కరీంనగర్ జిల్లా జానపద కథలలో ప్రతిఫలించిన సామాజికాంశాలు(సాహిత్య వ్యాసం )- టి.భోజన్న

ISSN 2278-478

పరిచయం :

జానపద కథలు ప్రయోజనాన్ని ఆశించి పుట్టవు. పుట్టిన తరువాత ప్రయోజనాన్ని సంతరించుకుంటాయి. జానపద కథలు మౌఖిక ప్రచారంలో ఉండడం వలన అనేక మార్పులకు లోనౌతాయి. జానపద కథలు ప్రాంతాలన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పులలో హాస్యం, చమత్కారం, నీతి మొదలైన లక్షణాలు ఎక్కువగా చేరుతాయి. అంతేకాకుండా ఆయా ప్రాంతాల వివరాలు చేరి శ్రోతకు స్థానికతను తెలియజేస్తు ఆనందింపజేస్తాయి.

జానపద కథలు ఒకే అంశంపై తీక్షణంగా సాగడం వలన పాఠకునికి, శ్రోతకి అందాల్సిన సందేశం త్వరగా అందుతుంది. జానపదుడు నిరంతరం శ్రమ చేయడం వలన, శ్రమకు సంబందించిన కథలు ఎక్కువగా వెలువడ్డాయి.వారి శ్రమ విలువను ముందు తరాలకు ఈ జానపద కథలు తెలియజేసాయని చెప్పవచ్చు.

జానపద కథలు జనుల సమస్యలపై పోరాటంతో ఆరంభమై ఉండవచ్చు. జానపదులు నిత్యం పోరాటం చేస్తూ జీవిస్తారు. గ్రామాలలో జీవిస్తూ, అధిక సంతానాన్ని పోషిస్తూ, అనేక సమస్యలు, అధికారుల అధిపత్యం, ప్రకృతి వైపరిత్యాలు, పంచభూతాల ఆగ్రహానికి గురియై ఆ కష్టాలను నిరంతరం నెమరువేస్తూ కథలలో నిగూఢించి ముందు తరాలకు చెప్తూ తగు జాగ్రత్తలు నేర్పిస్తారు.

పూర్వం పల్లెల్లోనే కాకుండా నగరాల్లో కూడా ముసలివారు కుటుంబ సభ్యులతో కలసి జీవించేవారు. ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. చిన్న పిల్లలకి రోజువారి రాత్రి కార్యక్రమాల్లో జానపద కథలు తప్పకుండా చెప్పేవారు. అలాంటి జానపద కథల వలన లాభం పొందిన వారిలో నేను కూడా ఉన్నాను. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరికి వారు కావడం వలన వృద్ధులు అనాథలవలే వృద్ధాశ్రమాలలో కాలం వెల్లదీస్తున్నారు.

మరి కొందరు వృద్ధదంపతులు వారి పిల్లలతో కలసి జీవిస్తున్నా వారితో మనసువిప్పి మాట్లడే వాతావరణం, పిల్లలకు కథలు చెప్పే అవకాశం ఆధునిక సమాజంలో లేకుండా పోయింది. పిల్లల మార్కులను, ర్యాంకులను కొలుస్తూ యంత్రల్లా జీవిస్తున్నారు తప్ప నిజమైన విఙ్ఞానం అందించడం లేదని చెప్పవచ్చు. “పిల్లల చేత ఎన్ని మంచి పుస్తకాలు చదివించామన్నది ముఖ్యం కాదు. వారిని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దామా లేదా” అని చూడాలంటారు స్వామి వివేకానంద. నేటి సమాజంలో ర్యాంకుల పంట పండిస్తున్నా, నైతిక విలువలు అడుగంటి పోయి సమాజాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఆధునిక సమాజమే నైతిక విలువలను పాటించడం లేదంటే రాబోయే తరాల గురించి చెప్పనక్కర్లేదు. టెలివిజన్ లకి రిమోట్ వలే, కీ ఇస్తే నడిచే యంత్రంల్లా మరుతారని చెప్పవచ్చు. పూర్వం కుటుంబాలలో సామరస్య దోరణి ఎక్కువగా కనబరుస్తూ సమస్యలను అందరు సమిష్టిగా పరిష్కరించుకునేవారు.నేడు మానవుడు ఒంటరివాడైనాడు. ఆ పరిస్థితులన్ని జానపద కథలో చక్కగా చెప్పబడ్డాయి. ఆ జానపద కథలే నేడు రకరకాల కథలుగా అమలులోకి వచ్చాయని తెలుస్తుంది.

పూర్వ కాలంలో కథలు చెప్పమంటూ వేదించే పిల్లలు ఉండేవారు. టెలివిజన్, కంప్యూటర్, చరవాణి మొదలైనవి వచ్చిన తరువాత ఎక్కడ ఆ వాతావరణం కనిపించడం లేదు. వీటి కారణంగా సమాజంలో కథలు చెప్పే వృద్ధుల సంఖ్య తగ్గిపోయింది. ఈ జానపద కథల వలన 1. మార్గ దర్శకత్వం 2. సందేశం 3. సామాజిక పరిస్థితులు 4. రాజకీయ ఆర్థిక వ్యవస్థ 5. భౌగోళికాంశాలు 6. శరీరక సమస్యలు– పరిష్కారాలు, 7. మానసిక, 8. ఆధ్యాత్మికత, 9. కట్టుబాట్లు, 10. వివేకం కల్గించేవి, 11. వ్యక్తిత్వ నిర్మాణ విషయాలు, 12. దిశా నిర్థేశం, 13. నైతిక విలువలు, 14. మానవీయ విలువలు, దయ, సానుభూతి, సాటి జీవుల పట్ల ప్రేమానురాగాలు, సేవాగుణం, దాతృత్వగుణం, సత్య నిష్ట, ధర్మాన్ని అనుసరించుట, ఐకమత్యం, ఆత్మ విశ్వాసం మొదలైనవి మనం నేర్చుకోవచ్చు. నేటి సమాజంలో మార్గదర్శిగా వ్యవహరించే గురువుల దగ్గరకు నేటి యువత ఎక్కువగా వెళుతుంటారు. కానీ వారి ఇండ్లలోని వృద్ధుల దగ్గర మానసిక ప్రశాంతత, మార్గదర్శక సూత్రాలు ఉన్నాయని గమనించడం లేదనిపిస్తుంది.

1 మార్గదర్శకత్వం:
జానపద కథలు పూర్వ కాలంనుండి ఆయా సమకాలీన పరిస్థితులను తెలియజేస్తూ, అనేక మంది జానపదుల అనుభవాలను శ్రోతలకి జానపద కథల ద్వారా అందించబడుతున్నాయి. మానవ జీవితంలో మార్గదర్శకత్వం చాలా ముఖ్యమైనది. జీవితంలో మార్గదర్శకత్వం లేకపోతే జీవితం అంధకారం అవుతుంది. అందుకనే జానపదులు ప్రత్యేకంగా మార్గదర్శక సూత్రాలు చెప్పకుండా జానపద కథలో దిశా నిర్థేశం చూపేవారు. జానపదుడు నేరుగా మార్గదర్శక సూత్రాలు చెప్పడం వలన శ్రోతకి గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

2 సందేశం:
సమాజంలో నేటి పరిస్థితులకి పూర్వం పరిస్థితులకి చాలా తేడా ఉంది. పూర్వ కాలంలో సందేశం పంపాలంటే పాటనో ! కథనో వాహికగా గ్రహించి సందేశం పంపేవారు. గురుకులాల్లో, ఆశ్రమాలలో, కథను బోధనోపకరణంగా తీసుకుని నీతిని గానీ, సందేశాన్ని గానీ అందులో చేర్చి శిష్యులకు, భక్తులకు హితబోధ చేసేవారు. నేటికి గురుకులాల్లో, ఆశ్రమాలలోని ఆచార్యులు కథలు చెప్పే సాంప్రదాయం కనిపిస్తుంది.

3 సామాజిక పరిస్థితులు:
జానపద కథలలో ప్రజల సమకాలీన పరిస్థితులు తెలుస్తాయని చెప్పవచ్చు.జానపదుని స్థితిగతులు, ఆర్థిక మరియు, చారిత్రిక పరిస్థితులు ప్రస్ఫుటంగా తెలుస్తాయి. సామాజిక పరిస్థితులను ఆశ్రయించుకునే అనేక జానపద కథలు వెలువడ్డాయి. సామాజిక ఇతివృత్తమే జానపద కథలకు మూలం అని చెప్పవచ్చు.

జానపద కథలలో ఎక్కువగా సామాజిక కథలే చేర్చబడి ఉన్నాయని తెలుస్తుంది. జానపదులు వారి యొక్క జీవన స్థితిగతులను కథలలో చెప్పుకుంటారు. ఉదా. రాజులు బర్లు (గేదెలు), గొడ్లు(ఆవులు) పెంచుకున్నట్లు, పెండ (పేడ) తీసినట్లు ఏడుగురు దాసిల కథలో చెప్పుబడింది. చిన్న కోడలు కథలో పేదవారి స్థితిని కుబేరుడు, దరిద్రుని కథలో ధనవంతల ఆలోచన విధానం, వారి జీవనగమనం చెప్పబడింది. జానపదులు సమయం వచ్చినప్పుడు జరుగవలసింది తప్పక జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. జీవితంలో ఏ సంఘటన జరిగినా సులభంగా దానిని పరిష్కరించుకుంటారు.

4 భౌగోళికాంశాలు:
జానపద కథలలో ఆయా గ్రామ వాతావరణం దేవాలయాల ప్రస్తావన, వాటి గొప్పతనం, భక్తుల నమ్మకాలు, సరిహద్దులు, నీటివనరులు, వాగులు, వంకలు, గుట్టల ప్రస్తావన చేయబడుతుంది. నేను సేకరించిన కథలలో, సత్యవతి దేవి కథ, పులిరాజు కథలలో ధర్మపురి దేవాలయాల పరిచయం, గోదావరి నది ఔన్నత్యం కొనియాడబడింది. ఈ ప్రస్తావన సత్యవతిదేవి కథ, పులి రాజు కథలు అతి ప్రాచీన కాలం నుండి ధర్మపురి గ్రామంలో చెప్పుకుంటున్నారని తెలుస్తుంది.

5 శారీరక సమస్యలు – పరిష్కారాలు:
జానపద కథలలో శరీరక సమస్యల పరిష్కారాలు తెలుపబడ్డాయి. పూర్వం జానపదుడు ఆజానుబాహుడిగా, అందగాడిగా ఉన్నట్లు, వారు అనేక మూలికలతో పాటు ఆహార నియమాలు పాటించేవారని ఆంధ్రుల సంస్కృతి చరిత్ర వలన తెలుస్తుంది. ఆయా నియమాలను, వారు వాడే మూలికలను కథలలో చేర్చి ఉండడం వలన, ఆ కథలు ప్రాంతాలను బట్టి మారుతూ అక్కడి ప్రజలకు శారీరక సమస్యలు లేకుండా చేసుకోవడానికి సహాయపడేవని తెలుస్తుంది. మైరావణహతం కథలో 360 మూలికలను కథలో చేర్చి చెప్పడం వలన జానపదుల ఉద్దేశ్యం అర్థమౌతుంది. ఇలాంటి జానపద సంబంధ కథలు భారతదేశంలో ప్రజల వ్యవహారంలో చాలా ఉన్నాయని తెలుస్తుంది.

6. చారిత్రక అంశాలు:
జానపద కథలలో చారిత్రక అంశాలు కూడా ఎక్కువగా ప్రదర్శితమౌతాయి. నా క్షేత్ర పర్యాటనలో లభించిన దుత్తకథ, చేపరాజు కథలలో కత్తికి కటారుకు వివాహం చేసినట్లు తెలుస్తోంది, ఈ పద్ధతి పూర్వ కాలపు రాచరిక సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ధర్మపురి గ్రామ విశిష్టతకు సంబంధించిన సత్యవతి దేవి (ధర్మాంగద పాము పాట) కథలో రాజకుమారి అయిన సత్యవతికి మంత్రి పాముతో వివాహం చేసినట్లు తెలుస్తుంది.

7. మానవీయ అంశాలు:
సమాజంలోని మానవుల స్వభావం కథలలో స్పష్టంగా చిత్రించబడుతుంది. ఆయా స్వభావాల ఆధారంగా ఆయా కాలల పరిస్థితులను అంచనా వేయవచ్చు. చాపరాజు కథలో సవతి తల్లి ప్రేమను, దుత్త కథలో చిన్నవారి ప్రవర్తనను, సవతుల కథలో సవతుల ద్వేషం, స్వార్థంను చిన్నకోడలు కథలో అత్తగారి పెత్తనం, కోడలి జీవనం మొదలైన అంశాలు కనిపిస్తాయి.

8. శిక్షలు:
పూర్వకాలంలో మానవుల తప్పులకు కఠినమైన శిక్షలు ఉండేవని జానపద కథల ద్వారా తెలుస్తోంది. కాపు కథలో, చాప రాజు కథలో సవతి తల్లిని, ఆమె కూతురి తప్పుల నిర్ధారణ చేసి తప్పులకు తగినట్లు శిక్షలు వేసినట్లు తెలుస్తుంది, కాపు కథలో తప్పు చేసిన సవతి తల్లిని ఊరు చుట్టూ తిప్పి గుండుకొట్టించి ఊరౌతల బొందపెట్టి గొడ్లు దాటించడం కనిపిస్తుంది. ప్రజల జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులను జానపద కథలు తమలో కలుపుకున్నాయి. జానపద కథలు కొన్నిసార్లు పదకోశంలాగా కూడా పని చేస్తాయని చెప్పవచ్చు.

9. నరబలి:
పూర్వకాలంలో జంతుబలులు ఎక్కువగా జరిగేవని జానపద కథల వలన తెలుస్తుంది. అడవులలో భూమిని చదును చేసుకుని జానపదులు పంటలు పండించేవారు. ఆ పంటలు సమృద్ధిగా పండాలని, జల్దేవర అను దేవతకు జంతువులను, మనుషులను కూడా బలి ఇచ్చినట్లు జానపద కథకులు నేటికి చెపుతుంటారు. జానపదుల ఆచారాలలో బలికి అత్యంత ప్రాముక్యత ఉంది. సమాజంలో నేటికి ఇల్లు, వంతెన మొదలైనవి కట్టినతరువాత మరియు పండిన పంటను ఇల్లుచేర్చేటప్పుడు జంతువులను బలి ఇవ్వడం కనిపిస్తుంది.

10. రాజుల పూర్వ చరిత్ర:
జానపదుల కథలలో రాజుల పూర్వ చరిత్ర లయాత్మకంగా చెప్పబడుతుంది. వీరి చరిత్రను లయాత్మకంగా చెప్పడం వలన తరతరాలు నిలిచి ఉంటుంది. ఉదా: “మూగన్న ముద్దుడా! నాగరాజు మనుమడా! చాపరాజు కొడుకా దుద్దులు పెట్టిత్తరారా ముద్దుల కుమారా ” అని మరియు కొన్ని గ్రామాల్లో “నాయిన్నా రారా! నా తండ్రి రారా పులి రాజాకు పుట్టిన భూపాల రారా ఎందుకేడ్తున్నవు కొడుకా ఈడ కూసుందువురారా” అని ధర్మపురి మండలంలోని గ్రామాలలో ఈ కథాగేయాలు రకరకాలుగా వాడుకలో ఉన్నాయి.

11. వైద్యం:
జానపదులకు శారీరక సమస్యలు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యం ద్వారా వ్యాధులను నివారించుకున్నట్లు జానపద సాహిత్యం వలన తెలుస్తుంది. గ్రామాల్లో నేటికి చెట్లమందులకు మంచి గిరాకి ఉంటుంది. మైరావణ హతం అను కథలో “ తూటివేరు, తుమ్మవేరు, తూరుపున దొండవేరు, కాశిలో జిల్లేడు వేరు, కాసే గడ్డి మేది చిలుక, తాడిమీది రెక్క పురుగు, తానిబంక, రాతి బంక, పుట్టమీద తెల్లమొలుక, చెట్టుమీద పాసి తీగె, భూతెంకి జామా, భూతకిమ్లి రొమ్ము బంక, పుట్టుపాపని కొంకి నరము, ఊరు తిరిగే సుంకరోని ఎడమ చేతి కొంకినరము, పెద్దమాల ముడ్డి బొక్క, కన్నె పిల్ల కాలి గోరు , చేతిలో నిర్వన్నేకన్ను మొదలైన మూడు వందల అరవై రకాల మందులు మూటవెట్టి, రోటవెట్టి పిట్టచెర్ల గొబ్బిలాల పేగులో తైలంబుతీసి రామలక్ష్మణులను ఈ మత్తుమందులతో పట్టి తెస్తానని మైరావణుడు అన్నట్లు మైరావణ హతం అను జానపద కథలో చెప్పబడింది. మైరావణ హతం అను కథలో 360 మూలికల పేర్లు, దుత్త కథలో కొన్ని వైద్య మూలికల పేర్లు ప్రస్తావించబడ్డాయి. కాపు కథలో ఆకు పసర్ల గురించి చెప్పడం జరిగింది. ఈ కథల ద్వారా జానపదులు తమకి తెలిసిన వైద్యవిధానము ఇతర ప్రాంతాలకు చేరవేసేవారు. అంతేకాకుండా వారి కుటుంబంలోని ముందు తరాలు సులభంగా వైద్య వృత్తిని నేర్చుకోవడానికి అవకాశం ఉండేలా కథలలో వైద్య విధానాలను చేర్చి ఉంటారని తెలుస్తుంది.

12. మూఢ నమ్మకాలు:
జానపదులలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. నా క్షేత్ర పర్యటనలో లభించిన అనేక కథలలో మూఢనమ్మకాలకు సంబంధించిన అనేక సంఘటనలు కనబడ్డాయి. నేను సేకరించిన కథల్లోనూ మూడనమ్మకాల కథలు ఎక్కవగా ఉన్నాయి. పంచాంగం అను కథలో ముందు జరిగే సంఘటనలు చిత్రించబడ్డాయి. ఉదా: తన కొడుకు వలననే రాజకుమారి మళ్ళి కొడుకును కంటుందని పండితుడు చెప్పింది విని అది నమ్మి ఆమే తపస్సు చేస్తుంది. కాపు కథలో భార్యను మొక్కజోన్న తోటకు బలి ఇవ్వడం కనబడుతుంది. ఈ కథలో తల్లి చనిపోయినా మళ్లి వివిధ అవతారాల్లో దర్శనమిస్తుంది. దీనిని బట్టి చనిపోయినవారు వారికి ఇష్టమైనవారు కష్టల్లో ఉంటే తిరిగి వస్తారని నమ్ముతారు. అంతేకాకుండా దయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్ముతారు.

13. సాంప్రదాయాలు:
మానవ సమాజంలోని కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు. ఆచారాలకు, మతవిశ్వాసాలకు జానపద కథలు నిలయం అని చెప్పవచ్చు. ఒక కాలం యొక్క సామాజిక పరిస్థితులు అంచనా వేయుటకు జానపద కథలు సహాయపడతాయి. “పంచాంగం కథలో విధిని ఎక్కువగా నమ్మడం, చేప రాజు కథలో ఆడపడుచులకు చీరలు, నగలు, ఏడుగురు దాసిల కథలో నగలు, చీరలు కూతురుకు వివాహ అనంతరం సారె పంపే సాంప్రదాయం ఉన్నట్లు తెలుస్తుంది”.

14. అద్భుతాంశాలు:
జానపద కథలలో అద్భుతాంశాలు కలిగిన కథలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ అద్భుతాంశాలు కథను అనేక మలుపులు తిప్పి శ్రోతకు ఉత్కంఠను రేకేతిస్తాయి. నేను సేకరించిన దుత్త కథలో సూర్యుడు మూత్రం పోసిన తరువాత పెరిగిన ఆకు కూరను చిన్న కోడలు తినగానే ఆడపిల్ల పుట్టడం, పంచాంగం కథలో భీముడు చెంబులో పోసిన మూత్రం తాగిన రాజకుమారికి మగ సంతానం కలగడం, చాపరాజు కథలో బావిలో రాణిని నాగుపాము కూతురుగా సాదడం, మొదలైన అద్భుత అంశాలు పై కథలలో చెప్పబడ్డాయి.

15. కులతత్వం:
గ్రామాలలో నేటికి అక్కడక్కడ కులతత్వం ఎక్కువగా కనిపిస్తుంది. పూర్వులలో చాల మంది కులము గురించి అడిగేవారుని జానపద కథల ద్వారా తెలుస్తుంది.‘‘ మీది ఏం కులము,మీరు ఏమిటొళ్ళు’’ అనే మాటలు గ్రామాల్లో నేటికి వినిపిస్తున్నాయి. గ్రామాలల్లో ఒక్కో కులాన్నిబట్టి వారి స్థాయి ఆధారపడి ఉంటుంది. మంగలి కథలో మంగలి వాడిని బ్రహ్మణుడిగా చేయడం సాధ్యం కాదని చెప్పడానికి జానపదలు కథను సృష్టించినట్లు తెలుస్తుంది. ఈ కథలో కలమును మార్చుకోవడమనేది ఏ సమాజం ఆమోదించది పరోక్షంగా తెలియజేయబడింది.

16. పురాణాలకు పోలిక:
పురాణాలకి జానపద కథలకి దగ్గరి సంబంధం కనబడుతుంది. పంచాంగం కథలోని భీముని ద్వారా సంతానం పొందే ఘట్టం, మరియు మహాభారతంలో కుంతి నూర్యుని ద్వారా సంతానం పొంది గంగ నదిలో పుత్రున్ని వదిలే సంఘటనలకు దగ్గరి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. పూర్వ కాలంలో రాజులు గాంధర్వ వివాహాలు చేసుకున్నట్లు కాపు కథలో చెప్పబడింది. జానపద కథలలో సందర్బానుసారంగా రాజులు, భూస్వాయులు, పటెళ్ళు అనేకమంది స్త్రీలను వివాహం చేసుకున్నట్లు కనబడుతుంది. పురాణాలు తెలియని గ్రామీణులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్షర జ్ఞానంలేని జానపదులు అనేకులు అనేక పద్యాలను, రామాయణ భారత భాగవతాలను కంఠతా చెప్పడం కనిపిస్తుంది. వీరికున్న ఈ విశిష్ట లక్షణమే ఇతిహాసాలు, పురాణాలలోని పాత్రలను అలవోకగా జానప కథలలో చొప్పించడానికి కారణం అయి ఉండవచ్చు.

17. కథలలో ప్రాంతీయ సమాచారం :
జానపద కథలలో ఆయా ప్రాంతాల సమాచారం ఎక్కువగా కనిపిస్తుంది. పంచాంగం కథలో రాణి భీముని ద్వారా కొడుకుని కని గంగనదిలో వదలడం జరిగింది, ఆ గంగానదికి దగ్గర్లో గుడి ఉండడాన్ని బట్టి ఈ కథకి ధర్మపురి గ్రామానికి సంబంధం ఉండి ఉండవచ్చు. కనుకనే ఈ కథ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువ ప్రచారంలో ఉందని తెలుస్తుంది. ఈ కథలో బెస్తవాళ్ళు నదిలో వదిలిన పిల్లవాడిని తీసుకున్నట్లు చెప్పబడింది ధర్మపురి గ్రామంలో నదిని ఆనుకొని బెస్తవాడ ఉంది. దీనిని గంగపుత్ర వాడ అని కూడ అంటారు. సత్యవతి దేవి కథలో గంగానది నుండి మూడు పిరికిండ్ల ఇసుక తెచ్చి స్థంభం ఏర్పరిచినట్లు చెప్పబడింది. దీనిని బట్టి గ్రామ చరిత్రలు(కైఫియత్తులుగా) జానపద కథలలో చెప్పుకుంటారని తెలుస్తుంది. ఈ కథలలో చింతామణి చెరువు, గోదావరిలోని గుండాలు, బావులు, వాగులు సరిహద్దులు మొదలునవి కనిపిస్తాయి,
ముగింపు : మానవ సమాజంలో రకరకాల మతాలు, కులాలవారు ఉంటారు. ఈ కులాలలో వారి వారి వస్తు సామాగ్రిని, వారు చేసే పనిని, వారి కష్ట సుఖాలను జానపద కథలలో చొప్పించి కథలు చెప్పుకుని వారి బాధలను మరచిపోయేవారు. సమాజంలో మూఢనమ్మకాలపై చాలా మంది సంఘ సంస్కర్తలు పోరాటం చేశారు. కాని వీరికంటే చాలా సంవత్సరాల ముందు నుండి జానపదులు నిరంతరం మూఢనమ్మకాల నిర్మూలనకై జానపద కథలలో సందేశాన్ని లోకానికి అందించారని చెప్పవచ్చు.

జానపద కథలలో అనేక సందేహాలకు పరిష్కరాలు, మానవ జీవితంలో సంక్రమించే వ్యాధులకు మూలికలు, వ్యవసాయ పనిముట్లు మొదలైన అంశాలు చేరి ఉంటాయి. జానపద కథలు మానవ జీవితమును ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. నేటికాలంలో మార్గదర్శకత్వం చేసేవారు ఎక్కువ కథలతో కూడిన సందేశాన్ని విద్యార్థులకు, శ్రోతలకు అందిస్తారు. అప్పుడే అవి చక్కగా అర్థమౌతాయి. నేటి కాలం మార్గదర్శకులైన బి.వి. పట్టాబిరామ్ (విజయంమీదే ), శివ్ ఖేరా (మీరు విజయం సాధించగలరు), యండమూరి వీరేంద్రనాథ్ (విజయానికి 5 మెట్లు) మొదలైన వారు వారి గ్రంథాలలో జానపద కథలతో విద్యార్థుల జీవితానికి మార్గదర్శనం చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

తాటికాయల భోజన్న,

                                                                                        పరిశోధక విద్యార్థి,

                                                                         జానపద  గిరిజన విజ్ఞన  పీఠం,

వరంగల్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)