథాకావ్యంగా, ఎఱ్ఱన హరివంశం పురాణేతిహాసంగా, సోముని హరివంశం వంశకథాకావ్యంగా ఇలా తెలుగులో వెలసిన ప్రసిద్ధ కావ్యాలనన్నిటినీ కూలంకషంగా చర్చించి, వాటిని ప్రక్రియాపరంగా వివేచించారు. వేమన పద్యాన్ని ఒక ప్రక్రియగా ప్రతిపాదించారు.

అన్నమాచార్యుల ‘సంకీర్తన’, రామదాసు ‘కీర్తన’, క్షేత్రయ్య ‘పదం’, బ్రహ్మంగారి ‘తత్త్వం’, త్యాగయ్య ‘కృతి’ అని ప్రక్రియాపరంగా ఎలా వాడుతున్నామో అలాగే వేమన పద్యం అనేదాన్ని కూడా పారిభాషిక పదంగా గ్రహించాలి అని సూచించారు.
నాటకీయత- నన్నయ మార్గదర్శికత్వం: ఈ వ్యాసంలో తొలుత పేర్కొన్నట్టు నన్నయలో నాటకీయతను వెలికితీసిన ఘనత కూడా సుబ్రహ్మణ్యంగారికి దక్కుతుంది. ‘కుమారాస్త్ర విద్యాప్రదర్శన’, ‘శిశుపాల వధ’ ఘట్టాలను వ్యాయోగాలుగా, ‘బకాసురవధ’, ‘జరాసంధవధ’లను సమవాకారాలుగా, ‘ద్యూత సభ’ను డిమంగా అన్వయించి చూపి, నన్నయలో నాటకీయతా లక్షణాన్ని సోదాహరణంగా నిరూపించారు.

తిక్కన ప్రయోగశీలత్వం: తిక్కనలోని ప్రయోగశీలత్వ లక్షణాన్ని నిరూపించారు. ఉత్తర రామాయణాన్ని కథా కావ్యంగా, అనేకనాయకాశ్రితంగా రచించిన తిక్కన ఒక కావ్యానికి ఒక రసం అన్న సిద్ధాంతానికి కూడా కట్టుబడలేదనీ, తన శిష్యులైన కేతన మొదలగు వారిని కథాకావ్యాల సృష్టికి ప్రేరేపించారనీ స్థాపించారు.

ఎఱ్ఱన ప్రబంధ పరమేశ్వరత్వం:

రచనలనే కాక, కవుల రచనాశైలులను కూడా సమగ్రంగా విశ్లేషించారు జి.వి.యస్. ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడన్న బిరుదు కలగడానికి కారణం ప్రక్రియకు తగిన శైలి అనే సిద్ధాంతాన్ని ప్రదర్శించినందుకే అని చెప్పి, ఎఱ్ఱన ప్రయోగాలను ఈ విధంగా విశ్లేషించారు: హరివంశము: పురాణ కవితా శైలి + ఇతిహాస వస్తువు + కథా కథన పద్ధతి. అరణ్యపర్వశేషము: కావ్య కవితా శైలి + ఇతిహాస వస్తువు + ఉభయ(కథన+వర్ణన) పద్ధతి. నృసింహ పురాణము: ప్రబంధ కవితా శైలి + పురాణ వస్తువు + వర్ణనాత్మక పద్ధతి. ఇలా బహురూపశైలిని ప్రక్రియానుగుణంగా ప్రకటించగలగడం వల్లనే ఎఱ్ఱన ప్రబంధ పరమేశ్వరుడయ్యాడని వివరించారు.

సోమన సంవిధాన చక్రవర్తిత్వం: అలాగే నాచన సోముని ఉత్తర హరివంశాన్ని విశ్లేషిస్తూ, అది వంశకథాకావ్యమెలా అయిందో హేతుబద్ధంగా చర్చించటమే కాక, అప్పటిదాక ఏతద్కావ్యంలో విమర్శకులెవరూ గుర్తించలేని కథా సంవిధానశిల్పాన్ని గుర్తించి, సోమన సంవిధాన చక్రవర్తి బిరుదానికి సార్థకతను నిరూపించారు.

శ్రీనాథ యుగ రసరమ్యత్వం:

శ్రీనాథ యుగాన్ని సాకల్యంగా పరిశీలించిన జీ.వి.యస్., ఈ యుగంలోని కవులు తామెంచుకున్న రసాన్నే రసరాజంగా తమ తమ రచనలలో ప్రతిబింబించే ప్రయత్నం చేశారని వివరించారు. ఉదాహరణకు శ్రీనాథుడు శృంగార రసాన్ని, పోతన, అన్నమయ్యలు భక్తి రసాన్ని, కొఱవి గోపరాజు మొదలుగా గల కథాకావ్యకర్తలు అద్భుత రసాన్ని ఇలా వారు తమ తమ కావ్యాల ద్వారా రససమీకరణవాదానికి దోహదం జేశారని వక్కాణించారు.

ప్రక్రియాపరమైన యుగవిభజన: సాహిత్యకారులు సౌలభ్యం కోసం తెలుగు సాహిత్యాన్నంతటినీ యుగాలుగా విభజించారు. కవుల పేర్లతో, రాజుల పేర్లతో ఇలా రకరకాలుగా కాలాన్ని విభజించారు. అయితే సుబ్రహ్మణ్యం గారు పేర్కొన్నట్టు(సాహిత్యచరిత్రలో చర్చనీయాంశాలు[2002:218]), ఎవరే రీతిగా సాహిత్య చరిత్రను రచింపబూనినా ఒక సూత్రానికి కట్టుబడి యుగవిభాగాన్ని, పరిణామాన్నీ నిరూపించలేకపోయారు. కవుల పేర్లతో మొదలైన యుగవిభజనలో రాజుల పేరిట యుగాలు రావడం వంటి శాఖాచంక్రమణ ప్రమాదాలు జరిగాయి. జి.వి.యస్.గారు ప్రక్రియావికాసస్ఫూర్తితో సాహిత్యవికాసచరిత్రను ఆధునిక పద్ధతిలో నిర్మించారు. ప్రాఙ్నన్నయ కాలం మొదలుకొని, ఇటీవలి కాలం (1985) వరకూ కాలాన్ని ప్రక్రియాపరంగా విభజించారు. ఉదాహరణకు, మౌఖిక సాహిత్య ప్రక్రియా యుగం(క్రీ.శ. 1000 వరకు), కావ్యేతిహాస యుగం(11వ శతాబ్ది), వస్తుకావ్య యుగం(12వ శతాబ్ది పూర్వార్ధం), దేశిపురాణ యుగం(12వ శతాబ్ది ఉత్తరార్ధం) ఇలా చేసిన విభజన జి.వి.యస్.కి ఉన్న సాహిత్యావగాహనకు అద్దం పడుతుంది. అలాగే, సాహిత్య విమర్శలో, పరిశోధనలో కూడా యుగ విభజన చేశారు.

జి.వి.యస్. విమర్శలో కాని విశ్లేషణలో కాని సంప్రదాయ పద్ధతి కనిపిస్తుంది. అయితే ఆ సంప్రదాయం ఆయన దృష్టిలో స్థిరమైన జడ పదార్థం కాదు. గతిశీలం దాని లక్షణం. సంప్రదాయం వంశపారంపర్యంగా వచ్చే లక్షణం కాదు. ఎప్పటికప్పుడు పరిశ్రమతో అలవర్చుకునేది అన్న స్పృహ కలిగిన విమర్శకుడు కనుకనే ఆయన భారతీయ సాహిత్య విమర్శకే కట్టుబడిపోకుండా, విశ్వసాహిత్య విమర్శను పరిశీలించి, తెలుగుకు దాన్ని అన్వయించారు. ప్రాచీన సాహిత్య విమర్శతో ఆగిపోకుండా ఆదికావ్యమైన మహాభారతంతో మొదలుకొని, తన కాలపు అత్యాధునిక ప్రక్రియలైన అనుభూతి కవిత్వాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని కూడా సానుకూలంగా విమర్శించగలిగారు.

తెలుగు విమర్శకులలో చాలా మంది, అయితే ప్రాచీన సాహిత్యవిమర్శకి, లేకపోతే ఆధునిక సాహిత్య విమర్శకి కట్టుబడి ఉన్నారు. అయితే అసలైన సాహిత్య పిపాసి ప్రాచీనం, ఆధునికం అంటూ గిరిగీసుకుని కూర్చోడు. మంచి సాహిత్యమే రూపంలో ఉన్నా ఆస్వాదిస్తాడు, అభినందిస్తాడు. జి.వి.యస్. అటువంటి మేలైన సాహిత్య పిపాసి, విమర్శకుడు. ఆయన నన్నయ నుండి నయాగరా కవుల వరకు అందరి సాహిత్యాన్ని అభిమానించాడు, విమర్శించాడు.

విమర్శకుడిగా జి.వి.యస్.: ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్నట్టు జి.వి.యస్. గొప్ప విమర్శకుడిగా కూడా పేరెన్నిక గన్నారు. వారి విమర్శనా ప్రతిభను వ్యక్తం చేసే ఆణిముత్యాలవంటి ఆయన విమర్శలను కొన్నింటిని పరిశీలిద్దాం:

జి.వి.యస్.ను చదివితే విశ్వనాథ సత్యన్నారాయణపై ఆయనకు గల అపారమైన అభిమానం, ఆరాధన తేలిగ్గానే ప్రకటితమవుతాయి. అయితే ఆ అభిమానం అకారణంగా వ్యక్తం చేస్తే సుబ్రహ్మణ్యంగారు సగటు సాహిత్యాభిమాని అయ్యేవారు. ఆ అభిమానానికి గల కారణాలను సహేతుకంగా, సశాస్త్రీయంగా నిరూపిస్తారు కనుకనే ఆయన గొప్ప సాహిత్య విమర్శకుడిగా పేరు పొందారు. విశ్వనాథ వారిని విమర్శక చక్రవర్తిగా స్థాపిస్తూ, ఇలా అంటారు:

“ఒక సాహిత్య విమర్శకుని స్థానాన్ని నిర్దేశించటంలో పరిగణింపవలసిన ప్రధానాంశం – ఆయన ఏ కావ్యాల మీద విమర్శ సాగించాడనే దానికంటే ఆ విమర్శనే పద్ధతిలో ప్రస్తరించాడన్న వివేచనం” (అభినవలోచనం[1989:121])
ఈ వాక్యం నేపథ్యంగా, విశ్వనాథ ఆంగ్ల విమర్శను, కట్టమంచివారి ఆధునిక విమర్శను ఏ విధంగా అధ్యయనం చేసి తనదైన విమర్శనా మార్గాన్ని వేసుకున్నదీ విశ్లేషించారు. విమర్శ ఎన్ని విధాలుగా ఉంటుందో వివరించి, ఎటువంటి విమర్శ ఉత్తమమైనదో సూచించి, విశ్వనాథ విమర్శనాగ్రంథాలలో ఉన్న ఉత్తమమైన విమర్శను నిరూపించి, ఒక్కొక్క విమర్శనాగ్రంథంలో ఉన్న ప్రత్యేకతనూ విడివిడిగా బహిర్గతం చేశారు. చివరగా ఈ క్రింది వాక్యంతో విమర్శక చక్రవర్తిగా శిఖరాయమానమైన విశ్వనాథ కీర్తిని ఆవిష్కరించారు.

“విశ్వనాథలో ఉన్న ప్రత్యేకతేమిటంటే – ఆయన క్రొత్తను గుర్తిస్తాడు. కాని, దాన్ని గ్రుడ్డిగా అనుకరించడు. దాన్ని పరిశీలిస్తాడు. పరిష్కరిస్తాడు. పరిపూర్ణతను భావిస్తాడు. ప్రయోగంగా ప్రస్తరిస్తాడు. దానితో ప్రత్యేకతను సాధించుకొంటాడు”( అభినవలోచనం[1989:123]). జాగ్రత్తగా గమనిస్తే ఆచార్య జి.వి.యస్.లో కూడా సరిగ్గా ఇదే లక్షణం కనిపిస్తుంది. అందువల్లనే ఆయన విశ్వనాథతో, ఆయన రచనలతో అంతగా మమేకం చెందారేమోననిపిస్తుంది.

ఆధునిక కవులలో శ్రీశ్రీని, దాశరథిని, సి.నా.రె.ని, నయాగరా కవులనూ, రావూరి భరద్వాజనూ కూడా వారి రచనల ఆధారంగా విశ్లేషించారు.

శ్రీశ్రీలోని భావకవిని తలస్పర్శిగా దర్శింపజేసి, భావకవిత్వం నుండి అభ్యుదయకవిత్వానికి ఆయన చేసిన మహాప్రస్థానాన్ని, శ్రీశ్రీ కవితలలో పురాణ ప్రతీకల స్వభావాన్ని ఆవిష్కరించారు. దాశరథి శాంతి విప్లవ ప్రస్థానాన్ని వివేచించారు.

ఆధునిక కావ్యం గొప్పదనటానికి ప్రమాణం అది ఎన్ని ప్రశ్నలు పఠితలో రేకెత్తింపజేసినదనే గాని, ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిందనేది కాదని చెప్పి, ఆ విధంగా సి.నారాయణ రెడ్డి గారి విశ్వంభరను గొప్ప ఆధునిక మానవేతిహాస కావ్యంగా అభివర్ణించారు.

రాయప్రోలు సుబ్బారావు గారు జి.వి.యస్. గారి అభిమాన కవులలో ఒకరు. ఆయనను మహాకవిగా అభివర్ణిస్తారు సుబ్రహ్మణ్యం గారు. ఆయనను ఊరకే మహాకవి అనేసి ఊరుకోరు. మహాకవికి నిర్వచనాన్ని చెబుతారు.
“మహాకవిగా ఒకరిని గుర్తించడానికి మూడు ప్రమాణాలు 1) ప్రక్రియ 2) మార్గం 3) దర్శనం. ప్రక్రియలోనూ మార్గంలోనూ నవ్యతను సాధిస్తూ తనదైన ఒక దర్శనాన్ని కూడా సాహితీజగత్తు కందిస్తే ఆ దర్శనానికి లక్ష్యాలుగా తన రచనలను రూపిస్తే అతన్ని మహాకవుల్లో మహాకవి అనక తప్పదు” (అభినవలోచనం[1989:137])అని చెప్పి రాయప్రోలు సుబ్బారావుగారు పైన చెప్పిన మూడు ప్రమాణాలను పరిపూర్ణంగా సాధించిన మహాకవులనీ అందువల్లనే నవ్యకవిత్వయుగంలో వారికి సమున్నతమైన ఆచార్య స్థానం ఏర్పడిందనీ ఉగ్గడిస్తారు.

ఇవే కాక, జి.వి.యస్. 20వ శతాబ్ది విశ్వ సాహిత్య విమర్శ పేరిట చేసిన ఆకాశవాణి ప్రసంగాలు అపారమైన వారి అధ్యయనానికీ, సాహిత్యావగాహనకు దర్పణంగా నిలుస్తాయి.

జీ.వి.ఎస్. రచనలు – విమర్శనా గ్రంథాలు – పురస్కారాలు:
1. వీర రసము
2. తిరుపతి వేంకట కవుల కావ్య సమీక్ష
3. సారస్వత సౌరభము
4. ప్రథమాంధ్ర మహాపురాణము – ప్రబంధ కథామూలము
5. నవ్యాలోకము
6. పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవి కృతులు – సమీక్ష
7. శ్రీనాథుని కవితా వైభవము
8. పురాణ వాఙ్మయము
9. తిరుపతి వేంకటకవుల కవితా వైభవము
10. రసోల్లాసము
11. రామకథ : సాయి సుధ
12. అభినవలోచనం
13. ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం
14. అక్షరాల ఆలోచనలు
15. కలంతో కాలమ్
16. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు
17. జీవియస్ వ్యాసాలు
18. కొలమానమ్
19. విశ్వనాథ: నవ్య సంప్రదాయం
20. జీవియస్ రూపకాలు
21. జీవియస్ మధురాద్వైతం
22. జీవియస్ నవలలు, కథానికలు
23. నవయుగ రత్నాలు
24. అనుశీలన
25. జీవియస్ పీఠికలు
26. ముత్యాల ముచ్చట్లు
27. ఆంధ్రమహాభారతం : అమృతత్వ సాధనం
28. జీవియస్ సాహితీ సమాలోచనం
29. చందన
30. సుశీల కథలు
31. శ్రీసత్యసాయిస్తుతి : అష్టోత్తరశతి
32. విభావన
33. 20వ శతాబ్ది విశ్వ సాహిత్య విమర్శ

‘ఆంధ్ర సాహిత్య విమర్శ-అంగ్ల ప్రభావము’ అనే గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ‘వీరరసం’, ‘రసోల్లాసం’ గ్రంథాలకు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ప్రభుత్వేతర సంస్థలనుండి ఆయన అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు.

జి.వి.యస్. ప్రతిపాదించిన ముఖ్య సిద్ధాంతాలు/ప్రతిపాదనలు:
1. నన్నయ భారతంలో నాటకీయత
2. రస సమీకరణం – ధర్మవీర రస ప్రతిపాదన.
3. రామాయణ మహాభారతాల్లో అంగిరసం
4. ప్రబంధ లక్షణాలు-వక్రోక్తి, ప్రతీకాత్మకత; విజయవిలాస, ప్రభావతీ ప్రద్యుమ్నాల్లో ప్రతీకాత్మకత
5. ప్రక్రియాపరమైన వివేచన
6. నవ్య సంప్రదాయవాదం
7. అమలిన శృంగార సిద్ధాంతంలో తాత్త్వికత
8. తెలుగు విమర్శపై పాశ్చాత్య విమర్శ ప్రభావం
9. మహాభారతంలో అమృతత్వ సాధనం
10. విమర్శక చక్రవర్తిగా విశ్వనాథ.

ఉపయుక్త గ్రంథ సూచి:
1. మీనన్.కె.కె., ఇసుకపల్లి దక్షిణామూర్తి, జె.ఉమామహేశ్వరరావు, జి.వి.సుబ్బారావు, వి.సుమతి, శంకరమంచి పార్థసారథి. 1988. రజతరంజని. రంజని రజతోత్సవ సంఘం. హైదరాబాదు.
2. సుబ్రహ్మణ్యం,జి.వి. 2002. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. తెలుగు అకాడమి. హైదరాబాదు.
3. ……………. 1996. అనుశీలన. షష్ఠిపూర్తి ప్రచురణలు. హైదరాబాదు.
4. ……………. 1980. రసోల్లాసం. నవోదయం ప్రచురణ. హైదరాబాదు.
5. ……………. 1999. 20వ శతాబ్ది సాహిత్య విమర్శ. జీవియస్ సాహితీ కళాపీఠం.హైదరాబాదు.
6. ……………. 2000. శ్రీమదాంధ్రమహాభారతం. తితిదే ప్రచురణలు. తిరుపతి.
7. ……………. 1988. అక్షరాల ఆలోచనలు. యువభారతి. హైదరాబాదు.
8. …………….1989. అభినవలోచనం. యువభారతి. హైదరాబాదు.
9. 1996. చందన. జీవియస్ సాహితీ కళాపీఠం.హైదరాబాదు.
10. http://eemaata.com/em/issues/200609/915.html – విశ్వనాథ నవ్య సంప్రదాయ వాదం. సెప్టెంబరు 2006

హరిత భట్లపెనుమర్తి,

పరిశోధక విద్యార్థి,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.