జ్ఞాపకాలు – 2 – కె. వరలక్ష్మి

మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ఫర్ అయ్యిందట . అక్కడి నుంచే మా అత్త గారొక సారి , మామగారొకసారి వచ్చి వెళ్లే వారు . ఆ సంవత్సరం సెలవుల్లో మేం పిల్లల్ని తీసుకుని కొరుప్రోలు వెళ్లేం . రెండు గదుల డిపార్టుమెంట్ క్వార్టర్స్ . పెద్ద కాంపౌండు లోపల చెట్లు , ఆఫీసు . పక్కనే రోడ్డు కవతల సంత . పెద్ద సైజు టేబులంతేసి పై డిప్పలున్న తాబేళ్లని నేనక్కడే చూసేను .చాలా మంది తాబేళ్ల మాంసం కొనుక్కెళ్లేవారు. కొరుప్రోలు నుంచి ముందుకెళ్తే చేపలు పట్టే జాలర్ల పల్లె , వాళ్ల పూరి గుడిసెల ముందు ఆరబెట్టిన చేపలు , సర్వీ చెట్ల వరసల కవతల పెద్ద పెద్ద కెరటాల హోరెత్తే సముద్రం , పక్కనే చిన్న కొండమీద గుడి – అద్భుతమైన దృశ్యం ఇప్పటికీ మనసులో హత్తుకుపోయింది . పిల్లలు ముగ్గురూ చెయ్యి వదిల్తే చాలు కెరటాల వైపు పరుగు తీసేవాళ్లు . వాళ్లతో సమంగా పరుగులు తీయడం , ఉన్న వారం రోజుల్లోనూ రెండు సార్లు వెళ్లేం .

మా అత్త గారి పెద్ద చెల్లిలికి ఆరోగ్యం బాగాలేక వైజాగ్ కె .జి .హెచ్ లో ఉంటే ఆమెను చూసుకుంటూ ఈవిడ అక్కడున్నారట . ఇంట్లో ఆఖరు పిల్లలు శాంత , రుక్మిణి మాత్రమే ఉన్నారు . వాళ్లే వాళ్ల నాన్నగారికి వండి పెడుతున్నారు . మోహన్ మమ్మల్ని దించేసి కోనసీమలో ఏదో సినిమా షూటింగ్ అవుతుందంటే వెళ్లేడు . మాతో మా పెద్ద తమ్ముడు , హాస్పిటల్లో ఉన్న ఆంటీ చిన్న కూతురు కూడా వచ్చేరు . టీనేజ్ లో ఉన్న వాళ్లిద్దరూ చెట్లంట పుట్టలంట పరుగులు తీస్తూ బాగా ఎంజాయ్ చేసే వాళ్లు .

క్వార్టర్స్ వెనకాల పలుగు , పారల్లాంటి డిపార్టుమెంటు సామాన్లు బోలెడన్ని ఉండేవి . వాటిల్లోంచి చిన్న సైజు గునపం ఒకటి , తవ్వుగోల ఒకటి పట్టుకెళ్లనా అని అడిగితే శాంత చక్కగా పేక్ చేసి సంచిలో పెట్టి మరీ ఇచ్చింది . మా పిల్లల కోరిక మేరకు తాబేలు డిప్పను కూడా తెచ్చుకున్నాం . మేమున్న ఇంటి కాంపౌండు లోపల పెద్ద ఖాళీ స్థలం ఉండేది . వచ్చిన మర్నాడు తవ్వు గోల తీసి గడ్డి మొక్కల్ని శుభ్రం చెయ్యడం మొదలు పెట్టేనో లేదో మామామగారు వచ్చేసారు . డిపార్టుమెంటు సామాన్లు అలా తేచ్చుకోకూడదంట . సంచిలో వేసుకుని పట్టు కెళ్లి పోయారు . ఇప్పుడంటే అలాంటివన్నీ షాపుల్లో దొరుకుతున్నాయి కాని అప్పటికి జగ్గంపేటలో అలాంటివేవన్నా కావాలంటే కమ్మరిని ఆశ్రయించాల్సిందే . మంచి పూల తోట పెంచేద్దామనుకున్న నా కల అలా ఆగిపోయింది అప్పటికి . మేం తెచ్చిన తాబేలు డిప్ప వీధిలో పిల్లలందరికీ గొప్ప ఆకర్షణ అయిపోయింది . స్కూలు పిల్లలు కూడా లీజరు టైంలో దాని పైకెక్కి దుమికి ఆడుతూండే వాళ్లు .

మా మామగారి తాగుడు అలవాటు ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపించ సాగింది . ఆయన తిరిగి రాజమండ్రికి బదిలీ చేయించుకుని వచ్చేసారట . మా అత్త గారు మాత్రం చెల్లెలికి సేవలు చేస్తూ ఉండిపోయారు .

ఒకసారి వచ్చినప్పుడు మా మామగారు మోహన్ దేనికో బైటికెళ్లడం చూసి “ అమ్మాయ్ , ఇలా రా అమ్మా “ అని పిలిచేరు . నేను ఆశ్చర్యపోతూ వెళ్లి ఎప్పట్లాగే నేల వైపు చూస్తూ నిలబడ్డాను .

“వరసగా నువ్వు పరీక్షలు పేసవడం చూస్తుంటేనే నువ్వెంత తెలివైనదానివో అర్ధమౌతుంది . మా ఎదవ నాలుగో సారిగాని ఇంటరు పేసవ్వలేదు . మీ అత్తగారు , ఈనా కొడుకూ ఒకే లాంటి తెలివి తక్కువోళ్లు. నువ్వు సంసారాన్ని దిద్దుకునే పద్దతీ , పిల్లల్ని పెంచుతున్న పద్దతీ చూస్తుంటే ముచ్చటేస్తంది . నేను సంపాదించింది వెనకేసింది ఒక్క పైసా లేదు . ఇంకా ఇద్దరాడ పిల్లలు పెళ్లికెదిగి ఉన్నారు . ఆళ్లనీ , మీ అత్తగార్నీ నువ్వే చూసుకోవాలమ్మా “ అన్నారు .

నేను ఆశ్చర్యపోయి ఆయన వేపు చూసేను .
అప్పటికే ఆయన ముఖం పీక్కుపోయి ఏదో మార్పు కనపడుతోంది . చటుక్కున నాకు కళ్లల్లో నీళ్లు తిరిగేయి .

“తప్పకుండా మావయ్య గారూ ! అయినా , మీకేం కాదు “ అన్నాను .
ఆయన ఒక నీరసపు నవ్వు నవ్వి “ఎళ్లమ్మా , పని చూసుకో “ అన్నారు . అదే ఆయన చివరిసారి జగ్గంపేట రావడం .
ఆ కాస్త పలకరింపుతో నాకాయన పట్ల ఒక పాజిటివ్ దృక్పధం ఏర్పడిపోయింది .

ఆయన స్థానంలో నన్నూహించుకుంటూ
“త్రాగాను మధువు
తలపులన్ని మరచుటకు “ – అంటూ ఓ కవిత రాసాను . అప్పటికి నా కవిత్వం ఇంకా ప్రేమ పరిధిని దాటలేదు. ఓ పొడవు నోట్ బుక్ లో రాయాలన్పించినప్పుడల్లా ఓ కవిత రాసేస్తూ ఉండేదాన్ని . వాటినిప్పుడు చదివితే “ఇది కవిత్వమా ?” అని నవ్వొస్తుంది . ఆ కవితల పుస్తకం నాస్కూల్ టేబుల్ మీద ఉండేది . వచ్చిన వాళ్లల్లో కొందరైనా అవి చదివి నేను కవిత్వం రాస్తానని అనుకోవాలని నాకు లోలోపల ఉండేది .అలాగే కొందరు చదివి ‘అబ్బా మీరు రాస్తారా ‘ అంటూండే వాళ్లు . ఈ మధువు కవిత చదివేక అందరూ నన్ను అనుమానంగా చూడ్డం మొదలెట్టేరు . దెబ్బకీ నా కవితల పుస్తకం ఇంట్లో అలమరలోకి వెళ్లిపోయింది . ఓరోజు మాకు దగ్గర్లో మునసబు గారి వీధిలో ఉన్న పోస్టాఫీసు నుంచి బంట్రోతు వచ్చి మాకు రాజమండ్రి నుంచి ఫోనొచ్చింది అని చెప్పేడు . అప్పటికే మోహన్ తన స్కూలుకెళ్లి పోయేడు . నేను వెళ్లేను పోస్టాఫీసుకి , అవతలి నుంచి మా చిన్న మామగారు మామామగారు కాలం చేసేరని చెప్పేరు . నాకు గాభారాతో నోట మాట రాలేదు . చేతిలో ఫోను మొయ్యలేనంత బరువెక్కి పోయినట్టన్పించింది . ఆ తర్వాత చాలా ఏళ్లకి మేం లేండ్ లైన్ ఫోన్ వేయించుకున్నాక కూడా ఫోన్ రింగైతే గుండె దడదడా కొట్టుకునేది . ఎందుకో కొన్ని భయాలు అలా ఉండిపోతాయి .

అక్కడి కార్యక్రమాలన్నీ ముగిసేక మా అత్తగారు , శాంత , రుక్కు జగ్గంపేట వచ్చేసారు . ఒక గోనె సంచిలో వంట సామాగ్రి , రెండు సంచుల్లో బట్టలు పట్టుకుని . ఇల్లు పెద్దది కావడం వల్ల ఇబ్బందేం లేదు కాని ఇంట్లో మా అమ్మా వాళ్లు ఇచ్చిన నవారు మంచం తప్ప మరో మంచం లేదు . ఒక మడత మంచం ఉండేది కాని అదీ శిధిలావస్త కొచ్చేసింది . ఇంట్లో ఒక ఫేను కూడా లేదు . అత్తయ్య గారికి నవారు మంచం ఇచ్చేసి మేమంతా గచ్చు మీద పడుకునే వాళ్లం . కోనేరు పేటలో ఉండే ఇనప మంచం – అచ్చు హాస్పిటల్స్ మంచం లాంటిది – వాళ్ల అమ్మమ్మగారింట్లో విప్పి పెట్టి ఉంటే మోహన్ వెళ్లి దాన్ని పట్టుకొచ్చేడు . కొత్తగా పెట్టిన ఇనప బీరువాల కొట్లో మొదటి వాయిదా కట్టేసి ఒక బీరువా తెచ్చేడు . ఇప్పట్లాగా ఇంటి కోసం ఫర్నిచర్లు కొనుక్కోవాలనే కాంక్ష ఉండేది కాదు , ఉన్నా డబ్బు ఎక్కడిది ? ఇక వంటింటికి కావాల్సిన కొద్దిపాటి గిన్నెలు తప్ప సెట్లు సెట్లు కొని పెట్టుకోవడం నాకు ఇష్టముండదు , ఎలాగూ అందరం కలిసే ఉంటాం కాబట్టి అత్తయ్య గారు తెచ్చిన సంచి విప్పి ఆ గిన్నెలు కూడా వాడడం మొదలు పెట్టేం .

శాంత , మా చిన్న చెల్లెలు కుమారి మంచి పనిమంతులు . వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా . వంటతో సహా ఇంటి పనంతా చక్క బెట్టేసే వాళ్లు . నాకు చదువుకోవడానికి కొంత తీరిక దొరికేది . మా అత్తగారు ఉదయం లేస్తూనే బైబిల్ చదువుతూ కూర్చునేవారు . టిఫిను , భోజనం అన్నీ ఆవిడ కూర్చున్న చోటికే అందేవి . ఒక వారం తర్వాత అలా ఒక్కరే చదువుకోవడం విసుగన్పించి నట్టుంది . చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్లి సువార్త విన్పించబోయేవారట . ఆవీధి మొత్తం బ్రాహ్మలు , కోమట్లు . ఎవరూ వినేవారు కాదట .దూరంగా ఉన్న దళిత పేటను వెతుక్కుంటూ వెళ్లేవారు . అప్పటికి దళితుల్లో కూడా క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు . రాజమండ్రి లాంటి బస్తీలో పుట్టి పెరిగిన ఆవిడకి జగ్గంపేట లాంటి పల్లెలో ఉండడం కష్టమైపోయేది కాబోలు , తరచుగా రాజమండ్రి వెళ్ళిపోయే వారు .

మా అమ్మ బియ్యం బస్తా విప్పిన వెంటనే , వంటకు బియ్యం తీసుకున్న తర్వాత నా చేత బియ్యంలో “శ్రీ “ అని రాయించేది . ఆ అలవాటు ఉండిపోయి నేనూ అలాగే చేసేదాన్ని . ముత్తా గొల్ల అనే రైతు ఆయన్ని నేను బాబాయ్ అని పిలిచే దాన్ని . తన ఇద్దరు మనవరాళ్ల స్కూల్ ఫీజు కి బదులు కిచిడీ బియ్యం బస్తాలు వేసే వాడు .అప్పటికి కిచిడీ లంటే ఒకటో రకం సన్న బియ్యమన్న మాట . అన్నం చాలా రుచిగా ఉండేది . ఎక్కువ రోజుల పంట , మంచి బలవర్ధకం అని చెప్పుకొనేవారు .
ఇలా బియ్యంలో శ్రీకారం రాసే నా అలవాటు మా అత్తింటి వాళ్లకి వేరే అర్ధంలో కన్పించింది . కోనేరు పేటలో మా అత్త వారింట్లో కూడా నేనలాగే రాసేదాన్ననే విషయం మరచిపోయారు . నేను స్కూల్లో బిజీ అయిపోయి వాళ్లు వండి పెట్టడమే మహద్భాగ్యం అనుకునే దాన్ని . నాకెప్పుడూ ఊహలోకి కూడారాని విషయం వాళ్లకి తట్టింది . వాళ్లు బియ్యం తీసి అమ్మేసుకుంటారని నేనలా రాస్తున్నానని అందరితో చెప్పడం మొదలు పెట్టేరు .

అలాగే చిట్టబ్బాయిరెడ్డి గారింట్లోంచి , రామబ్బాయి రెడ్డి గారింట్లోంచి చిక్కటి గేదెపాలు ఉదయం , సాయంత్రం వచ్చేవి .బొగ్గుల కుంపటి మీద మరిగి మందంగా మీగడ కట్టేది . ఇంట్లో పాలు , పెరుగు పుష్కలంగా ఉండేవి .మీగడ పెరుగును పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు . అలా తినని రోజు మజ్జిగ చిలికితే వెలక్కాయంత వెన్న ముద్ద వచ్చేది . ఇంట్లో కాచిన కమ్మని నెయ్యి భోజనాల దగ్గర తప్పని సరిగా ఉండేది . హార్లిక్స్ సీసాలో ఉన్న నెయ్యిలో వేసిన చెంచాకి కూడా వాళ్లు విపరీతార్ధం తీసారు .చెంచా ఎక్కడి వరకూ ములిగిందో నేను కొల్చుకుంటానని అన్నారు .

నిజానికి నా ఆలోచనలెప్పుడూ ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఉండేవి కాదు . స్కూలు డెవలప్ చయ్యడం మీద , నా చదువు మీద ఉండేది . ఇలాంటి విషయాలకి నాలో నేనే ఏడ్చుకుని కన్నీళ్లు తుడుచుకునే దాన్ని .అప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంటు ఉద్యోగులకి పెన్షన్లు ఉండేవి కావట . ఆ సంవత్సరం నుంచి ఇవ్వచ్చు అనుకున్నారట . మోహన్ ఆపని మీద తరచుగా హైదరాబాద్ వెళ్లి వచ్చేవాడు . వాళ్లమ్మ గారికి ఫేమిలీ పెన్షన్ తెప్పించడానికి , అసలే ఖర్చు మనిషేమో ఆ వంకతో ఎడాపెడా అప్పులు చేసేసేవాడు . మొత్తానికి పెన్షను సేం క్షనై ఎరియర్స్ ఏవో వచ్చినట్టున్నాయి . ఆ వారంలో వెళ్ళిన మా అత్తగారు అక్కడే ఉండిపోయారు . వీకెండ్ కి మోహన్ వెళ్లినప్పుడు తల్లీ కొడుకూ గొడవ పడ్డారట . అంతే , ఆవిడ అక్కడే ఉండిపోయింది . ఆకబురెలా అందిందో తెలీదు – నేను స్కూలు నుంచి లోపలికి వెళ్లే సరికి శాంత , రుక్కు బట్టలు , గిన్నెలు సర్దేసుకున్నారు . నేను తెల్ల బోయి చూస్తూ ఉండగానే చార్జీలకు డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళిపోయేరు .ఏడాదిగా అలవాటు పడిన ఇల్లు చిన్నబోయింది .

మోహన్ కి జీతమెంతో తెలీదు .ఆవిడకు పెన్షను ఎంతో తెలీదు . గవర్నమెంటు సర్వీసులకి పెన్షనొస్తుందని కూడా నాకు తెలీని అజ్ఞానం అప్పటికి .

ఆ కొద్ది కాలంలోనూ రుక్కు వల్ల నేను చాలా భయస్తురాలినైపోయేను . ఎదిగిన పిల్ల – రెండు మూడు సార్లు రాజమండ్రి , ఒకసారి సామర్లకోట పారిపోయింది. మోహన్ వెతికి వెతికి తీసుకురావడం . ఆ తప్పు నాదేనని మా అత్తగారు తిట్టడం . దీపావళి రోజు కొత్త టెర్లిన్ వోణీ వేసుకుని మా చిన్నమ్మాయిని చంకనేసుకుని ప్రమిదల పక్కనే నిలబడి మతాబు కాలుస్తోంది . ప్రమిద దీపం వోణీకి అంటుకుని ఒక్కసారిగా మంట ఎగసింది . వాకిట్లో దీపాలు పెడుతున్ననేను ముందు పాపాయిని లాక్కుని , తర్వాత ఓణీ లాగి పడేసాను . అప్పుడు కూడా మా అత్తగారు బాగా తిట్టేరు . “ నా కూతురు కన్నా నీ కూతురు ఎక్కువైపోయిందా ‘ అంటూ . ఆవిడలా మాట్లాడ్డం వల్ల రుక్కు చాలా పెంకితనం నేర్చుకుని చేతి కందకుండా పోయింది . మరో పక్క ఉత్త అమాయకత్వం .

మొత్తానికి ఏమైతేనేం శాంతకీ , రుక్కుకి కొరుప్రోలు అబ్బాయిల్తో పెళ్లిళ్లు అయ్యేయి .

– కె. వరలక్ష్మి

గత సంచికల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయగలరు 

నా జ్ఞాపకాలు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకాలుPermalink

One Response to జ్ఞాపకాలు – 2 – కె. వరలక్ష్మి

  1. Chalapatirao says:

    గత సంచికలు వరుసగా చూడడానికి వీలుగా l’educazione. దీనికి వీలు కల్పించే విధంగా వెబ్సైటు లో మార్పులు తెస్తే బాగుంటుంది. ప్రయత్నించండి. శ్రీమతి వారలక్ష్మిగారి కధనం బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)