జ్ఞాపకాలు – 3(ఆత్మ కథ )_కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు . వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది . వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా “ అని అడిగేడు .నేనా విషయం మోహన్ తో చెప్పి ,’చేరదామా ‘ అని అడిగేను . ”శాంత , రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి . నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు “ అన్నాడు . లయన్స్ సభలు సాధారణంగా ఆది వారాలు జరిగేవి . మైక్ లో వాళ్ల మాటలన్నీ విన్పించేవి . ఒకోసారి పదిమంది పేదలకి తువాళ్లు పంచుతున్నామనీ , మరోసారి ఏడేసి రూపాయలు ఆర్ధిక సాయం చేస్తున్నామనీ అనడం విని నాకు బలే నవ్వొచ్చేది . నెలనెలా వాళ్ల భోజనాల కార్యక్రమాలకి మాత్రం బోలెడు ఖర్చయ్యేదట . ఏపత్రికకి పంపలేదు కానీ అప్పట్లో ‘కమీలియన్ క్లబ్ ‘ అని ఒక చిన్న వ్యంగ్య కథ ఒకటి రాసేను .

మేం చిన్నప్పుడు వైష్ణవ స్వాముల ప్రసాదాల కోసం వెళ్లిన ఇల్లు తీసేసి కొత్త భద్రరావుగారు చక్కని డూప్లెక్స్ ఇల్లు ఒకటి కట్టుకున్నారు . ఆ ఇంటి వారమ్మాయిల కోసం వీణ తెప్పించేరనీ, వీధిలో కోమట్ల అమ్మాయిలు ఇంకొందరు కూడా వీణ నేర్చుకుంటున్నారనీ , పెద్దాపురం నుంచి టీచరు ఒకావిడ వచ్చి నేర్పిస్తున్నారనీ తెలిసింది . నా మనసాగలేదు . సంశయిస్తూనే వెళ్లేను . భద్రరావుగారి భార్య లక్ష్మిగారు ఆప్యాయంగా ఆహ్వానించేరు . అక్కడ అమ్మాయిలు కొందరు వీణ మెట్లను పలికించే సాధనలో ఉన్నారు . టీచరు ఎనభై ఏళ్లకు పైగా వయసున్నావిడ . మొదటి ప్రయత్నంలోనే నాకు సరిగమలు పలకడం , నేను శృతి బద్ధంగా పాడడం చూసి “నీకు సరస్వతీ కటాక్షం నిండుగా ఉందమ్మా “ అంటూ ఆశీర్వదించేరు . పాఠాల కోసం వెళ్ళినా ,సాధన కోసం రోజూ వారింటికి వెళ్లలేను కదా ! సొంతంగా వీణ కొనుక్కోవాలనుకున్నాను . కాని , వెయ్యి రూపాయలు ఒక్క సారిగా ఎక్కన్నుంచొస్తాయి ? అది తెలిసి లక్ష్మి గారు మధ్యలో ఉండి నెలకి వంద కట్టేలా వీణ ఇప్పించేరు .” వీణ కొనుక్కున్నా పాఠాలకి మాత్రం మా ఇంటికే రండి . మిమ్మల్ని చూడ్డం , మీ గాత్రం వినడం ఎంతో బావుంటుంది . నాకు “ అనే వారు లక్ష్మి గారు . వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా నన్నూ పిలిచేవారు . డైరెక్టర్ విశ్వనాథ్ గారిది ఏం సినిమానో గుర్తు లేదు కాని మా ప్రాంతంలో షూటింగ్ జరుగుతూంటే ఆయన్ని , శారద , చలం గార్లనీ లయన్స్ క్లబ్ తరపున అతిధులుగా పిలిచి లక్ష్మి గారింట్లో డిన్నర్ ఏర్పాటు చేసేరు . “ఆరు గంటల కల్లా మాస్టారూ, మీరూ తప్పక రండి “ అని పిలిచేరు . నేను మోహన్ తో చెప్పేను .”చూద్దాంలే “ అన్నవాడు ఏడు గంటలైనా ఇంటికి రాలేదు . అలా వెళ్లడం కోసం పిల్లల్ని సాయంకాలమే మా చెల్లితో మా అమ్మ వాళ్లింటికి పంపించేసాను . కాశీ వెళ్లి వచ్చిన కోమట్లు ఒకరింట్లో బెనారస్ చీరలు తెచ్చి అమ్ముతుంటే రెండు వందల రూపాయలు పెట్టి జరీ బుటాలు , రిచ్ పల్లూ ఉన్న ఆలివ్ గ్రీన్ చీర ఒకటి అంతకుముందు కొనుక్కున్నాను . ఆ చీర కట్టుకుని లక్ష్మి గారింటికి వెళ్లేను . “రండి రండి , ఇంతాలస్యం చేసారేం అంటూ నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లేరు లక్ష్మి గారు . ఇల్లంతా లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది . లయన్స్ మెంబర్స్ కుటుంబాలతో సందడి సందడిగా ఉంది . మేడ మెట్ల మీద ఇన్ షర్ట్ చేసుకున్న తెల్లని బట్టల్లో విశ్వనాథ్ గారు ఎదురు పడ్డారు . నేను నమస్కారం చేసేను .ఒక్క క్షణం ఆయన చూపు నా మీద నిలిచింది . పైకి వెళ్లి శారద గార్ని పలకరించాను . కాస్సేపటి తర్వాత చిన్న సభా కార్యక్రమంలో ముగ్గురూ సినిమాల గురించి మాట్లాడేరు . చలం తాగి రావడం నాకు నచ్చలేదు . ఇదంతా జరుగుతున్నంత సేపు నా కళ్ళు మోహన్ కోసం వెతుకుతూనే ఉన్నాయి . భోజనాలు ముగిసి ఇంటికి చేరేసరికి పది అయ్యింది . నేను గుమ్మంలో అడుగు పెట్టగానే ఇంగ్లీష్ టీచర్ తో కబుర్లు చెప్తున్న మోహన్ లేచొచ్చి నా చెంప ఛేళ్ళు మన్పించాడు .” అయ్యాయా నీ తిరుగుళ్లు ? భోగందానిలాగా అలంకరించుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగొస్తావా !” అన్నాడు . ఆ దుర్మార్గానికి నేను కన్నీటి వరదైపోయేను . “మీ కోసం అందరూ అడిగేరు “అన్నాను . ”నిన్ను పిలిస్తే నీవెంటపడి నేనొచ్చేస్తాననుకున్నారా ? అసలు నిన్ను స్కూలు పెట్టనిచ్చి నేను చాలా పొరపాటు చేసానే . నీ కాళ్లు నేల మీద ఆనటం లేదు . నీ కొమ్ములు ఎలా కత్తిరించాలో నాకు తెలుసులే “ అంటూ బైటికెళ్ళిపోయేడు .
తెల్లవారే సరికి వాచిన చెంపనో , చిట్లిన పెదవినో కవర్ చేసుకుంటూ ముఖాన నవ్వు అంటించుకుని స్కూలు కోసం రెడీ అయ్యే దాన్ని . నా ప్రాణ సమానమైన నా పిల్లలు , వాళ్లకి అన్నం పెట్టే స్కూలు ఇవే ప్రధానమైనవి అప్పటికి నాకు . కష్టాల్ని , బాధల్ని బైటికి చెప్పుకోవద్దనే మొండి ధైర్యమేదోనన్నావహించి ఉండేది . దాంతో సమానంగా ఇలా బతుకుతున్నానేంటి అనే ఓ గిల్టీ ఫీలింగ్ కూడా నన్నంటిపెట్టుకుని ఉండేది . అలా గిల్టీలో ముంచేసిన ఎన్నెన్నో సంఘటనలు —

ఒకసారి మూవీ చూస్తున్నాం . ఇంటర్వెల్ లో లైట్లు వెలిగినప్పుడు రెండు వరసల ముందు కూర్చున్న ఒకతను రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి నన్ను చూసేడు . ఇంటికి రాగానే మోహన్ గొడవ మొదలు పెట్టేడు , “ అతనెందుకు నిన్ను అలా చూసేడు , మీ ఇద్దరికీ ఏమిటి సంబంధం ?” అంటూ , అతన్ని ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు . అతనెవరో నాకు తెలీదని చెప్పేను . అతను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పె క్టరట . ఒక దెబ్బ కొట్టడం , అతను నాకు తెలుసని ఒప్పుకోమనడం . చివరికి అర్ధరాత్రి పన్నెండు దాటేక పోలీసుల చేతిలో ఖైదీలాగ దెబ్బల బాధ భరించలేక తెలుసని అన్నాను . వెంటనే పేపరూ , పెన్నూ ఇచ్చి ఒక లెటర్ డిక్టేట్ చేసేడు . దాని సారాంశమేంటంటే – “ నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను ,వెంటనే రమ్మని “. దాన్ని పట్టుకుని మోహన్ బైటి కెళ్లి పోయేడు . అతన్ని పిల్చుకొచ్చి గొడవ పెడతాడేమోనని చాలా భయం వేసింది . వెంటనే రెండిళ్లకవతల ఉన్న మా నూజిళ్ళ మాస్టారింటికి వెళ్లిపోయేను . అంత రాత్రి వేళ అలాంటి పరిస్థితిలో నన్ను చూసి ఆశ్చర్యపోయినా , మాస్టారూ అక్కయ్యగారు సాదరంగా ఆహ్వానించేరు నేను వాళ్లని దాటుకుని వెళ్లి పుస్తకాల బీరువాల మధ్యలో చతికిల బడి పోయేను . తెలతెలవారేవరకూ నేను ఏడుస్తూను , వాళ్లు ఓదారుస్తూనూ ఉండిపోయేం .
ఇంకోపక్క స్కూలు కదా అని ఫీజు కట్టడానికి వచ్చే తండ్రులతో మృదువుగా , మర్యాదగా మాట్లాడితే వాళ్లు బైటి కెళ్లి ‘ ఆవిడకి నేనంటే చాలా ఇష్టం ‘ అని చెప్పుకొనే వాళ్లు .

మేమున్న ఇంట్లో ఉత్తరం వైపున్న మూడు గదుల్ని పది రూపాయలకి వేరే వాళ్లకి అద్దెకి చ్చే వాళ్లం . మొదట్లో స్కూల్ టీచర్స్ , తర్వాత పశువుల డాక్టర్ల కుటుంబాలు అద్దెకుండేవారు . నాకు వాళ్లతో కబుర్లు చెప్పేటంత తీరిక లేకపోయినా అందరూ స్నేహంగానే మసలే వాళ్లు . నేను M .A చదివేటప్పుడు డాక్టరు గారి భార్య తెల్లగా ఎత్తుగా మెరిసిపోతూ ఉండేది . ఒక్కొక్క చేతికీ డజను బంగారు గాజులు వేసుకునేది . వాళ్ల తండ్రి గారు పోలీసు డిపార్టు మెంట్లో ఉద్యోగం చేస్తూ నెలకో తులం బంగారం కొని దాచే వారట . కొంత అతిశయం ప్రదర్శించేది . నాకోసారి జలుబు చేస్తే “ మా బ్రహ్మలు తిన్నట్టు పాలూ పెరుగూ చిన్నప్పటి నుంచీ తిని ఉండరు కాబట్టి ఇప్పుడు తింటే మీకు పడవు “ అంది . రావి చెట్టుకి అవతలున్న ఇంటికి పొడవైన అరుగులుండేవి . ఈవిడెళ్లి ఆ ఇంటి అరుగుల మీద అమ్మలక్కలతో మాట్లాడేది . ఖాళీ సమయమంతా కబుర్లే కాలక్షేపం వాళ్లకి . నేనెంత గోప్యంగా దాచుకోవాలనుకున్నా నా ఇంటి విషయాలన్నీ ఆ అరుగుల మీదికి వెళ్లి పోయేవి . నేను ఎదుర్కొంటున్న కష్టాలు , సమస్యలు వాళ్లకి ఆనందం కలిగించే సంభాషణలయ్యేవి . నేను ఆదివారం ట్యూషన్ క్లాసులకి వెళ్తూంటే వెనక నుంచి నవ్వులు , ఎగతాళులు విన్పించేవి . “ ముదిమి వయసులో చదువులూ (పాతికేళ్లకే )…అని దీర్ఘాలు తీసేవారు . బొండా వారి వీధిలో వినాయకుణ్ణి నిలిపే అరుగు మీద సత్తులు అనే మిషను కుట్టుకునే వాడొకడుండేవాడు . నన్ను చూడగానే నా కులం పేరెత్తి ‘గొల్ల భామా ‘ అంటూ అడ్డమైన పాటలూ అందుకునే వాడు . నేను ఎక్కడా తలపై కెత్తి చూడకుండా వెళ్లిపోతూ ఉండేదాన్ని . రెండు మూడు నెలల తర్వాత ఇంట్లో ఏదో ప్రోబ్లమ్ వల్ల మంచి నీళ్ళ చెరువు గట్టు మీది నూతిలో పడి చచ్చి పోయేడు సత్తులు . ఎదుటి వాళ్లని ఏడిపించే వాళ్లంతా ధైర్యవంతులు కాదని నాకప్పుడే అర్ధమైంది .

మొదట్లో నేను గమనించుకోలేదు కాని మోహన్ మా ఇంగ్లీషు టీచరు బార్బరాతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని అర్ధమైంది . అడిగితే పెద్ద గొడవ చేసేసి ‘ నా ఇష్టం ‘ అన్నాడు . ఒకసారి మా అత్తగారు పశ్చిమగోదావరి జిల్లా నుంచి తన ఫ్రెండు అని ఒకావిడను తీసుకొచ్చేరు . నేను స్కూల్లోంచి భోజనం చెయ్యడానికి లోపలికి వచ్చేసరికి మోహన్ ఆవిడతో ఒకే మంచం మీద ఉన్నాడు . నేను భోరుమని ఏడ్చేస్తూంటే “ఏడవకమ్మాయ్ , ఆవిడకి చాలా డబ్బుంది , ఎంతో కొంత ఇస్తుంది “ అన్నారు . “ఛీ , డబ్బు కోసం ఎవత్తెనో ఇంట్లో పెట్టి కాపలా కూర్చునే పని నేను చెయ్యలేను “ అంటూ ఆవిడ మీద విరుచుకు పడ్డాను . ఆ మాట ఆవిడకి ఎక్కడో తగిలింది . “పెద్దంతరం , చిన్నంతరం , భయమూ , భక్తీ లేని గడుగ్గాయి ‘ అంటూ తిట్టిపోసి ‘ నీ కర్మ ఇలాక్కాలింది . ఎలాగేడుస్తావో ఏడు ‘ అని కొడుకుని తిట్టి వెళ్ళిపోయారు .

నా శరీరం మీద నాకే అసహ్యం పుట్టుకొచ్చింది . అతను నన్ను ముట్టుకున్నా భరించలేకపోయేదాన్ని . “ నువ్విక బార్బరాతోనే ఉండు , నా జోలికి రాకు “ అని వేడుకున్నాను . అతని పశుబలం ముందు నేనెంత ! చివరికి కండోమ్ వాడేలాగ ఒప్పించేను , క్రమంగా మేమిద్దరం శారీరికంగా , మానసికంగా దూరమయ్యాం అతనికి ఒక ఊరు నుంచి మరో ఊరికి ట్రాన్స్ఫ రైనప్పుడల్లా పదో , ఇరవయ్యో వేలు అప్పు తీర్చాలి . నువ్వు తెచ్చి ఇస్తావా లేదా అని నా పీక మీద కత్తి పెట్టేవాడు . చివరికి ఎవర్నో తీసుకొచ్చి ఆ డబ్బు వీళ్లిచ్చేరు అని నాచేత సంతకం పెట్టించే వాడు . ఆ అప్పు అంచెలంచెలుగా నేను తీర్చవలసొచ్చేది . ఎంత అత్యవసరమైనా తన జీతం నుంచి పది రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు . ఎప్పుడు చూసినా నేను డబ్బు ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉండేదాన్ని .

-కె .వరలక్ష్మి 

గత సంచికల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయగలరు 

నా జ్ఞాపకాలు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)