కాండ్రించి ఉమ్మండి(కవిత )..అఖిలాశ

అక్కడో పుట్ట పగిలి

కామం పూసుకున్న పురుగులు

ఒక్కొక్కటిగా….

సీతాకోకచిలుక దేహాన్ని నలిపేశాయి…!

గుమికూడిన కొన్నితోడేళ్ళు

మత మూత్రాన్ని తాగి బలిస్తే…

మరికొన్ని

కుల మలినాన్ని తిని కొవ్వెక్కితే…

ఇంకొన్ని

జాతి రక్తాన్ని సప్పరిస్తూ…

లేత కొమ్మలను విరిచేశాయి…!

మత్తెక్కిన దేహం గమనిస్తూనే ఉంది…

శరీరంపై పాకుతున్న

కామనాగులేసిన కాటుకి

రక్తం చిమ్మిన ఆ ప్రదేశమంతా

తెల్లటి విషంలో మరణించింది…!

కీచకులందరూ కలిసి

చిట్టి దేహాన్ని పొడిచి పొడిచి తింటుంటే

లోయలలోనున్న నగ్న ప్రతిమ యొక్క

నల్లని కనుగుడ్లు

శిఖరం పైకెక్కి తీక్షణంగా వీక్షించాయి…!

నరకాన్ని దేహంలో నింపుతున్నప్పుడు

అమ్మా అని రోధించాలనుకుంటే…

కంఠసీమలోనే మాటలన్నీ

మౌనంగా నిర్జీవమయ్యాయి…!

ఎవరైనా తనకొక చిన్న సహాయం చేయగలరా…

మీ నోటి నిండా ఉమ్మిని నింపుకొని

ఆ కామాంధులపై కాండ్రించి ఉమ్మండి…

మాటల చెప్పులతో తరిమి కొట్టండి

శిక్షల తూటాలతో వారి మెదళ్ళను

తూట్లు పొడవండి…

న్యాయ ఖడ్గంతో వారి అంగాలను కోసి

సమాజపు గుమ్మానికి వేలాడతీయండి…

మీలో ఎవరైనా

ఆ చితికిపోయిన దేహాన్ని సరిచేయగలరా !

కామపొరల్లో బంధి అయినా

ఆ బాల్యాన్ని రక్షించగలరా !

సమాధైన విలువలను

ఆకాశ అంచులకు చేర్చగాలారా !

నేను వెళ్తున్నా…

మీలో ఎవరైనా !

నా పాదముద్రలకు నీడై అనుసరించండి…!

-అఖిలాశ

~!~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.