తెలుగు నవలా  “కీర్తికిరీటాలు”లో కలికితురాయి సులోచనారాణి నవలలు- అరసిశ్రీ

ISSN 2278-478

సాహితీ లోకానికి శాశ్వత రాజీనామా చేసిన “సెక్రటరీ” . దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలారచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందారు ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి……యద్దనపూడి సులోచనారాణి.

యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. వీరిది సమిష్టి కుటుంబం. అమ్మనాన్నలకి ఆఖరి సంతానం. ఐదుగురు అక్కయ్యలు-బావలు, ముగ్గురు అన్నయ్యలు-వదినలు, పిన్నులు-బాబాయిలు, అత్తయ్యలు-మామయ్యలు, ఇరుగుపొరుగు బంధువులు. అది చిన్నపాటి సంఘంలా ఉండేది అంటారామె . ఊరికి అప్పుడే జిల్లా పరిషత్‌ హైస్కూలు వచ్చింది. ఆ సంవత్సరమే (1956) ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పరీక్షలు రాశారు.

“అప్పటికి నేనింకా చీరలు కట్టడం లేదు. పరికిణీ-ఓణీ వయసే. మొదటి కథ ‘చిత్ర నళినీయం’ ఆంధ్రపత్రిక వారపత్రికలో 1956 మే నెలలోనే ప్రచురితం అయింది. అప్పుడు ఆంధ్రపత్రిక సెంటర్‌ స్ర్పెడ్‌లో ‘యద్దనపూడి సులోచనారాణి’ అని ప్రప్రథమంగా నా పేరు చూసుకుని పొందిన ఆనంద స్మృతి పరిమళం నా మనసులో శాశ్వతంగా ఉండిపోయింది. కథ పడటమే కాదు.. రెండు వారాల తర్వాత పత్రిక నుంచి 15 రూపాయల పారితోషికం నన్ను వెతుక్కుంటూ రావటం మరింత ఆనందం కలిగించింది. మొట్టమొదటిసారిగా నేను ‘యద్దనపూడి సులోచనారాణి’ అని సంతకం చేసి అందుకున్న డబ్బు “అది అంటూ తన అనుభవాలను ఇటివల ఒక ఇంటర్వ్యు లో పంచుకున్నారు సులోచనారాణి .

ఆ తర్వాత వెంటవెంటనే జరిగిన సంఘటనలు ఆమే జీవితంలో ఎన్నో మార్పులను తీసుకు వచ్చిందని చెప్పాలి . రామాయణ భాగవతాలను పాటల రూపంలో చెప్పి, కథలపట్ల ఆసక్తి కలిగించిన వీరి అమ్మమ్మ ఆ వేసవిలో పోయింది. తర్వాత ఏడాది తిరగకుండా అమ్మ పోయింది. 1958 లో హైదరాబాద్‌ అత్తవారింటికి రావడం జరిగాయి . పల్లెటూరు నుంచి పట్నం రావడం , అత్తగారూ ఆడబడుచు పిల్లలూ… అంతా కొత్త వాతావరణం. ఇంతలో ఏడాదిలో వీరి నాన్న గొంతు క్యాన్సర్‌తో కన్నుమూసారు . పుస్తకాలు చదవం ,కథలు రాయడం మొదలు పెట్టారు .

యద్దనపూడి సులోచనారాణి రచనా జీవితంలో తొలినవల “సెక్రటరీ” ఆమెని నాటి నవలా రంగంలో  అగ్రస్థానంలో నిలిపింది.  అప్పటికి వీరికి 23 సంవత్సరాలు. అప్పుడే అమ్మాయి పుట్టింది. తల్లిగా కొత్త అనుభూతి! ఉక్కిరిబిక్కిరి అయ్యే సంతోషం. ఇంకో కొత్త సంతోషం… అమ్మాయితో పాటు సెక్రటరీ నవల కవల పిల్ల అన్నట్టుగా నా హృదయంలోకి వరదలా వచ్చేసింది అంటారామె . ఆ నవలకి వచ్చిన పాపులారిటీ, ప్రశంసలు అంతా ఇంతా కాదు . తరవాత కాలంలో ఆమెకు వచ్చిన ప్రాచుర్యం ఏ స్థాయికి చేరిందంటే పలువురు మగరచయితలు తమ సొంతపేర్లతో నవలలు పంపితే పత్రికల్లో ప్రచురణ కావట్లేదని స్త్రీపేర్లతో నవలలు పంపే స్థితి ఏర్పడింది. ఎందరో అక్షరాస్యుల్ని సాహిత్య పాఠకులుగా మార్చడం కూడా సెక్రటరీ నవల సాధించిన విజయంలో భాగమే.

ఆగమనం , ఆరాధన ,జీవన సౌరభం ,ఆరాధన , జాహ్నవి ,ఆత్మీయులు , దాంపత్యవనం ,అభిజాత , నిశాంత , అభిశాపం , ప్రేమ , అగ్నిపూలు , ప్రేమదీపిక , ఆహుతి , అమర హృదయం , అమృత ధార ,అనురాగ గంగ ,అర్ధస్థిత, ఆశల శిఖరాలు , అవ్యక్తం ,ఋతువులు నవ్వాయి , కలల కౌగిలి , కీర్తికిరీటాలు, కీర్తికిరీటాలు, గిరిజా కళ్యాణం, చీకటిలో చిరుదీపం, జీవన సౌరభం ,జాహ్నవి , దాంపత్యవనం , నిశాంత , ప్రేమ, ప్రేమదీపిక , ప్రేమపీఠం , బహుమతి , బందీ , బంగారు కలలు , మనోభిరామం , మౌనతరంగాలు , మౌన పోరాటం , మౌనభాష్యం , మోహిత, వెన్నెల్లో మల్లిక ,విజేత, శ్వేత గులాబి , సెక్రటరీ , సౌగంధి , సుకుమారి  మొదలైనవి వీరి నవలలు  .

యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగు అడుగుపెట్టారు. 1965లో ‘మనుషులు మమతలు’ సినిమాకు కథను అందించారు. తర్వాత ఆమె రాసిన ‘మీనా, ‘జీవన తరంగాలు’, ‘సెక్రటరీ’, ‘రాధాకృష్ణ’, ‘అగ్నిపూలు’, ‘చండీప్రియ’, ‘ప్రేమలేఖలు’, ‘విచిత్రబంధం’, ‘బంగారుకలం’ లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి.

మీనా నవల పత్రికలో ధారావాహికగావచ్చింది. ఆ పేరునూ పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీశారు. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు.

ఆమె రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్‌లో వచ్చిన ‘రాధా మధు’ సీరియల్‌ కథ కూడా యద్దనపూడిదే. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే మొదటి తెలుగు మెగా డైలీ సీరియల్ ఋతురాగాలు కథ కూడా యద్దనపూడి గారి కాలం నుండి వెలువడిందే. డైరెక్టర్ మంజుల నాయుడు గారి తో కలిసి ఆమె చాలా సీరియల్స్ కు కథ రాసారు.

  యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
ఈ నవల సెక్రటరీ. జ్యోతి మాసపత్రికలో 1964లో ధారావాహికగా ప్రచురితమైంది. ప్రాచుర్య నవలా సాహిత్యం మొదట్లో కొవ్వలి, జంపన నవలలతో ప్రారంభం కాగా 1960 దశకం నుంచి వచ్చిన నవలలో  మైలురాయిగా సెక్రటరీ నవల నిలుస్తుంది.

1964లో తొలిసారిగా ఈ నవల ధారావాహికగా ప్రచురణ పొందుతున్న రోజుల్లో నవలా పఠనం అలవాటు ఉన్న కుటుంబాలలో జయంతి, రాజశేఖరాలు వారిలో ఒకరైపోయారని విమర్శకులు ప్రశంసించారు. ఆ రెండు పాత్రల జీవితాల్లో మలుపులు, సంఘటనలు తమ బంధుమిత్రుల జీవితాల్లోనివే అన్నంతగా పాఠకులు అనుభూతిని పొందారు .
లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయగానసభలో నవలకు నీరాజనం కార్యక్రమం జరిగింది. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రచించిన ‘సెక్రటరీ’ నవల సర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం సులోచనారాణిని సత్కరించారు.

మధ్య తరగతి మనస్తత్వాలు, ,మన చుట్టూ కనిపించే జీవితాలే ఆమె కథ వస్తువులు. ఆత్మభిమానం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే అమ్మాయిలే ఆవిడ నవలా నాయికలు. నవల చదువుతున్నంత సేపు మనసుకు హాయిగా కలిగిస్తాయి . స్త్రీ సమస్యలే ఆమె రాసిన ప్రతి కథలో ప్రధానం గా కనిపిస్తాయి. ఎవరి అహం దెబ్బతినకుండా పాత్రలను నడిపించిన తీరు కనిపిస్తుంది. మధ్య తరగతి అమ్మాయిలే లక్ష్యం గా ఆమె నవలలు రాసేవారని అప్పట్లో విమర్శలు కూడా ఉండేవి. సమాజం లో అమ్మాయిల వాస్తవ ఆలోచనలే కథలో పాత్రల ద్వారా చెబుతుంటా అని ఆమె అంటుండేవారు.
వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు.

ఓసారి నార్ల వెంకటేశ్వర్రావు గారు స్వయంగా వీరి ఇంటికి వచ్చి ‘జీవనతరంగాలు’ నవల రాబోయే కథ ఫారాలని కంపోజర్స్‌ ద్వారా డబ్బులిచ్చి స్మగుల్‌ చేయించుకుని పాఠకులు చదువుతున్నారని చెప్పారు. ఒక రైటర్‌ నవల ఆదరణకి ఇంతకంటే పడికట్టు రాయి ఏముంటుంది ? ఆంగ్లంలో ఒకే ఒక రచయితకి ఇలాంటి పాపులారిటీ దక్కిందని చెప్పారాయన అంతటి ఆదరణ ఉండేది వీరి రచనలకి .

‘కోకిల’ ఆడియో క్యాసెట్‌ మేగ్‌జైన్‌. ఇది ఇండియాలోనే కాదు- బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్త ప్రయోగం . ఆడియో మేగ్‌జైన్‌ చేయడానికి ముఖ్య కారణాలు మూడు… ఒకటి అంధులు, రెండు వృద్ధులు, మూడు చదువురాని వర్గాలు అని పేర్కున్నారు సులోచనారాణి . మేగ్‌జైన్‌ మంత్లీ. ఎనిమిది నెలలు వరసగా రిలీజ్‌ చేశారు. చాలా బాగుంది అని ప్రశంసల వర్షం కురిసింది. కానీ డబ్బు రాలేదు. లాభాలు లేకుండా పోవడం , డబ్బంతా అయిపోయింది. మార్కెటింగ్‌లో సున్నా క్యాటగిరీకి వెళ్లింది. మేగ్‌జైన్‌ ఆగిపోయింది.

నిరుపేదలకు ఏదో ఒకటి చేయాలని నిరంతరం తపన పడేవారు . అందుకే ‘విన్‌’ (విమెన్‌ ఇన్‌ నీడ్‌) అనే సేవా సంస్థను స్థాపించారు. దాని ముఖ్యోద్దేశం – వృద్ధులైన స్త్రీలకి, పేద తరగతి మహిళలకి, పిల్లలకి అవసరమైన సాయం చేయటం. హెల్పేజ్‌ ఇండియా వారు వచ్చి చూసి, దీన్ని పెంచమనీ భారీగా గ్రాంట్‌ ఇస్తామనీ చెప్పారు. ఒక చిన్న పాఠశాల ఏర్పరిచి పనిపాటలు చేసుకునే వారి పిల్లలకి చదువు చెప్పడం మొదలుపెట్టారు . అనతికాలంలోనే దానికి బాగా ఆదరణ పొందింది .

యద్దనపూడి సులోచనారాణి తెలుగు నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. ఎందరో వర్ధమాన రచయితలకి , రచయిత్రులకి ఆమె సాహిత్యం ప్రేరణ . చదువరుల హృదయాల్లో ఆమె స్థానం అజరామరం . ఆమె సృష్టించిన పాత్రలు , వాటి వ్యక్తిత్వాలు మన సమాజంలో ఇప్పటికి ఎప్పటికి సజీవంగా పలకరిస్తూనే ఉన్నాయి , ఉంటాయి కూడా . రచన పరంగానే కాకుండా సామాజిక సేవకురాలిగా సగటు మనుషులందరికీ ఆమే ఒక ఆదర్శం. 

– అరసిశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , Permalink

Comments are closed.