అంతే తేడా …

నానీ గణగణా మోగుతున్న ఫోన్ ని అందుకున్నది.

అది చెల్లెలు సత్యవతి నుండి.

“మా ఊళ్ళో తిరణాల జరుగుతున్నది,

మీరందరూ – యావన్మందీ – తక్షణం బయల్దేరి వచ్చేయండి.”

“సత్యం! ప్రతి సంవత్సరం తప్పకుండా జరుగుతున్నదే కదా,

ఇంత అకస్మాత్తుగా – ఈ పిలుపు –

ఏదో ప్రత్యేకత – ఉండే ఉంటుది …. ” –

“ఈ ఏడు మా పెద్దోడి చిన్నోడు కృపాకర్ – సినిమాలలో వేసే వాడు …. ,

కృపాకర్ వస్తున్నాడు, ఈ పల్లెటూరి జాతర సీనులన్నిటినీ కథలో కలుపుతాడట.

మనం గనుక అక్కడ ఉంటే, మన వాళ్ళు ఉన్న దృశ్యాలను చక్కగా తీస్తానన్నాడు …….”

“అర్ధమైంది, ఉన్న పళంగా వచ్చేస్తున్నాను.

పెద్ద తెర మీద – మన అందర్ని – మనకు మనం చూసుకుంటుంటే ఎంత బావుంటుందో ………”

బెడ్డింగు, హోల్డాలు, డజను బత్తాయిలు, హస్తం అరటి పళ్ళు,

మరచెంబుతో మంచి నీళ్ళు, డబ్బాడు వడియాలు ……..

ఇన్ని సరంజామాతో ….. రాజు వెడలె రవి తేజము లలరగ ……….

అన్నంత సంరంభంగా సాగింది నానీ ప్రయాణం.

****                 ****                          ****               ****            

కృపాకర్ చూస్తూనే పలకరించింది, “ఒరే నిధీ, నువ్వు ఉన్న సినిమాలన్నీ చూసాను ………

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, నవ రసాలు అన్నీ నీలోనే ఉట్టి పడుతున్నాయి.”

అని కితాబు ఇచ్చింది.

నిజానికి నానీకి సినిమాలు చూసే అలవాటు లేదు,

కృపాకర్ నటించిన సినిమా పోస్టర్ లను మాత్రమే చూసేది,

దిన పత్రికలలోని ప్రకటనల నన్నిటినీ కూలంకషంగా చదువుతుండేది.

ఆ పఠనా నాలెడ్జి నానీకి ఆపద్ధర్మంగా ఉపయోగపడుతూంటుంది.

“బుడబుక్కల దుస్తులు, వీడు … “ అని అనుకుంటుంది,

కొన్ని కొన్ని సార్లు పైకి అనేస్తుంటుంది కూడానూ.

‘పదేళ్ళ క్రితం బక్క పలచగా ఉన్నాడు, ఇప్పుడు బాగా ఒళ్ళు చేసాడు.’ అనుకున్నది.

ఆనక భోజనాల వేళ సమయం సందర్భం చూసుకుని అన్నది

“నిధీ, పీలగా, సన్నగా ఉండే వాడివి, ఇప్పుడు బొద్దుగా గుండ్రాయిలాగా ఉన్నావు, బాగున్నావురా.”

ఆమె అమోఘ ఉపమానాలన్నిటికీ శ్రోతలు కొంతకాలానికి శృతి పక్వంగా ఆస్వాదించడాన్ని అలవాటు చేసుకుంటారు. తప్పదు కదా.

“కృపానిధి కాదు, నానీ, పేరు మార్చుకున్నాను, కృపాకర్ – అని.”

మనసులో చిన్నబుచ్చుకున్నప్పటికీ – నవ్వుతూ అన్నాడు.

“ముద్దుపేరు, నిక్ నేము – అన్న మాట.

వేదమంత్రాల పరిమళంతో పెట్టిన పేరుకు ఎక్కువ విలువ ఉంటుంది కదూ.”

వడ్డిస్తున్న పులుసు గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టి,

గొప్ప రాచ కార్యమేదో ఉన్నట్లు, కిచెన్ లోకి చల్లగా జారుకుంది నానీ.

అన్ని వాక్ అస్త్రాలనూ ఒక్కసారే గుమ్మరిస్తే తట్టుకోగలడా అర్భకుడు,

అందుకే నిధి ఉరఫ్ కర్ కి ఊపిరి పీల్చుకోడానికి టైమ్ ఇచ్చింది నానీ.

 

****                 ****                          ****               ****     

తిరణాలకు బంధుమిత్ర సపరివారం – అందరూ చేరారు.

సత్యవతి మనవడు కృపాకర్ – రెండు దశాబ్దాల క్రితం ఇక్కడే కొన్ని సినీ షాట్స్ తీసాడు.

అప్పుడు చుట్టుపక్కల ముప్ఫై పల్లెటూళ్ళు కదలి వచ్చాయి.

ఆ నాటి సినిమా దర్శకుడు – అప్పటికప్పుడు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా –

పల్లె ప్రజలంతా – నటీ నటులుగా అవతారం దాల్చారు.

సుత్తి, కొడవలి, దుడ్డు కర్రలు, సకల పరికరాలు, సమస్త వస్తువలనూ ఎత్తి పట్టుకున్నారు.

కెమేరాలో నిండుగా విప్లవ దృశ్యాలు నిండి పోయాయి.

ఆ రోజున ఏ పండుగ లేకుండానే – తిరణాల సందోహం నెలకొన్నది.

సత్యమ్మ – ప్రధమ షూటింగ్ కు ప్రత్యక్ష సాక్షులు ఐన అప్పటి వర్గం ప్రజలు – అందరూ –

నేటి మూవీ షూటింగ్, సీనులని ఆసక్తిగా ఎదురుచూసారు.

కృపాకర్, ఇతర యాక్టర్లు – ఖరీదైన దుస్తులు ధరించారు.

40 రోజుల పాటు – డ్యూయెట్లు, డాన్సులు –

ఆ గ్రామాన్ని స్వర్గధామంగా మార్చాయి.

పాతిక కార్లు గాలిలోకి ఎగరడం, యుద్ధ బీభత్సాలు ……..

ఓహ్, న భూతో న భవిష్యతి.

ఈ గాలి, నేల మొత్తం – మరో ప్రపంచం అయ్యింది.

****                 ****                          ****               ****     

ఈ నాడు – సినీ చిత్రీకరణలు, కథాంశం సైతం తేడా వచ్చింది.

కృపాకర్ డొక్కలు ఎండిన పేద ప్రజలకు నేతగా – అప్పటి సినిమాలో ఉన్నాడు,

ఇప్పటి చిత్రకథ పూర్తిగా భిన్నంగా ఉన్నది.

ఈ నాటి film లోని హీరో ఐన – కృపాకర్ బిజినెస్, ఫ్యాక్టరీ నిర్మించాడు

[సినిమాలోనే కాక – నిజ జీవితంలోనూ ఫ్యాక్టరీ ఓనర్ అతను]

ఇక స్టోరీ ప్రకారం ;- కృపాకర్ వ్యాపారం, ఫ్యాక్టరీలకు –

స్వార్ధపరులైన – కుత్సిత మనస్కులు ఐన లేబర్ నాయకులు సమస్యలు సృష్టించారు.

లేనిపోని ప్రోబ్లమ్స్ వలన బిజినెస్ కుదేలైనది, ఫాక్టరీ మూతబడింది.

హీరో కృపాకర్ – విదేశాలకు వెళ్ళి, అక్కడే వ్యాపారం చేసి స్థిరపడాలని

కృతనిశ్చయంతో బయలు దేరాడు.

 

****                 ****                          ****               ****     

ప్రివ్యూకి కూడా ఆహ్వానం అందుకున్నారు,

బంధు మిత్ర సపరివార సహితంగా థియేటర్ కి వెళ్ళారు, చూసారు, ఆనందించారు.

“మా కళ్ళముందు పెరిగిన వాడివి, ఇంత గొప్పవాడివైనావు,

చాలా సంతోషంగా ఉంది.”

అభినందన మందారమాలలు వేసారు అందరూ. – ఆనక అందరూ గృహోన్ముఖులైనారు.

మూవీ తీరుతెన్నులను గూర్చి – , చర్చలలో విస్తరించుకుంటూ –

తమ తమ అభిప్రాయాలను – తలో రకంగా మాటలకు ప్రకాశం తెచ్చారు.

“మన నిధి సినిమాలలో చేరిన కొత్తల్లో – బీదా బిక్కీ జీవితాలను సినీమాలుగా తీసాడు కదా.

ఇప్పుడేమిటి, తలా – తోకా లేని కథలను జనాల మీదకు గుమ్మరిస్తున్నాడు!?” చిరాకుగా అన్నాడు నానీ పెనిమిటి.

నానీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది – ;

“మొదటి దశ నాటికి నిధి – తెల్ల కాగితం లాగ ఉన్నాడు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న స్థితి అప్పటిది.

ప్రగతి కథలకు పెద్ద పీటను వేసాడు.

తనకు లేమి అన్నది నిత్య జీవన విధానానికి – తెలిసి ఉన్నది, కాబట్టి,

నిరుపేదల అంశాలను, మధ్య తరగతి బ్రతుకుల సమస్యలతో కలిగి ఉన్న అనుబంధం వలన –

ఆకళింపు చేసుకున్న మనో స్పర్శతో – ఆ రోజులలో- సహజంగా తీయగలిగాడు.

దర్శకుడిగా ఎదిగాక, ధనవంతుడు అయ్యాడు కదా, కలిమి లేములు తూకం అంచనా తప్పింది.

ఇప్పుడు పేదల ఫీలింగులను – ఇదివరకులాగా – అంత సమర్ధవంతంగా తీయలేకపోతున్నాడు. వెండితెర కాస్తా – బంగారుమయం ఔతున్నది, ప్రజలకు కలలను పంచిపెడుతున్నది.”

భార్య విశ్లేషణకు ఆశ్చర్యంతో – కాస్సేపటిదాకా అట్టే నిలబడ్డాడు.

“భడవ, తెలివైనవాడే?”

అక్కచెల్లెళ్ళు ఇల్లు చేరాక – పంచపాళీలో అరుగుపై కూర్చుని అనుకున్నారు.

నానీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

 – కాదంబరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

కథలుPermalink

Comments are closed.