హేమాద్రి చిదంబర దీక్షితుల నృత్య నాటకాలు విశ్లేషణ (సాహిత్య వ్యాసం )- డా.లక్ష్మణరావు ఆదిమూలం

ISSN 2278-478

హేమాద్రి చిదంబర దీక్షితులు 1891లో జన్మించారు. వీరి తండ్రి హేమాద్రి వేంకటేశ్వర్లు, చిన్నతనం నుంచి కూచిపూడి, యక్షగాన ప్రక్రియలను మావయ్య అయిన వేదాంతం సాంబయ్యవద్ద అభ్యసించారు.

చిన్నతనంలోనే ప్రహ్లాద, లోహితాస్య, కుశవుల పాత్రలను ధరించారు. యుక్త వయస్సు వచ్చేనాటికి భామ, గొల్ల, దాదినమ్మా కలాపాలలోని స్త్రీ పాత్రలను పోషించారు. కృష్ణ, సుంకరకొండ, కర్ణకుడు, హరిశ్చంధ్రుడు, లక్ష్మణుడు, అనిరుద్దుడు, అభిమన్యుడు వంటి పాత్రను పోషించి పండిత పామరును సైతం మెప్పించారు. వీరికి ముగ్గురుకుమాయిరులు. ఇద్దరు కుమార్తెలు. 1952లో గుడివాడలో నాట్యోపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు.

అప్పటినుంచి నిర్విరామంగా ఎన్నో వందలమంది శిష్యులను తయారుచేసి పలుచోట్ల తన శిష్యబృందంతో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అఖిల భారత నృత్య పోటీలు (హైదరాబాదు) 1964 నుంచి 1987 వరకు జరిగిన ప్రతి సంవత్సరం ఆ పోటీలో పాల్గొని, వీరి శిష్యులు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాలలో నిలిచి ఎందరో ప్రశంసలు అందుకున్నారు.

1964 నుంచి నర్సాపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు మొదలైన ప్రాంతాలలో కూడా పిల్లలకు నృత్యశిక్షణ ఇచ్చేవారు. తరవాత కాలంలో రాజమహేంద్రవరంలో శ్రీదుర్గా కూచిపూడి నాట్య కళాశాలను, శ్రీ వరలక్ష్మి కూచిపూడి నాట్యకళాశాలను, శ్రీలితా కూచిపూడి నాట్య కళాశాల, నాట్యభారతి మొదలైన నృత్యశిక్షణా సంస్థలను స్థాపించి వందలాది విద్యార్ధులకు నృత్యంలో శిక్షణ ఇచ్చారు. నాట్యశాస్త్ర ధురీణ, నాట్యకళా పితామహ, నాట్యకళావిశారద, నాట్యరత్న పండిత అనేవి వీరి బిరుదులు.

తెలుగు సాహిత్యంలో నాటకాన్ని , సంస్కృతంలోని దశ విధ రూపకాల్ని పరిశీలించి , కూచిపూడి నృత్య రూపకాలను ఒక అంచనా వేయవచ్చు . తెలుగులో నాటకం , నాటికలకు కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి . దశరూపకాల లక్షణాలు ఉన్నాయి . వీటికి భిన్నంగా సాగుతుంది కూచిపూడి నృత్య రూపకాలు కూచిపూడి కళాకారులు తమ ప్రదర్శనకు అనువుగా సంప్రదాయబద్దంగా రచించుకోవడం జరిగింది . వీటిని పరిశీలిస్తే కూచిపూడి నృత్య రూపకాలలో ఈ క్రింది లక్షణాలు ఉంటాయి . వస్తువు ,సంస్కృత ఛందస్సు , దర్వులు , రంగాలు , ద్విపద , వచనం , కైవారం, ప్రార్ధనలు , చూర్ణిక , దండకం , మంగళం , సూత్రధారుడు వంటివి రచనలో కనిపిస్తాయి . చిదంబర దీక్షితులు రచించినవి రెండు నృత్యరూపకాలు. గిరిజా కళ్యాణం, అర్ధనారీశ్వర.

వస్తువు :
గిరిజా కళ్యాణం నృత్య రూపకంలో ఈశ్వరుడు హిమగిరి చక్రవర్తి వద్దకు వెళ్లి పర్వత సానువుందు తపస్సు చేయడంతో కథ ప్రారంభమవుతుంది. చివరికి ఈశ్వరుడు శివతాండవంచేసి, మూడవకన్నుతో మన్మధుడిని భస్మం చేయడం జరుగుతుంది. రతి తన భర్తకోసం నిర్వేదన చెంది పరమేశ్వరుడిని ప్రార్ధిస్తుంది. శివుడు అనుగ్రహించడం, తరవాత పార్వతితో పరమేశ్వరుడి కళ్యాణం కావడంతో ఈ రూపకం ముగుస్తుంది.

‘అర్ధనారీశ్వర’ నృత్య రూపకం, గంగా ` గౌరీ సంవాదంతో ఈ నృత్యరూపం ప్రారంభమవుతుంది. గంగా ` గౌరి సంవాదం వలన గౌరి శివుడిని, కైలాస పర్వతాన్ని వదిలి హిమవంతుని ఇంటికి చేరుతుంది. కొన్ని రోజుల తరువాత భృంగిరిటి శివుని ద్వారా విషయం తెలుసుకుని శివుడితోపాటు పార్వతిని వెదకటం ప్రారంభిస్తాడు. భృంగిరిటికి పార్వతీదేవి కన్పిస్తుంది. భృంగిని చూసిన పార్వతి కైలాసంలో పరమేశ్వరుడు, అందరూ కుశలమే కదా! అని అడుగుతుంది. భృంగిరిటి! అమ్మా! మీరు పరమేశ్వరుని అర్ధశరీరాన్ని పొందారు కదా, అది ఎట్లా జరిగిందో వివరించమని అడుగుతాడు. పార్వతిదేవి ముందు జన్మలో దాక్షాయణిగా జన్మించడం, ఆ తరవాత హిమవంతునికి పార్వతిగా పుట్టడం శివుని శరీరంలో అర్ధభాగాన్ని పొందడం వంటి ఘట్టాలను వివరిస్తుంది.

పాత్రలు :
ప్రదర్శనకి కథ ఎంత ముఖ్యమో , పాత్రల ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యమైనది . గిరిజా కళ్యాణం లో శంకరుడు ,హిమవంతుడు ,మన్మధుడు ,పార్వతి ,రతీదేవి ,చెలి కత్తెలు పాత్రలున్నాయి .

అర్ధ నారీశ్వర నృత్య నాటిక .దీనిలో ముఖ్యంగా గంగా గౌరీ సంవాదం ముఖ్యమైన ఘట్టం . ఈ నృత్య నాటికలో అర్ధ నారీశ్వరుడు , భ్రుంగీశ్వరుడు , గంగ , పార్వతి పాత్రలు ముఖ్యమైనవి .

అంకాలు :
ప్రదర్శన సౌలభ్యం కోసం నాటకం లోని వస్తువు ని భాగాలుగా విభజిస్తారు . ఆ భాగాలను అంకాలుగా , రంగాలుగా పేర్కొనడం జరుగుతుంది . రూపకంలోని భాగాలకు అంకాలు అని పేరు. వీటినే రంగాలు అని కూడా పిలుస్తున్నారు. రూపకంలో రంగాలు సన్నివేశాల్ని, కథాగమనాన్ని నడిపించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. రంగాల్నిబట్టే ఆ నృత్యరూపకం నిడివి ఆధారపడి ఉంటుంది. నాటకం, నాటిక రెండింటిలోని తేడాలని ప్రధానంగా అంకా సంఖ్యనుబట్టే నేడు నిర్ణయించడం జరుగుతుంది.

హేమాద్రి చిదంబర దీక్షితులు రచించిన ‘గిరిజాకళ్యాణం’లో 5 రంగాలున్నాయి. హిమాయ పర్వతాలపైకి శివుడు ప్రవేశించడం మొదటిరంగం, పార్వతిదేవి ప్రవేశం రెండవ రంగం, మూడవ రంగంలో పార్వతిదేవి తన చెలికత్తెతో ఉండగా శివుడిని చూడటం, ఎంతకీ పరమేశ్వరుడు ప్రసన్నం కాకపోవడంతో విసిగి శివుడిని ప్రశ్నించడం కన్పిస్తుంది. నాలుగవ రంగంలో మన్మధుని ప్రవేశం, అయిదవ రంగంలో శంకరునిపై మన్మధుని బాణప్రయోగం వంటి ఘట్టాలుగా కథా నడుస్తుంది.

‘అర్ధనారీశ్వర’ నృత్యరూపకంలో రెండు రంగాలున్నాయి. మొదటి రంగంలో అర్ధనారీశ్వరుడిగా శివుడి ప్రవేశం, భృంగీశ్వరుడు శివుడిని స్తోత్రం చేయడం ఉంటుంది. రెండవ రంగంలో శివుడు, పార్వతీ కహం గంగాగౌరీ సంవాదం కన్పిస్తుంది.

ప్రార్ధన :
నృత్యరూపకాలో తమ ప్రదర్శన ప్రారంభించే ముందు రంగస్ధం వెనుక ప్రార్ధను చేస్తారు. ఇవి ఎక్కువగా గణపతికి సంబంధించినవై ఉంటాయి. ఈ పద్యంలో ప్రార్ధన చేసే ముందు వీరు గణపతి పద్యం ఒక రాగయుక్తంగా పాడతారు.

“గిరిజా కళ్యాణం “లో ప్రార్ధన నాట రాగం , ఆదితాళం లో సాగుతుంది .
”మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామదేవాది వందిత మనసా స్మరామి “.
అర్ధనారీశ్వర లో వినాయక ప్రార్ధన , ఆదితాళం .”తాండవ నృత్య కరి గజానన “.అంటూ ప్రార్ధన చేయడం జరిగింది .

సూత్రధారుడు :
ఇతడినే కూచిపూడి నృత్యరూపకాల్లో ప్రధాన పాత్రగా పరిగణించవచ్చును. ఇతను పాత్రతోపాటు తాను వేషధారివలే కలిసి ప్రదర్శన ఇస్తాడు. ప్రధాన సంప్రదాయ పాత్రగా కనిపించే సూత్రధారి పాత్రే చివరి వరకు కథను నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాడు.

“గిరిజా కళ్యాణం “నృత్య నాటకంలో ఇష్ట దేవతా ప్రార్ధన అయిన తరవాత సూత్రధారుడు వచనంతో మొదలవుతుంది . దక్ష యజ్ఞానంతరం సంహార స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రళయ రుద్రావతారం ఉపసంహరించుకున్న సతీదేవి వియోగం వారిని కాల్చివేస్తూంటుంది .

దర్వులు :
నృత్య నాటకాలలో దర్వులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది . దరువులంటే మాత్రా ఛందస్సులో , సాధ్యమైనంత వరకు చతురస్రం లో నడుస్తూ పల్లవి , అనుపల్లవి చరణాలతో కూడి ఉండే సంగీత రచన గా చెప్పవచ్చును . సంస్కృత నాటకాలలో కనిపించే ధృవ గానమే ఈ దరువులు .

ప్రవేశ దరువు :
పాత్ర ప్రవేశ సమయంలో వచ్చే దరువు ప్రవేశ దరువుగా చెబుతారు .
గిరిజా కళ్యాణం లో పార్వతి ప్రవేశంలో దరువు కనిపిస్తుంది .
దరువు , శంకరాభరణం , రాగం ఆది తాళం ..
“వెడలే హిమగిరి తనయ వేడ్కరు జిల్లగాను
కొల్లలుగా చెలులతో పురహరుని గొల్చుటకు “

అర్ధ నారీశ్వర నృత్యనాటికలో ,,అర్ధనారీశ్వరుడు దరువు అసావేరి , ఆదితాళం లో సాగుతుంది .
“వెడలే నటరాజు నాగభూషణుడు .
చిరు గజ్జలు ఘల్లున “

వచనం :
నృత్య రూపకా సాహిత్యంలోని గద్యాలే వచనాు. సంధి ప్రయోజనాత్మకంగాను, పాత్ర సంభాషణా సందర్భములోనూ, వర్ణన సందర్భంలోనూ వచనాలు కన్పిస్తాయి.

హేమాద్రి చిదంబర దీక్షితు రచించిన ‘గిరిజా కళ్యాణం’ నృత్యరూపంలో కథా గమనంలో సూత్రధారుడు పలికె మాటలు వచనంలో సాగుతాయి.
“దక్షయజ్ఞానంతరము సంహార స్వరూపుడైన పరమేశ్వరుడు, ప్రళయ రుద్రావతారం ఉపసంహరించుకున్న సతీదేవి వియోగం వారిని కాల్చివేస్తూంటుంది”.

దండకం :
ఏ వ్యక్తినైన స్తుతి చేస్తూ సాగే పాటని దండకంగా చెబుతారు. భవభూతి రచించిన ‘మాలతీ మాధవం’ నాటకంలో సూత్రధారునిచే దైవ స్తుతిపరంగా పలికించిన దండమే ప్రాచీన సంస్కృత దండకమని చెబుతారు. దండకానికి లక్షణాలు చెప్పిన కవులున్నారు.
హేమాద్రి చిదంబర దీక్షితు రచించిన ‘గిరిజా కళ్యాణం’ నృత్య రూపకంలో పరమేశ్వరుని చేతులో పార్వతి చేతిని హిమవంతుడుంచితే అందరూ స్తోత్రము చేస్తారు. అది దండకంలో సాగుతుంది.
‘‘శ్రీమన్మహాదేవ దేవాది దేవత్రిలోకాధి సేతా
విభూతి విలాస భుజంగేంద్ర భూషా సుపోషా
సురేంద్రాది సంశేవితా నాట్యవేదార్ధసంపూర్ణ
రూపాదయాంబోధి చంద్రా ప్రభోనీవె
మృత్యుంజయా ఆదిమధ్యాంతముల్లేని ఓం
కార రూపా హిమాశైవాసా విశేషా
నమో ఆదిదేవా, నమో భక్తపా
నమస్తే`నమస్తే`నమస్తే`నమః’’ 35.

‘అర్ధనారీశ్వర’ (గంగా`గౌరి సంవాదం) నృత్యరూపకంలో ‘దేవగాంధారి’ రాగంలో దండకం ఈ క్రింది విధంగా సాగుతుంది.
‘శ్రీ మన్మహాదేవ దేవాది దేవా త్రిలోకాధినేతా
విభూతి విలాస భుజంగేంద్ర భూష సుపోషా
సురేంద్రాది సంశేవితా నాట్య వేదార్ధ సంపూర్ణరూప
దయాంబోధి చంద్రా, ప్రభోనీవె మృత్యుంజయా
నమో ఆదిదేవ నమో భక్తపా
నమస్తే`నమస్తే`నమస్తే`నమః’’.
శివుని వేషధారణ, అంకరణను, గొప్పతనాన్ని దండకంలో కీర్తిస్తారు.

కీర్తనలు :
భగవంతుని రూప, గుణ లీలాదుల్ని మహిమల్ని వర్ణిస్తూ పరవశించడం, హరికథల్ని ఇతరుకు చెప్పడం, భక్తి కలిగించడం కీర్తన భక్త క్షణం. భగవంతుని గురించి ఏకాంతంగా కానీ, సామూహికంగా కానీ కీర్తించవచ్చు. కూచిపూడి నృత్య రూపకాు చాలావరకు రామాయణ, భారత, భగవత సంబంధ కథను ఆధారంగా చేసుకుని రచించిన నృత్య రూపాలే ఎక్కువ. దైవ సంబంధమైన కథు, మహిమను చెబుతూ నృత్యరూపకా రచన సాగింది. ప్రస్తుతకాంలో వస్తువును గ్రహించడం మార్పు చోటు చేసుకుంటున్నాయి.
హేమాద్రి చిదంబర దీక్షితు రచించిన ‘గిరిజా కళ్యాణం’ నృత్య రూపకంలో పార్వతి చెలులు ప్రవేశించే సమయంలో కీర్తన రచించబడిరది.

చెలులు :` ‘‘ఘల్లు ఘల్లున పాదగజ్జందొ మ్రోయ,
కహంస నడక కలికి యెచ్చటికే॥
పార్వతి :` జడలోను గంగాను ధరియించున్నట్టి
మండ యేలే మహేశు సన్నిధికే॥
చెలులు :` తళ తళమను రత్న తాటంకము మెరయ
పసిడి కుండణము పడతి యెచ్చటికే॥
పార్వతి :` కరియోగ చర్మము ధారుడైనట్టి
గరళ కంఠుండైన శంభు సన్నిధికే॥’’ 57.

‘అర్ధనారీశ్వర’ నృత్య రూపకంలో పార్వతి మాటకు గంగాదేవి శివుని శిరమునుండి దిగి వచ్చి మాట్లాడే సందర్భంలో మిత్రగతిలో సాగే కీర్తన సాగింది.
‘‘భళిర అమ్మక చ్లె హరుని శిరమునకెక్కి
పరవళ్లు త్రొక్కెటి పడతి యెవ్వతివే
పరువు నెరుగక పరుని మీయి గొన్న యట్టి
కరువున మరిగేటి మారియెవ్వతివే
మాయ దారి యెవ్వతివే…….’’ 58.

మంగళం :
కూచిపూడి నృత్యరూపకాలో దేవతా పాత్రలు ఉంటే వారికి మంగళం పాడటం సంప్రదాయం. మంగళహారతి పాటపాడుతూ కర్పూరాన్ని పళ్ళెంలో వెలిగించి రంగస్థలానికి, ప్రేక్షకులకి చూపిస్తారు.

హేమాద్రి చిదంబర దీక్షితులు రచించిన ‘గిరిజా కళ్యాణం’లో ‘మంగళం’ ఈ విధంగా రచించబడింది.
‘‘శ్రీ శివశంకర గిరిజాధీశ మంగళం
శిష్టజనాధార శివశక్తి మంగళం
మదనగర్వ భంగ మహాదేవ మంగళం
క్రూర చిత్త దక్ష ముఖ వినాశ మంగళం’’ 46.

అర్ధనారీశ్వర (గంగా ` గౌరి సంవాదం) నృత్య రూపకంలో మంగళం సూత్రధారుడు చెప్పడంతో ముగుస్తుంది.
‘‘ప్రదీప్త రత్నోజ్వ కుండలాయై
స్పురన్‌ మహాపన్నగ భూషణాయ
శివ ప్రియాయైచ , శివ ప్రియాయ
నమశ్శివాయైచ , నమశ్శివాయ “.

ఈ విధంగా నృత్య నాటికలలో పాత్రలు , సూత్రధారుడు , అంకాలు , దరువులు , కీర్తనలు ,వచనం ,ప్రార్ధన,మంగళం వంటివి రచించడం జరుగుతుంది . వీటిని సాహిత్యం తెలిసిన వారు రచించి నృత్యం తెలిసిన వారు నృత్య రూపకంగా మలచడంలో కంటె నాట్యాచార్యులే నృత్య నాటికను రచించడం వలన వారికి కావాల్సిన విధంగా , అనువుగా రచించడం జరుగుతుంది . హేమాద్రి వారి నృత్య రూపకాలు తరవాత నృత్య రూపకాల రచయితలకి , నాట్య కళాకారులకి ఆదర్శంగా నిలిచాయి .

– డా.లక్ష్మణరావు ఆదిమూలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.