నా కళ్ల తో అమెరికా -69-(యాత్రా సాహిత్యం )-కె.గీత

మెక్సికో నౌకా యాత్ర- చివరి భాగం

“టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు”లో ఎన్సినాదా నగర సందర్శన కూడా కలిసి ఉండడంతో సంబరపడ్డాం. టూరులో ముందుగా సివిక్ ప్లాజా లో మెక్సికో అమర వీరుల విగ్రహాల్ని సందర్శించేం.

అక్కణ్ణించి దాదాపు పదకొండు గంటల వేళ తిన్నగా మా అసలు సిసలు టూరు “టేస్ట్ ఆఫ్ మెక్సికో” ప్రదేశానికి చేరుకున్నాం.
బయటి నించి చూస్తే ఏదో పాత ఇల్లు అనుకునేలా ఉన్న రెస్టారెంటు అది.లోపల హాలు ధాబా లాగా ఉంది. అది దాటి వెనక వైపు పెరట్లోకి అడుగు పెట్టేసరికి మా టూరు వాళ్ల కోసమే టేబుళ్ల మీద సరుకు, సరంజామా సర్ది పెట్టేరు. టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి… అవన్నీ కోయడానికి కత్తులు, కటర్ లతో బాటూ మనిషికి ఒక అమందస్తా (చిన్న రోలు) కూడా ఇచ్చే సరికి ఖంగు తిన్నాం.

పెరట్లో మాతో బాటూ మరో నాలుగైదు టేబుల్స్ నిండా జనం ఉన్నారు.
ముందుగా మా కిచ్చిన టేస్ట్ ఆఫ్ మెక్సికో ఏప్రాన్లు కట్టుకున్నాం.
ముందుగా మెక్సికో ఫుడ్ గా అత్యంత పేరు పొందిన “సాల్సా” తయారీ తరగతి ప్రారంభమైంది.
మాకిచ్చిన సరుకుల్లో వెల్లుల్లి రేకను ముందుగా ఇచిన చిన్న రోలులో కనిపించనంత మెత్తగా రుబ్బాలి.
స్థానికంగా పండిన రకరకాల పెద్ద మిరపపళ్లను కాల్చి తెచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కటి తీసుకోమన్నారు.
అందులో మనకు కావల్సిన అన్ని స్పైస్ లెవల్స్లోనూ ఉన్నాయి మిరపపళ్లు.
మేం కావాలని అత్యంత కారంగా ఉండేవని చెబుతున్నవి ఎలా ఉంటాయో చూద్దామని తీసుకున్నాం.

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

ఆ మిరపకాయను కచ్చబచ్చాగా రుబ్బిన తరువాత ఇచ్చిన టమాటా పళ్లని రుబ్బుకుని, ఉల్లిపాయలు, కొత్తిమీర వంటివి కలుపుకుని టేబుల్ మధ్యలో పెట్టిన చిప్సు తో ముంచుకుని తినేయడమే.
ఇక మేం తీసుకున్న మిరపపళ్లు గూబ గుయ్ మనేంత కారంగా ఉన్నాయి.
కళ్లల్లోకి నీళ్లు వస్తూ ఉన్నా మా సెలక్షనుకి మాకే నవ్వు వచ్చింది.
ఇక రెండవ భాగంగా ఇక్కడి మరో ముఖ్యమైన వంటకాలు ఫిష్, చికెన్, వెజిటబుల్ బజ్జీల తయారీ.
ఎవరికి ఏది తినాలనుంటే అవే తయారు చేసుకోవచ్చన్నమాట.

బజ్జీల తయారీకి అవసరమైన పిండి, ఉప్పు వగైరాలన్నీ మాకిచ్చిన గిన్నెలో కలుపుకుని అందులో ముల్లు తీసిన చేప ముక్కలు లేదా చికెన్ ముక్కలు లేదా కేరట్ ముక్కలు దొర్లించి ఇచ్చిన పళ్లేళ్లో పెట్టుకుని వరసగా వేయించే లైనులో నిలబడ్డాం.
అదృష్టం కొద్దీ ఎవరి మూకుడు వాళ్లకిచ్చి వేయించుకోమనకుండా వాళ్లే మాకు వేయించి ఇస్తున్నారు.
ముందుగా కాయగూరల వాళ్లని రమ్మన్నారు.

మొత్తం బాచ్ లో మా వరు ఒక్కతే వెజిటేరియన్ కావడంతో తన బజ్జీలు ముందుగా రెడీ అయి వచ్చేసేయి.
ఆ తరువాత చికెన్, చివరిగా చేపల వాళ్ల లైనులో నిలబడ్డాం.

మాంచి ఆకలితో ఉన్నా కారం లేకపోవడం వల్ల, ఉప్పు సరిపడా వెయ్యకపోవడం వల్ల వట్టి కార్న్ ఫ్లోర్ బజ్జీలు రుచించలేదు మాకు.
ఫోటోల వరకూ తీసుకుని ఏదో కాస్త తిన్నామనిపించి బయట పడ్డాం.
అంత వరకూ మాకు వంట నేర్పించిన చెఫ్ తో ఫోటో తీసుకున్నాను నేను.
అక్కణ్ణించి వచ్చేటపుడు షాపింగు కోసం ఒక గంట పాటూ ఎన్సినాదా మార్కెట్టు లో ఆపేరు.
స్థానిక వస్తువుల్ని కొనుక్కునేందుకు స్థానికుల్ని పరిచయం చేసుకునేందుకు అవకాశం దొరకడంతో సంతోషపడ్డాను.
స్థానిక మార్కెట్టు లో రంగులమయంగా అందంగా ఉంది.

చిన్న సందుల్లో రోడ్ల పక్కనే బయటే వేళాడదీసున్న రంగు రంగుల వస్తువులు, బట్టలు చూడగానే సికింద్రాబాదులో జనరల్ బజార్ గుర్తుకొచ్చింది.

కానీ అంత మంది జనమే లేరిక్కడ. అక్కడే ఎంతసేపైనా తచ్చాడాలనిపించింది.

కానీ సమయానికి బస్సు ఎక్కకపోతే షిప్పు ఎక్కడం కుదరదన్న సత్యం మరిచిపోని సత్య నన్ను వెనకే తరమడం మొదలుపెట్టేడు.

మొత్తానికి సిరికి స్థానిక చేతి వృత్తుల వారు తయారుచేసిన కాటన్ గౌను కొన్నాను.
రంగులో ముంచిన నూలు గుడ్డకి చేత్తో రంగురంగుల దారాల్తో చేసిన చిన్న ఎంబ్రయిడరీ గౌనది.
ఇలాంటి చోట్ల డాలర్లలో కొనే అమెరికా నించి వచ్చిన వాళ్లని చూసి ఎక్కువ ఖరీదు చెబుతారనీ, బాగా బేరం ఆడొచ్చనీ ఎక్కడో చదివాను.

షాపమ్మాయి చెప్పిన రేటులో సగానికి అడిగేను. ఆ అమ్మాయి స్పానిషు యాసలో, వచ్చీ రాని ఇంగ్లీషులో “మీలాంటి వారు కొనుక్కుంటే ఇక్కడ మా స్థానికుల చేతుల్లో తయారైన ఈ వస్త్రం అమెరికా వరకూ వెళ్తుంది కదా” అని సంతోషంగా ఉంటుంది నాకు. కానీ మీరు అడిగిన రేటుకి ఇస్తే దళారీలకు, అన్ని ఖర్చులకూ పోగా మాకు ఏం మిగులుతుంది? ఇలా డాలర్లలో ఎవరైనా కొనుక్కున్న రోజే నా పిల్లలకు మొక్కజొన్న రొట్టెల్లో మాంసం పెట్టగలిగేది.” అంది.
మారు మాట్లాడకుండా ఆ అమ్మాయి అడిగిన డబ్బులు చేతిలో పెట్టేను.
టూరు బస్సు దిగి డ్రయివర్ గాను, అప్పటి వరకూ మమ్మల్ని ఊరంతా తిప్పుతూ గైడు గానూ పనిచేస్తున్న అమ్మాయితో ఫోటో తీసుకున్నాను.

తిరిగి వచ్చి నౌక ఎక్కే ముందు షిపు యార్డ్ లో ఉన్న షాపుల్లో పూసలతో, దారలతో అల్లిన చేతులకు కట్టుకునే చిన్న చిన్న బ్రేస్ లెట్ల వంటివి అదే రేటుకి కొన్నపుడు గౌను కొని ఒక అమ్మాయికి సాయం చేసినందుకు తృప్తిగా అనిపించింది.
తిరిగి లాస్ ఏంజిల్స్ వచ్చేటపుడు అమెరికా భూభాగంలో అడుగుపెట్టడానికి ఉన్న అనేక భద్రతల్లో భాగంగా అందరికంటే చివరలో మా వీసా, పాస్పోర్టుల చెకింగ్ తర్వాత మమ్మల్ని పంపడం మినహా ఆ ప్రయాణం ఎంతో హాయిగా జరిగింది.
సముద్రాన్ని ఒడ్డు నించి చూసి ఆనందపడడానికీ ప్రత్యేకంగా సముద్రమ్మీదే గడపడానికీ ఉన్న తేడా అందరికీ మొదటిసారి అర్థమైంది. ఎప్పుడెప్పుడు వెనక్కు వస్తామా అని తిరిగి భూమ్మీదకి రాగానే గొప్ప సంతోషంగా అనిపించినట్లు పిల్లలు నౌక దిగి కారెక్కుతునే “హుర్రే” అని అరిచేరు.

(మెక్సికో యాత్ర సమాప్తం)

-కె.గీత

గత సంచికల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

నా కళ్లతో ఆమెరికా (యాత్రా సాహిత్యం )- కె . గీత 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో