ది కిస్‌(కథ)-గీతాంజలి

ఎత్తైన కొండల మీద పర్చుకుంటున్న చల్లని వెన్నల వెన్నల్లో మెరుస్తున్న పచ్చని గడ్డి… ఆ గడ్డిలో మొలచిన నక్షత్రాల్లాంటి తెల్లని గడ్డిపూలు, ఆకాశంలో నక్షత్రాల్ని పలకరిస్తున్నాయి.

నా నేస్తాలతో చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆ కొండలు… తెల్లని గడ్డిపూలను చూస్తూ మురిసిన ఆ క్షణాల్లోకి మళ్ళీ ఇలా… మనిషంత ఎత్తున ఆ కొండకి నన్ను అదుముతూ అతను నా మొఖం వైపుకి వంగుతున్నాడు. అతని కళ్ళలో వెన్నల్లో మత్తడి తెగిన జలధార నా వైపుగా ప్రవహిస్తున్నది. అతని పెదాలు మాత్రం కాంక్షతో చిట్లడానికి సిద్ధమైన రుధిర పుష్పాల్లా ఉన్నాయి. అతనెవరు? ఎక్కడో చూసాను. గుర్తుకు రావట్లేదు. ఇంతలో అతను నా మీదకు వంగి తన రెండు అరచేతులతో నా మొఖాన్ని పట్టుకుని నా నుదిటిపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకునే ముందు తపస్వీ… అంటూ పిలిచాడు. ముఖాన్ని అరచేతుల్లోకి నా మొఖాల్ని ఎలా తీస్కున్నాడనీ. దేవుని ప్రసాదాన్ని భక్తితో రెండు అరచేతులూ చాపి ఎలా తీస్కుంటారో అలా! అలా అతను తర్వాత నా కళ్ళమీద, బుగ్గల మీద, గడ్డం మీద నిశ్శబ్దంగా ఎంతో ఆర్తిగా తపనతో ముద్దులు పెడుతున్నాడు. అతని పెదవుల స్పర్శకు నాలో మైకం కమ్ముకుంటుంది. అతన్ని ప్రతిఘటించలేకపోతున్నా తపస్వీ… అంటూ నా పేరు కలవరిస్తూ అతను నా పెదవులపై ముద్దు పెడుతున్నాడు. వేడెక్కిన అతని పెదాలు నాలోకి మధుపాన్ని నింపుతున్నాయి. నా దేహం పులకరింతలతో ప్రకంపించసాగింది. నా నోరంతా తియ్యని మధుపం నిండిన రుచితో నిండిపొయ్యింది. మధ్య మధ్యలో నా చెవి దగ్గర నా పేరును కలవరిస్తూ… ఆగి ఆగి ముద్దులు పెడుతూ… నా దేహంలో సముద్రం అంతా కలిసి ఒకే ఒక్క అలై పొంగి ప్రవహించింది.

ఒక్కసారి మెలకువ వచ్చింది. ఇదంతా కలా? తనువంతా చెమటతో తడిసి పోయింది… కలలోని ముద్దు రగిల్చిన పులకరింతల ప్రకంపనలు దేహాన్నింకా వదలలేదు. చుట్టూ చూసా… చీకటి… సన్న బెడ్‌లాంప్‌ వెలుగు తప్ప ఇంకేమీ. పక్కన నా భర్త మహేష్‌ నిద్రపోతున్నాడు. ఏ రాత్రి వచ్చాడో… పన్నెండు వరకూ చూసి పడుకున్నా… అతన్నించి ఆల్కహాల్‌ వాసనొస్తున్నది. ఇది నాకు మామూలే. మెల్లగా పక్కమీది నించి లేచాను… వరండా గదిలోకి వచ్చి వాలు కుర్చీలో కూర్చున్నాను. రాత్రి మూడు అవుతున్నది. వరండా గ్రిల్‌ నించి బయట ఉన్నా సన్నజాజి తీగ నుంచి పూల పరిమళపు గాలి వీస్తున్నది. ఆ కల ఒక అద్భుతంలా అన్పిస్తున్నది. పడక గదిలోని పట్టె మంచాన్నొక రణవేదికగా మార్చి మహేష్‌ నాతో శృంగారం చేసినా ఇన్నేళ్ళుగా రాని ఆ మధురానుభూతి కలలో ఆ ఒక్క ముద్దుతో రావడం… ఎంత విచిత్రం? అసలతను ఎవరు? కళ్ళు మూస్కుని దీర్ఘాలోచనలో పడ్డాను. ఆ కళ్ళు… చల్లని చందమామని నింపుకున్న ఆ కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు సూది ముక్కు… ముఖ్యం ఆ ఉంగరాల జుట్టు… విచ్చుకుని… నవ్వుతున్నట్లుండే ఆ పెదవులు ఎవరు… ఛామనఛాయలో ఒక వింత మెరుపుతో మేని రంగు… ఆఁ అతడే తన చిన్నప్పటి కౌమార దశలో తనని నీడలా వెంబడించి, ప్రేమించానని చెప్పి భంగపడ్డ సారంగధర్‌… సారంగ అవును తనకప్పుడు పదమూడేండ్లు అతనికి పదహారుంటాయి. ఇంటెనకాలి మూర్తి అంకుల్‌ కొడుకు… ఆడుకోడానికి కాలనీ పార్కులో కలిసే గుంపులో అందరికంటే పెద్దవాడు. తనను తప్పూ… తప్పూ అని ఇంట్లో వాళ్లు పిల్చినట్లే పిల్చేవాడు ఇదిగో ఎప్పుడూ తప్పులు చేస్తుంటావు కదా అందుకనీ… అవి చిలిపిగా నవ్వేవాడు. మీ ఇంట్లో కూడా అంతేగా అనేవాడు ఆడుకోడానికి రాకపోతే వాళ్ళ చెల్లి స్వాతిని పంపేవాడు. మా అన్న నన్ను చెండుకు తింటున్నాడు రావే తప్పూ అని గుంజుకుపోయేది. ఒక్కసారిగా వెలిగిపోయేది అతని మొఖం తనను చూసి. ‘ఏమయ్యింది రాలేదు?’ అనేవాడు. ‘నువ్వు తప్పక రావాలి సుమా నా కోసం” అన్న సూచన ధ్వనించేది అతని గొంతులో ఒకసారి ఇంటి ముందున్న కొండలపైకి పిల్లలంతా వెళ్ళారు. ఆ కొండల్లో అదిగో కలలో వచ్చిందే మనిషంత ఎత్తున్న కొండ సరిగా ఆ కొండ వెనుకే తనను పట్టుకొని ఐ లవ్యూ తపస్వీ… చెప్పెసి… బుగ్గమీద ముద్దు పెట్టేసాడు. తను ఒక్కసారి అతన్ని తోసేసి కళ్ళ నిండుగా నీళ్ళతో ఇంటికి ఉరుక్కుంటూ వచ్చేసింది. అప్పట్నించి అతను ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళలేదు. అంతనంటే ఇష్టం ఉన్నా! ఇంతలో నాన్న గారికి బదిలీ అయిపోయి హైదరాబాద్‌ వచ్చేసింది. విజయవాడ నుంచి తర్వాత అసలు అతన్ని పూర్తిగా మర్చిపోయింది. ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా గుర్తుకు రాని మనిషి… పెళ్ళైన ఆరేళ్ళకి ఇలా కలలో కన్పించడం అదీ… ఇలా ఎందుకు? తన దేహమెందుకు అంత పులకరించింది అదీ కలలో పెట్టిన ముద్దుకి? నేను కళ్ళు మూస్కుని అలసటగా తలవాల్చాను ఇంతలో చెవుల దగ్గర మళ్ళీ తప్సూ… తపస్వీ అన్న పిలుపు రహస్యంగా… మధురంగా… గుండెల్లోకి జారుతూ… నా గుండె ఝల్లుమంది. నాకు పట్టిన నిద్ర ఒక్కసారి విచ్చుకుంది. అవును అతను ముద్దు పెట్టుకుంటూ తనను తన పేరుతోనే పిలిచాడు. తప్సూ… తపస్వీ అన్నాడు… ఎంత ప్రేమతో విరహంతో స్పర్శించాడనీ? ముద్దు పెట్టుకున్నాడనీ? అందుకేనా… ఇంత అందమైన అనుభూతీ? తన పేరు పిల్చినందుకేనా… తన పేరు మాత్రమే? ఇంకెవరి పేరుతో కాకుండా… తన భర్త మహేష్‌ పిల్చినట్లు. ఒక్కసారి నీరసం వచ్చేసింది. కల మిగిల్చిన మాధుర్యం మాయమైపోయింది. మహేష్‌ గుర్తుకొచ్చి… క్షణాల్లో కృంగిపోయింది. ఒక వెగటుదనంతో మనసు నిండిపోయింది. కళ్ళలోంచి నీళ్ళు కారాయి… కలలో ఎవరో పర పురుషుడి ముద్దుకు తనలా స్పందించడం తన భర్త ప్రేమకి కలగాల్సిన అనుభూతి ఇలా కలగడం ఏమిటి?

అందరిలాగే తనూ కలలు కన్నది పెళ్ళీ ప్రేమించే భర్త, శృంగారం, పిల్లలు అందమైన ఇల్లు. తనను ప్రేమించి పెళ్ళి చేస్కున్నాడు మహేష్‌ ఇంట్లో పెద్దల్ని ఒప్పించాడు తన స్నేహితురాలు మానస పెళ్ళికి వెళ్ళిన తనకు మానస భర్త స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. ఆరడుగుల పొడవు మంచి తెలుపు రంగులో అందంగా ఉన్నాడు మహేష్‌!

పెళ్ళిలో మహేష్‌ తనను కళ్ళార్పకుండా చూడ్డం గమనించింది. తన వెంట నీడలా తిరిగాడు. చూపులతో మాట్లాడాడు. తను అందగత్తే కాబట్టి అలా చూస్తూన్నాడనుకుంది. ఆ పరిచయాన్ని కొనసాగించాడు మహేష్‌. ఒక రోజు చేతిలో ప్రేమలేఖ పెట్టాడు. పెళ్ళన్నాడు. నువ్వులేనిదే బతకలేనన్నాడు. మనస్విని కూడా మహేష్‌ మంచివాడంది. బాంకులో ఉద్యోగస్తుడు తను పీజీ పూర్తి చేసి కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్నది. మనస్విని భర్త కూడా ఒక రోజు తనతో మాట్లాడాడు మంచి వాడు ఆలోచించుకో ప్రేమా తిరుగుళ్ళు అనటం లేదు. పెళ్ళి చేస్కుందాం అంటున్నాడు అని. నాన్నగారితో మాట్లాడమనండి అంది తను. ఉద్యోగం చేస్తానని దానికి అడ్డు చెప్పద్దని కండిషన్‌ పెట్టింది. ముహూర్తాలింకా నాలుగు నెలలకు కానీ లేవన్నారు పెద్దవాళ్ళు. ఈ నాలుగు నెలలు ఇద్దరూ ఎన్నో సార్లు కల్సి తిరిగారు. బస్సుల్లో, బస్టాపుల్లో ఫంక్షన్స్‌లో మహేష్‌ కొద్దిగా అందంగా ముఖ్యంగా తెల్లగా ఉండే స్త్రీలను కన్నార్పకుండా చూడ్డం గమనించింది. ఇబ్బందిగా అన్పించింది. అయినా అడగాలని అనుకుంది. చూడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో అనేవాడు ఎవరో ఒక అమ్మాయిని చూపిస్తూ సూర్యోదయాన్ని – అమ్మాయి అందాన్ని చూడకపోతే ఎలా నేను సౌందర్యారాధకుడను అనేవాడు. తనకెందుకో అతనలా అనడం అస్సలు నచ్చలేదు. అప్పటికే పెండ్లి శుభలేఖలు అచ్చవడం – పంచడం అయిపోయాయి. ఇంకో వారంలో పెళ్ళి… ఒకరోజు మహేష్‌ ఇంటికొచ్చాడు. డాబా మీదకెళదాం అన్నాడు. డాబా మీద తన ఒళ్ళో తల పెట్టుకొని పడుకుని ”నీకు తెలుసా తపశ్వినీ… మొన్న నేను మా బాబాయి కూతురు సవిత పెళ్ళికెళ్ళాను. అక్కడ పట్టు పరికిణీ వేస్కొన్న ఒక్క తెల్ల పిల్ల కన్పించింది. ఎంతందంగా ఉందో తెలుసా. పెళ్ళైనంత సేపూ ఆ అమ్మాయిని నేనూ – నన్ను ఆ అమ్మాయి చూస్కుంటూనే ఉన్నాం. దగ్గరకెళ్ళి పేరు తెల్సుకోవాలనుకున్నా కానీ ఈ లోపల ఎవరో ఆమెను చందూ అని పిలిచారు. ఆమె ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ నా వైపు చూసి ఎంత చిలిపిగా నవ్విందో తెలుసా” … మహేష్‌ చెబుతుంటే తను దిమ్మెరపోయి వింటూ ఉండిపొయ్యింది. వెంటనే కంపరంతో అతన్ని తన ఒడిలోంచి లేపాలన్న ప్రయత్నంలో అతని తలను చేతులతో జరుపుతుంటే… అతనే లేచి ”నిన్ను చందూ అని పిలవనా” అంటూ ‘చందూ’ అని పిలుస్తూ, చటుక్కున తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టేస్తున్నాడు. తమ స్థాణువైపోయింది. అతను మధ్య మధ్యలో ‘చందూ’ అంటూ పెదాలని బంధిస్తున్నాడు… తను చేతులతో విదిలిస్తున్నది. తోసేస్తున్నది అసహ్యంతో… తన జీవితంలో తొలి ముద్దు అది!! తననెవరి పేరుతోనో… ఒక మూడు గంటలు. ఒకెమ్మాయితో పెళ్ళి పందిట్లో మానసిక వ్యభిచారం చేసేసి ఉద్రేకపడిపోయి తననా పేరుతో పిలుస్తూ ఆమెను తల్చుకుంటూ ముద్దు పెట్టుకొని ఆ ఉద్రేకాన్ని చల్లార్చుకోవడం… ఎంత ఏహ్యమైన, జుగుప్సాకరమైన పని? తన దేహాన్ని – వ్యక్తిత్వాన్ని ఎలా కించపరిచాడు దారుణంగా అవమానించాడు. తను ఛీ అని విదిలించుకొని మెట్లు దిగి పారిపోయింది… ఆవేశంలో దేహం కంపిస్తోంది. అంత సిగ్గైతే ఎలా అంటున్నాడు మహేశ్‌ నిస్సిగ్గుగా…

తను పరిగెత్తి తన గదిలోకెళ్ళి తలుపేస్కుని మంచంపై వాలిపోయింది. ఆవేశంతో గుండెలు అవిశిపోతున్నాయి. ఛీ… ఒళ్ళు జలదరిస్తున్నది తన పెదవులు… ఒక్కసారి పెదాలు తడుముకుంది అతని ఎంగిలి… ఛీ… ఎవర్నో తల్చుకుంటూ తన పెదవుల్ని ఎంగిలి చేసాడు పెదాలు పగిలి రక్తాలు కారి శుద్ధి అయితే బాగుండు గ్లాసులో నీళ్లు తీస్కుని ఆ పెదాలను ఎంత కడిగినా ఆ మైల పోవడం లేదు… దుఃఖంతో రగిలిపోయింది. పెదాలకు సబ్బు రాసింది – బట్టతో తుడిచింది… ఊహా… ఆ మాలిన్యం ఎంతకీ పోదే… చందూ – చందూ అని కలవరిస్తూ తనకు పెట్టిన ఆ ముద్దు తన పెదాలను తన దేహాన్ని మలినపరిచింది… ఏం చెయ్యటం? ఈ అసహ్యాన్ని ఎలా భరించడం? ఊహూ వీడితో తనుండలేదు. చెప్పెయ్యాలి అమ్మకీ నాన్నకీ ఈ పెళ్ళి వద్దని… తను తలుపు తీసిందో లేదో పెద్దమ్మా… పెద్దనాన్న, అత్తయ్యా – మామయ్య, నాన్నమ్మ – అమ్మమ్మ అంతా బిలా బిలా చుట్టుముట్టారు తనని. ‘అబ్బో పెళ్ళి కళ వచ్చేసిందే’ తపశ్విని మొఖంలో అని… నోట మాట రాలేదు తనకు మరో పక్క వెలిగిపోతున్న అమ్మా నాన్న చెల్లి ముఖాలు. ”పెళ్ళికి ఆ… ఆ దానయ్య మూడు లక్షలు పంపిస్తున్నాడు, ఖంగారు పడకు నాన్నా” అంటూ అన్నయ్య నాన్నకు చెబుతున్నాడు. ‘ఇదిగో – మెళ్ళోకి నానుతాడు… చేతికి చేయించిన కంకణాలు లోలాకులు ఉంగరాలు వచ్చేసాయిక్కా” అంటున్న జలజ పిన్ని బాబాయ్‌… ఇల్లంతా సందడి… ఒక్కసారి తనలోపల శక్తి అంతా సన్నగిల్లిపోయింది. అమ్మ నాన్న అన్న చెల్లి సంతోషం ఆవిరైపోతుంది. మహేష్‌ను చేస్కోనని చెబితే… చెల్లికి పెళ్ళి అవుతుందా, చెల్లి పీజీ చేస్తున్నది ఉస్మానియాలో. ఏం చెయ్యాలి… ఇంకో నాలుగు రోజుల్లో పెళ్ళి…! తన మెదడంతా మొద్దుబారి పోయింది. గదిలోనే ఉండిపోయి తిండి మానేసి ఎంత ఏడ్చిందని… అంతా పెళ్ళై పుట్టింటిని వీడనుంది కదా అందుకే బెంగ – అనుకున్నారు. అమ్మ అయితే తనూ ఏడ్చేస్తూ అన్నం ముద్దలు తిన్పించింది. బతిమిలాడి… పిచ్చి తల్లికి తనెందుకు ఏడుస్తుందో తెలీదు. ‘మంచివాడే మహేష్‌ సుఖపడతావే బెంగపడకు’ అంటోంది అమ్మ. మంచివాడంటే ఆరడుగల పొడవు తెల్లని మేని ఛాయ… బ్యాంకు ఉద్యోగం స్వంత ఇల్లు – కారు ఉండటమేనా? మహేష్‌లోని తనకు తెలిసిన చీకటి కోణం వీళ్ళకెలా తెలుస్తుంది. తనకు పెళ్ళి చేసాక చెల్లి యమునకి చేసెయ్యాలని ఇప్పట్నించే ఆలోచిస్తున్నారు. తల పగిలిపోతుంటే మాత్ర వేస్కుని పడుకుండి పోయింది తను.

పెళ్ళవుతుంటే… ఏ ఆనందమూ లేదు. తొలి రాత్రి ఎలా గడవనుందో… అదే దిగులు అదే కాదు అసలు తన శృంగార జీవితం ఎలా ఉండబోతుందో? ఒక బలి పశువులా అతనితో తాళి కట్టించుకుంది. తొలి రాత్రి ముహుర్తాలు మూడు రోజుల వరకూ లేదంటే ఊపిరి పీల్చుకుంది. మహేష్‌ తన చెల్లి యమునతో అతి చనువు ప్రదర్శించడాన్ని భరించలేకపోయింది. యమున తనకంటే తెలుపు… పని ఉన్నా లేకపోయినా యమునని పలకరిస్తూ ఆమెకు దగ్గరగా చూసే ప్రయత్నం చేయడం… ఆమె కన్పించిన ప్రతిసారీ ఆబగా మళ్ళీ కనపడదేమో అన్నట్లు చూడ్డం… చాలా అసహ్యంగా అన్పించింది. ఆ రోజు తన బుగ్గలని నిమురుతూ ”మీ చెల్లి బుగ్గలకు ఆ నునుపు తెలుపు ఎలా వచ్చాయో కనుక్కోరాదూ” అన్నాడు… ”ఏం మాట్లాడుతున్నావు మహేష్‌ నువ్వు… బుద్ది ఉందా నీకు” అంది తను దాదాపు అరుస్తున్నట్లుగానే. ఒక్కసారి చెల్లి నెల క్రితం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ”అక్కా – బావ యూనివర్సిటీకి వచ్చాడు రెండు సార్లు ఏదో పని ఉందని – నన్ను కలిసి కేంటిన్‌కి తీస్కెళ్ళాడు నా ఫ్రెండ్స్‌ కూడా వచ్చారు.” తను ఆశ్చర్యపోయింది. అదే అడిగింది మహేశ్‌ను. ”ఆఁ ఒక స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్‌ లోన్‌ అవసరమైతేను వెళ్ళాను మీ చెల్లె అక్కడే ఉంది కదా అని కలిసాను” అన్నాడు నిర్లక్ష్యంగా.. ఇందుకే అన్నమాట వెళ్ళడం ”లోన్‌ అవసరమైతే స్టూడెంట్స్‌ బాంక్‌కి వెళతారు గానీ నీవెళ్ళడం ఏంటీ”… ఆశ్చర్యపోతూ అడిగింది. ”నువ్వు చాలా తెలివైన దానివి కానీ ఇక ప్రశ్నలు ఆపు తపస్వీ అంత దూరం నుంచి నీ కోసం వచ్చాను” అన్నాడు మాట మారుస్తూ. ఆ రోజు అదంతా గుర్తుకొచ్చింది. ”ఇంకోసారి మా చెల్లి మాటలు నా దగ్గర మాట్లాడకు” అంది ఖచ్చితంగా అక్కడ్నించి వెళ్ళిపోయి అమ్మ గదిలోకి వెళ్ళి మౌనంగా రోదించింది. వీడితోనా తను బతకబోతున్నది అనుకుంటూ… తెల్లతోలు ఆడవాళ్ళు వీడికి ఐ కేండీలు…

తొలి రాత్రి ఎలా గడిచిందో – లక్ష సందేహాలతో గదిలోకి వెళ్ళింది. అలంకరణ ఒద్దన్నా తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టింది అమ్మ… అతను ముట్టుకుంటుంటే ఒళ్ళు జలదరించింది. ”నాకు టైం కావాలి మానసికంగా సిద్ధంగా లేను” అంది చేతుల్ని దూరంగా నెడ్తూ… ”కానీ నేను ఆగలేను – నేను సిద్ధంగానే ఉన్నాను” అంటూ ఆక్రమించేసాడు బలవంతంగా… ముద్దు పెడుతూ ”యమునా… యమునా” అని చెల్లి పేరు కలవరించాడు – షాక్‌ తగిలినట్లై తోసేసింది – మహేష్‌ తాగి ఉన్నాడు. తనను పట్టించుకోలేదు… అతను తనను పూర్తి మలినపరిచాడా రాత్రి… తనలోని యవ్వన – జీవన ఆకాంక్షల్ని నలిపేస్తూ..! మరునాడు చెల్లి కళ్ళలోకి చూడలేక పోయింది. ఇక అప్పట్నించీ అతనితో శృంగారం తన జీవితంలో ఒక పీడగా శృంగారం ముందు అతను పెట్టే ముద్దు ఒక శాపంగా మారిపోయింది. రెండు చేతులలో తన తలకు మొఖాన్ని అదిమిపెడుతూ… అతను పెట్టే ముద్దుకు తప్పించుకోడానికి తను మొఖాన్ని పక్కకి వేగంగా వద్దన్నట్లు జరుపుతుంటే తన వైపుకి విసురుగా తిప్పుకుంటూ అతను కోపంగా బలవంతంగా తనకు నొప్పి, పెదాలే కాదు నుదురు కనుబొమ్మలు భయంకరమైన నొప్పి… కళ్ళు ముఖం అంతా నొప్పి. పైగా అతని నోట్లోంచి ఆల్కహాలూ, సిగరెట్టు వాసనా రెండూ లేకపోతే… పళ్లు సరిగ్గా తోముకోని నోటి ఖంపు… అన్నింటికీ మించి అతను ముద్దు పెట్టే సమయంలో తనను పిలిచే రకరకాల ఆడ పేర్ల ఖంపు… ముద్దంటే ఇదా? నాలుకను బలవంతంగా తన నోట్లో జొనిపేస్తూ… ఉమ్ము కారుస్తూ… వచ్చే వాంతిని ఆపుకోవడం తన వల్ల కాక… అతన్ని తోసేసే శక్తి లేక… నరకం… నరకం… దాంతో పాటే ఒక్కసారే పుట్టేసిన కవల పిల్లలు… ఇక ఈ వెగటు మనిషితో రాజీయేనా?

ఆడవాళ్ళనూ ఆబగా ఎందుకు చూస్తావు అని అడిగితే ఎక్కడ చూసానంటాడు దబాయిస్తాడు. మరొకసారి ఏం చూస్తే తప్పా… అందర్నీ చూస్తానా? ఏదో తెల్లగా అందంగా ఉండే వాళ్ళను చూస్తాను… పులకరింతలు కలుగుతాయి. చెప్పాగా సౌందర్యారాధకుడ్ని అని వ్యంగ్యంగా నవ్వుతాడు… పులకరింతలు కలుగుతాయట ఆడవాళ్ళను చూస్తే హృదయంతో కాదు కాళ్ళ మధ్య అని తనకు తెలీదూ? దాని పర్యవసానమే కదా ముద్దుతో పాటు చూసిన ఆడవాళ్ళ పేర్ల కలవరింతలు? అయినా నీకు అనుమానం ఎక్కువైపోయింది. అనుమాన పిశాచిలాగా తయారయ్యావు అనడమే కాదు. తన ఫ్రెండ్స్‌కి – సాత్విక భర్తకీ తన తల్లికీ కూడా తన మీద అనుమాన పడుతున్నదని చెప్తాడు. తనను అందరి ముందు అనుమాన పిశాచిగా ముద్రవేసేవాడు. చూడ్డం భరించలేకపోయినా… చూసిన తర్వాత తన పడకగదిలో జరిగే ఆ స్త్రీల పేర్లతో జరిగే ముద్దు తతంగం… తన మీద జరిగే లైంగిక అత్యాచారానికీ సంబంధం ఉంది. బస్సుల్లో – ఫంక్షన్స్‌లో ఇతను ఎవర్నైనా ఆబగా చూస్తూన్నాడంటే మాట కలుపుతున్నాడంటే… ఆ రోజు రాత్రి వాళ్ళు తన పడక గదిలోకి వస్తున్నారన్న మాట… అందుకే అతను ఆడవాళ్ళను చూసే చూపులు మరింత అసహ్యాన్ని భయాన్ని కలిగిస్తాయి. తన పడక గది అంటే తనకి చాలా అసహ్యం. ఆ గదిలో తను తప్ప తన చెల్లి యమున, చందు, నళిని, సునీత – రాధ, రాజేశ్వరి, జమున, ఉమాదేవి, విజయ, దుర్గ… ఇంకా సినిమా నటులు జయలలిత దగ్గర్నించి నగ్మా వరకూ ఉంటారు. వాళ్ళ దేహసౌష్టవాన్ని పైకే వర్ణిస్తూ, తల్చుకుంటూ తన దేహంతో క్రీడిస్తాడు – అంటే వ్యభిచారం చేస్తాడు. తనూ ఒక రకంగా వ్యభిచారమే చేస్తున్నది. మరి ఎందుకొప్పుకోవాలిదంతా? ఎవరి కోసం? పిల్లల కోసమా? ఏ కనిపించని కట్టుబాట్లు తనని దీన్నించి తప్పించుకోలేక ఆపుతున్నాయి? ఉద్యోగం చేస్తున్నది. అయినా ఎందుకు లొంగుతోంది? పిల్లలే కారణం… వాళ్ళే లేకపోతే తనెప్పుడో ఈ చీదర నుంచి బయటపడేది. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయేమంటే అతను బయపడేకొద్ది తను ప్రశ్నించే కొద్దీ అతనింకా రెచ్చిపోతున్నాడు. హింసాత్మకంగా మారాడు అసహ్యంగా… శృంగారం చేసే ముందు తన చెల్లెది, పిన్ని, తన ఫ్రెండ్‌ సాత్విక – సినిమా యాక్టర్ల పేర్లు తనను చెప్పమంటుంటాడు చెప్పకపోతే… తప్పించుకొని మంచం దిగిపోతుంటే జుట్టుపట్టి కొడతాడు. దెబ్బలు భరించలేక ఒకట్రెండు సార్లు చెప్పింది కూడా. సిగరెట్టు వాతలు పెడతాడు చెప్పకపోతే. వాళ్ళ పేర్లు చెబితే తీవ్రంగా ఉద్రేకపడిపోతాడు. చాలా సార్లు భరించలేక పుట్టింటికెళ్ళి ఉండిపోతే బ్రతిమిలాడి మళ్ళా అలా చేయననీ అలా ఆడవాళ్ళ పేర్లు అడగననీ కాళ్ళ బేరానికొస్తాడు. తల్లి కూడా సర్దుకొమ్మని అతనికెలా కావలిస్తే అలా ఉండు అంటుంది. అతనికిష్టమైన చీరక కట్టుకోడం కాదుగా – ఇది అమ్మకెలా చెప్పడం? మరీ అంత అనుమానించకూడదే మొగుణ్ణీ అంటుంది. తను మెల్లగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. ఒత్తిడి తట్టుకోలేక సైకియాట్రిస్ట్‌ దగ్గరకెళ్ళింది. మందులు వాడుతున్నది. పిల్లల కోసం బతకగలుగుతున్నది. క్లాసులు పాఠాలు చెప్పుకోగలుగుతున్నది.

”డాక్టర్‌ నా భర్తకు, ఈ అసహజత్వ శృంగార ధోరణి తగ్గడానికి మందులు లేవా?” అనడిగింది ఆ డాక్టర్ని… ”ఏముందమ్మా మగవాళ్ళలో ఇది మామూలే… సెక్స్‌లో ఫాంటసీ లేకపోతే థ్రిల్‌ ఉండదు… కోపరేట్‌ చెయ్యమ్మా… తప్పేముందీ… అతనికిష్టమైనట్లుండడంలో…” చాలా మామూలు విషయం చెప్తున్నట్లు చెబుతున్నాడు డాక్టర్‌… తన గుండె గాయం లోతు తెల్సీ! వీడు కూడా తన భార్యని ఇట్లాగే అవమానిస్తాడా…

భయం… తెల్ల తోలు ఆడవాళ్ళంటే భయం… ఇంటి పనిమనిషి తెల్లగా ఉందని మానిపించేసింది. మహేష్‌ దొంగ చూపులు చూసి… అమ్మగారు… సారు వద్దన్న బలవంతంగా పొద్దున ఈ రెండొందలు ఇచ్చారండి. నేనట్లాంటి దాన్ని కాదండి. సారు ఇబ్బందిగా చూస్తారండి. నేను మానేస్తున్నానమ్మగారు అని మానేసింది వజ్రమ్మ.

పక్కింట్లో అద్దెకి దిగేవాళ్లు తెల్లగా ఉంటారేమో అని భయం. నల్లగానో, ఛామన ఛాయగానే అంటే హమ్మయ్య అని ఊపిరి తీసుకోవడం. ఘోరంగా ఉంది తన పరిస్థితి. ఒకసారి వాళ్ల ఆఫీసర్‌ ముస్లిం ఇంటికి చాయ్‌కి పిలిస్తే వెళ్లవలసి వచ్చింది. వాళ్ళ ఆడవాళ్లు లోపల ఉన్నారు మహేశ్‌ బయట ఆఫీసర్‌తో తనేమో వాళ్ళ ఆడవాళ్ళతో కూర్చుంది. తాము రావడం ఆడవాళ్ళు డాబా పైనుంచి చూశారు. ఎంతో అందంగా తెల్లని మేని ఛాయతో ఉన్నారు. ఇంటికెళ్లేప్పుడు వెధవ… నన్ను కూడా మీ ఆడవాళ్ళతో కూర్చోబెట్టోచ్చుగా… అవును వాళ్లు నన్ను చూశారా అందంగా ఉన్నానన్నారా లేదా చెప్పు. వాడితో కూర్చున్న కాని మనసంతా లోపల వాళ్లని చూడాలని కొట్టుకుందనుకో.” నా ముఖంలో రక్తం ఇంకిపోవడం తెలుస్తూనే ఉంది. మరోసారి ముస్లిం ఇంటి ఓనర్ల ఇంటి అల్లుడు చనిపోయాడు కొత్తగా చేరాము ఆ ఇంట్లో… ఆడవాళ్లంత శవాన్ని చూడ్డానికి బురఖాలు మొఖం మీద తొలగించుకుని వెళ్తూ… వస్తున్నారు. నల్ల మబ్బులోంచి తొంగి చూస్తున్న నక్షత్రాల్లా ఉన్నారు. వాళ్ళ బంధువులైన మగవాళ్ళు గేటు దగ్గర నిలబడి వెళ్తున్న వారికి దుఃఖంతో షుక్రియా చెబుతున్నారు. అక్కడ నిలబడి వాళ్లతో కలిసిపోయి ఆ ముస్లిం స్త్రీల అందాన్ని దగ్గరగా చూస్తూన్నాడు. ఇంట్లో లేని మహేష్‌ కోసం బయటకు వస్తే ఇదీ దృశ్యం. తనని చూసి ఖంగు తిని నువ్వేంటిక్కడ అసహ్యంగా మగవాళ్ళ మధ్యలో పద అని గుంజుకెళ్లాడు. అక్కడొక చావు జరిగిందని అంతా దుఃఖంలో ఉన్నారని లేదు అవకాశం దొరికిందని… సిగ్గు లజ్జ లేకుండా ఏమిటీ మనిషి… తనకు చాలా ఇష్టమైన పాటా… మేరే సామ్నే వాలే కిడికీమే ఎక్‌ చాంద్‌ కా తుక్‌డా రహతీహై కిశోర్‌ పాట. ”నీకు తెలుసా మన పక్కింటి రవి భార్య నేను ఆఫీసుకెళ్ళే టైమ్‌కి తిరిగి ఇంటికొచ్చే టైమ్‌కి నా కోసం గుమ్మంలో నిల్చుంటుంది ఎంతందంగా ఉంటుందో తెలుసా చందమామలా” అంటూ మేరే సామ్నే వాలే కిడికీ పే అంటూ పాటెత్తుకుంటాడు అంతే కాదు ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చాకా వెలిగిపోయే మొఖంతో ఆ పాట హం చేస్తాడు. నాకిష్టమైన ఆ పాట ఇక వినలేని స్థితికి చేరుకున్నా. ”ఇంకా ఆపుతావా ఆ పాట” అని అరిస్తే నీకు కుళ్లు అని వ్యంగ్యంగా అంటాడు. ”ఆమెకి ఎంత 20 ఏళ్లు కూడా ఉండవు. ఆమె భర్త చూడు ఎలా భల్లూకం లాగా ఉన్నాడు. పాపం ఎలా ఉంటుందో” అంటాడు. నిట్టూరుస్తాడు. ఎన్నెన్ని గాయాలు… నిత్యము ఇదే హింస. తెలుపంటే భయమైపోయింది. తెల్ల రంగు ఆడవాళ్ళంటే భయమైపోయింది. మహేష్‌తో ఉండమన్నా అతని ముద్దు అన్నా సెక్స్‌ అన్నా భయం అసహ్యం. పిల్లలు లేకపోతే ఎంత బాగుండేది. దేవుడు వీడికి కళ్లెందుకిచ్చావు. వీడు గుడ్డివాడైతే బాగుండు అని ఎన్నిసార్లు కోరుకున్నదో…

మహేశ్‌ ఫోన్లో అమ్మాయిలు నగ్న చిత్రాలు చూస్తాడు. అతని ఫోన్‌ డిస్‌ప్లే స్క్రీన్‌ మీద అర్ధనగ్న సినీ హీరోయిన్ల బొమ్మలుంటాయి. చూడవద్దనీ, తీసెయ్యమని ఎంత మొత్తుకున్నా వినడు. ఎప్పుడన్నా ఫోన్‌ రింగయ్యి పిల్లలు ఎత్తాలని చూస్తే… ఆ బొమ్మలు చూసీ ఛీ ఛీ అనేవాళ్ళు అయినా సిగ్గులేదు మహేష్‌కి చాలా సార్లనుకుంది. వీడికెలా బుద్ధి చెప్పాలా అని తనూ వాడి ముందు మగవాళ్ళ నగ్న ఫోటోలు కండలు తిరిగిన జాన్‌ అబ్రహం, షారూఖ్‌ ఖాన్‌ ఫోటోలు చూస్తే? కనీసం చూసినట్లు నటిస్తే తనను ముద్దు పెట్టుకుంటున్నపుడు షారూక్‌ఖాన్‌ పేరు తనూ కలవరిస్తే? ఆ హీరోల ఫోటోలు ఒక్కసారి తన నోట్‌ బుక్‌లో పెట్టుకుని అతను చూడాలని ఒదిలేసింది ఓపెన్‌గా… చూసాడు… ఏంటిది అని చెంపలు పగలగొట్టాడు. ఆ హీరోల బొమ్మలు ముక్కలు ముక్కలు చేసి కాలితో నలిపేసాడు. ‘బోగం వేషాలు వేస్తున్నావా’ అని అరిచేసాడు. కాలితో డొక్కలో తన్నాడు. తను డొక్క పట్టుకొని నొప్పితో ఝార్లిల్లింది. ‘ఏం నువ్వు చూస్తే తప్పు కాదా’ అని అర్చింది… ‘నాకూ ఇలానే ఉంటుంది. నీకులానే కోపం అసహ్యం కలుగుతాయి’ అని అరుస్తూ లేచి అతని మీదకురికి చెంపలు వాయించేసింది. చేతిలోని అతని సెల్‌ నేలమీద వేసి పగలగొట్టింది. మహేశ్‌ ఆగ్రహంతో ఒణికిపోయాడు. అతని పశు బలం ముందు బక్క పల్చటి బలహీనమైన తనెంత? అతను మారలేదు. తనకో కోరిక – కల మహేష్‌ ఆకలి చూపులు చూస్తున్న స్త్రీ వీడ్ని అందరి ముందు, ముఖ్యం తన ముందు చెప్పుతో కొట్టాలి… ఎదురు చూస్తున్నది తను ఆ రోజు కోసం… మరింత పశువైనాడు. ఎప్పుడూ నువ్వు నేనెంతో కలలు కన్న శృంగార జీవితాన్ని ధ్వంసం చేస్తున్నావని ఆరోపిస్తూంటాడు. మగవాడికి సెక్సు ఉద్రేకం ఎన్నో రకాలుగా కలుగుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలంటాడు. తను ముద్దు పెట్టాబోతాడనగానే… తన దేహం కట్టెలాగా బిగుసుకుపోతుంది. ‘శవంలా పడుంటావేమే నా స్పర్శకు రెస్పాన్స్‌ ఎందుకియ్యవు’ కోపంగా అడుగుతాడు. తను ఎలా ప్రతిస్పందిస్తుంది? అతనంటే కోరిక ఎక్కడిది? అతను తన పెదాలు ముట్టద్దని పెదాలు బిగించేస్తే.. కోపంతో వేళ్ళతో పెదాలు విడదీసే ప్రయత్నం చేస్తాడు. ఫ్రిజిడ్‌ అని తిడతాడు.

తొలి ముద్దు తోనే తన లోపలి శృంగార ఆకాంక్షల్ని చంపేసి తనని ఫ్రిజిడ్‌గా మార్చింది తనే… గతం అంతా కళ్ళముందు తిరుగుతుంటే, తన తలంతా భారమైపోయింది. కన్నీళ్లు ధారగా కారసాగాయి చూస్తుండగానే తెల్లవారు ఝాము ఐదు అయిపోయింది. లేవాలి… మామూలై పోవాలి… వంట చెయ్యాలి పిల్లలకు నవ్వుతూ కనపడాలి. తన మొఖంలో దిగులు కనపడిందా అల్లాడిపోతారిద్దరూ… రుత్విక – కృతికలు.

ఇంతకీ కల ఎందుకలా వచ్చింది? మెలకువలో తనేమైనా తప్పుగా ఆలోచించిందా? లేదే? ఈ కల రావటం ఇది మొదటి సారి కాదు. చాలా సార్లు వచ్చింది ఈ ఆరేళ్లలో… తన బాల్య స్నేహితుడు సారంగని తను ఎప్పుడూ కలవనే లేదు… అయినా… ఎందుకిలా కల పునరావృతం అవుతున్నది?

బహుశ తనో స్వచ్ఛమైన స్పర్శకోసం, ముద్దుకోసం ఎదురు చూస్తుందా తనకు తెలీయకుండానే…? స్వచ్చమైన కేవలం తనను మాత్రమే పలవరిస్తూ తన పేరును మాత్రమే జపిస్తూ ముద్దు పెట్టించుకునే అర్హత లేదూ తనకు? గొప్ప మోహంతో ప్రేమించిన మనిషితో ముద్దు పెట్టించుకోవడం – అతనికి అవును ఈ పెదాలు అటువంటి ముద్దు కోసం పరితపిస్తున్నాయి. తను అంతే మోహంతో ముద్దు పెట్టటం ఎలా ఉంటుంది? అసలు ముద్దు ఎలా ఉంటుంది? తనకు ముద్దంటే పెదవులు, నుదురు, కనుబొమ్మలు, కనురెప్పలు, కళ్ళు, బుగ్గలు మొత్తం మొఖమంతా విపరీతమైన నొప్పితో ముకుళించుకుపోవడం… ఇలాంటి ముద్దునే కదూ తను గత ఆరేళ్ళుగా తిరస్కరిస్తున్నది? స్వచ్ఛమైన ముద్దుకై పరితపిస్తున్నది? కనీసం తను అలాంటి ముద్దు పెట్టుకునే పెదవుల కోసం వెతుకుతుందా? ఇది తప్పా? మొన్న ఒక పత్రికలో రష్యన్‌ కవయిత్రి రాసిన అనువాద కవిత చదివింది. ఎంత బాగుంది ముద్దు మీద రాసింది మెరీనా త్స్వేతేవా అనే కవయిత్రి రాసింది.

నుదిటిపై ఒక ముద్దు!!!

నుదుటిపై పెట్టే ముద్దు – దుఃఖాన్ని పోగొడుతుంది.

నీ నుదుటిని ముద్దాడనీ!

కళ్ళ మీద పెట్టే ముద్దు – నిద్రపుచ్చుతుంది.

నీ కళ్ళను ముద్దాడనీ!

పెదవుల మీద పెట్టే ముద్దు – దాహార్తిని తీర్చే నీరులాంటిది

నీ పెదవులని ముద్దాడనీ!

నుదిటిపై పెట్టే ముద్దు – చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తుంది.

ప్రియా… నీ నుదుటిని మళ్ళీ ముద్దాడనీ…!!!

మెరీనా… ఎంత గొప్పగా రాసింది? తనూ స్వచ్ఛమైన ముద్దుకోసం పరితపించిందా?

అవును! తన కలాంటి స్వచ్ఛమైన ముద్దు కావాలి.

నుదిటిపై, కళ్ళపై, పెదవులపై… నా దేహం పైని అణువణువుపై… నా దుఃఖాన్ని పోగొట్టడానికి, నా చేదు జ్ఞాపకాల్ని చెరిపేయడానికి, నన్ను పసిపాపలా నిద్ర పుచ్చడానికీ, నా దాహార్తిని తీర్చడానికి… తను కోరుకున్న ముద్దు తను దాచుకున్న ముద్దు, మహేష్‌తో అయితే అది సాధ్యం కాదు!

– గీతాంజలి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.