మేఘసందేశం-09 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు యొక్క గంభీర, నర్మగర్భ భావాలు కొన్ని చూద్దాం. చర్చించాలంటే మొత్తం ఇతని కవిత్వాన్నంతా చూడాల్సిందే! ప్రతి శ్లోకమూ రసాత్మకమే. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత అంటారు విమర్శకులు. అందువల్ల ఇక్కడ నామ మాత్రంగా చెప్తాను.

రఘువంశం మహా కావ్యం (4-32) లో ఒక శ్లోకంలో “స సేనాం మహతీం కర్షన్ పూర్వసాగరగామినీం| బభౌ హరజటాభ్రష్టాం గంగామివ భగీరథ: ” అంటాడు. ఈ శ్లోకం పైకి చూడ్డానికి చాలా చిన్నదిగా కనిపించినా అర్థం అపారం. ఎన్నో భావాల్ని చిన్న పదాల్లో పొదిగి వ్రాశాడు కాళిదాసు. ఇక్కడ మనం కొద్దిగా గతంలోకి వెళ్ళాలి. సూర్యవంశంలోనే పుట్టిన సగరుడనే చక్రవర్తి రఘువుకు పూర్వీకుడు. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగంలో వాడే గుర్రాన్ని పాతాళంలో దాచేస్తాడు.

ఆ గుర్రాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని అరవై వేలమంది కొడుకులు భూమిని తవ్వి సముద్రాన్ని తయారు చేస్తారు. అక్కడ పాతాళంలో గుర్రాన్ని కపిలమహాముని దగ్గర ఉండడం చూసి, ఆయన్ని విమర్శించి, అతని శాపానికి భస్మమై పోతారు. వాళ్ళకి ఉత్తమగతులు లభించాలంటే స్వర్గంలో ఉన్న గంగను పాతాళానికి తేవలసి వచ్చింది. సగరుడూ అతని కొడుకు అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని మనుమడు భగీరధుడు, తన తాతలకు ఉత్తమగతులు ప్రాప్తించాలని, రాజ్యం వదులుకుని, గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై, నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు? అని అడిగింది. అప్పుడు భగీరధుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన శివుడు గంగను భూమి మీదకి వస్తూంటే తన తలపై మోపి, జటాజూటంలో బంధిస్తాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదులుతాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగుతుంది. దాన్ని భగీరథుడు తూర్పుసముద్రంలో ఉన్న తాతల బూడిదల మీదకు పంపి వాళ్ళకు ఉత్తమగతులు కలిగిస్తాడు. అకుంఠిత దీక్ష, అనంతమైన పట్టుదలకు మారు పేరుగా భగీరథ కృషిని పేర్కొంటారు. అదీ అసలు కథ. ఈ శ్లోకంలో పాత సన్నివేశంతో పోలిక చెపుతున్నాడు కాళిదాసు. పోలికలు ఉపమానాలు కాళిదాసు తర్వాతే కదా ఏ కవి అయినా! రఘువు వెనక తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న గొప్ప సేన, ఈశ్వరుడి జడల మధ్య నుంచి జారిపోయి భగీరథుని వెనుక తూర్పు సముద్రం వైపు పరిగెత్తుతున్న గంగలా ఉంది అని. ఇది కేవలం వస్తువుల మధ్య, మనుష్యుల పోలిక మాత్రమే కాదు. ఆశయాల్లో పోలిక, భావసంపదలో పోలిక, ఆదర్శాల్లో పోలిక. ఇక్కడ మనకి కాళిదాసులోని ప్రతిభావ్యుత్పత్తులు అర్థమవుతాయి.
మనం మరలా మేఘసందేశ వ్యాఖ్యానంలోకి వద్దాం.

శ్లో.36. అప్యన్యస్మింజలధర మహాకాళమాసాద్య కాలే
స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః,
కుర్వన్సంధ్యాబలిపటహతాం శూలినః శ్లాఘనీయా
మామంద్రాణాం ఫలమవికలం లప్స్యసే గర్జితానాం.

భావం: యక్షుడు తన అబ్యర్ధనను కొనసాగిస్తున్నాడు. ఓ మేఘుడా! నీవు, ఆ మహాకాళక్షేత్రానికి ఒకవేళ ముందుగా చేరినా సరే! సాయంకాలం వరకు వేచి ఉండు. ఎందుకంటే ఆ సాయంసంధ్యాకాలంలో కొనియాడతగిన ఈశ్వరునికి పూజ జరుగుతూండగా, శివునికి సాయంసంధ్యాకాలం పూజలు పరమప్రీతికరం కదా! నీవు కొంచెం కొంచెంగా ఉఱిమితే, ఆ ఉరుములు పటహములు అంటే తప్పెటలు లేక నగారాలు వాయించినట్లుంటుంది. నీకు కొంచెం గంభీరాలైన ఉఱుములు ఉన్నందుకు, భగవత్సన్నిధిలో ఉపయోగించడంవల్ల ప్రయోజనం కలుగుతుంది అని చెప్తున్నాడు యక్షుడు.

విశేషాలు: మనకు భగవంతుడు దేహంతోపాటు అనేక శక్తులు కూడా ఇచ్చాడు. ఇది మనం గుర్తించినట్లైతే ఈ దేహాన్ని ఆ శక్తులను ఈశ్వర సేవకు అంటే భాగవతసేవకు ఇంకా శరీరావయవలోపంచేత సహాయం కోరేవారు, ధనజనలేమిచేత నిస్సహాయులైన వారు, ఈ రెండురకాల దీనజనసేవకు కూడా ఉపయోగించినట్లైతే పరమ శ్రేయోలాభం కలుగుతుంది. అంటే భగవంతునికి మనమంటే ఇష్టం కలుగుతుంది. ఈ జన్మకు సాఫల్యం – ఈశ్వరుడు మనల్ని ఇష్టపడటమే! అంతకంటే పరమావధి ఏమున్నది అంటున్నాడు యక్షుడు. ఇక్కడ “కొనియాడతగిన” అనే ఈ విశేషణం ఈశ్వరునికీ అన్వయించుకోవచ్చు అలాగే పూజకు కూడా అన్వయించుకోవచ్చని తెలుస్తోంది.

శ్లో.37. పాదన్యాసక్వణితరశనాస్తత్ర లీలావధూతై:
రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః క్లాంతహస్తాః,
వేశ్యా స్త్వత్తో నఖపదసుఖాన్ప్రాప్య వర్షాగ్రబిందూ
నామోక్ష్యంతే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్కటాక్షాన్.

భావం: ఆ సంధ్యాపూజ సమయంలో పుణ్యస్త్రీలు, వేశ్యామణులు నాట్యం చేస్తూ ఉండగా వారి వడ్డాణ్ణాల ధ్వనిస్తూ ఉండగా, చామరాలతో మహాకాళేశ్వరస్వామికి వీచుతుండగా, నీవు వారిమీద పడేటట్లు చల్లగా నీటిబిందువుల్ని వర్షిస్తే, నిన్ను తుమ్మెదబారుల్లాంటి కడగంటిచూపులతో చూస్తారు. వారి నఖ క్షత స్తానంలో హాయిననుభవించి నీ వుపకారానికి గుర్తుగా వారి నీ వైపు చూశే చూపులు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి.

శ్లో.38. పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః
సాంధ్యం తేజః ప్రతినవజపాపుష్పరక్తం దధానః,
నృత్యారంభే హర పశుపతేరార్ద్రనాగాజినేచ్ఛాం
శాంతోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా.

భావం: సాయంకాలపూజ తర్వాత, శివుడు, తాండవ నృత్యానికి పూనుకొన్నప్పుడు, ఎత్తిన ఆయన చేతులమీద, క్రొత్త మందార పువ్వులా ఎఱ్ఱనైన సంధ్యాకాంతి గల నీవు వ్రాలి రక్తంచేత తడిసిన గజచర్మంమీద ఆయనకు గల కోరికను పోగొట్టు. అప్పుడు అమ్మవారి నయనాలు భయంపోయి, స్తిమితపడతాయి. నీవల్ల ఆవిడకు గజచర్మభయం పోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు నిన్ను వారు బహు వేడుకగా చూస్తారు. నీవు ఇలా వారి అనుగ్రహానికి కూడా పాత్రుడవు కావచ్చు.

శ్లో.39. గచ్ఛంతీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం
రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యైస్తమోభిః,
సౌదామిన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గ స్తనితముఖరో మాస్మభూర్విక్లబా స్తాః.

భావం: ఓ మేఘుడా! ఆ మహాకాళేశ్వరుని సేవ పూర్తి అయిన తర్వాత తిరిగి నగరసంచారం జరుగుతుంది కదా! ఆ ఉజ్జయినిలో కటికచీకట్లో రమణుల ఇంటికి పోతున్న స్త్రీలకు, అంటే అభిసారికలకు నీ మెఱపులతో దారి చూపు అంతే! ఏ మాత్రం ఉఱమవద్దు సుమా! వర్షింపనూ వద్దు. ఉఱిమినా లేక వర్షించినా పాపం ఆ యువతులు భయపడతారు.

విశేషం: శ్లోకంలో కాళిదాసు “నికష స్నిగ్ధయా” అనే పదం ఒకటి వాడాడు. ఇది ఉపమాలంకారం కాగా, ఉరమవద్దు, వర్షించవద్దు అనడం కావ్యలింగలంకారం అవుతుంది. వికబ్లా: అనే పదం ఒకటి వాడి కారణం చెప్పడం వలన పదార్ధ హేతుకం అవుతుంది.

శ్లో.40. తాం కస్యాంచిద్భవనవలభౌ సుప్తపారావతాయాం
నీత్వా రాత్రిం చిరవిలసనాత్ ఖిన్నవిద్యుత్కళత్రః,
సూర్యే దృష్టే పునరపి భవాన్వాహయేదధ్వశేషం
మందాయంతే న ఖలు సుహృదామభ్యుపేతార్థకృత్యాః.

భావం: నీ భార్య అయిన సౌదామని (మెఱపు) మెఱసి మెఱసి అలసి సొలసి ఉంటుంది. అంత ఆమెతో కూడి నీవు పావురాలు నిద్రిస్తున్న ఏదైనా ఒక భవనంమీద ఆ రాత్రి గడపి మరల తెల్లవారగానే, ప్రయాణం చెయ్యి. మిత్రులకు ఉపకారం చేయడానికి అంగీకరించి, అందుకు పూనుకొన్న నీలాంటివారు ఆలస్యం చేయరు కదా! నీవు నా మిత్రుడవు కాబట్టి నా విషయంలో ఏమాత్రం ఆలశ్యం చేయవు సుమా! అని అన్యాపదేశంగా చెప్తున్నాడు యక్షుడు.

శ్లో.41. తస్మిన్కాలే నయనసలిలం యోషితాం ఖండితానాం
శాంతిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు,
ప్రాలేయాస్రం కమలవదనాత్సో౭పి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః.

భావం: ఆ సూర్యోదయసమయం అంటే కొందఱు భర్తలు తమ సతుల కన్నీళ్లు తుడిచే సమయం. కన్నీళ్ళు ఎందుకు తుడవాలంటే మఱి భర్తలు రాత్రంతా తిరిగి తిరిగి తెల్లవారాక ఇంటికి వస్తే ఏడవరా? రాత్రంతా ఎక్కడ తిరిగారో తెలివైన మీకు తెలుపక్కరలేదు కదా! అటువంటి సతులను ఖండితలు అంటారు. అలాగే సూర్యుడు ఉదయాన రాగానే, ఖండిత లాంటి పద్మిని (తామరపువ్వు) మంచు అనే కన్నీటిని నింపుకొంటే, ఆ కన్నీటిని తుడువడానికి సూర్య కిరణాలు అనే చేతుల్ని చాపుతూంటాడు. అప్పుడు మాత్రం నీవు దయచేసి అడ్డు పోకు. వారికి బాగా కోపం వస్తుంది. అది నీకు కూడా మంచిది కాదు సుమా!

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)