ఆకాశానికెగిసిన ‘జేజిమావయ్య’ వాణి – అరసి శ్రీ

ISSN 2278-478

బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. గీతరచయితగా, ఆకాశవాణికేంద్రంలో స్వరకర్తగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించారు.

జననం :

తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన బాలాంత్రపు రజనీకాంతారావు. 1920 జనవరి 29వ తేదీన నిడదవోలులో జన్మించారు . రజని కుటుంబం లోని వారంతా పండితులుగా , కవులుగా ప్రఖ్యాతమైన వారే . రజని తండ్రి “కవిరాజహంస” బాలాంత్రపు వేంకటరావు “వేంకటపార్వతీశ కవుల”లో ఒకరు . “ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల” సంస్థాపక, నిర్వాహకులుగా వ్యవహరించారు . తల్లి వెంకటరమణమ్మ సాహితీ వ్యక్తి. ఇంటిలోని సాహితీ వాతావరణానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగిసోమయాజి వంటి పండితుల చూస్తూ పెరిగారు . అప్పుడు పిఠాపురంలో పండితులు, కవులు, సంగీత విద్వాంసులు, పానుగంటి, వేదుల రామకృష్ణకవి, వోలేటి వెంకటరామశాస్త్రి, దేవులపల్లి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, తుమరాడ “వీణ” సంగమేశ్వరశాస్త్రి, పెండ్యాల సత్యభామ వారితో చర్చలు , సాహిత్య ఇష్టా గోస్తులు జరుగుతూ ఉండేవి .

బంధువైన పులిగుత్తుల లక్ష్మీనరసమాంబ వద్ద నేర్చిన భక్తి సంగీతపు “పాఠాల ” వీరికి ఎంతగానో ఉపకరించాయి. మేనమామ దుగ్గిరాల పల్లంరాజు వద్ద మొదట నేర్చిన పద్యాలు, రాగాలు సంగీతం పట్ల ఆసక్తిని పెంచాయి . కాకినాడలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో నేర్చిన శాస్త్రీయ సంగీత పాఠాలు సంగీతరచనకి పునాదిగా మార్చుకున్నారు .

సినిమా రంగం :

వీరి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో చెప్పుకోవలసినవి “గృహప్రవేశం” (1946). “మేలుకో ఓ భారత నారీ” అనాడు రాసిన పాట ఈనాటికీ సామాజికపరంగా సరిపోతుంది. సి.ఎస్‌. ఆర్‌. పాడిన “మై డియర్‌ తులశమ్మక్కా”, “జానకి నాదేనోయి”, ఎమ్‌.ఎస్‌.రామారావు పాడిన ” హాలాహలమెగయునో” పాటలు . పూర్తి సంగీత బాధ్యతలు చేపట్టిన చివరి సినిమా గోపీచందే దర్శకత్వం వహించిన “పేరంటాలు!” (1951). సినీ సంగీతంలో “విదేశీ వాద్యగోష్టి ప్రభావం, పాటలోని రసభావ నిరూపణ చేసే చరణాంతర సంగీతం” చాలామంది సంగీత దర్శకులకు కొత్త దృష్టినిచ్చాయి.

సాహిత్యం :

గ్రంథమాల లో ఎక్కువగా బెంగాలీ సాహిత్యాన్నే ప్రచురించడం కారణంగా తొలిరోజుల్లో రజనిపై బెంగాలీ ప్రభావం బలంగా వుండేది. ఈ బెంగాలీ ప్రభావాన్ని ఆయన తొలి సంగీత రచనల్లో చూడగలం.

విశాఖపట్నం రాకముందే గేయ రచనలు, “కదంబం” లాంటి సాహిత్య పత్రికల్లో కవితా ప్రచురణలు జరిగినా రజని కలం 1937- 40 మధ్య కాలంలో కొన్ని వినూత్న ప్రయోగాలను చేసింది. శ్రీశ్రీ, పఠాభి కవితలతో ప్రేరితుడై “పూషా” అన్న కలంపేరుతో లయ ప్రధానంగా, మాత్రా ఛందస్సులలో పొందుపర్చి “తెలుగు స్వతంత్ర”, “ఆనందవాణి” వంటి పత్రికల్లో ప్రచురించిన గేయ కవితలను రచించారు . తండ్రిగారి ఏకాంత సేవకు ఆంగ్లంలో ‘Alone with spouse divine’ అనువాదం , క్షేత్రయ్య పదాలకు ఆంగ్లానువాదం ‘Amourse of the Divine Cowherd’ , క్షేత్రయ్య, రామదాసు జీవిత చరిత్రలు (కేంద్ర సాహిత్య అకాడమీవారికి) , ‘రజనీ భావతరంగాలు’ – ఆంధ్రప్రభలో శీర్షిక . క్షేత్రయ్య పదాలు, గాంధారగ్రామ రాగాలు, గీతగోవిందం, భారతీయ సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైనవాటి మీద పరిశోధనావ్యాసాలు. (మద్రాసు మ్యూజిక్ అకాడమీలో) జేజిమామయ్య పాటలు , మువ్వగోపాల పదావళి , త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవితచరిత్రలు , ఏటికి ఎదురీత (కవితలు) , చతుర్భాణీ (4 సంస్కృత నాటకాలకి తెలుగు అనువాదం) , అన్నమాచార్య కీర్తనలకి ఆంగ్లానువాదం. ఆంద్ర వాగ్గేయకార చరిత్రము వీరి విశేష పరిశోధన గ్రంధం .

“శతపత్రసుందరి” అనేది 1953వరకు రాసిన ఆయన గేయ సంకలనం. వీటిలో అధిక భాగం రజనియే మొదటిసారి స్వరపరచి పాడుకున్నవి, పాడించినవి “శతపత్రసుందరి” “జాబిల్లి వస్తున్నాడు” (వింజమూరి సోదరీమణులు), “ఓహో ప్రతిశ్రుతి” (రజని), “ఓ భ్రమరా” (టి.జి. కమలాదేవి) ” “మ్రోయింపు జయభేరి” (సూర్యకుమారి), “మనప్రేమ” (బాలమురళి, గోపాలరత్నం), “గుడారమెత్తివేశారు”, “ఎందు చూచినగాని” (ఘంటసాల) “ఎన్ని తీయని కలలు కన్నానో” (మల్లిక్‌), “నటన మాడవే మయూరి” (బాలసరస్వతి), “పోయిరావే కోయిలా”, “కోపమేల రాధ” (సాలూరి, బాలసరస్వతి), రొదసేయకే తుమ్మెదా” (వి. లక్ష్మి?).
రజని సంపూర్ణ గేయ నాటకాలు (మొదటి పద్ధెనిమిది) ఒక సంకలనం “విశ్వవీణ”గా 1964లో వెలువడ్డాయి. ముప్పయి వరకు గద్య పద్య గేయాత్మక నాటకాలను రచించారు. సంగీత నాటకంలో సంగీత నిర్వాహకుని బాధ్యతే అతి ముఖ్యమైనదని మనందరికి తెలిసినదే. వాద్య (కథా) చిత్రాలకు ఒక ఒరవడి, రూపం దిద్దినవారాయిన. ఈ కోవలోనివే “ఆదికావ్యావతరణం”, “మేఘసందేశం”, ” కామదహనం” రూపకాలు .

బాల సాహిత్యం :

రజని సాహిత్యం , సగీతం కేవలం పెద్దలకే పరిమితం కాలేదు . ఆయన “జేజిమావయ్య” పేరుతో రాసిన పిల్లల పాటలు విననివారుండరు .
“పాపాయి ఎక్కేది కర్రగుర్రం
సిపాయి ఎక్కేది ఎర్ర గుర్రం”
“చక చకా పోతుంది /మూడు చక్రాల సైకిల్
ముందు తమ్ముని కోర్చు పెట్టుకుని / వెనక చెల్లిని కూర్చో పెట్టుకుని” వంటి గేయాలు బాల గేయాలకి మచ్చుతునకలుగా చెప్పవచ్చు. అలాగే ప్రత్యేకంగా పిల్లలకోసం చేసిన గేయనాటికలు “దిబ్బరొట్టె అబ్బాయి”, “మామిడిచెట్టు” మొదలైనవి.

సంగీతం :

రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని సేవ చేశారు. ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రచించారు. రేడియో కోసం వీరు వందలాది గీతాలను రచించారు. ఇతర రచయితల గీతాలకి కూడా స్వరరచన చేశారు. బాలలకోసం జేజిమామయ్య పాటలు రచించారు.

చండీదాసు , మేఘసందేశం ,సంధ్యాదీపకళిక ,మధురానగరిగాథ ,సుభద్రార్జునీయం ,గ్రీష్మఋతువు ,శ్రీకృష్ణశ్శరణం మమ, మేనకావిశ్వామిత్ర , క్షీరసాగర మథనం (స్వరరచన) ,విప్రనారాయణ (స్వరరచన),కృష్ణశాస్త్రిగారి అతిథిశాల (ఉమర్ ఖయ్యూం) (స్వరరచన) – పర్షియన్ బాణీలో కూర్చిన సంగీతం. దీనికి చాలా పేరు వచ్చింది.

నృత్యం :

విజయవాడకు వచ్చినప్పటినుండి స్వయంగా యక్షగానాలు రాయడమే కాకుండా పింగళి, బందా, వోలేటిలతో కలిసి ఎన్నో ప్రాచీన యక్షగానాలను పునరుద్ధరించారు. “గొల్ల కలాపం దరువులు”, “భామా కలాపం”, “ప్రహ్లాదచరిత్ర”, “ఉషాపరిణయం”, “రుక్మిణీకల్యాణం”, మన్నారుదాస విలాసం (రంగాజమ్మ), గంగాగౌరీవిలాసం (పెదకెంపెగౌడ), “కల్యాణ శ్రీనివాసం” వాటిలో కొన్ని. రజని ప్రేరణతోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి యక్షగాన రచన చేసారని చెప్పాలి. గురువు లక్ష్మీకాంతంగారితో కలిసి ఎన్నో సంస్కృత నాటకాలను దూతవాక్యం, పాంచరాత్రం, ద్యూత ఘటోత్కచం, ప్రతిమ భాస విరచితాలు, వేణీసంహారం భట్టనారాయణుడు, అనర్ఘరాఘవం మురారి , భాణాలను (తామరపువ్వు కానుక, ధూర్తవిట సంవాదం) ఆంధ్రీకరించారు.

ఆకాశవాణి :

చదువు పూర్తయిన తరవాత కొద్దికాలం గ్రంథమాలలో సహసంపాదకుడిగా పని చేసి జూలై 1942లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో చేరడంతో రజని జీవితం కొత్త మలుపు తిరిగింది. అంతకుముందు చదువుకునే రోజుల్లోనే (1938 జూలై) ఆచంట జానకీరాం సమర్పించిన “అనార్కలి” నాటకంలోని కొన్ని పాటలకు వరసలు కట్టడం, దేవులపల్లి కృష్ణశాస్త్రికి రేడియో వ్యాసాల రచనలో సహాయకుడిగా వ్యవహరించడం, స్వీయ రచనలు “చండీదాస్‌”, “గ్రీష్మఋతువు” 1941లో ప్రసారం మొదటి నాటికలో రజని, “మాలపల్లి” సుందరమ్మలు ప్రధాన పాత్రధారులు, సాలూరి రాజేశ్వరరావు వాద్యగోష్టి అందించారు.

దాదాపు ఒకటిన్నర దశాబ్దాపు కాలం మద్రాసులో పని చేసిన తరువాత గురువైన పింగళి లక్ష్మీకాంతంగారి పిలుపుతో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి తరలి వచ్చారు. రేడియోలో చేరిన తొలిరోజుల్లోనే మిత్రులైన నిడుమోలు జగన్నాథ్‌ నిర్మించిన రెండు లఘు హాస్యచిత్రాలకి (“తారుమారు”, “భలేపెళ్ళి”, 1942) సంగీత దర్శకత్వం వహించారు. (వీటిలో రజని, ఆయన శ్రీమతి సుభద్రగార్లు కొన్ని పాటలు కూడా పాడారు.) “గీతావళి” కార్యక్రమంలో ప్రసారితమైన “స్వామీ నీ ఆలయమున” అన్న రజని గేయాన్ని, అందులోని మధ్య ప్రాచ్య సంగీతపు పోకడల్ని విని ఆశ్చర్యపోయిన ప్రఖ్యాత దర్శకుడు బి. ఎన్‌. రెడ్డి సరాసరి మద్రాస్‌ రేడియో కేంద్రానికి వచ్చి తనప్పట్లో నిర్మిస్తున్న “స్వర్గసీమ” (1945) చిత్రంలో ఒక సన్నివేశానికి తగినట్లుగా ట్యూన్‌ కావాలన్నారు. అలా తయారయినదే “ఓహో పావురమా” అన్న పాట. ఆ పాట పొందిన జనాదరణ గూర్చి చెప్పనవసరం లేదు! అదే చిత్రానికి “ఋష్యశృంగ” సంగీత రూపకం, “హాయి సఖీ”, “గృహమే కదా స్వర్గసీమ” (నాగయ్య), “ఎవని రాకకై” (రజని) అన్న మరో నాలుగు పాటలు కూడా రాసి స్వరపరిచారు.

పదకవితా పితామహుడు అన్నమయ్య గురించి, ఆయన రచనలకున్న ప్రాచుర్యాన్ని తెలియని తెలుగువారు ఉండరు అనడంలో అతిశయోక్తి కాదు . కాని అన్నమయ్య పదాలను ప్రజాబాహుళ్యానికి పంచిపెట్టినదెవ్వరు అంటే ఆ పదాలు శాస్త్రీయ కచేరీ శ్రోతలకే పరిమితం కాకుండా నలుగురి నోళ్ళలో పడి నలిగింది రేడియో ద్వారానే. ఆకాశవాణిలో మొదటగా ఆ పాటలకు వరసలు కట్టి పాడింది రజనిగారే! “విన్నపాలు వినవలె” (భౌళి) వాటిలో మొదటిది.

“భక్తిరంజని”లో రజని వినిపించిన వచనాలు, దండకాలు, గద్యాలు, స్తుతులు తెలుగువారి రోజూవారి జీవితంలో భాగాలయిపోయాయి. 1971-76 మధ్యకాలాన్ని స్వర్ణయుగంగా ఈనాటికీ చెప్పుకుంటారు. అప్పుడే తొలిసారిగా విజయవాడ కేంద్రంఅంతర్జాతీయ పీఠంపైకి వచ్చింది. రజని శ్రీనాథ, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజుల రచనలకు సంగీతం సమకూర్చి ప్రసారంచేసిన “కొండనుంచి కడలిదాకా” అన్న గోదావరి నదిపైన సంగీత రూపకం 1972లో NHK టోక్యో నుండి బహుమతి పొందింది. స్టేషన్‌ డైరెక్టర్‌గా వున్నప్పుడే, తిరువన్నామలైకి తరలి వెళ్ళిన తర్వాత మౌన వ్రతం దాల్చిన చలాన్ని ఇంటర్యూ చేయగలిగారు. “చలం కలం వెలుగులు” అన్న పేరుతో ప్రసారితమైన ఈ కార్యక్రమం ఒక “క్లాసిక్‌”. కళాకారునిగా ఎంత ప్రతిభను చూపారో, ఒక అధికారిగా కూడా అంతే పేరు సంపాదించుకున్నారు.

ఉద్యోగ బాధ్యతలు :

1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జెక్యుటివ్ గా చేరారు. 1944 లో కార్యక్రమాల నిర్వహణాధికారిగా పనిచేసారు . 1956 – 60 లో విజయవాడ కేంద్ర కార్యాలయానికి బదిలీ అయ్యారు .1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాల్ లోని కర్సియాంగ్ స్టేషను కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషను డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 1976 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 1976 నుండి 1978 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు.. 1979 నుండి 1982 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 1985 వరకు పనిచేశారు.

పురస్కారాలు :

1947ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి నెహ్రూ “”Our tryst with destiny” ప్రసంగం తర్వాత రజని రచించి స్వరపరిచిన “మాదీ స్వతంత్రదేశం అనే గీతం ప్రసారమయింది. 1961 లో వీరి రచన ఆంద్ర వాగ్గేయకార చరిత్రము కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది . 1972లో రజనీ రచించి స్వరపరిచిన “కొండ నుండి కడలి దాకా” రూపకం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. దీనికి జపాన్ నుంచి “నిప్పాన్ హోసో క్యొకాయ్” బహుమతి లభించింది.కృష్ణశాస్త్రిగారి ‘అతిథిశాల’ సంగీతరూపకానికి పర్షియన్ సంగీతం ఆధారంగా కూర్చిన సంగీతానికి చాల పేరు వచ్చింది.1981లో మేఘసందేశ రూపకానికి బెంగుళూరులో ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది.

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు బాల మురళీకృష్ణ గారి మాటల్లో “రజనీ గేయాలు అంటే లోక ప్రసిద్ధం .అయన ఒక మహా వాగ్గేయకారుడు . లలిత సంగీత స్రష్టలలో ముఖ్యుడు .ఆయన గీయాలలో ప్రత్యేకత లలిత సంగీత క్లాసికల్ గా ఉంటుంది “ అన్నారు .

                                తెలుగు సాహిత్య ,సంగీత,నృత్య రంగాల్లోనూ , ఆకాశవాణి లో తనదైన ముద్ర వేసుకుని శ్రోతలకి రజని గా చల్లదాన్ని పంచి , పిల్లలకి జేజి మావయ్యగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయారు .

-అరసిశ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.