మేఘసందేశం-10 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఒక గొప్ప కావ్యాన్ని వ్రాయడానికి కావలసిన మనోస్థైర్యము ఒక ఋషికి మాత్రమే ఉంటుంది. సాహిత్యములో కావ్యప్రక్రియ చాల కష్టమైనది. కావ్యములలో నాటకము అందమైనది. అట్టి నాటకములలో అందమైనది శకుంతల. “పండితులు చూసి మెచ్చుకొనునంత వఱకు నేను చేసిన ప్రయోగము సరియైనదని నమ్మను, పనిలో ఎంతటి నేర్పరియైనను తన పని మీద తనకు సరిగా వున్నదను నమ్మకము కలుగదు, దానిని యితరులు చూసి మెచ్చుకొనినప్పుడే ఆత్మవిశ్వాసము కలుగుతుంది” అని అభిజ్ఞాన శాకుంతలంలో సూత్రధారునితో పలికిస్తాడు కాళిదాసు. మహాకవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక రచనలలో ఒక అపూర్వ కళాకృతి. మహోన్నతమైన రచన. గెటే పండితుడు ఈ నాటకాన్ని చదివి ఆనందం పట్ట లేక, నృత్యం చేసాడుట !

నాల్గవ అంకంలో కణ్వమహర్షి శిష్యుడు ఒకడు నిద్రలేచి, ఒక వంక అస్తమిస్తున్న చంద్రుడిని, ఒక వంక ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రభాతవేళని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఒకటి చెప్తాను. “శ్లో. యాత్యేకతోస్త శిఖరం పతిరోషధీనా, మావిష్కృ తోరుణ పురస్సర ఏకతోర్క:, తేజో ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్, లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.” ఒక వేపు చంద్రుడు అస్తగిరికి పోతున్నాడు. ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా ఉదయిస్తున్నాడు. ఆహా! రెండు దివ్య తేజస్సులు ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా. ఒక తేజస్సు అంతర్హితమవుతూ ఉంటే, ఒక తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది. ఏక కాలంలో కనిపిస్తున్న ఈ సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు తెచ్చేదిలాగ ఉన్నది కదా! ఇదీ ఈ శ్లోక భావం. కష్ట సుఖాలు కావడి కుండలు. అందు చేత కష్టం వస్తే క్రుంగి పోనూ కూడదు. సుఖం వస్తే పొంగి పోనూ కూడదు. ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన శ్లోకం ఇది.

మనం మరలా మేఘసందేశ వ్యాఖ్యానంలోకి వద్దాం.
శ్లో.42. గంభీరాయాః పయసి సరిత శ్చేతసీవ ప్రసన్నే
ఛాయాత్మాపి ప్రకృతిసుభగో లప్స్యతే తే ప్రవేశం,
తస్మా దస్యాః కుముదవిశదా న్యర్హసి త్వం న ధైర్యా
న్మోఘీకర్తుం చటులశఫరోద్వర్తనప్రేక్షితాని.

భావం: అలా సాగుతున్న సమయంలో మనస్సులా నిర్మలమైన గంభీర అనే నది కనబడుతుంది. నీవు ఆ నదిని ఇష్టపడకపోయినా, ఆ నది నీటిలో నీ ఛాయా శరీరమైనా ఉంది కాబట్టి, ఆ నది నిన్ను మనసులో తలుస్తూనే ఉంటుంది. అలా ఇష్టపడి, చేపల పొర్లిగింతలనే చూపులతో నిన్ను చూస్తుంది. నీవు మాత్రం ఆ చూపులను నీ ధూర్తత్వంతో వ్యర్థం చేయకు. ఆ నదియొక్క ప్రణయాన్ని నీవు నిరాకరించవద్దు సుమా! అని ప్రబోధిస్తున్నాడు.

శ్లో.43. తస్యాః కించి త్కరధృతమివ ప్రాప్తవానీరశాఖం
హృత్వా నీలం సలిలవసనం ముక్తరోధోనితంబం,
ప్రస్థానం తే కథమపి సఖే లంబమానస్య భావి
జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్థః.

భావం: నీవు ఆ గంభీరానదీజలాలను గ్రోలితే, నీకు మధురమైన అనుభవం కలుగుతుంది. వెళ్లడానికి నీకు మనసు రాదు. అక్కడ ఉన్న నీరు అనే వస్త్రాన్ని తొలగించగానే (అంటే ఇక్కడ తాగగా అని అర్ధం) ఆ ఒడ్డున వున్న ప్రబ్బలి చెట్టనే చేతితో పట్టుకున్న దానిని తొలగించినట్లైనది. అప్పుడు ఆ వస్త్రవిహీన యైన శూన్యమైన నడుము కలిగిన ఆ గంభీర నాయిక (నది) ను చూచిన తర్వాత ప్రయాణం కష్టమే సుమా! ఎందుకంటే రసికుడైన నాయకుడు నగ్నమైన కటిప్రదేశం కలిగిన నాయికను చూసిన తర్వాత నిగ్రహించుకోవడం కష్టం అని చెప్తున్నాడు.

విశేషము: ఇక్కడ కాళిదాసు నదిని నాయికగాను, మేఘుడిని నాయకునిగాను కల్పించి శృంగార సన్నివేశం వర్ణించాడు. ఒడ్డునందు నితంబాన్ని, నీటియందు వస్త్రాన్ని, నదియందు నాయకత్వాన్ని ఆరోపించడం వలన రూపకాలంకారం. నాలుగోపాదంలో అర్ధాంతన్యాసాలంకారం ఉన్నది.

శ్లో.44. త్వన్నిష్యందోచ్ఛ్వసిత వసుధా గంధసంపర్క రమ్యః
స్రోతోరంధ్రధ్వనితసుభగం దంతిభిః పీయమానః,
నీచై ర్వాస్య త్యుపజిగమిషో ర్దేవపూర్వం గిరిం తే
శీతో వాతః పరిణమయితా కాననోదుంబరాణాం.

భావం: మేఘుడా! నీ వర్షంతో భూమి ఊరట చెందుతుంది. సువాసనలు వెదజల్లుతుంది. అక్కడ ఉన్న గాలి ఆ పరిమళాన్ని ధరిస్తుంది. ఏనుగులు కూడా ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూంటాయి. అప్పుడు వాని తొండాలనుండి వినుటకు ఇంపైన ధ్వని (ఘీంకారము) వెలువడుతుంది. అడవి మేడికాయలు పండి, ఆ వాసనలు వస్తూంటాయి. వీటన్నిటితో కూడిన చల్లని గాలి, దేవగిరిని చేరబోతున్న నీకు అనుకూలంగా మెల్లగా వీయగలదు సుమా! అని చెప్తున్నాడు.

విశేషము: ఈ శ్లోకంలో కాళిదాస మహాకవి “స్రోతోరంధ్ర” అనే పదం ఒకటి ప్రయోగించాడు. స్రోత శబ్దానికి ఇంద్రియమనే అర్ధం ఉన్నది. ఇంద్రియ విశేషమైన నాసికను గురించి చెప్పడం సందర్భాన్ని బట్టి లక్షణావృత్తినాశ్రయించవలసి ఉంటుంది. దేవపూర్వం అనే స్థలంలో కూడా లక్షణంతోనే చెప్పాల్సి ఉంటుంది. దేవశబ్దము పూర్వమందు కలది దేవగిరి అవుతుంది. అందువల్ల ఇక్కడ వాచ్యార్ధము కుదరదు. లక్షణాన్ని గ్రహించాలి. ఇందులో స్వాభావోక్తి అలంకారం ఇమిడి యున్నది.

శ్లో.45. తత్ర స్కందం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా
పుష్పాసారైః స్నపయతు భవా న్వ్యోమగంగాజలార్ద్రైః,
రక్షాహేతో ర్నవశశిభృతా వాసవీనాం చమూనా
మత్యాదిత్యం హుతవహముఖే సంభృతం తద్ధి తేజః

భావం: ఓ మేఘుడా! నీవు త్వరలో దేవగిరిని చేరబోతున్నావు కదా! అది కుమారస్వామి నిత్యనివాసస్థానం. ఆ స్వామిని నీవు పుష్పమేఘుడవై… అంటే పూలను వర్షించే మేఘంగా చేయబడిన దేహం కలవాడవై…ఆకాశగంగాజలాలతో తడిసిన పుష్పాల ధారావర్షంచేత అభిషేకం చెయ్యి. ఆ కుమారస్వామి ఇంద్రుని సైన్యాన్ని రక్షించడంకోసమై, నవశశిభృతుడు (బాలచంద్రశేఖరుడు) అగ్నిముఖమందు ఉంచిన సూర్యుని అతిక్రమించిన తేజస్సుకదా! శివుడు తన తేజస్సును అగ్నియందుంచగా ప్రభవించిన వాడు కదా! అని అంటున్నాడు.

విశేషాలు: తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడంకోసం బ్రహ్మాదిదేవతలు ప్రార్థించిన మీదట శివుడు, బ్రహ్మచర్యాన్ని వీడి, పార్వతిని పరిణయమాడి, కొన్ని కారణాంతరాలచేత తన తేజోవంతమైన వీర్యాన్ని జగన్మాతయందు కాక, అగ్నియందు ఉంచాడు. అంతటి అగ్ని కూడా ఆ తేజస్సును భరించలేక గంగయందు ఉంచాడు. గంగ కూడా ఆ తేజస్సును భరించలేక రెల్లుగడ్డిమీదకు తోయగా తోయజాక్షుడైన కుమారస్వామి జన్మించాడు. కృత్తికలచేత పెంచబడిన ఆ కార్తికేయుడు, పార్వతి ప్రసాదంతో వేలాయుధుడై తారకాసురుని సంహరించాడు. ఆ తరువాత దేవతల ప్రార్థనచే పైన పేర్కొన్న దేవగిరిమీద నిత్యనివాసానికి అంగీకరించాడు. అంటే సతతం, సదా, ఎల్లప్పుడు, కుమారస్వామి దేవగిరిమీద కొలువై ఉంటాడు. ఈ వృత్తాంతాన్ని కాళిదాస కవి తన “కుమారసంభవం” అనే మహాకావ్యంలో వివరించాడు. “దేవతల రక్షణ కోసం ఉద్భవించిన కుమారుని నీవు కూడా పూజించినట్లైతే సకలదేవతలు ఇంద్రునితో సహా నీకు అనుకూలురే అవుతారు. అది నీకు రక్షణ హేతువు.” అని మేఘునికి యక్షుడు చెప్పినట్లు మనం భావించవచ్చు. ఇక్కడ వర్షమేఘాన్ని పుష్పమేఘం అవ్వమంటున్నాడు కాళిదాసు . ఎంత అందమైన భావనను ప్రకటించాడో చూశారా!

-వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)