‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

రాజకీయ దురంధరుడైన పురుషుని ‘’స్టేట్స్ మన్ ‘’అంటాం .మరి అంతే రాజకీయ పరిజ్ఞానం ఉన్న మహిళను యేమని పిలవాలి ?’’స్టేట్స్ ఉమన్ ‘’అని పిలుస్తాం .అలాంటి రాజకీయ దురంధరత్వం కల మహిళా మణి,విదుషీమణి షీలాకౌల్ .7-2-1915 జన్మించిన షీలాకౌల్ ,లాహోర్ మహిళా కాలేజిలో చదివి బి.యే.డిగ్రీ పొంది ,లాహోర్ లో గంగారాం ట్రెయినింగ్ కాలేజిలో విద్యాబోధన శిక్షణ పొందింది .అవిభక్త పంజాబ్ లో ఆమె బాడ్ మింటన్ చాంపియన్ ట్రోఫీ గెలుచుకున్నది .

లక్నో లో నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ నిర్మించిన కైలాస్ నాథ్ కౌల్ ను వివాహమాడింది .వీరి కుమారులిద్దరూ ప్రతిభా సంపన్నులే .గౌతమ్ కౌల్ ఇండో –టిబెటన్ బార్డర్ పోలీస్ కు డైరెక్టర్ జనరల్ ,ప్రసిద్ధ సినీ క్రిటిక్ .విక్రం కౌల్ అంతర్జాతీయ స్పోర్ట్స్ అడ్మి నిస్ట్రేటర్.కుమార్తె దీపక్ కౌల్ మాజీ మంత్రి ,ప్రముఖ సాంఘిక సేవకురాలు .జవహర్లాల్ నెహ్రు కౌల్ కు బావమరది .ఇందిరాగాంధీ మేనకోడలు .

షీలాకౌల్ లక్నో మునిసిపల్ కార్పోరేషన్ లో 1959 లో సభ్యురాలై రాజకీయ అరంగేట్రం చేసి ఆరేళ్ళు పని చేసింది .తర్వాత ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికై 1968 నుండి 71వరకు మూడేళ్ళు సేవలందించింది .ఆ తర్వాత మూడు సార్లు 1971,80,84లో లక్నో నుండి ,రెండు సార్లు 1989,1991 లో రాయ్ బరేలీనుంచి మొత్తం అయిదు సార్లు పార్లమెంట్ కు ఎన్నికై గొప్ప రాజకీయ దురంధురాలని ,ప్రజా సేవా పరాయణు రాలని నిరూపించుకున్నది .కేంద్ర ప్రభుత్వ మంత్రిగా 1980-84 మరియు 1991-95కాలాలలో రెండు సార్లు తన దక్షత నిరూపించుకున్నది ..చివరగా 1995 -96 లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేబట్టి తన సమర్ధత చాటింది .1975లో బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించింది .1980లో కోపెన్హాం లో జరిగిన ‘’ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ కమ్మిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ వుమెన్ ‘’కు ,1980 లో సోఫియా లో జరిగిన ‘’ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది రోల్ ఆఫ్ కల్చర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మాన్ అండ్ సొసైటీ కి, 1982 మరియు 83 పారిస్ ‘’ది సెషన్స్ ఆఫ్ జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది యునెస్కో’’ కు ,1983లో పియోన్ గియాంగ్ లో జరిగిన ‘’ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆఫ్ ది నాన్ అలైన్డ్ అండ్ ఆదర్ డెవలపింగ్ కంట్రీస్ కు ,1984 లో జెనీవాలో జరిగిన ‘’ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ‘’కు షీలాకౌల్ నాయకత్వం వహించింది .1985 ,87 లలో యు .యెన్ .జనరల్ అసెంబ్లీకి ,1990లో యూరోపియన్ పార్లమెంట్ కు హాజరై మన్ననలు అందుకున్నది .1988 లో భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ జనరల్ సేక్రేటరిగా ఎన్నుకోబడి సేవలందించింది .

ఇలా షీలా కౌల్ పార్టీలోను ,ప్రభుత్వం లోను వివిధ హోదాలలో సేవలు అందిస్తూ దేశంలో, విదేశాలలో కీర్తి సాధించి ప్రజల మన్ననలు అందుకుని ‘’స్టేట్స్ వుమన్ ‘’అని పించుకున్నది. అన్నీ ఆమె సమర్ధత అర్హత లను బట్టి పొందిన అధికారాలే .

1991లో పార్లమెంట్ లో 74 వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టినఘనత పొందింది కౌల్ .అలాగే అంతకు ముందే ఆలీఘర్ ముస్లిం యూని వర్సిటి సవరణ బిల్ ప్రతిపాదించి అమలు జరిగేట్లు చేసింది . కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్,కమిటీ ఆన్ ప్రివిలేజెస్ ,జాయంట్ కమిటీ ఆన్ టాక్సేషన్,కన్సల్టేటివ్ కమిటీ ,మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ,సబ్జెక్ట్ కమిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ లలో సభ్యురాలై తన అమూల్య సలహా సంప్రదింపులతో వాటికి పరిపుష్టి కలిగించింది .ఇన్ని రకాల పబ్లిక్ సేవలో ఆరితేరిన ఆమె పై 1996 లో ఆమె కేంద్ర పట్టణాభి వృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అసిస్టెంట్లు ఇద్దరితోకలిసి ప్రభుత్వ దుకాణాలను కారుచౌకగా సన్నిహితులకు కట్టబెట్టిందని అభియోగం తెచ్చారు .సి. బి .ఐ. తనిఖీలు చేసి౦ది కాని ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ఏ ఆధారాలు లేవని తెలియజేసింది. ఆమెఆస్తులను దేనినీ స్వాధీనం చేసుకోలేదుకూడా .కేసు సాగి సాగి ఆమె వృద్ధాప్యం వలన విచారణకు హాజరు కాలేకపోయింది .కౌల్ చనిపోయిన ఏడాది తర్వాత ఆమె మాజీ అడిషనల్ ప్రైవేట్ సెక్రెటరి కి కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించింది .

శతమానం భవతి అన్నట్లుగా షీలా కౌల్ నిండు నూరేళ్ళూ జీవించి 13-6-2015 మరణించింది .ఆమె చనిపోయే వరకు షీలా కౌల్ ఒక్కరు మాత్రమె పార్లమెంట్ లో అతి వృద్ధ సభ్యురాలై రికార్డ్ సృష్టించింది .గొప్ప విద్యావేత్త ,విదుషీమణి ,రాజకీయ వేత్త ,సంఘ సేవకురాలు ,సంఘ సంస్కర్త ఐన షీలా కౌల్ వీటికి మించి రాజకీయ దురంధురాలైన ‘’స్టేట్స్ ఉమన్ ‘’.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~!~~~ 

వ్యాసాలుPermalink

Comments are closed.