ఓ శిరి(ష్ ) కథ (కథ )- శివలీల కె

నల్లటి మురికినీరు… పడమర ఒడిలో దాక్కోబోతున్న భానుడి స్పర్శకు మరింత నల్లగా కనిపిస్తోంది. సూర్యకాంతిని తనలో దాచుకున్న చిన్నచిన్న తరంగాలు అప్పుడప్పుడూ చమక్కున మెరుస్తూ చటుక్కున మాయమవుతున్నాయి. కనుచూపుమేర వెలుగుపువ్వుల్లా కనిపిస్తున్న ఆ మెరుపుల్నే తదేకంగా చూస్తోంది సిరి.

కాటన్ చీరలో నిండు ముత్తైదువలా ఉంటుంది ఆవిడ. పసిమి దేహచ్చాయ. రూపాయి బిళ్లంత బొట్టు. చెరగని చిరునవ్వు. కాటుక కళ్ల మాటున దాచుకున్నా దాగని కరుణ. చూడగానే చేతులెత్తి దండంపెట్టే రూపు. యాభైఏళ్లుంటాయి తనకి.

కొన్నాళ్ల కిందట జబ్బుచేసి వంట్లో సత్తువ లేకుండా అయిపోయింది. మనిషి తగ్గిందేమో కానీ, రంగుమాత్రం తగ్గలేదు. బయటికెళ్లి పనిచేసే ఓపికలేదు. అలా అని ఇంట్లో ఖాళీగా కూర్చోనూ లేదు. అప్పుడప్పుడూ ఓ రెండు గంటలపాటూ నడిచి ఊరి చివరగా ఉన్న నాలా వరకు వస్తుంది. ప్రవహిస్తున్న నాలాను చూస్తూ బ్రిడ్జిపై కూర్చుంటుంది. ఈ మధ్య ఆమెకిది ఓ దినచర్యలా మారింది. ఒక్కరోజు నాలా దగ్గరికి రాకపోతే ఏదో కోల్పోయిన భావన.

అక్కడున్న దుర్వాసనకు మనిషన్నవాడెవ్వడూ ఆ చుట్టుపక్కలకి రాడు. కానీ తనకెందుకో ఆ వాసనంటే కడుపులో తిప్పదు. రోజులు గడుస్తున్న కొద్దీ మురికికాలువ అంటే మమకారం పెరిగిపోతోంది సిరికి. అక్కడ కూర్చుంటే ఎన్నడూ లేనంత మనశ్సాంతిగా ఉంటోంది. నాలా తన రెండు చేతులూ చాపుకుని ‘రా… రమ్మని’ పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది.

ఇది సూయిసైడల్ ఇన్స్టింక్ట్ కాదు. అసలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు తను. ఇలా ఆలోచిస్తున్న సిరికి తెలీదు…కొద్దిరోజుల్లో తనుకూడా నాలాలో కలిసిపోతుందని. దాని ప్రవాహంతోపాటూ కదిలిపోతుందని!!!

సూరీడు మెల్లగా అస్తమించాడు. తనతోపాటే వెలుగుపువ్వులను కూడా తీసుకెళ్లాడు. రవి కిరణాలతో అప్పటివరకూ మెరిసిన మురికి నీరు ఇప్పుడు నల్లగా మారిపోయింది. నాలా రెండుచివరలా బారులు తీరిన చెట్లు గాలికి నిశ్శబ్ధంగా ఊగుతున్నాయి.

ఎందుకో భయమేసింది సిరికి. ఒక్క క్షణంలో ఎంత తేడా. చుట్టూ పరికించి చూసింది. దూరంగా కనిపిస్తున్న ఇళ్లలో మిణుకుమిణుకు మంటూ లైట్లు వెలుగుతున్నాయి.

ఇంతలో…ఓ వ్యక్తి మోపెడ్ పై వచ్చి తమ పవిత్రమైన ఇంటి చెత్తనంతా నాళాలో కుమ్మరించాడు. వెనక్కివెళుతూ తనని చూసి వంకరనవ్వోటి నవ్వినట్టున్నాడు. అందుకు నిదర్శనంగా అతని తెల్లటి పళ్లు కనిపించాయి. మరోనాడైతే బూతులు తిట్టేదేమో తను. ఈ రోజెందుకో కోపం రావట్లేదు.

ఎవరో గట్టిగా నవ్వుతున్నశబ్దం విని అటువైపు చూసింది సిరి. ఇద్దరు మగవాళ్లు. తననే చూస్తున్నారు. తనవైపే అడుగులేస్తున్నారు. ఇక అక్కడ ఉండడం మంచిది కాదనుకుని ఇంటికి బయల్దేరింది. వారు వెంబడిస్తున్నారని అనిపించగానే నడకలో వేగం మరింత పెంచింది. దానితో పాటే గతం తాలూకు జ్జ్ఞాపకాలు ఆమెను వెంబడించాయి.

                                       *****                                                     *****                                      *****

‘నా బంగారం. నాతోనే ఉంటూ నాకెప్పుడూ సాయంగా ఉంటాడు. ఎన్ని పనులు చేస్తాడని వదినా. ఆవకాయ పెట్టడానికి మామిడి ముక్కలన్నీ కొట్టిచ్చాడు నిన్న. చేతులు ఎరుపెక్కినా సాయం చేయడం మాత్రం ఆపలేదు’ అమ్మ పక్కింటావిడతో గర్వంగా చెబుతోంది.

‘నా కొడుకూ ఉన్నాడు ఎందుకు. చిన్న పుల్ల అటు తీసి ఇటు పెట్టడు. కనీసం బ్యాగులో పుస్తకాలు కూడా సర్ధుకోవడం రాదు. నీ కొడుకుని నాకిచ్చెయ్ వదినా. చచ్చి నీ కడుపున పుడతా’ నవ్వుతూ అంటోంది ఆమె.

పక్కనే కూర్చుని వాళ్ల మాటలు వింటున్న శిరీష్ తలొంచుకుని సిగ్గుపడ్డాడు. అవును. శిరీష్. అదే తన పేరు. తనకి అమ్మానాన్నా పెట్టిన పేరు. తనని అప్పుడు అందరూ అదే పేరుతో పిలిచేవాళ్లు.

‘ఆడపిల్లలా ఆ సిగ్గెంటోయ్. సిగ్గుపడుతుంటే ఎంత ముద్దుగా ఉంటాడు వీడు. నా దిష్టే తగిలేట్టుంది నా బిడ్డకు’ మురిపెంగా అంటోంది అమ్మ నాతో.

‘ఎంతందంగా ఉన్నాడో చూడు. వీడు అమ్మాయిగా పుట్టుంటే, మీ ఇంటి ముందు క్యూ కట్టే వాళ్లు అబ్బాయి తల్లిదండ్రులు

రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు శిరీష్ పదోతరగతి. తోటి అబ్బాయిల శరీరంలో వచ్చిన మార్పులు శిరీష్ కి రాలేదు.

‘ఈ ఆడంగి పనులేంట్రా నీకు. చిన్నప్పుడంటే ఏదో సరిపోయింది. ఇకనైనా ఇలాంటివి మానుకో. ఏ ఒక్కరికి తెలిసినా నలుగురి చెవిలో వేస్తారు. లే… లేచి అన్నయ్య దగ్గర కూర్చోపో…అప్పుడైనా కొంచెం బుద్దొస్తుంది నీకు’ ఓరోజు కిచెన్ లో కూర్చుని కూరగాయలు తరుగున్న శిరీష్ ని కసిరింది అమ్మ.

అమ్మ ప్రవర్తన లో మార్పును కొన్నాళ్లుగా గమనిస్తున్న శిరీష్ మౌనంగా హాల్లోకి నడిచాడు శిరీష్.

అన్నయ్య సోఫాలో కూర్చుని చదువుకుంటున్నాడు. అతడి పక్కనే కూర్చున్నాడు శిరీష్.

‘వచ్చావా నాయనా… నీవల్ల ఫ్రెండ్స్ మధ్య నా పరువు పోతోంది’ ఛీకొడుతూ వేరే గదిలోకి వెళ్లిపోయాడు అన్నయ్య.

ఆ మాటలకు చెల్లి కిసుక్కున నవ్వింది.

ఆ నవ్వు తెరలు తెరలుగా మారి శిరీష్ చెవుల్లోకి దూసుకెళ్లింది. అప్పటికే కుమిలి, కుంచించుకుపోయిన అతని చిన్ని గుండెని నిర్థాక్షీణ్యంగా కోసింది. ఆ అబ్బాయి మనసులో చెప్పలేనంత వ్యధ. హ్రుదయాన్ని వడిచేసి పిండినట్టుగా. ఆ నవ్వుకి అతడు ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం మర్చిపోయినట్టుగా!!!

భరించలేనంత బాధగా ఉంది శిరీష్ కి. తనను తాను కాపాడుకోలేని అసహాయత. హేళన చేసేవారిని ఎలా ఎదుర్కోవాలో తెలియని అమాయత్వం. పొద్దున్నే లేచి అమ్మకి మొహం చూపించాలంటే భయం. నాన్నకు ఎదురుపడాలంటే సిగ్గు. స్కూలుకు వెళ్లాలంటే మొహమాటం. ప్రతిపనికీ హేళనచేసే తోటి విధ్యార్థులను, ప్రతి క్షణం తనని తప్పించుకు తిరిగే తోబుట్టువులను చూస్తే కట్టలు తెంచుకునేంత దుఃఖం.

ఈ స్థితికి కారణం తను కాదు. ఈ పరిస్థితి తను కోరి తెచ్చుకున్నదీ కాదు. కానీ ఎవరితో చెప్పుకోవాలి. ఎవరు అర్థం చేసుకుంటారు. పరాయివారు అవమానిస్తే తనవారితో చెప్పి ఊరట చెందేవాడేమో. చివరికి తన వాళ్లుకూడా నిందిస్తుంటే ఎవరికి చెప్పుకోగలడు.

సంవత్సరం గడిచిపోయింది. పదోతరగతి ఫస్టు క్లాసులో ప్యాసయ్యాడు శిరీష్. ఎవ్వరి మొహంలో ఆనందంలేదు.

కాలేజీలో జాయినయ్యాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. అవమానాలను, హేళనలను పక్కనపెట్టి చదువుపై దృష్టి పెట్టాడు.

కాలేజీలో ఒక లెక్చరర్ శిరీష్ ని కావాలనే టచ్ చేసేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా భుజం మీద చేయేసేవాడు. పెద్దగా పట్టించుకోలేదు శిరీష్. తనకేదో డౌట్ వస్తే క్లారిఫై చేసుకుందామని ఒంటరిగా లాబ్ కి వెళ్లాడు శిరీష్. అదే అదనుగా తీసుకుని చేయికాస్తా కిందకు జరిపి నడుంమీద ఉంచాడు. లెక్చరర్ కళ్లలోకి సూటిగా చూశాడు శిరీష్. ఒకింత ఆశ్చర్యంగా, మరికొంత ప్రశ్నార్థకంగా. బదులుగా వెకిలి నవ్వోటి నవ్వాడు లెక్చరర్.

ఏదో అలజడి. తనకి తెలియనిది, జరగకూడనిది ఏదో జరుగుతోంది. తనకి ఇష్టంలేని ఆ స్పర్శలో తేడాని శరీరం సరిగ్గానే అర్థం చేసుకుంటోంది. అక్కడి నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటూ మెదడు పదేపదే సంకేతాన్నిస్తోంది. ఒక్కసారిగా తన చేయివిదిలించుకుని పరుగులాంటి నడకతో బయటికొచ్చాడు శిరీష్. ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. రోజులు గడవడం మరింత భారమైంది.

‘శిరీష్ ని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లండి. మారతాడేమో’ ఆశగా నాన్నతో అంటోంది అమ్మ.

అమ్మ మాటలు విన్నారు. ఆలోచించారు. నాన్న ఆశలకు రెక్కలొచ్చాయి. మరుసటిరోజే పొలం తాకట్టు పెట్టాడు. తరువాతి రోజు కొడుకుని సైక్రియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్లారు.

రెండుగంటల పాటు కౌన్సిలింగ్ చేసిన ఆయన ‘ఏం పర్వాలేదండీ… ఇంతకన్నా మొండి కేసులను డీల్ చేశాను నేను. ఈ టాబ్లెట్స్ వాడండి. ఆరునెలల్లో మారిపోవడం ఖాయం’

‘నిజంగానా అండీ…’ నాన్నకంఠంలో ఆనందం.

‘నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్…టాబ్లెట్స్ మాత్రం క్రమం తప్పక వాడాలి మరి. వారానికో సారి కౌన్సిలింగ్ కు రావాలి’

శిరీష్ కి కూడా చాలా ఆనందమేసింది. ఈ ప్రపంచంలో ఇంతకన్నా తనకు కావల్సింది ఏదీ లేదనిపించింది. తన బాధలన్నీ ఆర్నెళ్లలో తీరిపోతాయి. అనందంగా ఇంటికి చేరుకున్నాడు.

క్రమం తప్పకుండా మందులు వేసుకున్నాడు. గంటల తరబడి కౌన్సిలింగ్ తీసుకున్నాడు. ఆర్నెల్లు గడిచాయి.

మార్పులేదు.

‘ఇక నావల్ల కాదండీ. ముంబైకి తీసుకెళ్లండి. బాగా ఖర్చవుతుంది మరి’

నిరాశతో వెనుదిరిగారు. తండ్రీకొడుకులిద్దరూ.

ముంబైకి తీసుకెళ్లడమా? వద్దా? ఆ దిగువ మధ్యతరగతి తండ్రిలో అంతర్మథనం. కళ్లముందు పిల్లాడలా తిరుగుతుంటే చూడలేకపోతున్నాడు. కానీ ఒక్క పిల్లాడికోసం తలకు మించిన ఖర్చు చేయడం సబబుగా అనిపించలేదు ఆయనకి.

మనసుని ఓడించాడు. ముగ్గురు పిల్లల తండ్రిని గెలిపించాడు.

‘ఒరేయ్, నీకోసమే మరిన్నిఅప్పులు చేస్తే ఎలా. ముందు ముందు పెద్ద ఖర్చులు బోలెడున్నాయి. చెల్లి పెళ్లి చేయాలి. అన్నయ్యను ఇంజనీరింగ్ చదివించాలి. ఇక ఇంతటితో నా ప్రయత్నాలు ఆపేస్తున్నాను రా’ సూటిగా చెప్పేశాడు.

అమ్మ కళ్లొత్తుకుంది. ఏమీ మాట్లాడలేదు. కనీసం కళ్లెత్తి కొడుకు వైపైనా చూడలేదు.

ఇంటర్ పూర్తయింది. అత్తెసరు మార్కలు. ఏమిటని కూడా ఎవ్వరూ అడగలేదు. హోటల్ మేనేజ్ మెంట్ లో జాయిన్ అయ్యాడు శిరీష్. రోజులు గడిచేకొద్దీ…అబ్బాయిలను చూస్తే ఏదో ఫీలింగ్. అమ్మాయిలతో చాలా చనువుగా వాళ్లలో ఒకరిలామెలగాలన్నఆలోచన. మొక్కలా మొలిచింది. శిరీష్ కే తెలియకుండా అతనిలో మరింత బలంగా నాటుకుపోయింది.

తను ఎవరు? మిలియన్ డాలర్ ప్రశ్న. ఎవరితో స్నేహం చేయాలి? వివరించలేని సమీకరణం. ఈ పెనుగులాటల్లోనే హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి  చేశాడు శిరీష్.

                                  ********                                     *********                                            **********

‘ఓ సంబంధం చూశాను. చాలా మంచి కుటుంబం. అమ్మయి కూడా హోటల్ మేనేజ్ మెంట్ చేసింది. పెళ్లి చేస్తేనన్నా వీడు మారతాడేమో చూద్దాం’ ఓ రాత్రి నాన్న అమ్మతో అంటున్నారు.

మంచినీళ్లకోసం హాల్లోకి వచ్చిన శిరీష్ కు ఆ మాటలు చెవినపడ్డాయి.

అమ్మ ఏదో చెబుతోంది. ఇక అక్కడే ఉండి మాటలు వినడం సభ్యత కాదని తన గదిలో కూర్చున్నాడు.

తన జీవితమే తనకు ఇంకా అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడం తనకిష్టం లేదు. అదేమాట నాన్నతో అన్నాడు.

‘నీ పద్ధతి మార్చుకో. లేదా నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు. అసలే చుట్టాల మధ్య తలెత్తుకు తిరగలేకపోతున్నాం మేం. పెళ్లొక్కటే దీనికి పరిష్కారం’ కరుకుతనం తప్ప కరుణ లేదా స్వరంలో.

నాన్నకళ్లల్లోకి చూశాడు.

ఆయన ఇక మాట్లాడేదేమీ లేదంటూ బయటికెళ్లిపోయారు.

సపోర్టు కోసం అమ్మవంక చూశాడు. నాన్నమాటే తన మాట అన్నట్టుగా చూసి, తలదించుకుంది.

తోబుట్టువులను చూడబోయాడు. ఆ అవసరం లేకుండానే ముఖం తిప్పుకున్నారు.

అందరి కళ్లలో ఒకే భావం. తనను ఎలాగైనా వదిలించుకోవాలి. లేదా దారికి తెచ్చుకోవాలి. అందుకోసం ఏం చెయ్యడానికైనా రెడీ అన్నట్టున్నాయి వారి చూపులు.

బహుశా ఇది తన ఇల్లు కాదేమో. నేనుండాల్సిన చోటు ఇది కాదేమో. విచిత్రమైన ఆలోచన. మొలకెత్తింది. లిప్తపాటులో మానులా ఎదిగిపోయింది.

గదిలోకెళ్లి హోటల్ మేనేజ్ మెంట్ సర్టిఫికేట్లతో బయటికొచ్చాడు.

చేతిలో చిల్లిగవ్వలేదు.

నాన్నని అడగాలంటే అభిమానం. కనీసం అమ్మయినా ‘డబ్బులున్నాయా నాన్నా’ అని అడగనూలేదు.

వెనక్కి పిలుస్తారేమో అన్న ఆశ. గేటు దాటేవరకే కాదు… ఊరు దాటేవరకూ వెంబడించింది. ట్రైనెక్కాడు. దూరమైపోతున్న ఊరిని చూస్తూ ఉండిపోయాడు. ఊరు దూరమైనా… తన ఇల్లు… ఇంటివాళ్లు కళ్లముందే ఉన్నట్టు అనుభూతిచెందాడు. అలాఎంతసేపు ఉన్నాడో తెలియదుగానీ… టికెట్ కలెక్టర్ గదమాయింపుకి ఉలిక్కిపడి చుట్టూ చూశాడు.

‘టికెట్టెక్కడ. ఎక్కడికెళ్లాలి. చెవుడానీకు ఎన్నిసార్లు పిలవాలి’ విసుగ్గా ఉందతని గొంతు.

ఎటెళ్లాలో తెలియదు. అసలు ట్రైన్ ఎక్కడికెళ్తుందో కూడా తెలీదు.

‘నేనాండీ….మరే’ నసిగాడు.

కిసుక్కున నవ్వారు మిగిలిన ప్యాసింజర్స్. వాళ్లలో వాళ్లే ఏదో చెప్పుకుంటున్నారు.

పక్కకొచ్చి నిలబడింది ఒకామె. ఆమె… అతడిలా ఉన్న ఆమె.

‘ఇదిగో కండెక్టరు బాబు. మా మడిసి. టికెట్టు నే తీసుకుంటా’

పక్కనే కూర్చుంది. వణుకుతున్న చేతిని తన చేతులోకి తీసుకుంది. బాధలన్నీ తెలుసుకుంది. తనకి ఏడుపొస్తే…ఆమెకూడా కన్నీళ్లు కార్చింది. తనతోపాటు హైదరాబాద్ తీసుకొచ్చింది. ఓ ఇల్లు చూపించి, అదే మనిల్లంది. మనలాంటి వాళ్లు చాలమంది ఇక్కడ ఉంటారని చెప్పింది. మనందంతా ఒక ఫ్యామిలీ అంది. శిరీష్ ను అందరికీ పరిచయం చేసింది. సిరిగా మార్చింది.

రోజులు గడుస్తున్నాయి. ఏదో కొత్త లోకంలో సంచరిస్తున్న ఫీలింగ్. తనకిష్టమైనట్టు బతకొచ్చు. కావాల్సిన బట్టలు తొడుక్కోవచ్చు. కానీ ఇక్కడి వాళ్లందరికీ ఓ పీడకల ఉంది. అదే ‘ఆకలి’. అది తీరడానికి వాళ్లు చేస్తున్న పనులు వెన్నులో వణుకు పుట్టించేవి.

మంచి ఉద్యోగం సంపాదించి నా కాళ్లమీద నేను నిలబడతాను అనుకున్నాను. కానీ త్వరలోనే తెలిసొచ్చింది అదంత సులువుకాదని. వేషం, భాష, నడత, నడక ఇవన్నీ తన శత్రువులే అన్నవిషయం అర్థమవడానికి సిరికి ఎంతోకాలం పట్టలేదు.

ఇంటర్వూ చేయకుండానే తనని రిజెక్టు చేశాయి కొన్నికంపెనీలు. ఆఫీస్ లోకి కూడా అడుగుపెట్టనివ్వకుండా గెంటేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఇంటర్వూలు. ఏదైనా ఉద్యోగం దొరక్క పోతుందా అన్న ఆశ. కొన్ని సార్లు ప్యాంటు షర్టులతో, మరికొన్ని సార్లు చుడీదార్ తో ఇంటర్వూకెళ్లింది సిరి. అయినా ఫలితం లేదు.

నెలలు గడిచే కొద్దీ చదువు తనకు తిండి పెడుతుందన్న భరోసా తగ్గిపోయింది. బతకడానికి ఏదోటి చేయాలి కదా. తోటివారితో కలిసి బిచ్చమెత్తుకోవడం… రోడ్డుపై నడిచేవారిని అడ్డగించి డబ్బులడగడం… ఇవన్నీ మొదట్లో చాలా చిన్నతనంగా అనిపించేవి. ఏడుపొచ్చేది. ఇంటికెళ్లిపోతే బాగుండు అనుకుంది. వెళ్లింది కూడా.

ఇంటికి ఆమడదూరంలో ఉన్న సిరిని అవలీలగానే గుర్తుపట్టింది అమ్మ.

పరుగులాంటి నడకతో తన దగ్గరికి చేరుకుంది. వీధివీధంతా కలియజూస్తూ, చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి గడియబిగించింది.

‘ఏంటీ అవతారం. ఈ బట్టలేంటి. నువ్వెంటి. ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రా’ అన్నయ్య బట్టలిచ్చి బాత్రూంలోకి తరిమింది అమ్మ.

వేషం మార్చినా బాడీలాంగ్వేజీని మార్చలేరుకదా. తమ్ముడు చెల్లీ సిరినో వింత జంతువులా చూస్తున్నారు.

‘ఇక ఇంటికి ఎప్పటికీ రాకు. ఇది నీ ఇల్లు కాదు. దయచేసి వెళ్లిపో’ ఆరోజు రాత్రి భోజనాలైన తర్వాత నాన్న అన్నారు.

                             *****                                         *****                                                *****

ఇంటి గురించి ఆలోచిస్తూ నడుస్తున్నసిరికి అప్రయత్నంగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. గట్టిగా మాటలు వినిపించడంతో గత జ్ఞాపకాల నుంచి బయాటికి వచ్చింది సిరి. ట్యూబులైటు కాంతి లో చాలా సాదాసీదాగా కనిపించింది ఇప్పుడు తానుంటున్న ఇల్లు. కన్న వారు కాదంటే రోడ్డెక్కిన తనను అక్కున చేర్చుకున్న ఆ ఇల్లు. వెనక్కి తిరిగి చూసింది. తనను వెంబడించిన వాళ్లు కనపడలేదు. కళ్ళు తుడుచుకుంది. ఇంట్లోకి అడుగుపెట్టింది. అందరూ ఏవో ముచ్చట్లలో మునిగిపోయారు. కొందరు తమపై పెట్టిన పోలీసు కేసుల గురించి చర్చిస్తున్నారు. బదాయి లో వచ్చిన డబ్బు పంచుకుంటున్నారు ఇంకొందరు. మరి కొందరు అన్నం తింటున్నారు.

అన్నం చూడగానే ఆకలి బగ్గుమంది సిరికి. కడుపునిండా తిని ఎన్నాళ్లయింది. కానీ అడగలాంటే మొహమాటం. నేరుగా తన ట్రంకుపెట్టె ఉన్న స్థలం దగ్గరకెళ్లింది. చిరిగిన దుప్పటి పరుచుకుంది. పక్కకు తిరిగి పడుకుంది.

‘ఏంటే అక్కా… అప్పుడే తొంగున్నావ్. తిండి తినవా’

‘వద్దే కవితా… ఆకలిగా లేదు’ లేని నవ్వు తెచ్చుకుంటూ అంది సిరి.

‘మనం మనుషులమే గానీ పశువులతో సమానమే అక్కా. కాలూచేయి ఆడితేనే తిండి. మూలగానీ పడ్డామనుకో ఎవ్వరికీ అక్కరకు రాము. చివరికి చావుకూడా మనల్ని అసయించుకుంటదంతే. ఇంద ఈ పెరుగన్నం తిని తగలడు. ఆ జానకి వచ్చే టైమైంది. అది గానీ వచ్చిందనుకో ఇదికూడా దక్కదు నీకు’

కవితది కొంచెం జాలిగుండె. పక్కవారి కష్టాలు చూసి కన్నీరు కారుస్తుంది. తనకి చేతనైన సాయం చేస్తుంది.

కళ్లు చెమర్చాయి సిరికి. చకచకా లేచి రెండు ముద్దలు కడుపులో పడేసుకుంది. చెంబునిండా నీళ్లు తాగింది. కడుపు నిండుగా అనిపించింది. మళ్లీ గోడకు తిరిగి పడుకుంది.

ఇలా ఇంకెన్నాళ్లు. పోనీ మళ్లీ ఇంటికెళితే.

ఇల్లు గుర్తురాగానే, మళ్లీ గతం కళ్లముందు కదలాడింది.

                            *****                                           *****                                               *****

చాలా ఏళ్లు గడిచిపోయాయి తను ఇంటినుంచి వచ్చేసి. ఎందుకో తెలీదు గానీ మరోసారి ఇంటి జ్ఞాపకాలు చుట్టిముట్టాయి. ఈసారి మామూలుగా కాదు. ఇల్లు… తల్లిదండ్రులు గుర్తొస్తే కాకావికలమైపోతోంది మనసు. పదేపదే కీడును శంకిస్తోంది. ఇక ఉండబట్టలేక మరోసారి ఊరెళ్లింది సిరి.

ఊరి పొలిమేరలోకి అడుగుపెట్టగానే ఎవరో తనని గుర్తుపట్టారు. ఆ ముందురోజే నాన్న చనిపోయారట. తను వస్తున్న సంగతి ఎలా తెలుసుకున్నారో ఏమో…ఊళ్లోకి అడుగుపెట్టనివ్వలేదు. ఊరు ఊరంతా తనను వెలేసింది. తను తండ్రిని తాకితే అశుధ్దమట. దహన సంస్కారాలు ఊరిలో చేయనివ్వరంట.

‘ఎందుకొచ్చావిప్పుడు… వెళ్లిపో…’ పళ్లు పటపట కొరుకుతూ కర్కశంగా అన్నాడు అన్నయ్య.

అమ్మకోసం కలియజాసింది సిరి. జాడలేదు. ఈ సమయంలో అమ్మకు తోడుగా ఉండాలనిపించింది. కుదరదు. కడసారి నాన్నగారి పాదాలను తాకాలన్న కోరికను మనసులోనే సమాధిచేసి… ఆయన చివరియాత్రను దూరం నుంచి చూస్తుండిపోయింది సిరి. అంతే మరెప్పుడూ ఇక ఆ ఊరు వెళ్లలేదు.

                                *****                                           *****                                                    *****

గత జ్ఞాపకాలతో అలాగే నిద్రలోకి జారుకుంది సిరి. పదినిముషాలు గడిచాయి. కళ్లు తెరవాలనుంది సిరికి. రెప్పలు మరింత బిగుసిపోతున్నాయి. చేయి కదపాలనుకుంది. ఎందుకో తన చేయి తనకే బరువుగా తోచింది. మోయలేనంత భారంగా. అలా ఎన్ని నిముషాలు గడియాయో తెలీదు. సిరికి మాత్రం కొన్ని యుగాలైనట్టుగా ఉంది.

సరిగ్గా అప్పుడే మొదలైంది వణుకు. వెన్నులోంచి మొదలై చప్పుడు చేయకుండా మెడవరకూ మెల్లగా పాకింది. ఒళ్లంతా చల్లబడిపోయిన భావన. పక్కనే ఉన్న కవితను పిలవాలనుకుంది. నోరు తెరవలేకపోతోంది. గట్టిగా అరవాలనుంది కానీ… గొంతు మూగపోయినట్టుగా ఉంది. తన మెదడు ఆలోచిస్తోంది. ఏంచేయాలో చెబుతోంది. కానీ శరీరం ససేమిరా అంటోంది. బహుశా తను చచ్చిపోబోతోందేమో.

‘అక్కా… లేవే… ఎందుకిలా వణికిపోతున్నావ్…’ కవిత మాటలు ఏదో నూతిలోంచి వినపడినట్టుగా ఉన్నాయి.

‘అయ్యే కళ్లు తేలేస్తోంది… రండే….’ ఇంతెత్తున ఎగిరిపడుతున్న దేహాన్ని పట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ గట్టిగా అరుస్తోంది.

‘పోనీవే… మనకో ఖర్చు తప్పుతుంది’ కర్కశంగా అంటోంది జానకి.

ఆ మాటలే తను చిట్ట చివరగా విన్నది. తరువాతి క్షణం… తన శరీరం గాల్లో తేలిపోతున్నట్టుగా ఒక వింత భావన. ఒక తెల్లటి కాంతి రారామ్మని పిలుస్తున్న అనుభూతి. పేగులు కొరికేస్తున్న క్షుద్భాద, కన్నవాళ్లపై మమకారం, భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం… ఇంకా పైకి చెప్పలేని రకరకాల భావాలన్నింటినీ వదిలించుకుని, విదిలించుకుని వెళ్లిపోయింది సిరి. ఒంటరిగా…!!!

‘దీని చుట్టాలకు ఫోన్ కొట్టండే’

ఎవరో ఫోన్ చేస్తున్నారు.

‘ఇప్పుడు కూడా రారంటే దీన్ని చూడ్డానికి. మనమే దీన్ని సాగనంపాలి’ కళ్లొత్తుకుంటున్నారు కొందరు.

సిరి పోయిందన్న బాధకన్నా తమ చివరిరోజులు ఎలా ఉండబోతాయో అని ఊహించుకుని భయపడుతున్నారు చాలామంది.

ఎప్పటిలానే తెల్లారింది. తదుపరి కార్యక్రమాలు ఎలాచేయాలో, ఎవరెంత డబ్బు ఖర్చు పెట్టాలో డిసైడ్ చేస్తోంది జానకి. మధ్యాహ్నం అవుతోందనగా… బలిష్టంగా ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు. జానకితో ఏదో మాట్లాడాడు. కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయాడు.

‘దొంగసచ్చినోడే. దీన్ని స్మశానానికి తీస్కెళితే మనల్ని ఈ ఏరియానుంచి తరిమేస్తారంటనే. ఏం చేద్దాం’ జానకి కళ్లలో భయం.

సమయం భారంగా నడుస్తోంది. సాయంత్రం అయింది. ఆరోజు రాత్రి…లైట్లన్నీ ఆరిపోయాయి.

వాళ్లంతా గోడలక్కూడా వినిపించనంత రహస్యంగా మాట్లాడుతున్నారు. నిశ్శబ్ధానికి కూడా తెలియనంత నిశ్శబ్ధంగా పనులు చేస్తున్నారు.

ఇవన్నీ తనకేమాత్రం సంబంధం లేదన్నట్టుగా హోరున వర్షం కురుస్తోంది. మరోరోజు భారంగా గడించింది. అందరిదీ ఒకే దిగులు. తనను ఎలా సాగనంపాలా అని. పనులు ఆగిపోయాయి. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లలేదు.

                                      *****                                               *****                                           *****

అప్పటికి సిరి చనిపోయి మూడురోజులైంది.

చీకటి పడింది. దూరంగా కుక్కలు ఆగకుండా ఏడుస్తున్నాయి. కప్పలు ఉండుండీ తాళం వేస్తున్నాయి. మధ్య మధ్యలో కీచురాళ్ల రొద. ఉన్నట్టుండి వర్షం మళ్లీ మొదలైంది.

నులక మంచం మీద పడుకోబెట్టారు సిరిని. చడీచప్పుడు లేకుండా మోసుకెళ్తున్నారు. నాలా దగ్గరికి రాగానే ఆగారు. మంచం కిందకి దించారు. సిరి శవాన్ని నాలా బ్రిడ్జిమీద కూర్చోపెట్టారు. తాను ఎప్పుడూ కూర్చునే నాకిష్టమైన సిమెంటు బ్రిడ్జిమీద ఇలా విగతజీవిగా కూర్చోవాల్సి వస్తుందని సిరికి ఒకప్పుడు తెలీదు.

వీటన్నింటినీ పట్టించుకోనట్టుగా… నాలా ఉద్రుతంగా ప్రవహిస్తోంది. వాళ్లంతా చుట్టూ చూశారు.ఎవ్వరూ లేరని డిసైడయ్యారు. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకున్నారు. అంతే… ఒక్క ఉదుటన సిరిని తోసేశారు. దబ్బున శబ్ధం చేస్తూ నాలా కౌగిలిలో ఒదిగిపోయింది సిరి. ప్రతి సాయంత్రం తనని ఆప్యాయంగా పలకరించే సిరిని తనలో కలుపుకున్న ఆనందంలో ఆ కాలువ మరిన్ని నురగలు కక్కుతూ మరింత ఉద్రుతంగా ప్రవహించింది.

– శివలీల.కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.