మేఘసందేశం-08 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

1813లో ఈ కావ్యం ‘హోరేస్ హేమాన్ విల్సన్’ (హొరచె హయ్మన్ విల్సొన్) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది. మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది. అసలు మేఘ సందేశమే ఒక కల్పన. ఈ కల్పనకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యంగా విశ్వనాథ సత్యనారాయణ ఒక అందమైన కల్పనతో వ్రాసిన నవల “దూతమేఘము” నేపాల రాజవంశాలను పూర్వరంగంగా తీసికొని అతడు వ్రాసిన ఆరు నవలలలో ఒకటి. కాళిదాసు మందాక్రాంత వృత్తాల లో మేఘ సందేశం వ్రాయడానికి గల కారణానికి అతడు చేసిన కల్పన పరమ రమణీయంగా ఉంటుంది. ఎడబాటు కలిగిన ప్రేయసీ ప్రియులు దూతల ద్వారా సందేశములు పంపుట ఇతర పురాణాలలో కానవస్తుంది. నలదమయంతుల హంసరాయబారము, రుక్మిణీ కృష్ణుల బ్రాహ్మణరాయబారము, రామాయణమున హనుమంతుని దౌత్యము. సుందర కాండములో రామదూతగా హనుమంతుడు శ్రీరాముని అభిజ్ఞానమును సీతమ్మకు అందజేసే వృత్తాంతానికి, మేఘదూతంలోని కథాను గమనానికి పోలికలున్నాయి. కాని ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రథముడు. చైనీయ కవి నూకాంగ్ తన కావ్యములో మేఘమును దూతగా పంపెనని బహుభాషా కోవిదుడు, వంగ దేశీయుడు అగు హరనాథ పండితుడు వ్రాసెను. కాని నూకాంగ్ క్రీ.శ. ద్వితీయ శతాబ్దమువాడు. కాళిదాసు క్రీ.పూ. మొదటి శతాబ్దమువాడు. మేఘ సందేశం కావ్యాన్ని అనుసరిస్తూ అనేక రచనలు వచ్చాయి. ఈ కావ్యంలోని ఊహాగానానికి ఉన్న అందం అలాంటిది. వాటిలో సాంగణ కుమారుడైన విక్రమ కవి రచించిన ‘నేమి సందేశము’ను ప్రత్యేకంగా పేర్కొనాలి. 12వ శతాబ్దికి చెందిన ధోయి కవి ‘పవనదూతము’, 13వ శతాబ్దికి చెందిన వేదాంత దేశికకవి ‘హంస సందేశము’, 15వ శతాబ్దికి చెందిన కృష్ణానంద సార్వభౌముని ‘పదాంక దూతము’, 14వ శతాబ్దికి చెందిన ఉద్దండుని ‘కోకిల సందేశము’, జైన పండితుడు మేరుతుంగ కవి ‘జైన మేఘ దూతము’, 17వ శతాబ్దివాడు దేవీ చంద్రుని ‘పవన దూతము’, 18వ శతాబ్దినాటి వైద్యనాథ సూరి ‘తులసీ దూతము’ వాటిలో కొన్ని. 18వ శతాబ్దమున జర్మను కవి శీలరు మేఘదూత కావ్యము ననుసరించుచు రాసిన ‘మారియా స్టూవర్టు’ అనే కావ్యంలో నిర్బంధంలో ఉన్న ఒక రాణి మేఘం ద్వారా ఫ్రాన్సు దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. క్రీ.శ.1083 లో నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ద్వీపాంకర అతీశుడు టిబెట్కి వెళ్ళి అక్కడ బౌద్ధాన్ని ఉత్తేజపరిచే క్రమంలో భారతీయ సాహిత్యాన్ని అనువర్తింపజేసేందుకు ప్రోత్సహించారు. ఆ క్రమంలోనే “మేఘదూతం” సహా అనేక సంస్కృత గ్రంథాలను టిబెటిక్ భాషలోకి కూడా అనువర్తింపజేశారు. అంతటి మహత్తరమైన ప్రభావాన్ని అనువర్తింపజేసిన ప్రధమ కవి – కవి కుల గురువు కాళిదాసు.
మనం మరలా మేఘసందేశ వ్యాఖ్యానంలోకి వద్దాం.
శ్లో.30. వేణీభూతప్రతనుసలిలా సా త్వతీతస్య సింధుః
పాండుచ్ఛాయా తటరుహతరుభ్రంశిభిర్జీర్ణపర్ణైః
సౌభాగ్యం తే సుభగ విరహావస్థయా వ్యంజయంతీ
కార్శ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః

దీని భావం: ఓ! మేఘుడా! సుందరుడా! బహు సుందరుడవైన నిన్ను ఎడబాయడంతో, ఆ నిర్వింధ్యానది సన్నని జాలుగా ప్రవహిస్తున్న నీటిని జడగా వేసుకొని, తీరములందు మొలచిన చెట్లనుండి జాఱిపడిన ఎండుటాకులతో తెల్లబాఱినదై ఉండి, ఇలాంటి విరహావస్థచేత చూసేవారికి సౌందర్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ నిర్వింధ్యకు సంతోషం కలిగించు. ఇక్కడ విశేషం ఏమిటంటే… ఈ నిర్వింధ్య ప్రియుడెంతో అందగాడు కాబట్టే అతని విరహంతో పాపం ఆమె ఇంతలా చిక్కిపోయింది అనుకొనేట్లు గా ఉందని చెప్పడం అన్నమాట.
శ్లో.31. ప్రాప్యావంతీనుదయనకథాకోవిదగ్రామవృద్ధా౯
పూర్వోద్దిష్టా మనుసర పురీం శ్రీవిశాలాం విశాలాం,
స్వల్పీభూతే సుచరితఫలే స్వర్గిణాం గాం గతానాం
శేషైః పుణ్యై ర్హృతమివ దివః కాంతిమత్ఖండమేకం.

దీని భావం: అవంతి దేశం చాలా ప్రసిద్ధమైనది. ఆ దేశంలోని గ్రామాల్లో ఉండే పెద్దవారు ఉదయనమహారాజు కథలను బాగా తెలిసినవారు. ఆ దేశంలోనే ముందు చెప్పిన విశాలా పట్టణం అనేది ఉంది. దీన్నే ఉజ్జయిని పట్టణం అని కూడా అంటారు. ఇది అవంతి దేశానికి రాజధాని. చాలా సంపన్నమైన నగరం. ఆ నగరాన్ని వర్ణించాలంటే…కొంచెం పుణ్యం ఉండగానే, స్వర్గసుఖం అనుభవిస్తున్నవారు ఈ భూమండలం మీద జన్మిస్తే, ఆ మిగిలిన పుణ్యఫలాన్ని అనుభవించడానికి తెచ్చిన స్వర్గఖండమో అన్నట్లు ఉంటుంది. అనగా స్వర్గతుల్యంగా ఉంటుంది అంటున్నాడు కాళిదాసు. అంటే స్వర్గంలో ఉండే సుఖాలన్నీ ఈ ఉజ్జయినీ నగరేంలో కూడా సమా నంగా లభిస్తాయి అని అర్ధం. కాబట్టి ఓ మేఘుడా! అటువంటి ఉజ్జయినిని తప్పక చూసి తీరవలసినది అంటున్నాడు.

శ్లో.32. దీర్ఘీ కుర్వ౯ పటు మదకలం కూజితం సారసానాం
ప్రత్యూషేషు స్ఫుటితకమలామోదమైత్రీకషాయః,
యత్ర స్త్రీణాం హరతి సురతగ్లానిమంగానుకూలః
శిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః.

దీని భావం: ఓ మేఘుడా! ఆ ఉజ్జయినీ పట్టణానికి దగ్గరలో శిప్రానది అనే ఒక నది ఉంది. ఆ శిప్రానది గాలి
బెగ్గురుపక్షుల చక్కని కూజితాలను, దీర్ఘం చేసేదిగా ఉంటుంది. అంటే వాటి ధ్వనులను ఎడతెగకుండా వినిపించేది గా ఉంటుంది. శిప్రానదిలోని పద్మాలు మంచి విశేషమైన పరిమళంతో కూడినవి గా ఉంటాయి. మరియూ ఆ శిప్రానది గాలి తిన్నగా వీచి శరీరానికి సుఖంగా సోకేదిగా ఉంటుంది. అంటే శైత్యం (శీతలం), సౌరభం, (పరిమళం), మాంద్యం (నెమ్మది) అనే మూడు విశేష గుణాలతో కూడిన సామర్థ్యంతో ఉన్నటువంటి శిప్రానది గాలి స్త్రీల యొక్క రతిశ్రమను పోగొట్టడమే కాక తిరిగి ఆ అభిలాషను పుట్టిస్తుంది అని చెప్తున్నాడు కాళిదాసు. అటువంటి శిప్రానది యొక్క గాలిని వదలకుండా ఆఘ్రాణించవలసినదని యక్షుడు మేఘునికి మరీ మరీ వర్ణించి చెప్తున్నాడు.

శ్లో.33. హారాంస్తారాం స్తరళగుటికా న్కోటిశః శంఖశుక్తీః
ఘాసశ్యామాన్మరకతమణీనున్మయూఖప్రరోహా౯,
దృష్ట్వా యస్యాం విపణిరచితాన్విద్రుమాణాం చ భంగా౯
సంలక్ష్యంతే సలిలనిధయ స్తోయమాత్రావశేషాః.

దీని భావం: ఓ మేఘుడా! ఆ విశాలా పట్టణంలోని దుకాణాలలోని వీథుల్లో గమనించినట్లైతే కోట్లకొలది శుద్ధములైన నాయకరత్నాలను, ముత్యాలహారాలను, శంఖాలను, ముత్యపుచిప్పలను, పచ్చికలా ఆకుపచ్చవర్ణం కల్గిన మరకతమణులను, పగడపుఖండాలను, చూచి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా! “ఆహా! సముద్రాలలో ఇక నీరుమాత్రమే మిగిలింది, రత్నాలు లేవు. శంఖాలు లేవు. ఎందుకంటే అన్ని సముద్రాల్లోని రత్నాలు ఇక్కడ విశాలా పట్టణానికి చేరిపోయాయి కదా కదా!.” అని అనుకుంటారని ఆ విశాలాపట్టణం యొక్క గొప్పదనాన్ని “రత్నసంపదకు ఆలవాలం” అని నిరూపిస్తున్నాడు కాళిదాసు.

శ్లో.34. జాలోద్గీర్ణై రుపచితవపుః కేశసంస్కారధూపై
ర్బంధుప్రీత్యా భవనశిఖిభిర్దత్తనృత్యోపహారః
హర్మ్యేష్వస్యాః కుసుమసురభిష్వధ్వఖేదం నయేథాః
పశ్య౯ లక్ష్మీం లలితవనితాపాదరాగాంకితేషు.

దీని భావం: ఉజ్జయినీ పట్టణంలోని స్త్రీలు తమ కేశాలు సువాసనలను వెదజల్లడానికై వేసుకొన్నటువంటి ధూపాల యొక్క సువాసన గృహముల యొక్క కిటికీల నుండి బయటకు వెలువడి నీలో కలుస్తాయి. తద్వారా నీ దేహానికి పుష్టి కలుగుతుంది. ధూమం మేఘమవుతుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! అది నీకొక ఆతిథ్యం ఇస్తుంది. మరియూ తమ యొక్క బంధువనే ప్రేమవలన అక్కడ ఉన్నటువంటి పెంపుడునెమళ్లు కూడా నీ ఎదుట నాట్యం చేసి నీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. చంద్రదర్శనం చేత సముద్రుడుప్పొంగినట్లు, సూర్య సమీక్షణంతోనే కమలాలు వికసించినట్లు నీ యొక్క సందర్శనంతోనే నెమళ్లు పురివిప్పుతాయి, ఆడతాయి ఎందుకంటే నెమళ్ళకు మేఘుడు బంధువు కదా! అవి పూలచేత పరిమళిస్తున్నవై, అక్కడి అందమైన ఆడువారి పాదముల లత్తుక గుర్తులున్న మేడలపై కూర్చుని, ఉజ్జయినీ సామ్రాజ్య లక్ష్మిని, అంటే అక్కడి సంపదను, సౌభాగ్యాన్ని చూస్తూ నీ యొక్క మార్గాయాసాన్ని పోగొట్టుకోగలవు అని యక్షుడు మేఘునికి చెప్తునాడు.

శ్లో.35.భర్తుః కంఠచ్ఛవిరితి గణైః సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా స్త్రిభువనగురోర్ధామ చండీశ్వరస్య,
ధూతోద్యానం కువలయరజోగంధిభిర్గంధవత్యా
స్తోయ క్రీడానిరతయువతిస్నానతిక్తైర్మరుద్భిః.

దీని భావం: ఓ మేఘుడా! నీకు అక్కడ అలౌకికానందం మరియూ లౌకికానందం ఒకేసారి కలుగుతాయి. ఎలా అంటే తమ స్వామి యొక్క కంఠం యొక్క కాంతి వంటి కాంతి గలవాడవనే కారణంచేత అనగా శివునికంఠంలా నీవు కూడా నల్లగా ఉంటావు కాబట్టి ప్రమథగణాలు నిన్ను చాలా ఆదరణతో చూస్తారు. నీవు వారి యొక్క ఆదరణ పొందినవాడవై, త్రిభువనగురుడు, చండికాపతి అయిన శివునియొక్క పవిత్రధామాన్ని పొందు. నీకు ఆవిధంగా ఈ క్షేత్రప్రవేశంతో అలౌకికానందం కలుగుతుంది. ఉజ్జయిని నగరం ఒక మహాపుణ్యక్షేత్రం. ఈశ్వరుడు మహాకాలుడనే పేరుతో అక్కడ కొలువై ఉన్నాడు. అది ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటి. అది కేవలం ఒక పుణ్యక్షేత్రము మాత్రమే కాదు భోగక్షేత్రం కూడా ఎలా అంటే అక్కడ గంధవతి అనే నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది నిండా పరిమళాలు వెదజల్లే కలువపూలు విశేషంగా ఉన్నాయి. ఆ గంధవతీనది మీదినుంచి కలువపూల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ అందులో స్నానం చేసే యువతుల యొక్క స్నాన వస్తువులు అనగా చందనం మొదలైన వస్తువుల పరిమళాన్ని మోసుకొని వస్తూ ఉండడం చేత అక్కడ వీచే గాలులు సైతం ఉద్యానవనాల్ని కదిలిస్తూంటాయి. అలా ఉద్యానపుష్పపరిమళాలు గంధవతీ నదీ వాయువులు మోసుకొచ్చే పరిమళాలతో కలుస్తాయి. ఈ మూడువిధాలైన గంధాలతో కూడినటువంటి చల్లనిగాలి మెల్లగా వీస్తూంటుంది. కాబట్టి నీకు చాల సుఖం కలుగుతుంది. ఇది నీకు లౌకికానందాన్ని ఇస్తుంది. ఈ రెండు రకాల ఆనందాలతో నీకు గొప్ప లాభం కలుగుతుంది. వెళ్ళిరా మేఘుడా! శుభం అంటున్నాడు యక్షుడు.

టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.