జానపద కథ వెలికితీతలో నా అనుభవాలు జ్ఞాపకాలు(సాహిత్య వ్యాసం )-టి.భోజన్న .

ISSN 2278-478

పరిచయం :

పరిశోధన శీర్షిక (అంశం) ఎన్నుకోవడంలోనే పరిశోధకుని ప్రతిభ కనిపిస్తుందని పండితులంటారు. నిజంగా అంశాన్ని ఎన్నుకోవడం చాలా కష్టమైన పని అని నాకు నా అంశాన్ని ఎన్నుకొనే క్రమంలోనే తెలిసింది. ఎంత చదివిన వారైనా, ఎన్ని విషయాలు తెలిసిన వారైనా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం సులువుగా చేయలేరు. నేను నా పరిధిలో ఆలోచించి అన్ని విధాల తర్కించి పరిశోధన శీర్షికను ఎన్నుకోవాలనుకున్నాను.

నేను చదివిన తెలుగు సాహిత్యంలో అనేక అంశాలు నాకు కనిపించాయి. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్య, జానపద సాహిత్యం, విమర్శ, కవిత్వం అంటూ….రకరకాల ప్రక్రియలున్నాయి. వీటన్నింటిలో ఏ అంశాన్ని ఎన్నుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

నా చిన్నతనం నుండి జానపద సాహిత్యమంటే మక్కువ ఎక్కువే అయినా ఖర్చుతో కూడుకుని ప్రయాసలు అధికంగా ఉంటాయి కాబట్టి పరిశోధనాంశ నిర్ణయంలో చాలా ఆలోచించాల్సి వచ్చింది. ‘‘ థీసెస్ ’’ అంటే తీసి, తీసి రాయడమనే మాట నేను సమాజంలో చాలా సార్లు విన్నాను. నీ దారి ఏలాంటిదో అంటూ కొందరు నన్ను ప్రశ్నించారు. అంతేకాకుండా నిర్జీవమైన సాహిత్యం కంటే సజీవ సాహిత్యాన్ని మరికొంతకాలం బ్రతికించాలనిపించింది. ఎంత కష్టమైన జానపద సాహిత్యాన్నే అంశంగా ఎన్నుకోవాలని అందులోని ఒక్కో అంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించాను. రకరకాల ఆలోచనల తరువాత నాకు ఎంతో ఇష్టమైన జానపద కథల వైపే నా మనస్సు మరలింది. అందుకు అనుగుణంగానే ఈ ప్రక్రియపై పరిశోధనలు తక్కువగా జరగడం నాకు మరింత ఆనందానిచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకొని నా యొక్క ఎం. ఫిల్ అంశంగా ‘‘ ధర్మపురి మండల జానపద కథలు – సామాజిక పరిశీలన’’ అను అంశాన్ని తీసుకొని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పూర్తి చేసి పిహెచ్.డి అంశంగా ‘‘ కరీంనగర్ జిల్లా జానపద కథలు – పరిశీలన’’ అనే అంశం తీసుకొని నా యొక్క పరిశోధనను జిల్లాకు విస్తరించి పరిశోధన చేయడం జరిగింది. ఈ అంశాన్ని తీసుకోవడానికి నా బాల్యంలోనే భీజాలు పడ్డాయని చెప్పవచ్చు. నా చిన్నతనంలో అమ్మమ్మ, అమ్మ నాకు అనేక కథలు చెప్పేవారు. ఆ కథలలోని నీతి, మార్గదర్శకత్వం, హాస్యం, చమత్కారం నన్ను కట్టిపడేసేవి. కావుననే అలాంటి కథలను పూర్వుల నుండి కాపాడిన వృద్ధుల నుండి సాధ్యం అయినంతవరకు కాపాడి ముందుతరాలకు అందివ్వాలనే సంకల్పమే ఈ పరిశోధనకి పునాది అని చెప్పవచ్చు.

1. క్షేత్ర పర్యటన అనుభవాలు – అనుభూతులు (మండలాల వారిగా)

నా జీవితంలో నేను అనుకోని సంఘటనలు అనేకం జరిగాయి. ఈ సంఘటనల్లో చెప్పుకోదగిన వాటిల్లో నా పిహెచ్.డి. ఒకటి, నేను చదువుకుంటానని గానీ, ఉన్నత చదువులు చదువుతానని నేనుకాని, నాకు సంబంధించిన వారేవరు అనుకోలేదు. నేను ఏడవ తరగతిలో విద్యకు దూరమై కూలి పనులకు వెళ్ళిన నేను పిహెచ్.డి చదివానంటే నేనే నమ్మడం లేదు. ఈ రోజు నా ఈ స్థితికి అనేక మంది పెద్దలు కారణం అయ్యారు. వారందరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

నేను స్వతహాగా ఎవరిపై ఆధార సమాజంలోపదను కలిసిపోయి అందరిలో వారి స్వంత మనిషిగా మొలగడం నా చిన్ననాటి నుండి నాకు అలవాటు, అదే అలవాటు నా క్షేత్ర పర్యటనలో నాకు సహాయపడింది. వ్యవహర్తలతో మాట్లాడడం కానీ విషయ సేకరణకానీ, కొత్త ప్రదేశంలో సంచరించడం గానీ ఇబ్బందిగా అనిపించలేదు. నేను వెళ్ళిన ప్రతి మండలం నాకు ఆనందాన్నే ఇచ్చింది. జానపదులు నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. నేను ఈ పరిశోధన క్షేత్రపర్యటనలో భాగంగా అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు కొత్త కొత్త విషయాలు అనేకం నేర్చుకున్నాను, అవి నా జీవితంలో ఏదో ఒక సమయంలో సహాయపడుతున్నాయి. జానపద కథలకై మండలాలవెంట తిరిగినప్పుడు అనేక మంది సహాయం చేసి జానపద కథలను నాకు అందించారు. అయినను నా పర్యటన ఆనందాన్ని ఎంత ఇచ్చిందో? బాధను అంతే మిగిల్చింది. అందుకు కారణం నా ఆర్ధిక స్థితిగతులే అని చెప్పాలి.

ఉదా : కథలు చెప్పిన వ్యవహర్త నాతో చాలా సమయం గడిపి, తదనంతరం నా నుండి మద్యం మొదలైనవి కోరుకునేవారు. అది గ్రామాల్లో సహజమైన స్థితి గానీ నేను ఏ జానపదుడికి ఖర్చు చేయలేదు. వారిని మాటలతోనే ఆనందపరిచి వచ్చేవాడిని కాని ఇలా చేసిన తరువాత వారికి ఎంతో కొంత కావాల్సింది చేస్తే బాగుండు అనిపించేది. నేను వెళ్ళిన స్థలం కొత్తది కావడం, అక్కడి వ్యక్తులు పరిచయాస్థులు కాకపోవడం కాస్త ఇబ్బంది పెట్టేవి. కానీ చాలాత్వరగా వారితో కలిసిపోయి వారి ఇంటి వ్యక్తివలె అయ్యేవాడిని. అది ఎలాగో అప్పుడప్పుడు నాకే తెలిసేది కాదు.

జానపద కథలను సేకరించడం అంత సులభమైన పని కాదని తెలుసు కానీ కొన్ని చోట్లలో పరిశోధన అక్కడితో ఆపివేస్తే బాగుండు అనిపించేది. రవాణ సదుపాయాలు లేని గ్రామాల్లో నడవడం బస్సులు మారడం, బస్సులు మొదలైన వాటికోసం గంటల తరబడి వేచి చూడడం లేదా అక్కడికి చేరి కథల సేకరణ మొదలుపెడితే, వ్యవహర్త ఏమి చెప్పకుండా స్వంత విషయాలు చెప్పుతూ నా నుండే రాబట్టే ప్రయత్నం చేయడం నన్ను మరింత బాధపెట్టేది.

కొందరైతే ఎన్నిసార్లు వెళ్ళిననూ ఒక కథ కూడా చెప్పకుండా తింపి పంపేవారు. (గంటల సమయం నాతో సరదాగా గడిపి) ఈ వ్యక్తులకు అనేక కథలు తెలుసు అయినా ఒక కథ కూడా చెప్పేవారు కాదు, వారి మనస్తత్వం చూసి నవ్వుకునేవాడిని. అట్లాగే మరికొన్ని ప్రాంతాల్లో నాతో అయిన స్వల్ప పరిచయానికే నన్ను తమ మనుమడిగా భావించి అనేక కథలు చెప్పినవారు ఉన్నారు. సమయం చూడకుండా నాకు ఇంటి వెళ్ళాలనే కోరిక కల్గిన వారి ఉత్సాహాన్ని చూసి అక్కడే ఉండేవాడిని నిజంగా వారికి కథను నాకు చెప్పాలనే బలమైన కోరికకు నేను దాసోహం అయిపోయాను. వారు అలా మారడానికి కారణాలు అన్వేషిస్తే తెలిసిందేమంటే వారి మనుమలు, మనుమరాళ్ళు వారి దగ్గరకు రారని వారు చెప్పే విషయాలు వినరని వారికి దొరికే నాలాంటి వారే ఆప్తులు. నాతో వారియొక్క వ్యక్తిగతాంశాలు అనేకం పంచుకునేవారు. దీని గురించి వారిని అడుగితే ‘‘ రారు బిడ్డా నా మనుమలు, మనుమరాళ్ళు ఎవరు రారు మా దగ్గరకు వాళ్లకు మేము వాసనత్తమట బుక్కెడు మంచి నీళ్ళు కూడా ఇవ్వరు.

ఈ మాట వినగానే నా కండ్లలో నీళ్ళు తిరిగాయి. ప్రస్తుత తల్లిదండ్రులు విద్యావ్యవస్థ, సమాజం నా కండ్ల ముందు కదిలాయి. ఆ సమయంలోనే నేను చాలా ఆనందపడ్డాను. నాకు ఎంత మంది తల్లిదండ్రులు, ఎంతమంది తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంతమంది మామలు అత్తలు, నా పరిశోధన అంశమే నాకు వీరందరినిచ్చింది. వారి స్వంతవారు చేయలేని పనిని నేను చేసి వారికి కాస్తా ఆనందాన్ని ఇచ్చాను కదా అనిపించేది. ఇది తాత్కాలికమే అని తెలుసు కాని ఆ సమయంలో ఇద్దరం ఆనందపడేవారిమి.

ప్రతి మండలంలో నాకు తెలిసిన వారుండడం నా పరిశోధనకి సులభంగా తోచింది. వారిద్వారా వ్యవహర్తలను కలిసేవాడిని అయినా వారు నన్ను అనేక ప్రశ్నలు అడిగేవారు. అవి చెప్పిన తరువాతే కథ చెప్పేవారు లేదంటే కథ మొదలు పెట్టరు. కథ అయిననూ కలువగానే చెప్పేవారు కాదు, మొదట రకరకాల మాటలు, జానపద పొడుపుకథలు, గేయాలు, సామేతలు, తదనంతరం కథలు చెప్పేవారు, ఈ స్థాయి చేరేవరకు చాలా సమయం పట్టేది మల్లి రెండవరోజు వెళ్ళవలిసి వచ్చేది. రెండవరోజు మాత్రం నేరుగా నిన్న ఆపిన కథనుండే మొదట పెట్టేవారు. నాకంటే వారే ఉత్సాహంగా కథను చెప్పేవారు.

జానపద కథలు సేకరించాడానికి నేను రోజు ఉండే వేషధారణలో వెళితే కుదిరేది కాదు, టక్ ఉండకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. చక్కగా దువ్వుకో కూడదు. కరీదైన చెప్పులు ఉండకూడదు. గడియారం కారీదైనది ఉండకూడదు. ఇవన్నీ గమనిస్తూ ముఖ కదలికలను చూస్తూ కథలు చెప్పేవారు. అందుకే నేను ఆ గ్రామం చేరగానే లుంగీ, టీషర్ట్ వేసుకుని వారి ఊరివారిలాగే మారిపోయేవాడిని నా భాష కుడా అక్కడి భాషవలే మారిపోయేది. అంతేకాకుండా వెళ్ళిన కాసేపులోనే వరుసలు పెట్టి పిలిచేవాడిని వారిడ్లలో గడపడం నా పట్ల వారికి అభిమానాన్ని కల్గించిందని గ్రహించాను.

నేను వారితో ఉండిన 2, 3 రోజుల్లో వారి వ్యక్తిగత అంశాలు సైతం మాట్లాడేవారు. నేను అది విని ఆశ్చర్యపోయేవాడిని కానీ అది ఎక్కడ బహిర్గత పరిచేవాడిని కాదు. వారి నమ్మకాన్ని నేటికి నిలబెట్టుకుంటున్నాను. నాకు తెలిసిన సలహాలు నేటికి వారికి అందిస్తున్నాను. ఈ తక్కువ సమయంలోనే అక్కడివారు నా చివరి సమయంలో నీ దగ్గరే ఉంటాం. మమ్మలిని సాదావా? అని అడగడం నేను ఎప్పటికి మరిచిపోలేను. వారికి నాపై కల్గిన ప్రేమను నా జీవితాంతం గుండెల్లో దాచుకొని వారన్నట్లు కొందరికైనా నా దగ్గర ఆవాసం కల్పించే రోజుకోసం చూస్తున్నాను.

ఇది నా పరిశోధన అనేకంటే నాకు మార్గదర్శనం అనడమే ఉత్తమం. నిజం చెప్పాలంటే నేను అనుకున్నట్లు పరిశోధన చేయలేదు. అనుకున్నట్లు పరిశోధన చేసుంటే ఆ అనుభూతులకి మాటలు ఉండేవి కాదేమో. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. నేను వివాహితుడను కావడం, ఆర్థికంగా వెనుకబడడం నన్ను పరిశోధనకి దూరం చేసేవి. పరిశోధన మొత్తం వదిలి ఏదో పని చేసుకుంటూ బ్రతుకుదాం అనిపించేది. కానీ మనస్సుమాత్రం పరిశోధన కోసం తహతహలాడేది. పెండ్లి, పేరంటాలు, పురుడు మొదలైనవి దేనికి హాజరైనా అక్కడి నుండి వ్యవహర్త దగ్గరికి నేను చేరవాల్సిందే. ఎదో ఒక కొత్త అంశాన్ని సేకరించి భద్రపరుకోవాల్సిందే ఆదే నా నిత్యకృత్యం అయింది.

ఈ పరిశోధనలో ముఖ్య భూమికగా జానపద గిరిజన విజ్ఞాన పీఠం మరియు పీఠాధిపతి, నా యొక్క పర్యవేక్షకులు పోషించారనే చెప్పాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివి ఇక్కడకి వచ్చి పిహెచ్.డి. చేయడం కొత్తలో చాలా బాధపడ్డాను. కానీ నా పరిశోధనకి అనువైన ఆహ్లాదకరమైన స్థలం అదేనని తరువాత తెలుసుకున్నాను. మా గురువుగారితో మండల విశేషాలు అనేకం పంచుకునేవాడిని, వారుకూడా తగు సలహాలు, సూచనలు చేసేవారు. అవే ఆకు శ్రీరామరక్షలా పనిచేసేవి. వారు ఏది చెపితే అది అక్కడ కనిపించేది. దానిని అవలీలగా నేను జయిస్తూ ముందుకు సాగేవాడిని.

క్షేత్ర పర్యటన కల్గిన అంశం ఎన్నుకున్న వారికి గురువు సహకారం లేకుంటే అది నిజంగా నరకం అనే చెప్పవచ్చు. ‘‘గురువు లేని విద్య గుడ్డి విద్య’’ అనే సూక్తి ఇక్కడ సరిగా సరిపోతుంది. ఈనాటి నా క్షేత్ర పర్యటన విజయవంతమవడానికి మా గురువుగారే మూలం. వారి సలహాలే నన్ను త్వరత్వరగా పని పూర్తి చేసేలా చేసింది. వారి అభినందనలే కలిసిన ప్రతిసారి కొత్తది తీసుకెళ్ళడానికి కారణం అయ్యింది. సౌమ్యంగా ఉంటూనే పల్లెతూ మాట అనకుండా ప్రతిసారి కొత్తది ఏంటి అని అడగడం వలననే నేను ప్రతిసారి జానపదుల వెంట పరిగెత్తాను.

మా పర్యవేక్షకులను కలిసిన ప్రతిసారి కొత్త విషయం వారికి చూపాలని ఆరాటపడేవాడిని అందుకు తగ్గినట్లుగా కృషి చేసేవాడిని కొన్ని సమయాల్లో కుటుంబ బాధ్యతల కారణంగా పరిశోధన వెనకబడిన మళ్ళి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగేవాడిని.

ముగింపు :

జానపదుల వలన పొందిన ఉత్సాహం నేను గ్రామాల్లో పరిశోధన నిమిత్తం వెళ్ళగా పాతతరం (ముసలివారు) చక్కగా నన్ను ఆదరించేవారు. వారికి ఒక ఆప్తుడు దొరికినట్లు సంబరపడిపోయెవారు. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు విసుగులేకుండా సమాధానం చెప్పేవారు.

ఈ పరిశోధనని ఎన్నుకున్నందుకు మెచ్చుకునేవారు. జానపద కథల గొప్పతనాన్ని విలువను తెలిపెవారు. వీరు నాపై చూపే ప్రేమ, తోడ్పాటు గమనించి మరోప్రాంతానికి ఉత్సాంగా వెళ్ళేవాడిని అన్ని చోట్ల నాకు తోడ్పాటు లభించలేదు. భిన్న మనస్తత్వాలు కల్గిన జానపదులను నేను కలవడం జరిగింది. కొందరైతే నేను అక్కడికి చేరగానే నన్నో వింత మనిషిగా చూసేవారు. కొత్తలో వారికి సంబంధం లేనట్లు పక్కకు తొలిగేవారు. క్రమక్రమంగా వారే చక్కని తోడ్పాటు అందించేవారు.
నా ఈ పరిశోధనకి నాకంటే ముందు జరిగిన కొన్ని సిద్ధాంత వ్యాసాలు, గ్రంథాలు సహకరించాయి. అంతేకాకుండా నా ఆసక్తిని గమనించిన పర్యవేక్షకులు సైతం నాకు నచ్చిన దారిలో వెళ్ళడానికి అనుమతించి సహకరించారు. వారి సహాకారంతో మరింత మెరుగుగా క్షేత్ర పర్యాటన చేసి జానపద కథలు స్వీకరించడం జరింగింది. కావుననే ఈ అంశాన్ని తీసుకొని క్షేత్రపర్యటన చేసి కథలు సేకరించి ఈ అంశానికి నేను న్యాయం చేశాననే నమ్ముతున్నాను.

టి.భోజన్న .
పరిశోధక విద్యార్థి,
శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,

హైదరాబాద్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.