మేఘసందేశం-11 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు వ్యాసుని “చకారకుక్షి” అని సరదాగా అనేవాడట. మేఘ సందేశ శ్లోకాల్లోకి వెళ్ళబోయే ముందు దాని వివరమేమిటో తెలుసుకుందాం. మహాభారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంత పెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు అనుష్టుప్ ఛందస్సులో అక్షర నియతి తప్పిపోకుండా “చకారం” యెక్కువగా వాడారట! అందువల్ల కాళిదాసు ఆయన్ని చకార కుక్షి అని తమాషాగా అనేవాడు. కాళిదాసు విశ్వనాథుని దర్శనం కోసం ఒక సారి కాశీ పట్టణం వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక పరిచారకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి ” వీరు వ్యాసులవారు” అని పరిచయం చేస్తూ విగ్రహం చూపారట. కాళిదాసు చూడగానే “ఓహో వీరా! చకారకుక్షి” అంటూ విగ్రహం బొడ్డు లోనికి తన వేలు దూర్చారట. అంతే ఆ వేలు యిరుక్కుపోయింది. ఎంతకూ వూడి రాలేదు. కాళిదాసు ఇదేమిటని ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి “మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి ఒక్క చకారం కూడా లేకుండా ఒక శ్లోకంచెప్పు, అలా చెప్పగలిగితేనే నీవేలూడుతుంది” అన్నాడట. కాళిదాసు వినయంగా తలవంచి “తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం. ఊరక ఏదో వేళాకోళానికలా అంటాను అంతే… మరేమీ గాదు. క్షమించండి. మీవలె శ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి” అనిపలికి “శ్లో: ద్రౌపద్యా పాండుతనయాః పతి, దేవర, భావుకాః, నదేవరో ధర్మరాజః సహదేవో నభావుకః” అని వెంటనే శ్లోకం చెప్పగానే మెచ్చుకుంటున్నానయ్యా! మనుమడా! నీపాండిత్యానికి, చిరాయుష్మాన్భవ! అని ఆశీర్వదించారట. కాళిదాసు వేలు బయట పడింది. ఇంతకీ దీనికి అర్ధం ఏమిటంటే… “ద్రౌపదీదేవికి పాండవులతో భర్త, మరిది , బావగారు, అనేమూడురకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరిదికాడు, సహదేవుడు బావకాదు” అని దీని అర్ధం. చూశారా కాళిదాసు ప్రతిభ! ఆయన కాళికావర ప్రసాది గదా! ఆయన కవిత్వానికి ఈ భూమండలంలో తిరుగేముంది? మనం మరలా మేఘసందేశ వ్యాఖ్యానంలోకి వద్దాం.

శ్లో.46. జ్యోతిర్లేఖావలయి గళితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదళప్రాపి కర్ణే కరోతి,
ధౌతాపాంగం హరశశిరుచా పావకేస్తం మయూరం
పశ్చాదద్రిగ్రహణగురుభి ర్గర్జితై ర్నర్తయేథాః

భావం: కుమారస్వామి మయూర వాహనుడు కదా! ఆయన నెమలిని ఆనందింపజేసి, తద్ద్వారా స్వామి అనుగ్రహం పొందమని మేఘునితో యక్షుడు అంటున్నాడు. తన కుమారుని వాహనమైన నెమలి పింఛాన్నే, పార్వతి కర్ణాభరణంగా ధరిస్తుంది. కుమారసంభవాద్పూర్వం భవాని కలువదళాన్ని ధరించేది. ఇప్పుడు తన ప్రియపుత్రునిమీద తనకు గల ప్రేమను సూచించడానికి, తనంతట తానే జారిన బర్హిపింఛాన్ని ధరిస్తోంది. జగన్మాత అనుగ్రహం ఆ విధంగా పొందిన నెమలి అది. ఆ పింఛం కాంతులవరుసలతో చుట్టుకొనబడింది. “తనంతట తానే జారినది” అని ఎందుకంటున్నాడంటే నెమలిపురి నుండి తనంతట తానుగా వెలువడిన లేక వూడిన నెమలిపింఛాన్ని గ్రహించాలి తప్ప, మనం పింఛాన్ని నెమలి నుండి బలవంతంగా ఎప్పుడూ తీసుకోకూడదని అర్ధం. తెల్లనైన కేకినేత్రాలు హరుడు ధరించిన శశికాంతితో ఇంకా శుభ్రం అయ్యాయని, నెమలి నేత్రాలను వర్ణించాడు. శివానుగ్రహం కల నెమలి మేఘుని ఉఱుములు కొండగుహల్లో ప్రతిధ్వనించాకే వాటి గొప్పతనం తెలుస్తుంది. ఆ ఉఱుములకు మెఱుపులకు నెమళ్లు ఆనందించి, నాట్యం మొదలుపెడతాయి. అదే చేయించమంటున్నాడు మేఘునితో. ఉఱుములతో కూడా ఆటలు ఆడించమంటున్నాడు. కుమారస్వామి తన వాహనాన్ని ఆనందింపజేస్తే, ఆయన అనుగ్రహిస్తాడు కదా! అని అంటున్నాడు యక్షుడు.

శ్లో.47. ఆరాధ్యైనం శరవణభవం దేవముల్లంఘితాధ్వా
సిద్ధద్వంద్వై ర్జలకణభయాద్వీణిభిర్ముక్తమార్గః ,
వ్యాలంబేథాః సురభితనయాలంభజాం మానయిష్య౯
స్రోతోమూర్త్యా భువి పరిణతాం రంతిదేవస్య కీర్తిం.

భావం: శరవనం (ఱెల్లుగడ్డివనం) లో పుట్టిన సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించిన తర్వాత, దేవజాతిలో ఒకరైన సిద్ధులు వీణల్ని వాయిస్తున్న వారై ఆజంటలు వానచినుకులు తమ మీద పడతాయన్న భయంతో నీకు దారి ఇస్తారు కాబట్టి అక్కడినుండి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో నీకు ఒక నది కనిపిస్తుంది. ఆ నది ఎలాంటిదో తెలుసా మేఘుడా! గోవులవధవల్ల పుట్టి, భూమిమీద నదిలా మారిన రంతిదేవుని కీర్తి. అటువంటి ఆయన కీర్తిని అనగా ఆ నదిని సత్కరించడంకోసం కోసం దిగు.

విశేషము ఏమిటంటే.... శరం అంటే అంటే బాణం అని మనకు తెలుసు కానీ ఱెల్లుగడ్డి అనే కూడా అర్థం ఉంది. బాణాల్లా ఉన్న గడ్డే ఱెల్లుగడ్డి. అలాంటి దుబ్బులను శరవణం అంటారు. అందులో పుట్టిన వాడే శరవణభవుడు. శరవనం లో “న” మీద “ణ” ప్రత్యయం వస్తుంది. చెప్పుకోవాలంటే భగవంతునికి చేసే పూజలో ఎన్నో రకాల ఉపచారాలుంటాయి. ఆ సన్నిధిలో గానం, సంగీతం, నృత్యం మొదలైన లలితకళల ప్రదర్శన కూడా ఒకవిధమైన ఉపచారమే! అందువల్లనే తిరుమలలో శ్రీనివాసునికి నిత్యం “నాదనీరాజనం” ఒక ఉపచారంగా సమర్పించబడుతోంది. అందువల్ల సిద్ధమిథునాలు కుమారస్వామి ఎదుట వీణలు వాయించి ఆయనను ఆనందింపచేస్తున్నారు.

ఇక ఆ చర్మణ్వతీ నది కథ కూడా తెలుసుకోదగ్గదే! ఆ నది దశార్ణదేశంలో ఉంది. పూర్వం రంతిదేవుడనే మహారాజు యాగం చేయబోతూండగా, సురభి సంతానమైన గోవులు ఆయన వద్దకు వచ్చి మనుష్యభాషణాలతో తమను యాగంలో సమిధలుగా వ్రేల్చమని కోరాయి. వాటిని వధించడానికి రంతిదేవుడు సంశయించుచుండగా…అవి తప్పు కాదని పుణ్యమే వస్తుందని ప్రోత్సహించాయి. సరే. ఈ పనికి ఏ ఒక్క గోవు ఇష్టపడకపోయినా యాగం మానేస్తానని రంతిదేవుడు అని, సాగించిన యాగంలో వధింపబడిన గోవులు గోలోకాన్ని చేరాయి. ఆ గోవుల చర్మాలే ఒడ్లుగా వాటి రక్తం ప్రవహించి, నది నదిగా మారిందని అదే…చర్మణ్వతీ నదని అంటారు. అంతటి మహాయాగం చేసినందుకు ఆ రంతిదేవుని కీర్తికి తార్కాణంగా ఆ చర్మణ్వతీ నది ఉద్భవించినదని పురాణాలు చెబుతాయి.

అబేధాతిశయోక్తి అలంకారం: కీర్తి చర్మణ్వతీ నదులకు బేధమున్నట్లు అబేధముగా వర్ణించడం చేత అబేధాతిశయోక్తి అలంకారం ఈ శ్లోకంలో ఉన్నది.

శ్లో.48. త్వయ్యాదాతుం జలమవనతే శార్ఙ్గిణో వర్ణచౌరే
తస్యాః సింధో పృథుమపి తనుం దూరభావాత్ప్రవాహం,
ప్రేక్షిష్యంతే గగనగతయో నూనమావర్జ్య దృష్టీ
రేకం ముక్తాగుణమివ భువః స్థూలమధ్యేంద్రనీలం.

భావం: శ్రీకృష్ణుని వర్ణాన్ని దొంగిలించిన (నీలమేఘ శ్యామ వర్ణము) నీవు, ఆ చర్మణ్వతి నదిఒద్దకు పోయి, ఆ నీటిని తీసుకోవడానికి, వంగినప్పుడు, పెద్దదైనా దూరంగా ఉండటంవల్ల చిన్నదిగా ఉన్న ఆ నదీ ప్రవాహాన్ని పైన ఆకాశంలో పోయేవారు అనగా యక్ష, సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుషులు చూసి… ఆ నదిని భూమి ధరించిన ఒంటిపేట ముత్యాలహారంగాను, నిన్ను, ఆ ముత్యాలహారం నడుమ కూర్చబడిన ఇంద్రనీలమణిగా భావిస్తారని తన కార్యార్ధమై యక్షుడు మేఘుడిని పొగడుతున్నాడు.

విశేషo: విహంగ వీక్షణంలో మాత్రమే మనకు నదులు తెల్లగా ముత్యాల కోవలా కనిపిస్తుంది. కాళిదాసు దర్శనానికి మన సాధారణ దృష్టికీ అదే బేధం.

అలంకారం: 1. విష్ణువు రంగును మేఘం దొంగిలించ బడినట్లుగా వర్ణించబడినది. అది అసంభవము. కానీ తత్సమానమనే అర్ధం బోధింపబడడం వలన నిదర్శనాలంకారము.

లంకారం: 2. మేఘముతో గూడిన ప్రవాహము నీలమణి గూర్చిన ముత్యాల హారమా? అన్నట్లున్నదని సంభావించడం వలన ఉత్ప్రేక్షాలంకారము. “ఇవ” అనే శబ్దం చేత ఉపయోగింపబడినందున వాచ్యోత్ప్రేక్ష అలంకారము.

శ్లో.49. తాముత్తీర్య వ్రజ పరిచితభ్రూలతావిభ్రమాణాం
పక్ష్మోత్క్షేపాదుపరివిలసత్కృష్ణశారప్రభాణాం,
కుందక్షేపానుగమధుకరశ్రీముషామాత్మబింబం
పాత్రీకుర్వందశపురవధూనేత్రకౌతూహలానాం.

భావం: ఆ చర్మణ్వతీనదిని దాటి, వెళ్తూంటే దశపురస్త్రీలు నిన్ను కుతూహలంతో చూస్తారు. ఇలా నిన్ను చూడడం ఒక వారికి వేడుక అవుతుంది సుమా! వారి తీగల్లాంటి కనుబొమ్మల విలాసాలను, కొంచెం ధవళకాంతితో కూడిన నల్లనికాంతులు గలవి కావడం వలన మొల్లపూలవెంట కదిలే తుమ్మెదలకాంతిని అపహరించినవైన వారి కనుఱెప్పల్ని, ఆ నయనకాంతులను చూడడం నీకు నిజంగా వేడుక గా ఉంటుంది సుమా! అని యక్షుడు మేఘుడికి నివేదిస్తున్నాడు. ఉత్సాహ భరితుడిని చేస్తున్నాడు.

అలంకారం: తుమ్మెదల శోభను దొంగ్లించడం అసంభవం కనుక దానివంటి శోభ అని పర్యవసించుటచే నిదర్శనాలంకారము.

-వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

గత సంచికల కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు .

మేఘ సందేశం – టేకుమళ్ళ వెంకటప్పయ్య 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో