కాఫీ కప్పు సూర్యుడు(కవిత)-కె.గీత

ఉదయపు మంచు మబ్బు చాటున పొగలు చిమ్ముతున్న కాఫీ కప్పులా సూర్యుడు

అల్లల్లాడే చెట్ల చేతుల్ని తాకి ఆకుల చివర నీటి వేళ్లై వేళ్లాడుతూ

రోజు రోడ్డు మీద పదడగుల్ని దాటనివ్వని చూపు

వాస్తవాన్ని కళ్లు చెమరుస్తున్నా

ఆకాశానికి భూమికీ మధ్య

జీవితానికీ బతుక్కీ మధ్య

ఊహల నిచ్చెనేదో ఎక్కుతూ దిగుతూ ప్రారంభమైన ఉదయం

వాట్సాప్,

ఫేస్బుక్ ల బాత్రూమ్, టాయ్లెట్

జూమ్,

వెబ్ సెమినార్ ల “బ్రష్” అప్, హాఫ్ బాత్

కాఫీతో కారు ప్రయాణం

కాదేదీ జాబ్ తో సమానం

పలకరించని ప్రపంచం నించి

పలకని ప్రపంచానికి ఎదిగిన ప్రతీ రోజూ

మంచు మబ్బు చాటున పొగలు చిమ్ముతున్న కాఫీ కప్పులా సూర్యుడు

పదాలై హృదయానికి చేరాలనేదో తొందర్లో మాటల గొంతుకలో వేళ్లాడుతూ-

అంకెల బతుకు మీటల్ని దాటనివ్వని యంత్రపు తెర

కంటికీ మింటికీ మధ్య ఊగిసలాడుతున్న జ్ఞాపకపు నీటి పొర

కంఠం లోపలెక్కడో గుండె మెలితిప్పి హృదయించిన ఈ పలకరింపు

ముంగిట వెలుగై మొలకెత్తి నీ కాఫీ కప్పులో పొగలైనప్పుడు

పొలమారిన నా తలపై తడిమిన సూర్యుడు

ఉదయపు మంచు మబ్బు చాటున –

– కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

http://kalageeta.wordpress.com/
http://www.telugurachayita.org/

కవితలుPermalink

Comments are closed.